యుద్ధకళ
11వ అధ్యాయం: తొమ్మిది పరిస్థితులు
సన్–జు
చెప్పాడు:
1) రణతంత్రం తొమ్మిది రకాలైన భూములను గుర్తించినది.
a. చెల్లాచెదురు భూమి
b. సులువైన భూమి
c. పోటీపడే భూమి
d. బహిరంగ భూమి
e. కూడలి భూమి
f. గంభీరమైన భూమి
g. కష్టమైన భూమి
h. నిర్బంధించబడిన భూమి
i. తెగించవలసిన భూమి
2) ఒక తెగ నాయకుడు తన స్వంత భూభాగంలోనే యుద్ధం చేస్తున్నప్పుడు
అది ‘చెల్లాచెదురు భూమి’.
(సైనికులు తమ నివాసాలకు సమీపంలో ఉండటం వలన తమ భార్యాపిల్లలను
చూడాలనే ఆతురతలో అన్ని దిశలలోకి చెల్లాచెదరై పోతారు కనుక అలా పిలుస్తారు. ఇళ్ళు
సమీపంలో ఉండటం వలన వారికి పురోగమించేటపుడు తెగింపుతో కూడిన ధైర్యం ఉండదు, తిరోగమించేటపుడు –ఆశ్రయం కోసం మరెక్కడికో ఎందుకు? –వారు తమ ఇళ్ళకే పారిపోతారు.)
3) అతడు ప్రత్యర్థి భూభాగంలోకి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిదూరం
చొచ్చుకు వెళ్ళినపుడు అది ‘సులువైన
భూమి’.
(అటువంటి సందర్భంలో సులువుగా తిరోగమించే అవకాశం ఉంటుంది కనుక)
4) ఆక్రమించడంవలన ఇరుపక్షాలలో దేనికైనా కూడా గొప్ప సానుకూలతను
తెచ్చిపెట్టే భూమి ‘పోటీపడే భూమి’.
(అటువంటి ప్రదేశాన్ని ఆక్రమణలోకి తెచ్చుకోవడానికి పోటీపడి
పోరాడాలి కనుక)
5) ఇరుపక్షాలూ తిరుగాడే స్వేచ్ఛ కలిగి ఉండే భూమి ‘బహిరంగ భూమి ’.
6) మూడు దేశాల సరిహద్దులు కలిసే భూమిని ముందుగా ఆక్రమించిన వారు
సామ్రాజ్యంలో అధికభాగం తన అదుపులోకి తెచ్చుకుంటారు. అటువంటి భూమి ‘కూడలి భూమి ’.
7) కోటగట్టబడిన అనేక నగరాలను తన వెనుక వదిలేస్తూ శత్రుదేశపు
మధ్యభాగంలోకి సైన్యం చొచ్చుకు వెళ్ళినపుడు అది ‘గంభీరమైన భూమి ’.
(అటువంటి ప్రదేశం నుండి తిరోగమించడం కష్టం కనుక ఆ సైన్యం
పరిస్థితి గంభీరంగా ఉంటుంది.)
8) దేశమంతా పర్వత ప్రాంత అడవులు, గరుకుగా ఉన్న వాలు ప్రాంతాలు, నీటి చెలమలు, చిత్తడి
నేలలతో ఉండి ప్రయాణించడానికి కష్టంగా ఉంటే అది ‘కష్టమైన భూమి ’.
9) కొండల నడుమ ఉన్న సన్నని, ఇరుకైన దారుల గుండా చేరుకోగలిగే భూమి, అలాగే మెలికలు తెరిగిన దారులగుండా మాత్రమే వెలుపలికి రాగలిగిన
భూమి అవటం వలన మన సైన్యంలోని పెక్కుమందిని చిత్తుగా ఓడించడానికి శత్రుసైన్యంలోని
కొద్దిమంది సరిపోతారు. అటువంటి ప్రదేశం ‘నిర్భందించబడిన
భూమి ’.
10) ఏ భూమి మీద ఐతే మనం ఆలస్యం లేకుండా పోరాడటం వలన మాత్రమే
విధ్వంసం బారిన పడకుండా రక్షించబడతామో అది ‘తెగించవలసిన భూమి ’.
11) కనుక చెల్లాచెదురు భూమిలో పోరాడకు. సులువైన భూమిలో ఆగకు.
పోటీపడే భూమిలో దాడి చేయకు.
12) బహిరంగభూమిలో శత్రువు కదిలే మార్గానికి అవరోధం కల్పించడానికి
ప్రయత్నించకు. కూడలి భూమిలో మిత్రులతో చేయి కలుపు.
(బహిరంగ భూమిలో శత్రువు కదిలే మార్గానికి అవరోధం
కల్పించాలనుకుంటే మనమే చిక్కుల్లో పడతాం. ఆ ప్రయత్నంలో మన సేన విడిపోతుంది;
కూడలి భూమిలో మిత్రులతో చేయికలపడమంటే పొరుగు రాజ్యాలతో పొత్తులు పెట్టుకోవడం.)
13) గంభీరమైన భూమిలో లూటీ చేయి. కష్టమైన భూమిలో ఏకధాటిగా వెళుతూనే
ఉండు.
(గంభీరమైన భూమిలో ఎక్కువకాలం ఉండవలసి వస్తుంది కనుక ఆహారం కొరకు
లూటీ మీద ఆధారపడాలి, కష్టమైన
భూమిలో రక్షణ ఏర్పాట్లు కుదరవు కనుక దానిని సాధ్యమైనంత త్వరగా వదిలిపెట్టాలి.)
14) నిర్బంధించబడిన భూమిలో ఎత్తుగడమీద ఆధారపడు. తెగించవలసిన భూమిలో
పోరాడు.
15) ప్రాచీనకాలంలో నైపుణ్యం కలిగిన నాయకులుగా పిలువబడిన వారికి శత్రుసైన్యం
ముందుభాగాన్ని, వెనుక భాగాన్ని
ఒకదానినుండి మరోదానిని వేరు చేయడమెలాగో తెలుసు, దాని పెద్ద, చిన్న
విభాగాల మధ్యన సహకారం లేకుండా చేయడమెలాగో తెలుసు. ఆపదలో ఉన్న బలగాలను సురక్షితమైన
బలగాలు కాపాడకుండా, అధికారులు సైనికులను సమీకరించకుండా
అడ్డుపడటమెలాగో తెలుసు.
16) శత్రుపక్షం ఐక్యంగా ఉన్నపుడు అది అస్తవ్యస్తతకు గురయ్యేటట్లు
వారు చేసారు.
17) వారికి ప్రయోజనకరంగా ఉంటుందనుకున్న సమయంలో ముందడుగు వేసారు.
అలా కాని సమయంలో వారు నిలిచిపోయారు.
18) క్రమమైన పద్దతిలో తీర్చిదిద్దబడిన పెద్దసంఖ్యలో ఉన్న శత్రుసైన్యం
దాడి చేయడానికి కదులుతూ వస్తుంటే ఎలా ఎదుర్కోవాలి అని అడిగితే నేనిలా చెబుతాను: “నీ శత్రువు దేనిని కాపాడుకోవాలనుకుంటాడో,
దేనికి ప్రాముఖ్యత ఇస్తాడో దానిని
ముందుగా స్వాధీనం చేసుకో. అతడప్పుడు నీ అభీష్టానికి లోబడిపోతాడు.”
19) వేగం అనేది యుద్ధసారం. శత్రువు సిద్ధంగా లేకపోవడాన్ని నీవు
సానుకూలంగా మార్చుకో. ఊహించని దారులలో ప్రయాణించి, రక్షణలేని ప్రదేశాలమీద దాడిచేయి.
20) దండెత్తుతున్న బలగం పాటించవలసిన సూత్రాలు: ఒక దేశంలోకి నీవు
చొచ్చుకువెళ్ళేకొలదీ నీ బలగాల మధ్య ఐక్యత హెచ్చుతుండాలి. దానివలన దాడిని కాచుకునే
నీ ప్రత్యర్థి నీ ముందు నిలవలేడు.
21) సారవంతమైన దేశంలో నీ సైన్యానికి ఆహారం సరఫరా చేసే నిమిత్తం
దోపిడీలు చేయి.
22) నీ సైనికుల సంక్షేమం గురించి జాగ్రత్తగా తెలుసుకో. వారినుండి
మితిమీరి ఆశించవద్దు. నీ శక్తిని ఏకీకృతం చేయి, నీ బలాన్ని పొదుపుగా నిల్వచేయి. నీ సైన్యాన్ని నిరంతరం
చైతన్యంతో ఉంచు. దుర్గ్రాహ్యమైన పథకాలకు రూపకల్పనచేయి.
23) తప్పించుకునే అవకాశం లేని స్థానాలకు నీ సైనికులను నెట్టు,
అపుడు వారు పలాయనానికి బదులుగా మరణాన్ని
ఎంచుకుంటారు. వారు మరణానికి ఎదురుగా ఉంటే, వారు
సాధించలేనిది ఏదీ లేదు. అధికారులు,
సైనికులు ఒకే రకంగా తమ సంపూర్ణ శక్తిని వెలికితీస్తారు.
24) సైనికులు అతి ప్రమాదకరమైన కష్టంలో ఉన్నపుడు, భయమనే భావనను కోల్పోతారు. ఆశ్రయం పొందే
చోటే లేనట్లైతే, వారు పారిపోకుండా స్థిరంగా
నిలబడతారు. శత్రుదేశంలో ఉన్నట్లైతే,
వారు ప్రత్యర్థిని మొండిగా
ఎదుర్కొంటారు. సహాయమనేదే లేకపోతే,
వారు శక్తి మేరకు పోరాడతారు.
25) ఆ విధంగా, మార్గనిర్దేశకాల
కొరకు ఎదురు చూడకనే సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అడిగేవరకు వేచి ఉండకనే
వారు నీ అభీష్టాన్ని నెరవేరుస్తారు. నిర్బంధాలేవీ లేకనే వారు తమ విధులను
నిర్వర్తిస్తారు. ఆజ్ఞలేవీ జారీ చేయకనే వారిలో మనం నమ్మకముంచవచ్చు.
26) శకునాలను చూడటాన్ని నిషేధించు, అర్థరహితమైన భయాలను, సందేహాలను
పటాపంచలు చేయి. అపుడు వారు మరణించేవరకు మరో ఆలోచన లేకుండా యుద్ధంలో పాల్గొంటారు.
27) మన సైనికుల వద్ద అధికధనం లేకపోతే దానికి కారణం వారికి సంపదమీద
అనిష్టత కాదు. వారు ఎక్కువకాలం బ్రతకకపోతే దానికి కారణం వారికి దీర్ఘాయుష్షు మీద
అనిష్టత కాదు.
(గత్యంతరం లేకపోవడం వల్లే వారు తమ సంపదను, జీవితాలను త్యజిస్తారు. ధనాన్ని కలిగి
ఉంటే సైనికులకు జీవితం మీద ఆశ పెరుగుతుంది. యుద్ధం మీద ధ్యాస తగ్గుతుంది. కనుక
సేనాధిపతి అనేవాడు మనుషులందరూ కోరుకునే ఆ రెంటినీ త్యజించవలసిన అగత్యాన్ని తన
సైనికులకు కల్పించాలి.)
28) పోరాటాన్ని ప్రారంభించమని ఆజ్ఞ అందుకున్న రోజున—కూర్చున్న వారి బట్టలు కన్నీటితో
తడుస్తూ, పడుకున్నవారి
చెక్కిళ్ళమీద కన్నీరు ధారలుగా కారుతూ—నీ
సైనికులు వెక్కివెక్కి ఏడవవచ్చు. అయితే ఒకసారి వారిని తప్పించుకోవడం సాధ్యం కాని
విపత్కర స్థితిలోకి నెట్టివేస్తే, ఇక
వారు ఒక ‘చూ’ లేక ఒక ‘కూయి’ వలే
ధైర్యాన్ని ప్రదర్శిస్తారు.
(‘చూ’ మరియు
‘కూయి’ అనేవారు ప్రాచీనకాలపు ప్రఖ్యాత చైనా యోధులు)
29) యుద్ధ వ్యూహాలలో నైపుణ్యం కలిగినవాడిని ‘షుయై–జాన్’
(shuai-jan) తో పోల్చవచ్చు. షుయై–జాన్
అనునది చాంగ్ పర్వతాలలో నివసించే ఒక వేగవంతమైన సర్పం. నీవు దాని తలమీద
కొడితే, అది నీమీద దానితోకతో
దాడి చేస్తుంది. నీవు దాని తోక మీద కొడితే అది నీమీద దాని తలతో దాడి చేస్తుంది.
మధ్యభాగంలో కొడితే తల, తోక
రెంటితో దాడి చేస్తుంది.
30) ఒకసైన్యాన్ని షుయై–జాన్
వలె రూపొందించడం సాధ్యమేనా అని ఎవరైనా అడిగితే దానికి నేను ఔననే సమాధానం చెబుతాను.
‘వు’ రాజ్యసైనికులు, ‘యు’
రాజ్యసైనికులు పరస్పరం శత్రువులు.
అయినాకూడా వారు ఒకే పడవలో ఒక నదిని దాటుతూ మార్గమధ్యంలో తుఫానులో గనుక చిక్కుకుంటే
ఎడమ చేయి కుడిచేయికి సాయపడినట్లుగా వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.
(ఉమ్మడి విపత్తును ఎదుర్కొంటున్నపుడు శత్రువులే ఒకరికొకరు
సహాయపడగలిగినప్పుడు, ఒకే
సైన్యంలోని వేరు వేరు భాగాలు తప్పనిసరిగా ఒకదానినినొకటి ఆదుకుంటాయి.)
31) కనుక గుఱ్ఱాలను కట్టివేయడాన్ని, రథచక్రాలను పూడ్చివేయడాన్ని నమ్ముకుంటే చాలదు.
(యుద్ధంలో గెలుపొందడంకొరకు సైనికులు పారిపోకుండా గుఱ్ఱాలను
కట్టివేయడం, రథచక్రాలను
పూడ్చివెయ్యడం లాంటి చర్యలు తీసుకున్నంత మాత్రాన సరిపోదు. నీ సైనికులలో పట్టుదల,
అందరూ ఒకే లక్ష్యంతో పనిచేయగలగడం,
అన్నింటినీ మించి సానుభూతితో ఒకరికొకరు
సహకరించుకొనే స్ఫూర్తి లేనట్లైతే నీవు గెలుపొందలేవు. షుయై–జాన్ నుండి నేర్చుకోవలసిన పాఠం ఇదే.)
32) అందరూ తప్పకుండా చేరుకోవలసిన ఒక ధైర్యపు స్థాయిని ఏర్పరచడమే
సైన్యాన్ని నిర్వహించే సూత్రం.
(ఒకేఒకవ్యక్తి ధైర్యం అనిపించేటట్లుగా అందరి ధైర్యం ఒకేస్థాయిలో
ఉండాలి. ఆవిధంగా వారిని
ప్రేరేపించాలి.
సైన్యమంతా ఒకే దేహంగా రూపొందినపుడు సైనికులందరి ఉద్దేశ్యం, స్ఫూర్తి ఒకే విధంగా ఉంటాయి. ఏం జరిగినా
కూడా అవి ఒక స్థాయి కన్నా తగ్గవు.)
33) బలవంతులు,
బలహీనులు—వీరిరువురనూ ఉత్తమంగా
ఎలా వినియోగించుకోవాలనేది యుద్ధభూమిని సక్రమంగా ఉపయోగించుకోవడం మీద ఆధారపడి
ఉంటుంది.
34) నిపుణుడైన సేనాని తనను అనుసరించడం తప్ప మరోదారిలేని ఒక
వ్యక్తిని నడిపించినంత సులువుగా ఒక సైన్యాన్ని నడిపిస్తాడు.
35) విషయాలను రహస్యంగా ఉంచడం కొరకు మౌనంగా ఉండటం, పరిస్థితి సవ్యంగా ఉండటం కొరకు నీతి,
నిజాయితీలతో మెలగటం ఒక సేనాని కర్తవ్యం.
36) తప్పుడు
నివేదికలతో, తప్పుడు ప్రదర్శనలతో
అతడు తన అధికారులకు, సైనికులకు అయోమయాన్ని
కలిగించాలి—ఆ విధంగా వారిని
పూర్తిగా తెలియని స్థితిలోనే ఉంచాలి.
37) తన ఏర్పాట్లను మార్చడం ద్వారా, తన పథకాలను మార్చడం ద్వారా అతడు శత్రువుకు తన గురించి సరైన
సమాచారం లేకుండా చేస్తాడు. తన శిబిరాన్ని తరలించడం ద్వారా, చుట్టుతిరుగుడు దారుల్లో ప్రయాణించడం ద్వారా శత్రువు తన
ఉద్దేశ్యాన్ని ముందస్తుగా ఊహించకుండా నిరోధిస్తాడు.
38) క్లిష్ట సమయంలో ఒక సైన్యానికి నాయకుడు –ఎత్తుకి చేరుకున్న తరువాత వెనుకనున్న నిచ్చెనను తన్నివేసే
వ్యక్తి– వలే వ్యవహరిస్తాడు.
శత్రుభూభాగం లోపలికి చాలాదూరం తన సైనికులను నడిపించిన తరువాత మాత్రమే అతడు తన అసలు
ఉద్దేశ్యాలను బయట పెడతాడు.
39) అతడు తన పడవలను తగులబెడతాడు, వంటపాత్రలను పగులగొడతాడు; ఒక గొఱ్ఱెల కాపరి తన గొఱ్ఱెల మందను నడిపించినట్లుగా అతడు తన
సైనికులను అనేక దారులలో నడిపిస్తాడు. ఇంతకీ అతడు ఎక్కడికి వెళుతున్నాడో ఎవరికీ
తెలియదు.
40) తన సైన్యాన్ని సమీకరించడం, దానిని ప్రమాదంలోకి తీసుకు వెళ్ళడం—దీనిని ఒక సేనాని విధిగా చెప్పవచ్చు.
41) తొమ్మిది రకాల యుద్ధ భూములకు సరిపోయే విధంగా వేరువేరు చర్యలు;
దాడి చేసే లేక ఆత్మరక్షణ గావించుకొనే
ఎత్తుగడలను సమయోచితంగా ఉపయోగించుకోవడం; మానవ
స్వభావపు ప్రాధమిక నియమాలు: ఇవి ఎంతో ఖచ్చితంగా అధ్యయనం చేయవలసిన విషయాలు.
42) శత్రుదేశం మీద దండెత్తుతున్నపుడు సాధారణ సూత్రం ఏమిటంటే,
దేశం లోపలికంటా చాలా దూరం చొచ్చుకు
వెళ్ళడం అనేది సైన్యంలో ఐక్యతను తెస్తుంది; కొద్దిదూరం మాత్రమే చొచ్చుకు వెళ్ళడం అంటే దానర్థం సైన్యం
చెల్లాచెదరై పోవడమే.
43) నీ స్వంతదేశాన్ని దాటివేసి, పొరుగుదేశం గుండా నీ సైన్యాన్ని నడిపించేటపుడు నీవు ‘క్లిష్టమైన భూమి’లో ఉంటావు. నలువైపులా సమాచారవ్యవస్థ ఉన్నపుడు అది ‘కూడలి భూమి’.
44) నీవు ఒక దేశంలోకి చాలా దూరం చొచ్చుకువెళితే అది గంభీరమైన భూమి.
నీవు కొద్ది దూరం మాత్రమే చొచ్చుకు వెళితే అది సులువైన భూమి.
45) వెనుకవైపు బలమైన శత్రుస్థావరాలు, ముందువైపు ఇరుకైన కనుమదారులు ఉంటే అది నిర్బంధించబడిన భూమి.
ఆపత్సమయంలో ఆశ్రయం పొందగలిగిన ప్రదేశమే అసలు లేకపోతే అది తెగించవలసిన భూమి.
46) కనుక, చెల్లాచెదురు
భూమిలో అందరూ ఒకే ఉద్దేశ్యంతో పోరాడే తత్త్వాన్ని నేను నా సైనికులలో
ప్రేరేపిస్తాను. సులువైన భూమిలో నా సైన్యంలోని అన్ని భాగాల మధ్యన సన్నిహిత బంధం
ఉండేటట్లు చూస్తాను.
47) పోటీపడే భూమిలో నేను సైన్యం వెనుక భాగాన్ని తొందరపెడతాను.
(వెనుకభాగం వెనుకనే ఉండిపోక త్వరితగతిన ముందుభాగంతో కలసి కీలక
స్థావరాలను ఆక్రమణలోకి తెచ్చుకోవడం కొరకు)
48) బహిరంగ భూమి మీద నేను నా రక్షణ సాధనాల విషయంలో అప్రమత్తంగా
ఉంటాను. కూడలి భూమి మీద నేను మిత్రరాజ్యాలతో బంధాన్ని దృఢతరం చేసుకుంటాను.
49) గంభీరమైన భూమిమీద సరఫరాలు నిరంతరాయంగా లభించేటట్లు చేయడానికి
ప్రయత్నిస్తాను. కష్టమైన భూమిమీద దారివెంట ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాను.
50) నిర్బంధించబడిన భూమిమీద తిరోగమించడానికి ఎటువంటి మార్గమున్నా
దానిని మూసివేస్తాను. తెగించవలసిన భూమిమీద తమ జీవితాలను రక్షించుకోవడంలోని
నిష్ఫలత్వాన్ని నా సైనికులకు ప్రకటిస్తాను.
51) ఎందుకంటే, చుట్టుముట్టబడినపుడు
దృఢంగా ప్రతిఘటించడం, మరోదారి
లేనపుడు సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడటం, ప్రమాదంలో
పడినపుడు ఆదేశాలను తు.చ. తప్పకుండా శిరసా వహించడం ఒక సైనికుని స్వభావం.
52) పొరుగు రాజుల పథకాలేమిటో తెలుసుకునేవరకూ వారితో మనం పొత్తులకు
దిగలేము. ఒక దేశ భూస్వరూపం—ఆ
దేశంలోని పర్వతాలు, అడవులు; దానిలోని లోయలు, అగాథాలు; దానిలోని
నీటి చెలమలు, చిత్తడి నేలలు—
గురించి అవగాహన లేకుండా ఆ దేశం గుండా
ప్రయాణించే సైన్యానికి నాయకత్వం వహించడానికి మనం తగము. స్థానికుల
మార్గదర్శకత్వాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే ఆ ప్రదేశపు సహజ సానుకూలతల నుండి మనం
లభ్ది పొందలేము.
53) ఈ క్రింది నాలుగైదు సూత్రాలలో ఏ ఒక్కటైనా తెలియకపోవడం అనేది
సైనిక స్వభావం కలిగిన (యుద్ధ పిపాసియైన) ఒక రాజుకి తగదు.
54) యుద్ధ పిపాసియైన ఒక రాజు ఒక శక్తివంతమైన రాజ్యం మీద
దాడిచేసినపుడు, శత్రు బలగాలు సమీకృతం
కాకుండా నిరోధించడంలోనే అతడి సైన్యాధిపత్యం ప్రదర్శితమవుతుంది. అతడు తన
ప్రత్యర్థులను ఎంతగా భయపెడతాడంటే వారి మిత్ర రాజ్యాలు అతడికి వ్యతిరేకంగా యుద్ధంలో
పాల్గొనడానికే వెనుకాడతాయి.
55) కనుక అతడు అనేక మందితో పొత్తుపెట్టుకోవడానికి ప్రాకులాడడు. తద్వారా
ఇతర రాజ్యాల శక్తి పెంపొందనివ్వడు. శత్రువులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ రహస్యమైన తన స్వంత పథకాలను
అతడు అమలు చేస్తాడు. ఆవిధంగా అతడు వారి నగరాలను స్వాధీనం చేసుకొని, వారి సామ్రాజ్యాలను జయిస్తాడు.
56) నియమనిబంధనలతో నిమిత్తం లేకుండా బహుమతులను అందించు, విధివిధానాలతో నిమిత్తం లేకుండా
ఆదేశాలను జారీచేయి; దానితో ఒకేఒక
వ్యక్తితో వ్యవహరిస్తున్న మాదిరిగా నీవు మొత్తం సైన్యాన్ని నడిపించగలవు.
57) నీ సైనికులకు వారు చేయవలసిన పనిని మాత్రమే తెలుపు. నీ పథకం
గురించి వారికెప్పుడూ తెలియనీయకు. విజయావకాశం స్పష్టంగా ఉన్నపుడు దానిని వారికి
చూపించు, పరిస్థితి
నిరాశాజనకంగా ఉంటే మాత్రం వారికేమీ చెప్పకు.
58) నీ సైన్యాన్ని మృత్యుసమానమైన ప్రమాదానికి గురిచేయి, అది బ్రతికి బట్టకడుతుంది. ఎటువంటి
ఆశాలేని అంతులేని కష్టాలలోకి దానిని నెట్టివేయి, అది సురక్షితంగా బయటపడుతుంది.
59) ఎందుకంటే ఒక బలగం ప్రమాదంలో పడినపుడు విజయానికి కావలసిన
దెబ్బకొట్టడానికి తగిన సామర్థ్యాన్ని అది కలిగి ఉంటుంది.
60) శత్రువు ఉద్దేశ్యాలకు అనుగుణంగా మనలను జాగ్రత్తగా మలచుకోవడం
ద్వారా యుద్ధంలో విజయాన్ని సాధించవచ్చు.
(శత్రువు పురోగమించదలిస్తే, ఆ విధంగానే చేసేటట్లుగా అతడిని ప్రలోభపెట్టు; ఒకవేళ అతడు తిరోగమించాలని ఆతురత పడితే, అందుకు కావలసిన సమయాన్ని అతడికి
కల్పించు. అతడికి అనుకూలంగా ప్రవర్తించడంలో మన ఉద్దేశ్యం మనం అతడిమీద దాడిచేసే
లోపు అతడిలో నిర్లక్ష్యం, ధిక్కారం
మొదలైన ప్రమాదకర లక్షణాలు పెంపొందేటట్లు చేయడమే.)
61) పట్టుదలతో శత్రువు పొంతనే కాచుకొని ఉండటం ద్వారా దీర్ఘకాలంలో
సైన్యాధ్యక్షుడిని చంపడంలో మనం విజయం సాధిస్తాము.
62) ఒక విషయాన్ని పూర్తి చాతుర్యంతో నెరవేర్చగల సామర్థ్యంగా దీనిని
పిలుస్తారు.
63) నీవు నీ అధికారాలను స్వీకరించిన రోజునే సరిహద్దు
మార్గాలన్నింటినీ మూసివేయి. విదేశీ ప్రయాణాన్ని అనుమతించే అధికారిక పత్రాలను నాశనం
చేయి. దౌత్యవేత్తల రాకపోకలను నిలిపివేయి.
64) సభామందిరంలో దృఢంగా వ్యవహరించడం ద్వారా నీవు పరిస్థితిని
నియంత్రించవచ్చు.
(నీ పథకాలకు ప్రభువు అనుమతి లభించేటట్లుగా గట్టిగా ప్రయత్నించు)
65) శత్రువు నీకో అవకాశాన్ని ఇస్తే, దానిని వెంటనే అందిపుచ్చుకో!
66) నీ ప్రత్యర్థి జాగ్రత్తగా కాపాడుకుంటున్నదానిని నీవు
చేజిక్కించుకోవడం ద్వారా అతడి ముందఱికాళ్ళకు బంధం వేయి. అతడు యుద్ధభూమిని చేరుకునే
సమయం నీకనుకూలంగా ఉండేటట్లుగా నైపుణ్యంతో వ్యవహరించు.
67) నిర్ణయాత్మకమైన యుద్ధం చేయగలిగే వరకూ నీవు నియమానుసారంగానే
ప్రవర్తించు, శత్రువుకు
అనుకూలంగానే నిన్ను నీవు మలచుకుంటూ ఉండు.
68) కనుక, శత్రువు
నీకో అవకాశాన్ని ఇచ్చేవరకూ మొదట ఒక యువతి వలే బిడియాన్ని ప్రదర్శించు, తరువాత పరిగెత్తే కుందేలు వేగాన్ని
మించిపోవడానికి ప్రయత్నించు, దానితో
నిన్ను ప్రతిఘటించడానికి శత్రువుకు సమయం మించిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి