19, ఆగస్టు 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---12





అక్టోబర్ విప్లవం

ఈ విధంగా సమాజం యొక్క దోపిడీ నుండి వ్యక్తిని రక్షించటం కొరకు మానవుడు ఆలోచించాడు. తుదకు ఈ సిద్ధాంతం ప్రాతిపదికగా 1917వ సం||లో ‘లెనిన్’ నాయకత్వంలో రష్యాలో జరిగిన ‘బోల్షివిక్ విప్లవం’ లేక ‘అక్టోబర్ విప్లవం’ వలన ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. లెనిన్ మరణానంతరం ‘స్టాలిన్’ నాయకత్వంలో కమ్యూనిస్టు రష్యా (సోవియట్ యూనియన్) గణనీయమైన అభివృద్ధి సాధించింది. చివరకు రెండవ ప్రపంచ యుద్ధంలో యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'హిట్లర్' సైన్యాన్ని రష్యా ఓడించటంతో కమ్యూనిస్టు రష్యా శక్తి ప్రపంచానికి తేటతెల్లమైనది. రష్యా కీర్తి గగనతలాన్నంటింది. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఎక్కడలేని బలం వచ్చింది. దాని ప్రభావం చెప్పలేనంతగా ప్రపంచ రాజకీయ వ్యవస్థ మీద పడింది.

రష్యా యొక్క సరిహద్దులలోగల విస్తారమైన భూభాగాన్ని స్టాలిన్ 'సోవియట్ యూనియన్‌'లో విలీనం చేశాడు. అంతేకాక రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తన ఆక్రమణలోకి వచ్చిన తూర్పు ఐరోపా దేశాలన్నింటినీ స్టాలిన్ కమ్యూనిస్టు దేశాలుగా మార్చివేశాడు. ఆ దేశాలన్నీ సోవియట్ యూనియన్‌కు మిత్రదేశాలుగా మారాయి. ప్రపంచంలో కమ్యూనిజం ఒక బలమైన శక్తిగా మారింది.

దీనితో పశ్చిమ ఐరోపా దేశాలు తూర్పు నుండి దూసుకొస్తున్న ఎర్ర కెరటం నుండి కనీసం తాము బయటపడటానికి మరియు అప్పటికే తమ మీద దోపిడీదారీ సామ్రాజ్యవాద దేశాలుగా ముద్రపడి సామ్యవాదానికి ప్రపంచమంతటా ప్రజాదరణ పెరగటంతోనూ, అదీగాక రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చేతిలో చావుదెబ్బ తినడం వలన జరిగిన అవమానం.. తుదకు అమెరికా మరియు కమ్యూనిస్టు రష్యాల సహాయంతో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందాన బ్రతికి బయటపడటం… ఇలా ఈ కారణాలన్నింటివలన అవి తమ వలస దేశాలన్నింటికీ త్వరలోనే స్వాతంత్ర్యాన్ని ప్రకటించేసాయి.

ఈ విధంగా కమ్యూనిజం మానవాళికి ఎనలేని మేలు చేసి నేటి ఆధునిక ప్రపంచం ఏర్పడటానికి ప్రధాన కారణమైనది. కమ్యూనిజమే లేకపోతే నేటికి కూడా ప్రపంచంలో మూడువంతుల ప్రజలు ఒక వంతు ప్రజల చేతిలో వలస ప్రజలుగా బ్రతుకుతూ ఉండవలసి వచ్చేది. క్రమంగా చైనా, మంగోలియా, ఉత్తర కొరియా, కంబోడియా, వియత్నాం, లావోస్ లాంటి ఆసియా దేశాలు మరియు మరికొన్ని లాటిన్ అమెరికా దేశాలు కూడా సామ్యవాద వ్యవస్థను అవలంబించాయి.

ఈ సామ్యవాద ఆలోచనావిధానం వలన మానవుడు రాజకీయంగా మరియు ఆర్థికంగానే కాక, సాంస్కృతికంగా కూడా విముక్తి చెందాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని 'శాస్త్రీయ దృక్పథం' మూఢత్వాన్నుండి ఏ కొద్దిమంది విద్యావంతులనో మార్చింది. కానీ 'తార్కికమైన' లేక 'హేతుబద్ధమైన' ఆలోచనతోకూడుకున్న ఈ సామ్యవాద దృక్పథం యావత్‌ప్రపంచంలోని విస్తారమైన జనబాహుళ్యాన్ని మూఢత్వాన్నుండి బయటపడవేసింది. ప్రతి మనిషి తన విలువ తెలుసుకుని మసలటం ప్రారంభించాడు. అప్పటి వరకు బలహీనులుగా భావించబడినవారంతా ప్రాబల్యాన్ని సాధించారు. స్త్రీలు పురుషుల ఎదుట తమ ప్రాబల్యాన్ని చాటారు. పేదలు ధనవంతుల ఎదుట తమ ప్రాబల్యాన్ని చాటారు. పాలేరు కామందు ఎదుట, నిమ్నవర్ణాలవారు అగ్రవర్ణాల ఎదుట, పాలితులు పాలకుల ఎదుట, రైతుకూలీ భూస్వామి ఎదుట, పిల్లలు పెద్దల ఎదుట తమ ప్రాబల్యాన్ని చాటారు.

సామ్యవాద వ్యవస్థలో సమాజంలో దోపిడీ నిర్మూలించబడింది. 'స్వంత ఆస్తి' రద్దు చేయబడి ఫాక్టరీలు మరియు వ్యావసాయిక భూమి లాంటి ఉత్పత్తి సాధనాలు, వనరులు ప్రజలందరి ఉమ్మడి సొత్తుగా మార్చివేయబడ్డాయి. ఆధునిక విజ్ఞానశాస్త్ర ఫలాలు ప్రజలందరకూ సమానంగా అందుబాటులోకి వచ్చాయి. స్త్రీలు ఉన్నత విద్యనభ్యసించారు. ఫురుషులతో సమానంగా అన్ని పదవులనూ అలంకరించారు. జాతికులభేదాలు లేకుండా సమాజంలోని ప్రతిఒక్కరికీ సమాన అవకాశాలు ఈయబడ్డాయి. బూర్జువా సంస్కృతికి కాక సామాన్య ప్రజల సంస్కృతికి పెద్దపీట వేయడం జరిగినది. ఈ విధంగా సామాజిక శక్తుల దోపిడీ పీడ విరగడై వ్యక్తి ప్రయోజనం కొరకు పాటుపడే సామ్యవాద వ్యవస్థ ఏర్పడింది.

అంతర్జాతీయ స్థాయిలోనైతే ధనిక దేశాలు బడుగు దేశాలను తమ వలసలుగా చేసుకుని దోపిడీ చేయటం అంతమొందిన విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. అలా విముక్తి పొందిన దేశాలలో కానీయండి, చివరికి దోపిడీదారీ పశ్చిమ ఐరోపా దేశాలలో కానీయండి… అవి పెట్టుబడిదారీ దేశాలైనాకూడా సామ్యవాద ఆలోచనా విధానాన్ని నిర్లక్ష్యం చేయటం వాటికి సాధ్యపడలేదు.

(సామ్యవాదం ఒక వ్యవస్థగా కొన్ని దేశాలకే పరిమితమైనా ఒక ఆలోచనా విధానంగా (సోషలిజం) మాత్రం విశ్వవ్యాప్తమైనది. సోవియట్ యూనియన్ పతనంతో సామ్యవాదం ఒక వ్యవస్థగా మాత్రమే అపజయం పొందింది.కానీ ఒక ఆలోచనా విధానంగా అది వేసిన బలమైన ముద్ర నేటికీ ప్రపంచమంతటా సజీవంగానే కాక బలంగా కొనసాగుతున్నది.)

అయితే ఈ వ్యవస్థలో కూడా వ్యక్తి ప్రయోజనాలు మాత్రమే నెరవేరాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా వ్యవస్థలో రాజ్యం, సమాజం, వ్యక్తి అనబడే మూడు అంగాలుంటాయి. ఈ మూడింటి ప్రయోజనాలు సమానంగా నెరవేరినపుడే అది సక్రమమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. కనీ ఈ సామ్యవాద వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనాలు మాత్రమే నెరవేరాయి. రాజ్యం యొక్క, సమాజం యొక్క ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడినాయి.

సిద్ధాంతపరంగా సామ్యవాదం రాజ్యానికి బద్ధ వ్యతిరేకి. రాజ్యాన్ని పీడక వర్గం పీడిత వర్గాన్ని అణచి ఉంచటానికి ఉపయోగించే సాధనంగా అభివర్ణించింది. రాజ్యం డుల్లిపోవాలని ఆకాంక్షించింది. సమాజంలో రాజ్యం ఏర్పడటం అనేది సహజమైన మరియు అనివార్యమైన పరిణామం. దీనిని గుర్తించకుండా సామ్యవాదం సమాజాన్ని మాత్రమే అంగీకరించి రాజ్యాన్ని వ్యతిరేకించటం విడ్డూరం.

అలాగే సామ్యవాదం వ్యక్తి యొక్క సామాజిక ప్రవృత్తిని కూడా నిరోధించింది. తనదైన విశిష్టత కలిగిన వ్యక్తి, తనవైన ప్రతిభాపాటవాలు కలిగిన వ్యక్తి వాటిని ప్రదర్శించుకొని, సమాజంలో వాటిని నిరూపించుకుని తనకంటూ సమాజంలో ఒక గుర్తింపును, తనకు తగిన ఒక ఉన్నత స్థానాన్ని పొందటానికి అవకాశం లేకుండా పోయింది. సమానత్వం పేరుతో అందరూ ఒకేగాటన కట్టివేయబడ్డారు. సామాజికమైన ఉత్పత్తి వనరుల అభివృద్ధి జరిగినా స్వంత ఆస్తికి అవకాశం లేకపోవటంతో అందరూ తిండిగింజలకు మాత్రమే పనిచేయవలసిన పరిస్థితి తలయెత్తినది. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలే సమాజంలోని ప్రజలందరకూ జీవన లక్ష్యాలుగా నిర్దేశించబడినాయి. ఈ విధంగా దైహిక స్థాయి అవసరాలే మానవుడి జీవన లక్ష్యాలైతే అందుకు సామాజిక జీవితమే అవసరంలేదు. ఆటవిక జీవితంలో అవి ఇంతకంటే సులువుగా లభిస్తాయి. ఈ విధంగా సామ్యవాద వ్యవస్థలో మానవుడి సామాజిక జీవితం యొక్క మౌలిక లక్ష్యాలే నిర్లక్ష్యం చేయబడ్డాయి.

తూర్పు ఐరోపా, రష్యా, చైనా లాంటి దేశాలలో సిద్ధాంత విషయంలో కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించబడింది. కానీ కంబోడియా లాంటి చోట్ల సిద్ధాంతాలను మూర్ఖంగా ఆచరించటానికి ప్రయత్నించి 'పోల్‌పాట్' లాంటి పాలకులు ఎంతో విధ్వంసాన్ని సృష్టించారు… ఎంతో మారణకాండకు పాల్పడ్డారు.

(స్టాలిన్ హయాంలో రష్యాలో కూడా మారణ హోమం జరిగినది. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలకు భూములివ్వ నిరాకరించిన ప్రజలను స్టాలిన్ పెద్దయెత్తున వధించాడు. కొందరికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. మరికొందరు నిర్బంధ శ్రామిక శిబిరాలకు తరలింపబడ్డారు. తన విధానాలను వ్యతిరేకించిన తన స్వంత సహచరులు అనేక మందిని సైతం స్టాలిన్ ‘గ్రేట్ పర్జ్’ పేరుతో పాశవికంగా వధించాడు. చైనాలో కూడా మావో కాలంలో ‘గొప్ప ముందడుగు’, ‘సాంస్కృతిక విప్లవం’ మొదలైన కార్యక్రమాల మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు.)

ఈ విధంగా సామ్యవాదం వ్యక్తి యొక్క సామాజిక ప్రవృత్తిని నిరోధించటంతో అనేక సామ్యవాద దేశాలలోని ప్రజలు స్వేచ్ఛకోసం తహతహలాడి అటువంటి స్వేచ్ఛ కలిగిన పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాన్ని కోరుతూ తమ దేశాలలోని సామ్యవాద వ్యవస్థలను కూలదోసారు. ఇది చరిత్రలో ఇటీవలి పరిణామమే. ఒకనాడు ఏ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామ్యవాదం జనించిందో ఆ పెట్టుబడిదారీ వ్యవస్థనే ప్రజలు తిరిగి కోరుకోవటంతో ఇది ఒకరకంగా తిరోగమనంగానే భావించవలసి ఉన్నది. దీనికి కారణాలను ముందుముందు పరిశీలిద్దాం……(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి