16, ఫిబ్రవరి 2009, సోమవారం

నాలుగు యోగాలు -I

ఉపోద్ఘాతం:

మానవ సమాజానికి దోషరహితమైన ఓ మంచి రాజకీయ వ్యవస్థను సూచించే ప్రయత్నంలో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో వ్యాసపరంపరను ప్రారంభించి కొన్ని భాగాలను రాశాను. ఆ వ్యాసావళిలో ‘గీతా వ్యాసాలు’ పేరుతో కొంత తాత్త్విక చర్చ చేశాను. ఆ తాత్త్విక చర్చ అంతా రాజకీయ వ్యవస్థను ఉద్దేశించి మాత్రమే కనుక అందుకు అవసరమైన ‘కర్మయోగం’ ను మాత్రమే అక్కడ వివరించాను. కానీ ఆ తాత్త్విక చర్చను చదివిన వారు అందులోని రాజకీయ ఉద్దేశ్యం మీద కన్నా తాత్త్విక విషయాల మీదే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ అనేక సందేహాలను నా ముందు ఉంచుతున్నారు. దానితో రాజకీయ వ్యవస్థ అనే విషయం పక్కకు పోయి తాత్త్విక చర్చే ప్రధానమైపోయింది.

వారి సందేహాలు తీర్చడానికి భారతీయ తత్త్వశాస్త్రం లోని మిగిలిన మూడు యోగాలైన జ్ఞాన, రాజ, భక్తి యోగాల గురించి కూడా చెప్పక తప్పడంలేదు. నిజానికి మిగతా యోగాల గురించి ఇంత త్వరగా బ్లాగులో రాసే ఉద్దేశ్యం నాకు లేదు. ఎందుకంటే అవన్నీ సమగ్రంగా రాయబడి ఇంకా సిద్ధంగా లేవు. కానీ ఏదో ఒక రూపంలో వాటిని ఇక్కడ వివరించకపోతే చదువరులనుండి నేను ఎదుర్కొంటున్న సందేహాలను తీర్చడం కష్టమని తలచి వాటిని రాస్తున్నాను.

‘గీతా వ్యాసాలు’ చదివిన తరువాత అవి సంక్లిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం ఒకటి బాగా వినిపించింది. అందుకే వాటిని సరళీకరిస్తూ ‘తేలిక భాషలో తత్త్వశాస్త్రం’ అనే మరో మూడుభాగాల వ్యాసం రాయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు వివరించబోయే మూడు యోగాలూ చదువరులను అంతగా కంగారుపెట్టవని అనుకుంటున్నాను. ‘జ్ఞానయోగం’ సంక్లిష్టంగా ఉన్నాకూడా అది కర్మయోగమంత పెద్దగా ఉండదు. కొంచెం చిన్న వ్యాసం. ఓ రెండు, మూడు భాగాలతో ముగుస్తుంది. ‘రాజయోగం’ విస్తారమైనదే కానీ చాలా సరళంగా మరియూ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ‘భక్తియోగం’ సరళమే కాక ఒకే వ్యాసంతో ముగుస్తుంది.

ఈ ఉపోద్ఘాతం ముగించబోయే ముందు చివరిగా ఓ మనవి. నేను వివరిస్తున్న కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాల పేరుతో మీకు బయట తటస్థపడే గ్రంథాలలో ఉండే సమాచారంతో నా వివరణ సరిపోలదు. నేను ‘భగవద్గీత’ చదివి అందులో గ్రహించిన విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆయా యోగాల పేరుతో స్వంతంగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు మాత్రమే ఇవి. ఈ విషయాన్ని చదువరులు జ్ఞాపకం ఉంచుకోగలరు.


నాలుగు యోగాలు:

యోగాలు నాలుగింటి గురించీ తెలుసుకోబోయే ముందు మానవ దేహం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము.

ఏ జీవి దేహంలోనైనా ఈ మూడు క్రియాకేంద్రాలు ఉంటాయి. అవి ప్రకృతి-పురుషుడు-జీవుడు.

దేహంలో ‘జీవుడి’ స్థానం భ్రూమధ్యం- అంటే రెండు కనుబొమల మధ్యన. ఈ జీవుడు బుద్ధి, మనసు, ఇంద్రియాల ద్వారా ఆలోచనలు, సంకల్పాలు వంటి కార్యకలాపాలను జరుపుతాడు.

‘పురుషుడి’ స్థానం హృదయం. ఇతడు ప్రాణవ్యాపారాన్ని జరుపుతాడు. ఈ జగత్తులో ఎల్లెడలా ఉన్న ప్రాణశక్తి అన్ని దేహ భాగాల గుండా హృదయం వైపు ప్రయాణించి అక్కడ హృదయ స్పందన కొరకు వినిమయమౌతూ ఉంటుంది. దీనివలన అన్ని దేహ భాగాలూ సక్రమంగా పనిచేస్తాయి. ఈ ప్రక్రియ జరిగినంత సేపూ దేహంలో ప్రాణమున్నట్లుగా చెప్పబడుతుంది. ఇదంతా పురుషుని ఆధ్వర్యంలో జరుగుతుంది.

ఇక మూడవ క్రియాకేంద్రమైన ‘ప్రకృతి’ యొక్క స్థానం దేహంలోని గుహ్యాంగం లేక మర్మాంగం లేక జననాంగం. ఇది పునరుత్పత్తి వ్యాపారాన్ని జరుపుతుంది. గుహ్యాంగాలలో కలిగే సంభోగవాంఛకు కారణం ఈ ప్రకృతే.

ఈ విధంగా మానవుడి దేహంలో ఉన్న ప్రకృతి, పురుషులే మరలా విధి, దైవం అనే రూపాలలో ప్రతి మానవుడినీ వెన్నంటి ఉంటాయి. ‘విధి’ ప్రకృతి యొక్క మరో రూపం. అలానే ‘దైవం’ పురుషుని యొక్క మరో వ్యక్తీకరణ. ఈ విధి, దైవం అనే రెండు అంశాలూ మానవుడి జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఒక మానవుడు తన జీవితంలో తలపెట్టే కార్యాలను ఈ రెండు అంశాల యొక్క తోడ్పాటు ద్వారా మాత్రమే సఫలీకృతం చేసుకోగలడు. అంటే మానవుడి ప్రయత్నం విజయవంతమవ్వడానికి దైవానుగ్రహం, విధి అనుకూలత అనేవాటిలో ఏదో ఒకటిగానీ లేక రెండూ గానీ తప్పనిసరిగా కావాలి.

పై వివరణలో మనకు రెండు రకాల కర్మత్రయాలు పరిచయం అయ్యాయి.

అవి:

ప్రకృతి-పురుషుడు-జీవుడు

విధి-దైవం-మానవుడు

ఇప్పుడు మొదటి కర్మత్రయం అయిన ‘ప్రకృతి-పురుషుడు-జీవుడు’ పరంగా ఈ నాలుగు యోగాల గురించి చెప్పుకుందాం. జీవుడు తన బుద్ధితో అనుసంధానమై శ్రద్ధతో అవలంబించేది జ్ఞానయోగం. హృదయాంతర్గతుడైన భగవంతునితో అనుసంధానమయ్యేది భక్తియోగం. గుహ్యాంగాతర్గతమైన ప్రకృతిశక్తితో అనుసంధానమై ఆచరించేది రాజయోగం. ఈ మూడింటి కలగలుపు కర్మయోగం.

ఇప్పుడు రెండవ కర్మత్రయం అయిన ‘విధి-దైవం-మానవుడు’ పరంగా ఈ యోగాల ఆచరణను గురించి చెప్పుకుందాం.

మానవుడు దైవానుగ్రహాన్ని పొందే విధానాన్ని చర్చించేది భక్తియోగం, విధి అనుకూలతను పొందే విధానాన్ని చర్చించేది రాజయోగం.

ఇక మానవుడు ఈ లోకంలోని గుణకర్మల యెడల వ్యామోహం చెందకుండా, తనకు అవసరంలేని ప్రాపంచిక ఆకర్షణల యెడల వైరాగ్యం కలిగి, ఈ లోకంలో నిత్యమైనదేదో, అనిత్యమైనదేదో తెలుసుకుని, తన జీవితాన్ని వ్యర్ధ కార్యకలాపాలలో వృధా చేయకుండా సత్యస్వరూపమైన తన జీవన లక్ష్యం ఏదో నిర్దేశించుకుని, తత్సాధన కొరకు సత్యాన్వేషణ చేసేది జ్ఞానయోగం.

ఈ విధంగా సిద్ధించిన జ్ఞాన ప్రకాశపు వెలుగులో దైవం మరియు విధి యొక్క సహాయంతో యజ్ఞం చేసి సత్యావిష్కరణ గావించి జీవన లక్ష్యాన్ని సాధించేది కర్మయోగం.....(మిగతా రెండవ భాగంలో)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి