13, సెప్టెంబర్ 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---28 (గీతా వ్యాసాలు)





V: జ్ఞానం

ఈ విధంగా మనం 'కర్మస్వరూపం' గురించి, 'జగత్ స్వరూపం' గురించి, 'సత్యస్వరూపం' గురించి మరియు జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే 'నిష్కామకర్మ' లేక 'యజ్ఞం' గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యజ్ఞం (నిష్కామ కర్మ) యొక్క ఆచరణకు అత్యంతావశ్యకమైన ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అదే ‘జ్ఞానం’. జ్ఞానం లేనిదే మానవుడు యజ్ఞం చేయలేడు. జ్ఞానం వలన మానవుడికి నిత్యానిత్యవస్తువివేకం కలిగి అనిత్యమైన వస్తువుల యెడల వైముఖ్యాన్ని, నిత్యమైన వస్తువుల యెడల ఆసక్తిని పెంపొందించుకుంటాడు. అంటే మానవుడు జ్ఞానం వలన తనకు దేని వలన మేలు జరుగుతుందో దేని వలన కీడు జరుగుతుందో తెలుసుకుని అప్రమత్తుడై మెలగుతాడు.గుణకర్మల ఆకర్షణకు లోబడకుండా, ఆ ఆకర్షణకు కారణమైన కామాన్ని జయించి, సత్యాచరణే తన జీవన లక్ష్యంగా తెలుసుకుంటాడు. అందువలనే జ్ఞానం వలన జరిగినంత మేలు మానవునకు మరొక దానివలన జరగదు.


అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |

స్వరం జ్ఞానప్లవేనైన పృజినం సంతరిష్యసి || (అ.4-శ్లో.36)

పాపాత్ములందరిలో మహాపాపివైనాసరే, జ్ఞానమనే తెప్పతోనే పాపసాగరాన్ని దాటివేస్తావు.


న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే|

తత్స్వయం యోగసంసిద్ధః కాలే నాత్మని విందతి || (అ.4-శ్లో.38)

ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కర్మ యొగ సిద్ధి పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది.


సత్యాచరణ యెడల శ్రద్ధ ఉన్నపుడు మానవుడికి జ్ఞానం సిద్ధిస్తుంది.


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః |

జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి అచిరేణాధిగచ్ఛతి || (అ.4-శ్లో.39)

శ్రద్ధాసక్తులూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమ శాంతి లభిస్తుంది.


ఆ జ్ఞానమనే ఖడ్గంతో మాత్రమే మానవుడు కామాన్ని సంహరించి నిష్కాముడు అంటే గుణాతీతుడు కాగలడు. అప్పుడే యజ్ఞం చేయగలడు.


తస్మా దజ్ఞానసంభూతం హృత్‌స్థం జ్ఞానాసినాత్మనః|

చిత్‌వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిఛి భారత || (అ.4-శ్లో.42)

అర్జునా! అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి, నిష్కామ కర్మయోగం ఆచరించు. లేచి యుద్ధం చేయి.


పుట్టుకతోనే ఎవరూ జ్ఞానులు కారు. జిజ్ఞాసతో అంటే జ్ఞానం యెడల ఆసక్తితో సద్గురువును సేవించినపుడు ఆయన బోధనవలన, దైవానుగ్రహం వలన క్రమంగా మనకు జ్ఞానోదయమౌతుంది.


తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః || (అ.4-శ్లో.34)

తత్త్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు.వారి వద్దకు వెళ్ళినపుడు వినయవిధేయతలతో నమస్కరించి, సమయం సందర్భం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో.


నిజమైన గురువు, నిజమైన శిష్యుడు అంటే సదాచరణ, పవిత్రమైన మనస్సు గల గురువు మరియు శ్రద్ధ కలిగిన శిష్యుల కలయికలో జ్ఞానం ఉద్భవిస్తుంది.

ఐతే మానవుడు జ్ఞానాన్ని పొందేంతవరకూ నిష్కామ కర్మాచరణ చేయలేడు కదా! మరి అంతవరకు ఎటువంటి కర్మాచరణ చేయాలి? అనే సమస్య ఉత్పన్నమౌతుంది. ఇక్కడే మానవుడు ఒక చిన్న వ్యూహాన్ని అవలంబించాలి. జ్ఞానసిద్ధి జరిగే వరకు మానవుడు సాత్విక కర్మలే తప్ప రాజస, తామస కర్మల జోలికి వెళ్ళకూడదు.

మానవుడు త్రిగుణాలనూ సమదృష్టితో చూస్తూ మూడురకాల గుణకర్మలనూ ఆచరించటమే నిష్కామకర్మ. కానీ మానవుడు ఆ అర్హత సాధించేంతవరకు కేవలం సాత్విక కర్మలే చేయాలనేది కూడా శాస్త్రసమ్మతమే. సాత్విక కర్మలే ఎందుకంటే జ్ఞానం లేకుండా కర్మకుపక్రమించినపుడు కామప్రకోపం వలన ఏదోఒక గుణకర్మ వైపు వ్యామోహితులవటం జరుగుతుంది. ఇలా చేసిన మూడురకాల కర్మలూ కర్మబంధాలకు దారితీసినా ప్రత్యేకించి రాజస,తామస కర్మలు రెండూ ప్రవృత్తి నివృత్తి చక్రంలో పడవేస్తాయి. అందువలనే ఈ రాజస, తామస కర్మలు రెండింటినీ ‘ద్వంద్వాలు’అని విడిగా పేర్కొంటారు. సాత్విక కర్మలు ఈ ప్రవృత్తి నివృత్తి చక్రానికి దారితీయవు. (ఈ ప్రవృత్తి నివృత్తి చక్రం అనేది జ్ఞనయోగానికి సంబంధించిన అంశం.)

ఈ విషయం గురించి గీతలో ఈ విధంగా చెప్పబడింది.


త్రైగుణ్యవిషయా వేదాః నిస్‌త్రైగుణ్యో భవార్జున!|

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || (అ.2-శ్లో.45)

అర్జునా! వేదాలు మూడుగుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచి పెట్టి, ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధసత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.


‘నిస్‌త్రైగుణ్యో- నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో’ అంటే గుణాతీత స్థితికి చేరాలంటే ముందుగా ద్వంద్వాలను అంటే రాజస, తామస కర్మలను విసర్జించి, కేవలం సాత్విక కర్మలనే చేయాలి. దీనివలన మానవుడు త్వరలోనే జ్ఞానాన్ని సాధించి తద్వారా కామాన్ని జయించి గుణాతీతుడు కాగలడని గీతాకారుని ఉద్దేశ్యం.

జ్ఞానం యొక్క తక్షణ పర్యవసానం నిష్కామకర్మ.అంటే ఒక మానవుడికి జ్ఞానం సిద్ధించినదీ అంటే ఇక అతను నిష్కామకర్మ యోగాన్ని అవలంబిస్తున్నట్లుగానే మనం భావించవచ్చు. అసలు జ్ఞానాన్ని సముపార్జించేదే నిష్కామకర్మ యోగాన్ని అవలంబించుటకొరకు. అందుకే భగవానుడు గీతలో జ్ఞానాన్ని, నిష్కామకర్మ యోగాన్ని ఒకటిగానే పేర్కొన్నాడు.


సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రపదంతి న పండితాః |

ఏకమప్యాస్థిత స్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం || (అ.5-శ్లో.4)

జ్ఞానం వేరు, కర్మయోగం వేరు అని అవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించినా రెండింటి ఫలమూ దక్కుతుంది.


యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి || (అ.5-శ్లో.5)

జ్ఞానయోగులు పొందే ఫలమే కర్మయోగులూ పొందుతారు.జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని… (సశేషం)


5 కామెంట్‌లు:

  1. ఇలాంటి విలువైన చర్చ ముందుకు తెచ్చి నందుకు మీకు అభినందనలు.
    మానవ జీవితాన్ని నేరుగా తాకి స్పందిస్తున్నట్లుగా లేదు. ఆ తాజా తనం కాన రావడం లేదు. ఈ శ్లోకాలు వగైరాలు అంతా ఛాదస్తం లాగ కనపడుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు తలపెట్టిన మీరు దాన్ని సరళంగా రాస్తే బాగుండేది. కొన్ని భాగాలు బాగా సరళంగానే ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. సీతారాం రెడ్డి గారు! మీ వ్యాఖ్యలకు సమాధానం చాలా పెద్దది. సిద్ధం చేస్తున్నాను.. దయచేసి వేచి చూడండి. వీలైతే కామెంట్ గాకాక టపాగా అందిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. సరే మిత్రమా వేచి చూస్తాను.

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగును ఈరోజే "కనుగొన్నాను", కూడలి ద్వారా! పైపైన చూడగా, మీరు రాసినవి ఆసక్తికరం గా ఉండేటట్టు ఉంది, కనీసం మన మీడియా మేధావుల ఎంగిలిరాతల్లాగా కాకుండా!

    I Will start reading your archives from now on. Would you mind if I commented on those old posts, that is, if there is anything to communicate?

    Cheers
    Yogi

    రిప్లయితొలగించండి
  5. @Yogi, I would never mind. you are always welcome. Thank you for your appreciation.

    రిప్లయితొలగించండి