28, జూన్ 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---7





ఐరోపాలో సామాజిక వికాసం

15వ శతాబ్దంలో జరిగిన ఒక కీలక సంఘటన చీకటి యుగంలో మగ్గుతున్న ఐరోపాలో సామాజిక వికాసానికి దారితీసినది. ఈ సామాజిక వికాసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ వికాసం తదనంతర ప్రపంచ చరిత్రగతిని నిర్దేశించినదిగా, పెట్టుబడిదారీ వ్యవస్థకు నేపథ్యంగా చెప్పుకోవచ్చు.

ఆ కీలక సంఘటన ఏమిటంటే ఆటోమన్ టర్కులు తమపొరుగున ఉన్న బైజాంటైన్ సామ్రాజ్యం మీద దాడి చేసి దాని రాజధాని అయిన కాన్‌స్టాంటినోపుల్ (నేటి ఇస్తాంబుల్) ను ఆక్రమించి సుధీర్ఘకాలం నుండి వెలుగొందుతున్న ఆ సామ్రాజ్యాన్ని పతనం చేసారు. ఆటోమన్ సామ్రాజ్యం ఇస్లామిక్ సామ్రాజ్యం. ఇది నేటి టర్కీ ప్రాంతంలో ఉండేది. బైజాంటైన్ సామ్రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యం. ఒకప్పటి రోమన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండి తదుపరి దానినుండి విడివడి తూర్పు యూరప్‌లో విలసిల్లిన గొప్ప సామ్రాజ్యం.

(క్రీస్తు పూర్వం నేటి ఇటలీ దేశపు రాజధాని ఐన రోము నగరం రాజధానిగా సువిశాలమైన భూభాగంలో విస్తరించి విలసిల్లినది రోమన్ సామ్రాజ్యం. కాలాంతరంలో దానియొక్క తూర్పు ప్రాంతం విడిపోయి బైజాంటైన్ సామ్రాజ్యంగా ఏర్పడింది. గ్రీసు దేశం, రష్యా మొదలైనదేశాలు కలిగిన నేటి తూర్పు యూరప్ ప్రాంతంలో ఈ బైజాంటైన్ సామ్రాజ్యం కొనసాగింది. రోము నగరం రాజధానిగా గల పశ్చిమ ఐరోపా లోని రోమన్ సామ్రాజ్యం అనాగరిక, బర్బర, అరాచక జాతులవలన ఏర్పడిన కల్లోలంలో పతనమైనది. దీనివలన అప్పటి వరకు రోమన్ సామ్రాజ్యం వలన గొప్ప నాగరికతా సంస్కృతులతో ఉజ్వల వైభవాన్ని చవిచూచిన పశ్చిమ ఐరోపాలో అన్ని రంగాలలోనూ స్థబ్దత ఆవహించినది. ఈ స్థబ్దత ఒక వేయి సంవత్సరాలు (క్రీ||శ.410 నుండి క్రీ||శ.1410 వరకు) కొనసాగింది. ఈ కాలాన్ని ఐరోపా చరిత్రలో చీకటి యుగంగా చరిత్రకారులు పిలిచారు. బైజాంటైన్ సామ్రాజ్యం మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగింది.

సరిగా ఈ సమయంలోనే పశ్చిమ ఆసియా ప్రాంతంలో 7వ శతాబ్దంలో ఇస్లాం ఆవిర్భవించి ప్రపంచ రాజకీయాలలో తిరుగులేకుండా ఆధిపత్యాన్ని చాటి అంతా తానై అజేయంగా నిలిచింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఇస్లామిక్ ప్రస్థానంలో నేటి టర్కీ ప్రాంతంలో (ఆసియా మైనర్) నెలకొని సువిశాలంగా విస్తరిల్లిన ఆట్టోమన్ టర్కీ సామ్రాజ్యం క్రీ||శ.1453వ సంవత్సరంలో తమ పొరుగున ఉన్న బైజాంటైన్ సామ్రాజ్యం మీద దాడిచేసి దాని రాజును హతమార్చి ఆ సామ్రాజ్యాన్ని పతనం చేసింది.)

ఆటోమన్ టర్కులు బైజాంటైన్ సామ్రాజ్యం మీద దాడి చేసి దాని రాజధాని ఐన కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించుకోవటం యావత్ మానవజాతి నాగరిక ప్రస్థానంలోనే, యావత్ మానవజాతి రాజకీయ చరిత్రలోనే అత్యంత ప్రధానమైన సంఘటనలలో ఒకటి. దీనివలన భవిష్యప్రపంచాన్ని, మానవాళి జీవనశైలినీ నిర్దేశించే ప్రధానమైన కొన్ని పరిణామాలు 15వ మరియు 16వ శతాబ్దాలలో ఐరోపాలో సంభవించాయి.

అవి:

1. నూతన భౌగోళిక ఆవిష్కరణలు.

2. సాంస్కృతిక పునరుజ్జీవనం.

3. క్రైస్తవ మత సంస్కరణోద్యమం.

సామాజిక వికాసాన్ని జాతిగత స్వభావంగా కలిగిన ఐరోపా జాతులకు తమ స్వభావాన్ని వ్యక్తీకరించుకొనుటకు మరియు తదనుగుణమైన పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించుట కొరకు ఈ పరిణామాలద్వారా కాలం కలసి వచ్చింది.


నూతన భౌగోళిక ఆవిష్కరణలు

అనాదినుండి ఐరోపా మరియు తూర్పు ఆసియా దేశాల మధ్యన వర్తకం మధ్యధరా సముద్రం ద్వారా జరిగేది. ఆ ప్రాంతం మొదట క్రైస్తవ బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉండటం వలన యూరప్ దేశాల వర్తకం నిరాటంకంగా జరిగేది.కానీ అది ఇస్లామిక్ ఆటోమన్ టర్కుల ఆక్రమణలోకి వచ్చేసరికి యూరప్ వర్తకానికి ఆటంకమేర్పడింది. ఈ వర్తకం ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది. దానితో వారు తూర్పు ఆసియా దేశాలకు నూతన మార్గాలను అన్వేషించటానికి పూనుకున్నారు. ఈ అన్వేషణను ప్రధానంగా స్పానిష్, పోర్చుగీసు పాలకుల ధనసహాయంతో మరియు ప్రోద్బలంతో సాహసవంతులైన ఇటాలియన్ నావికులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆఫ్రికా ఖండం క్రిందివైపుగా 1498వ సం||లో ప్రధానంగా భారతదేశానికి తద్వారా తూర్పు ఆసియా దేశాలకు నూతన మార్గాన్వేషణా ప్రయత్నం ఫలించింది. ఈ ప్రయత్నంలోనే యాదృచ్ఛికంగా అమెరికా ఖండం కనుగొనబడింది. అలాగే సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా ఖండపు ప్రాంతంతో కూడా మిగతా ప్రపంచానికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా కనుగొనబడిన అమెరికా ఖండం తదితర ప్రాంతాలను ‘నూతన ప్రపంచం’ గా చరిత్రకారులు పిలిచారు.

సాంస్కృతిక పునరుజ్జీవనం(The Renaissance)

బైజాంటైన్ సామ్రాజ్యం ఆటోమన్ టర్కుల ఆధీనంలోకి రావటంతో టర్కుల దురంతాలకు భయపడి గ్రీకు పండితులు, కవులు, కళాకారులు ఇటాలియన్ నగరాలకు వలస వెళ్ళిపోయారు. బైజాంటైన్ సామ్రాజ్యం ఇటలీ కేంద్రంగా వర్ధిల్లిన ఒకనాటి రోమన్ సామ్రాజ్యానికి దాయాది రాజ్యం అవడంవలన అది గ్రీకోరోమన్ సంస్కృతికి ఆటపట్టుగా నిలచినది. అందువలన ఈ కాందిశీకులను ఆ సంస్కృతి యెడల ఆదరణ గలిగిన ఇటలీలోని సంపన్న వర్తకులు ఆదరించి, ఆశ్రయమిచ్చారు. వీరి ప్రభావం వలన ప్రాచీన గ్రీకురోమన్ సంస్కృతి పునరధ్యయనానికి ప్రేరణ కలిగినది. దానితో ఒకనాడు సముజ్వలంగా వెలుగొందిన కళలు, సాహిత్యం, వాస్తుశిల్పం, సంస్కృతి తిరిగి జవజీవాలు సంతరించుకోవడంతో సాంస్కృతిక పునరుజ్జీవనం సంభవించి, అది క్రమంగా ఇటలీ నుండి ఐరోపా అంతటా వ్యాపించింది. ఇదే సమయంలో 1450వ సం||లో అచ్చు యంత్రం కనుగొనబడటంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా పునరుజ్జీవన ఉద్యమం ప్రజలలో వ్యాపించినది. దేశభాషలలో సారస్వత వికాసం జరగటంతో జనబాహుళ్యంలోకి నూతనభావజాలం విస్తృతంగా వ్యాపించింది.

పునరుజ్జీవన ఉద్యమంతో యూరోపియన్ సమాజంలో బహుముఖ ప్రగతి సంభవించి అది ఆధునిక నాగరికతకు పునాది వేసింది. ఈ ఉద్యమం యూరోపియన్ మేధావులలో సృజనాత్మకమైన, నూతనమైన, స్వీయ ఆలోచనలను కలిగించింది. చీకటి యుగపు బంధిఖానా నుండి ఐరోపా ప్రజ విముక్తిపొందింది. ఆ యుగంనాటి అన్నిరకాల మూఢత్వాలను ప్రజలు తిరస్కరించారు.

చీకటి యుగం మూలంగా తెగిపోయిన తమ సాంస్కృతీ వికాస స్రోతస్సును ఐరోపా ప్రజలు తిరిగి ముడివేసి నేటి ఆధునిక, అభ్యుదయ జీవన విధానం మరియు శాస్త్రీయ దృక్పథములవైపు కొనసాగించారు.

క్రైస్తవ మత సంస్కరణోద్యమం(Reformation)

ప్రజల ఆలోచనాధోరణిలో వచ్చిన ఈ మార్పు యూరప్‌లో సామాజిక వికాసానికి, జనజీవన చైతన్యానికి ఆటంకంగా ఉన్న మతంలో మార్పుకు దారితీసింది. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ ప్రభావంతో జర్మనీలో మార్టిన్ లూథర్ చర్చి దురాచారాలను ఖండిస్తూ 1517వ సం||లో కరపత్రం విడుదల చేయటంతో చెలరేగిన కలకలం క్రైస్తవ మతసంస్కరణోద్యమానికి దారితీసింది. తిరిగి ఈ ఉద్యమం కూడా ఐరోపా అంతటా వ్యాపించింది. క్రైస్తవ మతాన్ని తమ జీవన వికాసానికి అనుగుణంగా ప్రజలు తీర్చిదిద్దుకున్నారు. చర్చి రెండుగా చీలి క్రైస్తవులు రోమన్ కాథెలిక్కులు (పూర్వాచార) మరియు ప్రొటెస్టెంట్‌లు (సంస్కరణవాద) గా విడిపోయారు.

ప్రొటెస్టెంట్ ఉద్యమ ఫలితంగా కాథలిక్కులు కూడా ఇగ్నేషియా లయోలా నాయకత్వంలో తమలోని లోటుపాట్లను సరిదిద్దుకోవటంతో (ప్రతిసంస్కరణోద్యమం) క్రైస్తవ మతసంస్కరణ సంపూర్ణమైనది.

టర్కులు బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం వలన పై విధంగా ఐరోపాలో సంభవించిన సామాజిక వికాసం తిరిగి వలసల స్థాపన, పారిశ్రామిక విప్లవం, నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు లాంటి తదనంతర పరిణామాల రూపంలో విశ్వవ్యాప్తమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసింది. ఆ పరిణామాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.......(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి