ఇప్పుడు టి.వి.ఛానళ్ళలో ఒక యాడ్ వస్తున్నది.అది ఒక ట్రౌజర్స్ కంపెనీ యాడ్.దానిలో ఒక యువతి తన ఇంట్లోనే తన ప్రియుడితో రహస్య ప్రేమాయణం సాగిస్తుంటుంది. అది గమనించిన ఆమె తండ్రి తుపాకి తో వెంటబడతాడు. దానితో ఆ ప్రియుడు గ్రిల్స్ లేని ఫ్రెంచ్ విండోలోనుండి (అర్థనగ్నంగానే) బయటకు దూకుతాడు. అప్పుడా యువతి అతనికి అతడు విప్పిన పాంట్‌ను అందించి తన తండ్రిని అతడి వెంట పడకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో ఆ పాంట్ తొడుక్కుని ఆ ప్రియుడు ఉడాయిస్తాడు. ఈ లోపు కూతురును విదిలించుకుని ఆ తండ్రి ‘బఫూన్ ’లా ఆ యువకుడి వెంట పడతాడు.
దీనికి ముందు మరో యాడ్ వచ్చేది. అది ఒక ‘బాడీ స్ప్రే ’ యాడ్. దానిలో ఒక ఇంటిలో ఒక స్త్రీని ఒక పురుషుడు చూచుకోకుండా డాష్ ఇస్తాడు.ఆ సమయంలో ఆ పురుషుడి నుండి వస్తున్న బాడీ స్ప్రే సువాసనను పీల్చిన ఆ స్త్రీలో వలపులు రేగి తన మనోలోకంలో ఆ పురుషుడితో శృంగారంలో పాల్గొన్నట్లు పచ్చిగా ఊహించుకుంటుంది.(ఆమె మనసులో ఊహించుకున్నా మనకు మాత్రం యాడ్‌లో అంతా చూపిస్తార్లెండి.)
దీనికన్నా ముందు మరో ప్రకటన వచ్చేది. దానిలో ఒక హిందీ సినిమా హీరో నటించాడు. ఓ బేకరీలో పనిచేస్తుండే ఒక యువకుడు బేకరీ యజమానికి మస్కా కొట్టి అతని కూతురుతో శృంగారం సాగిస్తాడు. ఆ సమయంలో వారి వేడి ‘మహిమ’ వలన వారి క్రింద కొన్ని బిస్కట్లు తయరవుతాయి.
వీటన్నింటి వలన యువతకు ఎటువంటి సందేశం వెళుతున్నది? ‘ప్రీ మారైటల్ సెక్స్’(వివాహ పూర్వ శృంగారం), అక్రమ సంబంధాలు…ఇలాంటివి తప్పేమీ కాదనీ, పైగా అవి చాలా ‘ఫన్నీ’ అనీ, వాటిని వ్యతిరేకించేవాళ్ళంతా బఫూన్లేననీ, అవి ఇతరులను ఫూల్స్‌ను చేస్తూ, వారికి మస్కాకొట్టి, వారికి తెలియకుండా సాగించి, చిలిపిగా నవ్వుకునే ‘థ్రిల్లింగ్’ విషయాలనే సందేశాన్ని యువతకు ఈ ప్రకటనల రూపకర్తలు చెప్పకనే చెబుతున్నారు.
(ఇక కొన్ని(చాలా) సినిమాల గురించైతే చెప్పుకోవటమే అనవసరం. అక్కడ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఇంకా ఆవుడ్, ఈవుడ్ అన్నీ కలిపి చాలా శృంగారాన్నే ఒలకబోస్తున్నాయి. ప్రేమ పేరుతో అభూత కల్పనలను సృష్టిస్తూనే ఉన్నాయి. యువతకు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉన్నాయి.)
(ఇప్పుడు సమాజంలో తమ మానాన తాము చదువుకుంటూ, తమ బంగారు భవిష్యత్తు వైపు సాగిపోయే అమ్మాయిలపై ప్రేమోన్మాదుల సాగించే మారణకాండకు ఇటువంటి సందేశాల, సంకేతాల ప్రభావం, ఇటువంటి సినిమాల ప్రభావం లేదంటారా..?!)
ఇటువంటి ప్రకటనల కాన్సెఫ్టుల యొక్క రూపకర్తలు, ఇటువంటి ప్రకటనలను రూపొందించే యాడ్ ఏజెన్సీలు, వీటిని రూపొందించమని కోరే కంపెనీలు, వీటిని ప్రకటించే TV ఛానెళ్ళు..వీళ్ళెవరికీ బాధ్యతలేదా..?! వీళ్ళ ఉత్పత్తులను ఏదోరకంగా అమ్ముకోవటమేనా వీరిపని..! వీళ్ళను నియంత్రించడానికి యంత్రాంగమంటూ లేదా..?!
ఈ పరిస్థితి నేటి మన సమాజంలో విలువల యొక్క పతనానికి చిహ్నం. ఇస్లామిక్ దేశాలలో అయితే ఇటువంటి ప్రకటనలకు బాధ్యులైన వారికి ఎటువంటి గతి పట్టేదో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. విలువల యెడల వారికి అంత పట్టు. అంత కాఠిన్యం అవసరం లేదు కానీ ఎవరికైనా విలువల యెడల నిబద్ధత ఉండాలి. ఇటువంటి పోకడల యెడల నియంత్రణ ఉండాలి.
వ్యభిచారం చేసేవారికి ఎయిడ్స్ రాకుండా చూచుకోమని జాగ్రత్తలు చెప్పే ప్రభుత్వాలున్న ఈ దేశ వ్యవస్థలో అటువంటి నియంత్రణ సాధ్యపడుతుందంటారా..?!!
అంత్యనిష్ఠూరమా ? ఆది నిష్ఠూరమా ?
10 గంటల క్రితం
+of+lakshmi%5B1%5D.jpg)

10 వ్యాఖ్యలు:
మందకృష్ణా......మందకృష్ణా......మందకృష్ణా......
ఎక్కడున్నావయ్యా...ఎక్కడున్నా వచ్చి..ఈ పచ్చి పిచ్చి యాడ్స్ బారి నుండి కాపాడు సామి...
చాలా మంచి విషయం చెప్పారు. ముఖ్యంగా ఇపుడు క్లిక్ అయేది - పాశ్చాత్యుల జీవితాల అనుకరణ! (బేకరీ దృశ్యం) వ్యాపార ప్రకటన లో అంతర్జాతీయ స్థాయి ని తీసుకుని రావటం, కొంటె తనం వీటిలో ప్రధానాంసాలు. సాధారణంగా హృతిక్ లాంటి 'హాలీవుడ్ ఇమేజ్' ఉన్న నటుడి తో యువత ఎక్కువగా ఆకర్షితం అవుతుంది. ఇంతకు ముందు హృతిక్ తో ఒక డాన్స్ చేస్తూ తీసిన యాడ్ (హైడ్ అండ్ సీక్) మీకు నచ్చే ఉంటుంది. అందుకే హృతిక్ ఎండార్స్మెంట్ ఈ బ్రాండ్ కు ప్రధాన ఆకర్షణ. మీరు ఉదహరించిన మిగతా యాడ్ లు కూడా ఈ మరుతున్న కాలానికి ప్రతీకలే. వీటిని చూసినంత మాత్రాన యువత ఎఫెక్ట్ అవుతారనడం పూర్తిగా నిజం కాదు. చిన్నప్పటినుంచీ వీ.ఐ.పీ యాడ్ ల లో హీరో లను చూసి చూసి ఉన్నాం. అప్పట్లో పెద్ద వాళ్ళు విసుక్కునే వారు. అలానే ఇప్పుడు మనం కూడా. అయితే, వీటికి బ్రేక్ లు వెయ్యలేమా అంటే.. వెయ్యొచ్చు. ఎప్పటికప్పుడు సృజనాత్మకత పేరుతో వాళ్ళే ఈ అతి సెక్సు వాదానికి విసిగి మానేస్తారు లెండి. పైగా ఒక ప్రోడక్ట్ ని (పెద్ద వాళ్ళు వాడే ప్రోడక్ట్) అమ్మాలంటే క్వాలిటీ నే ఎప్పటికీ మంచి సూత్రం. యాడ్ కాదు.
ఈ ప్రకటనల పై ఎలాంటి అభ్యంతరాలున్నా,ఎలాంటి ఫిర్యాదులున్నా ఈ లంకె నొక్కి మన అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
http://www.ascionline.org/regulation/howtocomplain.htm
నిబద్ధత ఎవరికి కావాలి? తీసేవాళ్ళకా!చూసేవాళ్ళకా!!
తీసేవాళ్ళ ఉద్దేశం అమ్మకం. అంతేకాక, వాళ్ళకొక regulator(నియంత్రించే సంస్థ) ఉన్నారు. ఆ రూల్స్ కి లోబడి ఈ యాడ్లు తీస్తారు.ఇక విచ్చలవిడితనం,వ్యభిచారం మీకు కనబడ్డాయి. నాకు అదొక కథచెప్పినట్లనిపించొచ్చు.Aren't those situations possible?
చూసిన ప్రతివాడూ regulator లేక సెన్సార్ అవడం మొదలైతే,ఇక అందరూ మందకృష్ణలవ్వచ్చు.ఇలాంటివి లక్ష యాడ్లూ,పాతిక లక్షల సినిమాలొచ్చినా, మన యువత అంత ఈజీగా బ్రెయిన్ వాష్ అయిపోయే స్థితిలో లేరు. వారు సినిమాల్లో చూసేవాటికన్నా జీవితాల్లో అనుభవించేవి ఇంకా ఎక్కువ.
మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలీదు.హైదరాబాద్ లో ఉంటే ఒకసారి సాయంత్రం IMAX కు, నెక్లెస్ రొడ్ కు వీలైతే బంజారాహిల్స్ లోని ఒక పబ్ కు వెళ్ళి చూడండి.
ఇక్కడ విషయం అందరికీ తెలుసు... ఇలాంటి ప్రకటనలు కేవలం రెచ్చగొట్టేందుకే అన్నట్టు నాకనిపిస్తుంది.
అందులో ఉన్న మర్మమేమిటోఅందరికీ అర్థమవుతుంది. ఇలా సెక్సు సెల్స్ అనే సంగతిని వాడుకోవడమే.
రెగులారిటీ అథారటీలు సినిమాలకున్నంత స్ట్రిక్టుగా ప్రకటనలకి లేరు అని అనిపిస్తుంది.
చూస్తే తీస్తారు, తీస్తే చూస్తరు, అది నిర్మాతల వివరణ కావత్చు, కాని
చూపేది చూస్తారు, చూపలెనిది చూడలెరు కదా ... కాబట్టి తియ్యడం ఆపడమే సరైన మార్గం
@జింతాకు గారు,
అవతార పురుషులకు స్వాగతం..సుస్వాగతం.మీ ‘పి కింద ప’ బ్లాగులో పోస్టు చేసినవి రెండు ‘సిన్ని’ టపాలే అయినా ‘కేక’ పుట్టించారు. ఎప్పుడో అధర్మం పెరిగినపుడే కాకుండా తరచుగా అవతరిస్తూ బ్లాగులోకాన్ని అలరించ ప్రార్థన.నా టపాను కరుణించి అవతరించినందుకు ధన్యవాదాలు.
@సుజాత గారు,
ఇవి విసుక్కునేంత చిన్న విషయాలని నేను భావించడంలేదు.
@రాజేంద్ర కుమార్ గారు,
మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు.అయితే వీటికి ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందంటారా?!మొన్న ఓ సినిమా విషయంలో కూచపూడి నర్తకుల అభ్యంతరాలకు ఓ సెన్సారు అధికారిణి ఎలాంటి తలా తోక లేని సమాధానాలిచ్చిందో మీరు వినలేదా?ఈ వ్యవస్థలో అన్నీ ఉంటాయి.కానీ ఫైనల్ గా రిజల్టే ఉండదు.
@కత్తి మహేష కుమార్ గారు,
Are not those situations possible? అని ప్రశ్నించారు. ఈ యాడ్స్ లోని విషయాలు సమాజంలో జరగడం లేదని కాదు. సమాజంలో అన్నీ జరుగుతాయి. కానీ ‘సభ్యసమాజం’ అంటూ మనం విలువలను విడిగా పేర్కొంటాము. దాని అర్థం సభ్య సమాజం విడిగా ఎక్కడో ఉంటుందని కాదుగా! కేవలం సభ్యతకు, అసభ్యతకు మధ్యన గీతగీసే ప్రయత్నమే అది. ఆ గీతను ఈ యాడ్‌లు చెరపటానికి ప్రయత్నిస్తున్నాయి. ఎటూ జరుగుతూనే ఉందని మనం అసభ్యతను అంగీకరించలేముగా! అపలేక పోయినా ప్రోత్సహించకుండా ఉంటే అంతే చాలు.
చూసే ప్రతి ఒక్కడికీ ప్రశ్నించే అధికారంలేదనా మీ ఉద్దేశం? కేవలం కొన్ని సంస్థల, వ్యక్తుల యొక్క గుత్త హక్కా అది?
‘ఇలాంటివి లక్ష యాడ్‌లు, పాతిక లక్షల సినిమాలు వచ్చినా మన యువత అంత ఈజీగా బ్రెయిన్ వాష్ అయిపోయే స్థితిలో లేరు’ అని అన్నారు. మంచిదే..మరివారు IMAX లో, నెక్లెస్ రోడ్ లో, పబ్బుల్లో ఏంజేస్తున్నారు. మెడిటేషన్ చేస్తున్నారా? కాదు..వాళ్ళేం జేస్తున్నారని మీ ఉద్దేశమో నాకు తెలుసు. అంటే ‘మన యువత బయటి ప్రభావాలవల్ల చేడిపోయే బలహీనులు కారు. వారు స్వంతంగానే చెడిపోయే బలవంతులు’. ఇదేగా మీ conclusion.
(యువత నడవడిక మీద ‘స్వీయ నియంత్రణ’, ‘కుటుంబ విలువలు’ ఇత్యాది వాటి ప్రభావం లేదని నేను అనటంలేదు. వీటికి తోడు చుట్టూ ఉండే వాతావరణ కూడా బాగుండాలనేదే నా ఉద్దేశం. అసభ్య వాతావరణం యొక్క ప్రభావానికి కొందరైనా లోనవుతారు.)
@ప్రవీణ్ గార్లపాటి గారు,
ధన్యవాదాలు.
@అసంఖ్య గారు,
ధన్యవాదాలు. మీరు నాపాత టపాకు రాసిన కామెంట్ చూశాను.దానికి త్వరలోనే మరో టపాలో సమాధానం లభించగలదని తెలియజేస్తున్నాను.
ఇక్కడ సమస్య వారినుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందన్నది కాదు,వస్తుంది లేకపోతే రాదు అని కాకుండా మీరు భావించింది సమాజశ్రేయస్సును ఉద్దేశ్యించింది కాబట్టి,ఖచ్చితమైన సమాధానం వచ్చేవరకూ మనం/మీరు వారితోఇ-ఉత్తరప్రత్యుత్తరాలు జరపవచ్చు,కానీ ఫిర్యాదుకు ఒక నిర్ధిష్టరూపం,ఒక ప్రకటన వివిధరకాలుగా ఎలా చెరుపుతుందో/చెడగొడుతుందో కనీసం మీరు అలా ఎందుకు భావిస్తున్నారో విశదంగా తెలపాలి.మొదట ఇమెయిల్ ద్వారా తెలియజేసినా తర్వాత మాత్రం రిజిస్టర్పోస్టులో అకనాలెడ్జ్మెంట్ తో ఫిర్యాదు వారికి పంపాలి.
రాజేంద్ర కుమార్ గారూ!
ఈ వ్యవస్థ మీద, దానిలోని సంస్థల మీద నాకెంత విశ్వాసం ఉందో మీకు తెలియనిది కాదు. మీరు చెబుతుంటేనే తెలుస్తున్నదిగా ఆ ఉత్తర ప్రత్యుత్తరాలలో ఎన్ని కొర్రీలున్నాయో.
చిత్తశుద్ధి ఉన్న లక్షణం ఒక్కటైనా కనపడుతున్నదా వాటిలో.
"అంటే ‘మన యువత బయటి ప్రభావాలవల్ల చేడిపోయే బలహీనులు కారు. వారు స్వంతంగానే చెడిపోయే బలవంతులు’. ఇదేగా మీ conclusion."
లెస్స పలికారు. నెనర్లు.
- మురళి
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి