8, డిసెంబర్ 2008, సోమవారం

వ్యాఖ్యలకు జవాబులు…I

బ్లాగ్మితృలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతకాలంగా వేరేపనులలో పడిపోయి అప్పుడప్పుడూ కూడలిలో బ్లాగులు చూడటమేతప్ప వాటిలో కామెంట్లు గానీ, నా బ్లాగులో టపాలుగానీ రాయడంలేదు. అయితే చదువరిగారి ‘మన భద్రతే మనకు ముఖ్యం’ చదివిన తరువాత కామెంట్ చేయకుండా ఉండలేకపోయాను. ఈ విధంగా నేను తిరిగి బ్లాగ్లోకంలోకి వచ్చిన సమయంలోనే సీతారాం రెడ్డి గారు నా బ్లాగులో ముచ్చటగా మూడు బాణాలవలే మూడు విమర్శనాత్మకమైన వ్యాఖ్యలను సంధించడం జరిగినది.

బోర్‌కొట్టే నా సీరియస్ సబ్జెక్ట్‌కు వ్యాఖ్యలులేక కొన్నాళ్ళుగా నేను -తరచూ కొత్త వ్యాఖ్యలేమైనా వచ్చాయా లేదా అని చూసుకోవటం, ఒకవేళ వస్తే వాటిలో కొన్నింటికైనా సమాధానాలివ్వటం, వివాదాలు మొదలవ్వటం.. తిరిగి వ్యాఖ్యలకూ, ప్రతివ్యాఖ్యలకూ పాల్పడటం, డిస్ట్రబ్ అవటం- ఇలాంటి బాధలేవీలేకుండా హాయిగా ఉన్నాను. :). అయితే సీతారాంగారి పదునైన వ్యాఖ్యలతో ఇప్పుడు వాటికి ప్రతిస్పందించక తప్పడంలేదు. వాటికి సమాధానం చాలా పెద్దది గనుక కామెంట్‌గా కన్నా టపా రూపంలో అందిస్తే బావుంటుంది అనుకున్నాను. అందుకే ఈ టపా రాస్తున్నాను.. అది కూడా రెండు భాగాలుగా.


సీతారాం రెడ్డిగారూ,

ముందుగా మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు! అభినందనలకు ధన్యవాదాలు!

నేను ‘భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!’ అనే టైటిల్‌తో రాస్తున్న వ్యాసావళిలో ఇప్పటివరకూ 28 భాగాలను రాశాను. ఇది మొత్తం మూడు అధ్యాయాల చిరుగ్రంథం. ఇంకొక టపాతో (అంటే 29వ భాగంతో) రెండవ అధ్యాయం పూర్తవుతుంది. ఆ తరువాత 3వ అధ్యాయం రాయవలసి ఉన్నది. వాటిని కూడా వీలును బట్టి త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.

ఇక మీరు చేసిన విమర్శల సంగతి చూద్దాం.


‘మానవ జీవితాన్ని నేరుగా తాకి స్పందిస్తున్నట్లుగా లేదు’ అన్నారు.

ఈ వ్యాసావళిలోని ఇప్పటివరకూ రాసిన భాగాలను మొదటి నుండి అన్నింటినీ మరి మీరు చదివారో?!..లేదో!! నేను ఈ వ్యాసాలలోని మొదటి అధ్యాయమంతా అంటే 16వ భాగం వరకూ ప్రపంచ ప్రజల రాజకీయ, సామాజిక చారిత్రక క్రమాన్ని విశ్లేషించడానికే కేటాయించాను. (ఆ క్రమం వెనుక ఉన్న తాత్త్విక నేపథ్యాన్ని వివరించడానికి రెండవ అధ్యాయాన్ని కేటాయించాను. ఆ తాత్త్వికతననుసరించి చరిత్ర క్రమాన్ని ఏ విధంగా భవిష్యత్తులోకి పురోగమింపచేయాలో మూడవ అధ్యాయంలో చర్చిద్దామనుకుంటున్నాను) మరి అదంతా మానవ జీవితాన్ని తాకుతున్నట్లుగా మీకు అనిపించలేదా?!


‘తాజాదనం కానరావడంలేదు’ అని అన్నారు.

తాజాదనం అంటే సమకాలీన సంఘటనలను పేర్కొనలేదనా మీ ఉద్దేశ్యం. ఈ రచన చాలా విస్తారమైన విషయాన్ని బాగా కుదించి అతిసంగ్రహంగా చెబుతున్న స్థూలమైన రచన. కేవలం మౌలిక భావనలకే పరిమితమైన రచన. ఇటువంటి సంగ్రహ మరియు మౌలిక రచనలో సమకాలీన సంఘటనలనుపేర్కొనడంగానీ, వాటిని సవివరంగా రాయడంగానీ కుదిరే పనికాదు.


‘ఈ శ్లోకాలు వగైరాలు అంతా చాదస్తంలాగా కనపడుతున్నది.’ అని అన్నారు.

ఆ శ్లోకాలన్నీ భగవద్గీతలోనివని మీరు గమనించే ఉంటారు. చాదస్తపు ముసలమ్మలు, మూఢ భక్తులు మొదలైనవారి చేతిలో పారాయణ గ్రంథంగా కనబడే ఆ భగవద్గీతే ప్రపంచ ప్రసిద్ధ తత్త్వవేత్తల చేత (ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తతోసహా) మహా తాత్త్విక గ్రంథంగా, భారతీయ తత్త్వశాస్త్ర సారంగా కొనియాడబడింది. కాకలు తీరిన కమ్యూనిస్టులు, మహా మహా హేతువాదులు, కరుడు గట్టిన నాస్తికులు సైతం గీతను సర్వోన్నత తాత్త్విక గ్రంథంగా అంగీకరించారు. గీతను మరి మీరు ఏ దృష్టితో చూస్తారో మీరే నిర్ణయించుకోండి.


యజ్ఞం’, ‘కర్మ’ ఇవన్నీ అవసరమా?! అని అన్నారు.

బహుశా మీకు తత్త్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అంతగా తెలిసినట్లులేదు. అన్ని శాస్త్రాలకు, మనిషి సాధించిన సమస్త విజ్ఞానానికి, సమస్త మానవ ఆలోచనలకు, మానవుడు రూపొందించే అన్ని సిద్ధాంతాలకు పునాది తత్త్వశాస్త్రమే. ఇవి అన్నీ కూడా తమ మూలాలను తత్త్వశాస్త్రంలోనే కలిగి ఉంటాయి. అటువంటి తత్త్వశాస్త్రంలో ‘భారతీయ తత్త్వశాస్త్రం’ అత్యంత విశిష్టమైనది. దానిలో ‘యజ్ఞం’, ‘కర్మ’ అనేవి చాలా కీలకమైన భావనలు. అవి చర్చించబడకుండా భారతీయ తత్త్వశాస్త్రమే లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థలకు పాశ్చాత్య తత్త్వశాస్త్రం పునాదిగా ఉన్నది. లాక్, హ్యూం, రూసో లాంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రాతిపదికన ప్రజాస్వామ్య, కాపిటలిస్టు వ్యవస్థలు పెంపొందాయి. హెగెల్, మార్క్స్ వంటి తత్త్వవేత్తల సిద్ధాంతాల ప్రాతిపదికన కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యవస్థలు నిర్మింపబడ్డాయి. ఇప్పుడివన్నీ స్పష్టంగా విఫలంచెందాయి. ఈ వ్యవస్థలన్నీ మానవుడిని అనేక రకాల బాధలకు గురిచేశాయి. పైన పేర్కొన్న తత్త్వవేత్తలంతా చతికిలబడ్డారు. మరి అటువంటి దోషభూయిష్టమైన తాత్త్విక మూలాలను మార్చకుండా మనం మన రాజకీయ వ్యవస్థలో, మన సామాజిక పరిస్థితులలో ఏ విధంగా మార్పును కోరగలం.. ఏ విధంగా దానిని సాధించగలం.

నిజమైన మార్పు కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులకు తాత్త్విక మూలాలు ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టుకుని, వాటిని తొలగించి, అక్కడ సరియైన, సరికొత్త తాత్త్విక బీజాలను నాటాలి. అప్పుడు మాత్రమే వస్తుంది అసలైన మార్పు..కావలసిన మార్పు. అంతేకానీ ఆ తాత్త్విక సిద్ధాంతాలను అసలు గుర్తించనైనా గుర్తించకుండా, వాటిని అధ్యయనం చేయకుండా, వాటిలోని దోషాన్ని గ్రహించి దానిని మార్చకుండా అలానే వదిలేసి పైపై పరిస్థితులలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తే ఆ మార్పులు ఏ మాత్రం ప్రభావం చూపజాలవు.

ఎప్పుడు తత్త్వం మారుతుందో అప్పుడు సమస్తం మారుతుంది. మరి ఇప్పుడు భారతీయ తాత్త్విక చింతన తప్ప ఈ ప్రపంచానికి వెలుగు చూపగలిగే తత్త్వశాస్త్రం మరోటిలేదు…(మిగతా జవాబులు రెండవ భాగంలో)

2 వ్యాఖ్యలు:

 1. సరస్వతీ కుమార్ గారూ
  మీ ప్రతిస్పందనని చదివాను.
  మీరు కోరినట్లుగా మళ్ళీ ఒక్కసారి కర్మ స్వరూపం చదువుతాను.
  మీరు రాసిన 16వ భాగం వరకూ నాబోటి మామూలు పాఠకులు అర్ధం చేసుకొనే స్థాయిలోనే ఉన్నాయి. చాలావిషయాన్ని సంగ్రహంగా చెప్పారు. ఆ విషయాలు తెలుసుకొనే వాళ్ళకు నిజంగా ఉపయుక్తంగా ఉన్నాయి. భగవద్గీత మీద నాకూ భక్తిప్రపత్తులు ఉన్నాయి.

  ఈ జ్ఞానం ఫోల్డెడ్ ఫిలాసఫీ అని మీరు చెప్పారు. దాన్ని అన్ ఫోల్డ్ చేయండి చదువుతాము, అర్ధం చేసుకొంటాము. మీరు ఆ పనిలోనే ఉన్నట్లుగా భావిస్తున్నాను. అయితే మీరు కూడా అలా అన్ ఫోల్డ్ గానే చెబుతున్నారేమోనని శ్లోకాల ఉటంకింపువలన అనుకోవలసి వస్తుంది. మొదటి 16 భాగాలు చదివిన నాకు ఒకే సారి బ్రేక్ పడ్డట్లయింది. నేను మామూలు పాఠకుణ్ణి. మీరు రాసేదంతా అర్ధం చేసుకోవాలన్న తపన ఉన్నవాణ్ణి. మరి మాకొరకైనా మీరు మేము ఆశించిన శైలిలో రాయాలని అడుగుతున్నాను.

  మీరు రాసిన విషయం విలువైనది. దానిలో తెలుసుకొనేది చాలాఉంది. అందులో సందేహం లేదు. సామజిక స్పృహ ఉన్న అందరూ చదవాలి. మీరురాసిన శైలి ( ఈ పదము సరియైనదో కాదో ) లో రాస్తే దాని భావం నిర్దేశిత పాఠకులకు చేరదేమోనని నా భయం.

  సాధారణంగా అభ్యుదయ వాదులకు, మనదేశంలో అణగారిన, వెలివేయబడ్డ వర్గాలకు, ఒకప్పుడు సంస్కృతం చదువకూడదని నిషేధించబడ్డ వర్గాలకు దాని పట్ల ఒక ఎవర్షన్ ఉంటుంది. (నాకేమీ లేదు. ప్రొద్దుటే ఘంటసాల భగవద్గీత, వేదిక్ చాంటింగ్ వింటాను. వాటి సంగీత స్వరాలు నాకిష్టం )

  భారతీయ ప్రాచీన దర్శనంలో మార్మికత ఉంది. దానితో దాన్ని వ్యాఖ్యానించేవారి దృక్పధమే బయటకొస్తుంది కానీ అది బయటకు రాదు. అనుకూల వాఖ్యలు చేసే వాళ్ళే ఎక్కువ మంది. అందుకే ఆ మార్మికత లేకుండా రాయండి.

  యజ్ఞం శబ్దం మమూలు చదువులు చదివిన నాబోటి గాళ్ళకు అశాస్త్రీయంగా ధ్వనిస్తుంది. దానికేమి పరిష్కారం? అది నా సమస్యా? అందరి సమస్యా?

  దాన్ని మంచి ఫలితం కొరకు, ఉమ్మడి సంక్షేమం కొరకు చేసే సామాజిక కార్యక్రమం అని రాస్తే ఎలాంటి అనుమానాలు ఉండవు.

  నాది మిడిమిడి జ్ఞానమని మీకు అనిపించినా ఫర్వాలేదు. తెలుసుకోవాలన్న తృష్ణ ఉంది. దానికి మీ శైలి కష్టంగా ఉంది. అందుకే సరళంగా రాయమనేది.

  ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సీతారాం రెడ్డి గారూ!

  మీ శ్రద్ధ అభినందనీయం. మీకు ఈ విషయం మీద పూర్తి అవగాహన వచ్చేంతవరకూ నన్ను వ్యాఖ్యల ద్వారా నిస్సంకోచంగా సంప్రదించవచ్చు. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దానిని నా ధోరణిలో, నాకు తోచినట్లుగా, ఒకానొక పద్దతిలో చెప్పివేశాను. ఇక మీలాంటి వారి స్పందన ద్వారా వ్యక్తీకరణలో ఏమైనా మార్పులు చేయవలసి వస్తే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను.

  గీత యెడల మీకూ భక్తి ప్రపత్తులు ఉన్నాయని చెప్పారు. నాకూ ఉన్నాయి. కానీ అది నాకు సెకండరీ. నేను గీతను ప్రధానంగా భక్తి దృష్టితో గాక కేవలం ఒక తాత్త్విక గ్రంథంగానే చూస్తాను. కార్ల్ మార్క్స్ రచనలను, గీతను నేను సమభావంతోనే అధ్యయనం చేశాను. అలానే మీరు కూడా గీత మీద భక్తి మాట ఎలా ఉన్నా దానిని తాత్త్విక దృష్టితో చూడటానికి ప్రయత్నించండి.

  ఇక శ్లోకాల ఉటంకింపు అనేది నేను చెప్పే విషయానికి ప్రామాణికత కొరకు చేశాను. నేను చెప్పే విషయానికి ఋజువు కొరకు చేశాను. నేను నా తాత్త్విక భావాలను గీత చదవటం ద్వారానే ఏర్పరచుకున్నాను. నేను ఏ శ్లోకాల ద్వారా ఆయా నిర్ధారణలన్నీ చేశానో ఆ శ్లోకాలనే ఉటంకించాను. అదంతా నా స్వకపోల కల్పితం కాదని మన ప్రాచీన తత్త్వశాస్త్రంలోనే ఉన్నదని తెలియజేయడానికే ఆ శ్లోకాలన్నింటినీ ఉటంకించాను.

  భారతీయ తాత్త్వికతను అన్ ఫోల్డ్ చేయడానికే నా ప్రయత్నం. దాని యొక్క మార్మికతను ఛేదించడమే నా ఉద్దేశ్యం. అంతేకానీ నా రచన ద్వారా మరింత మార్మికత, మరింత గందరగోళం సృష్టించడం నా ఉద్దేశ్యం కాదు.

  ‘యజ్ఞం’ అనే పదం వాడుక గురించి: నేను ముందు ముందు ఈ మాట స్థానంలో ‘సింథసిస్’ అనే పదం వాడతాను. ఆ మాటను ఇప్పటికే పరిచయం చేశాను కూడా. అయితే ఇది గీతను విశ్లేషించే రచన కనుక ఈ రచన వరకు గీతలో వాడిన పదాలను వాడక తప్పదు.

  నేను రాసిన వ్యాసాలలో మొదటి అధ్యాయం అంటే 16వ భాగం వరకూ అర్థమైనంత వేగంగా రెండవ అధ్యాయం ఖచ్చితంగా అర్థంకాదు. దీనికి కొంచెం నెమ్మది అవసరం. అంతేకానీ పఠనకు బ్రేక్ పడేంత సంక్లిష్టత మాత్రం దానిలో ఏమీ లేదు. నెమ్మదిగా ఒక్కో అంశం మళ్ళీ మళ్ళీ చదివి అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళండి.

  అయినా కూడా మీరు ఇంతగా అడుగు తున్నారు కాబట్టి శ్లోకాలు లేకుండా, తాత్త్విక పరిభాష లేకుండా అదే విషయాన్ని మరలా తేలిక భాషలో కొంచెం బ్రీఫ్ గా రాయడానికి ప్రయత్నిస్తాను.

  మీ తృష్ణకు, తపనకు మరోసారి అభినందనలు!

  ప్రత్యుత్తరంతొలగించు