2, మార్చి 2009, సోమవారం

రాజయోగం -II

రాజయోగం అంటే ‘శక్తి ఆవాహన’:

ప్రకృతిలో శక్తి ఎల్లెడలా వ్యాపించి ఉంటుంది. ఇది అనేక రూపాలలో ఉంటుంది. ఉష్ణశక్తి, విద్యుచ్ఛక్తి, స్థితిశక్తి, గతిశక్తి, కాంతిశక్తి, యాంత్రికశక్తి మొదలైనవి. ఐతే ఈ శక్తులన్నింటికీ మూలం ఒకటే. ఒకే శక్తి వివిధ రూపాలు పొందినది. ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఏ రూపంలో ఉన్న శక్తి ఎంత పరిమాణంలో ఉన్నా, మొత్తం శక్తి యొక్క పరిమాణం మాత్రం స్థిరం. అది పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు.

శక్తి నిత్యత్వ నియమం: శక్తిని కొత్తగా సృష్టించలేము. ఉన్న శక్తిని రూపుమాపలేము. మొత్తం శక్తి యొక్క పరిమాణం ఎల్లప్పుడూ స్థిరం. బహురూపాలలో ఉండే శక్తిని కేవలం ఒక రూపంలో నుండి మరో రూపంలోకి మాత్రమే మార్చగలం. ఇదే ‘శక్తి నిత్యత్వ నియమం’.

రాజయోగం కూడా ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించే నిర్మించబడినది. మనసు ద్వారా జగత్తులో ఎల్లెడలా పరివ్యాప్తమై ఉన్న శక్తిని ఆవాహన చేసి ఆ శక్తిని మనకు కావలసిన మరో శక్తి రూపంలోకి మార్చుకుంటాం. ఈ విధంగా మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసే విధివిధానాలను వివరించేదే రాజయోగం.

యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం ఇత్యాది రాజయోగలక్ష్యాలు శక్తి యొక్క వివిధ రూపాలే. శక్తి ఆవాహనా సాధనమైన మనస్సుకూడా శక్తి యొక్క రూపమే. అలాగే విధి కూడా శక్తి స్వరూపమే. అంటే మనస్సు ద్వారా ఆవాహన చేయబడిన శక్తిని రాజయోగ లక్ష్యాలైదింటిలో మనకు కావలసిన రూపానికి లేక రూపాలకు మార్చుకుంటాం. శక్తి ఆవాహన చెందిన బలీయమైన మనస్సుతో చేసిన సంకల్పాలకు విధిరూపంలో ఉన్న శక్తి అనుకూలత చెంది, ఆ సంకల్పాలు విజయవంతం అవటంతో మనకు రాజయోగ లక్ష్యాల రూపంలో ఉన్న యశోసంపదాది శక్తి రూపాలు సమకూరతాయి.


రాజయోగం అంటే తపస్సు:

మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసి దానిని ఏ విధంగానూ రూపాంతరం చెందించని పక్షంలో అది తపశ్శక్తిగా మనలోనే ఉంటుంది. ప్రాచీన భారతంలోని ఋషులు ఈ విధంగానే తపశ్శక్తిని ఆర్జించేవారు. దానిని అనుభవింపదగిన భౌతికరూపాలలోకి మార్చుకోకుండా నిరాడంబరజీవన విధానంతో కాపాడుకుని అవసరాన్ని బట్టి తగిన సమయంలో లోకకళ్యాణార్ధమే వినియోగించేవారు. అసురులు అలాకాక తాము ఆర్జించిన తపశ్శక్తిని మితిమీరిన భోగాలకు, దుష్ట కార్యాలకు, పరపీడనకు వినియోగించి చివరకు శక్తి అంతా క్షీణించి, తిరిగి ఆ శక్తి స్వరూపమే అయిన విధి చేతిలోనే వంచితులై పతనమయ్యేవారు.

(ఆర్జించిన శక్తిని ఏ విధంగా ఉపయోగించాలనేది రాజయోగ పరిధిలోకి రాదు. అది కర్మయోగ పరిధిలోని విషయం. శక్తిని ఏ విధంగా ఆర్జించాలనే విషయాన్ని మాత్రమే రాజయోగం చర్చిస్తుంది. అందుకొరకు చేయవలసిన సాధనను మాత్రమే, అనుసరించవలసిన విధివిధానాలను మాత్రమే రాజయోగం చర్చిస్తుంది.)


రాజయోగం అంటే విధిని అనుకూలింపచేసుకోవడం:

విధిని గురించి నాస్తికుల వద్ద ప్రస్తావిస్తే ఇంతవరకూ దైవంతోనే వేగలేకపోతున్నాం మళ్ళీ ఈ విధి ఒకటా అని పరిహసిస్తారు.

పాజిటివ్ గా అయితే కొందరు ఈ విధిని ‘అదృష్టం’ అంటారు. కొందరు ‘కలసిరావడం’ అంటారు. అదే నెగెటివ్ గా అయితే కొందరు దీనిని ‘దురదృష్టం’ అంటారు. కొందరు ‘ఖర్మ’ అంటారు. మరికొందరు ‘తలరాత’ అంటారు. ఎవరు ఏమన్నా మానవాతీతంగా దైవం తరువాత ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దైవంకన్నా కూడా ఎక్కువగా మానవజీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్న అంశంగా మనం ఈ విధిని గుర్తించవచ్చు.

ఈ విధి శక్తి స్వరూపం. మానవుడు ఐహికంగా ఔన్నత్యాన్ని సాధించాలన్నా లేక ఇహలోక జీవితంలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించాలన్నా కూడా ఈ విధి అనుకూలించినపుడు మాత్రమే చేయగలడు. విధి సహకారంలేనపుడు మానవుడు చిన్న విషయంలో కూడా విజయాన్ని సాధించలేడు. ఈ విధి మానవుడిని అందలాలు ఎక్కిస్తుంది; అదఃపాతాళానికి అణగద్రొక్కుతుంది. యశోవంతుణ్ణీ చేస్తుంది; అనామకుణ్ణి చేస్తుంది. అంతులేని భోగాలలో ముంచిలేపుతుంది; చిత్రవధ చేసి చంపుతుంది. అనేక మహత్తర విజయాలనందిస్తుంది; ఇసుమంత సామర్ధ్యం లేని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. కుబేరుణ్ణి చేస్తుంది; కుచేలుణ్ణీ చేస్తుంది. పండితుణ్ణి చేశ్తుంది; పరమశుంఠనూ చేస్తుంది.

ఐతే ఇవేవీ కూడ యాదృచ్ఛికంగా జరగవు. మన యెడల విధియొక్క ఆగ్రహానుగ్రహాల ననుసరించి మాత్రమే జరుగుతాయి. దీనివలననే మనం ఈ విధిని కాళి, చండి, దుర్గ మొదలైన శక్తి రూపాలలో పూజిస్తుంటాము. అంటే ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది ఒక రకంగా శక్తి ఉపాసన. దైవారాధనకు, శక్తి ఉపాసనకు ఉన్న తేడాను మనం ఈ విధంగానే గుర్తించాలి. మన యెడల ప్రసన్నమైన విధి మనకెన్నో వరాలను ఇస్తుంది. ప్రధానంగా మన సంకల్పాలు విజయవంతమయ్యే రూపంలోనే అదంతా ఉంటుంది.

ఈ విధంగా కొన్ని సాధనల ద్వారా విధిని ప్రసన్నం చేసుకోవచ్చు. శాక్తేయులు చేసే శక్తి ఆరాధన మరియు తాంత్రికులు చేసే క్షుద్ర సాధనలవంటివి కావు ఇవి. సామాన్యజనులందరూ ఆచరించదగిన అతి సాధారణమైన ఆచరణలు. ఈ సాధనలను వివరించేదే రాజయోగం.

...(మిగతా విషయం తరువాతి టపాలలో)

రాజయోగం -I

మానవుడు ఐహికంగా వృద్ధినొందుటకు ఉద్దేశించినది రాజయోగం.

మానవుడు ఐహికంగా వృద్ధిచెందుటకు మార్గం కృషి, దీక్ష, పట్టుదల, అలుపెరుగని పోరాటం ..ఇత్యాది పడికట్టు పదాలేనా లేక ఏదైనా శాస్త్రీయ అభ్యాసం ఉన్నదా అనే ప్రశ్న మనకెదురైనపుడు దానికి సరైన సమాధానం రాజయోగం.

‘ఐహికమైన వృద్ధి’ అంటే మానవుడు తన Physical Quality ని పెంచుకోవడం. Physical Quality అంటే బురదపాముకు, రాచనాగుకు ఉండే తేడా; ఇత్తడికి, పుత్తడికి ఉండే తేడా; కంచుకు, కనకానికి ఉండే తేడా; పిల్లికి, పులికి ఉండే తేడా; రాజుకు, పేదకు ఉండే తేడా; నాసి వస్తువుకు, నాణ్యమైన వస్తువుకు ఉండే తేడా.

మధ్యయుగాలలో ఇనుము లాంటి తక్కువ రకపు లోహాలను ఉన్నతలోహమైన బంగారంగా మార్చే పరసువేది లేక రసవాదం (Alchemy) అనే ప్రక్రియ ఐరోపాలో వాడుకలో ఉండేదని ప్రతీతి. ఈ రసవాదం ఎంతవరకు నిజమోకానీ రసయోగం (రాజయోగం) మాత్రం ఐహికంగా అల్పస్థాయి మానవులను ఉన్నతస్థాయి మానవులుగా ఖచ్చితంగా మారుస్తుంది.

రాజయోగ భావనను, దాని ఉద్దేశ్యాలను, తత్సాధనను మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మరి కొన్నిరకాల వివరణలను చెప్పుకుందాం.


రాజయోగమంటే యశోసంపదాది ఐహిక విషయాలను సాధించడం:

ఆహార నిద్రామైధునాలు మానవుడికేకాక ఏజీవికైనా ఉండే ప్రాధమిక స్థాయి అవసరాలు. మానవుణ్ణి ఒక్కడినే ఉద్దేశించి మాట్లాడితే వీటిని కూడు, గూడు, గుడ్డలుగా చెప్పవచ్చు. మానవుడు కాక మిగతా జీవులు ఈ ప్రాధమిక స్థాయి అవసరాలు తీరటంతోటే ఆగిపోతాయి. కానీ మానవుడు ఈ అవసరాలు తీరిన తరువాత యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం ..ఇత్యాది ఉన్నత స్థాయి అవసరాలకై కృషిచేస్తాడు. ఆ కృషి యొక్క స్వరూపమే రాజయోగం. తత్సాధనను వివరించేదే రాజయోగం.

ఆ భగవానుడు సైతం కాంక్షాపరులైన ప్రతిఒక్కరినీ యశోసంపదాది విషయాల సాధనకై పిలుపునిస్తున్నాడు.


తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ

జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం | (అ.11-శ్లో.33)

కనుక ( ఓ అర్జునా!) లేలెమ్ము. ఖ్యాతి నార్జింపుము. శత్రువులను జయించి సర్వసమృద్ధంబగు రాజ్యమును అనుభవింపుము.


ఇచ్చట ఖ్యాతి అంటే యశస్సు, శత్రువులను జయించడమంటే అది విజయం, సర్వ సమృద్ధం అంటే ఐశ్వర్యం, రాజ్యం అంటే అధికారం, అనుభవించడమంటే భోగం. ఈ విధంగా భగవానుడు రాజయోగ లక్ష్యాలైన యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం అనే ఐదింటినీ సాధించమని పిలుపునిస్తున్నాడు.


రాజయోగం ఒక ‘శక్తి ఉపాసన’:

జీవుడు గుహ్యాంగాతర్గతమైన ప్రకృతి శక్తితో అనుసంధానమై ఆచరించేది రాజయోగం అని గతంలో ఒకసారి చెప్పుకున్నాం.

గుహ్యాంగం ప్రకృతి లేక శక్తి స్వరూపిణియైన ఆ జగన్మాత స్థానం. అందుకే శాక్తేయులు (శక్తి ఆరాధకులు) గుహ్యాంగాలను పూజిస్తారు. శాక్తేయులంత ప్రత్యక్షంగా కాకపోయినా వైదికమతంలో కూడా ఈ విధమైన గుహ్యాంగ ఆరాధన ఆచరణలో ఉన్నది. వైదిక మతంలో శక్తి స్వరూపిణికి భర్తగా భావించే శివుడిని లింగ రూపంలోనే పూజిస్తారు. శివాలయాలలో మనకు కనిపించే లింగం పురుష జననాంగానికి, ఆ లింగానికి క్రింద ఉండే పానపట్టం స్త్రీ జననాంగానికి ప్రతిరూపాలు.

శక్తి ఆరాధన చేసే శాక్తేయమతం ప్రాచీన భారతదేశంలో కొంతకాలం విరివిగా ఆచరణలో ఉండేది. ఇప్పుడు శాక్తేయులు మన దేశంలో స్వల్పంగానే ఉన్నారు. అస్సాం రాజధాని గౌహతికి సమీపంలో గల కామాఖ్య ఆలయం మన దేశంలో ప్రసిద్ధి చెందిన శక్తి ఆలయం. మన రాష్ట్రంలో కూడా ఇటీవలి కాలంలో ఓ శాక్తేయ ఆలయాన్ని నిర్మించారు. విశాఖపట్టణానికి సమీపంలో గల ‘దేవీపురం’ అనే గ్రామంలో దీనిని నిర్మించారు.

(దేవీపురంలో ప్రధాన ఆలయాన్ని శ్రీచక్రం ఆకారంలో నిర్మించారు. ఇందులో రాజరాజేశ్వరీ దేవిని ప్రతిష్టించారు. పక్కనే ఉన్న ఒక కొండ గుట్టపై గుహ్యాంగాలకు ఆలయాలను నిర్మించారు. కొండగుట్టకు పూర్తిగా పైభాగంలో పురుషాంగ ఆలయం ఉంటుంది. కొంచెం దిగువన స్త్రీ జననాంగానికి ఆలయం ఉంటుంది.)

ఈ శాక్తేయులు కానీయండి, తాంత్రికవాదులు కానీయండి శక్తి ఆరాధనలో భాగంగా రాజయోగం లోని ప్రాణాయామాది సాధనలు చేస్తుంటారు. శక్తి అనేక రూపాలలో ఉంటుంది. మానవదేహంలో వెన్నెముక అథోభాగంలో కుండలినీ రూపంలో నిద్రాణమై ఉండే శక్తిని ప్రాణాయామాది సాధనల ద్వారా జాగృతం చేసి సుహుమ్న నాడిద్వారా ఊర్ధ్వాభిముఖంగా పయనింపచేసి శక్తివంతులుగా మారటం, అణిమాది అష్టసిద్ధులు స్వంతం చేసుకోవటం ఇత్యాదివి తాంత్రిక వాదుల లక్ష్యాలు. ఈ తాంత్రికవాదులవలనే రాజయోగం అనేక అపార్ధాలకు లోనై సామాన్య ప్రజలకు దూరమైనది.

నిజానికి రాజయోగాన్ని క్లిష్టమైన ఈ తాంత్రికరూపంలో కాక చాలా సరళమైన రూపంలో కూడా ఆచరించి శక్తిని సముపార్జించవచ్చు. ఆ సరళ రూపమే మనసును స్వాధీనం చేసుకోవడం. స్వాధీనమైన మనస్సు నిశ్చలమై తనలోనికి ఈ జగత్తులో ఎల్లెడలా వ్యాప్తమై ఉన్న శక్తిని ఆవాహన చేస్తుంది. ఈ విధంగా శక్తివంతమైన మనస్సుతో మానవుడు చేసే సంకల్పాలకు విధిరూపంలో ఉన్న శక్తి ప్రసన్నమై అతడు అఖండ విజయాలు సాధిస్తాడు. ఘనతర కార్యాలు సాధిస్తాడు.

ప్రాచీన భారతంలో ఋషులు ధ్యాన సాధనలద్వారా మనస్సును స్వాధీనం చేసుకుని తపశ్శక్తిని సాధించేవారు. ఈ మనస్వాధీన ప్రక్రియను ధ్యానరూపంలోనేకాక అనేక బాహ్యసాధనలద్వారా కూడా చేయవచ్చు. ఈ విషయాలన్నింటినీ రాబోయే వివరణలలో మరికొంచెం విపులంగా చెప్పుకుందాం.

...(మిగతా విషయం తరువాతి టపాలలో)