10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సన్-జు 'యుద్ధకళ': 7వ అధ్యాయం




యుద్ధకళ




7వ అధ్యాయం:  సైనిక విన్యాసాలు









సన్జు చెప్పాడు:

1) యుద్ధానికి సంబంధించి సైన్యధికారి తన ప్రభువునుండి ఆదేశాలను స్వీకరిస్తాడు.

2) సైన్యాన్ని సమీకరించి, తన బలగాలన్నింటినీ ఏకీకృతం చేసిన తరువాత, అతడు తన యుద్ధ శిబిరాన్ని ఏర్పాటుచేయడంకన్నా ముందే వాటిలోని వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని, సామరస్యాన్ని తప్పనిసరిగా నెలకొల్పాలి.

3) ఆ తరువాత, అన్నింటికన్నా కష్టమైన యుక్తిపర సైనికవిన్యాసాలు (tactical maneuvering) వస్తాయి. ఈ యుక్తిపర సైనిక విన్యాసాలలోని కష్టం అంతా డొంకతిరుగుడుగా ఉండే దానిని సూటిగానూ, దురదృష్టాన్ని లాభంగానూ మార్చుకోగలగడంతో కూడుకొని ఉంటుంది.

(Tactical maneuvering అంటే శత్రువును తప్పుదారిపట్టించడం కొరకు... తద్వారా ప్రతికూలపరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కొరకు పన్నే ఎత్తుగడలు.)

4) శత్రువు తప్పుదారి పట్టేటట్లు ప్రలోభపెట్టిన తరువాత, సుదీర్ఘమైన చుట్టుతిరుగుడు మార్గాలలో ప్రయాణించడం, అతడి తరువాత ప్రయాణం ప్రారంభించినా కూడా అతడికన్నా ముందు గమ్యాన్ని చేరుకునే విధంగా జాగ్రత్తపడటం అనేవి తప్పుదారి పట్టించే నైపుణ్యంయొక్క పరిజ్ఞానాన్ని సూచిస్తాయి.

(తనకు శత్రువు మీద దాడి చేసే ఉద్దేశ్యం లేదన్నట్లుగా సుదూర ప్రాంతంలో కాలయాపన చేయడం ద్వారా శత్రువును ఏమార్చి, ఆతరువాత శరవేగంతో తన ప్రయాణాన్ని పూర్తిచేసి, శత్రువుకంటే ముందుగా యుద్ధక్షేత్రానికి చేరుకోవటం)

5) సైనిక విన్యాసాలు సుశిక్షితమైన సైన్యంతో అయితే లాభదాయకం. అదే క్రమశిక్షణ లేని మందతో అయితే ఎంతో నష్టదాయకం.

6) ఒకానొక ప్రయోజనాన్ని చేజిక్కించుకోవడం కొరకు సైన్యాన్ని పూర్తి సరంజామాతో పంపితే చాలా ఆలస్యం జరిగే అవకాశముంటుంది. మరోపక్క అదే లక్ష్యం కొరకు త్వరితగతిన కదిలే ఒక సైనికవిభాగాన్ని మిగతా సైన్యం నుండి విడగొట్టి పంపితే అది తన సామానుకు, నిల్వలకు దూరమవుతుంది.

7) ఆ విధంగా, నీవు వంద లీల దూరంలో ఉన్న ఒకానొక ప్రయోజనాన్ని చేజిక్కించుకోవడం కొరకు నీ సైనికులనురక్షణ కవచాలను తొలగించి వేసి పగలుగానీ, రాత్రిగానీ ఆగకుండా శక్తిమేరకు ప్రయాణిస్తూ, సాధారణం కన్నా రెట్టింపు దూరాన్ని అధిగమించేటట్లుగా ఆదేశిస్తేనీ సైన్యంలోని మొత్తం మూడు విభాగాలకు చెందిన నాయకులు శత్రువుల చేజిక్కుతారు.

8) శక్తివంతులు ముందుకెళ్ళిపోతారు. అలసిపోయినవారు వెనకబడిపోతారు. అలా ఈ పథకంలో నీ సైన్యంలోని పదోవంతు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటుంది.

9) నీవు యాభై లీల దూరం ప్రయాణించి శత్రువు పథకాన్ని చిత్తుచేయాలనుకుంటే నీ మొదటి సైనిక విభాగపు నాయకుడిని నీవు కోల్పోతావు. నీ సైన్యంలో సగభాగం మాత్రమే గమ్యాన్ని చేరుకుంటుంది.

10) నీవు అదే లక్ష్యంతో 30’లీల దూరం ప్రయాణిస్తే నీ సైన్యంలో మూడింట రెండు వంతులు గమ్యాన్ని చేరుకుంటుంది.

11) దీనిని బట్టి సామానుల బండి వెంటలేని సైన్యం ఓడిపోతుంది; ఆహార పదార్థాలు లేని సైన్యం ఓడిపోతుంది; సరఫరా కేంద్రాలు లేని సైన్యం ఓడిపోతుంది అని చెప్పవచ్చు.

12) మన పొరుగు రాజ్యాల వారి పథకాల గురించి తెలుసుకోకుండా వారితో మనం పొత్తులకు దిగలేము.

13) ఒక దేశ భూస్వరూపంఅంటే ఆ దేశంలోని పర్వతాలు, అడవులు; గుంటలు, అగాథాలు; చెలమలు, చిత్తడి నేలలు మొదలైనవాటి గురించి అవగాహన లేకుండా దాని గుండా ప్రయాణించే ఒక సైన్యానికి నేతృత్వం వహించడానికి మనం తగము.

14) స్థానిక మార్గదర్శకులను ఉపయోగించుకోకుండా ఆప్రాంత సహజసానుకూలత నుండి మనం లబ్దిని పొందలేము.

15) యుద్ధంలో నిజాన్ని దాచి, అబద్దాన్ని మాత్రమే చూపించు, నిన్ను విజయం వరిస్తుంది.

16) నీ బలగాలను ఏకీకృతం చేయాలా లేక విభజించాలా అన్నదానిని పరిస్థితులను బట్టి మాత్రమే నిర్ణయించాలి.

17) నీ సైన్యం వేగంగా కదిలేటపుడు వాయువును పోలి ఉండాలి, నెమ్మదిగా కదిలేటపుడు దట్టమైన అడవిని పోలి ఉండాలి.

(దట్టమైన అడవిలా అంటే శ్రేణులన్నీ పరస్పరం సామీప్యంలో ఉంటూ ఒకరికొకరు అందుబాటులో ఉండాలి.)

18) దాడి చేయడంలో, దోపిడీ చేయడంలో కార్చిచ్చును పోలి ఉండు. స్థిరంగా ఉండటంలో పర్వతాన్ని పోలి ఉండు.

19) నీ ప్రణాళికలు రాత్రివలే చీకటిగా, గ్రహించలేని విధంగా ఉండాలి. నీవు చేసే దాడి పిడుగుపాటువలే ఎదుర్కోలేని విధంగా ఉండాలి.

20) నీవు గ్రామసీమలను లూటీ చేసినపుడు ఆ లూటీనంతా నీవారందరికీ సమానంగా పంచు. నీవు కొత్త ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నపుడు సైనికులకు కేటాయింపులు జరిపే విధంగా ఆ భూమిని అనేక భాగాలుగా విభజించు.

21) నీవు అడుగు ముందుకు వేయబోయే ముందు తొందరపాటు లేకుండా అన్ని విషయాలను జాగ్రత్తగా పర్యాలోచించు.

22) ‘తప్పుదారి పట్టించే నైపుణ్యాన్ని ఎవరు నేర్చుకుని ఉంటారో వారు జయిస్తారు. సైనిక విన్యాసాల యొక్క వైనం ఆ విధంగా ఉంటుంది.

23) సేనానిర్వహణ గ్రంథం (The Book of Army Management) ఇలా చెబుతుంది: రణరంగంలో నోటితోపలికే మాటలు ఎంతో దూరం వినిపించవు. అందుకే భేరీలుఘంటికలు ఉపయోగిస్తారు. సాధారణ వస్తువులు అంత స్పష్టంగా కనిపించవు. అందుకే జెండాలు, చిహ్నాలు ఉపయోగిస్తారు.

(The Book of Army Management అనేది సన్జు కాలం కన్నా ముందే రాయబడి అతని కాలంలో చైనాలో వ్యాప్తిలో ఉన్న మిలటరీ గ్రంథం. ఇప్పుడది అలభ్యం. ఈ అధ్యాయంలోని మిగిలిన పాయింట్లన్నీ ఆ గ్రంథం లోనివే)

24) భేరీలు, ఘంటికలు; జెండాలు, చిహ్నాలు అనేవి సమస్త సైనికులు తమ కళ్ళు, చెవులను ఒకానొక ప్రత్యేక విషయం మీద కేంద్రీకరించేటట్లు చేసే సాధనాలు.

25) ఆ విధంగా సైన్యమంతా ఒకే సంఘటిత దేహంగా రూపొందటం వలన ధైర్యవంతుడైన సైనికుడు ఒంటరిగా ముందుకు వెళ్ళడంగానీ, పిరికివాడైన సైనికుడు ఒంటరిగా వెనుదిరగడం గానీ సాధ్యం కాదు. పెద్ద సంఖ్యను నియంత్రించే విధానం ఆవిధంగా ఉంటుంది.

(పురోగమించడం గానీ, తిరోగమించడం కానీ సేనాని ఆదేశాల ప్రకారం సైనికులంతా కలసికట్టుగానే చేస్తారు.)

26) కనుక రాత్రియుద్ధంలో నీ సైనికుల కళ్ళను, చెవులను ప్రభావితం చేసే సాధనాలుగా భేరీలను, సంకేతాత్మకమైన అగ్నిజ్వాలలను ఉపయోగించు; అలాగే పగటియుద్ధంలో జెండాలను, పతాకాలను విరివిగా వినియోగించు.

27) ఒక సైన్యం మొత్తం తన స్ఫూర్తిని (spirit) కోల్పోవచ్చు. ఒక సర్వ సైన్యాధికారి తన అప్రమత్తతను (presence of mind) కోల్పోవచ్చు.

(కనుక, అలా కోల్పోయేవరకు వేచి ఉండు)

28) ఉదయం పూట ఒక సైనికుని స్పూర్తి, ఉత్సాహం చురుకుగా ఉంటుంది. మధ్యాహ్నానికల్లా అది బలహీనమవటం ప్రారంభమవుతుంది. సాయంత్రం అతడి మనసు శిబిరానికి తిరిగి వెళ్ళడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది.

29) అందువలన తెలివైన సేనాని శత్రుసైన్యం స్పూర్తి చురుకుగా ఉన్నపుడు దాని నుండి దూరంగా ఉంటాడు. శత్రుసైన్యం చురుకుదనాన్ని కోల్పోయి, తిరిగి వెళ్ళడాన్ని కోరుకుంటున్నపుడు దాడి చేస్తాడుమానసిక స్థితులను చదవగలిగే నేర్పు ఇది.

30) క్రమశిక్షణతోనూ, ప్రశాంతంగానూ ఉండటం; శత్రువులో గందరగోళం, కోలాహలం కనబడే వరకు ఎదురు చూడటంస్వీయనియంత్రణను కాపాడుకోగల నేర్పు ఇది.

31) శత్రువు గమ్యానికి ఇంకా దూరంగా ఉన్నపుడు నీవు దగ్గరగా ఉండటం, శత్రువు నానాతంటాలు పడుతున్నపుడు నీవు తీరుబడిగా వేచిఉండటం, శత్రువు ఆకలితో అలమటిస్తున్నపుడు నీవు సుష్టుగా భోంచేసి ఉండటంశక్తిని పొదుపుగా, ఉత్తమంగా వాడుకునే నేర్పు ఇది.

32) పతాకాలన్నీ క్రమపద్దతిలో ఉన్న శత్రుసైన్యాన్ని మార్గమధ్యంలో అడ్డగించకుండా ఉండటం, ప్రశాంతతతో, ఆత్మవిశ్వాసంతో కూడుకొని, చక్కని అమరికతో తీర్చిదిద్దబడి ఉన్న సైన్యం జోలికి వెళ్ళకుండా ఉండటంపరిస్థితులను అవగతం చేసుకోగలిగే నేర్పు ఇది.

(పతాకాలన్నీ క్రమపద్దతిలో ఉంటే, దానిని బట్టి ఆ సైన్యంలోని శ్రేణులన్నీ క్రమపద్దతిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అటువంటి సైన్యం అజేయమైనది కనుక దాని జోలికి పోకూడదు)

33) సైనికనీతిననుసరించి శత్రువుకు అభిముఖంగా కొండను అధిరోహించకూడదు, అలాగే కొండదిగుతున్న శత్రువును ఎదుర్కోకూడదు.

34) శత్రువు పలాయనం మోసపూరితమైనపుడు అతడిని వెంబడించకు. ఆవేశపూరితులై ఉన్న సైనికులమీద దాడి చేయకు.

35) శత్రువు ఇవ్వజూపే ప్రలోభాలను స్వీకరించకు. ఇంటిదారిపట్టిన సైన్యాన్ని అటకాయించకు

(శత్రువు ఇవ్వజూపే ప్రలోభాలు అంటే ముఖ్యంగా శత్రువు వీడివెళ్ళిన ప్రాంతంలోని ఆహారం, ఎందుకంటే అది విషపూరితమై ఉండగలదు. ఇంటిదారిపట్టిన సైన్యాన్ని ఎందుకు అటకాయించకూడదంటే, ఇంటికి తెరిగి వెళ్ళే అభిలాషతో ఉన్న సైనికుడు తన దారిని అడ్డుకున్న వారిమీద ప్రాణాలకు తెగించి పోరాడతాడు. అదేజరిగితే నీవు నిలువలేవు)

36) నీవు ఒక సైన్యాన్ని చుట్టుముట్టినపుడు అది పారిపోగల మార్గాన్ని దానికి వదిలి పెట్టు. నిస్పృహతో ఉన్న సైన్యాన్ని మరింత బాధించకు.

(పారిపోగల మార్గాన్ని వదిలి పెట్టమంటే పారిపోనీయమని అర్థం కాదు. పారిపోగల మార్గం దానికి చూపించడం ద్వారా అది నిరాశా, నిస్పృహలతో తెగించి పోరాడే పరిస్థితి రాకుండా చేసి, ఆ తరువాత దానితో యుద్ధం చేయాలి. నిస్పృహతో ఉన్న సైన్యాన్ని మరింత బాధిస్తే వారు తెగించే ప్రమాదం ఉంటుంది)

37) ‘యుద్ధకళ ఆవిధంగా ఉంటుంది.




(ఏడవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి