తాడేపల్లి వారు ‘తెగేదాకా లాగడం’ పేరుతో ఈ దేశంలో దళితుల యెడల ఈ ప్రభుత్వాలు చూపిస్తున్న పక్షపాత ధోరణిని విమర్శిస్తూ వ్యాసావళి రాస్తున్నారు.ఈయన వాదాన్ని తన కామెంట్ల ద్వారా కత్తి మహేష్ కుమార్ గారు దీటుగా ఎదుర్కొంటున్నారు.
‘దళితులు SC/ST అట్రాసిటీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అగ్రవర్ణాలవారిని బాధిస్తున్నారు’ అనే తాడేపల్లి వారి ఆరోపణకు మహేష్ కుమార్ గారు చెప్పిన సమాధానం నన్ను విభ్రాంతికి గురిచేసింది. ఆ సమాధానం…
‘ప్రతీకారం,హింస దీనికి సమాధానమని దళితులు తలచి ఉంటే ఏ గ్రామంలోనూ “పెద్ద కులాల” వాళ్ళు బ్రతికి ఉండేవారు కాదేమో!
వీరు భారతీయ వ్యవస్థను నమ్మి చట్టాన్ని గౌరవించి, కేసులతో సరిపెడుతున్నారు. కాబట్టే చాలామంది బతికున్నారు. Let’s pray that they continue to adopt this path.’
దీనిని బట్టి అగ్రవర్ణాలవారు ఈనాడు బ్రతికి బట్టకట్టి, ఊపిరి పీల్చి, మనుగడ సాగించడం అనేది కేవలం దళితుల దయాధర్మాల వలన మరియు ఈ దేశ చట్టాల యెడల వారు కలిగి ఉన్న గౌరవం వలన మాత్రమే సాధ్యపడుతున్నది అని మనం గ్రహించాలి. దళితులు ఇదే పంథాను ఇక ముందు కూడా అనుసరించాలని ఈయన అగ్రవర్ణాల వారందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన కూడా చేసారు.
తమ కొమ్ముకాసే వ్యవస్థనేగా వీరు నమ్ముతున్నది. తమకు చుట్టాల్లాంటి చట్టాలనేగా వీరు గౌరవిస్తున్నది.
మరో సందర్భంలో ఈయన తనను దళిత పక్షపాతి అని ఆరోపించడం తనకు బాధాకరం కాదనీ అది తనకు గర్వకారణమనీ పేర్కొన్నారు.
మహేష్ కుమార్ గారూ!…ఇంతకూ మీ గర్వకారణం ఏమిటి?…దళితవాదం ఒక పాలక పక్ష వాదమనా..?!లేక అది ఒక విప్లవకర వాదమనా..?!దేనికి గర్వపడుతున్నారు..?
దళితవాదం ఏనాడో పాలకపక్ష వాదమైపోయింది. ఇప్పుడు అణగద్రొక్క బడుతున్నవారు ఖచ్చితంగా అగ్రకులాల వారే. చరిత్రలో ఒకనాడు దళితులు అణగద్రొక్క బడినారు అన్నది నిజమే. అందుకు ఫూలే, అంబేద్కర్ లాంటి వారు ఉద్యమాలు నడిపి ఆయావర్గాలకు హక్కులు సాధించిపెట్టారు. అవి నిజమైన దళిత ఉద్యమాలు. న్యాయమైన పోరాటాలు.కానీ ఈనాడు దళితోద్యమనాయకుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి?!ఈనాడు దళితోద్యమం ఏవిధమైన స్వభావాన్ని సంతరించుకున్నది?!ఆనాటి పోరాటాలకు పూర్తి భిన్నమైన స్వభావం ఇది. ఇప్పుడు దురహంకారులు అగ్రవర్ణాలవారు కాదు. కోట్లాది మంది దళితుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న నేటి దళిత నాయకత్వమే దురహంకారపూరితమైనది. గ్రామాలలో అగ్రవర్ణాల మనుగడ దళితుల దయాధర్మాల మీద మాత్రమే వీలుపడుతున్నదనే మహేష్ కుమార్ గారి వ్యాఖ్య కూడా ఆ దురహంకారాన్నే ప్రతిబింబిస్తున్నది.
జరుగుతున్న సంఘటనలు, వర్తమాన పరిస్తితులను బట్టి చూస్తే మనకు ప్రస్తుత దళిత నాయకత్వ దురహంకార వైఖరి గురించి అవగాహన కలుగుతుంది . దళితులు చేస్తున్న అత్యాచారాలను తాడేపల్లి వారు చాలానే ఉదహరించారు. వాటిని నేను మరలా చెప్పవలసిన పనిలేదు.
తిలక్..తరాజూ..ఔర్ తల్వార్….మారో ఉన్కో జూతే చార్. అంటే ‘బ్రాహ్మణుడిని (తిలకధారులు), వైశ్యుడిని (తరాజు పట్టేవారు) క్షత్రియుడిని (కరవాలం చేబూనే వారు) చెప్పుతో కొట్టండి’ అనేది ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత పార్టీ అయిన ‘బహుజన్ సమాజ్ పార్టీ’ యొక్క నినాదం. ఇది పోరాటమా?! లేక దురహంకారమా?!
మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన ఒక వ్యవహారంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ‘కమ్మజ్యోతి’ గా అభివర్ణింపబడింది. ‘దాడులు మళ్ళీ మళ్ళీ చేస్తాం’ అని బాహాటంగా చెబుతున్నారు. ఇది పోరాటమా?! లేక దురహంకారమా?! మన రాష్ట్రంలో ఆ నాయకుడు తప్ప ఇంకెవరూ కులాలను అంత బహిరంగంగా ఉటంకించరు. దళితోద్యమ నాయకత్వం పోరాట స్థాయి నుండి దురహంకార స్థాయికి ఏనాడో పరిణామం చెందింది.డిఫెన్స్ నుండి అఫెన్స్ లోకి ఎప్పుడో మారిపోయింది.
దళితులు అణచబడుతున్నారు అనేది పాతపాట. దళితుల ఆగడాలను ఎదిరించాలనేది కొత్త మాట. ఆ మాటే తాడేపల్లి వారు చెబుతున్నారు.
ఇప్పుడు పోరాడవలసిన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారూ అంటే అది అగ్రవర్ణాలే…ఇప్పుడు తిరగబడవలసిన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారూ అంటే అది అగ్రవర్ణాలే…ఇప్పుడు విప్లవకర వర్గం ఎవరైనా ఉన్నారూ అంటే అది అగ్రవర్ణాలే. ఎందుకంటే ‘విప్లవం’ ఎవరిసొత్తూ కాదు. ఎవరు అణగద్రొక్క బడతారో వారి చేతిలోని ఆయుధమే ‘విప్లవం’.
ఇప్పుడు దళితోద్యమ నాయకత్వంలో ఉన్నది పోరాటస్ఫూర్తి కాదు. అది ఏనాడో అంతరించినది. ఇప్పుడున్నది కేవలం తామెన్ని ఆగడాలు చేసినా తమనెవరూ ఏమీ చేయలేరనే నిర్భీతి మాత్రమే. తామెన్నైనా అంటారు…ఏమైనా చేస్తారు. కానీ తమనెవరు ఏమి అన్నా, కనీసం ఆత్మరక్షణ కోసం తమచర్యలను తిప్పికొట్టినా ఇక అంతే….SC/ST అట్రాసిటీ చట్టం అంటారు. దళితులనందరినీ అగ్రవర్ణాల వారు అణచివేస్తున్నారని 100 ఏళ్ళ నాటి పరిస్థితులన్నింటినీ ఇప్పుడే జరుగుతున్నట్లుగా ఏకరువు పెడతారు. అగ్రవర్ణ దురహంకారులని నిందిస్తారు.
TTD వారు ‘దళిత గోవిందం’ పేరుతో తమ సౌజన్యాన్ని చాటుకోవాలనుకున్నారు. అపోహలను తొలగించాలనుకున్నారు. కానీ పుణ్యానికి పోతే పులి ఎదురైందన్న చందంగా ఈ వ్యవహారంలో వారికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
హిందూ దళిత వాడల్లోని దేవాలయాల్లో పూజా పునస్కారాల నిమిత్తం కొందరు దళిత యువకులకు పౌరోహిత్యంలో తర్ఫీదు ఇచ్చారు. అయితే దళితోద్యమ నాయకత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ‘పౌరోహిత్యంలో తర్ఫీదు ఇచ్చారు బానే ఉంది…కానీ మాకు తిరుమలలో శ్రీవారిసన్నిధిలో పౌరోహిత్యానికి అవకాశం ఈయకుండా మా దళిత వాడల్లోని దేవాలయాలకే మమ్మల్నెందుకు పరిమితం చేస్తున్నారు?ఇది దళితుల యెడల చూపిస్తున్న వివక్ష…ఇది అగ్రవర్ణ దురహంకారం’ అని ఆరోపించారు. TTDవారు ‘దళిత గోవిందం’ పేరుతో చొరవ చూపించనంతకాలం ఏ సమస్యాలేదు. కొంత సౌజన్యాన్ని ప్రదర్శించటంతోటే మొదలయ్యాయి వాదనలు, డిమాండ్లు.
(1930ల్లో కమ్మవారు బ్రాహ్మణ కులంతో వచ్చిన విభేదాలతో వారిని బహిష్కరించి తమ పౌరోహిత్యం తామే చేసుకోవటం ప్రారంభించినప్పుడు వారు కూడా అటువంటి కోరిక కోరలేదు.)
చదువుల్లో రిజర్వేషన్లు…OK. స్కాలర్‌షిప్పులు…OK. ప్రవేశ పరీక్షలలో మినహాయింపులు…OK. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు…OK. చట్ట సభల ప్రాతినిథ్యంలో రిజర్వేషన్లు…OK. ఇంకా ‘ఆ’ రిజర్వేషన్లు…OK. ఇంకా ‘ఈ’ రిజర్వేషన్లు…OK. వీటిలో వేటికీ కూడా అగ్రవర్ణాలవారు నోరెత్త లేదు. మౌనంగానే అంగీకరించారు. కానీ తమ సనాతన విశ్వాసాల్లో, తమ శాస్త్రాలలో జోక్యం చేసుకుంటే ఒక వైదికుడు రుద్రతాండవం చేస్తాడనే విషయాన్ని వీరు విస్మరిస్తున్నారు. దీనిని గుర్తించే అక్బర్ అంతటి వాడు సైతం ఈ విషయంలో ఉదారంగా ప్రవర్తించాడు. బ్రిటిష్ వారు సైతం వైదిక మత విశ్వాసాల విషయంలో ఆచితూచి ప్రవర్తించేవారు.
నిజమే వీరు దేశంలో ప్రస్తుతం నెలకొన్న వ్యవస్థ వలన పరిరక్షితులే. నిస్సందేహంగా సురక్షితులే. వీరేమి చేసినా ప్రభుత్వం వీరికొమ్మే కాస్తుందనటంలో సందేహంలేదు. కానీ అణచి వేత భరించలేక, వీరి ఆగడాలు సహించలేక ఈ దేశంలో అగ్రవర్ణ ఫాసిజం తలయెత్తితే..(కారంచేడు, చుండూరు ఘటనలు దానికి సూక్ష్మ రూపాలు) అప్పుడు ఈ వ్యవస్థా ఉండదు…ఈ ప్రభుత్వాలూ ఉండవు. తెగేదాకా లాగితే జరిగేది అంతే.
మండల్ కమిషన్ వ్యవహారంలో అనేక మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు బహిరంగంగా సజీవదహనానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నారు.తమకు జరిగే అన్యాయానికి అగ్రవర్ణాలవారి ప్రతిస్పందన ఎల్లవేళలా అలానే ఉంటుందనుకుంటే అది పొరపాటే.
[[తాడేపల్లి వారి 'తెగేదాకా లాగడం' వ్యాసావళి (ప్రస్తుతానికి నాలుగు భాగాలు) కొరకు |http://www.tadepally.com/]]
అంత్యనిష్ఠూరమా ? ఆది నిష్ఠూరమా ?
10 గంటల క్రితం
+of+lakshmi%5B1%5D.jpg)

12 వ్యాఖ్యలు:
నేను వేరే టపాలో చేసిన కామెంటు చెప్పడంతో పాటూ, దాని లంకెకూడా ఇచ్చిఉంటే, చదివేవాళ్ళకి నేను ఆ మాట ఏ contextలో అన్నానో తెలిసే అవకాశం ఉంటుంది.
కాకపోతే కొన్ని సవరణలు. నేను మీరు ఉదహరించిన మొదటి కామెంట్ తాడేపల్లిగారి టపాకు సమాధానంగా అనలేదు. That was directed towards another response by ‘ఒరేమునా’. కాస్త గమనించగలరు.
ఇక "గర్విస్తున్నాను" అన్నది నేను ‘అగ్రకుల అహంకారి’ గా మాట్లాడక కొంత తార్కికంగా ప్రశ్నిస్తే, వారు జవాబు చెప్పడం మాని నన్ను ‘దళితపక్షపాతి’అని బ్రాండ్ చెయ్యడం వలన.
అందుకే మీరు ఇక్కడ ఒక లంకె పెడితే, చదివేవాళ్ళకి కాస్త పూర్తి విషయం,దాని context అర్థమయ్యి విమర్శించడానికి వీలవుతుంది.
Very good write-up!
@ మహేష్ ఆ వ్యాఖ్య ఆ టపాకి సంబంధించినా, ఒరేమునా కామెట్ కి సంబంధించినా, భావం మాత్రం అదే కదా ? I can't believe such a comment came from you. I hope you didn't mean that.
@నిరంజన్,మీరు ఒక సారి తాడేపల్లిగారి టపా చదవండి. ఒక్క హింసాత్మక ఘటనతో వారు "దళిత పంధా ఇదే" అని తీర్మానించారు. ఒక వేళ దళతపంధా ఇదే అయితే నిజంగా మన దేశం ఏ ఆఫ్రికాలాగో సాయుధ గృహ(కుల)యుద్ధంలో ఉండేది కదా? అందుకే ప్రతి హింసకూ ప్రతిహింసే మార్గమని దళితులు అనుకొనుంటే, ప్రతి atrocity కేసుతో పాటూ కొన్ని అగ్రకులాల తలలు తెగిపడేవే కదా?
ఇదే భావనతో నేను ఆ మాట అనడం జరిగింది. తాడేపల్లివారి extreme conclusion కు ఇది నా extreme explanation. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకూ దళితుపై హింస,అత్యాచార,హత్య కేసులు కొన్ని లక్షలున్నాయ్. ప్రతి కేసుకీ ప్రతీకారంగా హింసకు పూనుకొని ఉంటే ఎన్ని అగ్రకులాల హత్యలు జరిగి ఉండేవో లెక్కేసి చూడండి!!!
ఏదో కొందరు దళితనేతల మూర్ఖత్వాన్ని అడ్డం పెట్టుకుని దళిత ఉనికినే ప్రశ్నించడం ఎంతవరకూ సమంజసం. దానికి తోడు ఆయన ఆపాదించిన విషయాలు ఎంత కుత్సితంగా ఉన్నాయంటే..సిగ్గేస్తుంది. దళితులు తప్పుడు కేసులు బనాయించి అగ్రకులాలను హింస పెడుతున్నారట! అత్యాచారం, హత్య, కాళ్ళూ చేతులూ నరకడం ఇవన్నీ దళితులు తమమీద తాము చేసుకుని అగ్రకులాలను కోర్టులకు ఈడుస్తున్నారా?
ఇదే ప్రశ్న నేనడిగితే "కులం పేరుతో ధూషించిన కేసులు" అంటున్నారు.ఆ కేసుల శాతం మొత్తం కేసుల్లో కనీసం 10%కూడా లేవే! ఈ నిజాలు తెలుసుకోకుండా, ఒక సంక్లిష్టమైన సామాజిక సమస్య మీద తన biased అభిప్రాయాల్ని ఒక case study లాగా సత్యాలన్నట్టు చర్చిస్తుంటే, ఊరుకొని ఉండమంటారా?
@మహేష్ కుమార్ గారు:
మీ విలువైన సమయాన్ని ఇక్కడ అనవసరంగా వృథా చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యడం మంచిదని నా అభిప్రాయం.
ఒక సామాజిక సమస్యను, సంఘసమస్యగా కాకుండా వ్యక్తిగత సమస్యగా భావిస్తే జరిగే సంఘటనలు ఇలానే ఉంటాయి. మీరు ఒక అగ్రకులజ్ఞుడిలాగానో, దళితుడిలాగానో కాకుండా ఒకే కులజనుడిలాగా ఆలోచించండి. మనమంతా, మనదంతా ఒకే కులం అదే మానవకులం. మనదంతా ఒకే కుటుంబం, వసుధైకకుటుంబం.
మహేశ్ గారూ,
మీ పాయింట్ అర్థమయిన నాలాంటి ఎంతోమంది మౌనంగా వున్నారు అంతే. అంత మాత్రాన మీ వాదనపై విమర్ష వున్న ప్రతిచోటా మీరు సమర్థించుకోబూనటం అనవసరం.
నేనివాళే మా వూరు నుండీ తిరిగొచ్చాను. మా అమ్మా-నాన్నల దగ్గర నుండీ మాలా-మాదిగల మీద వున్న పిర్యాదు ఒక్కటే. మేము కనిపించినా మంచం దిగట్లేదనీ, ఇంతకు ముందులా వంగి వంగి దండాలు పెట్టట్లేదనీ, పిలిచినప్పుడల్లా కూలికి రావట్లేదనీ, ప్రభుత్వానికి ముద్దు బిడ్డలయిపొయ్యారనీ.
సమాజంలో జరిగే మార్పుని జీర్ణించుకోలేని అగ్రకులాల వాదనలే ఇవన్నీ. అయితే అదే సమయంలో చట్టాల ఆసరాతో ఏ అగ్రకుల దురహంకారాన్ని మనం ఈసడించుకుంటున్నామో అదే దురహంకారంతో "కృష్న మాదిగ" లాంటి వాళ్ళు ప్రకటనలివ్వడం, దాడులు చేయడం ఖండనార్హం. దళిత పెద్దలూ, మేధావులూ ఆ పనే చేస్తున్నారు. క్రిష్న మాదిగ చేసిన పనికి ఆయన మీదున్న గౌరవం సగానికి సగం మందిలో పోయిందనడంలో సందేహం లేదు.
ఓ అగ్రకుల అమ్మాయిని అగ్రకుల అబ్బాయి టీజ్ చేస్తే ఎవరికీ పట్టింపు లేదు గానీ అదే ఓ దళిత అబ్బాయి చేస్తే జీర్ణించుకునే స్థాయిలో మన అగ్రకులాలు లేవు. అందువల్లే ఎక్కడో నూటికి ఒక్కటి అలా జరిగినా అగ్రకులాల్లో అది విపరీత స్పందనలకు కారణమౌతోంది.
--ప్రసాద్
http://blog.charasala.com
@ప్రసాద్, నా పేరు రాసి మరీ నా వాదాన్ని వక్రీకరిస్తే ఊరుకుండలేక రాయాల్సి వచ్చింది. ఈ చర్చవలన నాకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభమూలేదు. కానీ its my moral responsibility to explain my stand. At least when I was blamed for perpetuating hatred. Which I never intended to.All I wanted was a sensible debate.
ఇకనుండీ ఈ విషయంపై స్పందించడం మానుకుంటున్నాను.నాగరాజ గారికి కూడా వారి సలహాకు నెనర్లు.
Saraswathi Kumar , మీతో నేను ఏకీభవిస్తాను...
రెండు వాదనల్లోనూ నిజముంది, రెండింట్లోనూ అతిశయోక్తులున్నాయి. ఇరువర్గాల్లోనూ తప్పులున్నాయి. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. కొన్ని సంఘటనల కారణంగా దళితులందర్నీ ఒకటే గాట ఎలా కట్టలేమో, అగ్ర కులాల వాళ్లందరినీ కూడా అలాగే దళిత వ్యతిరేకులుగా చూడలేం. 'దళిత పక్షపాతి'గా ముద్రేయించుకున్న మహేష్ కుమార్ కి అగ్రకులాల్లో స్నేహితులే లేరంటే నేన్నమ్మను. తాడేపల్లి గారి సర్కిల్లో అందరూ బ్రాహ్మలేనన్నా నమ్మలేను. మరి ఈ ఆవేశాలెందుకు? ఎవరి అనుభవాలని వారు జెనరలైజ్ చేయటానికి ప్రయత్నించటం వల్ల వచ్చిన గొడవ ఇదంతా.
అయ్యా,గత ఆరవ తారీకు నుంచి ఇవ్వళ్టి వరకూ మీ ఈ బ్లాగు టపాను ప్రతిరోజూ కూడలిలో తాజా టపాలా ఎలా కనిపించెలా చెస్తున్నారో చెప్తే మాపాత బ్లాగుటపాలనూ అలా ప్రదర్శిముకుంటాము,ముందస్తు ధన్యవాదాలతో
రాజేంద్ర కుమార్ గారు,
నాకు మొన్న మొన్న దాకా తెలీలేదు. టపాకి మీరిచ్చిన లేబుల్ మార్చి 'publish post అనగానే మళ్ళి కూడలి లో తాజాగా మీ టపా ప్రత్యక్షం!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి