18, ఫిబ్రవరి 2009, బుధవారం

జ్ఞానయోగం -III

ఇప్పుడు మరో ముఖ్య విషయాన్ని పరిశీలిద్దాం. వివిధ రకాల ప్రకృతులను కలిగి ఉన్న జీవులు అందరూ సమానమేనా లేదంటే అసమానమా! ఒక వేళ అసమానమైన పక్షంలో వీరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ. అసలు ఈ జీవుల కన్నా సర్వోన్నతుడని భావించబడే భగవంతుడు ఎంత ఎక్కువ.

జీవులందరికన్నా భగవంతుడు గొప్ప. ఆయన పరిమాణంలో అనంతుడు. తన ప్రకృతితో కలసి కాకుండా విడిగానే ఉనికిని కలిగి ఉన్నవాడు. తన ప్రకృతిని వ్యక్తీకరించి, మరలా లయింపజేసుకునే సామర్ధ్యం కలిగినవాడు. ఘనతరమైన సృష్టి కార్యాన్ని నెరవేర్చేవాడు. ముల్లోకాలనూ, పదునాలుగు భువనాలనూ పాలించేవాడు. మాయకు లోబడని అతీతుడు, నిత్యయోగ స్వరూపుడు. ...ఇత్యాది లక్షణాలతో ఆయన జీవులందరికన్నా గొప్పవాడైపోయి ఈ సృష్టిలో తనకన్నా మరేదీ గొప్పదిలేని స్థితి కలిగినవాడై ఉండి ఎక్కువ తక్కువలకు అసలు ఆయనే నాంది పలికాడు.


మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ! (అ.7-శ్లో.7)

ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు.


గతి ర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ |

ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజ మవ్యయం || (అ.9-శ్లో.18)

ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాస స్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వత బీజం నేనే.


స్వధర్మం

ఇక జీవులలో ఏ రెండు జీవుల ప్రకృతి ఒకటి కాదు. ఎవరి ప్రకృతి వారిదే. అటువంటప్పుడు ఈ జీవులన్నీ సమాన స్థాయివేనా? అంటే... కాదనే సమాధానమే వస్తుంది. ఈ జీవులన్నీ కొన్ని ఉన్నత స్థాయి ప్రకృతి కలిగి ఉన్నాయి. కొన్ని తక్కువ స్థాయి, కొన్ని ఇంకా తక్కువ స్థాయి ప్రకృతి కలిగి ఉన్నాయి. ఇవి ఎన్నో దశలలో ఉంటాయి. ఈ స్తరీకరణ ఎంతో విస్తారమైనది. అనంత ప్రకృతిలో ఎన్ని తేడాలున్నాయో అన్ని రకాల తేడాలు జీవులకు తమతమ ప్రకృతులవలన కలుగుతున్నాయి, అన్ని రకాల నిమ్నోన్నతాలు కలుగుతున్నాయి.

కానీ ఈ అసమానత అంతా భౌతిక దృష్టికే. ఏ జీవి ప్రకృతి ఆ జీవిలో ‘జీవేచ్ఛ’ రూపంలో వ్యక్తమౌతుంది. ఆ ఇచ్ఛ నెరవేర్చుకొనటమే, ఆ తన ప్రకృతిని కర్మరూపంలో వ్యక్తీకరించుకొని తన ‘స్వస్వరూప సందర్శనం’ చేసుకొనటమే ప్రతిజీవి కర్తవ్యం. ప్రతి జీవికి తన ప్రకృతి ఎటువంటిదైనా తన ప్రకృతే తనకు ‘సత్యం’. దానిని తెలుసుకొనటమే, ఈ అనంత సృష్టిలో దాని ప్రతిబింబాన్ని దర్శించుకోవటమే ఆ జీవి యొక్క కర్తవ్యం. కనుక మిగతా జీవుల తో పోలిస్తే తన ప్రకృతి గొప్పదైనా తక్కువదైనా తన ప్రకృతిననుసరించటమే ఏ జీవికైనా విహిత కర్తవ్యం. అలా చేసినపుడే ఆ జీవి సత్యాన్ని చేరగలదు. తదాచరణే ఆ జీవికి స్వధర్మాచరణ. స్వధర్మమంటే ఇదే.


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || (అ.3-శ్లో.35)

ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే.


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం || (అ.18-శ్లో.47)

బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.


యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం |

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విదంతి మానవః || (అ.18-శ్లో.46)

సమస్త ప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు.


సహజం కర్మ కౌంతేయ! సదోషమపి న త్యజేత్ |

సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || (అ.18-శ్లో.48)

కౌంతేయా! నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నిటినీ దోషం ఆవరించి ఉంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.


సమానత్వం

భగవంతుడితో సహా జీవులన్నింటినీ కలుపుకుని చూచినపుడు మనకు కనిపించే ఈ అసమానత కేవలం భౌతిక దృష్టికే. యోగపరంగా చూసినపుడు అంతా సమానమే. ఎందుకంటే యోగమనేది గొప్పతనానికి పరకాష్ట. యోగం తరువాత ఏమీ ఉండదు. యోగమే పరమావధి. యోగం భగవత్‌స్వరూపం. భగవంతునికన్నా గొప్పదేమీలేదు. యోగం వలన ప్రతి జీవుడు భగవంతునితో సమానమైన స్థితిని పొందుతాడు. జీవులన్నీ యోగాన్ని అవలంబించినపుడు వాటి ప్రకృతుల యొక్క ఎక్కువ తక్కువలతో సంబంధంలేకుండా అవన్నీ యోగస్వరూపుడైన ఆ భగవంతునితో సమమైన స్థితిని పొందుతాయి. ఈ విధంగా యోగం దృష్ట్యా భగవంతుడితో సహా అంతా సమానమే.

జీవులకు తమ తమ ప్రకృతుల వలన కలిగిన ఈ ఎక్కువ తక్కువల కెవ్వరూ బాధ్యులు కారు. అది అనాది సిద్ధం. యోగమే ప్రతి జీవి లక్ష్యం కనుక యోగదృష్టియే సరియైనది. యోగ దృష్ట్యా అంతా సమానమే. భగవంతుడు సైతం యోగాన్ని అవలంబిస్తున్న ఏ జీవికన్నా కూడా ఎక్కువ కాదు.


ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః |

సర్గేపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ || (అ.14-శ్లో.2)

ఈ జ్ఞానము నాశ్రయించి, నాతో సమమగు స్థితిని పొందినవారు ప్రళయకాలమున నశింపరు. సృష్టిసమయమున మరలా జన్మింపరు.

...(మిగతా విషయం చివరి భాగంలో)

5 వ్యాఖ్యలు:

 1. హమ్మయ్య. గొడవల్లోంచి బయటపడి విషయంలోకి వచ్చారు. సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హల్లో సరస్వతీకుమార్ గారు - నమస్సులు.

  జ్ఞానయోగానికి హేతువాదము, తార్కిక బుద్ధి ఉన్నాయన్నారు ఇంతకుముందు పోస్టింగులో. రాజయోగానికి మిగతావాటితోపాటుగా, శాస్త్రీయదృక్ఫథం ఉండాలన్నారు. హేదుబద్ధతకు, శాస్త్రీయదృక్ఫథానికి తేడా ఏమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సహజం కర్మ కౌంతేయ! సదోషమపి న త్యజేత్ |

  సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || (అ.18-శ్లో.48)

  కౌంతేయా! నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నిటినీ దోషం ఆవరించి ఉంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.
  =========
  స్వభావసిద్ధమైన కర్మ అంటే అర్ధం?
  కర్మలన్నిటినీ దోషం ఆవరించి ఉంటుంది అన్నారు - అంటే కర్మలు ఎన్ని రకాలు అని అర్ధం?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సీతారాంరెడ్డి గారూ! బావున్నారా?!:)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సాయి కిరణ్ గారూ! మీకునూ నా నమస్సులు!

  శాస్త్రీయ దృక్పథం అనేది ‘ప్రత్యక్ష ప్రమాణం’ ద్వారా విషయ నిర్ధారణ చేస్తుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా అది ప్రత్యక్షంగా కనపడినపుడు మాత్రమే లేదంటే శాస్త్రీయ ప్రయోగం ద్వారా నిరూపించబడినపుడు మాత్రమే నమ్మితే దానిని ‘శాస్త్రీయ దృక్పథం’ అంటారు.

  హేతువాదం ఇలా కాదు. అది మరింత ముందుకెళుతుంది. ఇది కంటికి కనబడే దానిని కూడా నమ్మవద్దంటుంది. కంటికి కనబడేది కనికట్టు కావచ్చు. కాబట్టి ఏ విషయమైనా హేతుబద్దంగా, తర్కబద్దంగా ఉన్నపుడు మాత్రమే నమ్మాలంటుంది.

  --స్వభావ సిద్ధమైన కర్మ అంటే పైన ‘స్వధర్మం’ అనే శీర్షిక క్రింద చెప్పబడింది.

  --కర్మలు సాత్వికము, రాజసము, తామసము అని మూడు రకాలు. మానవుడు స్వభావదోషాన్ననుసరించి ఇష్టాయిష్టాలకు లోనై వీటిలో ఏదో ఒకదానిని ఇష్టపడి దానినే ఆచరిస్తూ మిగతా రెంటినీ ద్వేషిస్తూ వాటిని ఆచరించకుండా దూరంగా ఉంటాడు.

  కానీ... 'నీవు ద్వేషించే కర్మలలో దోషమున్నట్లే, ఇష్టపడే కర్మలో కూడా దోషముంటుంది. కనుక ఇష్టాయిష్టాలకు లోనవ్వకుండా నీ స్వధర్మాన్ని నీవు ఆచరించు' అని చెప్పబడింది.

  ప్రత్యుత్తరంతొలగించు