22, జూన్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---1
ఉపోద్ఘాతం:

నేను 'సత్యాన్వేషణ పథం' అనే వ్యాసంలో (ఫిబ్రవరి పోస్టు) 'సత్యాన్వేషణ ' అనే కోణంలో వివరించిన విషయాన్నే 'భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!' అనే వ్యాసంలో రాజకీయ కోణంలో వివరించాను. రెండు వ్యాసాలు బింబ ప్రతిబింబాలు మాత్రమే. ఆ విషయాన్నే సమగ్రంగా వివరించటానికి ప్రారంభంగా ఈ ఉపోద్ఘాతాన్ని రాస్తున్నాను.

ఈ సమగ్ర వివరణను చదివేటపుడు అసలు విషయం ఎక్కడనుండి ఎక్కడకు పోతున్నది?..భారతదేశ వ్యవస్థ అంటూ దేశానికి ఆవల చరిత్రలో ఎప్పుడో జరిగిన విషయాలు వివరిస్తున్నాడేమిటి?...ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న సంఘటనలనో,లేక భారతదేశ చరిత్రనో చెప్పవచ్చు కదా...అనే సందేహాలు పాఠకులకు తలయెత్తకుండా అసలు నేను చెప్పదలచుకున్నదేమిటో ముందుగానే పై వ్యాసాలలో చెప్పివేసాను.'సత్యాన్వేషణ పథం ' వ్యాసంలో పరోక్షంగా,తాత్వికంగా చెప్పాను. 'భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?! 'అనే వ్యాసంలో ప్రత్యక్షంగా చెప్పాను. అందుకే ఈ వ్యాసపరంపరకు కూడా ఆ రెండవ వ్యాసపు టైటిల్‌నే ఇచ్చి నంబరింగ్ ఇస్తున్నాను.

ఈ వ్యాసాలు విడివిడి వ్యాసాలు కాదు. కొన్ని సశేష వ్యాసాల సమాహారం. మొత్తాన్ని కలిపి ఒక చిన్న గ్రంథంగా పరిగణించవచ్చు. ఈ గ్రంథంలో మూడు అధ్యాయాలుంటాయి. మొదటి అధ్యాయంలో ప్రపంచ రాజకీయ,సామాజిక రంగాలలో వచ్చిన మార్పుల యొక్క చారిత్రక క్రమాన్ని వివరిస్తాను. రెండవ అధ్యాయంలో ఏ తాత్విక పునాది మీద ఆధారపడి ఈ అధ్యయనమంతా జరుగుతున్నదో, ఏ తాత్విక భావనల ఆధారంగా భావి వ్యవస్థను ఈ దేశంలో ఏర్పరచాలని భావించడం జరుగుతున్నదో ఆ తాత్విక విచారధారను వివరిస్తాను. ఇక మూడవ అధ్యాయంలో ఆ భావి వ్యవస్థ ఎలా ఉంటుంది? ..దాని స్వరూప స్వభావాలేవిధంగా ఉంటాయి తదితర విషయాలను వివరిస్తాను.

ఇదంతా సమగ్ర వివరణ అంటున్నానే గానీ ఈ గ్రంథంలో అందించే వివరణ కూడా ఒక రకంగా సంగ్రహమే. ఈ విషయాలను వివరిస్తూ ఒక మహాగ్రంథమే రాయవచ్చు. ఐతే బయట విడిగా వేరే గ్రంథాలలో లభ్యమయ్యే విషయసంచయమేదీ ఈ వ్యాసాలలో పేర్కొనబడలేదు. విషయం యొక్క సమగ్ర వివరణకు అవసరమైన కనీస వివరాలను మాత్రమే పేర్కొన్నాను.మరీ వివరాలు ఎక్కువైనా కూడా అదంతా ఈ బ్లాగు ద్వారా చెప్పటం సాధ్యపడకపోవచ్చు. అన్ని వివరాలు అవసరమని కూడా నేను అనుకోవడంలేదు.

నా స్వీయ అవగాహనకొరకు, నా భావాలను స్పష్టపరచుకొనుట కొరకు, వాటిని క్రమబద్దీకరించుకొనుట కొరకు నేను డైరీలో రాసుకున్న విషయాలనే ఇప్పుడు మీముందు ఉంచుతున్నాను.

ఇంతటితో ఉపోద్ఘాతం సమాప్తం.వచ్చే వ్యాసంతో ఈ చిరుగ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం.నిజానికి ఈ గ్రంథానికి ప్రారంభం ఈ మొదటి అధ్యాయం కాదు. ఈ గ్రంథం లో చెప్పబోయే విషయానికి ప్రాతిపదికగా నిలచిన ఆ రెండు సంక్షిప్త వ్యాసాలను ముందుగా చదవాలి. కనుక ఈ గ్రంథానికి ప్రారంభం ఆ రెండువ్యాసాలే.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి