10, సెప్టెంబర్ 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---25 (గీతా వ్యాసాలు)





IV B: గుణాతీత స్థితి

రాగమున్న చోట ద్వేషముంటుంది. కామమున్నచోట క్రోధముంటుంది. రాగద్వేషాలు, కామక్రోధాలు బింబప్రతిబింబాలు. ఒక విషయాన్ని మనం ఇష్టపడితే తద్వ్యతిరిక్తమైనదాన్ని వ్యతిరేకించటం సహజమే.కనుక ఇష్టాన్ని తొలగిస్తే అనిష్టతకూడా తొలగిపోతుంది. అలా ఇష్టానిష్టాలు (లేక రాగద్వేషాలు) లేకుండా చేసే కర్మే.. అంటే కామం లేకుండా చేసే కర్మే నిష్కామకర్మ.

ఇష్టానిష్టాలు లేని ఇటువంటి నిష్కామ మానసిక స్థితినే ‘గుణాతీత స్థితి’ అంటారు. గుణాతీతం అంటే అతనికి ప్రత్యేకించి ఏ ఒక్క గుణం మీద కోరిక, ఆసక్తి లేదు. ఏ ఒక్క గుణం యొక్క ఆకర్షణకూ అతను లొంగిపోవటం లేదు. ఏ ఒక్క గుణాన్ని అతను ద్వేషించటంలేదు. అన్ని గుణాలను గుణాతీతుడు సమదృష్టితో చూస్తున్నాడు.

గీతలో ఈ గుణాతీత స్థితి గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడు.

అర్జున ఉవాచ:

కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ! |

కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే || (అ.14-శ్లో.21)

అర్జునుడు : ప్రభూ! ఈ త్రిగుణములను అతిక్రమించిన వాని (గుణాతీతుని) లక్షణములేవి? వాని ప్రవర్తన ఎట్లుండును? ఈ గుణములను అతిక్రమించుటెట్లు?


శ్రీ భగవానువాచ:

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ! |

న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || (అ.14-శ్లో.22)

భగవానుడు: అర్జునా! గుణాతీతుడు తనకు సంప్రాప్తించిన సత్వ గుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ, రజో గుణ ధర్మమైన కర్మ ప్రవృత్తినిగానీ, తమోగుణలక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు; అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు.


ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |

గుణా వర్తంత ఇత్యేవ యో పతిష్ఠతి నేఙ్గతే || (అ.14-శ్లో.23)

ఏమీ సంబంధంలేని వాడిలాగా తటస్తుడిగా ఉండి గుణాలవల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు.


సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః |

తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః || (అ.14-శ్లో.24)

సుఖదుఃఖాలయందు సమదృష్టి కలిగి ఉంటాడు. మట్టి, రాయి, బంగారం మొదలైన వస్తువులను సమభావంతో చూస్తాడు. ఇష్టమైన దానియందును, అనిష్టమైన దానియందును సమభావననే కలిగి ఉంటాడు. మరియు దూషణలయందు, భూషణలయందు కూడా సమభావననే కలిగి ఉంటాడు.


మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |

సర్వారంభపరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే || (అ.14-శ్లో.25)

మానావమానములయందు సమదృష్టి కలిగి ఉండి; శత్రువులయందును, మిత్రులయందును కూడా సమదృష్టినే కలిగి ఉండి తనకు తానుగా ఏ పనినీ ప్రారంభించని వాడు గుణాతీతుడనబడును.


అంటే సత్వగుణకర్మ ఎడల, రజోగుణకర్మ ఎడల, తమోగుణకర్మ ఎడల గుణాతీతుడు సమదృష్టినే కలిగిఉన్నాడు. వాటిలో ఏ ఒక్కదాని మీద ప్రత్యేకించి ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు. వాటి ఆకర్షణకు లోబడకుండా వాటిని కేవలం జగత్సంబంధమైన గుణకార్యాలుగానే చూస్తున్నాడు. మట్టిని, రాయిని, బంగారాన్ని ఒకే దృష్టితో చూస్తున్నాడు. అంటే వస్తువుల భౌతిక విలువను పరిగణనలోకి తీసుకోవటంలేదు. యజ్ఞానికి అవసరమైతే ఎంత అల్ప వస్తువునైనా అతను స్వీకరిస్తాడు. యజ్ఞానికి అవసరంలేకపోతే ఎంత విలువైన వస్తువైనా, ఎంత ఆకర్షణీయమైన విషయమైనా స్వీకరించడు. అంటే అతని దృష్టి యజ్ఞం మీద, సత్యం మీదే తప్ప ఆకర్షణీయమైన గుణకార్యాల మీద లేదు. శత్రుమిత్రులను, మానావమానములను, సుఖదుఃఖాలను, దూషణభూషణలను ఒకే దృష్టితో చూస్తున్నాడు.. అంటే వైరుధ్యాలను సమదృష్టితో చూస్తున్నాడు అని అర్థం. అంటే తద్విషయం మరియు తద్‌వ్యతిరిక్త విషయం అతని దృష్టిలో ఒకటే. అంటే పరస్పర విరుద్ధమైన గుణాలు మూడునూ అతని దృష్టిలో ఒకటే. తనకు తానుగా ఏ పనినీ ప్రారంభించడు అంటే యజ్ఞం యొక్క ప్రేరేపణతో తప్ప తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ఏ పనినీ ప్రారంభించడు అని అర్థం.

మరి ఇటువంటి మానవుడు దేనికొరకు కర్మ చేస్తాడు. రాగద్వేషాలతో కర్మలాచరించే మానవుడంటే కర్మలను తానిష్టపడే గుణాన్ని మరియు దానికి ప్రాతినిథ్యం వహించే వస్తువును లేక విషయాన్ని పొందటం కొరకు కర్మాచరణకు పూనుకుంటాడు. మరి గుణాతీతుడు ఏ ఒక్క గుణాన్నీ ప్రత్యేకించి ఇష్టపడటం లేదు కనుక మరి దేని కొరకు కర్మలాచరిస్తాడు?.. దేనికొరకంటే సత్యం కొరకు.. ఆ సత్యాన్ని మాత్రమే కోరే ‘జీవేచ్ఛ’ నెరవేర్చుకొనుట కొరకు. ‘జీవేచ్ఛ అంటే మానవుడు అసలు వాస్తవంగా ఏ కార్యనిర్వహణకొరకు ఈ భూమిమీద జన్మించాడో అదే అతని జీవేచ్ఛ’. అది మాత్రమే అతనికి సత్యం. అది మాత్రమే అతని జీవన లక్ష్యం. జీవేచ్ఛ దోషరహితం; జీవేచ్ఛ సత్య స్వరూపం.

ఏ మానవుడైనా జీవేచ్ఛ నెరవేర్చుకోవాలనే కోరుకుంటాడు. కానీ కామం వలన దీనికి మారుగా గుణకర్మల యెడల సమ్మోహితుడై వాటిని చేయాలనుకుంటాడు. ‘తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వలన పాపాలు చేస్తున్నాడు?’ అని అర్జునుడు శ్రీ కృష్ణుణ్ణి ప్రశ్నించటంలోని ఆంతర్యం ఇదే. (ఈ జీవేచ్ఛ అనేది జ్ఞానయోగానికి సంబంధించిన విషయం. కర్మయోగంలో ఇంతకు మించిన వివరణ అప్రస్తుతం.)… (సశేషం)


1 కామెంట్‌:

  1. సరస్వతీ కుమార్‌గారు,
    క్రమ పద్ధతిలో మీరు చేసిన నిరూపణ బాగుంది.

    రిప్లయితొలగించండి