‘జ్ఞానయోగం’ పేరుకు తగినట్లుగానే జ్ఞాన సముపార్జనకు ఉద్దేశించబడినది. జ్ఞానయోగంలో భక్తికి తావులేదు. ఇది హేతువాద ప్రధానమైనది. భగవంతుణ్ణి సైతం హేతువాద దృష్టితో పరిశీలిస్తుంది. భగవంతుడంటే ఏమిటి? ఈ జగత్తు ఏమిటి? ఎక్కడ నుండి వచ్చినది? జీవుడంటే ఏమిటి? జీవస్వరూపం ఏమిటి? ఈ సృష్టిలో జన్మించిన అంటే దేహధారణ చేసిన జీవుని కార్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నింటినీ హేతువాద దృష్టితో చర్చించేది జ్ఞానయోగం.
జ్ఞానయోగానికి హేతువాదం, తార్కిక దృష్టి; రాజయోగానికి శాస్త్రీయ దృక్పథం, క్రమశిక్షణ, యుక్తి, చతురత, విజయకాంక్ష, ఔన్నత్య కాంక్ష; భక్తి యోగానికి విశ్వాసం, శరణాగతి నేపథ్యంగా ఉన్నాయని మనం గుర్తించాలి.
ప్రకృతి-పురుషుడు-జీవుడు
జ్ఞానయోగంలో ముందుగా ప్రకృతి, పురుషుల గురించి తెలుసుకోవాలి. ప్రకృతి, పురుషులు అనాదులు. అంటే ఆదిలేనివి. వీటినెవరూ సృష్టించలేదు. వీటికి మూలమైనది ఏదీ లేదు. ఇవి భూత, భవిష్యత్, వర్తమానకాలాలలో ఎల్లప్పుడూ ఉంటాయి. మహా ప్రళయం సంభవించి ఈ సృష్టి అంతా, ఈ జగత్తంతా లయించి పోయినా ఉంటాయి.
ప్రకృతిం పురుషం చైవ విద్ద్యనాదీ ఉభావపి | (అ.13-శ్లో.20)
ప్రకృతి, పురుషుడు- ఈ ఉభయులకీ ఆదిలేదని తెలుసుకో.
ఇందులో పురుషుడే భగవంతుడు. ఈ జగత్తుకు తండ్రి. చైతన్యానికి మూలం.
ఫురుషుని పరిమాణం అనంతం.
పురుషుడిని 'బ్రహ్మం' అని కూడా అంటారు.
ఇది నిర్వికారం. అంటే మార్పు లేనిది.
ఇది నిర్గుణం. అంటే ప్రకృతి సంబంధమైన త్రిగుణాలు దీనిలో ఉండవు.
ఇది నిరాకారం. అంటే దీనికి ఏవిధమైన ఆకారం ఉండదు,
ఇది ఎల్లప్పుడూ అవ్యక్త రూపంలోనే ఉంటుంది. ఇంద్రియాలకు గోచరించదు.
ప్రకృతి ఈ జగత్తుకు తల్లి. మహామాయ. భావానికి, పదార్ధానికి మూలం.
పకృతి పరిమాణం కూడా అనంతమే.
ఇది సగుణం. అంటే ఇది సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములను (త్రిగుణాలు) కలిగి ఉంటుంది.
ఇది అన్ని రకాల మార్పులకూ లోనౌతుంది,
ఇది వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ కూడా ఉంటుంది.
వ్యక్తరూపంలో ఉండే ప్రకృతంతా ఇంద్రియాలకు గోచరిస్తుంది. దీనిని అపర ప్రకృతి అంటారు. ఇది జడ రూపంలో ఉంటుంది. ఇదే పదార్థం. ఇదే జగత్తు. ఇందులో త్రిగుణాలు అసమతుల్యంగా ఉండటం వలన అవి తమ ప్రభావాన్ని కోల్పోకుండా ఉంటాయి. అందువలన జగత్తులో గుణాతీత స్థితి ఉండదు.
అవ్యక్తరూపంలో ఉండే ప్రకృతి ఇంద్రియాలకు గోచరించదు. దీనిని పర ప్రకృతి అంటారు. ఇది శక్తి రూపంలో ఉంటుంది. ఇదే భావం. ఇదే మహత్తు. ఇందులో త్రిగుణాలు సమతుల్యంగా ఉండటం వలన అవి తమ ప్రభావాన్ని కోల్పోతాయి. అందువలన ఇది గుణాతీత స్థితిలో ఉంటుంది.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ || (అ.7-శ్లో.5)
అర్జునా! ఇప్పుడు చెప్పింది అపరప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో.
సృష్టికి ముందు అనంతమైన పురుషుడిలో అనంతమైన ప్రకృతి లయించిపోయి అవ్యక్తంగా ఉంటుంది. ఇలా లయించిన ప్రకృతిని బయటకు వ్యక్తీకరిస్తే అదే సృష్టికార్యం.
మరి జీవుని సంగతి ఏమిటి? గీతలో ప్రకృతి పురుషులు అనాదులని చెప్పాడు గీతాకారుడు. కానీ ఈ రెంటితోపాటు జీవుడిని పేర్కొనలేదు. అంటే జీవుడు అనాది కాదా? ..మరి అదే గీతలో జీవుని గురించి దేహీ నిత్యమవధ్యో అని పేర్కొనబడింది కదా!
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత ! | (అ.2-శ్లో.30)
అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు.
అంటే దీనిని బట్టి జీవుడు కూడా అనాది అనియే మనం చెప్పవచ్చు. కానీ తదుపరి 13వ అధ్యాయంలో ప్రకృతి, పురుషులను గురించి గీతాకారుడు చెప్పినపుడు జీవుడిని ప్రత్యేకించి పేర్కొనకపోవడానికి కారణం: జీవుడు ప్రకృతి, పురుషులకన్నా వేరు కాకపోవడమే.
జీవస్వరూపం:
అనంతమైన పురుషుడు భగవంతుడైతే, అనంతమైన ప్రకృతి జగన్మాత అయితే అతి సూక్ష్మమైన ప్రకృతి మరియు అతి సూక్ష్మమైన పురుషపదార్ధం యొక్క వీడని కలయికే జీవుడు. ఇదే జీవస్వరూపం. అంటే జీవుడు ఇటు శుద్ధ ప్రకృతి కాదు, అటు శుద్ధ పురుషుడూ కాదు. రెండింటి యొక్క కలయిక. అది కూడా వీడని కలయిక. పరిమాణమేమో అతి సూక్ష్మం.
అనంతమైన శుద్ధ పురుషుడు ‘భగవంతుడు’.
అనంతమైన శుద్ధ ప్రకృతి ‘జగన్మాత’.
అతి సూక్ష్మమైన ప్రకృతి పురుషుల వీడని కలయిక ‘జీవుడు’.
భగవంతుడిలో అంటే అనంత పురుషుడిలో అనంత ప్రకృతి లయిస్తుంది, మరలా తిరిగి వ్యక్తీకరింపబడుతుంది. కానీ జీవుని విషయంలో ఇలా జరగదు. ఎల్లప్పుడూ పురుషుడిలో ప్రకృతి లయించే ఉంటుంది. ఈ రెంటినీ ఉమ్మడిగా కలిపే ‘జీవుడు’ అంటాం. అయితే ఏ రెండు జీవులకు కూడా అలా లయించిన ప్రకృతి ఒకటిగా ఉండదు. ఏ జీవుడికి ఆ జీవుడే ప్రత్యేకం. అదే ఆ జీవుని యొక్క విశిష్టత. ఈ విశిష్టత మరియు ఈ ప్రత్యేకత అనాది సిద్ధం. ఇందుకెవ్వరికీ కర్తృత్వం లేదు. ఎవరూ ఇందుకు బాధ్యులు కారు.
భగవంతుడు తన ప్రకృతిని సృష్టి కార్యం ద్వారా వ్యక్తీకరించి దర్శిస్తాడు.
సర్వభూతాని కౌంతేయ! ఫ్రకృతిం యాంతి మామికాం |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం || (అ.9-శ్లో.7)
కౌంతేయా! ఫ్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టి కాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామ మిమం కృత్స్నం అవశం ప్రకృతే ర్వశాత్ || (అ.9-శ్లో.8)
ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకల భూతసంఘాన్నీ స్వాధీనంలో ఉంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.
స్వస్వరూప సందర్శనం:
మరి జీవుడికి తన ప్రకృతిని అలా వ్యక్తీకరించుకొనే అవకాశం లేదు. అందుకు జీవునికి ఉన్న మార్గం ఒక్కటే. ఆ భగవంతుడి సృష్టికార్యంలో కర్మ ద్వారా తన ప్రకృతిని దర్శించుకోవడం. కర్మ ద్వారా తన ప్రకృతిని ప్రకటించడం.
ఈ సృష్టి కార్యంలో, ఈ అనంత ప్రకృతి యొక్క వ్యక్తీకరణలో తన యొక్క, తనదైన ప్రకృతి యొక్క ప్రతిబింబాన్ని మానవుడు (జీవుడు) కర్మ చేయడం ద్వారానే దర్శించుకుంటాడు. అలానే ఈ లోకంలోని మిగతావారికీ ప్రకటిస్తాడు. దీనినే ‘స్వస్వరూప సందర్శనం’ అంటారు.
ఈ స్వస్వరూప సందర్శనమే మానవజన్మ యొక్క అసలు ఉద్దేశ్యం! అదే మానవజన్మకు అసలైన అర్థం, పరమార్థం !
జీవేచ్ఛ:
జీవుని యొక్క ఈ ప్రకృతే ‘జీవేచ్ఛ’ రూపంలో వ్యక్తమౌతూ - తాను ప్రకటింపబడేవిధంగా - జీవుడిని కర్మకు ఉపక్రమింపజేస్తూ ఉంటుంది. ఈ జీవేచ్ఛనే స్వభావంగా కలిగి దానిని సంకల్పించినపుడు మాత్రమే కర్మ ద్వారా ఈ ప్రకృతి వ్యక్తీకరింపబడుతుంది. అంటే మానవుడు తన జీవేచ్ఛ-స్వభావము-సంకల్పము లను సమన్వయపరచాలి. ఈ మూడింటినీ ఒక దానితో ఒకటి విభేదించకుండా చూడాలి.
(జీవుని యొక్క ప్రకృతే జీవేచ్ఛ గనుక అది ఎప్పుడూ మారదు. ఎవరికీ మారదు. జీవేచ్ఛ సత్యం. మారేవి స్వభావ సంకల్పాలే).
ఈ మూడింటినీ సమన్వయపరచడమెలా అనేది జ్ఞానయోగం చివరన ప్రత్యేకంగా చర్చిద్దాం
...(మిగతా విషయం తరువాతి భాగాలలో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి