7, ఫిబ్రవరి 2008, గురువారం

చలం-ఒక సమీక్ష (మూడవ భాగం)

ప్రజల సొమ్మును కోట్లాది రూపాయలు కాజేసి, ముందు తను తన కుటుంబ భద్రతను కాపాడుకుని, ఆనక ప్రజాసేవ అంటూ శ్రీరంగనీతులు చెప్పే వారిని ప్రజలు వోట్లు వేసి మరీ తమ నాయకులుగా ఎన్నుకుంటున్నారు. ఇటువంటి ప్రజలకు అంతటి త్యాగశీలి ఐన చలం లాంటి వారు ఎన్ని యుగాలకొక్కడు దొరుకుతాడు.

చలం నిస్సంశయంగా యుగపురుషుడు. చలం భారతదేశానికి స్త్రీవాద పితామహుడు. చలం కేవలం స్త్రీవాదే కాదు. ఆయన కుటుంబజీవితం మొత్తం ప్రక్షాళింపబడాలని కోరుకున్నాడు. అందుకు అతని 'బిడ్డల శిక్షణ ' గ్రంథమే తార్కాణం. చలం ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు. వ్యక్తియొక్క ఆలోచనావిధానంలో మరియు వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఎన్నో కోణాలను ఆవిష్కరించి వాటిలో ఎంతో మార్పుని చలం కోరుకున్నాడు. చలం ఒక తాత్వికుడు. మానవ జీవితానికి అసలు అర్ధం ఏమిటని, మానవజీవన లక్ష్యం ఏమిటని తరచి తరచి ఆలోచించి, అన్వేషించి చివరకు మానవజీవితాదర్శం శాంతియే అని కనుగొన్నాడు. యశోసంపదలను యెడమ చేత్తో....కాదు యెడమ కాలితో తన్నిన ఉన్నతుడు చలం.

చలం తన జీవితంలో ఎంతో సాంఘిక బహిష్కరణను, ఎంతో పేదరికాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఐనా కూడా తను ఏం చెప్పాడో తదాచరణకే కట్టుబడ్డాడు. చలం మూలంగా ఇంత ఉద్యమం, ఇంతటి సంచలనం, సమాజంలో ఇంతటి కదలికా చూసిన తరువాత ఇదంతా కేవలం ఒక వ్యక్తి చేసినదా అని ఎవరైనా విస్మయం చెందక మానరు. ఏ గొప్ప ప్రజాసమూహమో, లేక తన వేలాదిమంది అనుచరులతో ఏ గొప్ప నాయకుడో గానీ ఇటువంటి ఉద్యమాన్ని నిర్మించలేడు. కానీ చలం కాగితం, కలం ద్వారానే ఇంతటి కదలికను సమాజంలో తీసుకువచ్చాడు. ఉద్యమ రథానికి చక్రం, ఇరుసు కూడా తానే అయి నిలిచాడు. అందుకే అంతగా నలిగిపోయాడు.

భరత ఖండపు ఉత్తరాదిన ఆ హిమాచలం, తెలుగు వారి గుండెల్లో ఈ గుడిపాటి వెంకటాచలం ఆచంద్రతారార్కం నిలిచి ఉండేవారే. ఆయన హృదయాన్ని తెలుసుకోకుండా వ్యక్తీకరణలోని దోషాన్ని పట్టుకుని ఆయనను విమర్శించటం అవగాహనలేని తనమే. నిద్రపోతున్న జడసమాజాన్ని చలం తట్టిలేపాడనటం కన్నా కొట్టి లేపాడనటం సబబుగా ఉంటుంది. కందుకూరి, గురజాడల ఉద్యమాలు కొన్ని ప్రాంతాలకే, కొన్నివర్గాలకే పరిమితమయ్యాయి. పెక్కుమంది వారి అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ, కొందరు అసలవేవీ పట్టకుండా తమ మూర్ఖత్వాన్ని తాము కొనసాగిస్తూనే ఉన్నారు. అటువటి వారదరికీ చలం తొడపాశం పెట్టాడు. చలం రచనలు,చలం భావాలు, చలం ఉద్యమం ఆంధ్ర దేశం మూలమూలలకూ చేరాయి. చలం కన్నా ముందే ప్రారంభమై నత్తనడక నడుస్తున్న సామాజికమార్పుని చలం వేగిరం చేసాడు.(సమాప్తం)

6, ఫిబ్రవరి 2008, బుధవారం

చలం-ఒక సమీక్ష (రెండవ భాగం)

ఎంతో జీవితం ఉండగానే, నడివయసులోనే చలం జీవితం చెల్లాచెదురైనది. భార్య చలం ప్రవర్తనతో విసిగి వేసారి, చదువుసంధ్యలు, పెళ్ళిళ్ళు లేని తన పిల్లల దుస్థితికి తీవ్రంగా దుఃఖించి, మతిస్థిమితం తప్పి, గుండెపగిలి చనిపోయింది. పెద్దకొడుకు చిన్నవసులోనే రోగగ్రస్థుడై మరణించాడు. రెండవకొడుకు దురలవాట్లకు బానిసై ఇల్లు వదలి శాశ్వతంగా ఎటో వెళ్ళిపోయాడు. పెద్దకూతురు సన్యాసినిగా మారింది. మరో కూతురు చిన్మయానందుని శిష్యురాలైనది. మరో కూతురు బొంబాయిలో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళిపోయింది.

చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది. తన కుటుంబాన్ని ఆర్ధికంగా అప్పటివరకు ఆదుకున్న వదిన డాక్టర్ రంగనాయకమ్మ మరణించింది. ప్రియురాలు లీల వీడి వెళ్ళిపోయింది. బంధువులు, కులం, సమాజం ఏనాడో చలాన్ని బహిష్కరించారు. ఐనా చలం తన అభిప్రాయాలను వీడలేదు. చలం ఉద్యోగరీత్యా ఏ ఊరు వెళ్ళినా ఊరిచివరో, దాపులనున్న ఏ అడవిలోనో ఉన్న పాడుబడ్డ ఇళ్ళలోనో, లేదా హైందవేతరులు నివసించే వీధులలోనో మాత్రమే అతనికి ఇల్లు అద్దెకు దొరికేది. హిందూ సమజం అంతగా అతన్ని వెలివేసింది. చలం ఈ పరిణామాలవలన క్రమంగా మానసికంగా బలహీనపడ్డాడు. తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో చలం వేరేదారిలేక బెజవాడలోని తన ఆస్తులనన్నింటినీ తెగనమ్ముకుని తానుకూడా అరుణాచలానికి వెళ్ళిపొయాడు.

ఆంధ్రదేశంలో ఆదరణకరవై, జీవితం చిన్నాభిన్నమై అరుణాచలం వెళ్ళిన చలం రమణ మహర్షి చల్లని చూపులతో సాంత్వన పొందుదామనుకున్నాడు. ఐతే ఆంధ్రదేశంతోపాటు విధి కూడా చలాన్ని చిన్నచూపు చూసింది. ఈయన వెళ్ళిన అతికొద్ది కాలానికే రమణ మహర్షి ఇహలోక యాత్రను చాలించారు. అప్పటినుండి చలం ఎమోషనల్ గా తన పెద్దకూతురు, యోగిని, రమణ మహర్షి శిష్యురాలూ అయిన సౌరిస్ మీద ఆధారపడటం జరిగింది.

ఈవిధంగా మానసికంగా దుర్బలుడైన చలం ఈశ్వరవాణి అనీ, అష్టగ్రహ కూటమి అనీ ఆంధ్రదేశంలోని తన స్నేహితులకు ఉత్తరాలు రాసి నవ్వులపాలయ్యాడు. ఐతే చలాన్ని మనం విమర్శించకూడదు. ఎందుకంటే ఆయన తన సర్వశక్తులనూ తను నమ్మిన అభిప్రాయాలకొరకు ధారపోశాడు. తన మానసికశక్తినంతటినీ ధారపోసి ఎన్నో రచనలు చేశాడు. తనను, తన కుటుంబాన్ని బలి ఇచ్చాడు. సంఘబహిష్కరణను తిరుగులేకుండా ఎదుర్కొన్నాడు. ఇది చలం ప్రజల కుటుంబ జీవితంలో ఇసుమంత మార్పు కొరకు చేసిన త్యాగం, బలిదానం. దానిని మనం గుర్తించాలి.

చలం ప్రధానంగా లోపాన్ని ఎత్తి చూపాడు. దోషాన్ని విమర్శించాడు. వాటిని ప్రజలకు చాటి చెప్పాడు. తన మేధస్సునంతా, తన ప్రతిభనంతా దోషాన్ని ఎత్తిచూపటంలోనే చూపాడు. ఐతే ఏ సంస్కరణవాదైనా,ఏ తాత్వికుడైనా దోషం ఎత్తిచూపటంతోటే ఆగడు. పరిష్కారంగా కూడా కొన్ని అభిప్రాయాలను చెబుతాడు. అక్కడ అతనికి పట్టు ఉండక పొవచ్చు. ఆకోణంలో అతను ఎక్కువగా ఫోకస్ చేయక పోవచ్చు. ఐనా కూడా దోషాన్ని చెప్పినపుడు పరిష్కారం చెప్పటం అనేది సహజంగానే జరిగిపోతుంది. ఆయనను విమర్శించేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.....(సశేషం)

చలం-ఒక సమీక్ష (ఒకటవ భాగం)

చలం తన రచనలలో స్త్రీలు, పిల్లలు స్వేచ్చగా జీవించగలిగిన కుటుంబాన్ని కోరుకున్నాడు. ఐతే నిజజీవితంలో చలం తాను కోరిన కుటుంబాన్ని తానే నిర్మించలేకపోయాడు.

చలం ఈవిధంగా విఫలమవటం వలన ఆయన వేలెత్తి చూపిన దోషాలన్నీ దోషాలు కాకుండాపోవు. చలం ప్రధానంగా సమాజాన్ని, సామాజికజీవితాన్ని కాదు విమర్శించినది. వ్యక్తిని, వ్యక్తి యొక్క కుటుంబజీవితాన్ని, వ్యక్తి మనస్తత్వాన్ని విమర్శించాడు. చలం కుటుంబజీవితంలోని మూర్ఖత్వాన్ని, ద్వంద్వనీతిని, అమానుషత్వాన్ని స్వయంగా అనుభవించి, అసహ్యించుకొని దానిమీద తన రచనల ద్వారా తీవ్రమైన దాడి చేసాడు. చలం వీటన్నింటి మీద పెంచుకున్న కసి వలన ఈ దాడిలో తీవ్రతనే తన లక్షణంగా చేసుకున్నాడు. నిజానికి ఈ తీవ్రతవలనే మూర్ఖమైన కుటుంబజీవితాన్ని కొనసాగిస్తున్న వారికి అంతగా చురక వేయగలిగాడు.

ఐతే ఈ మూర్ఖత్వం ఒక రకమైన తీవ్రతైతే చలం అభిప్రాయాలు మరో రకమైన తీవ్రతగా పరిణమించి ఆ తీవ్రతకు చలం మరియు ఆయన కుటుంబం బలైపోయింది. చలం ఎంచుకున్న అంశం కుటుంబజీవితం, వ్యక్తిగత ప్రవర్తన అయ్యేసరికి అది తప్పనిసరిగా, సహజంగా ఆ అభిప్రాయాలను చలం ఆచరించటం జరిగింది. ఆ అభిప్రాయాల తీవ్రత యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో చలం కుటుంబమే, చలం జీవితమే ఒక ఉదాహరణగా నిరూపణ ఐనది. చలం నిజాయితీపరుడవటం వలన తన రచనలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను తన జీవితంలో కూడా ఆచరించటం జరిగినది. అందువలనే ఆ రచనలు, ఆ అభిప్రాయాలు అంత బలంగా ప్రజలను తాకాయి.

మనకు చలం హృదయం ముఖ్యం. చలం సారాంశం ముఖ్యం. చలం వ్యక్తి ప్రవర్తనలోని, కుటుంబ జీవితంలోని ఏఏ చెడుగులను వేలెత్తి చూపాడో అది ముఖ్యం. అంతేకానీ చలం రచనలలోని తీవ్రత అప్రధానమైనది. చలం తీవ్రతలోని అంతరార్ధం వేరు. ఆ తీవ్రత ఆచరణీయమని కాదు. ఆ తీవ్రత ఉద్దేశ్యం ప్రజలకు తమలోని దోషాన్ని బలంగా చెప్పటమే..... ఐతే చలం తాను ఏంచెప్పాడో అదే ఆచరించి ఆతీవ్రతలోని దోషానికి తనను, తన కుటుంబాన్ని బలిచేసాడు...(సశేషం)

3, ఫిబ్రవరి 2008, ఆదివారం

సత్యాన్వేషణ పథం

సత్యాన్వేషణ పథంలో మానవుడు ఇంతవరకు గమ్యస్థానం చేరలేదు. మానవుడి జీవితానికి ఎటువంటి దిశానిర్దేశం లేక, ఒక విధానమంటూ లేక అస్తవ్యస్తంగా ఉన్న రోజులలో ఒకే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని, దానికెటువంటి ప్రామాణికత లేకపోయినా దానినే గాఢంగా విశ్వసించి,ఆ మార్గంలోనే జీవించటం ప్రారంభించాడు.'విశ్వాసమే సత్యం' గా భావించాడు.దీనివలన మునుపటి అస్తవ్యస్తత తొలగి మానవజీవితానికి నిర్దిష్ఠ విధానమంటూ ఏర్పడింది. ఒక కట్టుబాటు ఏర్పడింది. అప్పటికి ఇదే మానవుడు సాధించిన విజయం.

ఐతే శాస్త్రీయ దృక్పథం లేని కేవల విశ్వాసం వలన మానవజీవితంలో మూఢత్వం నెలకొంది. వికాసం లేక సమాజం శిలా సదృశంగా మారిపోయింది. ఈ విధంగా సమస్య మరో రూపంలో ముందుకొచ్చింది. ఈ సమస్య నుండి బయటపడటానికి మనిషి మరో రకమైన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. 'ఏ విషయాన్ని గుడ్డిగా విశ్వసించకూడదు.ఏదైనా సరే ప్రత్యక్షంగా మనం చూడాలి లేదా శాస్త్రీయంగా నిరూపించబడాలి 'అనేదే ఆ కొత్త దృక్పథం. ఈ దృక్పథం వలన మనిషి అపరిమితమైన విజ్ఞానశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. ప్రకృతి మీద అదుపు సాధించాడు. అంతులేని విజయాలు సాధించాడు. అభ్యుదయవాదం, ఆధునికత పేరుతో నూతనమైన జీవనసరళినే సృష్టించాడు. 'శాస్త్రీయతే సత్యం'గా ప్రకటించాడు.

కానీ ఈ ధోరణి వలన ఆర్ధిక రంగంలో అనేక హానికర పరిణామాలు పొడసూపాయి. బలవంతుడు బలహీనుణ్ణి దోచి వేసే విషసంస్కృతి దాపురించింది. సామాన్యుల జీవితాలు దుర్భరమైపోయాయి. సంపద, సౌకర్యాలు, సుఖాలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. విజ్ఞానశాస్త్ర ఫలితాలను కొందరే అనుభవించటం ప్రారంభించారు. దీనితో మనిషి మళ్ళీ పునరాలోచనలో పడ్డాడు. పైకి గోచరించేదీ, ప్రత్యక్షంగా మనకు కనిపించేదీ కనికట్టు కావచ్చు, మోసపూరితం కావచ్చు. కాబట్టి 'ఏ విషయమైనా పైకి కనిపించినంతమాత్రాన నమ్మకూడదు. అది హేతుబద్ధమై, తర్కబద్ధమై ఉండాలి ' అనే నిర్ధారణకు వచ్చాడు. 'హేతుబద్ధమైనదే సత్యం' గా ప్రకటించాడు.ఈ ధోరణి వలన సమాజంలోని అతి సామాన్యుడు కూడా పరపీడననుండి విముక్తుడై మేలుపొందాడు. అతి బలహీనుడు కూడా తన ప్రాధాన్యతను గుర్తించి మసలుకోవటం ప్రారంభించాడు.

ఐతే ఈ హేతువాద ధోరణి అంతులేని వాదోపవాదాలకూ, ఎంతకూ కొలిక్కిరాని సిద్ధాంత చర్చలకూ దారితీసింది. ఏకాభిప్రాయనికి తావులేక ఎవరి అభిప్రాయాన్ని వారు సమర్ధించుకునే ధోరణి బయలుదేరింది. మానవుడు కూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలే మహాలక్ష్యాలుగా జీవించాల్సిన పరిస్థితి తల ఎత్తింది. మనిషి ఈ విధంగా దైహిక అవసరాలకే పరిమితమై మానసిక, బౌద్ధిక అవసరాలమాటే తలపెట్టక మనిషిగా తన విశిష్టతనే కొల్పోయే పరిస్థితి దాపురించింది. దీనితో మానవుడు తన హేతువాద దృక్పథాన్ని కూడా విడనాడేందుకు సన్నద్ధుడైనాడు. సరిగా ఇదే నేటి ప్రపంచ దృశ్యం.

సత్యాన్వేషణ పథంలో ఇన్ని శతాబ్దాల మహా యానంలో మానవుడు ఇంకా గమ్యాన్ని చేరలేకపొవటానికి కారణం ఏమిటి....? అని ప్రశ్నించుకోవలసినసమయమిది.

మానవుడికి సత్యస్వరూపం గురించి ఇప్పటివరకూ సరైన అవగాహన లేకపోవటమే దీనికంతటికీ కారణం. సత్యం ఏక రూప విషయం కాదు. అది మూడు అంశల యొక్క సమ్మేళనం.ఏదో ఒకానొక దృక్పథం వలన సంపూర్ణ సత్యం గోచరించదు.మానవుడు సత్యాన్ని చేరలేడు. విశ్వాసం వలన సత్యం లోని ఒక అంశ గోచరిస్తుంది.ప్రత్యక్ష ప్రమాణం లేక ఆధునిక దృక్పథం వలన మరోఅంశ గోచరిస్తుంది. హేతువాద దృక్పథం వలన మరో అంశ గోచరిస్తుంది. ఏదో ఒక దృక్పథాన్నే అంటిపెట్టుకోక సందర్భానుసారంగా మూడురకాల దృక్పథాలనూ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మానవుడు సత్యాన్ని చేరగలడు.