22, ఫిబ్రవరి 2012, బుధవారం

సన్-జు 'యుద్ధకళ': 13వ అధ్యాయం





యుద్ధకళ



13వ అధ్యాయం: గూఢచారులు








సన్జు చెప్పాడు:

1) లక్షమంది సైనికులున్న సైన్యాన్ని పెంపొందించి, దానిని మిక్కిలి దూరాలు నడిపించడం అనేది ప్రజలు భారీగా నష్టపోవడానికీ, సామ్రాజ్య వనరులు వృధా అయిపోవడానికీ దారితీస్తుంది. రోజుకి వేయి ఔన్సుల వెండి ఖర్చవుతుంది. ఇంటా, బయటా కూడా అలజడి బయలుదేరుతుంది. సైనికులు రహదారులలో అలసిపోయి కూలబడిపోతారు. ఏడు లక్షల కుటుంబాలు చేసే పనికి అంతరాయం కలుగుతుంది.

(ప్రాచీన చైనాలో ఎనిమిదేసి కుటుంబాలు కలసి కొంత పొలాన్ని ఉమ్మడిగా సాగు చేస్తుంటాయి. ఆ ఎనిమిదింటిలో ఒక కుటుంబం లోని పనిచేసే వ్యక్తి అవసరమైనపుడు యుద్ధంలో పాల్గొనాలి. ఆసమయంలో ఆ కుటుంబం యొక్క పోషణా భారాన్ని మిగతా ఏడు కుటుంబాలు వహిస్తాయి. ఆ విధంగా లక్ష మంది యుద్ధానికి వెళితే అది ఏడు లక్షల కుటుంబాలకు భారంగా పరిణమిస్తుంది.)

2) ఒకేఒక రోజులో నిర్ణయించబడే విజయం కొరకు పోరాడుతూ ఇరుసైన్యాలూ సంవత్సరాల తరబడి ఒకదానినొకటి ఎదుర్కొంటాయి. అటువంటపుడు నజరానాలు, జీతభత్యాల రూపంలో కేవలం ఒక వంద ఔన్సుల వెండిని ఖర్చుచేయడానికి అనిష్టత చూపడం దానివలన శత్రువు పరిస్థితి గురించి ఏమీ తెలియకుండా ఉండిపోవడంఅనేది మొరటుతనానికి పరాకాష్ట.

3) ఆ విధంగా ప్రవర్తించేవాడు సైనికులకు నాయకుడు కాలేడు, తన ప్రభువుకు తక్షణ సహాయాన్ని అందించలేడు, విజయాన్ని నియంత్రించలేడు.

4) ఆ విధంగా, ఒక వివేకవంతుడైన సార్వభౌముడూ, ఒక మంచి సేనానీ దాడిచేసి, విజయం సాధించి, సామాన్యులకు సాధ్యం కాని వాటిని సాధించేటట్లుగా చేసేది ఏమిటంటేఅది ముందస్తు సమాచారం.

5) ఈ ముందస్తు సమాచారాన్ని ప్రేతాత్మలనుండి పొందలేము; గతానుభవాలను బేరీజు వేయడం వలన పొందలేము; ఎటువంటి తార్కికమైన గణింపు ద్వారా కూడా పొందలేము.

6) శత్రు పథకాలను గురించిన సమాచారాన్ని కేవలం ఇతర వ్యక్తుల నుండి మాత్రమే పొందగలం.

7) కనుకనే గూఢచారులను ఉపయోగించాలి. ఈ గూఢచారులు ఐదు రకాలుగా ఉంటారు:

1) స్థానిక గూఢచారులు;

2) అంతర్గత గూఢచారులు;

3) మార్చబడిన గూఢచారులు;

4) దురదృష్ట గూఢచారులు;

5) బ్రతికిపోయిన గూఢచారులు.

8) ఈ ఐదు రకాలైన గూఢచారులు అందరూ పని చేస్తున్నపుడు, ఆ రహస్య వ్యవస్థను ఎవరూ కనిపెట్టలేరు. దీనిని దైవికమైన చాకచక్యంగా పిలుస్తారు. ఇది సార్వభౌముడి అతి విలువైన విభాగం.

9) స్థానిక గూఢచారులను కలిగి ఉండటం అంటే శత్రుదేశపు పౌరులను గూఢచారులుగా నియోగించడం.

10) అంతర్గత గూఢచారులను కలిగి ఉండటం అంటే శత్రువుకు చెందిన అధికారులను గూఢచారులుగా ఉపయోగించుకోవడం.

11) మార్చబడిన గూఢచారులను కలిగి ఉండటం అంటే, శత్రు గూఢచారులను పట్టుకుని, వారిని మన గూఢచారులుగా వినియోగించడం.

12) దురదృష్ట గూఢచారులను కలిగి ఉండటం అంటే, మన గూఢచారులకే తప్పుడు సమాచారం అందించి అది శత్రువుకు చేరేటట్లు చూడటం.

(కావాలని కొన్ని పనులను బహిరంగంగా చేసి, వాటి గురించి మన గూఢచారులు తెలుసుకొనే వీలు కల్పించాలి. శత్రువుకు వారు పట్టుబడినపుడు, అతడు వారినుండి ఆ సమాచారాన్ని రాబట్టి, తదుపరి వారిని మట్టుబెడతాడు. ఆనక ఆ మోసపూరితమైన సమాచారం ప్రకారంగానే అతడు కార్యరంగంలోకి దూకుతాడు. స్వంతరాజు చేత మోసగింపబడి, శత్రురాజు చేతిలో మరణిస్తారు కనుక వీరు దురదృష్ట గూఢచారులు.)

13) బ్రతికిపోయిన గూఢచారులంటే శత్రుశిబిరం నుండి సమాచారం గ్రహించి, తిరిగి వచ్చేవారు.

(శత్రువు చేతికిచిక్కి, మరణించకుండా మరలా తిరిగి వచ్చారు కనుక వీరు బ్రతికిపోయిన గూఢచారులు.)

14) కనుక సైన్యం మొత్తంలో గూఢచారులతో కన్నా మరింత ఎక్కువగా మనం సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటానికి మరెవరూలేరు. వీరి కన్నా ఎక్కువ ఉదారంగా మరెవరికీ బహుమతులీయకూడదు. మరే ఇతర వ్యవహారంలోనూ ఇంతకన్నా ఎక్కువ రహస్యాన్ని పాటించకూడదు.

15) ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలిగేంతటి ప్రతిభావిశేషాలు లేకుండా గూఢచారులను ఉపయోగకరంగా నియోగించడం సాధ్యం కాదు.

(వాస్తవానికీ, భ్రమకూ; నిజాయితీకి, కపటత్వానికీ తేడా తెలుసుకోగలిగి ఉండాలి)

16) ఉదారత, నిజాయితి లేకుండా వారిని తగినవిధంగా నిర్వహించడం సాధ్య కాదు.

(వారికి ఇవ్వజూపిన మొత్తాన్ని ఉదారంగా, నిజాయితీగా ఇచ్చివేయాలి. అప్పుడు వారు నీకొరకు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తారు.)

17) సూక్ష్మగ్రాహ్యత లేకుండా వారి నివేదికలలోని నిజాన్ని నిగ్గుదేల్చలేము.

(వారు శత్రువు తరపున పనిచేసే అవకాశం ఉన్న విషయాన్ని నీవు దృష్టిలో ఉంచుకోవాలి)

18) దుర్గ్రాహ్యంగా ఉండు! అంతుచిక్కకుండా ఉండు! నీ గూఢచారులను అన్ని రకాల వ్యవహారాలలో నియోగించు!

19) ఒకానొక రహస్య సమాచారాన్ని గూఢాచారి ముందే బట్టబయలు చేస్తే అతడిని, ఆ రహస్యం చెప్పబడిన వ్యక్తితో కలిపి మరణ దండనకు గురిచేయాలి.

20) ఒక సైన్యాన్ని చిత్తుచేయాలన్నా, ఓ నగరం మీద విజయవంతంగా దాడిచేయాలన్నా, లేక ఓ వ్యక్తిని హత్య చేయాలన్నా లక్ష్యమేదైనా సరే సంబంధిత సేవకులు, సహాయకులు, ద్వారపాలకులు, సేనాని గస్తీ సైనికులు వీరందరి పేర్లను తెలుసుకోవడంతో పనిని ప్రారంభించడం ఎల్లప్పుడూ అవసరం. ఈ పేర్లను నిర్ధారించే పనిని  మన గూఢచారులకు తప్పనిసరిగా అప్పగించాలి.

(లంచాలద్వారా వీరిలో కొందరిని మనకు అనుకూలురుగా మార్చుకోవచ్చు)

21) మన మీద గూఢచర్యం చేయడానికి వచ్చిన శత్రు గూఢచారులను కనిపెట్టి, బంధించి లంచాలు ఇవ్వజూపడం ద్వారా, మంచి వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారావారిని లోబరచుకోవాలి. ఆ విధంగా వారు మార్చబడిన గూఢచారులుగా రూపొంది మన సేవకు వినియోగపడతారు.

22) మార్చబడిన గూఢచారి అందించిన సమాచారం ద్వారానే మనం స్థానిక గూఢచారులను, అంతర్గత గూఢచారులను సంపాదించటం గానీ, వారిని మన సేవలో నియోగించడం గానీ సాధ్యమౌతుంది.

(తన దేశ పౌరులలో దురాశాపరులెవరో, తన దేశ అధికారులలో అవినీతిపరులెవరో అతడికి తెలుసు)

23) అతడందించిన సమాచారం మూలంగానే మనం దురదృష్ట గూఢచారి ద్వారా శత్రువుకు తప్పుడు సమాచారం చేరవేయగలం.

(తనవారిని ఏ విధంగా మోసం చేయవచ్చో మార్చబడిన గూఢచారికి తెలుసు)

24) అతడిచ్చిన సమాచారం ద్వారానే మనం బ్రతికిపోయిన గూఢచారులను నిర్దిష్టసమయాలలో వినియోగించుకోగలం.

25) మొత్తం ఈ ఐదురకాల గూఢచర్య విధానాల ఉద్దేశ్యం, లక్ష్యం శత్రువు గురించిన సమాచారమే. మనం మొట్టమొదటగా ఈ సమాచారాన్ని మార్చబడిన గూఢచారి నుండి మాత్రమే రాబట్టగలం. కనుక అతడితో ఎంతో ఆదరంగా వ్యవహరించడం చాలా అవసరం.

26) గతంలో యిన్రాజవంశ ప్రాభవానికి కారణం సియారాజ్య ఉద్యోగి అయిన ఇఛి’. అలాగే చౌరాజవంశ ప్రాభవానికి కారణం యిన్రాజ్య ఉద్యోగి అయిన లుయా’.

27) కనుక, కేవలం ప్రాజ్ఞుడైన పాలకుడూ, వివేకవంతుడైన సేనానీ మాత్రమే సైన్యంలోని ప్రతిభావంతులను గూఢచర్యం కొరకు వినియోగించుకొని అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. యుద్ధంలో గూఢచారులు అతి ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఒక సైన్యం కదలగలగటం అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది.




(సన్-జు 'ద ఆర్ట్ ఆఫ్ వార్' సమాప్తం)





[యుద్ధాన్ని దాటవేయకు. నీవు అలా చేయాలనుకుంటే అది కేవలం వాయిదా మాత్రమే వేయబడుతుంది. అది కూడా నష్టదాయకంగా మాత్రమే ముగుస్తుంది.
--మాకియవెల్లి]   




20, ఫిబ్రవరి 2012, సోమవారం

సన్-జు 'యుద్ధకళ': 12వ అధ్యాయం





యుద్ధకళ



12వ అధ్యాయం: నిప్పుతో దాడి








సన్జు చెప్పాడు:

1) నిప్పుతో దాడిచేయడానికి ఐదురకాల పద్దతులున్నాయి.

మొదటిది సైనికులను వారి శిబిరంలోనే తగులబెట్టడం;

రెండవది నిల్వలను తగులబెట్టడం;

మూడవది సైన్యం వ్యక్తిగత సామానులు తీసుకువస్తున్న వాహనాలను తగులబెట్టడం;

నాల్గవది వారి ఆయుధాగారాలకు నిప్పుబెట్టడం;

ఐదవది శత్రువు మధ్యలోకి అగ్నిజ్వాలలను విసిరివేయడం.    

2) ఒక దాడిని నిర్వహించాలంటే దానికి కావలసిన సాధనాలను మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. నిప్పు రాజెయ్యడానికి కావలసిన సామాగ్రిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.

3) నిప్పుతో దాడిచేయడానికి తగిన కాలం ఉంటుంది. అలాగే దహనకాండను ప్రారంభించడానికి ప్రత్యేక దినాలు ఉంటాయి.

4) తగినకాలం అంటే వాతావరణం బాగా పొడిగా ఉన్న సమయం; ప్రత్యేక దినాలు అంటే చాంద్రమాసంలోని 7, 14, 21, 28వ రోజులు. ఎందుకంటే ఈ నాలుగు రోజులలో గాలి బాగా వీస్తుంది.

5) నిప్పుతో దాడి చేసేవారు ఐదురకాల సంభావ్య పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి:

6) (1) శత్రుశిబిరం లోపల మంటలు చెలరేగగానే, నీవు వెనువెంటనే వెలుపలి నుండి దాడిచేయి.

7) (2) అక్కడ మంటలు చెలరేగినా కూడా శత్రు సైనికులు ప్రశాంతంగానే ఉంటే సదవకాశం కోసం వేచి చూడు, దాడి చేయకు.

8) (3) అగ్నిజ్వాలలు క్రమంగా పెరిగి ఉవ్వెత్తున ఎగసిన సమయంలో సాధ్యపడితే దాడిచేయి, సాధ్యం కాకపోతే ఉన్నచోటునుండి కదలకు.

9) (4) శత్రుశిబిరం వెలుపలినుండి నిప్పుతో దాడి చేయడం సాధ్యమైతే, శిబిరంలోపల మంటలు చెలరేగడం కొరకు ఎదురుచూడక, అనుకూలమైన సమయంలో దాడిచేయి.

10) (5) నీవు నిప్పుతో దాడిని ప్రారంభించేటపుడు గాలి ఏ వైపునుండి వీస్తుందో ఆ వైపే నీవు ఉండాలి. గాలివీచే దిశకు ఎదురుగా ఉండి దాడి చేయకూడదు.

11) పగటిపూట వీచే గాలి ఉధృతి చాలా సేపు ఉంటుంది. రాత్రి పూట వీచే గాలి త్వరలోనే నెమ్మదిస్తుంది.

12) ప్రతి సైన్యంలోనూ నిప్పుకు సంబంధించిన ఈ ఐదు పరిణామాలు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి, నక్షత్రాల కదలికలను గణించాలి, తగిన రోజుల కోసం కాపు కాయాలి.

13) దాడిలో సహాయకారిగా నిప్పును ఉపయోగించేవారు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దాడిలో సహాయకారిగా నీటిని ఉపయోగించేవారు తమ శక్తిని పెంపొందించుకుంటారు.

14) నీటివలన శత్రువు ప్రయాణించే మార్గానికి ఆటంకం కలుగవచ్చేమోగానీ, అతడు తన సర్వస్వాన్నీ కోల్పోవడం జరుగదు.

15) సాహసోపేతమైన కార్యాలు చేపట్టగల స్ఫూర్తిని పెంపొందించకుండానే తను చేపట్టే యుద్ధాలను గెలవడానికీ, తను చేసే దాడులలో విజయాన్ని సాధించడానికీ ప్రయత్నించేవాడి తలరాత విషాధభరితంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి ప్రయత్నాల ఫలితం సమయం వృధా అవడం, పరిస్థితిలో మార్పు లేకపోవడం.

(అటువంటి స్పూర్తిని పెంపొందించాలంటే యుద్ధంలో ప్రతిభ చూపిన వారికి, దాడులలో కీలక పాత్ర పోషించిన వారికి ఏ మాత్రం అశ్రద్ధ చేయక, తగిన ప్రోత్సాహకాలను వెనువెంటనే అందించాలి.)

16) కనుకనే ఇలా చెప్పబడింది: ప్రాజ్ఞుడైన రాజు దూరదృష్టితో ఈ విషయాన్ని ముందుగానే యోచించి, తన ప్రణాళికలను సిద్ధం చేస్తాడు. మంచి సేనాని తన అధికారులలో, సైనికులలో ప్రతిభ కలవారిని ప్రోత్సహించి వారి పని సామర్థ్యాన్ని పెంపు చేస్తాడు.

(అతడు సైనికులను తన అధికారం ద్వారా నియంత్రిస్తాడు. వారిలో విశ్వాసం పాదుకొల్పడం ద్వారా వారందరినీ సమైక్యంగా ఉంచుతాడు. తగిన పురస్కారాలు అందించడం ద్వారా వారిలో కర్తవ్యపరాయణతను పెంపొందిస్తాడు. విశ్వాసం క్షీణిస్తే సమైక్యత లోపిస్తుంది. పురస్కారాలు లోపభూయిష్టంగా ఉంటే ఆదేశాల మన్నింపు ఉండదు.)

17) సానుకూలత కనిపించకపోతే కదలకు, పొందడానికి ఏదో ఒకటి లేకపోతే నీ బలగాలను ఉపయోగించకు, పరిస్థితి ప్రమాదకరంగా లేకపోతే యుద్ధం చేయకు.

18) ఏ పాలకుడూ కేవలం తన వ్యక్తిగత కోపాన్ని చల్లార్చుకోవడానికి సైన్యాన్ని యుద్ధభూమికి తరలించకూడదు. ఏ సేనానీ కేవలం తన అహం దెబ్బతిన్న కారణంగా యుద్ధానికి పాల్పడకూడదు.

19) నీకు సానుకూలంగా ఉంటుందనుకుంటే ముందడుగు వేయి, లేకుంటే ఉన్నచోటు నుండి కదలకు.

20) కోపం కొంతకాలానికి సంతోషంగా మారవచ్చు; చిరాకు పోయి సంతృప్తి రావచ్చు.

21) కానీ ఒక సారి ధ్వంసం చేయబడిన సామ్రాజ్యం తిరిగి మరలా ఎప్పటికీ ఉనికిలోనికి రాలేదు. అలాగే మరణించిన వారిని తిరిగి ఎప్పటికీ బ్రతికించలేము.

22) కనుక ప్రాజ్ఞుడైన పాలకుడు అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, మంచి సేనాని పూర్తి జాగరూకతతో ఉంటాడు. ఒక దేశాన్ని శాంతియుతంగా ఉంచే పద్దతి, ఒక సైన్యాన్ని దుర్బేధ్యంగా ఉంచే పద్దతి ఇదే.




(పన్నెండవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి




18, ఫిబ్రవరి 2012, శనివారం

సన్-జు 'యుద్ధకళ': 11వ అధ్యాయం





యుద్ధకళ



11వ అధ్యాయం: తొమ్మిది పరిస్థితులు








సన్జు చెప్పాడు:

1) రణతంత్రం తొమ్మిది రకాలైన భూములను గుర్తించినది.

a. చెల్లాచెదురు భూమి

b. సులువైన భూమి

c. పోటీపడే భూమి 

d. బహిరంగ భూమి

e. కూడలి భూమి

f. గంభీరమైన భూమి

g. కష్టమైన భూమి

h. నిర్బంధించబడిన భూమి

i. తెగించవలసిన భూమి

2) ఒక తెగ నాయకుడు తన స్వంత భూభాగంలోనే యుద్ధం చేస్తున్నప్పుడు అది చెల్లాచెదురు భూమి’.

(సైనికులు తమ నివాసాలకు సమీపంలో ఉండటం వలన తమ భార్యాపిల్లలను చూడాలనే ఆతురతలో అన్ని దిశలలోకి చెల్లాచెదరై పోతారు కనుక అలా పిలుస్తారు. ఇళ్ళు సమీపంలో ఉండటం వలన వారికి పురోగమించేటపుడు తెగింపుతో కూడిన ధైర్యం ఉండదు, తిరోగమించేటపుడు ఆశ్రయం కోసం మరెక్కడికో ఎందుకు? –వారు తమ ఇళ్ళకే పారిపోతారు.)

3) అతడు ప్రత్యర్థి భూభాగంలోకి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిదూరం చొచ్చుకు వెళ్ళినపుడు అది సులువైన భూమి’.

(అటువంటి సందర్భంలో సులువుగా తిరోగమించే అవకాశం ఉంటుంది కనుక)

4) ఆక్రమించడంవలన ఇరుపక్షాలలో దేనికైనా కూడా గొప్ప సానుకూలతను తెచ్చిపెట్టే భూమి పోటీపడే భూమి’.

(అటువంటి ప్రదేశాన్ని ఆక్రమణలోకి తెచ్చుకోవడానికి పోటీపడి పోరాడాలి కనుక)

5) ఇరుపక్షాలూ తిరుగాడే స్వేచ్ఛ కలిగి ఉండే భూమి బహిరంగ భూమి ’.

6) మూడు దేశాల సరిహద్దులు కలిసే భూమిని ముందుగా ఆక్రమించిన వారు సామ్రాజ్యంలో అధికభాగం తన అదుపులోకి తెచ్చుకుంటారు. అటువంటి భూమి కూడలి భూమి ’.

7) కోటగట్టబడిన అనేక నగరాలను తన వెనుక వదిలేస్తూ శత్రుదేశపు మధ్యభాగంలోకి సైన్యం చొచ్చుకు వెళ్ళినపుడు అది గంభీరమైన భూమి ’.

(అటువంటి ప్రదేశం నుండి తిరోగమించడం కష్టం కనుక ఆ సైన్యం పరిస్థితి గంభీరంగా ఉంటుంది.)

8) దేశమంతా పర్వత ప్రాంత అడవులు, గరుకుగా ఉన్న వాలు ప్రాంతాలు, నీటి చెలమలు, చిత్తడి నేలలతో ఉండి ప్రయాణించడానికి కష్టంగా ఉంటే అది కష్టమైన భూమి ’.

9) కొండల నడుమ ఉన్న సన్నని, ఇరుకైన దారుల గుండా చేరుకోగలిగే భూమి, అలాగే మెలికలు తెరిగిన దారులగుండా మాత్రమే వెలుపలికి రాగలిగిన భూమి అవటం వలన మన సైన్యంలోని పెక్కుమందిని చిత్తుగా ఓడించడానికి శత్రుసైన్యంలోని కొద్దిమంది సరిపోతారు. అటువంటి ప్రదేశం నిర్భందించబడిన భూమి ’.

10) ఏ భూమి మీద ఐతే మనం ఆలస్యం లేకుండా పోరాడటం వలన మాత్రమే విధ్వంసం బారిన పడకుండా రక్షించబడతామో అది తెగించవలసిన భూమి ’.

11) కనుక చెల్లాచెదురు భూమిలో పోరాడకు. సులువైన భూమిలో ఆగకు. పోటీపడే భూమిలో దాడి చేయకు.

12) బహిరంగభూమిలో శత్రువు కదిలే మార్గానికి అవరోధం కల్పించడానికి ప్రయత్నించకు. కూడలి భూమిలో మిత్రులతో చేయి కలుపు.

(బహిరంగ భూమిలో శత్రువు కదిలే మార్గానికి అవరోధం కల్పించాలనుకుంటే మనమే చిక్కుల్లో పడతాం. ఆ ప్రయత్నంలో మన సేన విడిపోతుంది; కూడలి భూమిలో మిత్రులతో చేయికలపడమంటే పొరుగు రాజ్యాలతో పొత్తులు పెట్టుకోవడం.)

13) గంభీరమైన భూమిలో లూటీ చేయి. కష్టమైన భూమిలో ఏకధాటిగా వెళుతూనే ఉండు.

(గంభీరమైన భూమిలో ఎక్కువకాలం ఉండవలసి వస్తుంది కనుక ఆహారం కొరకు లూటీ మీద ఆధారపడాలి, కష్టమైన భూమిలో రక్షణ ఏర్పాట్లు కుదరవు కనుక దానిని సాధ్యమైనంత త్వరగా వదిలిపెట్టాలి.)

14) నిర్బంధించబడిన భూమిలో ఎత్తుగడమీద ఆధారపడు. తెగించవలసిన భూమిలో పోరాడు.

15) ప్రాచీనకాలంలో నైపుణ్యం కలిగిన నాయకులుగా పిలువబడిన వారికి శత్రుసైన్యం ముందుభాగాన్ని, వెనుక భాగాన్ని ఒకదానినుండి మరోదానిని వేరు చేయడమెలాగో తెలుసు, దాని పెద్ద, చిన్న విభాగాల మధ్యన సహకారం లేకుండా చేయడమెలాగో తెలుసు. ఆపదలో ఉన్న బలగాలను సురక్షితమైన బలగాలు కాపాడకుండా, అధికారులు సైనికులను సమీకరించకుండా అడ్డుపడటమెలాగో తెలుసు.

16) శత్రుపక్షం ఐక్యంగా ఉన్నపుడు అది అస్తవ్యస్తతకు గురయ్యేటట్లు వారు చేసారు.

17) వారికి ప్రయోజనకరంగా ఉంటుందనుకున్న సమయంలో ముందడుగు వేసారు. అలా కాని సమయంలో వారు నిలిచిపోయారు.

18) క్రమమైన పద్దతిలో తీర్చిదిద్దబడిన పెద్దసంఖ్యలో ఉన్న శత్రుసైన్యం దాడి చేయడానికి కదులుతూ వస్తుంటే ఎలా ఎదుర్కోవాలి అని అడిగితే నేనిలా చెబుతాను: నీ శత్రువు దేనిని కాపాడుకోవాలనుకుంటాడో, దేనికి ప్రాముఖ్యత ఇస్తాడో దానిని ముందుగా స్వాధీనం చేసుకో. అతడప్పుడు నీ అభీష్టానికి లోబడిపోతాడు.

19) వేగం అనేది యుద్ధసారం. శత్రువు సిద్ధంగా లేకపోవడాన్ని నీవు సానుకూలంగా మార్చుకో. ఊహించని దారులలో ప్రయాణించి, రక్షణలేని ప్రదేశాలమీద దాడిచేయి.

20) దండెత్తుతున్న బలగం పాటించవలసిన సూత్రాలు: ఒక దేశంలోకి నీవు చొచ్చుకువెళ్ళేకొలదీ నీ బలగాల మధ్య ఐక్యత హెచ్చుతుండాలి. దానివలన దాడిని కాచుకునే నీ ప్రత్యర్థి నీ ముందు నిలవలేడు.

21) సారవంతమైన దేశంలో నీ సైన్యానికి ఆహారం సరఫరా చేసే నిమిత్తం దోపిడీలు చేయి.

22) నీ సైనికుల సంక్షేమం గురించి జాగ్రత్తగా తెలుసుకో. వారినుండి మితిమీరి ఆశించవద్దు. నీ శక్తిని ఏకీకృతం చేయి, నీ బలాన్ని పొదుపుగా నిల్వచేయి. నీ సైన్యాన్ని నిరంతరం చైతన్యంతో ఉంచు. దుర్గ్రాహ్యమైన పథకాలకు రూపకల్పనచేయి.

23) తప్పించుకునే అవకాశం లేని స్థానాలకు నీ సైనికులను నెట్టు, అపుడు వారు పలాయనానికి బదులుగా మరణాన్ని ఎంచుకుంటారు. వారు మరణానికి ఎదురుగా ఉంటే, వారు సాధించలేనిది ఏదీ లేదు. అధికారులు, సైనికులు ఒకే రకంగా తమ సంపూర్ణ శక్తిని వెలికితీస్తారు.

24) సైనికులు అతి ప్రమాదకరమైన కష్టంలో ఉన్నపుడు, భయమనే భావనను కోల్పోతారు. ఆశ్రయం పొందే చోటే లేనట్లైతే, వారు పారిపోకుండా స్థిరంగా నిలబడతారు. శత్రుదేశంలో ఉన్నట్లైతే, వారు ప్రత్యర్థిని మొండిగా ఎదుర్కొంటారు. సహాయమనేదే లేకపోతే, వారు శక్తి మేరకు పోరాడతారు.

25) ఆ విధంగా, మార్గనిర్దేశకాల కొరకు ఎదురు చూడకనే సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అడిగేవరకు వేచి ఉండకనే వారు నీ అభీష్టాన్ని నెరవేరుస్తారు. నిర్బంధాలేవీ లేకనే వారు తమ విధులను నిర్వర్తిస్తారు. ఆజ్ఞలేవీ జారీ చేయకనే వారిలో మనం నమ్మకముంచవచ్చు.

26) శకునాలను చూడటాన్ని నిషేధించు, అర్థరహితమైన భయాలను, సందేహాలను పటాపంచలు చేయి. అపుడు వారు మరణించేవరకు మరో ఆలోచన లేకుండా యుద్ధంలో పాల్గొంటారు.

27) మన సైనికుల వద్ద అధికధనం లేకపోతే దానికి కారణం వారికి సంపదమీద అనిష్టత కాదు. వారు ఎక్కువకాలం బ్రతకకపోతే దానికి కారణం వారికి దీర్ఘాయుష్షు మీద అనిష్టత కాదు.

(గత్యంతరం లేకపోవడం వల్లే వారు తమ సంపదను, జీవితాలను త్యజిస్తారు. ధనాన్ని కలిగి ఉంటే సైనికులకు జీవితం మీద ఆశ పెరుగుతుంది. యుద్ధం మీద ధ్యాస తగ్గుతుంది. కనుక సేనాధిపతి అనేవాడు మనుషులందరూ కోరుకునే ఆ రెంటినీ త్యజించవలసిన అగత్యాన్ని తన సైనికులకు కల్పించాలి.)

28) పోరాటాన్ని ప్రారంభించమని ఆజ్ఞ అందుకున్న రోజునకూర్చున్న వారి బట్టలు కన్నీటితో తడుస్తూ, పడుకున్నవారి చెక్కిళ్ళమీద కన్నీరు ధారలుగా కారుతూనీ సైనికులు వెక్కివెక్కి ఏడవవచ్చు. అయితే ఒకసారి వారిని తప్పించుకోవడం సాధ్యం కాని విపత్కర స్థితిలోకి నెట్టివేస్తే, ఇక వారు ఒక చూలేక ఒక కూయివలే ధైర్యాన్ని ప్రదర్శిస్తారు.

(‘చూమరియు కూయిఅనేవారు ప్రాచీనకాలపు ప్రఖ్యాత చైనా యోధులు)

29) యుద్ధ వ్యూహాలలో నైపుణ్యం కలిగినవాడిని షుయైజాన్’ (shuai-jan) తో పోల్చవచ్చు.  షుయైజాన్  అనునది చాంగ్ పర్వతాలలో నివసించే ఒక వేగవంతమైన సర్పం. నీవు దాని తలమీద కొడితే, అది నీమీద దానితోకతో దాడి చేస్తుంది. నీవు దాని తోక మీద కొడితే అది నీమీద దాని తలతో దాడి చేస్తుంది. మధ్యభాగంలో కొడితే తల, తోక రెంటితో దాడి చేస్తుంది.

30) ఒకసైన్యాన్ని షుయైజాన్ వలె రూపొందించడం సాధ్యమేనా అని ఎవరైనా అడిగితే దానికి నేను ఔననే సమాధానం చెబుతాను. వురాజ్యసైనికులు, ‘యురాజ్యసైనికులు పరస్పరం శత్రువులు. అయినాకూడా వారు ఒకే పడవలో ఒక నదిని దాటుతూ మార్గమధ్యంలో తుఫానులో గనుక చిక్కుకుంటే ఎడమ చేయి కుడిచేయికి సాయపడినట్లుగా వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.

(ఉమ్మడి విపత్తును ఎదుర్కొంటున్నపుడు శత్రువులే ఒకరికొకరు సహాయపడగలిగినప్పుడు, ఒకే సైన్యంలోని వేరు వేరు భాగాలు తప్పనిసరిగా ఒకదానినినొకటి ఆదుకుంటాయి.)

31) కనుక గుఱ్ఱాలను కట్టివేయడాన్ని, రథచక్రాలను పూడ్చివేయడాన్ని నమ్ముకుంటే చాలదు.

(యుద్ధంలో గెలుపొందడంకొరకు సైనికులు పారిపోకుండా గుఱ్ఱాలను కట్టివేయడం, రథచక్రాలను పూడ్చివెయ్యడం లాంటి చర్యలు తీసుకున్నంత మాత్రాన సరిపోదు. నీ సైనికులలో పట్టుదల, అందరూ ఒకే లక్ష్యంతో పనిచేయగలగడం, అన్నింటినీ మించి సానుభూతితో ఒకరికొకరు సహకరించుకొనే స్ఫూర్తి లేనట్లైతే నీవు గెలుపొందలేవు. షుయైజాన్ నుండి నేర్చుకోవలసిన పాఠం ఇదే.)

32) అందరూ తప్పకుండా చేరుకోవలసిన ఒక ధైర్యపు స్థాయిని ఏర్పరచడమే సైన్యాన్ని నిర్వహించే సూత్రం.

(ఒకేఒకవ్యక్తి ధైర్యం అనిపించేటట్లుగా అందరి ధైర్యం ఒకేస్థాయిలో ఉండాలి. ఆవిధంగా వారిని ప్రేరేపించాలి. సైన్యమంతా ఒకే దేహంగా రూపొందినపుడు సైనికులందరి ఉద్దేశ్యం, స్ఫూర్తి ఒకే విధంగా ఉంటాయి. ఏం జరిగినా కూడా అవి ఒక స్థాయి కన్నా తగ్గవు.)
           
33) బలవంతులు, బలహీనులువీరిరువురనూ ఉత్తమంగా ఎలా వినియోగించుకోవాలనేది యుద్ధభూమిని సక్రమంగా ఉపయోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.

34) నిపుణుడైన సేనాని తనను అనుసరించడం తప్ప మరోదారిలేని ఒక వ్యక్తిని నడిపించినంత సులువుగా ఒక సైన్యాన్ని నడిపిస్తాడు.

35) విషయాలను రహస్యంగా ఉంచడం కొరకు మౌనంగా ఉండటం, పరిస్థితి సవ్యంగా ఉండటం కొరకు నీతి, నిజాయితీలతో మెలగటం ఒక సేనాని కర్తవ్యం.

 36) తప్పుడు నివేదికలతో, తప్పుడు ప్రదర్శనలతో అతడు తన అధికారులకు, సైనికులకు అయోమయాన్ని కలిగించాలిఆ విధంగా వారిని పూర్తిగా తెలియని స్థితిలోనే ఉంచాలి.

37) తన ఏర్పాట్లను మార్చడం ద్వారా, తన పథకాలను మార్చడం ద్వారా అతడు శత్రువుకు తన గురించి సరైన సమాచారం లేకుండా చేస్తాడు. తన శిబిరాన్ని తరలించడం ద్వారా, చుట్టుతిరుగుడు దారుల్లో ప్రయాణించడం ద్వారా శత్రువు తన ఉద్దేశ్యాన్ని ముందస్తుగా ఊహించకుండా నిరోధిస్తాడు.

38) క్లిష్ట సమయంలో ఒక సైన్యానికి నాయకుడు ఎత్తుకి చేరుకున్న తరువాత వెనుకనున్న నిచ్చెనను తన్నివేసే వ్యక్తివలే వ్యవహరిస్తాడు. శత్రుభూభాగం లోపలికి చాలాదూరం తన సైనికులను నడిపించిన తరువాత మాత్రమే అతడు తన అసలు ఉద్దేశ్యాలను బయట పెడతాడు.

39) అతడు తన పడవలను తగులబెడతాడు, వంటపాత్రలను పగులగొడతాడు; ఒక గొఱ్ఱెల కాపరి తన గొఱ్ఱెల మందను నడిపించినట్లుగా అతడు తన సైనికులను అనేక దారులలో నడిపిస్తాడు. ఇంతకీ అతడు ఎక్కడికి వెళుతున్నాడో ఎవరికీ తెలియదు.

40) తన సైన్యాన్ని సమీకరించడం, దానిని ప్రమాదంలోకి తీసుకు వెళ్ళడందీనిని ఒక సేనాని విధిగా చెప్పవచ్చు.

41) తొమ్మిది రకాల యుద్ధ భూములకు సరిపోయే విధంగా వేరువేరు చర్యలు; దాడి చేసే లేక ఆత్మరక్షణ గావించుకొనే ఎత్తుగడలను సమయోచితంగా ఉపయోగించుకోవడం; మానవ స్వభావపు ప్రాధమిక నియమాలు: ఇవి ఎంతో ఖచ్చితంగా అధ్యయనం చేయవలసిన విషయాలు.

42) శత్రుదేశం మీద దండెత్తుతున్నపుడు సాధారణ సూత్రం ఏమిటంటే, దేశం లోపలికంటా చాలా దూరం చొచ్చుకు వెళ్ళడం అనేది సైన్యంలో ఐక్యతను తెస్తుంది; కొద్దిదూరం మాత్రమే చొచ్చుకు వెళ్ళడం అంటే దానర్థం సైన్యం చెల్లాచెదరై పోవడమే.

43) నీ స్వంతదేశాన్ని దాటివేసి, పొరుగుదేశం గుండా నీ సైన్యాన్ని నడిపించేటపుడు నీవు క్లిష్టమైన భూమిలో ఉంటావు. నలువైపులా సమాచారవ్యవస్థ ఉన్నపుడు అది కూడలి భూమి’. 

44) నీవు ఒక దేశంలోకి చాలా దూరం చొచ్చుకువెళితే అది గంభీరమైన భూమి. నీవు కొద్ది దూరం మాత్రమే చొచ్చుకు వెళితే అది సులువైన భూమి.

45) వెనుకవైపు బలమైన శత్రుస్థావరాలు, ముందువైపు ఇరుకైన కనుమదారులు ఉంటే అది నిర్బంధించబడిన భూమి. ఆపత్సమయంలో ఆశ్రయం పొందగలిగిన ప్రదేశమే అసలు లేకపోతే అది తెగించవలసిన భూమి.

46) కనుక, చెల్లాచెదురు భూమిలో అందరూ ఒకే ఉద్దేశ్యంతో పోరాడే తత్త్వాన్ని నేను నా సైనికులలో ప్రేరేపిస్తాను. సులువైన భూమిలో నా సైన్యంలోని అన్ని భాగాల మధ్యన సన్నిహిత బంధం ఉండేటట్లు చూస్తాను.

47) పోటీపడే భూమిలో నేను సైన్యం వెనుక భాగాన్ని తొందరపెడతాను.

(వెనుకభాగం వెనుకనే ఉండిపోక త్వరితగతిన ముందుభాగంతో కలసి కీలక స్థావరాలను ఆక్రమణలోకి తెచ్చుకోవడం కొరకు)

48) బహిరంగ భూమి మీద నేను నా రక్షణ సాధనాల విషయంలో అప్రమత్తంగా ఉంటాను. కూడలి భూమి మీద నేను మిత్రరాజ్యాలతో బంధాన్ని దృఢతరం చేసుకుంటాను.

49) గంభీరమైన భూమిమీద సరఫరాలు నిరంతరాయంగా లభించేటట్లు చేయడానికి ప్రయత్నిస్తాను. కష్టమైన భూమిమీద దారివెంట ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాను.

50) నిర్బంధించబడిన భూమిమీద తిరోగమించడానికి ఎటువంటి మార్గమున్నా దానిని మూసివేస్తాను. తెగించవలసిన భూమిమీద తమ జీవితాలను రక్షించుకోవడంలోని నిష్ఫలత్వాన్ని నా సైనికులకు ప్రకటిస్తాను.

51) ఎందుకంటే, చుట్టుముట్టబడినపుడు దృఢంగా ప్రతిఘటించడం, మరోదారి లేనపుడు సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడటం, ప్రమాదంలో పడినపుడు ఆదేశాలను తు.చ. తప్పకుండా శిరసా వహించడం ఒక సైనికుని స్వభావం.

52) పొరుగు రాజుల పథకాలేమిటో తెలుసుకునేవరకూ వారితో మనం పొత్తులకు దిగలేము. ఒక దేశ భూస్వరూపంఆ దేశంలోని పర్వతాలు, అడవులు; దానిలోని లోయలు, అగాథాలు; దానిలోని నీటి చెలమలు, చిత్తడి నేలలుగురించి అవగాహన లేకుండా ఆ దేశం గుండా ప్రయాణించే సైన్యానికి నాయకత్వం వహించడానికి మనం తగము. స్థానికుల మార్గదర్శకత్వాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే ఆ ప్రదేశపు సహజ సానుకూలతల నుండి మనం లభ్ది పొందలేము.

53) ఈ క్రింది నాలుగైదు సూత్రాలలో ఏ ఒక్కటైనా తెలియకపోవడం అనేది సైనిక స్వభావం కలిగిన (యుద్ధ పిపాసియైన) ఒక రాజుకి తగదు.

54) యుద్ధ పిపాసియైన ఒక రాజు ఒక శక్తివంతమైన రాజ్యం మీద దాడిచేసినపుడు, శత్రు బలగాలు సమీకృతం కాకుండా నిరోధించడంలోనే అతడి సైన్యాధిపత్యం ప్రదర్శితమవుతుంది. అతడు తన ప్రత్యర్థులను ఎంతగా భయపెడతాడంటే వారి మిత్ర రాజ్యాలు అతడికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనడానికే వెనుకాడతాయి.

55) కనుక అతడు అనేక మందితో పొత్తుపెట్టుకోవడానికి ప్రాకులాడడు. తద్వారా ఇతర రాజ్యాల శక్తి పెంపొందనివ్వడు. శత్రువులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ రహస్యమైన తన స్వంత పథకాలను అతడు అమలు చేస్తాడు. ఆవిధంగా అతడు వారి నగరాలను స్వాధీనం చేసుకొని, వారి సామ్రాజ్యాలను జయిస్తాడు.

56) నియమనిబంధనలతో నిమిత్తం లేకుండా బహుమతులను అందించు, విధివిధానాలతో నిమిత్తం లేకుండా ఆదేశాలను జారీచేయి; దానితో ఒకేఒక వ్యక్తితో వ్యవహరిస్తున్న మాదిరిగా నీవు మొత్తం సైన్యాన్ని నడిపించగలవు.

57) నీ సైనికులకు వారు చేయవలసిన పనిని మాత్రమే తెలుపు. నీ పథకం గురించి వారికెప్పుడూ తెలియనీయకు. విజయావకాశం స్పష్టంగా ఉన్నపుడు దానిని వారికి చూపించు, పరిస్థితి నిరాశాజనకంగా ఉంటే మాత్రం వారికేమీ చెప్పకు.

58) నీ సైన్యాన్ని మృత్యుసమానమైన ప్రమాదానికి గురిచేయి, అది బ్రతికి బట్టకడుతుంది. ఎటువంటి ఆశాలేని అంతులేని కష్టాలలోకి దానిని నెట్టివేయి, అది సురక్షితంగా బయటపడుతుంది.

59) ఎందుకంటే ఒక బలగం ప్రమాదంలో పడినపుడు విజయానికి కావలసిన దెబ్బకొట్టడానికి తగిన సామర్థ్యాన్ని అది కలిగి ఉంటుంది.

60) శత్రువు ఉద్దేశ్యాలకు అనుగుణంగా మనలను జాగ్రత్తగా మలచుకోవడం ద్వారా యుద్ధంలో విజయాన్ని సాధించవచ్చు.

(శత్రువు పురోగమించదలిస్తే, ఆ విధంగానే చేసేటట్లుగా అతడిని ప్రలోభపెట్టు; ఒకవేళ అతడు తిరోగమించాలని ఆతురత పడితే, అందుకు కావలసిన సమయాన్ని అతడికి కల్పించు. అతడికి అనుకూలంగా ప్రవర్తించడంలో మన ఉద్దేశ్యం మనం అతడిమీద దాడిచేసే లోపు అతడిలో నిర్లక్ష్యం, ధిక్కారం మొదలైన ప్రమాదకర లక్షణాలు పెంపొందేటట్లు చేయడమే.)

61) పట్టుదలతో శత్రువు పొంతనే కాచుకొని ఉండటం ద్వారా దీర్ఘకాలంలో సైన్యాధ్యక్షుడిని చంపడంలో మనం విజయం సాధిస్తాము.

62) ఒక విషయాన్ని పూర్తి చాతుర్యంతో నెరవేర్చగల సామర్థ్యంగా దీనిని పిలుస్తారు.

63) నీవు నీ అధికారాలను స్వీకరించిన రోజునే సరిహద్దు మార్గాలన్నింటినీ మూసివేయి. విదేశీ ప్రయాణాన్ని అనుమతించే అధికారిక పత్రాలను నాశనం చేయి. దౌత్యవేత్తల రాకపోకలను నిలిపివేయి.

64) సభామందిరంలో దృఢంగా వ్యవహరించడం ద్వారా నీవు పరిస్థితిని నియంత్రించవచ్చు.

(నీ పథకాలకు ప్రభువు అనుమతి లభించేటట్లుగా గట్టిగా ప్రయత్నించు)

65) శత్రువు నీకో అవకాశాన్ని ఇస్తే, దానిని వెంటనే అందిపుచ్చుకో!

66) నీ ప్రత్యర్థి జాగ్రత్తగా కాపాడుకుంటున్నదానిని నీవు చేజిక్కించుకోవడం ద్వారా అతడి ముందఱికాళ్ళకు బంధం వేయి. అతడు యుద్ధభూమిని చేరుకునే సమయం నీకనుకూలంగా ఉండేటట్లుగా నైపుణ్యంతో వ్యవహరించు.

67) నిర్ణయాత్మకమైన యుద్ధం చేయగలిగే వరకూ నీవు నియమానుసారంగానే ప్రవర్తించు, శత్రువుకు అనుకూలంగానే నిన్ను నీవు మలచుకుంటూ ఉండు.

68) కనుక, శత్రువు నీకో అవకాశాన్ని ఇచ్చేవరకూ మొదట ఒక యువతి వలే బిడియాన్ని ప్రదర్శించు, తరువాత పరిగెత్తే కుందేలు వేగాన్ని మించిపోవడానికి ప్రయత్నించు, దానితో నిన్ను ప్రతిఘటించడానికి శత్రువుకు సమయం మించిపోతుంది.




(పదకొండవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి





16, ఫిబ్రవరి 2012, గురువారం

సన్-జు 'యుద్ధకళ': 10వ అధ్యాయం





యుద్ధకళ




10వ అధ్యాయం: భూస్వరూపం








సన్జు చెప్పాడు:

1) ఆరు రకాలైన భూస్వరూపాలను మనం గుర్తించవచ్చు. అవి:

a. సులువుగా చేరగలిగిన భూమి,

b. చిక్కుకు పోయిన భూమి

c. కాల విలంబనజరిగే భూమి,

d. ఇరుకైన కనుమలు,

e. నిట్టనిలువు శిఖరాలు,

f. శత్రువు నుండి బాగా దూరంగా ఉన్న ప్రాంతాలు

2) ఇరువైపులనుండి స్వేచ్ఛగా రాకపోకలు జరపడానికి అనువైన భూమిని సులువుగా చేరగలిగినదిఅని పిలుస్తారు.

3) ఇటువంటి లక్షణంగల భూమి విషయంలో మెరకగానూ మరియు వెలుతురుతోనూ ఉండే ప్రాంతాలను ఆక్రమించుకోవడంలో నీవు శత్రువు కన్నా ముందుండి, నీ సరఫరా మార్గాలను జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు నీవు సానుకూలతతో యుద్ధంచేయగలుగుతావు.

4) ఒక ప్రదేశాన్ని వదలి వెళ్ళగలిగి, తిరిగి దానిని ఆక్రమించుకోవడం కష్టమైనపుడు దానిని చిక్కుకుపోయిన భూమిఅని పిలుస్తారు.

5) ఇటువంటి ఒక స్థానం నుండి శత్రువు సన్నద్ధతలో లేని పక్షంలోనీవు హఠాత్తుగా ముందుకురికి, దాడిచేసి అతడిని ఓడించవచ్చు. ఐతే శత్రువు నీ రాకకొరకు సంసిద్ధుడై ఉండి, నీవు అతడిని ఓడించడంలో విఫలుడవైతేఅపుడు వెనుకకు తిరిగి రావడం అసాధ్యం అవుతుంది కనుక పెనువిపత్తు సంభవిస్తుంది.

6) మొదటి అడుగు వేయడం మూలంగా ఇరుపక్షాలలో దేనికీ లాభం జరిగే పరిస్థితిలేని ప్రదేశాన్ని కాలవిలంబన జరిగే భూమిగా పిలుస్తారు.

7) ఇటువంటి పరిస్థితిలో శత్రువు మనకు ఆకర్షణీయమైన ఎరను ఇవ్వజూపినప్పటికీ మనం ఆశపడి ముందడుగు వేయకూడదు, పైగా తిరోగమించాలి. ఆ విధంగా శత్రువునే మనం ప్రలోభ పెట్టాలి. అపుడు, అతని సైన్యంలో కొంత భాగం బయటకు వచ్చినపుడు మనం సానుకూలంగా మనదాడిని ప్రయోగించవచ్చు.

8) ఇరుకైన కనుమల విషయంలో, వాటిని మొదట నీవు ఆక్రమించుకోగలిగితే, వాటిలో బలమైన సైనిక రక్షణను ఏర్పరచి ఆపై శత్రువు రాక కోసం వేచిచూడు.

9) శత్రువు నీ కన్నా ముందే కనుమను ఆక్రమించినపుడు కనుమలో బలమైన సైనిక రక్షణ ఉంటే నీవు అతడిని వెంబడించకు, సైనిక రక్షణ బలహీనంగా ఉంటే మాత్రం అతడిని వెంబడించు.

10) నిటారు శిఖరాలకు సంబంధించి, నీవు నీ శత్రువు కన్నా ముందుగా వాటిని చేరితే, మెరకగానూ మరియు వెలుతురుగానూ ఉండే ప్రాంతాలను ఆక్రమించుకొని, అతడి ఆగమనం కొరకు అక్కడ వేచి ఉండు.

11) శత్రువు వాటిని నీకంటే ముందుగా ఆక్రమించితే, నీవు అతడిని అనుసరించకు, పైగా తిరోగమించి అతడు అక్కడినుండి కదిలేటట్లు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించు.

12) నీవు శత్రువు నుండి చాలా దూరంలో ఉండి, ఇరు సైన్యాల బలాలు సమానంగా ఉంటే, యుద్ధాన్ని పురిగొల్పడం అంత తేలిక కాదు. ఒక వేళ యుద్ధం చేసినా అది నీకు ప్రతికూలంగా ఉంటుంది.

13) ఇవి ఆరు కూడా భూమితో ముడిపడి ఉన్న సూత్రీకరణలు. ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని పొందిన సేనాని వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

14) సహజ సిద్ధమైన కారణాలనుండి కాక, సేనాని బాధ్యత వహించవలసిన దోషాలనుండి ఉత్పన్నమయ్యే ఆరు వేరువేరు రకాలైన విపత్తులకు సైన్యం గురి అవుతుంది. అవి : 

a. పలాయనం (Flight),

b. అవిధేయత (Insubordination)

c. వైఫల్యం (Collapse),

d. వినాశనం (Ruin),

e. గందరగోళం (Disorganization),

f. ఓటమి (Rout)

15) మిగతా పరిస్థితులన్నీ సరిసమానంగా ఉండి, ఒక బలగం తన కన్నా పరిమాణంలో పదిరెట్లు పెద్దదైన మరో బలగం మీద ప్రయోగించబడితే, దానిఫలితం మొదటి బలగపు పలాయనం’.

16) సాధారణ సైనికులు మరీ బలంగా ఉండి, వారి అధికారులు మరీ బలహీనంగా ఉన్నపుడు దాని ఫలితం అవిధేయత’. ఆధికారులు మరీ బలంగా ఉండి సాధారణ సైనికులు మరీ బలహీనంగా ఉన్నపుడు దాని ఫలితం వైఫల్యం’.

(అధికారుల వత్తిడి తట్టుకోలేక సైనికులు వైఫల్యం చెందుతారు)

17) ఉన్నతాధికారులు కోపంగా, అవిధేయంగా ఉండి, శత్రువును కలుసుకొన్నపుడు కోపం కారణంగాసర్వ సైన్యాద్యక్షుడు తాను పోరాడగలిగే స్థితిలో ఉన్నాడో లేదో చెప్పటానికంటే ముందేతమ ఇష్టానుసారంగా యుద్ధం ప్రారంభించినపుడు దాని ఫలితం వినాశనం’.

18) సేనాని బలహీనుడూ, పట్టులేనివాడూ అయినపుడు; అతని ఆజ్ఞలు స్పష్టంగా, తేటతెల్లంగా లేనపుడు; అధికారులకు, సైనికులకు నిర్దిష్టమైన విధుల కేటాయింపు జరగనపుడు, శ్రేణులను క్రమపద్దతిలో కాకుండా చిత్తానికి తోచినట్లు రూపొందించినపుడు, దాని ఫలితం పూర్తి గందరగోళం’.

19) ఒక సేనాని శత్రువు శక్తిని అంచనా వేయలేకపోయి, ఒక పెద్దబలగాన్ని ఎదుర్కోవడానికి ఒక చిన్నబలగాన్ని అనుమతించి లేక శక్తివంతమైన సైనిక దళం మీదకు బలహీనమైన దళాన్ని ఉరికించిఎంపిక చేయబడిన సైనికులను ముందరి శ్రేణిలో నెలకొల్పడాన్ని నిర్లక్ష్యం చేసినపుడు దాని ఫలితం తప్పనిసరిగా ఓటమి’.

20) ఓటమి కొనితెచ్చుకొనే ఈ ఆరు విధానాలనూ ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని పొందిన సేనాని తప్పనిసరిగా జాగ్రత్తగా గమనించాలి.

21) దేశ సహజ స్వరూపం సైనికులకు ఉత్తమ సహాయకారిగా ఉంటుంది. ఐతే శత్రువును అంచనా వేసే సామర్థ్యం, విజయం దిశగా బలగాలను నడిపించే సామర్థ్యం అలాగే కష్టాలను, ప్రమాదాలను, దూరాలను సునిశితంగా లెక్కగట్టే సామర్థ్యం ఒక గొప్ప సేనానికి గీటురాళ్ళుగా ఉంటాయి.

22) ఈ విషయాలన్నీ తెలిసి ఉండి, పోరాటంలో తన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టే వ్యక్తి తను చేసే యుద్ధాలను గెలుస్తాడు. వీటిని తెలియనివాడు, ఆచరణలో పెట్టనివాడు తప్పకుండా ఓటమి చెందుతాడు.

23) పోరాటంలో విజయం తప్పక సిద్దిస్తుందనుకున్నపుడు, పాలకుడు నిరాకరించినప్పటికీ, నీవు తప్పక పోరాడాలి; పోరాటంలో విజయం సిద్ధించదనుకున్నపుడు పాలకుడు ఆదేశించినప్పటికీ నీవు ససేమిరా పోరాడకూడదు.

24) కీర్తిని అభిలషించకుండా పురోగమించేవాడు, అగౌరవానికి భయపడకుండా తిరోగమించేవాడు; తన దేశాన్ని రక్షించడం, తన ప్రభువుకు మంచి సేవలందించడం మినహాయించి వేరే ఆలోచన లేనివాడు అయిన సేనాని రాజ్యానికి రత్నాభరణం వంటివాడు.

25) నీ సైనికులను నీ బిడ్డలుగా భావించు, వారు మిక్కిలి లోతైన లోయలలోకి సైతం నిన్ను అనుసరిస్తారు. వారిని నీ స్వంత ప్రియమైన పుత్రులుగా భావించు, వారు మరణంలోకూడా నీ వెంటే నిలచి ఉంటారు.

26) నీవు మెతకవైఖరితో నీ అధికారాన్ని ప్రదర్శించలేకపోయినట్లైతే; దయార్ధ్ర హృదయంతో నీ ఆదేశాలను పాటించేటట్లు వత్తిడి చేయలేకపోయినట్లైతే, మరిముఖ్యంగా అల్లర్లను అణచడంలో నీవు అసమర్థుడవైనట్లైతే అప్పుడు నీ సైనికులు చెడిపోయిన పిల్లల మాదిరిగా తయారవుతారు. ఆచరణాత్మకమైన ఏ ఉద్దేశ్యానికైనా వారు నిరుపయోగం.

27) మనకు మన సైనికులు దాడి చేయగల స్థితిలో ఉన్నారనే విషయం తెలిసి ఉండి, శత్రువు దాడికి అనుకూలంగా లేడనే విషయం తెలియకపోతే, మనం విజయం దిశగా సగం దూరం మాత్రమే ప్రయాణించినట్లు.

28) మనకు శత్రువు దాడికి అనుకూలంగా ఉన్నాడనే విషయం తెలిసి ఉండి, మనసైనికులు దాడి చేయగల స్థితిలో లేరనే విషయం తెలియకపోతే మనం విజయం దిశగా సగదూరం మాత్రమే ప్రయాణించినట్లు.

29) మనకు శత్రువు దాడికి అనుకూలంగా ఉన్నాడనే విషయం తెలిసి ఉండి, అలాగే మన సైనికులు దాడిచేయగల స్థితిలో ఉన్నారనే విషయం కూడా తెలిసి ఉండి, భూమి స్వభావం యుద్ధానికి అనువుగా లేదనే విషయం తెలియకపోతే, అప్పుడు కూడా మనం విజయం దిశగా సగదూరం మాత్రమే ప్రయాణించినట్లు.

30) కనుక అనుభవజ్ఞుడైన సైనికుడు ఒకసారి ముందడుగు వేసిన తరువాత ఎప్పుడూ తికమకకు లోనుగాడు. తన శిబిరం నుండి బయలు దేరటమంటూ జరిగిన తరువాత ఎప్పుడూ నష్టాన్ని పొందడు.

(బయలు దేరడానికి ముందే అన్ని విషయాలు పూర్తిగా ఆలోచిస్తాడు. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా అన్ని జాగ్రత్తలూ ముందే తీసుకుంటాడు.)

31) దీనినిబట్టి ఇలా చెప్పబడింది: నీకు నీ శత్రువు గురించీ, అలాగే నీ గురించి కూడా తెలిసి ఉన్నట్లైతే నీ విజయం సందేహాస్పదం అవదు. నీకు వాతావరణం గురించీ, అలాగే భూస్వరూపం గురించి కూడా తెలిసి ఉన్నట్లైతే నీవు సంపూర్ణ విజయాన్ని పొందుతావు.




(పదవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





14, ఫిబ్రవరి 2012, మంగళవారం

సన్-జు 'యుద్ధకళ': 9వ అధ్యాయం





యుద్ధకళ




9వ అధ్యాయం: సైన్యం కదలిక








సన్జు చెప్పాడు:

1) ఇప్పుడు మనం సైనిక శిబిరం ఏర్పాటు చేసుకోవటం, శత్రువు ఆనవాళ్ళను పరిశీలించటం అనే విషయాలకు వచ్చాం. పర్వతాలనుండి త్వరత్వరగా తప్పుకుని లోయల చెంతకు రా!

(లోయలలో ఆహారం, నీరు దొరుకుతుంది, పర్వతాలమీద అవి దొరకవు.)

2) సూర్యునికి అభిముఖంగా ఎత్తైన ప్రదేశాలమీద విడిది చెయ్యి. ఎత్తైన ప్రదేశం మీద ఉన్న శత్రువుతో పోరాటం కొరకు నీవు ఆ ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహించకు.

(ఎత్తైన ప్రదేశాలమీద విడిది చెయ్యి అంటే పర్వాతాలమీద కాదు. లోయలలోనే కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశంలో)

పర్వత ప్రాంత యుద్ధం గురించి తెలుసుకున్నాం. 

3) నదిని దాటిన తరువాత నీవు దానినుండి దూరంగా వెళ్ళిపోవాలి.

(శత్రువు కూడా ఆ నదిని దాటేటట్లు ప్రేరేపించడానికి)

4) దండెత్తివస్తున్న సైన్యం నదిని దాటుతున్నపుడు దానితో తలపడటానికి ప్రవాహం మధ్యలోకి ఎదురెళ్ళకు. సగం సైన్యాన్ని నదిని దాటనిచ్చి, అప్పుడు దాడి చేయడం ఉత్తమం.

5) నీవు పోరాటం కొరకు ఆతురతతో ఉన్నట్లైతే, శత్రువు దాటవలసిన నది సమీపంలో అతడిని ఎదుర్కోవడానికి వెళ్ళకు.

6) నీ పడవను శత్రువుకన్నా ఎగువగానూ, సూర్యునికి అభిముఖంగానూ లంగరు వేయి. శత్రువును ఎదుర్కోవడానికి ప్రవాహానికి ఎదురెళ్ళకు.

నదీ యుద్ధం గురించి తెలుసుకున్నాం.

7) ఉప్పునీటి కయ్యలను, బురదనేలలను దాటేటపుడు నీ దృష్టిని పూర్తిగా వాటిని ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరత్వరగా అధిగమించడం మీదే ఉంచాలి.

8) అటువంటి నేలలలో యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తే నీకు సమీపంలో నీరు, గడ్డి ఉండేటట్లు, అలాగే నీ వెనుకవైపు చెట్ల సమూహం ఉండేటట్లు చూసుకో.

ఉప్పునీటి కయ్యలలో సైనిక వ్యవహారాల గురించి తెలుసుకున్నాం.

9) పొడిగా, చదునుగా ఉన్న భూభాగంలో నీ కుడివైపూ, నీ వెనుకవైపూ ఎత్తైన ప్రదేశం ఉన్నటువంటి సులువుగా చేరుకోగల స్థితిని చేపట్టు. అప్పుడు ముందువైపు మాత్రమే ప్రమాదానికి అవకాశం ఉండి, వెనుకవైపు రక్షణ ఉంటుంది.

చదునైన ప్రాంతంలో సైనిక విన్యాసాల గురించి తెలుసుకున్నాం.

10) సైనిక పరిజ్ఞానానికి సంబంధించిన ఈ నాలుగు ఉపయోగకరమైన శాఖలు ప్రాచీనకాలపు చైనా చక్రవర్తి అయిన Yellow Emperor నలుగురు రాజులను జయించడానికి (వేరువేరుయుద్ధాలలో) దోహదపడ్డాయి.

11) అన్ని సైన్యాలూ పల్లపు ప్రాంతంకన్నా ఎత్తైన ప్రదేశానికి; అలాగే వెలుతురు లేని ప్రాంతంకన్నా వెలుతురు ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తాయి.

12) నీ సైనికుల మీద నీకు శ్రద్ధ ఉండి, ఆహారం, నీరు పుష్కలంగా దొరికే ఆరోగ్యకరమైన ప్రాంతంలో నీవు శిబిరాన్ని ఏర్పాటుచేస్తే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవుఆరోగ్యవంతమైన సైన్యం అజేయమైనది.

13) నీవు ఒక కొండ వద్దకు గానీ లేక నదిగట్టు వద్దకు గానీ వచ్చినపుడు సూర్యకిరణాలు పడే భాగాన్ని ఆక్రమించుకో. వాలు ప్రాంతం నీ కుడివెనుక ఉండాలి. ఆ విధంగా నీవు ఒకేసమయంలో నీ సైనికులకు సహాయకరంగా పనిచేయనూ గలవు, అలాగే భూమి సహజ సానుకూలతలను ఉపయోగించుకోనూగలవు.

14) ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాల మూలంగా నీవు దాటాలనుకుంటున్న నది పొంగి పొర్లుతూ ప్రవహిస్తుంటే, ఆ వరద తగ్గుముఖం పట్టే వరకు నీవు తప్పనిసరిగా వేచి ఉండాలి.

15) నిట్టనిలువుగా ఉన్న కొండ చరియల మధ్యన ప్రవాహాలున్నటువంటి, సహజసిద్ధంగా ఏర్పడిన లోతైన సొరంగాలున్నటువంటి, దిగ్బంధం చేయబడిన ప్రదేశాలున్నటువంటి, అడుగుముందుకు వేయలేకుండా అల్లుకుపోయిన దట్టమైన పొదలతో కూడినటువంటి, బురదనేలలు గానీ లేక నేలలో లోతైన పగుళ్ళు గానీ ఉన్నటువంటి ప్రాంతాన్ని సాధ్యమైనంత వేగంగా వదిలిపెట్టాలి. దానినెప్పుడూ సమీపించకూడదు.

16) అటువంటి ప్రదేశాలకు మనం దూరంగా ఉంటూ శత్రువు వాటిని సమీపించేటట్లు చేయాలి. వాటికి మనం అభిముఖంగా ఉన్నపుడు శత్రువుకు అవి వెనుకవైపు ఉండేటట్లు చేయాలి.

17) నీ శిబిరానికి పొరుగున ఏదైనా కొండ ప్రదేశం గానీ, చుట్టూ గడ్డి ఉన్న సరస్సులు గానీ, నీటిలో పెరిగే చెట్లతో నిండిన లోయలుగానీ, దట్టంగా అల్లుకుపోయిన పొదలతో కూడిన అడవిగానీ ఉన్నట్లైతే ఆ ప్రదేశాలన్నింటినీ జాగ్రత్తగా గాలించాలి. ఎందుకంటే అవి శత్రువులు మాటువేసి ఉండటానికిగానీ, లేక జిత్తులమారి గూఢచారులు నక్కి ఉండటానికిగానీ అవకాశం ఉన్న ప్రదేశాలు.

18) శత్రువు అతి చేరువలో ఉండి, నిశ్చలంగా ఉంటే అతడు తన స్థావరం యొక్క సహజసిద్ధమైన బలం మీద ఆధారపడుతున్నాడని అర్థం.

(బలమైన ఆ స్థావరాన్ని వదిలితే అతడు బలహీనపడతాడు కనుక దాని నుండి కదలడు)

19) అతడు దూరంగా ఉండి పోరాటానికి కవ్విస్తుంటే, నీవు ముందడుగు వేయడానికి అతడు ఆతురత చెందుతున్నాడని అర్థం.

(ఆ విధంగా నీవు నీ సూరక్షితమైన స్థావరాన్ని వదలాలని అతడి కోరిక)

20) అతడు శిబిరం ఏర్పాటు చేసిన ప్రదేశం సులువుగా చేరుకోదగినదిగా ఉంటే అతడు ఎరవేస్తున్నాడని అర్థం.

21) అడవిలోని చెట్లమధ్య కదలిక శత్రువు పురోగమిస్తున్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది. దట్టమైన పొదల మధ్యన అడ్డుతెరలు అనేకం కనిపిస్తే మనం అనుమానపడాలని శత్రువు కోరుకుంటున్నాడని అర్థం.

(తెరలవెనుక శత్రువు మాటువేసి ఉండి ఉంటాడనే అనుమానం మనకు కలగాలని శత్రువు ఉద్దేశ్యం. కానీ ఆ తెరలు శత్రువు పారిపోయాడన్న దానికి సంకేతం)

22) పక్షులు తమ ప్రయాణం మధ్యలో హఠాత్తుగా మరింత ఎత్తుకు వెళితే, అది శత్రువు పొదలలో మాటువేసి ఉండటాన్ని సూచిస్తుంది. భయపడిన జంతువులు హఠాత్తుదాడిజరగబోతున్నదనే విషయాన్ని సూచిస్తాయి.

23) ఎగసిన ధూళి నిట్టనిలువుగా, చాలా ఎత్తువరకూ వ్యాపించటం రథాలు పురోగమిస్తున్నాయన్నదానికి గుర్తు; ధూళి తక్కువ ఎత్తులో వెడల్పుగా విస్తరిస్తే అది పదాతిదళం సమీపిస్తుండటానికి సంకేతం, ధూళి వివిధ దిశలలో విస్తరిస్తే అది కట్టెలు సేకరించడానికి బృందాలు పంపబడ్డాయన్న విషయాన్ని తెలుపుతుంది; కొద్ది సంఖ్యలో ధూళిమేఘాలు అటూఇటూ కదులుతుండటం సైన్యం విడిది ఏర్పాట్లు చేసుకోవడాన్ని సూచిస్తుంది.

(రథాలు గానీ, వాటికి కట్టబడిన గుఱ్ఱాలు గానీ మనిషి కన్నా చాలా ఎక్కువ బరువు ఉంటాయి. అందువలన అవి కదిలేటపుడు ధూళి మనుషులు కదిలేటపుడు కన్నా ఎక్కువ ఎత్తు లేస్తుంది. అంతేకాక రథాలు ఒకదానివెనుక ఒకటిగా ప్రయాణిస్తాయి కనుక ధూళిమేఘం వెడల్పుగా ఉండదు. అదే పదాతి దళం కదిలేటపుడు అది అనేక వరుసలలో ఉన్నప్పటికీ ప్రతీ వరుసలోనూ ఒకరి పక్కన ఒకరుగా చాలా వెడల్పుగా సైనికులుంటారు కనుక వారు కదిలేటపుడు ధూళి వెడల్పుగా వ్యాపిస్తుంది.)

24) అణకువ కలిగిన మాటలు, పెరిగిన యుద్ధ సన్నాహాలుశత్రువు పురోగమించబోతున్నాడనేదానికి సంకేతాలు. కఠినమైన భాష, దాడి చేయడానికన్నట్లుగా ముందుకు చొచ్చుకు రావడంఅతడు పారిపోతాడనేదానికి సంకేతాలు.

25) తేలిక పాటి రథాలు ముందుగా వచ్చి రణరంగపు పక్క ప్రాంతాలలో తమ స్థానాన్ని స్వీకరిస్తే అది శత్రువు యుద్ధానికి ఆయత్తమవుతుండటాన్ని సూచిస్తుంది.

26) ప్రమాణపూర్వకమైన ఒప్పందం తోడుగా లేని శాంతి ప్రతిపాదనలు కుట్రను సూచిస్తాయి.

27) రణరంగంలో పరుగులు మొదలై, సైనికులందరూ తమ తమ స్థానాలను చేరుకుంటుంటే కీలక సమయం వచ్చేసిందని అర్థం.

28) కొందరు పురోగమిస్తూ, కొందరు తిరోగమిస్తూ కనబడితే అది ఒక ప్రలోభం.

29) సైనికులు తమ బల్లాలమీద వాలిపోయి నిలబడినప్పుడు వారు ఆకలితో నీరసించి పోయినట్లు.

30) మంచి నీరు తేవడానికి పంపబడిన వారు ముందుగా తాము నీరు త్రాగడంతో పనిప్రారంభిస్తే సైన్యం దప్పికతో బాధపడుతున్నట్లు.

31) తాము పొందగలిగిన ప్రయోజనాన్ని శత్రువు గమనించి కూడా దానిని పొందడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకపోతే సైనికులు డస్సిపోయినట్లు.

32) ఏదైనా ప్రాంతంలో పక్షులు మూగితే అక్కడ ఎవరూ లేనట్లే*. రాత్రి పూట ఉద్వేగపూరితమైన అరుపులు వినిపిస్తుంటే అది శత్రువు భయంతో ఉన్నాడన్నదానికి సంకేతం.

(అక్కడ ఎవరూ లేనట్లే*: శత్రువు అక్కడినుండి వెళ్ళిపోయాడని అర్థం)

33) శిబిరంలో అలజడి చెలరేగితే, సేనాని అధికారం బలహీనంగా ఉన్నదని అర్థం. జండాలు, చిహ్నాలు మారిపోతుంటే తిరుగుబాటును రెచ్చగొట్టే చర్యలు ఊపందుకున్నాయని అర్థం. ఆధికారులు కోపంగా ఉన్నారంటే, సైనికులు అలసి పోయారని అర్థం.

34) ఒక సైన్యం తన గుఱ్ఱాలకు ధాన్యాన్ని ఆహారంగా అందిస్తూ, తమ ఆహారం కొరకు పశువులను వధిస్తుంటే; అలాగే తమ గుడారాలకు తాము ఇక తిరిగి రామని తెలిపే విధంగా సైనికులు శిబిరంలో వేసిన మంటలపై వంటపాత్రలను వ్రేలాడదీయకపోతేవారు మరణించేవరకూ తెగించి పోరాడటానికి నిర్ణయించుకున్నారని నీవు తెలుసుకోవచ్చు.

(మామూలు సమయాలలో సైన్యం తాము ధాన్యాన్ని ఆహారంగా స్వీకరించి, గుఱ్ఱాలకు ప్రధానంగా గడ్డిని ఆహారంగా పెడుతుంది, పశువులను సంరక్షించుకుంటుంది. చావుకు సిద్ధపడిన సమయంలో ఇక పశువులు ఉండీ ఎవరికి ప్రయోజనం అనుకొని, బ్రతికిఉన్న కొద్ది దినాలూ రుచికరమైన మాంసాహారం తినే ఉద్దేశ్యంతో వారు పశువులను వధిస్తారు. తాము తినే ధాన్యాన్ని గుఱ్ఱాలకు పెడతారు.)

35) సైనికులు చిన్న చిన్న సమూహాలుగా చేరి గుసగుసలాడుకుంటున్న లేక తగ్గుస్వరంతో మాట్లాడుకుంటున్న దృశ్యం సైన్యపు క్రింది స్థాయిలోని అసంతృప్తిని సూచిస్తుంది.

36) చాలా తరచుగా ఇవ్వబడే బహుమతులు శత్రువు నిల్వలు తరిగి పోతున్నాయన్నదానికి గుర్తు. మరీ ఎక్కువ సంఖ్యలో శిక్షలు వారు అత్యంత తీవ్రమైన బాధను ఎదుర్కొంటున్నారనే దానిని బయటపెడతాయి.

(శత్రువు దిగ్బంధం చేయబడి అతడికి సరఫరాలు నిలచిపోతే అతడి నిల్వలు తరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో తిరుగుబాటు చెలరేగే ప్రమాదముంది కనుక సైనికులను సంతోష పెట్టడానికి తరచుగా బహుమతులు ఈయబడతాయి. అలాగే శత్రుసైన్యం దుర్భరమైన పరిస్థితిలో ఉంటే వారిలో క్రమశిక్షణ లోపిస్తుంది కనుక వారిని దారిలో పెట్టడానికి తరచుగా శిక్షలు అమలౌతుంటాయి)

37) సేనాని మొదట డంబాలు పలికి, తరువాత శత్రుసైన్యం యొక్క సంఖ్యకు భయపడితే, అది అతడి యొక్క వివేకరాహిత్యాన్ని తెలుపుతుంది.

(ఈ వాక్యం కొందరి వ్యాఖ్యాతల ప్రకారం ఇలా ఉంటుంది: సేనాని తన సైనికులతో మొదట కౄరంగా ప్రవర్తించి, తదుపరి తిరుగుబాటుకు పాల్పడతారేమో అని వారికి భయపడితే అది అతడికి ఏమాత్రం వివేకం లేకపోవడాన్ని తెలుపుతుంది)

38) నోటినిండా ప్రశంసలు కురిపిస్తూ దూతలు పంపబడినపుడు, శత్రువు తాత్కాలిక యుద్ధవిరమణను కోరుకుంటున్నాడని దానికి సంకేతం.

39) శత్రు సైన్యం కోపోద్రిక్తతతో ముందుకు వచ్చి, ఆ తరువాత మన సైన్యానికి అభిముఖంగా యుద్ధాన్ని ప్రారంభించకుండా, వెనుకకు మరలకుండాదీర్ఘకాలం పాటు అలానే ఉండిపోతే, అది ఎంతో అప్రమత్తంగా ఉండి ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించవలసిన పరిస్థితి.

(శత్రువు హఠాత్తుగా దాడికి పాల్పడటానికి కావలసిన సమయాన్ని తీసుకుంటున్నాడు.)

40) చాలినంతమంది సైనికులున్న శత్రుసైన్యం కన్నా మన సైన్యం సంఖ్యలో తక్కువగా ఉంటే, దాని అర్థం మనం ప్రత్యక్ష దాడికి పాల్పడలేమని మాత్రమే. మనం చేయవలసినదేమిటంటే మనకు అందుబాటులో ఉన్న బలాన్నంతటినీ ఏకీకృతం చేసి, శత్రువును నిశితంగా గమనిస్తూ, అదనపు బలగాలను చేర్చుకోవడం.

(అదనపు బలగాలను బయటినుండి కాక దండయాత్రను అనుసరించి వచ్చే సైనికేతరుల నుండే సమకూర్చుకోవాలి)

41) ముందు ఆలోచన అనేది చేయకుండా ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసే వాడు తప్పక వారికి పట్టుబడిపోతాడు.

42) సైనికులకు నీతో అనుబంధం ఏర్పడకముందే వారిని శిక్షిస్తే, వారు నీ యెడల విధేయత కలిగి ఉండరు. విధేయత లేనట్లైతే వారు ఆచరణలో నిరుపయోగంగా ఉంటారు. వారికి నీతో అనుబంధం ఏర్పడిన తరువాత వారిని శిక్షించకపోతే అప్పుడు కూడా వారు నిరుపయోగంగానే ఉంటారు.

43) కనుక సైనికులను మొదట మానవత్వంతో ఆదరించాలి, కానీ ఆ తరువాత వారిని ఉక్కు క్రమశిక్షణ ద్వారా నియంత్రణలో ఉంచాలి. ఇది విజయానికి ఓ ఖచ్చితమైన దారి. 

44) సైనికులకు శిక్షణ ఇచ్చేటపుడు ఆదేశాలను స్థిరంగా, క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే సైన్యం మంచి క్రమశిక్షణ గలదిగా అవుతుంది. అలా చేయకపోతే దానికి క్రమశిక్షణ ఉండదు.

45) ఒక సేనాని తన సైనికులలో విశ్వాసం కనబరుస్తూనే తన ఆజ్ఞలకు వారు విధేయత చూపాలని ఎల్లప్పుడూ కోరుకుంటుంటే ఇరువురికీ మేలు జరుగుతుంది.




(తొమ్మిదవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి