26, జూన్ 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---6





జాతిగత స్వభావం

ఇక్కడ ఒక ముఖ్యవిషయం చెప్పుకోవాలి. ఆదేమంటే కాపిటలిష్టు విప్లవాలు రాజ్యశక్తికి వ్యతిరేకంగా జరిగాయి. రాజ్యశక్తికి ఇస్లాం కేంద్రబిందువు. దానిని ఇస్లాం పెంపొందించింది. కానీ పెట్టుబడిదారీ విప్లవాలేవీకూడా రాజరికానికి వ్యతిరేకంగా జరిగినా కూడా అవి ఇస్లామిక్ దేశాలలో జరగలేదు. ఇక్కడ మనం ఒక ప్రధాన విషయం గుర్తించాలి. ఇస్లాంకానీ, కాపిటలిజం కానీ,తదనంతరం తలయెత్తిన కమ్యూనిజం కానీ మానవాళినంతటినీ ఉద్దేశించినవి. ఐతే ఇవి ఆయాజాతుల జాతిగత స్వభావాన్ననుసరించి ఒక్కొక వ్యవస్థను ఒక్కొక జాతి ఏర్పరచి మిగతా ప్రపంచమంతా వ్యాప్తినొందటానికి ప్రయత్నించాయి.ఇక్కడ మానవుడు సామాన్య విషయం (Common Factor). ఎక్కడైనా మానవుడే ఈ సమస్యలను ఎదుర్కొని పరిష్కారానికి పూనుకున్నాడు.

ఇస్లాం ఆవిర్భావానికి ముందు ఆటవిక బర్బరజాతుల అరాచకానికి గురయ్యింది ప్రధానంగా యూరప్. (ఆనాటి ప్రపంచమంతా ఇవి ఆగడాలు చేసినా సర్వ విధ్వంసం సృష్టించినది మాత్రం యూరప్‌లోనే)ఐతే దీనికి విరుగుడుగా ఇస్లాం ఆవిర్భవించింది అరేబియాలో. అలాగే రాజ్యశక్తి మితిమీరిన భూస్వామ్యవ్యవస్థ వ్యవస్థీకృతమైనది, సిద్ధాంతీకరింపబడినది ఇస్లామిక్ దేశాలలో. కానీ ఈ మితిమీరిన రాజ్యశక్తికి వ్యతిరేకంగా విప్లవాలు చెలరేగి కాపిటలిజం ఏర్పడినది ఐరోపాలో. అలాగే కాపిటలిజం మితిమీరి పచ్చిదోపిడీదారీగా మారినది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ ఐరోపాలో మరియు దాని వలసలలో. ఐతే దీనికి వ్యతిరేకంగా కమ్యూనిష్టు విప్లవం వచ్చింది రష్యాలో;తదనంతరం చైనాలో. ఇవి రెండూ అప్పటీకి రైతు రాజ్యాలే.ఫ్యూడల్ వ్యవస్థలోనే ఉన్నాయి.

అంటే యావత్ మానవాళినంతటినీ ఉద్దేశించిన ఈ పరిష్కారాలు సమస్య తీవ్రంగా ఉన్న చోటకాక మరోచోట కనుగొనబడ్డాయి. వైవిధ్యమైన జాతులున్న విశాల ప్రపంచంలో ఆయాజాతుల జాతిగత స్వభావాన్ననుసరించి కొన్ని జాతులు సమస్యగా పరిణమిస్తే మరికొన్ని జాతులు పరిష్కారాలు కనుగొన్నాయి.అలా కనుగొనడంలో అవి తమతమ దేశాలలోని వ్యవస్థలమీదే పోరాడాయి.

బర్బరజాతులు ఐరోపాను ఛిన్నాభిన్నం చేస్తున్న సమయంలో పటిష్ఠమైన రాజ్యవ్యవస్థను ఏర్పరచి అరాచకాన్ని అణచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఐతే శక్తివంతమైన రాజ్యవ్యవస్థను ప్రపంచంలోనే మేటిగా ఏర్పరచగలిగే విధంగా జాతిగత స్వభావాన్ని కలిగి ఉన్న అరేబియా ప్రాంతంలో ఇస్లాం ఆవిర్భవించింది. ఆ స్వభావాన్ని కలిగిన ఇతర జాతులలో కూడా అది వ్యాపించింది. తిరిగి రాజ్యమే ఒక సమస్యగా పరిణమించినపుడు సమాజ ప్రయోజనాలు ప్రమాదంలో పడినపుడు రాజ్య శక్తిని నిర్వీర్యం చేసే ఆలోచనా విధానం ఏ జాతైతే రాజ్యశక్తిని నిర్మించటం జాతిగత స్వభావంగా కలిగిఉందో అదే జాతిలో ఎలా జనించగలదు?

కనుకనే సమాజ వికాసాన్ని కలుగజేయగలగటాన్ని జాతిగత స్వభావంగా కలిగిన ఐరోపాలో ఆ ఆలోచనావిధానం జనించి తదనుగుణమైన కాపిటలిస్టు విప్లవాలు వచ్చాయి.

సరిగా ఇదే సూత్రం కమ్యూనిజం విషయంలో కూడా వర్తిస్తుంది.సమాజ వికాసం పేరుతో సామాజిక శక్తులు అంటే సామాజికమైన ఉత్పత్తివనరులను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొందరు స్వార్థపరులు పేదప్రజలను దోపీడీ చేస్తుండటంతో సమాజవికాసమే ఒక సమస్యగా పరిణమించి వ్యక్తి ప్రయోజనం ప్రమాదంలో పడినపుడు వ్యక్తి ప్రయోజనాలకొరకు సామాజిక శక్తులకు, సామాజిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే విప్లవాలు, పోరాటాలు సమాజ వికాసాన్ని పెంపొందించడమే జాతిగత స్వభావంగా కలిగిన పశ్చిమ ఐరోపా జాతులలో ఎలా ఏర్పడతాయి?. వ్యక్తి ప్రయోజనాన్ని కాపాడే తత్వాన్ని జాతిగత స్వభావంగా కలిగిన రష్యాలో ఆ మహత్తర కమ్యూనిష్టు విప్లవం (October Revolution) సంభవించింది.

ఈ సమయంలో చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. అదేమంటే ‘మనుషలంతా ఒక్కటే’అనే భావన నేటి ఆదర్శం, నేటి నీతి. మరి ఈ వివిధ జాతులు వివిధ జాతిగత స్వభావాలను కలిగి ఉంటాయనేది ఎంతవరకు నిజం?

మనుషులు మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, శరీర వర్ణం పేరుతో ఒకరినొకరు ద్వేషించటానికి, నాశనం చేసుకోవటానికి పూనుకున్నపుడు దానికి ప్రతిక్రియగా ‘మనుషలంతా ఒక్కటే’లాంటి నీతులు పుట్టాయి. కానీ ఈ వైషమ్యాలను కాసేపు పక్కన పెట్టి చూస్తే ఈ విశాల ప్రపంచంలో ఉన్న అనేక జాతులలో మౌలికంగా ఆలోచనావిధానంలోగానీ, జీవనవిధానంలోగానీ, తాత్వికచింతనలోగానీ మార్పు ఉన్నది. దానికి కారణం ఆయా జాతులలో ప్రతి ఒకటి తనదైన స్వభావాన్ని కలిగి ఉన్నది. రోజువారీ జీవితంలో విడివిడి వ్యక్తుల ప్రవర్తన వారు ఏ జాతికి చెందిన వారైనా బాహ్యదృష్టికి ఒక్కలాగే ఉంటుంది. కానీ విశాల దృష్టితో చూచినపుడు అంటే ఒక జాతి మొత్తాన్ని సుధీర్ఘకాలంలో దానియొక్క మనుగడను పరిశీలిస్తే ఆ జాతికే విశిష్టమైన ఒకానొక ప్రవర్తనావిధానం, పోకడ, తీరుతెన్ను ఉంటాయి.దానికి కారణం ఆ జాతికి తనదైన జాతిగత స్వభావం ఉండటమే.

ఫ్రాచ్యము-పాశ్చాత్యము (East and West)

ఇప్పుడు తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్యగల తేడాలను స్థూలంగా ఒకసారి పరిశీలిద్దాం. ప్రాచ్య దేశాల (Asian Countries)లో పారమార్థిక చింతన అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రసిద్ధ మతాలు ఆసియాలోనే జన్మించాయి. వాటిని స్థాపించిన మహాపురుషులలో బుద్ధుడు నేపాల్‌లో, వర్థమాన మాహావీరుడు, గురునానక్ భారతదేశంలో, కన్‌ఫ్యూషియస్ చైనాలో, జీసస్ దూరప్రాచ్యంలో, జొరాస్టర్ పర్షియాలో జన్మించారు.

ఒక్క పారమార్థిక ధోరణి మాత్రమేకాదు; మధ్య యుగపు ప్రపంచ విజేతలందరూ ఆసియా వారే.

పాశ్చాత్య దేశాల (Westren Countries)లో ఐహిక చింతన అధికంగా ఉంటుంది.ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎక్కువగా యూరోపియన్ జాతులకు చెందిన వ్యక్తులే రూపొందించారు. నేటి పాలనా వ్యవస్థ రూపుసంతరించుకున్నది ఐరోపాలోనే. ప్రజాస్వామ్యం, జాతీయభావం, సామ్యవాదం మొదలైనవి ఐరోపాలోనే జన్మించాయి. నేటి ఆధునిక జీవన విధానం ఐరోపాలోనే రూపుదిద్దుకున్నది.

ప్రపంచంలో ప్రాచ్యము, పాశ్చాత్యము అనేది స్థూలమైన విభజన. సూక్ష్మంగా చూస్తే ఇవే కాక ఇంకా అనేక జాతులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా తనదైన జాతిగత స్వభావాన్ని కలిగి ఉన్నది.

ఈ విధంగా విశాల ప్రపంచంలోని వివిధ జాతులలో ఆయా జాతులు తమతమ జాతిగత స్వభావాలననుసరించి ఒక్కొక్క వ్యవస్థకు అంటే కొన్ని జాతులు ఇస్లాంకు, మరికొన్ని జాతులు కాపిటలిజానికి, అలాగే మరికొన్ని జాతులు కమ్యూనిజానికి ప్రాతినిథ్యం వహించాయి. తమ కనుగుణమైన వ్యవస్థలను తమవంతు వచ్చినపుడు నెలకొల్పాయి.

దీనికనుగుణంగానే సమాజవికాసాన్ని ఉద్దేశించిన లేక సమాజ ప్రయోజనాలను ఉద్దేశించిన కాపిటలిష్టు వ్యవస్థ ఐరోపాలో తలయెత్తినది. ఇది కూడా మానవాళినంతటినీ ఉద్దేశించిన సామాజిక, రాజకీయ వ్యవస్థే. ఈ వ్యవస్థ గురించి చెప్పుకోవటానికి ముందు ఇది తలయెత్తటానికి ముందున్న నేపథ్యం గురించి చెప్పుకోవాలి. అరాచకాన్ని నిరసిస్తూ రాజ్యశక్తికి ప్రాతినిథ్యం వహిస్తూ ఇస్లాం పశ్చిమ ఆసియా, మధ్య ఆసియాలలో తలయెత్తితే మితిమీరిన రాజ్యశక్తికి నిరసనగా సమాజవికాసానికి ప్రాతినిథ్యం వహిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ ఐరోపాలో తలయెత్తినది. ఐతే ఇస్లాంకు మరియు పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మించబోయే ఐరోపాకు సిద్ధాంతపరంగా ప్రత్యక్ష యుద్ధమేమీ జరగలేదు. ఇస్లాం కూడా ఫ్యూడలిజమేకానీ ఐరోపాలోని ఫ్యూడల్ వ్యవస్థలను కూలదోసి మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థ జనించినది.

(ఈ రెండు శిబిరాల మధ్యన క్రూసేడులు జరిగినా అవి కేవలం మత ప్రాతిపదికనే తప్ప రాజకీయ సిద్ధాంత పరంగా జరగలేదు. అప్పటికి ఐరోపా ఇంకా చీకటి యుగంలోనే ఉన్నది. పెట్టుబడిదారీ భావజాలం ఆసమయానికి ఇంకా అక్కడ రూపుదిద్దుకోలేదు.)


(మూడు వ్యవస్థలలో కూడా ఒక్క కమ్యూనిజం మాత్రమే కాపిటలిజం మీద ప్రత్యక్షంగా సుద్ధీర్ఘమైన వాదోపవాదాలకు పూనుకున్నది. కాపిటలిజం మాత్రం ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా సిద్ధాంతచర్చలు చేసినా అవేవీ కూడా ఇస్లాంకు వ్యతిరేకంగా కాక తమదేశాలలోని భూస్వామ్య వ్యవస్థమీదే కేంద్రీకరింపబడ్డాయి. ఇక ఇస్లాం జనించేటపుడైతే సిద్ధాంతం పరోక్షంగా, తాత్వికంగా, ఆధ్యాత్మికంగా చెప్పబడిందేకానీ ప్రత్యక్షంగా చెప్పబడలేదు.)

ఐరోపాలో భూస్వామ్యవ్యవస్థ

ఐతే ఇస్లామిక్ ఫ్యూడలిజానికి ఐరోపాలో మధ్యయుగాలలో నెలకొన్న ఫ్యూడలిజానికి హస్తిమశకాంతరమైన తేడా ఉన్నది.ఇస్లాంలో రాజు సర్వశక్తిమంతుడు.కానీ ఐరోపా ఫ్యూడల్ వ్యవస్థలో రాజు స్థానిక భూస్వాముల చేతిలో కీలుబొమ్మ. ఎందుకంటే ఇతని చేతిలో సిద్ధ సైన్యం ఉండేది కాదు. యుద్ధ సమయంలో అతనికి కావలసిన సైన్యాన్ని ఈ భూస్వాములు సమకూర్చేవారు.రాజు యొక్క ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని స్వార్థపరులైన ఈ భూస్వాములు రాజునుండి అనేక రాయితీలు పొందేవారు.

క్రూసేడ్‌ల సమయంలో ఆసియాలో ఇస్లామిక్ రాజుల తిరుగులేని అధికారాన్ని గమనించిన ఐరోపా రాజులు తమదేశాలలో కూడా అటువంటి నిరంకుశ రాచరిక వ్యవస్థలను ఏర్పరచుకోవాలని కాంక్షించారు. చివరకు నూతనంగా స్థాపించిన వలసలతో వర్తక, వాణిజ్యాలు అభివృద్ధిచెంది సంపన్న మధ్య తరగతి ఆవిర్భవించడంతో వీరిసహాయంతో ఐరోపా రాజులు భూస్వాముల పీచమణచి నిరంకుశ రాచరికాలను (Enlightened Despotism) స్థాపించారు.

కానీ కాలక్రమంలో ఒకనాడు భూస్వాములను అణచడానికి రాజుకు సహాయంగా నిలబడిన ఈ అవకాశవాద బూర్జువా (సంపన్న మధ్యతరగతి) వర్గం వారి పీడ విరగడవ్వగానే ఈ నిరంకుశ రాచరికాలకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసి పెట్టుబడిదారీ వ్యవస్థకు రాజకీయ రూపమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థను క్రమంగా నెలకొల్పింది.

ఇప్పుడు ఐరోపాలో సామాజిక వికాసం ఎలా సంభవించినదీ మరియూ ఆ వికాసం పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసి అది ప్రపంచమంతా ఎలా వ్యాప్తి పొందినదీ అనే విషయాన్ని సవివరంగా పరిశీలిద్దాం.......(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి