23, ఆగస్టు 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---16 (మొదటి అధ్యాయం చివరి భాగం)





ఎందుకీ వైఫల్యం..?!


ఇస్లాం,కాపిటలిజం,కమ్యూనిజం.. ఇవి మూడునూ మానవుడు యావత్ మానవాళినంతటినీ ఉద్దేశించి ఒక చక్కటి సామాజిక, రాజకీయ వ్యవస్థ కొరకు ఒకదాని తరువాత ఒకటిగా చేసిన మూడు మహా ప్రయత్నాలు. ఇవి మూడునూ విఫలమయ్యాయి. అయితే ఇవి విఫలమైనది అంతిమ లక్ష్య సాధనలో మాత్రమే. వీటి ఫలితంగా ప్రపంచంలో అనేక మార్పులు జరిగాయి.. అనేక అద్భుతాలు సంభవించాయి. తుదకు నేటి రూపం ఏర్పడింది. ఈ విధంగా ఇవి చాలా ప్రయోజనాన్నే సాధించాయి. ఐతే మానవుని ఆ చిరకాల స్వప్నం మాత్రం నెరవేరలేదు. ఆ విషయంలో మాత్రం మానవుడు వైఫల్యాన్నే చవి చూశాడు.

తన వైఫల్యానికి కారణాన్ని సమీక్షించుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు మానవునికి ఏర్పడింది.ఈ విధంగా ఒకదాని తరువాత ఒకటిగా విఫలయత్నాలు చేసుకుంటూ పోయే అవకాశం ఇక మానవునికి లేదు. అది ఆ మూడింటితోనే సరి.మానవుని వైఫల్యానికి ప్రధాన కారణం ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా మానవుడు ప్రతిక్రియాత్మక ధోరణితోనే వ్యవహరించాడు గానీ అసలు సత్యమేమిటనిగానీ, రాగద్వేష రహితంగా సరైన విధానమేమిటనిగానీ ఆలోచించలేదు. తన ప్రతిక్రియాత్మక ధోరణినే మానవుడు సరియైన విధానంగా, సత్యంగా భావించాడు. నేటి పరిభాషలో చెప్పాలంటే మానవుడు Proactiv గా కాక Reactive గా కృషి చేశాడు.అందువలనే విఫలం చెందాడు.

ఒక చక్కటి సామాజిక, రాజకీయ వ్యవస్థ కొరకు ప్రయత్నించేటపుడు ‘సరి అయిన వ్యవస్థ అంటే అసలు ఎలా ఉండాలి?’.. అని ఆలోచింపక అప్పటికి సమస్యగా పరిణమించిన విషయాలకు పరిష్కారంగా తోచిన ప్రతిక్రియాత్మక ధోరణితో నూతనమైన వ్యవస్థలను నిర్మించాడు. అందువలన అవి అప్పటికి సమస్యలను పరిష్కరించినా, కాలక్రమంలో ఈ పరిష్కారాలే మరలా కొత్త రూపంలో సమస్యలుగా రూపాంతరం చెందాయి. తిరిగి మానవుడు ఆ వ్యవస్థను కాదని తిరిగి కొత్త వ్యవస్థను నిర్మించేటపుడు కూడా మరలా ప్రతిక్రియాత్మక ధోరణితోనే వ్యవహరించాడు. దానితో అవికూడా అప్పటికి సమస్యలను పరిష్కరించినా కొంత కాలానికి తిరిగి స్వయంగా అవే సమస్యలుగా పరిణమించాయి.

అరాచకానికి వ్యతిరేకంగా జనించిన ఇస్లాం విషయంలో ఇలానే జరిగింది. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జనించిన కాపిటలిజం విషయంలో ఇలానే జరిగింది. కాపిటలిజానికి వ్యతిరేకంగా జనించిన కమ్యూనిజం విషయంలో ఇలానే జరిగింది. కనుక ఇకనైనా మానవుడు తన ప్రతిక్రియాత్మక ధోరణికి స్వస్థి పలికి రాగద్వేష రహితంగా అంటే ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా ఇష్టాన్ని కానీ అనిష్టాన్ని కానీ ప్రదర్శించకుండా అసలు సత్యమేమిటని ఆలోచించాలి. తనకు సమస్యగా పరిణమించిన వ్యవస్థను ద్వేషించడం మానుకుని ‘అసలు సత్యస్వరూపమైన వ్యవస్థ ఎలా ఉంటుంది?’ అని ఆలోచించాలి. ద్వేషించడం కనుక జరిగితే ఆ వ్యవస్థకు ప్రతిక్రియనే మానవుడు కోరుకుంటాడు.. ఆ ప్రతిక్రియనే సత్యమనుకుంటాడు.

మానవుడు చరిత్రలో ఏ వ్యవస్థను నిర్మించేటపుడైనా మొదట తాత్విక విచారణ చేసేవాడు. ఆ తాత్విక పునాదిపైనే ఆయా వ్యవస్థలను నిర్మించేవాడు. ఐతే ఆ తాత్విక విచారధారలన్నీ సత్యాన్ని కాక అప్పటి తన ప్రతిక్రియాత్మక ధోరణినే ప్రతిబింబించేవి. ఆ ధోరణే పునాదిగా గలిగిన వ్యవస్థలు కూడా అలానే వ్యవహరించేవి.. తుదకు విఫలం చెందేవి.

ఇస్లాం ఆవిర్భవించిన నేపథ్యం అరాచకం. ఆ రోజులలో ప్రపంచంలో అనాగరిక జాతులు అల్లకల్లోలం సృష్టిస్తుండేవి.కనుక మానవుడి ఆలోచనాధోరణిని ఆ అరాచకం ప్రభావితం చేసింది. అరాచకానికి ప్రతిక్రియగా పటిష్ఠమైన రాజ్యశక్తి నిర్మాణానికి మానవుడు మొగ్గుచూపాడు. ఆ ధోరణి కలిగిన తాత్వికచింతనే చేశాడు. అదే సత్యంగా భావించాడు. అలా ఏర్పడినదే ఇస్లాం.

కానీ మితిమీరిన రాజ్యశక్తి కాలక్రమంలో సామాజిక వికాసానికి ఆటంకంగా పరిణమించినది.దానితో మానవుడు మరలా ఆలోచనలో పడ్డాడు. ఈ సారి సామాజిక వికాసానికి అనుకూలమైన తాత్విక విచారణ చేశాడు. రాజ్యశక్తిని సమస్యగా భావించాడు. ఈ పునాది మీద ఏర్పడినదే కాపిటలిజం. కానీ కాలక్రమంలో మితిమీరిన సామాజిక స్వేచ్ఛ వ్యక్తి ప్రయోజనానికి భంగకరంగా మారింది. దానితో మానవుడు మరలా ఆలోచనలో పడ్డాడు. తిరిగి సామాజిక వికాసాన్ని సమస్యగా భావించి వ్యక్తి ప్రయోజనానికి అనుగుణమైన తాత్విక చింతన చేశాడు. ఆ తాత్విక పునాది మీదనే సామ్యవాదాన్ని నిర్మించాడు.కానీ కాలక్రమంలో ఈ సామ్యవాదం వలన అసలు మానవుని సామాజిక జీవనం యొక్క మౌలిక లక్ష్యాలే దెబ్బతినటంతో తిరిగి ఆ సామ్యవాదాన్ని కూడా వదిలేశాడు.

ఇప్పుడు ప్రపంచంలో ఒక రకమైన భావశూన్యత ఏర్పడింది. ఇటువంటి శూన్యత సమీప గతంలో ఎప్పుడూ ఏర్పడలేదు. ఇస్లాం ప్రపంచాన్ని డామినేట్ చేసిన రోజుల్లో ఇస్లామిక్ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శంగా ప్రజాదరణ పొందాయి. తరువాతి కాలంలో ఆ సిద్ధాంతం వెనుకబడగానే కాపిటలిస్టు అభ్యుదయభావాలు ప్రపంచాన్ని డామినేట్ చేశాయి. అవి కూడా వెనుకడుగు వేయగానే సామ్యవాద ఆదర్శ భావజాలం ప్రపంచాన్ని డామినేట్ చేసింది. ఇప్పుడు అలా డామినేట్ చేసిన భావజాలమేదీ ప్రపంచంలో లేదు. ఇప్పుడు మానవుని ముందున్నది మూడు విఫలయత్నాలు మాత్రమే.

ఈ విధంగా మానవుడు గతకాలంలో సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఒక సమస్య పోతే మరో సమస్యనెదుర్కొన్నడు. ఏది సమస్యకు పరిష్కారమని ఢంకా భజాయించి చెప్పాడో అదే తిరిగి సమస్యగా పరిణమించడంతో నివ్వెరపోయాడు. ప్రతీసారీ ఇలానే జరగటంతో మానవుడు మ్రాన్పడిపోయాడు.

మానవుడు చరిత్రలో చాలా హడావుడి చేశాడు. కానీ ఏదీ నిలబడలేదు.దీనివలన ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట వాస్తవమైనా .. నేటి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సంపత్తి కలిగిన ప్రపంచం ఆయా ప్రయత్నాల ఫలితమే అయినా.. మానవుని అసలు లక్ష్యమైన ‘వ్యవస్థలోని అన్ని అంగాల ప్రయోజనం సమంగా నెరవేరే’ రాజకీయ, సామాజిక వ్యవస్థ మాత్రం నిర్మింపబడలేదు. కనుక ఇకనైనా మానవుడు తన ప్రతిక్రియాత్మక ధోరణిని వదలి.. రాగద్వేషపూరితమైన ఆలోచనాధోరణిని వదలి సరియైన తాత్విక విచారధారతో సత్యాన్ని కనుగొనాలి. తనకు తోచిన దానిని, తన భావాలకు అనుకూలంగా ఉన్నదానిని, అప్పటి సమస్యకు పరిష్కారంగా ఉన్నదానిని సత్యంగా భావించే ధోరణిని విరమించుకోవాలి.

ఈ జగత్తులో ఎవ్వరి భావాలతో ఎవ్వరి ఒప్పుకోలుతో నిమిత్తంలేని సత్యమనేది ఒకటి ఉన్నది.దానిని చేరే మార్గం కూడా ఉన్నది. దానిని మానవుడు తెలుసుకోవాలి.దానిని ఆచరిస్తేనే మానవుడికి ప్రయోజనం. దాని ద్వారానే మానవుని చిరకాల లక్ష్యం నెరవేరుతుంది. అటువంటి అనిమిత్త సత్యాన్ని తెలుసుకోకుండా తనకు నచ్చిన దానిని సత్యంగా ప్రకటించకూడదు. అదే మానవుడు చేసిన తప్పు. దాని ప్రతిఫలమే ఈ వైఫల్యం…(సశేషం)

(ఇంతటితో ‘ప్రపంచ చారిత్రక, రాజకీయ పరిణామాల సంగ్రహ అధ్యయనం’ అనే మొదటి అధ్యాయం సమాప్తం)



1 కామెంట్‌:

  1. సర్ తప్పుగా రాసినందుకు క్షమించండి సవరనగా దానిని సరిదిద్దాను , సర్ మీరు సవరణను తెలిపినందుకు చాల కృతజ్ఞుణ్ణి .

    రిప్లయితొలగించండి