29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 26వ అధ్యాయం
(Unedited)

రాజు-రాజ్యం

అధ్యాయం – 26: ఇటలీని అనాగరికులనుండి విముక్తి చేయడానికి పిలుపు


Chapter XXVI: An Exhortation to Liberate Italy from the Barbarians


పై చర్చలలోని విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించి, ఒక కొత్తరాజుకు ప్రస్తుతకాలం అనుకూలమైనదేనా అనీ, జ్ఞానం మరియు నైతికత కలిగిన ఒక వ్యక్తికి –తనకు గౌరవం కలిగించేవీ, తనదేశ ప్రజలకు మంచి చేసేవీ అయిన– ఒక నూతన విషయ క్రమాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చే అంశాలు ఈ కాలంలో ఉన్నాయా అనీ నాలో నేను ఆశ్చర్యపడిన నాకు ఒక కొత్తరాజుకు అనుకూలంగా అనేక అంశాలు కలసిరావడానికి ప్రస్తుతకాలం కన్నా ఎక్కువ సరియైనది నాకు ఎప్పుడూ తెలియదని నాకు అర్థమైనది.


నేను చెప్పినట్లుగా మోసెస్ సామర్థ్యం వెల్లడికావడానికి ఇజ్రాయెల్ ప్రజలు బంధీలుగా ఉండవలసిన అవసరం, సైరస్ ఆత్మౌన్నత్యం బహిర్గతం కావడానికి పర్షియన్లు మెడెస్‌చే అణచివేయబడవలసిన అవసరం, అలాగే థెసియస్ సామర్థ్యం ప్రదర్శింపబడటానికి ఎథీనియన్లు చెల్లాచెదురుకావలసిన అవసరం ఏర్పడినట్లుగా ప్రస్తుత సమయంలో ఇటలీకి చెందిన ఒక మహావ్యక్తి గుణగణాలు (నైతికత) బహిర్గతం కావడానికి ఇటలీ ఇప్పుడున్న—హీబ్రూలకన్నా ఎక్కువ బానిసత్వం, పర్షియన్లకన్నా ఎక్కువ అణచివేత, ఎథీనియన్ల కన్నా ఎక్కువగా చెదిరిపోయిన, నాయక్త్వం లేని, ఓ వ్యవస్థ లేని, దాడిచేయబడిన, దోచివేయబడిన, ముక్కలు చేయబడిన, జయించబడిన, ఇలా అన్ని రకాలుగా విధ్వంసానికి గురైన — దుర్దశకు చేరుకోవలసిన అవసరం ఏర్పడింది.


మన విముక్తి కొరకు భగవంతునిచే ఆదేశింపబడ్డాడా అని మనం భావించేటట్లుగా ఒకరు (*) గతంలో ఆశలు రేకెత్తించినప్పటికీ, తరువాతి కాలంలో, అతడి సామర్థ్యం ఉచ్ఛస్తితిలో ఉండగా, విధి అతడిని తిరస్కరించడం మనం చూశాం. దానితో ఇటలీ నిర్జీవంగా విడిచిపెట్టబడి తన గాయాలను నయం చేసేటటువంటి; లొంబార్డీ దోచివేతకు, రాజ్యంలో, టస్కనీలో బలవంతపు వసూళ్ళకు, పన్నులకు ముగింపు పలకగలిగిన, ఎంతోకాలం నుండి తనను వేధిస్తున్న కురుపులవంటి బాధలను నయం చేయగలిగిన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నది. ఈ కౄరత్వాన్నుండి, ఆటవికమైన ఈ అవమానాలనుండి తనను రక్షించగలిగిన వారిని ఎవరినైనా పంపమని ఆమె భగవంతుడిని ఎలా వేడుకుంటున్నదో చూడు. అలాగే ఇందుకొరకు ఎవరైనా బావుటాను ఎగురవేసిన పక్షంలో, దానిని అనుసరించడానికి ఆమె సిద్ధంగా ఉండటాన్ని, ఆతురత చెందడాన్ని కూడా చూడు.సీజర్ బోర్గియా (*)శౌర్యపరాక్రమాలు, సిరిసంపదలతో ఖ్యాతిగడించిన, భగవదనుగ్రహం కలిగిన, అలాగె ఇప్పుడు మీ కుటుంబమే అధిపతిగా (*) ఉన్న చర్చి అనుగ్రహం కూడా కలిగిన, అలాగే ఈ విమోచన కార్యక్రమానికి నాయకత్వం వహించగలిగిన మీ కుటుంబం మీద కన్నా ఆమె ఎక్కువ ఆశపెట్టుకోవడానికి ప్రస్తుతం ఎవరూ కనబడటంలేదు. నేను పేర్కొన్న వ్యక్తుల జీవితాలను, వారి చేతలను గనుక నీవు గుర్తుచేసుకున్నట్లైతే ఇది కష్టతరం కాబోదు. వారెంతో గొప్ప మరియు అద్భుతమైన మనుష్యులు అయినా కూడా వారు కేవలం మనుష్యులు. అలాగే వారిలో ఏఒక్కరికి కూడా ప్రస్తుతకాలం అందిస్తున్నంత అవకాశం రాలేదు. ఎందుకంటే వారు చేపూనిన కార్యం ఇంతకన్నా ఎక్కువ న్యాయమైనది కాదు, అలాగే ఇంతకన్నా తేలికైనదీ కాదు. అలాగే ఆ భగవంతుడు మీకు స్నేహితుడైనంతగా వారికి కాదు (మీకు స్నేహితుడైనంతగా కన్నా ఎక్కువగా వారికి స్నేహితుడు కాదు)head of the Church Giovanni de Medici, the newly elected Pope Leo X. Pope at the time The Prince was written. ఇతడు మెడిసి కుటుంబం నుండి ఎన్నికైన పోప్ (*)మన వైపు గొప్ప న్యాయం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఆవశ్యకమైనదైన ఆ యుద్ధం న్యాయమైనది. సైన్యం తప్ప మరి ఏ ఇతర ఆశాలేని ఈ సమయంలో సైన్యం పవిత్రమైనది. ఇక్కడ గొప్ప ఆకాంక్ష ఉన్నది, ఎక్కడ ఆకాంక్ష గొప్పగా ఉంటుందో, –నేను ఉదాహరణలుగా నీ ముందుందిన వ్యక్తుల విధానాలను నీవు అనుసరించినట్లైతే– అక్కడ కష్టాలు గొప్పగా ఉండలేవు. అంతేకాకుండా నిరుపమానమైన దేవుడి మహిమలు ఎంతటి అసాధారణరీతిలో ప్రకటింపబడ్డాయి?! సముద్రం రెండుగా విడిపోయింది, మేఘం దారి చూపింది, ఱాతి నుండి నీరు వెలుపలికి పారింది, మన్నా వర్షించింది, అదేవిధంగా ప్రతీ విషయం తమ గొప్పదనానికి దారితీసింది. మిగతా కార్యాన్ని తమరు చేయవలసి ఉన్నది. పనిచేయడంలో మనస్వేచ్ఛను, అలాగే ఖ్యాతిలో మనకు చెందవలసిన భాగాన్ని మననుండి వేరుచేయకుండా ఉండటం కొరకు భగవంతుడు అన్నీ చేయడు.ఖ్యాతి గడించిన మీ కుటుంబం చేయగలుగుతుందని ఆశిస్తున్న దానిని ఇంతకు ముందు పేర్కొన్న ఇటాలియన్లు ఎవరూ చేయలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇటలీలో జరిగిన ఎన్నో విప్లవాలలోనూ, ఎన్నో యుద్ధ ఘటనలలోనూ సైనిక సామర్థ్యం అడుగంటిపోయిందేమో అన్నట్లుగానే ఎప్పుడూ కనబడింది (అనిపించింది). దీనికి కారణం పాత పద్ధతులు మంచివి కాక పోవడమే. పైగా కొత్తపద్దతులు ఆవిష్కరించడం ఎలాగో (మాలో ఎవరికీ తెలియదు) తెలిసిన వారు ఒక్కరూ తలయెత్తలేదు. కొత్తగా తలయెత్తిన వానికి అతడు ప్రవేశపెట్టిన కొత్త పద్దతులు, చట్టాలు తెచ్చినంతగా (ప్రవేశపెట్టడం కన్నా) గౌరవం మరి ఏదీ తేలేదు. అవి మంచి పునాదిని మరియు గొప్పదనాన్ని కలిగి ఉన్నపుడు అవి అతడిని గౌరవనీయుడిగా, ఆరాధనీయుడిగా చేస్తాయి. ఇటలీలో అన్ని విధాలైన కొత్తపద్దతులనూ ప్రవేశపెట్టగలిగే అవకాశాలకు కొదవేలేదు.ఇక్కడ బాహువులలో గొప్ప పరాక్రమం ఉన్నది, అదే సమయంలో ఆ పరాక్రమం శిరస్సులో లోపించినది. ద్వంద యుద్ధాలలోనూ, కొద్దిమంది పాల్గొనే యుద్ధలలోనూ ఇటాలియన్లు ఎంతటి బలవంతులో, ఎంతటి నైపుణ్యం ఉన్నవారో, ఎంతటి యుక్తిపరులో శ్రద్ధగా చూడు. అయితే సైన్యం విషయం వచ్చేసరికి అసలు పోలికే కనిపీంచదు. ఇది పూర్తిగా నాయకులలోని లోపాలవల్లనే సంభవిస్తున్నది. సమర్థులైన వారిలో విధేయత కనిపించదు. అలాగే ప్రతిఒకరూ తనను తాను సమర్థుడిగా భావించుకుంటూ ఉన్న కారణంగా పరాక్రమంలోగానీ, అదృష్టంలోగానీ ఇతరులకన్నా ఉన్నతంగా ఉండి వారిని తనకు లోబడి ఉండేటట్లు చేసుకోగలిగేవారు ఎప్పుడూ కూడా ఏ ఒక్కరూ కూడా లేరు. అందువలన చాలాకాలంనుండి కూడానూ, అలాగే ఎంతో పోరాటం జరిగిన గత ఇరువది సంవత్సరాలలోనూ ఎప్పుడెప్పుడైతే పూర్తిగా ఇటాలియన్ సైన్యం ఉన్నదో అప్పుడు ప్రతిసారీ చాలా పేలవమైన పనితీరును ప్రదర్శించింది. దీనికి తొలి నిదర్శనం రెండవ టారో యుద్ధం, ఆ తరువాత అల్లెసాండ్రియా యుద్ధం, కపువా యుద్ధం, జెనోవా యుద్ధం, వైలా యుద్ధం, బొలొగ్నా యుద్ధం, మేస్త్రీ యుద్ధం. (రెండవ టారో యుద్ధం 1495 లో, అల్లెసాండ్రియా యుద్ధం 1499 లో, కపువా యుద్ధం 1501 లో, జెనోవా యుద్ధం 1507 లో, వైలా యుద్ధం 1509 లో, బొలొగ్నా యుద్ధం 1511 లో, మేస్త్రీ యుద్ధం 1513 లో జరిగాయి)అందువలన ఘనతవహించిన మీ కుటుంబం (గతంలో) తమ దేశాలను రక్షించిన గొప్పవ్యక్తులను అనుసరించాలని కోరుకున్నట్లైతే –ప్రతి యుద్ధానికి ఒక నిజమైన పునాదిగా– మీ స్వంత సైన్యాలను కలిగి ఉండటం అనేది అన్నింటికంటే ముందుగా అవసరం. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ విశ్వసనీయమైన, నిజమైన, ఉత్తమమైన సైనికులు ఎక్కడా ఉండలేరు (నీకు లభించరు). అలాగే ఆ సైనికులు ఒక్కొక్కరిగా (కూడా మంచి వారే అయినా) మంచి వారైనప్పటికీ అందరూ కలసికట్టుగా —వారు వారి రాజుచే ఆదేశింపబడుతున్నప్పుడు, అతడిచేత గౌరవింపబడుతున్నప్పుడు, అతనిచే పోషింపబడుతున్నపుడు— మరింత ఉత్తమంగా ఉంటారు. అందువలన, ఇటాలియన్ పరాక్రమం ద్వారా విదేశీయులనుండి నీవు రక్షణపొందగలగడానికి అటువంటి సైన్యంతో సిద్ధంగా ఉండటం అవసరం.స్విస్ మరియు స్పానిష్ పదాతిదళాలు రెండూ అతి భీకరమైనవిగా పేరుపొందినప్పటికీ రెంటిలో కూడా లోపాలున్నాయి. ఆ కారణంగా ఒక వైవిద్యమైన పద్దతిలో తర్ఫీదు పొందిన సైన్యం వాటీని నిలువరించడమేకాక ఖచ్చితంగా ఓడించగలుగుతుంది. స్పానియార్డులు అశ్వికదళాన్ని ఎదుర్కోలేరు, స్విస్ సైన్యం తమను సమీపించి, తమంత నిర్ణయాత్మకంగా (దృఢనిశ్చయంతో) పోరాడే పదాతిదళం ముందు తలవంచుతుంది. ఈ కారణంగా స్పానియార్డులు ఫ్రెంచివారి అశ్వికదళం యొక్క దాడిని కాచుకోలేకపోవడం, అలాగే స్విస్ సైన్యం స్పానిష్ పదాతిదళం చేతిలో ఓడిపోవడం మనం చూశాం, ఇక ముందు కూడా చూస్తాం. రెండవ పరిస్థితి (స్విస్ సైన్యం స్పానిష్ ఇన్‌ఫాంట్రీ చేతిలో ఓడిపోవడం) పూర్తిగా సంభవించనప్పటికీ దానిని సూచించే సంఘటన రవెన్నా యుద్ధంలో మనం చూశాం. ఆ యుద్ధంలో స్పానిష్ పదాతిదళం స్విస్ వారి(వలే) తరహాలో పోరాడే జర్మన్ సైన్యాలను ఎదుర్కొంది. ఆ సంఘటనలో స్పానియార్డులు తమ చురుకుదనంతోనూ, డాలుల సహాయంతోనూ బల్లాలు చేబూనిన జర్మన్ సైన్యంలోకి చొచ్చుకుపోయి వారికి సమీపాన నిలిచాయి. దానితో జర్మన్‌లు ఎంతో సేపు తమను తాము రక్షించుకోలేకపోయారు. ఒక వేళ వారి మీదకు అశ్వికదళం కనుక పంపబడకపోయినట్లైతే వారు జర్మన్‌లను చిత్తుచిత్తుగా ఓడించిఉండేవారు. ప్రతి ఒక సైన్యంలోని లోపాలను తెలుసుకున్నమీదట నీవు నీ సైనికులకు ఒక విభిన్నమైన పద్దతిలో —అశ్వికదళాన్ని నిలువరించడానికి, అలాగే పదాతిదళానికి భయపడకుండా ఉండాటానికి— తర్ఫీదునివ్వగలవు. ఇది జరగడానికి, కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు, పాతసైన్యంలోనే కొద్దిపాటు మార్పును ప్రవేశపెడితే చాలు. ఒక కొత్త రాజుకు ఖ్యాతిని, అధికారాన్ని తెచ్చిపెట్టే విషయాలు ఇవే.అందువలన ఇటలీ ఎట్టకేలకు తన విమోచనకర్తను దర్శించే ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. విదేశీ ఉపద్రవం వల్ల ఎంతగానో బాధపడ్డ ప్రాంతాలన్నింటిలోనూ ఎంతటి ప్రేమతో, ప్రతీకారం కొరకు ఎంతటి దాహంతో, ఎంతటి మొండి విశ్వాసంతో, ఎంతటి భక్తిప్రపత్తులతో, ఎంతటి కన్నీటితో అతడు స్వాగతించబడతాడో ఎవరూ వ్యక్తం చేయ.ఎఏరు. అతడికి ఏ తలుపులు మూసుకుపోతాయి? అతడికి విధేయులుగా ఉండటానికి ఎవరు తిరస్కరిస్తారు? ఎటువంటి అసూయ అతడిని ఆటంకపరుస్తుంది? ఏ ఇటాలియన్ అతడికి వందనాలర్పించడు?మాకందరికీ ఈ ఆటవిక రాజ్యం దుర్గంధభరితంగా ఉంది. కనుక ఘనతవహించిన మీ కుటుంబం ఈ కార్యాన్ని –న్యాయమైన లక్ష్యం వలన ప్రేరేపింపబడిన– ధైర్యంతో, ఆశతో చేబూనాలి.  ఆ ప్రకారంగా మీ పతాకం క్రింద మన మాతృదేశం వైభవాన్ని పొందుతుంది, అలాగే మీ ప్రాయోజకత్వం క్రింద పెట్రార్క్ యొక్క ఈ ఉవాచ నిజమవుతుంది.మొరటు క్రోథాన్ని ధైర్య స్థైర్యాలు దండించపూనుకున్నపుడు యుద్ధం ఎంతోసేపు జరగదు.


ఎందుకంటే ఇటాలియన్ల హృదయాలను ప్రాచీనకాలపు స్ఫూర్తి ఇంకా ఉత్తేజపరుస్తూనే ఉన్నది. అది ఇంకా చావలేదు.

The End
మాకియవెల్లి-ద ప్రిన్స్: 25వ అధ్యాయం
(Unedited)
రాజు-రాజ్యం
అధ్యాయం25: మానవ వ్యవహారాలలో విధి పాత్ర ఎంతవరకు ఉంటుంది, దానిని ఎలా ఎదుర్కొనవచ్చు


Chapter XXV: What Fortune can Effect in Human Affairs and How to Withstand Herమానవ వ్యవహారాలు (ఈ లోకంలో జరిగే సంఘటనలు) విధి మరియు దైవం చేతిలో ఉంటాయనీ, మనుష్యులు తమ తెలివితేటలతో వాటిని మార్చలేరనీ, నిజానికి విధి శాసనాలకు ఎటువంటి ప్రతిచర్యాలేదనీ అనేకమంది అభిప్రాయపడ్డారు, ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు అన్న విషయం నాకు తెలియనిది కాదు. ఈ కారణంగా –ఏ విషయంలోనైనా ఎక్కువ కష్టపడటం  అనవసరం, అన్ని విషయాలను విధిరాతకు వదిలేయాలి– అనే ఆలోచనకు వారు వస్తారు. ఈ అభిప్రాయం మనకాలంలో మరింతగా బలపడింది. ఎందుకంటే, మానవుని యొక్క ఊహలకు అందని గొప్ప మార్పులు ఎన్నో జరిగాయి, ఇంకా ప్రతిరోజూ జరుగుతున్నాయి కనుక. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించడం జరిగితే నేను వారి అభిప్రాయంతో కొంతవరకూ ఏకీభవిస్తాను. అయినప్పటికీ, మనం స్వేచ్ఛగా పనిచేసే సామర్థ్యం (Fరీవిల్ల్) పూర్తిగా అంతరించదు కనుక, మనం చేసే పనులలో సగాన్ని విధి నియంత్రిస్తుంది, మిగతా సగాన్ని లేదా అంతకన్నా కొంచెం తక్కువని విధి మన నియంత్రణకు వదిలిపెడుతుందనేది నిజమని నేను భావిస్తున్నాను. 


విధినిని నేను వెల్లువొచ్చి పొంగిపొర్లే నదితో పోల్చుతాను. అది ఉప్పొంగినపుడు మైదాన ప్రాంతాలను ముంచెత్తుంది, వృక్షాలను, భవంతులను కూల్చివేస్తుంది, మట్టిని ఒక చోటినుండి తొలగించి మరోచోట విడిచిపెడుతుంది. దాని ధాటికి ప్రతీదీ కొట్టుకుపోవలసిందే, దానిని ఏవిధంగానూ నిలువరించే శక్తి లేక అన్నీ దానికి లోబడవలసిందే. నది స్వభావం అటువంటిదైనప్పటికీ, అది ప్రశాంతంగా ఉన్నపుడు గట్లు, ఆనకట్టలు నిర్మించడం ద్వారా మనుషులు జాగ్రత్త పడటంవలన అది మరలా ఉప్పొంగినపుడు నీరు కాలువలోకి ప్రవహిస్తుంది, అలాగే దాని ప్రవాహం అదుపుచేయలేనంతగానూ, అంత ప్రమాదకరంగానూ ఉండదు. విధి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. తనను నిరోధించడానికి ఏ చర్యా చేపట్టని చోటే అది తన ప్రతాపాన్ని చూపిస్తుంది, తనను నిలువరించడానికి ఆనకట్టలు, అడ్డుకట్టలు ఎక్కడలేవని తెలుసుకుంటుందో అక్కడికే ఆమె తన కోపాగ్నిని ప్రసరింపజేస్తుంది.


ఈ మార్పులకు వేదిక అయిన మరియు వాటికి ప్రేరణను ఇచ్చిన ఇటలీని గనుక నీవు పరిశీలించినట్లైతే అది ఎటువంటీ ఆటంకంగానీ, రక్షణగానీ లేని బహిరంగ దేశమని నీవు గ్రహిస్తావు. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలవలే ఇటలీకూడా సరైన శౌర్యపరాక్రమాలతో గనుక రక్షింపబడినట్లైతే ఈ దండయాత్ర వలన జరిగిన గొప్ప మార్పులు జరిగి ఉండేవి కావు లేదా అసలు దండయాత్రే జరిగి ఉండేది కాదు. విధిని నిరోధించడానికి సంబంధించి సాధారణంగా వివరించడానికి ఇప్పుడు చెప్పినది సరిపోతుందని నేను అనుకుంటూన్నాను.


అయితే విశేషమైన సందర్భాలకు నన్ను ఎక్కువగా పరిమితం చేసుకున్నట్లైతే నేనేం చెబుతానంటే ఒక రాజు యొక్క స్వభావంలోగానీ, గుణగణాలలోగానీ ఎటువంటీ మార్పు లేకుండానే అతడు ఈ రోజు సంతోషంగా ఉండి రేపు నాశనమవడం మనం చూస్తాం. ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించిన కారణాలవలనే ప్రధానంగా ఇలా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. అదేమంటే అదృష్టం (విధి) మీదే పూర్తిగా ఆధారపడిన రాజు అది మారినపుడు వినాశనాన్ని పొందుతాడు. తన చేతలను సమయానికి తగినట్లుగా మలచుకునేవాడు విజయాన్ని పొందుతాడు, అలా మలచుకోనివాడు అపజయాన్ని పొందుతాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే —ప్రతీ మనిషి తన ముందుంచుకున్న— యశస్సు మరియు సంపద అనే లక్ష్యాన్ని చేరుకునే కార్యకలాపాలలోనే మనుషులు కనిపిస్తారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు వివిధ పద్దతులను అవలంబిస్తారు. ఒకరు ఆచితూచి, మరొకరు ఆతురతతో; ఒకరు బలంతో, మరొకరు నైపుణ్యంతో; ఒకరు సహనంతో, మరొకరు తద్విరుద్ధంగా ఉన్న దానితో. ప్రతీ ఒకరూ విభిన్నమైన పద్దతిలో లక్ష్యాన్ని చెరుకోవడంలో సఫలమౌతారు. ఆచితూచి అడుగువేసే ఇరువురు వ్యక్తులలో ఒకరు తన లక్ష్యాన్ని చేరుకోవడం మరొకరు విఫలమవడం కూడా మనం గమనించవచ్చు. అలాగే వేరువేరు మార్గాలననుసరించిన ఇరువురువ్యక్తులు —ఒకరు ఆచితూచి అడుగువేసేవారు, మరొకరు దూకుడుగా ఉండేవారు— ఒకేవిధంగా విజయాన్ని సాధిస్తారు. వారు అవలంబించిన పద్దతులు సమయానుకూలంగా ఉన్నయా లేదా అన్నదానినిబట్టి కాక మరిదేని వలనా ఇదంతా జరగదు. నేను చెప్పిన దాని ప్రకారం ఇలా జరుగుతుంది. అదేమంటే వేరువేరుగా పనిచేసే ఇరువురు వ్యక్తులు ఒకే ఫలితాన్ని పొందుతారు, అలాగే ఒకే విధంగా పనిచేసే ఇరువురు వ్యక్తులలో ఒకరు తన లక్ష్యాన్ని చేరుకుంటే, మరొకరు చేరుకోరు.


అదృష్టం లోని మార్పులను కూడా మనం ఇలానే వివరించవచ్చు. ఎలాగంటే జాగరూకతతో, సహనంతో పనిచేసే వ్యక్తికి కాలము మరియు ఇతర వ్యవహారాలు అనుకూలంగా ఉన్నట్లైతే అతడు విజయాన్ని పొందుతాడు. అయితే అవి మారినప్పుడు అతడు తాను పనిచేసే పద్దతిని మార్చుకోనట్లైతే వినాశనాన్ని పొందుతాడు. అయితే మార్పుకు అనుకూలంగా తనను తాను మలచుకోవడం తెలిసిన మనిషి మనకు తరచూ కనబడడు. దీనికి ఓ కారణం అతడు తన స్వభావానుసారంగా పనిచేసే విధానాన్నుండి పక్కకు తప్పుకోలేకపోవడం. మరొక కారణం ఒకానొక విధానంలో పనిచేస్తూ, ప్రతీసారీ విజయాన్ని పొందిన వ్యక్తి, ఆ విధానానికి స్వస్తిపలకడమే మంచిది అనే భావనకు రాలేకపోవడం. అందువలన ఆచితూచి అడుగువేసే వ్యక్తి దూకుడుగా వ్యవహరించాల్సిన సమయం వచ్చినపుడు అలా వ్యవహరించడం ఎలానో తెలియక వినాశనాన్ని పొందుతాడు. అయితే అతడు తన వ్యవహారశైలిని గనుక సమయానుకూలంగా మార్చుకుంటే, అతడి తలరాత మారబోదు.


పోప్ జూలియస్–ఈఈ అన్ని వ్యవహారాలలోనూ చాలా దూకుడుగా పని చేసేవాడు. అతడి వ్యవహారశైలికి కాలము మరియు పరిస్థితులు ఎంతబాగా అనుకూలించేవంటే అతడు ఎల్లవేళలా విజయాన్నే పొందేవాడు. మెస్సర్ గియోవన్నీ బెంటివోగ్లి ఇంకా బ్రతికి ఉండగానే బొలోగ్నా మీద ఇతడు చేసిన మొదటి యుద్ధాన్ని పరిశీలించండి. వెనటియన్స్ దీనికి సుముఖంగా లేరు, స్పెయిన్ రాజు కూడా అంతే. ఈ యుద్ధానికి సంబంధించి ఫ్రాన్సు రాజుతో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా పోప్ తన కలవాటైన ధైర్యంతో దూకుడుగా వ్యక్తిగతంగా తానొక్కడే జైత్రయాత్రకు బయలుదేరాడు. ఈ చర్యవలన భయపడి వెనటియన్స్, నేపుల్స్ రాజ్యాన్ని తిరిగి సంపాదించాలనే కోరికతో స్పెయిన్ ఏం చేయాలో పాలుపోక చేష్టలుడిగిపోయారు. మరోపక్క పోప్ తన వెనుకే ఫ్రాన్సు రాజును యుద్ధంలోకి లాగాడు. ఎందుకంటే పరిస్థితినంతా గమనించిన మీదట, వెనటియన్స్‌ను బలహీనపరచడం కొరకు పోప్‌ను తన మిత్రునిగా చేసుకోదలచిన ఆ రాజుకు పోప్‌ను తిరస్కరించడం సాధ్యపడలేదు. దీనిమూలంగా జూలియస్ తన దూకుడుతో ఎంతోగొప్ప వివేకం కలిగిన మరి ఏ ఇతర పోప్ కూడా నెరవేర్చలేనటువంటి కార్యాన్ని నెరవేర్చాడు. పోప్ తన పథకాలన్నింటినీ సిద్ధంచేసుకుని, అన్నివిషయాలనూ సమకూర్చుకొన్న తరువాతే బయలుదేరడం కొరకు –ఏ ఇతర పోప్ అయినా ఇలానే వ్యవహరించేవాడు– రోమ్‌లోనే వేచి ఉన్నట్లైతే అతడు ఎప్పటికీ విజయాన్నిసాధించి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఫ్రాన్స్ రాజు వేయి వంకలు చెప్పి ఉండేవాడు, అలానే ఇతరులు వేయి భయాలను వెల్లడి చేసి ఉండేవారు.


నేను అతడి ఇతర చర్యలను వదిలేస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా ఇలానే ఉంటాయి. అలాగే అన్నీ విజయవంతమయ్యాయి. అతడి జీవితం చిన్నది కావడంతో ఇందుకు విరుద్ధమైనది అతడికి అనుభవంలోకి రాలేదు. అయితే ఒకవేళ అతడు ఆచితూచి అడుగువేయవలసిన అవసరం కలిగిన పరిస్థితులు కనుక తలయెత్తినట్లైతే, అతడి వినాశనం సంభవించి ఉండేది. ఎందుకంటే తన స్వభావానికి అనుగుణమైన మార్గాలనుండి అతడు ఎప్పుడూ తప్పుకుని ఉండేవాడు కాదు.చివరకు నేనేం చెబుతానంటే అదృష్టం మారుతూ ఉంటుంది, మనుష్యులు మాత్రం తమ విధానాలను అంటిపెట్టుకుని ఉంటారు. ఇవి రెండూ ఎంతకాలం సామరస్యాన్ని కలిగి ఉంటాయో అంతకాలం మనుషులు గెలుపొందుతారు, ఆ సామరస్యం చెడిపోయినప్పుడు ఓటమిపాలౌతారు. నావరకు నేనేం అనుకుంటున్నానంటే జాగరూకతతో ఉండటం కన్నా సాహసించడమే మేలు. ఎందుకంటే అదృష్టం ఒక స్త్రీ. ఆమెను నీ అదుపులో ఉంచుకోవాలని కోరుకున్నట్లైతే బలప్రయోగం ద్వారా ఆమెను గెలుపొందటం అవసరం. అంతేకాక నెమ్మదిగా వ్యవహరించేవారి కన్నా ఇలా సాహసికులుగా ఉండేవారికి లోబడటానికే ఆమె అంగీకరించడం మనకు కనబడుతుంది. అందువలన, ఇలా ఓ స్త్రీవలే ఆమె ఎల్లవేళలా యువకులనే ఇష్టపడుతుంది. ఎందుకంటే వారు తక్కువ జాగ్రత్తతోనూ, ఎక్కువ హింసాత్మకంగానూ ఉండి మిక్కిలి ధైర్యంతో ఆమెను ఆజ్ఞాపిస్తారు.


మాకియవెల్లి-ద ప్రిన్స్: 24 వ అధ్యాయం
(Unedited)రాజు-రాజ్యం
అధ్యాయం 24: ఇటలీ రాజులు తమ రాజ్యాలనెందుకు కోల్పోయారుChapter XXIV: Why the Princes of Italy have Lost their States


ఇప్పటివరకు చెప్పిన సలహాలూ, సూచనలన్నింటినీ జాగ్రత్తగా పాటించినట్లైతే అవి ఒక కొత్తరాజును చిరకాలంనుండి ఉన్న రాజువలే కనబడేటట్లు చేస్తాయి, అంతేకాక అతిత్వరలోనే అతడిని తన స్థానంలో చిరకాలంనుండి ఉన్న రాజుకన్నా ఎక్కువ సుస్థిరం, సురక్షితం చేస్తాయి. ఎందుకంటే ఒక కొత్తరాజు చర్యలు వారసత్వపురాజు చర్యలకన్నా మరింత క్షుణ్ణంగా పరిశీలించబడతాయి, అవి సమర్థవంతంగా కనబడినపుడు ఆ కొత్తరాజుకు వారసత్వపు రాజుకన్నా మరింత ఎక్కువమంది మద్దతునిస్తారు, వారంతా మరింత బలంగా అతడికి కట్టుబడతారు. దీనికి కారణం మనుషులు గతంకన్నా వర్తమానానికి ఎక్కువ ఆకర్షితులవుతారు. వారికి వర్తమానం బాగుందనిపిస్తే వారు దానిలోనే సంతోషాన్ని పొందుతారు, అంతకు మించి మరేమీ కోరుకోరు. అంతేకాక, ఇతరవిషయాలలో ఆ రాజు వారిని నిరాశకు గురిచేయనట్లైతే అతడి రక్షణకు వారంతా శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ విధంగా నూతన రాజ్యాన్ని స్థాపించడం ద్వారానూ, మరియూ దానిని మంచి శాసనాలు, మంచి సైన్యం, మంచి మిత్రులు మరియు మంచి కార్యాల ద్వారా అలంకరించడం, బలపరచడం ద్వారానూ ఆ రాజు ద్విగుణీకృతమైన ఖ్యాతిని పొందుతాడు. అలాగే వారసత్వంగా రాజైనవాడు అవివేకం మూలంగా తన రాజ్యాన్ని కనుక పోగొట్టుకుంటే, అతడికి ద్విగుణీకృతమైన అపఖ్యాతి మిగులుతుంది.ఇటలీలోని తమ రాజ్యాలను పోగొట్టుకున్న నేపుల్స్ రాజు, మిలన్ రాజు, మరికొంతమంది వంటి మనకాలపు ఫ్యూడల్ రాజులను గనుక పరిశీలించినట్లైతే మొదటగా వారిలో ఒక సామాన్యమైన లోపం కనబడుతుంది. అదే సైన్యానికి సంబంధించినది. తత్కారణాలు సుదీర్ఘంగా చర్చించినవే. తరువాత వారిలో ఎవరోఒకరికి ప్రజలు వ్యతిరేకులుగానన్నా ఉన్నారు, లేదా ప్రజలు అతడితో స్నేహంగా ఉన్న పక్షంలో అతడు ప్రభువర్గీయులను ఎలా కాపాడుకోవాలో తెలియని వాడైనా అయి ఉంటాడు. ఇటువంటి లోపాలేవీ లేనపుడు యుద్ధరంగంలో సైన్యాన్ని నిలుపగల శక్తిసామర్థ్యాలున్న ఏ రాజ్యం కూడా చేజారిపోదు.


మాసిడోనియాకు చెందిన ఫిలిప్ —అలెగ్జాండర్ ది గ్రేట్ తండ్రి కాదు, టైటస్ క్వింటియస్‌చే జయించబడిన వాడు— తన మీద దాడిచేసిన రోమ్, గ్రీకు దేశాల గొప్పదనంతో పోల్చితే చాలా చిన్న దేశానికి రాజు. అయినా కూడా అతడు తన యుద్ధకౌశలంతోనూ, ప్రజలనెలా ఆకట్టుకోవాలో, ప్రభువర్గీయులనెలా కాపాడుకోవాలో తెలిసిన నేర్పరితనంతోనూ అనేక సంవత్సరాలపాటు యుద్ధంలో తన శతృవులను నిలువరించగలిగాడు. చివరికి అతడు కొన్ని నగరాలను కలిగియున్న కొంత భూభాగాన్ని పోగొట్టుకున్నప్పటికీ, తన రాజ్యాన్ని మాత్రం నిలుపుకున్నాడు.


Philip of Macedon Philip V (238–179 B.C.), king of Macedon. He was defeated in 197 B.C. by Titus Quintus Flaminius, a Roman general, at Cynoscephalae.అందువలన అనేక సంవత్సరాలపాటు నిలుపుకున్న తమ రాజ్యాలను పోగొట్టుకున్న మన రాజులు తమ దుస్థితికి విధిని కాక తమ సోమరితనాన్నే నిందించాలి. ఎందుకంటే పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నపుడు అవి తలక్రిందులవవచ్చనే ఊహే వారెప్పుడూ చేయలేదు. (సముద్రం ప్రశాంతంగా ఉన్నపుడు తుఫాను గురించి ఆలోచించకపోవడం మానవ స్వభావం) ఐతే చెడ్డరోజులు వచ్చిన తరువాతికాలంలో వారు ఆత్మరక్షణ గురించి కాక పలాయనం గురించే ఆలోచించారు, విజేతలు చేసే అవమానాలకు రోసిన ప్రజలు తిరిగి తమనే ఆహ్వానిస్తారని ఆశించారు. ఇలా జరగాలని ఆశించడం మిగతా ప్రయత్నాలన్నీ విఫలమైనపుడు సరైనది కావచ్చు. అయితే దీనిని నమ్ముకుని ఇతర ప్రయత్నాలన్నింటినీ నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం సరికాదు. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి లేవనెత్తుతారనే నమ్మకంతో ఎవరూ కావాలని క్రిందపడిపోరు. పైగా నీ ప్రజలు నిన్ను తిరిగి ఆహ్వానించడం అనేది జరగవచ్చు, జరుగకపోవచ్చు. ఒకవేళ జరిగినాకూడా అది నీ రక్షణకు తోడ్పడదు. ఎందుకంటే నీ మీద ఆధారపడిలేని రక్షణ నీకు నిరుపయోగం. నీ మీద, నీ ధైర్యస్థైర్యాలమీద ఆధారపడిన రక్షణ మాత్రమే నమ్మదగినది, ఖచ్చితమైనది మరియు చిరకాలం నిలిచి ఉండేది (దీర్ఘకాలం నిలబడేది).

మాకియవెల్లి-ద ప్రిన్స్: 23 వ అధ్యాయం(Unedited)
రాజు-రాజ్యం
అధ్యాయం 23: భజనపరులను ఎలా దూరంగా ఉంచాలిChapter XXIII: How Flatterers should be Avoided


ఈ విషయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విభాగాన్ని విడిచిపెట్టాలని నేను కోరుకోవడంలేదు. ఎందుకంటే రాజులు —వారు ఎంతో జాగ్రత్తపరులు మరియూ విచక్షణ కలిగినవారూ కాని పక్షంలో— అతికష్టం మీద మాత్రమే అధిగమించగలిగిన ఒక ప్రమాదం అది. అదే భజనపరులు. రాజాస్థానాలన్నీ వీరితో నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే మనుషులు తమ స్వవిషయాలతో ఎంతగా సంతోషాన్ని పొందుతారంటే, వాటి గురించి ఎంతగా భ్రమలలో ఉంటారంటే భజన అనే ఈ చీడపురుగునుండి వారు తమను తాము ఏ మాత్రం రక్షించుకోలేరు. పైగా అలా రక్షించుకోవాలనే ప్రయత్నంలో వారు అగౌరవమనే ప్రమాదానికి గురివుతారు. ఎందుకంటే భజనపరులనుండి రక్షణ పొందడానికి —నిజంచెప్పడం అనేది నీకు ఆగ్రహం కలిగించదనే విషయం— ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయడం కన్నా మార్గాంతరం లేదు. ఐతే ప్రతి ఒకరూ నీతో నిజం మాట్లాడగలిగినప్పుడు నీకు గౌరవమన్నదే ఉండదు.


కనుక ఒక వివేకవంతుడైన రాజు మూడవ మార్గాన్ని అనుసరించాలి. తన రాజ్యంలోని జ్ఞాన సంపన్నులైన వ్యక్తులను ఎంపిక చేసుకొని తనతో నిజంచెప్పే స్వేచ్ఛను వారికి మాత్రమే ఇవ్వాలి. అది కూడా తాను అడిగినవిషయాల గురించే తప్ప మరి ఇతరమైన వేటి గురించీ వారు మాట్లాడకూడదు. కానీ రాజు వారిని ప్రతి విషయం గురించి ప్రశ్నించాలి, వారి అభిప్రాయాలను వినాలి. ఆ తదుపరి స్వయంగా తన స్వంత అభిప్రాయాన్ని రూపొందించుకోవాలి. ఈ సభ్యులందరితో కలసికట్టుగానూ, విడివిడిగానూ అతడు ఎలా మెలగవలనంటే వారిలో ప్రతి ఒకరూ తాను ఎంత స్వేచ్ఛగా మాట్లాడితే రాజు తనను అంతగా ఇష్టపడతాడు అని తెలుసుకోవాలి (అనుకోవాలి). వీరుకాకుండా మరెవరికీ రాజు చెవి ఒగ్గకుండా ఉండి, ఆమోదం పొందిన మార్గాన్నే అనుసరిస్తూ, తన నిర్ణయాలకు స్థిరంగా కట్టుబడి ఉండాలి. ఎవరైతే ఇందుకు ఇతరంగా వ్యవహరిస్తారో వారు భజనపరుల మూలంగా తప్పుదారిలోనన్నా నడుస్తారు, లేదా రకరకాల అభిప్రాయాలవలన తన నిర్ణయాలను తరచూ మార్చుకుంటూ గౌరవాన్నన్నా కోల్పోతారు.


ఈ విషయం మీద ఒక ఆధునిక ఉదాహరణను పేర్కొనాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి చక్రవర్తి అయిన మాక్సిమిలన్ సేవలో ఉన్న ఫ్రా లూక తన ప్రభువు గురించి మాట్లాడుతూ “అతడు ఏన్నడూ ఎవరినీ సంప్రదించలేదు, అలాగని అతడు ఏ పనినీ తాను అభిలషించినట్లుగానూ చేయలేదు” అని చెప్పాడు. పైన తెలిపిన విధానానికి వ్యతిరేకంగా అతడు నడచుకోవడం వలన ఇలాంటి పరిస్థితి తలయెత్తింది. ఎలాగంటే చక్రవర్తి రహస్యాన్ని పాటించే వ్యక్తి అవడం వలన తన పథకాలను అతడు ఎవరికీ తెలియపరచడు, వాటి మీద ఎలాంటి సలహాలనూ స్వీకరించడు. ఐతే వాటిని ఆచరణలో పెట్టే క్రమంలో అవి బహిర్గతమై అందరికీ తెలిసిపోవడంతో, అతడి చుట్టూ ఉండే వ్యక్తులచేత అవి ఒక్కసారిగా వ్యతిరేకించబడతాయి. దానితో మెత్తబడిపోయిన అతడు తన పథకాలను విరమించుకుంటాడు. దీనివలన అతడు ఓరోజు చేసిన పనిని మరుసటిరోజు ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అసలతడు ఏం చేయాలనుకుంటున్నాడు, అతడి ఉద్దేశ్యం ఏమిటి అనేది ఏ ఒక్కరికీ కూడా ఎన్నడూ అర్థం కాదు. ఆలాగే ఏ ఒక్కరూ అతడి నిర్ణయాల మీద ఆధారపడలేరు.


[మొదటి మాగ్జిమిలన్ (Maximilian I; జననం: 1459, మరణం: 1519) పవిత్ర రోమన్ సామ్రాజ్య (జర్మనీ ప్రాంతం) చక్రవర్తి. ఇతడు మొదట బర్గండి రాజు చార్లెస్ (Charles the Bold) కుమార్తె అయిన మేరీని వివాహం చేసుకున్నాడు. ఆమె మరణించిన పిమ్మట మిలన్ రాజు కుమార్తె అయిన బియాంకా స్ఫోర్జాను (Bianca Sforza;) వివాహం చేసుకుని, తద్వారా ఇటలీ రాజకీయాలలో జోక్యం చేసుకోనారంభించాడు.]


అందువలన ఒక రాజు ఎల్లప్పుడూ సలహాలను స్వీకరించాలి. ఐతే అది తాను కోరుకున్నప్పుడు మాత్రమే, ఇతరులు కోరుకున్నప్పుడు కాదు. అంతేకాక తను అడగకుండానే సలహాలను ఇవ్వజూపే ప్రతి ఒక్కరినీ అతడు నిరుత్సాహపరచాలి. ఏది ఏమైనప్పటికీ అతడు నిరంతరం సంప్రదించేవాడిగానే ఉండాలి, తదుపరి తాను సంప్రదించిన అంశానికి సంబంధించిన విషయాలను సహనంతో వినేవాడుగా ఉండాలి. ఒక వేళ ఏ ఒక్కరైనా, ఏ విషయంలోనైనా తనకు నిజం చెప్పలేదని తెలిసినట్లైతే అతడు తన కోపాన్ని రుచిచూపించాలి.


ఒక రాజు వివేకవంతుడని అనిపించుకుంటే అది అతని ప్రతిభ వలన కాదు, అతడు తన చుట్టూ కలిగిఉన్న మంచి సలహాదారుల వలన అని ఎవరైనా అనుకున్నట్లైతే వారు నిస్సందేహంగా పొరబడినట్లే. ఎందుకంటే వివేకవంతుడు కాని రాజు ఎన్నడూ మంచి సలహా తీసుకోడనేది ఎప్పుడూ తప్పవని ఒక నిత్యసత్యం. ఐతే, అన్ని విషయాలలోనూ తనను పూర్తిగా నిర్దేశించే ఒక వివేకవంతుడైన వ్యక్తి చెప్పుచేతల్లో ఆ రాజు తనను తాను ఉంచుకున్న పక్షంలో, ఆ వ్యక్తి రాజుకు చక్కటి మార్గనిర్దేశకత్వాన్ని అందించవచ్చు. కానీ అలా ఎంతో కాలం జరగదు. ఎందుకంటే అలాంటి సలహాదారుడు అనతికాలంలోనే రాజ్యాన్ని ఆ రాజు నుండి తన హస్తగతం చేసేసుకుంటాడు.వివేకవంతుడు కాని రాజు ఒకవేళ ఎక్కువమందిని కనుక సంప్రదిస్తే అతనికెప్పుడూ ఏకాభిప్రాయం లభించదు. అలాగే ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఏకాభిప్రాయాన్ని రాబట్టడమూ అతడికి తెలియదు. ఆ సలహాదారులలో ప్రతి ఒకడూ తన స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తాడు. వారినెలా నియంత్రించాలో, వారి అంతరంగాన్ని ఎలా కనిపెట్టాలో ఆ రాజుకు తెలియదు. వారు మరోలా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నిర్భందంతో నిజాయితీగా ఉండే అవసరాన్ని కల్పించితే తప్ప మనుషులు ఎల్లప్పుడూ నీ యెడల తప్పుగానే ప్రవర్తిస్తారు. దీనినిబట్టి ఈ విధమైన నిర్థారణకు మనం ఖచ్చితంగా రావచ్చు. మంచి సలహాలు అవి ఎక్కడినుండి వచ్చినప్పటికీ రాజు వివేకం నుండే జనిస్తాయి, అంతేకానీ రాజు యొక్క వివేకం మంచి సలహాలనుండి జనించదు.
మాకియవెల్లి-ద ప్రిన్స్: 22 వ అధ్యాయం
(Unedited)

రాజు-రాజ్యం

అధ్యాయం 22: రాజు యొక్క సహాయకుల గురించి


Chapter XXII: Concerning the Secretaries of Princes


ఒక రాజుకు తన మంత్రులను ఎంపిక చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యతలేని విషయమేమీ కాదు;. ఆ మంత్రులు మంచివారా కాదా అనేది రాజు విచక్షణను అనుసరించే ఉంటుంది. ఎవరైనా సరే రాజు చుట్టూ ఉండే వ్యక్తులను చూచి, దానినిబట్టే  రాజుగురించి గానీ, అతని తెలివితేటల గురించి గానీ ఓ ప్రాధమిక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. వారు సమర్థులు, విశ్వాసపాత్రులు ఐనప్పుడు ఆ రాజు వివేకవంతుడిగా పరిగణింపబడతాడు. ఎందుకంటే సమర్థులను ఎలా గుర్తించాలో, వారిని విశ్వాస పాత్రులుగా ఎలా ఉంచాలో ఆ రాజుకు తెలిసి ఉండటం చేత. వారు సమర్థులు, విశ్వాసపాత్రులు కానప్పుడు ఎవరికైనా ఆ రాజు గురించి సదభిప్రాయం ఏర్పడదు. ఎందుకంటే వారిని ఎంచుకోవడమనే తొలి అడుగులోనే అతడు తప్పు చేయడం చేత.           సియేనా రాజైన పండాల్ఫో పెట్రూసి యొక్క మంత్రిగా మెస్సర్ ఆంటోనియో డ వెనాఫ్రో ను ఎరిగిన వారిలో ప్రతిఒక్కరూ వెనాఫ్రోను తన మంత్రిగా ఎంచుకున్న విషయంలో పండాల్ఫోను ఎంతో తెలివైనవాడిగా పరిగణిస్తారు. ఎందుకంటే గ్రాహక శక్తి మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి తనకు తానుగా గ్రహిస్తుంది, మరోటి ఇతరులు వ్యక్తీకరించినదానిని గ్రహిస్తుంది, మూడవది తనకు తానుగానూ గ్రహించలేదు, అలాగే ఇతరులు వ్యక్తీకరించిన దానినీ గ్రహించలేదు. మొదటిది సర్వోత్తమమైనది, రెండవది ఉత్తమమైనది, మూడవది నిరుపయోగమైనది. పండాల్ఫో మొదటి విధానికి చెందని పక్షంలో అతడు తప్పనిసరిగా రెండవ విధానికి చెందుతాడని దీనిని బట్టి అవగతమవుతున్నది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇతరులు చేసిన లేక చెప్పిన దానిలోని మంచి చెడులను తెలుసుకునే గ్రహింపు ఎప్పుడైతో ఉంటుందో —తనకు తానుగా ఏ విషయంలోనూ ముందడుగు వేయలేకపోయినప్పటికీ— అప్పుడు అతడు తన సేవకుడిలోని తప్పొప్పులను గుర్తించగలిగి ఒప్పులను ప్రసంశించి, తప్పులను సరిదిద్దుతాడు. దీనితో ఆ సేవకుడు తన యజమానిని మోసగించాలనే ఆలోచన చేయలేక నిజాయితీగా ఉండిపోతాడు.


ఒక రాజు తన మంత్రి గురించి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలగడానికీ ఎన్నడూ వైఫల్యం చెందని ఒక పరీక్ష ఉంది. మంత్రి నీ ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాల గురించే ఎక్కువగా అలోచించడం, ప్రతి విషయంలోనూ అంతరంగంలో తన స్వలాభాన్నే కోరుకోవడం నీవు చూచినట్లైతే, అటువంటి మనిషి ఎన్నడూ మంచి మంత్రి అవబోడు; అలాగే అతడిని నీవు ఎన్నటికీ నమ్మలేవు. ఎందుకంటే మరొకరి రాజ్యాన్ని తన చేతులలో కలిగి ఉన్నవాడు ఎన్నడూ తన గురించి ఆలోచించకూడదు; ఎల్లప్పుడూ తన ప్రభువు గురించే ఆలోచించాలి. అలాగే తన ప్రభువుకు సంబంధం లేని విషయాల యెడల ఎన్నడూ కూడా ఏమాత్రం శ్రద్ధ పెట్టకూడదు.మరోపక్క ఒక రాజు తన మంత్రిని నిజాయితీపరుడిగా ఉంచడం కొరకు అతడి గురించి ఆలోచించాలి. అతడిని గౌరవించాలి, అతడిని ధనవంతుడిని చేయాలి, అతడి యెడల దయ చూపాలి, పదవులను, రాజ్యభారాన్ని అతడితో పంచుకోవాలి. అలా చేయడం వలన అతడికి ఇవ్వబడిన గొప్ప గౌరవాలు, పదవులు అతడు వాటిని వేరే విధాలుగా పొందకుండా చేస్తాయి. అలాగే అతడికి అప్పగించబడిన కార్యభారాలవలన —రాజు మద్దతులేకుండా తానొక్కడే వాటిని నెరవేర్చలేనని తెలిసి ఉండడంతో— అతడు కుట్రలకు పాల్పడడానికి భయపడతాడు. రాజు, మంత్రి ఇలాంటి సంబంధంలో ఉన్నపుడు వారు ఒకరినొకరు విశ్వసించుకోగలుగుతారు. కానీ వారి సంబంధం మరోలా ఉన్నప్పుడు ఇరువురిలో ఎవరో ఒకరు వినాశకరమైన అంతాన్ని పొందుతారు.


మాకియవెల్లి-ద ప్రిన్స్: 21 వ అధ్యాయం(Unedited)
రాజు-రాజ్యం

అధ్యాయం –21: ఒక రాజు ప్రఖ్యాతిని బడయటానికి ఏ విధంగా నడచుకోవాలి


Chapter XXI: How a Prince Should Conduct himself so as to Gain Renown


గొప్ప సవాళ్ళను ఎదుర్కోవడం (గొప్ప దండయాత్రలు నిర్వహించడం), ఒక మంచి నమూనాగా నిలవడం; వీటంతగా ఒక రాజుకు గౌరవాన్ని కలుగ జేసే అంశాలు మరేవీ లేవు. మనకాలంలో ఇప్పటి స్పెయిన్ రాజైన ఫెర్డినాండ్ ఆఫ్ ఆరగాన్ దీనికొక మంచి ఉదాహరణ. ఇతడిని మనం దాదాపు ఒక కొత్తరాజుగా పిలవవచ్చు, ఎందుకంటే ఇతడు ఒక గుర్తింపులేని రాజుగా ఉండే స్థాయి నుండి కీర్తిప్రతిష్ఠల ద్వారా మొత్తం క్రైస్తవ ప్రపంచం (Christendom) లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజుగా ఎదిగాడు. అతడి చేతలను గనుక నీవు పరిశీలించినట్లైతే అవి అన్నీ కూడా ఎంతో గొప్పవీ, కొన్నైతే అసాధారణమైనవి అని నీవు తెలుసుకుంటావు. తన పరిపాలన ప్రారంభంలో అతడు గ్రెనడా మీద యుద్ధం చేశాడు. ఈ దండయాత్రే అతడి raajyaaniki or goppadanaaniki శక్తికి పునాదిగా నిలచింది.  తన అనుయాయుల (barons of Castile) ఆలోచనలన్నీ పూర్తిగా ee yuddhaMtOnE యుద్ధ విషయాలతోనే నిండిపోయి ఉండేటట్లు చేయడం మూలంగా వారికి రాజ్యంలో Evidhamaina kuTrala guriMci జరుగుతున్న మార్పుల గురించి ఆలోచించే సమయమన్నదే లేకపోవడంతో ఇతడు ప్రారంభంలో యుద్ధాన్ని తొందరన్నది లేకుండా తీరికగానూ, ఆటంకాలు కలుగుతాయన్న భయంలేకుండానూ నిర్వహించాడు. అలా అతడు వారి మీద తన అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ ఆ విధమైన పద్దతిలో పొందుతున్నాడన్న సంగతిని వారు గ్రహించలేకపోయారు. చర్చి, ప్రజలు సమకూర్చిన ధనంతో అతడు తన సైన్యాలను పోషించుకోగలిగాడు. దీర్ఘకాలం జరిగిన ఆ యుద్ధం ద్వారా అతడు —తనకు తరువాతికాలంలో ఎంతో ప్రసిద్ధిని తెచ్చిపెట్టిన— తన సైనిక Saktiki నైపుణ్యానికి పునాదిని నిర్మించుకోగలిగాడు. అంతేకాక, మరింత గొప్ప పథకాలను ఆచరణలో పెట్టడం కొరకు మతాన్ని ఎల్లప్పుడూ ఓ సాకుగా ఉపయోగిస్తూ ముస్లింలను తన సామ్రాజ్యం నుండి తరిమివేయడానికీ, వారిని తుడిచిపెట్టడానికీ ఒక పవిత్ర కౄరత్వానికి (pious cruelty) తనను తాను నిబద్ధుణ్ణి చేసుకున్నాడు. ఇంతకన్నా ఆరాధ్యపాత్రమైన, ఇంతకన్నా అసాధారణమైన ఉదాహరణ మరోటి ఉండదు. ఇదే సాకుతో అతడు ఆఫ్రికా మీద యుద్ధం చేశాడు, ఇటలీ మీద దండెత్తాడు, చివరగా ఫ్రాన్స్ మీద దాడి చేశాడు. ఆ విధంగా అతడు సాధించిన విజయాలు, అతడి పథకాలు ఎల్లప్పుడూ గొప్పగా ఉండి, అతడి అనుయాయుల మనసులను సందిగ్ధతలోనూ, ఆరాధనలోనూ ఉంచి, వాటి ఫలితాల ఎడల ఆసక్తితో నింపి ఉంచేవి. అతడి చేతలు ఒకదాని వెంట ఒకటి ఎలా తలయెత్తేవంటే అతడి అనుయాయులు అతడికి వ్యతిరేకంగా స్థిమితంగా పనిచేయడానికి వారికి సమయమే ఉండేది కాదు.


మరలా, అంతర్గతవ్యవహారాలలో అసాధారణమైన ఉదాహరణలను –మెస్సెర్ బెర్నబో డా మిలానో (Messer Bernabo da Milano) కు సంబంధించిన ఉదాహరణలవంటివి– నెలకొల్పటం ఒక రాజుకు ఎంతగానో తోడ్పడుతుంది. పౌరజీవితంలో ఎవరైనా ఒక అసాధారణమైన పనిని –మంచిగానీ లేక చెడుగానీ– చేయటం ద్వారా అతడికి అవకాశం లభించినప్పుడు అతడు వారు చేసిన దానిని బట్టి వారిని సత్కరించడమో లేక శిక్షించడమో చేస్తే దాని గురించి ఇతరులు ఎంతగానో మాట్లాడుకునేవారు. ఒక రాజు అన్ని విషయాల కంటే ఎక్కువగా, అన్నివేళలా, ప్రతీ పనిలోనూ తాను ఒక గొప్ప మరియు అసాధారణమైన మనిషిగా ప్రఖ్యాతిని పొందేటట్లుగా గట్టిగా ప్రయత్నించాలి.


ఇంకా ఒక రాజు ప్రాణమిత్రుడిగానో లేక బద్ధ శత్రువుగానో ఉన్నప్పుడు కూడ గౌరవింపబడతాడు. మరో విధంగా చెప్పాలంటే అతడు ఎటువంటి దాపరికం లేకుండా ఒక పక్షానికి విరుద్ధంగా మరో పక్షానికి మద్దతుగా తనను ప్రకటించుకున్నప్పుడు తటస్థంగా ఉండటం కంటే ఈ విధానం ఎల్లప్పుడూ అధిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నీ పొరుగు రాజులలో ఇద్దరు యుద్ధానికి తలపడినట్లైతే వాళ్ళెలా ఉంటారంటే ఆ ఇరువురిలో గెలిచిన వాడు నీవు భయపడేంత శక్తివంతుడైనా అయిఉంటాడు, లేదా అలా కాకుండా అయినా అయి ఉంటాడు. రెండు సందర్భాలలోనూ నీవు ఏదో ఒక పక్షం వైపు నిలచి పట్టుదలతో యుద్ధం చేయడం వలనే ఎల్లప్పుడూ నీకు అధిక ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే, మొదటి సందర్భంలో (గెలిచినవాడు నీకంటే శక్తివంతుడైన సందర్భంలో) నీవు ఏ పక్షమూ వహించనట్లైతే గెలుపొందిన వానిచే —ఓటమి పొందిన వానికి సంతోషమూ, సంతృప్తి కలిగేటట్లుగా— నీవు అనివార్యంగా వేటాడబడతావు. నీవు రక్షణ గానీ ఆశ్రయంగానీ పొందటం కొరకు చూపడానికి నీ వద్ద ఎటువంటి కారణమూ ఉండాదు. ఎందుకంటే గెలిచినవాడు తనను కష్టకాలంలో ఆదుకొనని సందేహాస్పదమైన మిత్రులను కోరుకోడు. అలాగే ఓడినవాడు నీవు చేతిలో సైన్యం ఉండికూడా తనకు సహాయం చేయనందుకు నీకు ఆశ్రయం కల్పించడు. 


రోమన్లను తరిమివేయడానికి ఏటోలియన్లచే పంపబడిన ఆంటియోకస్ గ్రీసుదేశం వెళ్ళాడు. అతడు రోమన్లకు మిత్రులైన ఏచియన్ల వద్దకు దూతలను పంపి వారిని తటస్థంగా ఉండమని కోరాడు. మరోప్రక్క రోమన్లు వారిని తమ తరఫున యుద్ధం చేయమని బలవంతం చేశారు. ఏచియన్ల సభలో ఈ సమస్య చర్చకు వచ్చింది. అక్కడ ఆంటీయోకస్ దూత వారిని తటస్థ వైఖరి అవలంబించమని గట్టిగా కోరాడు. దీనికి రోమన్ దూత ఇలా సమాధానం ఇచ్చాడు. “యుద్ధంలో జోక్యం చేసుకోకుండా ఉండటం మీ రాజ్యానికి ఉత్తమం మరియు ఎంతో ప్రయోజనకరం అని చెప్పిన దానికన్నా సత్యదూరం మరోటిలేదు. ఎందుకంటే యుద్ధంలో జోక్యం చేసుకోకపోవడం వలన ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా విజేతకు ఒక బహుమతిగా నీవు వదిలివేయబడతావు”.


ఆవిధంగా నీ స్నేహితుడు కానివాడు నీవు తటస్థవైఖరి అవలంబించాలని కోరటం, అదేసమయంలో నీకు స్నేహితుడైనవాడు యుద్ధం చేయమని కోరడం ఎల్లప్పుడూ జరిగుతుంది. సరైన నిర్ణయం తీసుకోలేని రాజులు ప్రమాదంనుండి అప్పటికి గట్టెక్కడానికి సాధారణంగా తటస్థవైఖరి అవలంబించి, చాలావరకూ వినాశనాన్ని పొందుతారు. అయితే ఒక రాజు ధైర్యంగా యుద్ధంలో ఏదోఒక పక్షం వైపు నిలబడినపుడు, తాను చేరిన పక్షం గెలుపొందితే —విజేత శక్తివంతుడైనప్పటికీ, అతడి దయమీద మాత్రమే తాను ఆధారపడి ఉన్నప్పటికీ— విజేత ఇతడికి ఋణపడి ఉంటాడు, మరియు ఇరువురి మధ్యన మిత్రబంధం ఏర్పడి ఉంటుంది. అంతేకాక మనుష్యులలో నిన్ను అణచివేయడం ద్వారా కృతఘ్నతకు మారుపేరుగా నిలచిపోయేంత సిగ్గుమాలినతనం ఎప్పుడూ ఉండదు. విజయాలనేవి విజేత న్యాయాన్యాయాల గురించి ఏమాత్రం ఆలోచించనవసరం లేనంతటి గొప్పవి ఎప్పటికీ కావు. అలాగే నీవు చేరిన పక్షం ఓడిపోతే అతడు నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు, అతడికి సామర్థ్యం ఉన్నపుడు నీకు సహాయపడతాడు. అలాగే మరలా ఉదయించడానికి అవకాశం ఉన్న అదృష్టంలో నీవూ భాగస్వామివి అవుతావు.


రెండవ సందర్భంలో, ప్రత్యర్థులు ఇరువురూ విజేత గురించి నీవు భయపడనవసరం లేనంతటి బలహీనులైన పక్షంలో, అప్పుడు ఎవరో ఒకరి పక్షం వహించడమనేది మరింత వివేకమనిపించుకుంటుంది. ఎందుకంటే ఆ ఇరువురిలో ఒకరి సహాయంతో మరొకరిని నీవు నాశనం చేస్తావు. నిజానికి అతడు వివేకవంతుడైనట్లైతే తన ప్రత్యర్థిని చేజేతులా నాశనం చేసుకోడు. (నీలాంటి బలవంతుడు పక్కనే ఉండగా) అతడు గెలుపొందినా కూడా నీ దయాదాక్షిణ్యాలమీదే ఆధారపడతాడు. ఎందుకంటే నీ సహాయం లేనిదే అతడు గెలుపొందేవాడేకాదు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. అదేమంటే ఒక రాజు మరొకరిమీద యుద్ధానికి తనకన్నా శక్తివంతుడైన రాజుతో —పైన చెప్పిన విధంగా అవసరం వత్తిడి చేస్తే తప్ప—చేతులు కలపకూడదు. ఎందుకంటే అతడు గెలుపొందితే, నీవు అతడి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడాలి. రాజులెప్పుడూ ఇతరుల దయాదాక్షిణ్యాల మీద సాధ్యమైనంతవరకూ ఆధారపడకూడదు. వెనటియన్స్ మిలన్ రాజుకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌తో చేతులు కలిపారు. తమకు స్వవినాశనాన్ని కొనితెచ్చిన ఈ పొత్తును వారు దాటవేయగలిగి ఉండేవారే. అయితే అలా దాటవేయడం కుదరనపుడు —లొంబార్డీ మీద దాడిచేయడానికి పోప్, స్పెయిన్ తమ సైన్యాలను పంపినపుడు ఫ్లోరెంటైన్స్‌కు ఇటువంటి పరిస్థితే తలయెత్తింది— పై కారణాల వలన రాజు ఎవరో ఒకరి పక్షం వహించవచ్చు,


ఏ ప్రభుత్వం కూడా తాను పూర్తిగా సురక్షితమైన విధానాన్నే ఎంచుకోగలనని ఎన్నడూ భావించకూడదు. తద్విరుద్ధంగా తాను అనుసరించబోయే విధానాలను అది సందేహాస్పదమైనవిగానే భావించాలి. ఎందుకంటే, సాధారణ వ్యవహారాలలో ఏం గమనించవచ్చంటే, మరో కష్టం బారినపడకుండా ఏ ఒక కష్టం నుండి కూడా ఎవరూ తప్పించుకోలేరు. ఈ కష్టాల ఎక్కువ తక్కువలను విచక్షణతో తెలుసుకోవడంలోనూ, ఆ మీదట తక్కువ కష్టాన్ని స్వీకరించడంలోనే వివేకం ఉన్నది. 


రాజనేవాడు ప్రతిభను ప్రేమించే వ్యక్తిగా కనబడాలి. ప్రతికళలోనూ నిష్ణాతులను గౌరవించాలి. అన్నింటికంటే ముఖ్యంగా —ఒకరు తన ఆస్తులు తననుండి లాగివేసుకోబడతాయని భయపడి వాటిని అభివృద్ధిచేయకుండా ఉండటంగానీ, మరొకరు పన్నులకు భయపడి వ్యాపారాన్ని ఆరంభించకుండా ఉండటంగానీ జరగకుండా— తన పౌరులు వాణిజ్యంగానీ, వ్యవసాయంగానీ లేదా ఇతర వ్యాపకాలలలోగానీ తమ అభినివేశాన్ని శాంతియుతంగా అనుసరించేటట్లుగా అతడు ప్రోత్సహించాలి. ఈ పనులను ఎవరు చేసినా లేదా ఏదోఒకవిధంగా తన నగరానికి గానీ లేదా రాజ్యానికి గానీ ఎవరు వన్నె తెచ్చినా అతడు వారికి పురస్కారాలను అందించాలి. 


అంతేకాకుండా, రాజు ఏడాదిలోని తగిన సమయాలలో తన ప్రజలను ఉత్సవాలతోనూ, వినోదాలతోనూ ఉల్లాసపరుస్తూ ఉండాలి. ప్రతినగరం కూడా వివిధ సంఘాలుగా, వర్గాలుగా విభజింపబడి ఉన్నందున అటువంటివాటిని అతడు అభిమానంతో చూస్తూ, అప్పుడప్పుడు వాటి కార్యక్రమాలలో పాల్గొంటూ; సౌజన్యానికీ, ఉదారతకూ తానొక నమూనాగా కనబడాలి. అయినప్పటికీ రాజు తన స్థాయినీ, హుందాతనాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి, ఏ విషయంలోనూ అవి తగ్గటానికి అతడసలు అనుమతించకూడదు.


మాకియవెల్లి-ద ప్రిన్స్: 20 వ అధ్యాయం
(Unedited)

రాజు-రాజ్యం

అధ్యాయం 20:  కోటలు కట్టడం – ఇంకా రాజులు తరచుగా (చేపట్టే చర్యలు) ఆధారపడే కొన్ని ఇతర విషయాలు ప్రయోజనకరమా లేక హానికరమా ?Chapter XX: Are Fortresses, and Many other Things to which Princes often Resort, Advantageous or Hurtful?1. కొందరు రాజులు తమ రాజ్యాన్ని సురక్షితంగా నిలుపుకోడానికి తమ సామంతులకు (తాము జయించిన రాజులకు) సైన్యంలేకుండా చేశారు. మరి కొందరు తాము స్వాధీనం చేసుకున్న పట్టణాలు వివిధ ముఠాలుగా విడిపోయి గందరగోళంలో ఉండేటట్లు చేశారు. మరికొందరు శతృత్వాలను పెంచుకున్నారు. కొందరు తమ పరిపాలన యొక్క ప్రారంభంలో అనుమానితులుగా ఉన్న వారి మద్దతు పొందటానికి ప్రయత్నించారు. కొందరు కోటలు నిర్మించారు, మరికొందరు ఉన్న వాటిని పడగొట్టి, ధ్వంసం చేశారు. ఈ చర్యలన్నింటిలో దేని గురించైనా —అది ఏ రాజ్యంలో అమలు అవుతుందో ఆ రాజ్యం యొక్క ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా— ఎవరూ ఖచ్చితమైన అభిప్రాయం వెలిబుచ్చలేరు; అయినప్పటికీ నేను ఈ విషయం అనుమతించినంతమేర సమగ్రంగా మాట్లాడతాను.


2. ఒక కొత్త రాజు తన అనుచరులను (సామంతులను) సైన్యం లేకుండా (సైన్యరహితులుగా, నిరాయుధులను) చేయడం అనేది ఇంతవరకూ జరగలేదు. అందుకు భిన్నంగా వారు సైన్యం లేకుండా (సైన్యరహితులుగా, నిరాయుధులై) ఉన్నారని గమనించిన ప్రతీసారీ వారిని సైన్యసహితులుగా (సైన్యాన్ని సమకూర్చాడు, సాయుధులుగా) మార్చాడు. ఎందుకంటే ఆవిధంగా ఇవ్వబడిన సైన్యం (ఆయుధాలు) నీ సైన్యం అవుతుంది (ఆయుధాలవుతాయి,) నీవు అనుమానించినవారు విశ్వాసపాత్రులుగా మారతారు, ముందే విశ్వాసపాత్రులుగా ఉన్నవారు అలాగే కొనసాగుతారు, నీ అనుచరులు కాస్తా నీకు బలమైన మద్దతుదారులుగా మారతారు. నీ అనుచరులనందరినీ సైన్యాన్ని సమకూర్చలేకపోయినప్పటికీ (సాయుధులను చేయలేకపోయినప్పటికీ), నీవు సైన్యాన్ని సమకూర్చినవారికి (సాయుధులను చేసినవారికి) లబ్దిని చేకూర్చినట్లైతే మిగిలిన వారిని సులువుగా నియంత్రించగలవు. నీవు సైన్యాన్ని సమకూర్చినవారు (సాయుధులను చేసినవారు) తమకివ్వబడుతున్న ప్రత్యేక గౌరవాన్ని గమనించినమీదట, వారు నీకు కృతజ్ఞతాబద్దులౌతారు, మిగిలినవారు –అధిక ప్రమాదాన్ని ఎదుర్కొనేవారు, అధిక బరువు బాధ్యతలను మోసేవారు అధిక పురస్కారాన్ని పొందవలసిన అవసరం ఉన్నది– అని భావిస్తూ నిన్ను మన్నిస్తారు. అయితే వారిని నీవు సైన్యం లేకుండా (నిరాయుధులను) చేయటం వలన (చేస్తేమాత్రం) వెంటనే వారిలో ఆగ్రహాన్ని కలిగిస్తావు. వారి ధైర్యాన్ని సందేహించి గానీ లేక వారి రాజభక్తిని సందేహించి గానీ నీ అనుచరులను నీవు విశ్వసించడం లేదన్న విషయాన్ని నీవు బయటపెట్టావు కనుక –ఈ రెంటిలో ఎలా భావించినా కూడా– అది వారిలో నీ యెడల ద్వేషానికి కారణమవుతుంది. అంతేకాక సైన్యలేకుండా నీవు కొనసాగలేవు కనుక నీవు తప్పనిసరిగా కిరాయి సైన్యం మీద ఆధారపడవలసి వస్తుంది. వాటి లక్షణమేమిటో నేను ముందే తెలిపాను. ఒకవేళ అవి మంచివైనా కూడా బలవంతులైన శత్రువులనుండి, నమ్మలేని అనుచరులనుండి నిన్ను కాపాడటానికి అవి సరిపోవు. ఈ కారణంగా, నేను ముందే చెప్పినట్లుగా, ఒక కొత్తరాజు తాను కొత్తగా సంపాదించిన రాజ్యానికి సైన్యాన్ని సమకూర్చుతాడు. దీనికి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు.  అయితే ఒక రాజు తాను సంపాదించిన కొత్త రాజ్యాన్ని ఓ ప్రాంతంగా తన పాత రాజ్యంలో కలుపుకున్నపుడు మాత్రం దానిని సంపాదించడంలో తనకు మద్దతుగా నిలచిన వారిని మినహాయించి ఆ రాజ్యంలోని మిగతా అందరికీ సైన్యంలేకుండా చేయడం ఆవశ్యకం. అవకాశం చూసుకొని వారిని సైతం బలహీనులుగా, నిర్వీర్యులుగా మార్చివేయాలి. ఆవిధంగా రాజ్యంలోని సైన్యమంతా నీ పాత రాజ్యానికి చెందిన నీ స్వంత సైనికులుగా ఉండేటట్లుగా వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి.


3. మన పూర్వీకులు, –వారిలో వివేకవంతులుగా పరిగణింపబడినవారు సైతం–, పియోస్టియాను ముఠాకక్షల ద్వారానూ, పీసాను కోటల ద్వారాను నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నది అని తరచూ అనేవారు. ఈ అభిప్రాయంతో వారు తమ సామంత పట్టణాలు కొన్నింటిని మరింత సులువుగా నిలుపుకోవడానికి వాటిలో ఘర్షణలను ప్రోత్సహించేవారు.  ఇటలీలోని వివిధ బలాల మధ్యన కొంతమేర సమతుల్యత ఉండే ఆ రోజులలో ఈ విధానం సత్ఫలితాలను ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. అయితే నేడు దీనిని ఒక ఆచరణాత్మక విధానంగా అంగీకరించవచ్చని నాకు అనిపించడంలేదు. ఎందుకంటే ఆవిధంగా ఏర్పడిన ముఠాల వలన ఎప్పుడైనా మంచి జరుగుతుందని నేను విశ్వసించడంలేదు. పైగా ఆ విధంగా విడిపోయిన నగరాల పైకి బయటి శత్రువు దండెత్తినపుడు అవి వెనువెంటనే చేజారిపోవడం తథ్యం. ఎందుకంటే వాటిలో బలహీనమైన ముఠా ఎల్లప్పుడూ బయటి శత్రువుతో చేతులు కలుపుతుంది, రెండవ ముఠా ఒంటరిగా ప్రతిఘటించలేదు. పైన తెలిపిన కారణాలతో ప్రభావితమయ్యే వెనెటియన్స్ తమ సామంత నగరాలలో గెల్ఫ్, గిబెల్లైన్ ముఠాల మధ్యన కక్షలను ప్రోత్సహించారని నేను విశ్వశిస్తున్నాను. వారు రక్తపాతానికి పాల్పడే పరిస్థితిని ఎప్పుడూ రానీయకపోయినప్పటికీ –పౌరులు తమ ఘర్షణలలో తలమునకలైపోయి తమకు వ్యతిరెకంగా కుట్రకు పాల్పడకుండా ఉంటారని– వారి మధ్యన ఆ విభేదాలను మాత్రం వెనటియన్స్ పెంచి పోషించారు. ఇది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదన్న సంగతిని మనం చూశాం. వైలా వద్ద వారు ఓటమిని పొందిన తరువాత వెంటనే ఒక ముఠా సాహసించి వెనటియన్స్ నుండి మొత్తం రాజ్యాన్ని చేజిక్కించేసుకుంది.  కనుక ఇటువంటి పద్దతులు రాజు లోని బలహీనతను సూచిస్తాయి (చాటుతాయి). ఎందుకంటే ఒక బలమైన రాజ్యంలో ఎప్పుడూ ఇటువంటి ముఠాలు అనుమతించబడవు. అటువంటి పద్దతుల ద్వారా ఎవరైనా తన అనుచరులను నియంత్రించడం సులువు కనుక అవి శాంతి సమయాలలో మాత్రం ఉపయోగపడతాయి, కానీ యుద్ధం సంభవించినపుడు అది ఎంత పొరపాటు విధానమో బయటపడుతుంది.   


4. తాము ఎదుర్కొన్న కష్టాలను, ఆటంకాలను అధిగమించినపుడు రాజులు నిస్సందేహంగా గొప్పవారవుతారు. కనుక విధి, ఒక కొత్తరాజుకు -ఒక వారసత్వపు రాజు కన్నా ఇతనికి ప్రఖ్యాతిని ఆర్జించవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది- గొప్పతనాన్ని ఆపాదించాలని కోరుకున్నపుడు శత్రువులు తలయెత్తి అతడికి వ్యతిరేకంగా పథకాలు రచించేటట్లు చేస్తుంది. ఆవిధంగా వారిని జయించే అవకాశం అతడికి లభించి, వారు ఏర్పాటు చేసిన నిచ్చెన ద్వారానే అతడు ఉన్నతస్థానానికి అధిరోహించగలుగుతాడు  ఈ కారణం వలన ఒక వివేకవంతుడైన రాజు అవకాశం లభించినప్పుడు తనకు వ్యతిరేకంగా కొంత శత్రుత్వం తలయెత్తేటట్లుగా చాకచక్యంతో వ్యవహరించి, దానిని అణచివేయడం ద్వారా తన ఘనతను పెంపొందించుకోవాలని పెక్కురి అభిప్రాయం.


5. రాజులు, మరిముఖ్యంగా కొత్తరాజులు తమ పరిపాలన యొక్క ప్రారంభంలో విశ్వసనీయులుగా ఉన్నవారి కన్నా అనుమానితులుగా ఉన్నవారినుండే తదనంతర కాలంలో ఎక్కువ రాజభక్తిని, సహాయాన్ని పొందారు. సియేనా రాజైన పండొల్ఫో పెట్రూసి (Pandolfo Petrucci, Prince of Siena) తన రాజ్యాన్ని ఇతరుల ద్వారా కన్నా ఒకనాడు తాను అనుమానించిన వ్యక్తులద్వారానే ఎక్కువగా పరిపాలించాడు. అయితే ఈ విషయాన్ని మనం సాధారణీకరించి మాట్లాడలేము, ఎందుకంటే ఇది వ్యక్తిని బట్టి ఎంతగానో మారిపోతుంది. నేను కేవలం ఇది చెబుతాను: ఒక రాజు యొక్క పరిపాలన ఆరంభంలో అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు తాము మనగలగటానికి సహాయం కావలసిన వారైనట్లతే వారిని ఎల్లప్పుడూ గొప్ప సులువుతో రాజు తన పక్షానికి తిప్పుకోవచ్చు. రాజు ఆరంభంలో తమ మీద ఏర్పరచుకున్న దురభిప్రాయాన్ని తమ చేతల (సత్ప్రవర్తన) ద్వారా చెరిపివేయడం తమకెంతో అవసరమని వారికి తెలుసు గనుక వారు రాజును విశ్వాసపాత్రంగా కొలవడనికి మరింత పట్టుదల చూపుతారు. ఆ విధంగా –పూర్తి సురక్షితులుగా ఉండి (తన అవిశ్వాసానికి గురవ్వకుండా ఉండి) తనను కొలుస్తూ, తన ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసే వారి వద్దనుండి కంటే– వీరి వద్దనుండి రాజు ఎల్లప్పుడూ అధిక లాబాన్ని రాబట్టుకుంటాడు. ఒక కొత్త రాజ్యాన్ని దాని పౌరుల రహస్య సహాయం ద్వారా పొందిన ఒక రాజు తనకు సహాయం చేసినవారు ఆ విధంగా చేయడానికి వారిని ఏ కారణాలు ప్రేరేపించినవో తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలించాలని అతడిని హెచ్చరించడం అవసరం కనుక దానిని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలివేయను. అది తన యెడల వారికి గల సహజసిద్ధమైన ఆదరాభిమానాలు కాక, కేవలం తమ ప్రభుత్వం యెడల ఉన్న అసంతృప్తి మాత్రమే అయినట్లైతే అప్పుడు వారి స్నేహాన్ని అతడు ఎంతో ప్రయాస మీద, కష్టం మీద మాత్రమే కాపాడుకోగలుగుతాడు; ఎందుకంటే వారిని సంతృప్తి పరవడం అతనికి సాధ్యం కాదు కనుక. ప్రాచీన మరియు నేటికాలపు వ్యవహారలనుండి తీసుకున్న ఉదాహరణలలో ఇందుకు గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, –పూర్వపు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉంటూ తనకు సానుకూలంగా వ్యవహరించి దానిని కబళించడానికి తనను ప్రోత్సహించిన వారి కన్నా– పూర్వపు ప్రభుత్వం క్రింద సంతృప్తితో ఉండి, ఆ కారణంగా తనకు శత్రువులైనవారిని మిత్రులుగా చేసుకోవడం ఒక రాజుకు సులభతరం అని మనం తెలుసుకుంటాము.


6. తమకు వ్యతిరేకంగా పథకాలు రచించేవారికి ముకుతాడుగానూ, ఏదైనా హఠాత్తు దాడి జరిగినపుడు తలదాచుకొనే ప్రదేశంగానూ ఉపయోగపడగల కోటలను నిర్మించి, తద్వారా తమ రాజ్యాలను మరింత సురక్షితంగా కాపాడుకోవడం అనేది రాజులకు ఒక రివాజు. ఈ పద్దతిని నేను ప్రశంసిస్తాను, ఎందుకంటే ఇది గతంలో ఉపయోగపడింది. అయినప్పటికీ, మన కాలంలో మెస్సెర్ నికోలో విటెల్లి (Messer Nicolo Vitelli) సిట్టా డి కాస్టెల్లో (Città di Castello) పట్టణాన్ని సంరక్షించుకోవడం కొరకు ఆ పట్టణంలోగల రెండు కోటలను పడగొట్టడం మనం చూశాం. అర్బినో రాజ్యానికి డ్యూక్ అయిన గిడో ఉబాల్డో (Guido Ubaldo, Duke of Urbino) తన రాజ్యం నుండి సీజర్ బోర్గియాచే తరిమివేయబడి మరలా తిరిగి వచ్చిన మీదట ఆ రాజ్యంలోని కోటలన్నింటినీ పునాదులతో సహా నాశనం చేశాడు. ఎందుకంటే అవి లేనట్లైతే తన రాజ్యం మరలా చేజారడం చాలా కష్టం అని అతడు భావించాడు. బొలోగ్నాకు తిరిగీ వచ్చిన మీదట బెంటివోగ్లి ఇటువంటి నిర్ణయానికే వచ్చారు. కనుక, కోటలు ఉపయోగకరమా కాదా అన్నది పరిస్థితులను బట్టి ఉంటుంది, అవి నీకు ఒక విధంగా మంచిని చేస్తే, మరో విధంగా హాని చేస్తాయి. ఈ అంశాన్ని ఈ విధంగా వివరించవచ్చు: విదేశీయుల (శత్రురాజుల) వలన కన్నా తన స్వంత ప్రజల (సామంతులు) వలనే ఎక్కువ భయం ఉన్న రాజు కోటలను నిర్మించాలి, ప్రజల వలన కన్నా విదేశీయులవలనే ఎక్కువ భయం ఉన్న రాజు వాటి జోలికి పోకూడదు. ఫ్రాన్సెస్కో స్ఫోర్జా (Francesco Sforza) చే నిర్మించబడిన మిలన్ కోట (castle of Milan) స్ఫోర్జా కుటుంబానికి రాజ్యంలోని మరే ఇతర కల్లోలం కన్నా కూడా ఎక్కువ సంకటాన్ని కలిగించింది, ఇంకా కలిగిస్తుంది. ఈ కారణంగా ప్రజలచే (అనుయాయులచే, సామంతులచే) ద్వేషింపబడకుండా ఉండటమే నీవు నిర్మించుకోగలిగిన ఉత్తమమైన కోట. నీవు కోటలను కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు నిన్ను ద్వేషించినట్లైతే అవి నిన్ను రక్షించలేవు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఆయుధాలు చేబట్టిన ప్రజలకు సహాయమందించే విదేశీయులకు ఎప్పుడూ కొరత ఉండదు. ఒక్క ఫోర్లి దొరసాని (Countess of Forli) విషయంలో తప్ప మన కాలంలో అటువంటి కోటలు ఏ ఒక్క రాజుకైనా ఉపయోగ పడ్డట్లుగా కనబడలేదు. ఆమె భర్త అయిన గిరొలామో (Count Girolamo) హత్యగావింపబడినప్పుడు ఆమె కోట మూలంగానే ప్రజల తిరుగుబాటును తట్టుకుని నిలబడి, మిలన్ నుండి సహాయం అందేవరకూ వేచి ఉండి, -విదేశీయులెవ్వరూ ప్రజలకు సహాయమందించగలిగే విధంగా నాటి పరిస్థితులు లేకపోవడంతో– తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగింది. అయితే తదనాంతర కాలంలో, సీజర్ బోర్గియా ఆమెపై దాడి చేసినప్పుడు మరియు ప్రజలు –ఆమె శత్రువులు– విదేశీయులతో చేతులు కలిపినప్పుడు కోటలు ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీనినిబట్టి ఇప్పుడు, ఇంతకు ముందు కూడా కోటలను కలిగి ఉండటం కన్నా ప్రజలచే ద్వేషింపబడకుండా ఉండటమే ఆమెకు క్షేమమై ఉండేది. ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట కోటలు కట్టినవానినీ, కట్టకుండా ఉన్నవానిని కూడా నేను ప్రశంసిస్తాను. అలాగే, కోటలను నమ్ముకుని ప్రజాలచే ద్వేషింపబడటాన్ని ఎవరు నిర్లక్ష్యం చేసినా, వారిని నేను నిందిస్తాను.