2, సెప్టెంబర్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---17 (రెండవ అధ్యాయం (గీతా వ్యాసాలు) ప్రారంభం)

రెండవ అధ్యాయం : ఉపోద్ఘాతం

మొదటి అధ్యాయంలో మానవుడు సమాజంలో ఒక సమగ్రమైన, సమతుల్యమైన వ్యవస్థను ఏర్పరచే ప్రయత్నంలో ప్రపంచ చరిత్రలో రాజకీయంగా, సామాజికంగా క్రమంగా వచ్చిన మార్పులను, జరిగిన సంఘటనలను ఒక నూతన దృక్కోణంలో అధ్యయనం చేయడం జరిగినది. ఇప్పుడీ రెండవ అధ్యాయంలో ఆ నూతన దృక్కోణం యొక్క తాత్విక నేపథ్యాన్ని అంటే ఆ అధ్యయనమంతా ఏ తాత్విక పునాది మీద ఆధారపడి జరిగినదో, అలానే ఏ తాత్విక భావనల ఆధారంగా ఈ దేశంలో నూతన వ్యవస్థను ఏర్పరచాలని భావించడం జరుగుతున్నదో ఆ తాత్విక విచారధారను తెలిసుకుందాం.

ఈ తత్త్వవిచారం పూర్తిగా కొత్తదేమీ కాదు. అర్థవివరణ మాత్రమే కొత్తది. మూలం మన ప్రాచీన భారతీయ తత్త్వశాస్త్రమే. అంటే నేనీ తత్త్వ విచారాన్ని invent చేయలేదు.. discover మాత్రమే చేశాను. భావ గర్భితమైన భారతీయ తత్త్వశాస్త్ర సారమైన గీత నుండి మనకు కావలసిన తాత్త్వికార్థాలను వెలికి తీయడానికి ప్రయత్నించాను.

భారతీయ తత్త్వశాస్త్రం పరిపూర్ణమైనది.. అద్వితీయమైనది. ఐతే దాని ప్రధాన సమస్య ‘భాష్యం’. ఎందుకంటే భారతీయ తత్త్వశాస్త్రం పరోక్షంగా ఉంటుంది.. భావగర్భితంగా, నర్మగర్భంగా ఉంటుంది. దాని అర్థాన్ని వెలికితీయడానికి భాష్యం తప్పనిసరి. ఆదిశంకరుడు మొదలుకొని ఎందరి ద్వారానో ఈ తత్త్వశాస్త్రానికి రకరకాల భాష్యాలు వచ్చాయి. అయితే అవన్నీ మతపరమైన సమస్యల చుట్టూ మరియు పారలౌకిక, పారమార్థిక విషయాల చుట్టూనే తిరిగాయి. ఐహిక విషయాలకు ముఖ్యంగా రాజకీయాలు, సామాజిక వ్యవస్థల వంటి విషయాలకు అనువర్తింపచేసుకునే విధంగా భాష్యాలు వెలువడలేదు. అందుకే ఆ ప్రయత్నం నేను చేశాను.

భారతీయ తత్త్వశాస్త్రం మొత్తాన్నీ నేను అధ్యయనం చేయలేదు. కేవలం దాని సంగ్రహ రూపమైన భగవద్గీతనే నేను ప్రమాణంగా తీసుకున్నాను. అది కూడా గీత మొత్తానికి నేను భాష్యం రాయలేదు. మనకు కావలసిన తత్త్వవిచారానికి సరిపోయేటట్లుగా సుమారు ఓ నలభై శ్లోకాలను తీసుకుని తత్త్వనిర్మాణం చేయడానికి ప్రయత్నం చేశాను.

మొదటి అధ్యాయం చివరిలో ఓ మాట ఉన్నది. “ఈ జగత్తులో ఎవ్వరి భావాలతో, ఎవ్వరి ఒప్పుకోలుతో నిమిత్తం లేని సత్యమనేది ఒకటి ఉన్నది. దానిని చేరే మార్గం కూడా ఉన్నది. దానిని మానవుడు తెలుసుకోవాలి” అని. ఆ సత్యాన్ని తెలుసుకునే దిశగానే ఈ తత్త్వవిచారం ఉంటుంది.

ఈ తత్త్వం మానవుడి కర్మాచరణకు మార్గదర్శకంగా ఉంటుంది కనుక ఈ మొత్తం తత్త్వనిర్మాణాన్ని నేను ‘కర్మయోగం’గా పిలిచాను. ఆ కర్మయోగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కర్మయోగం

ఏ మానవుడైనా సత్యాన్నే ఆచరించాలనుకుంటాడు. సత్యం కోసమే పరితపిస్తాడు. సత్యం వలన మాత్రమే అంతిమంగా శాంతి పొందుతాడు. కానీ మానవుని యొక్క ఈ ఉద్దేశం అంత సులభంగా నెరవేరదు.స్వయంగా అతని అంతరంగం నుండే అతనికి ఆటంకాలెదురౌతాయి. సత్యం కాని దానిని సత్యంగా భ్రమపడి.. దానినే ఆచరించి, సత్యానికి దూరమయ్యే పరిస్థితి కలుగుతుంది. ఈ దుస్థితి నుండి మానవుడిని రక్షించి, సత్యానికి చేరువ చేసేదే కర్మయోగం.


మానవుడు చరిత్రలో ఎక్కువగా సత్యాన్ని ఒక ఆదర్శంగా భావించాడేగానీ సత్యాన్ని ప్రత్యేకించి విశ్లేషించలేదు. సత్యస్వరూపం గురించి మానవుడు ఏవో మాటలకందని భావజాలాన్ని ఏర్పరచుకున్నాడుగానీ, తార్కిక దృష్టితో సత్యమీవిధంగా ఉంటుందని చర్చించలేదు. అలా సత్యాన్ని తెలుసుకునే ఏ ప్రయత్నం చేయలేదు. అందుకే సత్యం గురించి ఎవరికి తోచిన విధంగా వారు వాఖ్యానించారు. ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వారు సత్యంగా ప్రతిపాదించారు.

కానీ మహోన్నతమైన భారతీయ తాత్త్విక జగత్తులో సత్యం గురించి అత్యంత స్పష్టమైన నిదర్శనాలున్నాయి. అయితే భారతీయ తాత్త్వికత (వ్యాసుని వరకు) అంతా ‘ముకుళితమైనది’(Folded Philosophy). ఇది భారతీయ తత్త్వశాస్త్రానికి గల విలక్షణత. ఉపనిషత్తులు, దర్శనాలు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఇత్యాది తత్త్వశాస్త్రాలలో గానీ, పురాణాలలోగానీ, ఇతిహాసాలలో గానీ సత్యస్వరూపాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా సులువుగానే అర్థం చేసుకొనేటట్లుగా కొంచెం పరోక్షంగా చెప్పారు. అందుకే భారతీయ తత్త్వశాస్త్రాన్ని ‘ముకుళితమైనది’ అనవలసి వచ్చింది. అందువలనే దీనికి ఇన్ని భాష్యాలు, ఇన్ని వ్యాఖ్యలు. దాన్ని సమర్థవంతంగా విడదీయవలసిన కర్తవ్యం, అవసరం భారతీయులమైన మనందరిదీ. అలా చేయగలిగిన నాడు సత్యం ఆవిష్కరింపబడుతుంది. ఈ కార్యం దుష్కరమైనది కూడా కాదు. భారతీయ తాత్త్విక చింతనలోని సత్యస్వరూపాన్ని సులువుగానే విశదీకరించవచ్చు.

సత్యం ఎడల మనకు ఉన్న శ్రద్ధను నిరూపించుటకొరకు, దాని యెడల నిజంగా శ్రద్ధ ఉన్నవారే దానిని పొందగలిగేటట్లు ఋషులు తత్త్వశాస్త్రాన్ని ఈ విధంగా నిర్మించారు. శంకరుడాదిగా ఈ తత్త్వశాస్త్రంలోని అంతరార్థాన్ని అవగాహన చేసుకొనుట కొరకు, విశదీకరించుట కొరకు భారతీయులు ఎంతగా కృషి చేశారో, ఎంతగా తపించారో జగమెరిగిన విషయమే.

శంకరుడు, మధ్వాచార్యుడు, రామానుజుడు ఇత్యాది మతాచార్యులంతా భారతీయ తత్త్వశాస్త్రాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి, సత్యస్వరూపాన్ని ఆచరణలో సాధించటానికి చేసిన ప్రయత్నాలలో రకరకాల వ్యాఖ్యలు చెప్పారు. ఐతే వారంతా చారిత్రకంగా హిందూమత సంస్కరణకు, పునరుద్ధరణకు, ఆధునికీకరణకు ఉద్దేశింపబడినవారు గనుక వారు తమ లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగానే భాష్యాలు చెప్పారు. వీరు తమ సంస్కరణ లక్ష్యాలు సాధించగలిగినా సత్యం విషయంలో అభిప్రాయ భేదాలకు, వాదోపవాదాలకు కారకులయ్యారు.

ఐతే మనం శ్రద్ధతో భారతీయ తత్త్వశాస్త్ర జగత్తుకే మకుటాయమానం అనదగిన, ఉపనిషద్సారమైన భగవద్గీతను పరిశీలించినట్లైతే సత్యాన్ని సులభంగానే గ్రహించవచ్చు. గీతా శాస్త్రంలో సత్యం గురించి చెప్పబడిన విషయాన్ని మూడు సూత్రాలలో సంగ్రహంగా తెలుపవచ్చు. అవి:

1. ‘సత్వము’, ‘రజస్సు’, ‘తమస్సు’ అను పరస్పర విరుద్ధమైన మూడు గుణాల ‘మౌలిక మిశ్రమం’ ఈ ‘జగత్తు’.

2. అవే మూడు గుణాల అంశీభూత సమ్మేళనం ‘సత్యం’.

3. జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే సాధనం ‘యజ్ఞం’.

మొదటి సూత్రం మనకు ‘కర్మ స్వరూపం’ మరియు ‘జగత్ స్వరూపం’ లను వివరిస్తుంది. రెండవ సూత్రం ‘సత్యస్వరూపం’ ను వివరిస్తుంది. మూడవ సూత్రం ‘యజ్ఞం’, లేక ‘నిష్కామ కర్మ’ యొక్క స్వరూపాన్ని వివరిస్తుంది.

సత్య స్వరూపాన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే మొదట మనం విధిగా కర్మ స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి…(సశేషం)


2 వ్యాఖ్యలు: