5, జులై 2019, శుక్రవారం

యోగభావనలు (Concepts of Yoga)పని - ఫలితం


మనం చేసే పనులకు రెండురకాలైన ఫలితాలు లభిస్తాయి. 

మొదటిది మనకు ప్రత్యక్షంగా కనిపించే ఫలితం. ఇది తక్షణం కార్యరూపం దాల్చుతుంది. అందరూ ఇది మాత్రమే ఫలితం అనుకుంటారు.

కానీ మరోరకమైన ఫలితం కూడా ఉంటుంది అది పైకి కనిపించదు. వెంటనే కార్యరూపం దాల్చదు.

మొదటిది Active and Visible Result

రెండవది Potential and Invisible Result

పైకి కనిపించని Potential Result మరలా రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి Positive Potential మరోటి Negative Potential 

ఇవి రెండూ వేరువేరు Reserves గా ఉంటాయి. అంటే వేటికవే ప్రత్యేకమైన నిల్వలుగా ఉంటాయి.

మనం నిరంతరం చేసే పనులకు తక్షణ ఫలితం ఎలా ఉన్నా వాటిలోని మంచి చెడులవలన ఈ రెండు రకాల Potential Results ఏర్పడతాయి. 

మనం చేసే పనిలోని మంచి Positive Potential రూపంలో Positive Reserve గా ఏర్పడుతుంది. ఆ తదుపరి చేసే పనులలోని మంచి కూడా Positive Potential గా మారి క్రమానుగతంగా దీనికి add అవుతుంది.  

అలాగే మనం చేసేపనులలో చెడు ఏమైనా ఉంటే అది Negative Potential రూపంలో Negative Reserve గా ఏర్పడుతుంది. ఆ తదుపరి చేసే పనులలోని చెడు కూడా Negative Potential గా మారి క్రమానుగతంగా దీనికి add అవుతుంది. 

కొంతకాలం ఇలా పెరుగుతూ పోయి ఆ Reserves నిర్దిష్ఠ పరిమాణానికి (Certain Quantity) చేరుకున్న తరువాత Potential & Invisible Form దశ నుండి Kinetic & Visible Form దశలోకి మారతాయి. అయితే ఇవి రెండూ ఒకే సారి మారవు. ఎందుకంటే ఇవి రెండూ ఒకే స్థాయిలో పెరగవు. ముందుగా Ripen Stateకు చేరుకున్నది ముందు మారుతుంది.

Positive Reserve and Negative Reserve ఈ రెంటిలో ఏది ముందుగా నిర్ధిష్ఠ పరిమాణానికి చేరితే అదే ముందుగా వ్యక్తీకరింపబడుతుంది.

ఏ వ్యక్తిలోనూ సాధారణంగా మంచి చెడులు సమానంగా ఉండవు. ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుది కనుక అదే ముందుగా వ్యక్తీకరణ దశకు చేరుతుంది.

తక్షణం లభించే మొదటి రకం ఫలితం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. కానీ దీర్ఘ కాలంలో పోగుపడిన Potential Reserve వ్యక్తీకరింపబడటం వలన కలిగే రెండవ రకం ఫలితం  దీర్ఘకాలం ఉంటుంది.

ఘనకార్యాలు ఎప్పుడూ Positive Potential వ్యక్తీకరింపబడటం వలన మాత్రమే సాధింపబడతాయి. కానీ అనేకమంది ఘనకార్యాలను ఎలాంటి Positive Reserveనూ కలిగిలేకుండా మొదటి రకమైన తక్షణ ఫలితం రూపంలో సాధించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటారు.

అలాగే దుస్థితి కూడా ఎవరికైనా Negative Potential వ్యక్తీకరింపబడటం వలన మాత్రమే సంభవిస్తుంది.

పైన తెలిపిన విషయాలను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం

సమానమైన అర్హతలు, సమానమైన అవకాశాలను కలిగిన ఇరువురు వ్యక్తులు జీవితంలో వృద్ధిలోకి రావాలని తలపోసి ఒకే చోట ఒకే రకమైన వ్యాపారాన్ని ప్రారంభించారనుకుందాం. వ్యాపారవిజయానికి ఇరువురూ చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నారు, ఇరువురూ సమానంగా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారు పొందే ఫలితాలెలా ఉంటాయో చూద్దాం.

వారిరువురూ తగిన పరిమాణంలో Positive Reserveను కలిగి ఉంటే ఇరువురూ విజయాన్ని పొందుతారు.

ఒకరు మాత్రమే కలిగి ఉంటే ఆ ఒకరు మాత్రమే విజయాన్ని పొందుతారు.

ఇరువురూ కలిగి లేకపోతే ఇరువురూ అపజయాన్ని మాత్రమే పొందుతారు.

ఏవరికి ఏస్థాయి Reserve ఉంటే వారు ఆ స్థాయి విజయాన్ని మాత్రమే పొందుతారు.

ఇక్కడ ప్రయత్నం అనేది నిమిత్తమాత్రమైనటువంటిది. కేవలం ప్రయత్నించినంతమాత్రాన ఇలాంటి విషయాలలో ఎవరూ విజయాన్ని పొందలేరు. అది చిత్తశుద్దితో కూడుకున్న ప్రయత్నమైనప్పటికీ.   

ఇలా ప్రయత్నిస్తున్న వారికి Positive Reserve లేకపోగా Ngative Resrve గనుక ఉంటే వారు ఆస్తులు కోల్పోయి అప్పులపాలై కష్టాల సుడిగుండం లోకి నెట్టివేయబడతారు.

కనుక కేవలం ప్రయత్నాన్ని నమ్ముకుని కార్యరంగంలోకి దూకితే ఫలితం దక్కుతుందనుకోవడం మూర్ఖత్వం. క్రమశిక్షణాయుతమైన గతజీవితం సుదీర్ఘంగా వున్నవారు మాత్రమే Positive Reserve ను కలిగిఉంటారు. వారు మాత్రమే తమప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు. 

వ్యాపారమే కాకుండా విద్య, ఉద్యోగం, రాజకీయం, క్రీడారంగం, గ్లామర్ రంగం ఇలా దేనికైనా ఈ సూత్రం వర్తిస్తుంది.7, నవంబర్ 2018, బుధవారం

యోగభావనలు (Concepts of Yoga)పుణ్యం - పాపం


భారతీయుల ఆలోచనా విధానంలోని ప్రముఖమైన భావాలలో పుణ్యం పాపం అనే భావన కూడా ఒకటి. పరపీడనను పాపకార్యంగా, పరోపకారాన్ని పుణ్యకార్యంగా చాలామంది భారతీయులు భావిస్తుంటారు. 

దానధర్మాలు చేయడం, గుళ్ళూ గోపురాలు కట్టించడం, తీర్థయాత్రలు చేయడం, నోములు, వ్రతాలు చేయడం మొదలైన పనులు పుణ్యకార్యాలనీ, ఇతరులకు అన్యాయం చేయడం పాపకార్యమనీ సాధారణంగా అందరు భావిస్తుంటారు.

సమాజంలో ఈ భావనలెలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సదాచారణ, సద్గుణసంపత్తిద్వారా మానవుడు శక్తిని ఆర్జించడాన్ని యోగమార్గమంటారని మనం తెలుసుకున్నాం. ఈ సద్గుణసంపత్తినే పతంజలి మహర్షి  యమనియమాలని పేర్కొన్నాడు. 

ప్రేమ, సహనం, శ్రద్ధ, విధేయత, ఐకమత్యం, ఉదారత, మితాహారం, మితభాషణ మొదలైన సద్గుణాలను కలిగి ఉండటం, దురలవాట్లకు దూరంగా ఉండటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, శుచిశుభ్రత పాటించడం, విద్యను, విజ్ఞానాన్ని ఆర్జించడం, నాగరికత అలవరచుకోవడం, కోపాన్ని జయించడం, స్త్రీలను, పెద్దలను గౌరవించడం, సత్సంప్రదాయాలను పాటించడం, కుటుంబ విలువలు, సామాజిక విలువలను పాటించడం ….ఇలా సద్గుణ సంపత్తి అనేది చాలా విస్తారమైన పరిధిని కలిగి ఉంటుంది.

పైన పేర్కొన్నటువంటి కొన్ని సదాచారాలను పాటించడం ద్వారా మానవుడు శక్తిని ఆర్జించడాన్ని ప్రాచీన భారతీయ ఋషులు తపస్సు అని అన్నారు. అలా ఆర్జించిన శక్తిని తపశ్శక్తి అనేవారు. ఈ ప్రక్రియనంతా వారు యోగమార్గంగా పేర్కొన్నారు. దీనికి పతంజలి మహర్షి యోగదర్శనం అనే శాస్త్రీయ రూపాన్నిచ్చాడు. నాటి భారతీయ సమాజం ఆ విలువలతోనే మనుగడ సాగించేది.

కాలక్రమంలో కొందరు దుర్మార్గులు శక్తి సముపార్జన కొరకు దగ్గర దారులను వెదకడం ప్రారంభించారు. ఈ మార్గాలను అనుసరించేవారు సులువుగా, స్వల్పకాలంలో శక్తివంతులౌతున్నారనే భావన వ్యాప్తిచెందడంతో ఎన్నో నియమనిష్ఠలతో కూడుకొని దీర్ఘకాలం పట్టే ఈ తపస్సును, సదాచారాలను, సద్గుణసంపత్తిని పాటించేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఆయా దగ్గర దారులను అనుసరించేవారి సంఖ్య పెరిగిపోయింది. చివరకు భారతీయ సమాజం మొత్తం తపస్సు అనే సాధనకు దూరమైపోయింది.

ఈ దగ్గర దారులు అనేకం ఉన్నాయి. ఆయా దారులలో శక్తిని సముపార్జించడానికి కొందరు ప్రత్యేక సాధకులు బయలుదేరారు. వాటిని ఇంతకు ముందరి వ్యాసాలలో పేర్కొనడం జరిగినది. 

సాధారణ ప్రజలు మాత్రం పుణ్యం పాపం అనే దారిని ఎంచుకున్నారు. వారు పరపీడనను పాపకార్యంగానూ, దానధర్మాల్లాంటి పరోపకార కార్యాలనూ, దైవభక్తితో కూడుకున్న పనులను పుణ్యకార్యాలుగానూ భావించడం ప్రారంభించారు. ఇహ మిగిలిన అన్ని సద్గుణాలకూ క్రమంగా తిలోదకాలిచ్చారు. 

ఒక వ్యక్తిలో సుగుణాలు సహజ సిద్ధంగా ఉంటే తప్ప వాటిని సాధనలో భాగంగా అలవరచుకోవడం అనేది కనుమరుగైపోయింది. పైగా సహవాస దోషంతో (Social Osmosis) ఒకరి నుండి మరొకరు దుర్గుణాలను అలవరచుకొని సమాజంలో హెచ్చుభాగం దుర్గుణాలతో నిండిపోయింది. 

30, అక్టోబర్ 2018, మంగళవారం

యోగభావనలు (Concepts of Yoga)
శీలము-బలముసమాజంలో జీవనం సాగించే ప్రజలలో సింహభాగం బలాన్ని ఆర్జించడానికే కృషిచేస్తుంటారు. 

ఇక్కడ బలం అంటే ప్రాపంచికమైన ఆధిక్యం. యశస్సు, సంపద, విజయం, అధికారం మరియు భోగం; ఇవన్నీ ప్రాపంచికమైన అంశాలే, ఇవన్నీ కూడా బలం యొక్క వివిధరూపాలే. వీటిలోని ఏదో ఒక అంశంలో తమ ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచుకొని మరింత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి సాధారణ జన జీవన స్రవంతిలోని అందరూ ప్రయత్నిస్తుంటారు. 

కొందరు సిరిసంపదలను, కొందరు భోగభాగ్యాలను, కొందరు కీర్తిని, కొందరు అధికారాన్ని, కొందరు ఆధిపత్యాన్ని కొందరు విజయాన్ని సాధించడం కొరకు తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. ఇలా చేయడం ఆక్షేపణీయం కాకపోగా అభిలషణీయం కూడా.

అయితే అందరూ శ్రమిస్తుంటారు, అందరూ కృషిచేస్తుంటారు, అందరూ తపిస్తుంటారు, అందరూ ఆరాటపడుతుంటారు కానీ కొందరే ఆశించిన మేర కృతకృత్యులవుతుంటారు. 

ఎందుకంటే ఆయా ప్రయత్నాలు చేసే వారందరిలో ఎక్కువమంది తత్విషయాల సాధన కొరకు పూర్తిగా ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకుంటారు.

భౌతిక బలసంపత్తి సాధనలోని తాత్వికత ఏమిటో వీళ్ళలో చాలామందికి తెలియకపోవడమే దీనికి కారణం.

భౌతిక బలసంపత్తికి మూలం శీలసంపద. మన ప్రయత్నాలననుసరించి శీలమే కాలక్రమంలో వివిధరూపాలలో ఉండే భౌతిక బలంగామారుతుంది. (Character becomes Destiny)అందుకే ప్రాపంచిక బలాన్ని సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన యోగశాస్త్రాన్ని పతంజలిమహర్షి యమనియమాలనే పునాదుల మీద నిర్మించాడు. యమనియమాల సాధనంటే శీలనిర్మాణమే.

శీలమంటే సద్గుణ సంపత్తి, శీలమంటే మంచి నడవడిక, శీలమంటే క్రమశిక్షణ, శీలమంటే సదాచారం, శీలమంటే సత్సంప్రదాయం. .....ఇలా ఎన్ని రకాలుగానైనా శీలాన్ని మనం నిర్వచించవచ్చు. శీలస్వరూపాన్ని మనం విడిగా చర్చించుకుందాం. ఇప్పుడు దానికీ మరియు భౌతిక బలానికీ ఉండే సంబంధాన్ని మాత్రమే చర్చించుకుందాం.

శీలమంటే నేటి సమాజంలోని కొందరికి  చులకన, కొందరికి హేళన, మరి కొందరికి నిర్లక్ష్యం.

వయసులో ఉండగా అన్నీ అనుభవించి, ఇక ఏమీ అనుభవించలేని ముదుసళ్ళు చెప్పే శ్రీరంగనీతులుగా, జీవితంలో అనుభవించే అవకాశం లేనివారు పలికే చిలుక పలుకులుగా, జీవితమిచ్చే సుఖాలను అనుభవించడం చాతకాని చాదస్తపు మనుషుల ఆలోచనా విధానంగా చాలామంది శీలాన్ని గురించి చెప్పే మాటలను భావిస్తుంటారు.  

వీరి దృష్టిలో శీలమంటే ఏ గమ్యానికి చేర్చని ఒక మొండి రహదారిలో ప్రయాణం. జీవితంలో ఏ భాగ్యానికి మనలను నోచుకోనివ్వని ఒక శుష్క ప్రయత్నం. జీవితమిచ్చే అన్ని సుఖసంతోషాలను మననుండి లాగివేసుకొని మన బతుకును నిస్సారం చేసే ఒక చాదస్తపు వ్యధాభరిత ప్రయాస. కాబట్టి శీలం పేరుతో జీవితమందించే ఆనందాలను వదులుకోవడం మూర్ఖత్వం. 

ఇలాంటి ఆలోచనలతో వీరు జీవితంలో సద్గుణాలను అలవరచుకొని, శీలసంపత్తిని పెంచుకునే ప్రయత్నం ససేమిరా చేయరు. అయితే వీరికి ప్రాపంచికమైన బలసంపత్తి మాత్రం కావాలి. అందుకొరకు వీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రయత్నం మీద మాత్రమే ఆధారపడతారు. అంటే బలంకావాలి, దానిని అందించే శీలం మాత్రం అవసరం లేదు. బలానికి మూలం శీలమని కాక ప్రయత్నమని భావించడమే దీనికి కారణం.

వీరు అమితంగా కోరుకుంటూ, అపరిమితంగా శ్రమిస్తూ, తమ జీవిత సమయంలో సింహభాగాన్ని ఏ భౌతిక బలసంపత్తి సాధనకొరకు వెచ్చిస్తారో, వేటిని సాధించడంలోనే తమ జీవితానికి సార్ధకత ఉందనుకుంటారో, వాటన్నింటికీ మూలం తమ శీలమేననీ, తమ సద్గుణ సంపత్తే కాలక్రమంలో తాము కోరుకునే భౌతిక బలసంపత్తిగా, ప్రాపంచిక విజయంగా మారుతుందనీ వీరు తెలుసుకోలేరు. ఈ ధోరణే వీరి అపజయాలకు మూలకారణం గా మారుతుంది. 

శీలానికీ, బలానికీ ఉండే ఈ సంబంధాన్ని ఏ మేరకు అర్థం చేసుకుని తదనుగుణంగా నడచుకుంటారో ఆమేరకు మాత్రమే….

……ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా కూడా సంత్సంప్రదాయాలవలన ఏమేరకు శీలవంతులుగా ఉంటారో ఆమేరకు మాత్రమే జీవితంలో ఎవరైనా భౌతిక బలసంపత్తి సాధనలో కృతకృత్యులౌతుంటారు.

ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. 

సమాజంలో కొందరు దుర్మార్గులు కూడా విజయవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కనుక నడవడికకు, భౌతిక విజయాలకు సంబంధమే లేదని కొందరు వాదిస్తుంటారు. ఇది మరో చర్చ.  

వారు గతకాలపు సదాచారాలతో సాధించుకున్న బలసంపత్తిని సన్మార్గాన్ని విడనాడడం ద్వారా దుర్వినియోగం చేస్తూ, ఆ బలాన్నంతా పోగొట్టుకునే క్రమంలో ఉన్నారన్నదే వాస్తవం. వారి విజయాలన్నీ తాత్కాలికాలే. దీర్ఘకాలంలో వారు పతనం అవ్వడమేకాక తమను అనుసరిస్తూ అంటిపెట్టుకుని ఉండేవారికి కూడా దుర్గతి పట్టిస్తారు.

దీనికి మంచి ఉదాహరణ మన పురాణాలలోని అసురులు. వారు తపస్సు అనే సదాచారంతో సాధించిన బల సంపత్తిని దుర్మార్గపు పనులకోసం దుర్వినియోగం చేసి తుదకు అధోగతి పాలౌతుంటారు. 

అయితే సమాజంలో మనకు ఎదురయ్యే వ్యక్తులను మనం వారి జీవితంలో తుదికంటా పరిశీలించం. అప్పటికి వారేమి సాధిస్తున్నారో , వారేం చేస్తున్నారో, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో అంతవరకే చూస్తాం. కనుకనే మనకు అసలు తత్వం బోధపడదు.

మన నడవడికకు మెచ్చి ఏ దేవతో, ఏ దేవుడో మనకు వరమందించడం ద్వారా మనకు భౌతిక బల సంపత్తిని సమకూర్చరు. శీలమే బలంగా మారుతుంది. అది ప్రకృతి నియతి. ఇందులో ఏ దేవర ప్రమేయమూ లేదు.  ఎందుకంటే ప్రాపంచిక విజయపు పూర్వరూపం, మూల రూపం శీలం.

ఏ ఒక్కరూ కూడా ప్రాపంచిక విజయాన్ని ప్రత్యక్ష ప్రయత్నం ద్వారా సాధించలేరు. శీలసంపత్తి ద్వారా ప్రోదిచేసుకున్న మూలశక్తిని ప్రయత్నం యొక్క సహాయం ద్వారా తమకు కావలసిన రూపంలో ఉండే భౌతిక విజయంగా రూపుమార్చుకుంటారు ….అంతే. ప్రయత్నం అనేది ఈ మార్పిడికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. ఎంత ప్రయత్నించినా మూలశక్తి అనేదే లేనపుడు భౌతిక విజయంగా మనం దేనిని మార్చుకుంటాం. కనుకనే అటువంటి ప్రయత్నాలు వ్యర్థ ప్రయత్నాలుగా మిగిలిపోతాయి.

భౌతిక బలసంపత్తి సాధన కొరకు సమాజంలో దాదాపూ అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ కొందరే విజయం సాధించడానికి కారణం ఇదే.   

పైన వివరించిన నియమాన్ని ఎవరు ఏమేరకు తమ జీవితంలో పాటిస్తారో, ఆమేరకు మాత్రమే వారు విజయాలు సాధిస్తారు. ఒక్కొకరు ఒక్కో దశలో ఆగిపోతుంటారు, వారి సాధన మేరకే వారి విజయం కూడా ఉంటుంది. అందుకే సమాజంలో సాధారణమైన వ్యక్తులు ఎక్కువగానూ, గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులు తక్కువగానూ ఉంటారు. మధ్యస్థ విజయాలు సాధించిన వ్యక్తుల సంఖ్య కూడా వారి సాధనను బట్టి ఈ ఇరువురికీ మధ్యన ఎక్కడో ఓ చోట ఉంటుంది.

ఈ సూత్రం ఒక వ్యక్తికే కాదు ఒక కుటుంబానికి, ఒక సంస్థకి, ఒక సమాజానికి, ఒక జాతికి, ఒక దేశానికి ....ఇలా ఎవరికైనా వర్తిస్తుంది.25, సెప్టెంబర్ 2017, సోమవారం

యోగభావనలు (Concepts of Yoga) -3శక్తి సముపార్జనా మార్గాలు


శక్తిని ఆర్జించే మార్గాలుగా భారతీయ సమాజంలో ఎప్పటినుండో కొన్ని పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. 

ప్రాచీన భారతదేశంలో ఋషులు, మునులు శక్తిని ఆర్జించడానికి తపస్సును ఆచరించేవారు. దీనిని వారు స్వార్థం కోసం కాక లోకకళ్యాణం కోసం చేసేవారు. అసురులు మాత్రమే స్వార్థం కోసం చేసేవారు.  

కాలక్రమంలో ఆ సంప్రదాయానికి భారతీయ సమాజం దూరమైన తరువాత కొందరు దిగువ స్థాయి సాధకులు, కొందరు సిద్ధులు, మరికొందరు దుర్మార్గులు కలసి రకరకాల పద్దతులను శక్తి సాధనా మార్గాలుగా ప్రచారం చేసారు. చివరికి ఈనాడు ఈ సాధన జాతకాలు చెప్పి జీవనం సాగించే వారి వ్యాపకంగా మిగిలిపోయింది. దీనికి కారణం కొంత అవగాహనా లోపమైతే, కొంత దురాశ. 

'బ్రహ్మచర్యం' ద్వారా శక్తిని ఆర్జించవచ్చు అనేది ప్రాచీనకాలంనుండి ఉన్న ఒక సూత్రీకరణ. 

దీనిని ఆసరాగాచేసుకొని బ్రహ్మచర్యం అనేపదానికి సంభోగానికి దూరంగా ఉండటం అనే సంకుచితార్థం కల్పించి దానికి విపరీత ప్రచారం కల్పించారు. ఒక వ్యక్తి వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించడానికి ముందుదశ బ్రహ్మచర్యం కాబట్టి ఆ అర్థానికి సమర్థన లభించినట్లయినది. నిజానికి బ్రహ్మచర్యం అంటే అనేక నియమనిష్ఠల సమాహారం. సంభోగానికి దూరంగా ఉండటం అనేది అందులో ఒకటి. అది కూడా అవివాహితులకు మాత్రమే ఆ నియమం బేషరతుగా వర్తిస్తుంది. గృహస్థులు కూడా బ్రహ్మచర్య వ్రతదీక్ష అవలంబించవచ్చు. ఐతే సంభోగానికి దూరంగా ఉండటం అనే నియమం అవివాహితులకు వర్తించినంత కఠినంగా గృహస్థులకు వర్తించదు. కానీ వీరి ప్రచారంవలన సంభోగానికి దూరంగా ఉంటే చాలు ఇంకెన్ని అవలక్షణాలను కలిగిఉన్నా బ్రహ్మచర్యదీక్షకు ఎలాంటి ఆటంకం కలగదనే అభిప్రాయం ఏర్పడింది. 

ఇంకొంత మంది మరింత ముందుకెళ్ళి వీర్యం స్ఖలించకుండా నిగ్రహించుకుంటే ఆ వీర్యం శక్తిగా మారుతుందనే ప్రచారం కల్పంచారు. ఇదే నిజమైతే మరి స్త్రీలెలా శక్తివంతులౌతారు. వీళ్ళదృష్టిలో శక్తిసముపార్జన మగవారికే పరిమితమన్నమాట; అసలు శక్తి స్వరూణిగా చెప్పబడే స్త్రీ ఇందుకు అనర్హులన్నమాట. వీరెంతకు దిగజారారంటే స్త్రీని శక్తిసాధనకు అనర్హురాలుగా ప్రకటించడంతో ఆగకుండా ఒక మగవాడు చేసే సాధనకు స్త్రీ ఒక ఆటంకం అనే అభిప్రాయాన్ని కూడా ప్రచారం చేశారు. ఇది మరింత సంకుచితమైన అర్థం.

యోగశక్తి అన్నివిధాలైన ప్రాపంచిక విజయాలకు మూలం. ఇది కలిగి ఉన్నవారు ఈ లోకంలో కార్యసాధకులై వర్ధిల్లుతారు.'వీర్యం' అనేది యోగశక్తికి పర్యాయపదం కనుక యోగశక్తి కలిగి ఉన్నవారిని వీర్యవంతుడు/రాలు అంటారు. యోగశక్తి కార్యసాఫల్యతకు దారితీసినట్లుగా పురుషుని రేతస్సు (semen) ఒక స్త్రీ గర్భసాఫల్యతకు దారితీస్తుంది కనుక ఆ రేతస్సును కూడా వీర్యమని పేర్కొనడం జరుగుతున్నది. ఇది కేవలం ఉపమానం మాత్రమే. అంతేకానీ వీర్యమంటే రేతస్సు అని కాదు అర్థం. కానీ ఈ అర్థాన్నే అనేకమంది వ్యాప్తిచేశారు. ఈ అర్థాన్ని బట్టే వారు రేతస్సు (వారి దృష్టిలో వీర్యం) స్ఖలించకుండా సంరక్షించబడితే అది యోగశక్తిగా మారుతుందని ప్రచారం చేశారు. 

ఇంత విడ్డూరమైన ప్రచారాలన్నీ శక్తి సాధనా మార్గంనుండి బుధజనులు తప్పుకొని దిగువస్థాయి వ్యక్తులు ప్రవేశించడం వలనే జరిగినది.

మరికొంత మంది ప్రాణాయామాన్ని శక్తి సాధనా మార్గంగా ప్రచారం చేశారు. 

వీరు చెప్పేదేమంటే మానవుని వెన్నెముక అథోభాగంలో 'కుండలిని' అనే శక్తి ఉంటుంది. అది చుట్టచుట్టుకిని నిదురించే సర్పాన్ని పోలి ఉంటుంది. వెన్నెముక మధ్య భాగంలో కటిస్థానంనుండి శిరస్సు యొక్క పైభాగం వరకూ ప్రయాణిస్తూ సుషుమ్న అనే నాడి ఉంటుంది. దానికి ఇరువైపులా ఇడ, పింగళ అనే రెండు నాడులుంటాయి. ఈ రెండు నాడులకు రెండు నాసికా రంధ్రాలకు సంబంధం ఉంటుంది. ఇడానాడి ఎడమ నాసికా రంధ్రం ఆధీనంలో ఉంటుంది. పింగళా నాడి కుడి నాసికా రంధ్రం ఆధీనంలో ఉంటుంది. ఆయా నాసికా రంధ్రాలద్వారా ఓ క్రమపద్దతిలో మార్చి మార్చి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను చేయడం ద్వారా ఇడాపింగళా నాడులద్వారా వెన్నెముక అధోబాగంలో ఉన్న కుండలిని మేల్కొని సుషుమ్నద్వారా ఊర్ధ్వగమనం చెంది శిరోభాగాన్ని చేరేక్రమంలో మానవుడు శక్తివంతుడవుతాడు. అతడికి అణిమ,గరిమ,లఘిమ మొదలైన ఎనిమిది మహిమాన్విత శక్తులు సమకూరతాయి. వీటిని 'అష్టసిద్ధులు' అని అంటారు. వీటిని సాధించినవాడిని సిద్ధుడు అని అంటారు.   

వీరు చెప్పే పద్దతిలో అష్టాంగయోగం రూపంలో యోగమార్గాన్ని వివరించిన పతంజలి మహర్షి ఉద్దేశం ఎంతవరకు నెరవేరుతుందో మనం చెప్పలేము. 

పతంజలి యోగదర్శనాన్ని యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం మరియు సమాధి అనే ఎనిమిదిదశలుగా వివరించాడు. అందుకే ఇది అష్టాంగయోగంగా పిలువబడుతుది. ఆ ఎనిమిదింటిలో ప్రాణాయామం ఒకటి. 

అయితే యోగమార్గానికి యమనియమాలు పునాది వంటివి.

ఈ రెంటినీ శ్రద్ధగా పాటిస్తే మిగతా ఆరుదశలూ వాటంతటవే జరిగిపోతాయి. అంటే వీటి మధ్యన సంబంధం కార్యకారణ సంబంధం (cause & effect) అన్నమాట. యమనియమాలు కారణమైతే మిగిలిన ఆరుదశలు కార్యం. 

భారత స్వాతంత్ర్య సమర నాయకుడు గాంధీ 'యమం'లోని సత్యం, అహింసలనే తన జీవితాదర్శాలుగా గైకొన్నాడు. అయితే అనేకమంది యమనియమాలను నామమాత్రంగా ఉదహరించి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం మొదలైన అంగాలను మాత్రమే శ్రద్ధగా సాధన చేస్తూ అదే యోగసాధనగా చెబుతుంటారు.

దీనికి కారణం మధ్యయుగాలలో కేవలం వీటికే అధిక ప్రాధాన్యతనిస్తూ 'హఠయోగం' అనే ప్రక్రియ తలయెత్తి జనబాహుళ్యంలో విస్తృతంగా వ్యాప్తిచెందింది. ఆ ప్రభవంతో నేటికీ యోగసాధన అంటే వివిధరకాలైన ఆసనాలు, వివిధరకాలైన శ్వాసించే పద్ధతులు, వివిధరకాలైన ధ్యానించే పద్ధతులు అని మాత్రమే భావించబడుతున్నది. వీటి మధ్యన యమనియమాలను గురించి ఆలోచించే తీరుబడి కూడా ఎవరికీ లేకుండా పోయింది.

శక్తి సముపార్జనకు కొందరు నవరత్నాలను ఉంగరాలుగా చేతివేళ్ళకు ధరిస్తుంటారు. రత్నాలనేవి అధిక శక్తికి కేంద్రాలుకనుక అవి ధరించినవారు శక్తివంతులుగా ఉండి కార్యసాధకులౌతారని దీని ఉద్దేశ్యం. 

మరికొందరు ఒక రాగిరేకుమీద యంత్రం గీసి కొన్ని మంత్రాలను ఉచ్ఛరించడంద్వారా అందులోకి శక్తిని ఆవాహన చేసి, అలా వచ్చిన శక్తిని ఆయంత్రంలో బంధించి ఇంటి ఆవరణలో ఏదో ఓ చోట దానికి గుప్తంగా దాచిపెడతారు. ఇక ఆ శక్తి ఆ ఇంటిని వదిలిపోదన్నమాట; దుష్టశక్తులేవీ దరిచేరవన్నమాట.

అంటే శక్తిని మనం సదాచారంద్వారా, సుగుణాలద్వారాకాక ఇలా రత్నాలను ధరించడం ద్వారా, యంత్రాలలో బంధించడంద్వారా సంపాదించడమన్నమాట.

భోగలాలసులైన రాజులు, జమీందారులలో సత్ప్రవర్తన, సదాచారం అనేవి కుందేటికొమ్ము లాంటివి. అటువంటివారివలనే ఇలాంటి చిట్కా మార్గాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

కొందరు శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి మానవదేహంలో శక్తికేంద్రాలైన మర్మాంగాలను పూజిస్తారు. వీరు పురుషాంగాన్ని, స్త్రీ యోనిని శిలలపై చెక్కి వాటిని పూజిస్తారు. వీరిని శాక్తేయులని పిలుస్తారు.

శక్తిని వశం చేసుకొనేది సిరిసంపదలకోసమే కనుక కొందరు ఇనుము వంటి విస్తారంగా దొరికే విలువ తక్కువ లోహాలను బంగారం వంటి అరుదైన, విలువైన లోహాలుగా మార్చి ధనవంతులవటానికి రసవాదాన్ని (Alchemy) ఆశ్రయిస్తారు.

ఇటీవలికాలంలో వ్యాప్తిలోకి వచ్చిన న్యూమరాలజీ కూడా ఈ కోవలోకే వస్తుంది. వారు ఒక వ్యక్తి పేరునులోని అక్షరాలను శక్తి ఆవాహనకు అనుకూలంగా మార్పు చేస్తారు. ఆ మార్పుతో అతడు శక్తివంతుడై కార్యసాధకుడు అవుతాడన్నమాట.

ఇప్పటివరకూ పేర్కొన్న మార్గాలన్నీ మంచిశక్తి లేక దైవశక్తి (Positive Energy) ని ఆర్జించే మార్గాలు. ఇవికాక దుష్టశక్తిని (Negative Energy) సాధించే పద్దతులకూడా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చర్చించడం అనవసరం. ఇవన్నీ కూడా యోగమార్గం లోని అనేకానేక ఉపశాఖలే.

ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఋషులు, మునులు తపస్సు చేసే సంప్రదాయం కనుమరుగైన తరువాత కొందరు దిగువస్థాయి వ్యక్తులు, మరికొందరు దుర్మార్గులు వలన ఒకదాని తరువాత ఒకటిగా క్రమంగా భారతీయ సమాజంలోనికి ప్రవేశించాయి.

వీటిలో శాస్త్రీయత ఎంతన్నది, మూఢత్వం ఎంతన్నది, నైతికత ఎంతన్నది ఎవరికీ తెలియదు.

సదాచారమే శక్తి సముపార్జనకు సర్వోత్తమ మార్గం. ప్రాచీన భారతదేశంలోని ఋషులు ఒనరించిన తపస్సుయొక్క సారం కూడా అదే.

యమనియమాలంటే సదాచారం తప్ప మరేమీ కాదు.  
22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

యోగభావనలు (Concepts of Yoga) -2యోగశక్తి సంచయనం 
(Accumulation of Cosmic Energy)

శక్తి ప్రతీ క్షేత్రంలోనికీ ఎంతో కొంత మొత్తంలో తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకొంటుందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం.

ఈ కారణంగా ప్రతీ ప్రదేశంలోనూ స్వతఃసిద్ధంగా ఎంతోకొంత శక్తి ఉంటుంది. అలా ఉన్న శక్తి వలన ఏ ప్రదేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు లభించదు. ఎందుకంటే అది సాధారణమైన పరిమాణంలోనే ఉంటుంది. ఆపాటి శక్తి అన్ని ప్రదేశాలలోనూ ఉంటుంది. ఒక ప్రదేశంలోని శక్తి పరిమాణం అసాధారణంగా వృద్ధిచెందినపుడే ఆ ప్రదేశం తేజోవంతమై అది ఒక ప్రత్యేకమైన విలువను, గుర్తింపును సంతరించుకొంటుంది.

శక్తి ప్రతీ ప్రదేశంలోనికీ తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకుంటుందనే ధర్మాన్ని ఆసరాగా చేసుకొని మానవుని నియంత్రణలో ఉన్న ప్రదేశాలలోనికి చేరిన శక్తిని కొన్ని సాధనలద్వారా పెంపు చేయడం ద్వారా మానవుడు శక్తివంతుడు కాగలడు.

ఇలా ఆర్జించిన యోగశక్తిని ఓజోశక్తి అనీ, కుండలినీశక్తి అనీ రకరకాలుగా పిలుస్తారు. ఈ శక్తి కలిగిన మానవుడిని ఓజోవంతుడనీ, వీర్యవంతుడు అని పేర్కొంటారు. 

ఈ సాధనలలో సన్మార్గమైనవీ ఉన్నాయీ, దుర్మార్గమైనవీ ఉన్నాయి. సన్మార్గంలో చేసే సాధనలు ఫలించడానికి దీర్ఘకాలం పడుతుంది. అందుకే కొందరు దురాశాపరులు స్వల్పకాలంలో ఫలితాలనందించే అడ్డదారులలో శక్తి సముపార్జనకు పూనుకుంటారు. 

సన్మార్గంలో శక్తిని ఆర్జించడానికి దీర్ఘకాలం సాధన చేయవలసి ఉంటుంది. దీనికొరకు ప్రాచీన భారతదేశంలో తపస్సు అనే వ్యవస్థీకృత సాధనా రూపం ఉండేది. దీనిని బుధజనులైన ఋషులు, మునులు ఆచరించి శక్తిని ఆర్జించేవారు. ఇది శక్తిని ఆర్జించడానికి ఒక శాస్త్రీయ సాధన ...ఒక Full time Job.

తపస్సు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నట్లైతే శాస్త్రీయంగా తపస్సు చేయకపోయినప్పటికీ తపస్సులో భాగమైన అంశాలను ఆచరించడం ద్వారా సమాజంలో ఒకరిగా ఉంటూ సాధారణమైన కుటుంబజీవితం గడిపేవారు కూడా శక్తిని ఆర్జించవచ్చు.

ఆ ప్రకారంగా చాలా సులువైన మార్గంలో, సులభమైన పద్దతిలో ఈ శక్తిని మనం స్వంతం చేసుకోవచ్చు. కావలసిందల్లా ఆకాంక్ష, పరిశీలన, విశ్వాసం మాత్రమే.

శక్తి అనంతమైనది, అపారమైనది. అది ఈ జగత్తులో ఎల్లెడలా విస్తారంగా వ్యాపించి ఉంటుంది. కానీ దానిలో మనం ఎంత వశం చేకున్నామన్నదాని మీదే మన శక్తి ఆధారపడి ఉంటుంది.

శక్తిని వశం చేసుకోవడానికి అనేక పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువ పద్దతులు దుర్మార్గమైనవి. అవన్నీ శక్తిని ఆర్జించడనికి ఉన్న అడ్డదారులు. 

దురలవాట్లతో (పంచ మకారాలు: మద్యం, మాంసం, మత్స్యం, మిథునం, ముద్ర) కూడుకున్న తాంత్రిక సాధన, 

పరపీడనతో (జంతుబలి, నరబలి) కూడుకున్న క్షుద్రపూజలు, 

దురాశతో కూడుకున్న రసవాదం. 

ఇటువంటివన్నీకూడా శక్తినార్జించే మార్గాలుగా ప్రచారంలో ఉన్నాయి. 

కానీ ఇటువంటి దుర్మార్గమైన పద్దతులను దిగజారిన మనుషులు, అన్నిరకాలుగా దిగువస్థాయి వ్యక్తులు మాత్రమే ఆశ్రయిస్తారు. బుధజనులు ఇటువంటి పద్దతులను కలలో కూడా తలంచరు.

శక్తి సముపార్జనకు బుధజనసమూహానికి ఆమోదయోగ్యమైన ఉత్తమ మార్గం సదాచరణ. ఇది మనుషులను శక్తివంతులను చేయటమేకాక సకలజనులకూ మేలు చేసి, ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిస్తుంది.

శక్తివంతులైన వ్యక్తులు శక్తివంతమైన కుటుంబాలను నిర్మిస్తారు. 

శక్తివంతమైన కుటుంబం శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది. 

శక్తివంతమైన సమాజం శక్తివంతమైన జాతిని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తుంది. 

శక్తివంతమైన దేశం శక్తివంతమైన ప్రపంచాని నిర్మిస్తుంది.

సదాచారమే శక్తికి మూలం!

సదాచరణే ఈ యోగశక్తిని సంచయనం చేసే (శక్తిని వశం చేసుకోవడానికి) ఉత్తమ మార్గం.

సదాచారాన్ని పాటించే మానవుడు శక్తివంతుడవుతున్నాడు ...వీర్యవంతుడవుతున్నాడు. 


14, సెప్టెంబర్ 2017, గురువారం

యోగభావనలు (Concepts of Yoga) -1విజయరహస్యం 
(Success Mantra)

సమాజంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు సంపాదించుకోవడం తప్పనిసరి. ఆ అవసరాలు తీరిన తరువాత జీవితంలో ప్రయోజకులై సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపాలని కోరుకుంటారు. అది కూడా నెరవేరిన తరువాత సిరిసంపదలు, పేరుప్రతిష్ఠలు వంటి భోగభాగ్యాలను కోరుకుంటారు. వీటి సాధననే మనం విజయంగా చెబుతుంటాం. 

ఈ విజయాన్ని ఐదు రూపాలలో చూడవచ్చు. అవి యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం(సౌందర్యం)

ఇవన్నీ కూడా శక్తి రూపాలే.

శక్తికి కొన్ని లక్షణాలున్నాయి. 

అది అనేకరూపాలలో ఉంటుంది. ఒక రూపంనుండి మరో రూపంలోనికి రూపాంతరం చెందుతుంది. 

మనం సైన్సుని అధ్యయనం చేసేటపుడు కూడా 'శక్తినిత్యత్వనియమం' (law of conservation of energy) పేరుతో ఇవే విషయాలను తెలుసుకుంటాం. అదేమంటే శక్తిని సృష్టించలేము మరియు నశింపజేయలేము. అది అనేకరూపాలలో ఉండి ఒక రూపంనుండి మరో రూపంలోనికి మారుతుందే కానీ దాని యొక్క మొత్తం పరిమాణంలో మార్పుండదు.

విద్యుచ్ఛక్తి, ఉష్ణశక్తి, స్థితిశక్తి, గతిశక్తి, సౌరశక్తి, యాంత్రికశక్తి... ఇలా ప్రకృతిలో శక్తి అనేక రూపాలలో ఉంటుంది. ఆ ప్రకృతి యొక్క అంశతోనే యేర్పడిన ప్రాపంచిక జీవితంలో కూడా యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం.... ఇత్యాది వివిధ రూపాలో శక్తి ఉంటుంది. వాటిని పొందడాన్నే మనం ప్రాపంచిక విజయంగా చెబుతుంటాం.

సమాజంలో జీవనం సాగించే మానవుడు వీటిని (వీటన్నింటినీ కానీ, వీటిలో కొన్నింటినిగానీ లేక ఏదో ఒక దానిని కానీ) సాధించడానికి పూనుకున్నపుడు వాటికోసం ప్రత్యక్షంగా ప్రయత్నించకూడదు. అలాంటి ప్రయత్నం వ్యర్థ ప్రయాసగానే మిగిలిపోతుంది.

ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా లభించవు, వీటన్నింటికీ మూలరూపమైన యోగశక్తిని వీటి రూపాలలోకి రూపాంతరం చెందించడం ద్వారా మాత్రమే ఇవి లభిస్తాయి.

అంటే వాటిని సాధించాలనుకునే వ్యక్తి అందుకు పూనుకునే సమయానికే తగిన పరిమాణంలో యోగశక్తిని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యోగశక్తి రూపాంతరం చెందడం ద్వారా యశోసంపదాది విజయాలు లభిస్తాయి. అలా ముందుగానే యోగశక్తిని కలిగిలేని వ్యక్తి విజయ సాధనకు ఎంతగా ప్రయత్నించినా అవన్నీ వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి.

ప్రయత్నం అనేది యోగశక్తిని ప్రాపంచిక విజయంగా రూపాంతరం చెందించే ఒక Transforming Agent మాత్రమే. యోగశక్తి లోపించినపుడు అది చేయగలిగింది ఏమీ లేదు.ప్రయత్నపరులలో అనేకమంది అపజయాన్ని పొందడానికి కారణం ఇదే.

కనుక ఈ లోకంలో ఎటువంటి ప్రాపంచిక విజయాన్నయినా లక్ష్యంగా కలిగిన మానవుడు ఆ లక్ష్యం కోసం ప్రయత్నించడానికంటే ముందు చేయవలసిన పని ఆ లక్ష్యానికి తగిన స్థాయిలో యోగశక్తిని సమకూర్చుకొని వీర్యవంతుడవటం. 


యోగశక్తిని సంచయనం చేసే విషయంలో మాత్రమే మానవుని యొక్క ప్రయత్నం లేక ప్రత్యక్ష కృషి ఫలిస్తుంది.

(“యోగశక్తిని ఎవరైనా సాధించగలరు కానీ ఐహిక (లౌకిక లేక ప్రాపంచిక) విజయాన్ని మాత్రం యోగశక్తి ఉన్నవారు మాత్రమే సాధించగలరు”) 

ఈ విషయాన్ని గ్రహించడం వలనే ప్రాచీన భారతదేశంలో ఋషులు తమ జీవితంలో ప్రాపంచిక విజయం కోసం వేగిరపడక యోగశక్తిని ఆర్జించడం కోసం చిన్నవయస్సులోనే తపస్సుకు ఉపక్రమించేవారు. 


5, సెప్టెంబర్ 2017, మంగళవారం

యోగమార్గం - పరిచయం

ఇపుడు యోగమార్గం గురించి తెలుసుకుందాం.

మునుపటి వ్యాసంలో తెలిపినట్లుగా 'జగత్తు శక్తిమయం' అన్నవర్ణనను అనుసరించి యోగమార్గం ఏర్పడింది.

ఎలాగంటే

ప్రకృతి అనేది పదార్ధ (matter) రూపంలో ఈ జగత్తుకు భౌతికమైన అస్థిత్వాన్ని అందించడమేకాక యోగశక్తి (energy) రూపంలో కూడా జగత్తు అంతటా సమంగా వ్యాపించి ఉంటుంది. అందుకే జగత్తును శక్తిమయం అని వర్ణించడం జరిగినది.

ఆ విధంగా జగత్తులో సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న శక్తిని మన నియంత్రణలో ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతం వద్ద అధిక మొత్తంలో కేంద్రీకరించి దాని ద్వారా జగత్తులోని —శక్తి తక్కువగా ఉండే— మిగతా ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సాధించడమే యోగమార్గం. (అందుకే దీనిని రాజయోగం అని కూడా అంటారు)

అంటే లౌకిక శక్తిని ఆర్జించడం ద్వారా లౌకిక పరమైన దుఃఖం నుండి, కష్టనష్టాల నుండి బయటపడే విధానమే యోగమార్గం.

జగత్తులోని వైరుధ్యాలకు సమతుల్యత కల్పించడం ద్వారా దానిని ప్రభావరహితం చేసి దుఃఖ విముక్తి పొందటం సాంఖ్యపద్దతి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ప్రాపంచిక శక్తిని అధిక మొత్తంలో పోగుచేసి తద్వారా ప్రాపంచిక దుఃఖం నుండి విముక్తి పొందటం యోగపద్దతి.

ఈ యోగమార్గం ఎంతో సంక్లిష్టమైనది. నెమ్మదిగా ఒక క్రమ పద్దతిలో దీనిని అర్థం చేసుకోవాలి.

ఇది భారతీయుల ఆలోచనా విధానంలో, జీవన విధానంలో పెనవేసుకుపోయి ఉంటుంది.

భారతీయులు అమితంగా విశ్వసించే కర్మసిద్ధాంతం ఈ యోగమార్గాన్ని అనుసరించి రూపుదిద్దుకున్నదే.

భారతీయ సమాజానికి విలక్షణమైన కులవ్యవస్థ ఈ యోగమార్గాన్ని అనుసరించి సంతరించుకున్నదే.

అంతేకాక పాపం-పుణ్యం, స్వర్గం-నరకం వంటి భావనలు, జ్యోతిష్యశాస్త్రం మరియు దాని యొక్క అనేక ఉపవిభాగాలు, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, పరసువేది, ఇత్యాది అనేకమైన విషయాలు యోగమార్గం యొక్క వివిధ శాఖల రూపంలో తలయెత్తినవే.

ప్రకృతీ పురుషులు రెండింటిలో ఈ శక్తి ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి నుండి జగత్తు ఏర్పడినది. లోకం, ప్రపంచం జగత్తుకు పర్యాయ పదాలు. అందుకే ఇది జగత్సంబంధమైన శక్తి... లౌకిక శక్తి... ప్రాపంచిక శక్తి.

ఈ శక్తిని యోగమాయ లేక యోగశక్తి అని కూడా అంటారు. అందుకే దీనికి యోగమార్గం అనే పేరు వచ్చింది.

ఈ శక్తికి ప్రతీకగా ఉండే దేవతను దుర్గ, కాళి, చండి మొదలైన పేర్లతో పిలుస్తారు.


క్షేత్రాలు, ఉపాధులు:

ఈ జగత్తంతా సమంగా, స్వేచ్ఛగా ఉండే అనంతశక్తి స్థిరీకరణ పొందడం కోసం ప్రతి క్షేత్రాన్నీ లేక ప్రతి ఉపాధినీ తనలోని కొంత భాగానికి స్థావరంగా మార్చుకొంటుంది. అలా ప్రతీ క్షేత్రం లేక ప్రతీ ఉపాధిలో శక్తి కొంత అధికంగా పోగుచేయబడి (సంచితమై, బంధితమై (accumulated & locked) ఉంటుంది. 

అంటే ప్రకృతి ఒక క్షేత్రంలో దానికి భౌతికమైన అస్థిత్వాన్నిచ్చే పదార్ధంరూపంలోనేకాక యోగశక్తిరూపంలో కూడా కొలువై ఉంటుంది.

క్షేత్రాలు, ఉపాధులు అంటే అది ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఒక కుటుంబమైనా కావచ్చు, ఒక దేశమైనా కావచ్చు, ఒక వ్యవస్థ అయినా కావచ్చు, ఒక జంతువైనా కావచ్చు, ఒక నగరమైనా కావచ్చు, ఒక లోహమైనా కావచ్చు లేక మరేదైనా కావచ్చు. లౌకికమైనది ఏది అయినా కావచ్చు.    

హెచ్చుతగ్గులు:

స్వేచ్ఛగా ఉన్నపుడు సమంగా (అన్ని సమయాలలో ఒకే సాంద్రతతో, అంతటా ఒకే పరిమాణంతో) ఉన్న శక్తి ఏదైనా ఉపాధిని స్థావరంగా చేసుకొని స్థిరీకరణ పొందగానే దాని పరిమాణంలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఏర్పడుతుంది. 

అంటే ఒక క్షేత్రంలోని శక్తి పరిమాణం వేరువేరు సమయాలలో సమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాలక్రమంలో దాని పరిమాణంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. అలాగే వేరువేరు క్షేత్రాలలోని శక్తిపరిమాణం కూడా సమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

స్వేచ్ఛగా ఉన్నపుడు శక్తి పరిమాణం అన్ని ప్రదేశాలలో, అన్ని సమయాలలో ఖచ్చితంగా సమానంగా ఉంటుందిగానీ, శక్తి ఏదేనీ క్షేత్రంలో స్థిరీకరణ పొందినపుడు మాత్రం ఆ ఖచ్చితత్వం ఉండదు.

ఈ హెచ్చుతగ్గుల ప్రక్రియనూ దానికి గల కారణాలను మరియు ఈ హెచ్చుతగ్గులను నియంత్రించే పద్దతినీ చర్చించేదే యోగమార్గం.


కేంద్రీకరణ, సాంద్రీకరణ:

ఇలా శక్తి ప్రతీ క్షేత్రాన్ని తన స్థావరంగా చేసుకొనే లక్షణాన్ని ఆసరాగా చేసుకొని ఒక నిర్ధిష్ఠ ప్రదేశంలో స్థిరీకరణ పొందిన (లేక కేంద్రీకరింపబడిన) శక్తి పరిమాణాన్ని (లేక సాంద్రతను) క్రమంగా పెంపుచేయడం, ....అది మరలా ఆ ప్రదేశం నుండి నిర్గమనం చెందకూడా కాపాడడం ... ఇదే యోగమార్గం.    

తేజస్సు, తరచుదనం:

ఈ కేంద్రీకరణ, సాంద్రీకరణ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశానికి అంతటి అసాధారణత్వం సిద్ధిస్తుంది. ప్రాపంచికంగా దాని విలువ అంతగా పెరుగుతుంది. అలాగే ఈ శక్తి తగ్గే కొలదీ ఆ ప్రదేశం అదేవిధంగా సాధారణమైపోతూ ఉంటుంది.

అదేవిధంగా ఒక ప్రదేశంలో ఈ కేంద్రీకరణ, సాంద్రీకరణ పెరిగేకొలదీ ఈ జగత్తులో ఆ స్థాయి కలిగిన ప్రదేశాలు అరుదుగా ఉంటాయి. అంటే శక్తి సాంద్రత పెరిగే కొలదీ తరచుదనం తగ్గుతుంది. దాని తేజస్సు …..ఐహిక ప్రపంచంలో దాని యొక్క విలువ కూడా అదే స్థాయిలో క్రమంగా పెరుగుతాయి.

కేంద్రీకరణ, సాంద్రీకరణ తగ్గేకొలదీ ఈ జగత్తులో ఆ స్థాయి కలిగిన ప్రదేశాలు తరచుగా ఉంటాయి. అంటే శక్తి సాంద్రత తగ్గే కొలదీ తరచుదనం పెరుగుతుంది.  దాని తేజస్సు …..ఐహిక ప్రపంచంలో దాని యొక్క విలువ కూడా అదే స్థాయిలో క్రమంగా తగ్గుతాయి.

అంటే ఈ పరిస్థితిని ఒక పిరమిడ్‌తో పోల్చవచ్చు. శక్తి సాంద్రీకరణ తక్కువగా ఉన్న ప్రదేశాలు ఎక్కువ సంఖ్యలో ఉండి పిరమిడ్‌కు అడుగుభాగంలో ఉంటాయి. వాటికి పైన మరికొంత అధిక శక్తి సాంద్రత కలిగిన ప్రదేశాలు ఉండి వాటి సంఖ్య క్రింది వాటి కన్నా కొంత తక్కువ గా ఉంటుంది. ఈ విధంగా పిరమిడ్‌లో పైకి పోయే కొలదీ ఒక ప్రదేశంలోని శక్తి సాంద్రీకరణ పెరుగుతూ ప్రదేశాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి పిరమిడ్‌లో అడుగుభాగం నుండి అద్వితీయమైన శిఖరభాగాన్ని లక్ష్యంగా చేసుకొని —పైవైపుననున్న ఒక్కొక్క భాగాన్ని దాటుకుంటూ— ఊర్ధ్వగమనం చెందేటట్లుగా శక్తి సాంద్రీకరణను, కేంద్రీకరణను పెంచుకోవడమే యోగమార్గం.

ఉదాహరణకు ఒక దేశంలో జనావాసాలు ఏర్పడే విధానాన్ని మనం పరిశీలించవచ్చు. ఏ దేశంలోనైనా సరైన సౌకర్యాలు లేకుండా తక్కువ జనాభాను కలిగి ఉండే గుర్తింపులేని చిన్న చిన్న గ్రామాలు అసంఖ్యాకంగా ఉంటాయి. సకల నాగరిక సౌకర్యాలతో అధిక జనాభాతో అలరారుతూ విశ్వవ్యాప్తమైన గుర్తింపు కలిగిన మహానగరాలు అతి తక్కువగా ఉంటాయి. ఈ రెంటీకీ మధ్యస్థంగా అనేక చిన్నా పెద్దా పట్టణాలు, ద్వితీయ స్థాయి నగరాలు వాటికి తగిన మధ్య స్థాయి సౌకర్యాలతో ఉంటాయి. ఇదంతా కూడా ఆయా జనావాసాలలో కాలక్రమంలో ప్రజావసరాల మూలంగా నిర్దేశింపబడుతూ జరిగిన శక్తి కేంద్రీకరణ, సాంద్రీకరణల వలనే జరుగుతుంది.

అలాగే మరో ఉదాహరణ. ఇనుము, వెండి, బంగారం వంటి లోహాలలో ఇనుములో శక్తి సాంద్రీకరణ మిగతా రెంటికన్నా తక్కువగా ఉండటంవలన దానివిలువ ఆ రెంటికన్నా తక్కువగా ఉంటుంది. దాని లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారంలో శక్తి సాంద్రీకరణ అధికంగా ఉంటుంది. అలాగే దాని లభ్యత కూడా తక్కువగానూ ......లోకంలో దాని విలువ ఎక్కువగానూ ఉంటుంది. వెండి పరిస్థితి ఇనుముకన్నా ఎక్కువగానూ, బంగారంకన్నా తక్కువగానూ ఉంటుంది. ఇదంతా అనేక వేల లక్షల సంవత్సరాలపాటు భూగర్భంలో జరిగే మార్పుల వలన సహజసిద్ధంగా జరుగుతుంది.

అలాకాక ఈ మార్పును, ఈ శక్తి కేంద్రీకరణను కొన్ని రసాయన ప్రక్రియలద్వారా సాధ్యం చేసి ఇనుమువంటి నిమ్నలోహాలను బంగారంవంటి అధికస్థాయి లోహాలుగా మర్చవచ్చని రసవాదుల వాదన. అది వేరే సంగతి.

బొగ్గులో శక్తి సాంద్రీకరణ పెరిగితే బొగ్గు కాస్తా వజ్రంగా మారుతుంది.

ఇలా ఈ శక్తి కేంద్రీకరణ లేక సాంద్రీకరణ ఏ ప్రదేశంలోనైనా జరగవచ్చు.

ఇది ఒక దేశంలో జరిగితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.

ఒక సంస్థలో జరిగితే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది.

ఒక కుటుంబంలో జరిగితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది.

ఒక వ్యక్తిలో జరిగితే ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు.

సహజసిద్ధం, మానవప్రయత్నం:


ఈ శక్తి సాంద్రీకరణ కొన్ని సందర్భాలలో సహజ సిద్ధంగా జరుగుతుంది;

ఉదాహరణ: భూగర్భంలో బంగారం, వెండి వంటి ఉత్తమ లోహాలు, వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, రత్నాలు వంటి విలువైన రాళ్ళు ఏర్పడే విధానం.

మరి కొన్ని సందర్భాలలో మానవ ప్రయత్నంతో జరుగుతుంది.

ఉదాహరణ: ఒకానొక వ్యక్తి సాధనతో యోగశక్తిని సముపార్జించడం.

ప్రత్యక్షం, పరోక్షం:

అలాగే ఈ శక్తి సాధన కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగానూ జరగవచ్చు.

ఉదాహరణ: ఒకానొక వ్యక్తి సాధనతో యోగశక్తిని సముపార్జించడం.

మరి కొన్ని సందర్భాలలో పరోక్షంగానూ జరగవచ్చు.

ఉదాహరణ: ఒక కుటుంబ వాతావరణం వలన ఆ కుటుంబంలోని సభ్యులందరూ తమ ప్రమేయం లేకుండానే శక్తిని సముపార్జించడం.

అలాగే,

ఒక దేశంలోని పరిస్థితుల వలన ఆ దేశపౌరులు.... ఒక సంస్థలోని వాతావరణం వలన ఆ సంస్థలోని సభ్యులు తమ ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా, పరోక్షంగా శక్తిని ఆర్జించగలుగుతారు.