21, ఫిబ్రవరి 2009, శనివారం

భక్తియోగం

'భక్తియోగం' వలన మానవుడు దైవానుగ్రహానికి పాత్రుడౌతాడు. మానవుడు ఐహికంగా సాధించవలసిన విషయాలలో దైవానుగ్రహం యొక్క పాత్ర లేక దైవం యొక్క పాత్ర స్వల్పమే. కానీ మనిషి జీవితం మొత్తాన్ని సమగ్రంగా చూసినపుడు భగవంతుని కృప యొక్క విశిష్టత మనకు బోధపడుతుంది. మనిషి స్వభావాన్ని బట్టి, మనోబలాన్ని బట్టి అతనికి ‘విధి అనుకూలత’ సంభవిస్తుంది. ఒకొక్కసారి ఈ విధి వల్లనైతేనేమి, మానవుని సంకల్పదోషం వల్లనైతేనేమి మానవునికి హాని కలిగే సందర్భంలో దైవానుగ్రహం మానవుడిని రక్షిస్తుంది. అది కూడా అందుకు అతను పాత్రుడైన పక్షంలో మాత్రమే. ఆ పాత్రతకు మార్గం భక్తియోగమే.

మానవుడు ఆ భగవంతునికి భక్తుడు కాని పక్షంలో తన జీవితానికి భద్రతను డబ్బులోనో, అధికారంలోనో చూసుకుంటాడు. నిజానికి ఇటువంటివారు కూడా గుళ్ళూగోపురాలూ తిరుగుతూ దేవుడిని నిత్యం పూజిస్తూ ఉంటారు. కానీ ఇదంతా భౌతిక చర్యే కానీ వారికి ఏవిధమైన భక్తీ ఉండదు. భక్తి అనేది భౌతికమైనది కాదు. అది మానవుడి అంతరంగానికి సంబంధించిన విషయం. అది మనసులో, హృదయంలో ఉండాలి.

భక్తి అంటే మూర్తి ఆరాధన కాదు. అది ధర్మం ఎడల అనుతాపం, ధర్మం ఎడల అపరిమితమైన విశ్వాసం. భగవంతుడు ధర్మ స్వరూపుడు కావున ధర్మం యెడల అనుతాపం భగవంతుని ఎడల భక్తిగానే పరిగణింపబడుతుంది. భక్తి అంటే పూజలు, పునస్కారాలు కాదు. అది ‘సర్వత్ర సమదర్శనం’. మనకు ఏ విధంగా మేలు జరగాలని కోరుకుంటామో అలాగే ఇతరులకు కూడా జరగాలని కోరుకోవడం. ఇటువంటి వారినే ఆ భగవంతుడు తన భక్తులుగా పరిగణిస్తాడు.


యే త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే |

సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం || (అ.12-శ్లో.3)

సన్నియమ్యేన్దిరియగ్రామం సర్వత్ర సమబుద్దయః |

తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః || (అ.12-శ్లో.4)

ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరచుకుని సర్వత్రా సమభావం కలిగి, సమస్త భుతాలకూ మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ, నాశరహితమూ, అనిర్వచనీయమూ, అవ్యక్తమూ, సర్వవ్యాప్తమూ, ఊహాతీతమూ, నిర్వికారమూ, నిశ్చలమూ, నిత్యమూ అయిన ఆత్మస్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు.


సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || (అ.6-శ్లో.29)

యోగసిద్ధి పొందినవాడు సమస్త భుతాల పట్ల సమభావం కలిగి సర్వ భుతాలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వభూతాలనూ సందర్శిస్తాడు.


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || (అ.6-శ్లో.30)

అన్ని భుతాలలో నన్నూ,నాలో అన్ని భూతాలనూ చూసేవాడికి నేను లేకుండా పోను; నాకు వాడు లేకుండా పోడు.


సర్వ భూతస్థితం యో మాం భజత్యేకత్వ మాస్థితః |

సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే || (అ.6-శ్లో.31)

సమస్త భుతాలలో వున్న నన్ను భేదభావం లేకుండా సేవించే యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే ఉంటాడు.


ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున! |

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || (అ.6-శ్లో.32)

అర్జునా! సమస్త జీవుల సుఖదుఃఖాలను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయం.


నిజమైన భక్తుడు తన జీవితానికి భద్రతను, హామీని దైవానుగ్రహంలో చూసుకుంటాడు. తన స్వధర్మం అమితమైన ధనార్జనతో కూడుకున్నది కాక పోయినా తన భారాన్ని ఆ భగవంతుడి మీద మోపి తన కర్తవ్యనిర్వహణకు పూనుకుంటాడు. మరే విధమైన ఐహిక సంబంధమైన హామీని కోరడు. ఇటువంటి భక్తులకొరకే గీతలో భగవంతుడు ‘యోగక్షేమం వహామ్యహం’ అనే వాగ్దానాన్ని చేశాడు.


అనన్యాశ్చింతయం తో మాం యే జనాః పర్యుపాసతే |

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం || (అ.9-శ్లో.22)

ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించే వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను.


అంటే తన భక్తుల యోగక్షేమాలను తనే చూసుకుంటానని భగవానుడు మాట ఇచ్చాడు. కనుక మానవుడు తన స్వధర్మాచరణలో ఏ విధమైన ఐహికమైనటువంటి భద్రత, హామీ గోచరించకపోయినా కూడా వెరవకుండా భగవంతుడే తన యోగక్షేమాలు చూసుకుంటాడని నమ్మి తన స్వధర్మాన్ని నిర్వర్తించాలి.


త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః |

కర్మ ణ్యభిప్రవృత్తో పి నైవ కిఞ్చత్కరోతి సః || (అ.4-శ్లో.20)

కర్మఫలాపేక్ష విడిచిపెట్టి నిత్యమూ సంతృప్తితో దేనిమీదా ఆధారపడకుండా, కర్మలు చేసేవాడు, ఏమీ చేయనివాడే అవుతాడు.


అలా కానియెడల మానవుడు తన జీవితానికి భద్రత మరియు హామీ కొరకు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి అన్నింటికన్నా ముందుగా ధనాన్నో, అధికారాన్నో, లేక పేరుప్రతిష్ఠలనో సాధించుకొని, వాటిమీదనే ఆధారపడే విధంగా తయారై స్వధర్మాన్ని వీడతాడు. కర్మబంధాలలో చిక్కుకుంటాడు.

కనుక భక్తుడికి ఏ విధమైన ఐహికమైన ఆలంబన, హామీ లేక భద్రత అవసరంలేదు. అన్నీ ఆ భగవంతుడే. ఆ విధంగా భగవంతుడి మీద భారం వేసి తన స్వధర్మాన్ని నిర్వర్తించే మానవునికి ఎటువంటి హానీ సంభవించదు. అంటే మానవునికి తన స్వధర్మాన్ని నిర్వర్తించే ధైర్యం భక్తివలననే, శరణాగతి వలననే కలుగుతుంది. అందుకే గీతలో గీతాకారుడు తన భక్తులకు తనమీద అపరిమితమైన విశ్వాసం కలిగేటట్లుగా ‘కౌంతేయా! ప్రతిజానీహి, నమే భక్తం ప్రణశ్యతి’ అని కూడా అన్నాడు. అంటే ‘ఓ అర్జునా! నా భక్తుడెన్నటికీ చెడిపోడని ఘంటాపథంగా శపథము పలికి ఘోషింపుమా!’ అని అర్థం.


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |

సాధురేవ స మంతవ్యః సమ్య గ్వ్యవసితో హి సః || (అ.9-శ్లో.30)

ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రచిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది.


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం విగచ్ఛతి |

కౌంతేయా! ఫ్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి || (అ.9-శ్లో.31)

అలాంటి వాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై, శాశ్వతశాంతి పొందుతాడు. కౌంతేయా! నా భక్తుడెప్పుడూ చెడిపోడని ఘంటాపథంగా శపథం చేసి మరీ చెప్పు.


అంటే మనం ఇక నిశ్చింతగా సత్యాచరణ చేయవచ్చు. దేనికీ భయపడవలసిన పనిలేదు. భవిష్యత్తు గురించి భయపడవలసిన పనిలేదు. విధి పరంగా ఏమైనా విపత్తులు సంభవిస్తాయేమో అని భయపడవలసిన పనిలేదు. మరేదైనా భౌతికమైన హాని మన ఎడల జరుగుతుందేమో అని భయపడవలసిన పనిలేదు. అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనం మాత్రం మన స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి.

ఇప్పుడొక చిన్న కథతో ఈ భక్తియోగాన్ని ముగిద్దాం. ఒకప్పుడొక శివభక్తుడు వరద నీటిలో చిక్కుకుని ఆ పరమేశ్వరుడే తనను రక్షించుననే విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు పడవవారు వచ్చి సాయమందివ్వబోగా, ఆ సదాశివుడే స్వయంగా తనను రక్షించునని వారి సహాయం తనకు వలదని ముగ్గురినీ పంపివేసెను. తుదకు మరెవ్వరి సాయమూ లభింపక ఆ శివభక్తుడు వరదనీట మునిగి మరణించి, అటుపిమట శివ సాన్నిధ్యానికి పోయి ఆపత్సమయంలో తనకెందుకు సహాయపడలేదని ఆ శివుని ప్రశ్నించెను. అందుకు శివుడు తన భక్తునితో “నేను నీకు మూడు సార్లు సాయమందించబోయాను, కానీ నీవు మూడు సార్లూ తిరస్కరించావు” అని పలికెను.

దీనిని బట్టి ఏది భౌతికమైన ఆలంబన, ఏది భగవంతుడిచ్చే ఆలంబన అనేది మన విచక్షణతోటి మనమే స్వయంగా నిర్ణయించుకోవాలి.

(భౌతికమైన ఆలంబనలో స్వధర్మాచరణ నుండి, సత్యాచరణ నుండి పక్కకు జరగాల్సి వస్తుంది. భగవంతుడిచ్చే ఆలంబనలో అలా జరగవలసిన అవసరం ఉండదు. స్వధర్మాచరణ పరిధిలోనే మనకు ఆ భద్రత లభిస్తుంది.)

( నీ స్వధర్మాచరణలో కూడా-నీకు నడమంత్రపు సిరి లభించదేమో కానీ-నీకు ఎంత అవసరమో అంత ధనాన్ని ఆ భగవంతుడు తగిన విధంగా నీకు సమకూరుస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నీవు ధనమో, అధికారమో మరొకటో లక్ష్యంగా పనిచేయకు. నీకు సంతృప్తి కలిగేటట్లుగా, నీకు సరిపడే న్యాయమైన మొత్తంలో ధనాన్ని ఆ భగవంతుడే తగిన మార్గంలో నీకు అందచేస్తాడు. కనుక నీవు నీ స్వధర్మాన్ని ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో ఆచరించు. అలా అని ధనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకించవలసిన పనిలేదు. నీ స్వధర్మమైనపుడు నీవు ధనార్జనతో కూడుకున్న పనినైనా చేపట్టవచ్చు.)

(భక్తియోగంలో నారద భక్తిసూత్రాలనీ, దశవిధ భక్తిమార్గాలనీ అనేక పద్దతులున్నాయి. ఆయా విధానాలన్నీ భక్తియోగాన్ని ప్రత్యేకంగా సాధన చేసేవారికొరకు ఉద్దేశించబడినాయి. కానీ కర్మయోగంలో అంతర్భాగంగా భక్తియోగాన్ని ఆచరించే విధానమే ఇచ్చట వివరించడం జరిగినది.)

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

జ్ఞానయోగం -IV

మానవుని అంతర ప్రపంచం

ఏ మనిషికైనా అంతర ప్రపంచం మూడు స్థాయిలలో ఉంటుంది. అవి వరుసగా జీవేచ్ఛ-స్వభావం-సంకల్పం. జీవేచ్ఛ అంటే ఏమిటో మనం ఇంతకు ముందొక సారి చెప్పుకున్నాం. జీవుని యొక్క ప్రకృతే జీవేచ్ఛ రూపంలో వ్యక్తమౌతుంది. జీవేచ్ఛ అంటే ఒక మనిషి ఎందుకొరకు జీవిస్తున్నాడో, ఎందుకొరకు మనుగడ సాగిస్తున్నాడో, అతని వాస్తవ జీవిత లక్ష్యమేమిటో అదే అతని జీవేచ్ఛ. ఇది దోషరహితమైనది. ఇది జీవుని స్వస్వరూపం. ఇది సత్యస్వరూపం.

ఏ మానవుడికైనా జీవేచ్ఛలో దోషం ఉండదు. జీవేచ్ఛ ఎంత స్వచ్ఛమైనదైనా మనిషి దాన్ని వెంటనే ఆచరించలేడు. దానినే స్వభావంగా కలిగి ఉండాలి. తరువాత ఆ స్వభావాన్నే సంకల్పించాలి. సంకల్పంగా అది మార్పు చెందినపుడే అది ఆచరణలోకి వస్తుంది. అంటే జీవేచ్ఛ స్వభావంగా మారి, ఆ స్వభావం సంకల్పమైనపుడే అది ఆచరణలోకి వస్తుంది. అంటే ఆ మూడింటి మధ్యన సమన్వయం ఉండాలి.

కానీ ఈ ప్రక్రియలో జీవేచ్ఛనుండి స్వభావం విభేదిస్తే ఆ విభేదించిన స్వభావాన్నే ఆచరిస్తే జీవేచ్ఛ ఆచరణలోకి రాక దానితో విభేదించిన స్వభావం మాత్రమే ఆచరణలోకి వస్తుంది. కనుక ఆ మనిషి యొక్క వాస్తవ జీవన లక్ష్యం నెరవేరదు. మరో సందర్భంలోనైతే అలా విభేదించిన స్వభావాన్ని సైతం ఆచరించలేని అసమర్ధత కూడా కలిగి ఉండవచ్చు. అంటే స్వభావం ఒకటైతే సంకల్పం మరోటి అవుతుంది. అది ఇంకా హీనత్వానికి దారితీస్తుంది. అంటే జీవేచ్ఛననుసరించి స్వభావం ఉండదు. స్వభావాన్ననుసరించి సంకల్పం ఉండదు.


కోరికలు-సంకల్పాలు

జీవేచ్ఛ===కోరికలు===స్వభావం===సంకల్పాలు===సంకల్పం

‘మనిషికి కోరికలు ఉండకూడదు. కోరికలే వినాశ హేతువులు, దుఃఖహేతువులు’ అన్నపుడు దానర్ధం జీవేచ్ఛకు ఇతరమైన కోరికలు ఉండకూడదు అని అర్ధం. అంతేకానీ అసలే కోరికలు ఉండకూడదు అని కాదు. జీవేచ్ఛకు ఇతరంగా ఉండే కోరికలే ఇచ్చట కోరికలుగా చెప్పబడ్డాయి. జీవేచ్ఛ పరిధిలోకి వచ్చే కోరికలు నిరభ్యంతరంగా ఉండవచ్చు. జీవేచ్ఛకు ఇతరమైన కోరికలున్నపుడు జీవేచ్ఛకు, స్వభావానికి వైరుధ్యం ఏర్పడుతుంది. ఇది వాంఛనీయం కాదు. మనిషి యొక్క పారమార్ధిక భ్రష్టత్వానికి మరియు ప్రవృత్తి నివృత్తి చక్రానికి దారితీస్తుంది.


పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ |

కారణం గుణసంగో స్య సదనద్యోని జన్మసు || (అ.13-శ్లో.22)

ప్రకృతిలో ఉండే పురుషుడు ప్రకృతివల్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్ఛనీఛ జన్మలు పొందుతాడు.


జీవేచ్ఛకు ఇతరమైనటువంటి కోరికలేవీ లేనపుడు జీవేచ్ఛే స్వభావంగా ప్రతిబింబిస్తుంది. ఇది ఆదర్శస్థితి. జీవేచ్ఛకు ఇతరమైన కోరికలన్నీ అణగిపోవడానికి వైరాగ్యం ఒక్కటే మార్గం.


యదా వినియతం చిత్తం ఆత్మన్యేవా పతిష్ఠతే|

నిస్సృహస్సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || (అ.6-శ్లో.18)

మనస్సును వశపరచుకుని ఆత్మమీదే నిశ్చలంగా నిలిపి, సర్వ వాంఛలూ విసర్జించినపుడు యోగసిద్ధి పొందాడని చెబుతారు.


ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్ధ! మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే|| (అ.2-శ్లో.55)

మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు.


విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాం శ్చరతి నిస్స్పృహః |

నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి || (అ.2-శ్లో.71)

కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారం, మమకారం లేకుండా మెలగేవాడు పరమశాంతి పొందుతాడు.


సంకల్పాలన్నీ అణగిపోవాలన్నపుడు అసలే సంకల్పాలూ చేయకూడదని కాదు. స్వభావానికి విరుద్ధమైన, స్వభావానికి ఇతరమైన సంకల్పాలు చేయకూడదని అర్ధం. ఎట్టి సంకల్పాలు లేనివాడూ, తానై దేనినీ సంకల్పించనివాడూ (సర్వారంభపరిత్యాగీ) ఆదర్శవంతుడుగా గీతలో చెప్పబడింది. ఇక్కడ స్వభావానికి ఇతరమైన సంకల్పమే చేయకూడని సంకల్పమని గీతాకారుడి ఆంతర్యం. స్వభావానుకూల సంకల్పాలను నిరభ్యంతరంగా చేయవచ్చు. స్వభావానికి ఇతరమైన సంకల్పాలు చేసినపుడు మనిషి లౌకిక కార్యకలాపాలలో అపజయం పాలౌతాడు. ఐహికంగా పతనమౌతాడు. యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం ఇత్యాదివి సాధించడంలో పరాజితుడౌతాడు. సంకల్పాలన్నీ అణగినపుడు స్వభావమే సంకల్పంగా ప్రతిబింబిస్తుంది. అభ్యాసం దీనికి మార్గం.


యదా హి చేన్దృయార్థేషు న కర్మ ష్వనుషజ్జ్యతే|

సర్వసఙ్కల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే|| (అ.6-శ్లో.4)

ఇంద్రియ విషయాలమీద కానీ, కర్మలమీద కానీ ఆసక్తి లేకుండా సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు.


సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః|

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || (అ.6-శ్లో.24)

సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియసముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.


సంకల్పాలను అణచడానికి కోరికలను అణచి ఉంచాలనే నియమమేమీ లేదు. అలానే కోరికలనణచినవాడు సంకల్పాలను కూడా అణచాలనే నియమమేమీలేదు. ఎలా అయినా జరగవచ్చు. ఐతే కోరికలు, సంకల్పాలు రెంటినీ అణచినవాడు ఈ లోకంలో ఆదర్శపురుషుడు. గీతలో తనకు ఇష్టుడుగా గీతాకారుడు పేర్కొన్నది అతనినే. ఇట్టి ఆదర్శపురుషుడిలో జీవేచ్ఛే స్వభావంగా, స్వభావమే సంకల్పంగా మారి అంటే ఈ మూడునూ ఎట్టి వైరుధ్యాలు లేక ఒకటే అయిన పరిస్థితి ఏర్పడుతుంది.

కోరికలను అణచటం పారమార్ధిక విజయానికి దారితీస్తుంది. వైరాగ్యం దీనికి మార్గం. సంకల్పాలను అణచటం ప్రాపంచిక విజయానికి దారితీస్తుంది. అభ్యాసం దీనికి మార్గం...(జ్ఞానయోగం సమాప్తం)

18, ఫిబ్రవరి 2009, బుధవారం

జ్ఞానయోగం -III

ఇప్పుడు మరో ముఖ్య విషయాన్ని పరిశీలిద్దాం. వివిధ రకాల ప్రకృతులను కలిగి ఉన్న జీవులు అందరూ సమానమేనా లేదంటే అసమానమా! ఒక వేళ అసమానమైన పక్షంలో వీరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ. అసలు ఈ జీవుల కన్నా సర్వోన్నతుడని భావించబడే భగవంతుడు ఎంత ఎక్కువ.

జీవులందరికన్నా భగవంతుడు గొప్ప. ఆయన పరిమాణంలో అనంతుడు. తన ప్రకృతితో కలసి కాకుండా విడిగానే ఉనికిని కలిగి ఉన్నవాడు. తన ప్రకృతిని వ్యక్తీకరించి, మరలా లయింపజేసుకునే సామర్ధ్యం కలిగినవాడు. ఘనతరమైన సృష్టి కార్యాన్ని నెరవేర్చేవాడు. ముల్లోకాలనూ, పదునాలుగు భువనాలనూ పాలించేవాడు. మాయకు లోబడని అతీతుడు, నిత్యయోగ స్వరూపుడు. ...ఇత్యాది లక్షణాలతో ఆయన జీవులందరికన్నా గొప్పవాడైపోయి ఈ సృష్టిలో తనకన్నా మరేదీ గొప్పదిలేని స్థితి కలిగినవాడై ఉండి ఎక్కువ తక్కువలకు అసలు ఆయనే నాంది పలికాడు.


మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ! (అ.7-శ్లో.7)

ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు.


గతి ర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ |

ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజ మవ్యయం || (అ.9-శ్లో.18)

ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాస స్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వత బీజం నేనే.


స్వధర్మం

ఇక జీవులలో ఏ రెండు జీవుల ప్రకృతి ఒకటి కాదు. ఎవరి ప్రకృతి వారిదే. అటువంటప్పుడు ఈ జీవులన్నీ సమాన స్థాయివేనా? అంటే... కాదనే సమాధానమే వస్తుంది. ఈ జీవులన్నీ కొన్ని ఉన్నత స్థాయి ప్రకృతి కలిగి ఉన్నాయి. కొన్ని తక్కువ స్థాయి, కొన్ని ఇంకా తక్కువ స్థాయి ప్రకృతి కలిగి ఉన్నాయి. ఇవి ఎన్నో దశలలో ఉంటాయి. ఈ స్తరీకరణ ఎంతో విస్తారమైనది. అనంత ప్రకృతిలో ఎన్ని తేడాలున్నాయో అన్ని రకాల తేడాలు జీవులకు తమతమ ప్రకృతులవలన కలుగుతున్నాయి, అన్ని రకాల నిమ్నోన్నతాలు కలుగుతున్నాయి.

కానీ ఈ అసమానత అంతా భౌతిక దృష్టికే. ఏ జీవి ప్రకృతి ఆ జీవిలో ‘జీవేచ్ఛ’ రూపంలో వ్యక్తమౌతుంది. ఆ ఇచ్ఛ నెరవేర్చుకొనటమే, ఆ తన ప్రకృతిని కర్మరూపంలో వ్యక్తీకరించుకొని తన ‘స్వస్వరూప సందర్శనం’ చేసుకొనటమే ప్రతిజీవి కర్తవ్యం. ప్రతి జీవికి తన ప్రకృతి ఎటువంటిదైనా తన ప్రకృతే తనకు ‘సత్యం’. దానిని తెలుసుకొనటమే, ఈ అనంత సృష్టిలో దాని ప్రతిబింబాన్ని దర్శించుకోవటమే ఆ జీవి యొక్క కర్తవ్యం. కనుక మిగతా జీవుల తో పోలిస్తే తన ప్రకృతి గొప్పదైనా తక్కువదైనా తన ప్రకృతిననుసరించటమే ఏ జీవికైనా విహిత కర్తవ్యం. అలా చేసినపుడే ఆ జీవి సత్యాన్ని చేరగలదు. తదాచరణే ఆ జీవికి స్వధర్మాచరణ. స్వధర్మమంటే ఇదే.


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || (అ.3-శ్లో.35)

ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే.


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం || (అ.18-శ్లో.47)

బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.


యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం |

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విదంతి మానవః || (అ.18-శ్లో.46)

సమస్త ప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు.


సహజం కర్మ కౌంతేయ! సదోషమపి న త్యజేత్ |

సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || (అ.18-శ్లో.48)

కౌంతేయా! నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నిటినీ దోషం ఆవరించి ఉంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.


సమానత్వం

భగవంతుడితో సహా జీవులన్నింటినీ కలుపుకుని చూచినపుడు మనకు కనిపించే ఈ అసమానత కేవలం భౌతిక దృష్టికే. యోగపరంగా చూసినపుడు అంతా సమానమే. ఎందుకంటే యోగమనేది గొప్పతనానికి పరకాష్ట. యోగం తరువాత ఏమీ ఉండదు. యోగమే పరమావధి. యోగం భగవత్‌స్వరూపం. భగవంతునికన్నా గొప్పదేమీలేదు. యోగం వలన ప్రతి జీవుడు భగవంతునితో సమానమైన స్థితిని పొందుతాడు. జీవులన్నీ యోగాన్ని అవలంబించినపుడు వాటి ప్రకృతుల యొక్క ఎక్కువ తక్కువలతో సంబంధంలేకుండా అవన్నీ యోగస్వరూపుడైన ఆ భగవంతునితో సమమైన స్థితిని పొందుతాయి. ఈ విధంగా యోగం దృష్ట్యా భగవంతుడితో సహా అంతా సమానమే.

జీవులకు తమ తమ ప్రకృతుల వలన కలిగిన ఈ ఎక్కువ తక్కువల కెవ్వరూ బాధ్యులు కారు. అది అనాది సిద్ధం. యోగమే ప్రతి జీవి లక్ష్యం కనుక యోగదృష్టియే సరియైనది. యోగ దృష్ట్యా అంతా సమానమే. భగవంతుడు సైతం యోగాన్ని అవలంబిస్తున్న ఏ జీవికన్నా కూడా ఎక్కువ కాదు.


ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః |

సర్గేపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ || (అ.14-శ్లో.2)

ఈ జ్ఞానము నాశ్రయించి, నాతో సమమగు స్థితిని పొందినవారు ప్రళయకాలమున నశింపరు. సృష్టిసమయమున మరలా జన్మింపరు.

...(మిగతా విషయం చివరి భాగంలో)

జ్ఞానయోగం -II

జీవుడు ఈ సృష్టి కార్యంలో, ఈ జగత్తులో తన ప్రకృతి యొక్క బింబాన్ని చూసుకోవాలంటే ముందుగా మానవ దేహధారణ చేయాలి. అంటే ఈ సృష్టిలో తను కూడా మనిషిగా జన్మించాలి. జన్మ వలన జీవునికి దేహం లభిస్తుంది. దేహం వలన జీవునికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి మొదలైన సాధనాలు సమకూరతాయి.

అయితే జన్మించడంతోటే జీవుడు స్వస్వరూప సందర్శనం చేయటానికి పూనుకుంటాడని అనుకోవడం పొరపాటు. జన్మ అనేది, దేహధారణ అనేది స్వస్వరూప సందర్శనం కొరకు ఒక అవకాశం మాత్రమే. దేహధారణ చేసిన మానవుడు ఆ పరమ పురుషుడి మీద మనసు నిలిపి యజ్ఞం లేక నిష్కామ కర్మయోగం చేసి తద్వారా మాత్రమే తన జన్మ యొక్క పరమ ఉద్దేశ్యమైన స్వస్వరూప సందర్శనం నెరవేర్చుకుని ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు. కానీ ఎక్కువ సందర్భాలలో అలా జరగదు.


ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత! |

సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప! || (అ.7-శ్లో.27)

పరంతపా! సమస్త భూతాలూ పుట్టుకతోనే అనురాగ ద్వేషాల మూలంగా కలిగే సుఖదుఃఖాదులవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి.


ప్రవృత్తి-నివృత్తి

దేహధారణ చేసిన మానవుడు ప్రకృతి యొక్క మాయలో చిక్కుకుంటాడు. ఆ ప్రకృతి యొక్క, త్రిగుణాల యొక్క కర్మల వ్యామోహంలో చిక్కుకుంటాడు. అందులో ఏదో ఒక గుణకర్మయొక్క ఆకర్షణకు లోనై, ఆకర్మనే అధికంగా చేస్తూ కర్మబంధాలలో చిక్కుకుని, ప్రవృత్తి నివృత్తికి లోనై వ్యర్ధంగా ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. ప్రవృత్తి నివృత్తి అనేవి నేరము-శిక్ష వంటివి.


ప్రవృత్తిం చ నివృత్తించ జనా న విదురాసురాః |

న శౌచం నాపి చా చారో న సత్యం తేషు విద్యతే || (అ.16-శ్లో.7)

ఆసురీ సంపదలోనివారు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అను రెండు మార్గములున్నట్లే ఎరుగరు. వారియందు పారిశుద్ధ్యము గానీ. మంచినడవడి గానీ, సత్యము గానీ ఉండవు.


ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యా కార్యే భయాభయే|

బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్ధ ! సాత్వికీ || (అ.18-శ్లో.30)

పార్ధా! ప్రవృత్తి నివృత్తి మార్గములను, కర్తవ్యాకర్తవ్యాలను (చేయదగినవి, చేయకూడనివి), భయనిర్భయములను, బంధ మోక్షములను తెలియు బుద్ధి సాత్వికము.


అంటే ఈ లోకం లోనికి ప్రవేశించిన మానవుడిని రెండు విషయాలు ఆకర్షిస్తాయి. ఒకటి నిశ్శబ్దంగా, సామగానంలా, మంద్రంగా ఉండే భగవదాకర్షణ. రెండవది అతి తీవ్రమైన సంచలనాలతో ఆకర్షణలతో ఉండే ప్రకృతి యొక్క ఆకర్షణ. మాయకు లోబడకుండా జ్ఞానాన్ని సాధించి భగవంతుడి మీద మనసు నిలిపి నిష్కామకర్మ ద్వారా తన జీవనలక్ష్యం నెరవేర్చుకున్న వారు ఈ లోకంలో ఆ సృష్టివరకు మరలా జన్మించరు. దానినే మోక్షం అంటారు. అలాకాక ప్రకృతి మాయలోపడి ప్రకృతి ఆకర్షణకు లోబడినవాడు గుణకర్మలు చేస్తూ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటాడు. అనేక బాధలు పడుతూనే ఉంటాడు.


యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం |

తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః || (అ.7-శ్లో.28)

పుణ్యకర్మలు చేసి సకల పాపాలనూ పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖ రూపమైన మోహాల నుంచి విముక్తులై గట్టి పట్టుదలతో నన్ను భజిస్తారు.


జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం || (అ.7-శ్లో.29)

ముసలితనం, మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించే వాళ్ళు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆత్మ స్వరూపాన్నీ, సమస్త కర్మలనూ గ్రహించగలరు.


భగవంతుడు మాయకు అతీతుడు. ఆయన మాయకు లోబడకపోగా ఆ మాయనే తన చెప్పుచేతలలో పెట్టుకుంటాడు. తన మాయను తన ఇష్టానుసారం వ్యక్తీకరిస్తాడు, లయిస్తాడు. ఆ మాయ కాకుండా కేవలం పురుషుడుగానే తన ఉనికిని కలిగి ఉన్నాడు.

జీవుడు అలాకాదు. మాయకు అతీతుడు కాదు. జీవుడు తన ప్రకృతిని తన నుండి విడదీయలేడు. ప్రకృతి కాకుండా విడిగా జీవునికి ఉనికి లేదు. అట్టి భావనే అసంగతం. కనుక జీవుడు ప్రకృతి లేక మాయకు అతీతుడు కాడు. కేవలం భగవంతుడి మీద మనసు నిలపటం వలన మాత్రమే ..ఆయన వలన మాత్రమే ఈ ప్రకృతి మాయను జీవుడు అతిక్రమిస్తాడు. అంటే నిష్కామకర్మ వలన మాత్రమే మానవుడు ప్రకృతి మాయను, ప్రకృతి కర్మబంధాలను అతిక్రమిస్తాడు. జ్ఞానం యెడల శ్రద్ధ, ధర్మం యెడల అనుతాపం, గుణకర్మల యెడల అనాసక్తి, భగవంతుని యెడల అనురక్తి ఇత్యాది గుణాల వలననే మానవుడు భగవంతుని సాయంతో ప్రకృతి మాయను అధిగమిస్తాడు.


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |

మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే || (అ.7-శ్లో.14)

త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవ మాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు


...(మిగతా విషయం తరువాతి భాగాలలో)

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

జ్ఞానయోగం –I

‘జ్ఞానయోగం’ పేరుకు తగినట్లుగానే జ్ఞాన సముపార్జనకు ఉద్దేశించబడినది. జ్ఞానయోగంలో భక్తికి తావులేదు. ఇది హేతువాద ప్రధానమైనది. భగవంతుణ్ణి సైతం హేతువాద దృష్టితో పరిశీలిస్తుంది. భగవంతుడంటే ఏమిటి? ఈ జగత్తు ఏమిటి? ఎక్కడ నుండి వచ్చినది? జీవుడంటే ఏమిటి? జీవస్వరూపం ఏమిటి? ఈ సృష్టిలో జన్మించిన అంటే దేహధారణ చేసిన జీవుని కార్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నింటినీ హేతువాద దృష్టితో చర్చించేది జ్ఞానయోగం.

జ్ఞానయోగానికి హేతువాదం, తార్కిక దృష్టి; రాజయోగానికి శాస్త్రీయ దృక్పథం, క్రమశిక్షణ, యుక్తి, చతురత, విజయకాంక్ష, ఔన్నత్య కాంక్ష; భక్తి యోగానికి విశ్వాసం, శరణాగతి నేపథ్యంగా ఉన్నాయని మనం గుర్తించాలి.


ప్రకృతి-పురుషుడు-జీవుడు

జ్ఞానయోగంలో ముందుగా ప్రకృతి, పురుషుల గురించి తెలుసుకోవాలి. ప్రకృతి, పురుషులు అనాదులు. అంటే ఆదిలేనివి. వీటినెవరూ సృష్టించలేదు. వీటికి మూలమైనది ఏదీ లేదు. ఇవి భూత, భవిష్యత్, వర్తమానకాలాలలో ఎల్లప్పుడూ ఉంటాయి. మహా ప్రళయం సంభవించి ఈ సృష్టి అంతా, ఈ జగత్తంతా లయించి పోయినా ఉంటాయి.

ఇందులో పురుషుడే భగవంతుడు. ఈ జగత్తుకు తండ్రి. చైతన్యానికి మూలం. ఫురుషుని పరిమాణం అనంతం. పురుషుడిని 'బ్రహ్మం' అని కూడా అంటారు. ఇది మార్పు లేనిది. ఇది ఎల్లప్పుడూ అవ్యక్త రూపంలోనే ఉంటుంది. ఇంద్రియాలకు గోచరించదు.

ప్రకృతి ఈ జగత్తుకు తల్లి. మహామాయ. భావానికి, పదార్ధానికి మూలం. పకృతి పరిమాణం కూడా అనంతమే. ప్రకృతిని 'మహత్తు ' అని కూడా అంటారు. ఇది అన్ని రకాల మార్పులకూ లోనౌతుంది, ఇది వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ కూడా ఉంటుంది. వ్యక్తరూపంలో ఉండే ప్రకృతంతా ఇంద్రియాలకు గోచరిస్తుంది.

సృష్టికి ముందు అనంతమైన పురుషుడిలో అనంతమైన ప్రకృతి లయించిపోయి అవ్యక్తంగా ఉంటుంది. ఇలా లయించిన ప్రకృతిని బయటకు వ్యక్తీకరిస్తే అదే సృష్టికార్యం.


ప్రకృతిం పురుషం చైవ విద్ద్యనాదీ ఉభావపి | (అ.13-శ్లో.20)

ప్రకృతి, పురుషుడు- ఈ ఉభయులకీ ఆదిలేదని తెలుసుకో.


మరి జీవుని సంగతి ఏమిటి? గీతలో ప్రకృతి పురుషులు అనాదులని చెప్పాడు గీతాకారుడు. కానీ ఈ రెంటితోపాటు జీవుడిని పేర్కొనలేదు. అంటే జీవుడు అనాది కాదా? ..మరి అదే గీతలో జీవుని గురించి దేహీ నిత్యమవధ్యో అని పేర్కొనబడింది కదా!


దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత ! | (అ.2-శ్లో.30)

అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు.


అంటే దీనిని బట్టి జీవుడు కూడా అనాది అనియే మనం చెప్పవచ్చు. కానీ తదుపరి 13 వ అధ్యాయంలో ప్రకృతి, పురుషులను గురించి గీతాకారుడు చెప్పినపుడు జీవుడిని ప్రత్యేకించి పేర్కొనకపోవడానికి కారణం: జీవుడు ప్రకృతి, పురుషులకన్నా వేరు కాకపోవడమే.


జీవస్వరూపం:

అనంతమైన పురుషుడు భగవంతుడైతే, అనంతమైన ప్రకృతి జగన్మాత అయితే అతి సూక్ష్మమైన ప్రకృతి మరియు అతి సూక్ష్మమైన పురుషపదార్ధం యొక్క వీడని కలయికే జీవుడు. ఇదే జీవస్వరూపం. అంటే జీవుడు ఇటు శుద్ధ ప్రకృతి కాదు, అటు శుద్ధ పురుషుడూ కాదు. రెండింటి యొక్క కలయిక. అది కూడా వీడని కలయిక. పరిమాణమేమో అతి సూక్ష్మం.

అనంతమైన శుద్ధ పురుషుడు ‘భగవంతుడు’.

అనంతమైన శుద్ధ ప్రకృతి ‘జగన్మాత’.

అతి సూక్ష్మమైన ప్రకృతి పురుషుల వీడని కలయిక ‘జీవుడు’.

భగవంతుడిలో అంటే అనంత పురుషుడిలో అనంత ప్రకృతి లయిస్తుంది, మరలా తిరిగి వ్యక్తీకరింపబడుతుంది. కానీ జీవుని విషయంలో ఇలా జరగదు. ఎల్లప్పుడూ పురుషుడిలో ప్రకృతి లయించే ఉంటుంది. ఈ రెంటినీ ఉమ్మడిగా కలిపే ‘జీవుడు’ అంటాం. అయితే ఏ రెండు జీవులకు కూడా అలా లయించిన ప్రకృతి ఒకటిగా ఉండదు. ఏ జీవుడికి ఆ జీవుడే ప్రత్యేకం. అదే ఆ జీవుని యొక్క విశిష్టత. ఈ విశిష్టత మరియు ఈ ప్రత్యేకత అనాది సిద్ధం. ఇందుకెవ్వరికీ కర్తృత్వం లేదు. ఎవరూ ఇందుకు బాధ్యులు కారు.

భగవంతుడు తన ప్రకృతిని సృష్టి కార్యం ద్వారా వ్యక్తీకరించి దర్శిస్తాడు.


సర్వభూతాని కౌంతేయ! ఫ్రకృతిం యాంతి మామికాం |

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం || (అ.9-శ్లో.7)

కౌంతేయా! ఫ్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టి కాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |

భూతగ్రామ మిమం కృత్స్నం అవశం ప్రకృతే ర్వశాత్ || (అ.9-శ్లో.8)

ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకల భూతసంఘాన్నీ స్వాధీనంలో ఉంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.


స్వస్వరూప సందర్శనం:

మరి జీవుడికి తన ప్రకృతిని అలా వ్యక్తీకరించుకొనే అవకాశం లేదు. అందుకు జీవునికి ఉన్న మార్గం ఒక్కటే. ఆ భగవంతుడి సృష్టికార్యంలో కర్మ ద్వారా తన ప్రకృతిని దర్శించుకోవడం. కర్మ ద్వారా తన ప్రకృతిని ప్రకటించడం. ఈ సృష్టి కార్యంలో, ఈ అనంత ప్రకృతి యొక్క వ్యక్తీకరణలో తన యొక్క, తనదైన ప్రకృతి యొక్క ప్రతిబింబాన్ని మానవుడు (జీవుడు) కర్మ చేయడం ద్వారానే దర్శించుకుంటాడు. అలానే ఈ లోకంలోని మిగతావారికీ ప్రకటిస్తాడు. దీనినే ‘స్వస్వరూప సందర్శనం’ అంటారు.


జీవేచ్ఛ:

జీవుని యొక్క ఈ ప్రకృతే ‘జీవేచ్ఛ’ రూపంలో వ్యక్తమౌతుంది. ఈ జీవేచ్ఛనే స్వభావంగా కలిగి దానిని సంకల్పించినపుడు మాత్రమే కర్మ ద్వారా ఈ ప్రకృతి వ్యక్తీకరింపబడుతుంది. అంటే మానవుడు తన జీవేచ్ఛ-స్వభావము-సంకల్పము లను సమన్వయపరచాలి. ఈ మూడింటినీ ఒక దానితో ఒకటి విభేదించకుండా చూడాలి. (జీవుని యొక్క ప్రకృతే జీవేచ్ఛ గనుక అది ఎప్పుడూ మారదు. ఎవరికీ మారదు. జీవేచ్ఛ సత్యం. మారేవి స్వభావ సంకల్పాలే). ఈ మూడింటినీ సమన్వయపరచడమెలా అనేది జ్ఞానయోగం చివరన ప్రత్యేకంగా చర్చిద్దాం ...(మిగతా విషయం తరువాతి భాగాలలో)

నాలుగు యోగాలు -II

మొదటి భాగంలో యోగాలు నాలుగని చెప్పుకున్నాం. అవి కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం, మరియు భక్తియోగం. భక్తియోగం జీవునికి, భగవంతునికి ఉండే సంబంధ బాంధవ్యాలను గురించి చర్చిస్తుంది. ఇది భగవదనుగ్రహానికి దారితీస్తుంది. రాజయోగం జీవునికి శక్తి స్వరూపమైన ప్రకృతికి సంబంధించినది. ఇది విధి అనుకూలతకు, తద్వారా ఐహిక శక్తికి మరియు ఐహిక ఔన్నత్యానికి దారితీస్తుంది. జ్ఞానయోగం దైవంతోగానీ, విధితోగానీ సంబంధంలేనిది. జీవుని యొక్క శ్రద్ధ మరియు జిజ్ఞాసుత్వానికి సంబంధించినది. ఇది జీవునికే పరిమితమైనది. ఇది జ్ఞానానికి దారితీస్తుంది.

అయితే కర్మయోగం అలా కాదు. అది దైవం, విధి, జీవుడు ఈ ముగ్గురకూ సంబంధించినది. కర్మయోగం సత్యానికి సంబంధించినది. ఇది సత్యావిష్కరణకు దారితీస్తుంది. సత్యాన్ని వివేచించేది జ్ఞానయోగమైతే, సత్యాన్ని ఆచరించేది కర్మయోగం. జ్ఞానసిద్ధితో జ్ఞానయోగం అంతమై కర్మయోగం ప్రారంభమౌతుంది. గీతలో ఈ నాలుగు యోగాలను గురించి 7వ అధ్యాయమైన ‘విజ్ఞానయోగం’లో కొంచెం పరోక్షంగా ప్రస్తావించబడింది.


చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోర్జున ! |

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ! || (అ.7-శ్లో.16)

అర్జునా! నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు-ఆపదలో ఉన్నవాడు, ఆత్మతత్త్వం తెలుసుకోగోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు, ఆత్మ జ్ఞానం కలిగినవాడు.


తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి ర్విశిష్యతే |

ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః || (అ.7-శ్లో.17)

ఈ నలుగురిలో నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేనూ, నాకు అతనూ ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం.


ఉదారాస్సర్వ ఏవై తే జ్ఞానీ త్వా త్మైవ మే మతం |

ఆస్థితస్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం || (అ.7-శ్లో.18)

వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు.


బహూనాం జన్మానా మంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |

వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః || (అ.7-శ్లో.19)

అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివరకు ‘జగత్తు సర్వమూ వాసుదేవమయం’ అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు.


పై శ్లోకాలలో పేర్కొనబడిన నలుగురిలో

ఆర్తుడు భక్తియోగి;

జిజ్ఞాసువు జ్ఞానయోగి;

అర్థార్థీ అంటే సిరిసంపదలు కోరేవాడు రాజయోగి;

జ్ఞాని కర్మయోగి.

జ్ఞానిని భగవంతుడు తనకు ప్రియమైన వాడుగా చెప్పటంతో కర్మయోగమే ఉత్తమ యోగంగా ప్రకటించబడినట్లయినది. ఎందుకంటే భక్తియోగంలో కేవలం భగవంతుని శరణు పొందటం తప్ప యజ్ఞం జరుగదు. రాజయోగంలో కూడా స్వాధీనమైన మనస్సు దైవం (జీవేచ్ఛ) మీద ఏకాగ్రం కావాచ్చు, లేదా ఏదైనా ఐహిక విషయం (జీవేచ్ఛతో విభేదించిన) మీద కూడా ఏకాగ్రం కావచ్చు. అలానే జిజ్ఞాసువు జ్ఞానం కొరకు వివేచిస్తుంటాడేగానీ అతనికి జ్ఞానం ఉండదు. కనుక అతను యజ్ఞం చేయలేడు. రాజయోగి కూడా యజ్ఞం చేయలేడు. యజ్ఞం చేసి సత్యాన్ని ఆవిష్కరించగలిగేది జ్ఞాని ఒక్కడే. మానవుడు యజ్ఞశేషాన్ని భుజించి మాత్రమే పరమపదాన్ని పొందాలి. అదే ఉత్తమ మార్గం. అందుకే భగవంతుడు కర్మయోగమే ఉత్తమ మార్గమని ప్రకటించాడు. కర్మయోగంలో యజ్ఞం జరగటమేకాక అది జ్ఞాన, రాజ, భక్తి యోగాల సమ్మేళనం కూడా.

జ్ఞానయోగం సాత్విక గుణకర్మ, రాజయోగం రజోగుణకర్మ, భక్తియోగం తమోగుణ కర్మ, కర్మయోగం గుణాతీత కర్మ. అది భక్తి, రాజ, జ్ఞాన యోగాల సమ్మేళనం. అందువలనే భగవంతుడు గుణాతీత స్థితికి ప్రాతినిథ్యం వహించే కర్మయోగాన్ని ఆచరించే జ్ఞానిని తనకిష్టుడైన వాడిగా ప్రకటించాడు. అయిననూ భగవంతుడు మిగతా మూడు యోగాలను కూడా ఎందుకు ఉదహరించాడంటే కర్మయోగం ఎంతగా జ్ఞాన, రాజ, భక్తి యోగాల సమ్మేళనమైనా కూడా ప్రతిమానవుడు కర్మయోగమే కాకుండా ఈ మూడు యోగాలను కూడా విడివిడిగా తెలుసుని ఉండాలి.

ప్రతిమానవుడు ముందుగా ఈ మూడు యోగాలనూ విడివిడిగా తెలుసుకోవాలి; అభ్యసించాలి. ఆ తదుపరి ఈ మూడింటి కలబోత అయిన కర్మయోగాన్ని ఆచరించాలి. అపుడు మాత్రమే మానవుడు కర్మయోగాన్ని మరింత సమర్థవంతంగా ఆచరించగలుగుతాడు.

జ్ఞానయోగం లేనిదే మానవునకు నిత్యానిత్య వస్తువివేకం కలుగదు. తనకేది సత్యం, వేటిని తన జీవితంలో తాను సాధించాలి. ఏ లక్ష్యాల కొరకు తన జీవితాన్ని వినియోగించాలి అన్నది తెలియదు. రాజయోగం లేనిదే ఐహికంగా ఉన్నతుడవ్వలేడు. భక్తియోగం లేనిదే నిశ్చింత కలుగదు.. సురక్షిత భావం కలుగదు. రక్షణ పొందలేడు.

చరిత్రలో సాధకులు అనేకులు గుణకర్మల వ్యామోహంలో పడి త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే భక్తి, రాజ, జ్ఞాన యోగాల లోనే ఎక్కువగా సాధన చేశారు. కర్మయోగంలో వీరి సాధన స్వల్పంగానే ఉంటుంది. దానికి తగినట్లుగానే మన ఆధ్యాత్మిక సాహిత్యంలో కూడా ఈ మూడు యోగాలకు సంబంధించిన సాహిత్యమే విస్తృతంగా ఉంటుంది. కర్మయోగానికి సంబంధించిన సాహిత్యం నామమాత్రంగానే ఉంటుంది.

భక్తి, రాజ, జ్ఞాన యోగాలు మూడునూ విడివిడిగా చాలా విస్తృతంగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అవన్నీ ఆయా యోగాలను ప్రత్యేక సాధన చేసేవారి కొరకు ఉద్దేశించబడినవి. ఐతే ఈ రచన గీతాశాస్త్రాన్ని అనుసరించి రాయబడినది. అందువలన కర్మయోగంలో అంతర్భాగంగా వాటిని ఎంత పరిమితిలో ఆచరించవలేనో అంతపరిమితిలోనే రాయడం జరిగినది.

ఇప్పుడు ఆపరిమితిలోనే జ్ఞాన, రాజ, భక్తి యోగాలను గురించి విడివిడిగా తెలుసుకుందాం. ('కర్మయోగం' గురించి ఇప్పటికే వివరించడం జరిగినది)...('నాలుగు యోగాలు' అనే వ్యాసం సమాప్తం)

16, ఫిబ్రవరి 2009, సోమవారం

నాలుగు యోగాలు -I

ఉపోద్ఘాతం:

మానవ సమాజానికి దోషరహితమైన ఓ మంచి రాజకీయ వ్యవస్థను సూచించే ప్రయత్నంలో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో వ్యాసపరంపరను ప్రారంభించి కొన్ని భాగాలను రాశాను. ఆ వ్యాసావళిలో ‘గీతా వ్యాసాలు’ పేరుతో కొంత తాత్త్విక చర్చ చేశాను. ఆ తాత్త్విక చర్చ అంతా రాజకీయ వ్యవస్థను ఉద్దేశించి మాత్రమే కనుక అందుకు అవసరమైన ‘కర్మయోగం’ ను మాత్రమే అక్కడ వివరించాను. కానీ ఆ తాత్త్విక చర్చను చదివిన వారు అందులోని రాజకీయ ఉద్దేశ్యం మీద కన్నా తాత్త్విక విషయాల మీదే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ అనేక సందేహాలను నా ముందు ఉంచుతున్నారు. దానితో రాజకీయ వ్యవస్థ అనే విషయం పక్కకు పోయి తాత్త్విక చర్చే ప్రధానమైపోయింది.

వారి సందేహాలు తీర్చడానికి భారతీయ తత్త్వశాస్త్రం లోని మిగిలిన మూడు యోగాలైన జ్ఞాన, రాజ, భక్తి యోగాల గురించి కూడా చెప్పక తప్పడంలేదు. నిజానికి మిగతా యోగాల గురించి ఇంత త్వరగా బ్లాగులో రాసే ఉద్దేశ్యం నాకు లేదు. ఎందుకంటే అవన్నీ సమగ్రంగా రాయబడి ఇంకా సిద్ధంగా లేవు. కానీ ఏదో ఒక రూపంలో వాటిని ఇక్కడ వివరించకపోతే చదువరులనుండి నేను ఎదుర్కొంటున్న సందేహాలను తీర్చడం కష్టమని తలచి వాటిని రాస్తున్నాను.

‘గీతా వ్యాసాలు’ చదివిన తరువాత అవి సంక్లిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం ఒకటి బాగా వినిపించింది. అందుకే వాటిని సరళీకరిస్తూ ‘తేలిక భాషలో తత్త్వశాస్త్రం’ అనే మరో మూడుభాగాల వ్యాసం రాయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు వివరించబోయే మూడు యోగాలూ చదువరులను అంతగా కంగారుపెట్టవని అనుకుంటున్నాను. ‘జ్ఞానయోగం’ సంక్లిష్టంగా ఉన్నాకూడా అది కర్మయోగమంత పెద్దగా ఉండదు. కొంచెం చిన్న వ్యాసం. ఓ రెండు, మూడు భాగాలతో ముగుస్తుంది. ‘రాజయోగం’ విస్తారమైనదే కానీ చాలా సరళంగా మరియూ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ‘భక్తియోగం’ సరళమే కాక ఒకే వ్యాసంతో ముగుస్తుంది.

ఈ ఉపోద్ఘాతం ముగించబోయే ముందు చివరిగా ఓ మనవి. నేను వివరిస్తున్న కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాల పేరుతో మీకు బయట తటస్థపడే గ్రంథాలలో ఉండే సమాచారంతో నా వివరణ సరిపోలదు. నేను ‘భగవద్గీత’ చదివి అందులో గ్రహించిన విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆయా యోగాల పేరుతో స్వంతంగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు మాత్రమే ఇవి. ఈ విషయాన్ని చదువరులు జ్ఞాపకం ఉంచుకోగలరు.


నాలుగు యోగాలు:

యోగాలు నాలుగింటి గురించీ తెలుసుకోబోయే ముందు మానవ దేహం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము.

ఏ జీవి దేహంలోనైనా ఈ మూడు క్రియాకేంద్రాలు ఉంటాయి. అవి ప్రకృతి-పురుషుడు-జీవుడు.

దేహంలో ‘జీవుడి’ స్థానం భ్రూమధ్యం- అంటే రెండు కనుబొమల మధ్యన. ఈ జీవుడు బుద్ధి, మనసు, ఇంద్రియాల ద్వారా ఆలోచనలు, సంకల్పాలు వంటి కార్యకలాపాలను జరుపుతాడు.

‘పురుషుడి’ స్థానం హృదయం. ఇతడు ప్రాణవ్యాపారాన్ని జరుపుతాడు. ఈ జగత్తులో ఎల్లెడలా ఉన్న ప్రాణశక్తి అన్ని దేహ భాగాల గుండా హృదయం వైపు ప్రయాణించి అక్కడ హృదయ స్పందన కొరకు వినిమయమౌతూ ఉంటుంది. దీనివలన అన్ని దేహ భాగాలూ సక్రమంగా పనిచేస్తాయి. ఈ ప్రక్రియ జరిగినంత సేపూ దేహంలో ప్రాణమున్నట్లుగా చెప్పబడుతుంది. ఇదంతా పురుషుని ఆధ్వర్యంలో జరుగుతుంది.

ఇక మూడవ క్రియాకేంద్రమైన ‘ప్రకృతి’ యొక్క స్థానం దేహంలోని గుహ్యాంగం లేక మర్మాంగం లేక జననాంగం. ఇది పునరుత్పత్తి వ్యాపారాన్ని జరుపుతుంది. గుహ్యాంగాలలో కలిగే సంభోగవాంఛకు కారణం ఈ ప్రకృతే.

ఈ విధంగా మానవుడి దేహంలో ఉన్న ప్రకృతి, పురుషులే మరలా విధి, దైవం అనే రూపాలలో ప్రతి మానవుడినీ వెన్నంటి ఉంటాయి. ‘విధి’ ప్రకృతి యొక్క మరో రూపం. అలానే ‘దైవం’ పురుషుని యొక్క మరో వ్యక్తీకరణ. ఈ విధి, దైవం అనే రెండు అంశాలూ మానవుడి జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఒక మానవుడు తన జీవితంలో తలపెట్టే కార్యాలను ఈ రెండు అంశాల యొక్క తోడ్పాటు ద్వారా మాత్రమే సఫలీకృతం చేసుకోగలడు. అంటే మానవుడి ప్రయత్నం విజయవంతమవ్వడానికి దైవానుగ్రహం, విధి అనుకూలత అనేవాటిలో ఏదో ఒకటిగానీ లేక రెండూ గానీ తప్పనిసరిగా కావాలి.

పై వివరణలో మనకు రెండు రకాల కర్మత్రయాలు పరిచయం అయ్యాయి.

అవి:

ప్రకృతి-పురుషుడు-జీవుడు

విధి-దైవం-మానవుడు

ఇప్పుడు మొదటి కర్మత్రయం అయిన ‘ప్రకృతి-పురుషుడు-జీవుడు’ పరంగా ఈ నాలుగు యోగాల గురించి చెప్పుకుందాం. జీవుడు తన బుద్ధితో అనుసంధానమై శ్రద్ధతో అవలంబించేది జ్ఞానయోగం. హృదయాంతర్గతుడైన భగవంతునితో అనుసంధానమయ్యేది భక్తియోగం. గుహ్యాంగాతర్గతమైన ప్రకృతిశక్తితో అనుసంధానమై ఆచరించేది రాజయోగం. ఈ మూడింటి కలగలుపు కర్మయోగం.

ఇప్పుడు రెండవ కర్మత్రయం అయిన ‘విధి-దైవం-మానవుడు’ పరంగా ఈ యోగాల ఆచరణను గురించి చెప్పుకుందాం.

మానవుడు దైవానుగ్రహాన్ని పొందే విధానాన్ని చర్చించేది భక్తియోగం, విధి అనుకూలతను పొందే విధానాన్ని చర్చించేది రాజయోగం.

ఇక మానవుడు ఈ లోకంలోని గుణకర్మల యెడల వ్యామోహం చెందకుండా, తనకు అవసరంలేని ప్రాపంచిక ఆకర్షణల యెడల వైరాగ్యం కలిగి, ఈ లోకంలో నిత్యమైనదేదో, అనిత్యమైనదేదో తెలుసుకుని, తన జీవితాన్ని వ్యర్ధ కార్యకలాపాలలో వృధా చేయకుండా సత్యస్వరూపమైన తన జీవన లక్ష్యం ఏదో నిర్దేశించుకుని, తత్సాధన కొరకు సత్యాన్వేషణ చేసేది జ్ఞానయోగం.

ఈ విధంగా సిద్ధించిన జ్ఞాన ప్రకాశపు వెలుగులో దైవం మరియు విధి యొక్క సహాయంతో యజ్ఞం చేసి సత్యావిష్కరణ గావించి జీవన లక్ష్యాన్ని సాధించేది కర్మయోగం.....(మిగతా రెండవ భాగంలో)