20, ఆగస్టు 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---13





జగతి రూపును మార్చిన రెండు మహాయుద్ధాలు

గడచిన శతాబ్దంలో సంభవించిన రెండు సంఘటనలు చరిత్ర సాధించిన మార్పులకు తుదిరూపాన్నిచ్చాయి. అవే రెండు ప్రపంచ యుద్ధాలు.

ప్రపంచంలో ఫ్యూడల్ వ్యవస్థ మొదటి ప్రపంచ యుద్ధకాలం వరకు కొనసాగింది. 'మొదటి ప్రపంచ యుద్ధం' ఫ్యూడల్ వ్యవస్థకు భరత వాక్యం పలికితే రెండవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాద కొల్లదారీ వలస పాలనకు చరమగీతం పాడింది. సుదీర్ఘ చరిత్రలో మానవుడు సాధించిన సామాజిక మార్పులకు ఈ రెండు యుద్ధాలు అంతిమ ఘట్టాలుగా పనిచేసి నేటి ప్రపంచం రూపుదాల్చింది.

మొదటి ప్రపంచ యుద్ధం 1914వ సం||లో ప్రారంభమై 1918వ సం||వరకు కొనసాగింది.ఆ కాలం వరకూ ప్రపంచంలో ఫ్యూడల్ రాజ్యాలుండేవి.టర్కీలో 'ఆటోమన్ సామ్రాజ్యం', చైనాలో 'మంచూ సామ్రాజ్యం', రష్యాలో 'జార్ సామ్రాజ్యం',ఐరోపాలో 'ప్రష్యా రాజ్యం'. ఇవన్నీ కూడా ఫ్యూడల్ వ్యవస్థలే.అంటే నిన్నమొన్నటి వరకు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మధ్యయుగాలనాటి ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది. ఈ సామ్రాజ్యాలలో ఒక్క చైనా లోని మంచూ సామ్రాజ్యం మినహాయించి మిగిలిన రాజ్యాలన్నీ మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా కూలిపోయాయి. మంచూ రాజ్యం మాత్రం యుద్ధానికి రెండుమూడు సంవత్సరముల ముందు ‘సన్ యెట్ సెన్’ నాయకత్వంలో సంభవించిన ప్రజావిప్లవంలో కూలిపోయింది.ఏది ఏమైనా మొదటి ప్రపంచ యుద్ధం సంభవించినకాలం మానవజాతి చరిత్రలో ఫ్యూడల్ వ్యవస్థ అంతరించిన కాలం.

టర్కీలో అట్టోమన్ సామ్రాజ్యం అంతరించడమేకాక ప్రపంచ ముస్లిం ప్రజల నాయకత్వ పదవి లేక ఇస్లాం మతపెద్ద పదవి అయిన 'ఖలీఫా' పదవి (ఖలీఫేట్) రద్దవటం ఇస్లాం యొక్క సుదీర్ఘకాల ప్రాభవానికి అంతిమ ఘట్టంగా చెప్పవచ్చు.

రష్యాలో జార్ సింహాసనం ప్రజావిప్లవం ద్వారా కూల్చివేయబడి ముందుగా ఒక బూర్జువా ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది.అది ఇంకా నిలదొక్కు కోక ముందే లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్కులు ఆ తాత్కాలిక బూర్జువా ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రపంచంలో మొట్టమొదటి సామ్యవాద ప్రభుత్వాన్ని ఏర్పరచారు.

ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ప్రపంచానికి ఫ్యూడల్ పీడ విరగడైనది.ఇక మిగిలినది వలస పాలకుల పీడ.ఈ కార్యం 'రెండవ ప్రపంచ యుద్ధం' నెరవేర్చినది.రెండవ ప్రపంచ యుద్ధం(1939-45)లో సంభవించిన కొన్ని సంఘటనలు మరియు ఆ యుద్ధ ఫలితాలు వలస పాలన అంతరించడానికి దారితీశాయి.అవి:

ౘ ప్రపంచంలో చాలా భాగాన్ని తమ వలసలుగా పాలిస్తూ అప్పటి వరకూ అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న బ్రిటన్,ఫ్రాన్స్‌లు యుద్ధంలో నాజీ జర్మనీకి మోకరిల్లాయి.వాటిని అమెరికా మరియు సామ్యవాద రష్యా రక్షించాల్చిన పరిస్థితి ఏర్పడింది.దీనితో వాటికి ఉన్న పరపతి, ఖ్యాతి అంతరించాయి.అందువలన అవి వలసలుగా అంతటి సువిశాలమైన అనేక దేశాలతో కూడిన సామ్రాజ్యాలను పాలించే నైతిక హక్కును మరియు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయి.

ౘ నాజీ జర్మనీని సామ్యవాద రష్యా ఓడించడంతో కమ్యూనిజం యొక్క ఖ్యాతి ఆకాశాన్నంటింది.కమ్యూనిస్టు సిద్ధాంతానికి విపరీతమైన ప్రచారం,జనాదరణ లభించి సామ్రాజ్యవాదానికి ప్రపంచంలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.దానితో సామ్రాజ్యవాద దేశాలు గత్యంతరంలేక ప్రజలను సంతృప్తి పరచడం కొరకు సోషలిస్టు మంత్రం జపిస్తూ వలసలను వదిలేశాయి.

ౘ పెట్టుబడిదారీ వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన ఐరోపాలోనే రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం తూర్పు ఐరోపా దేశాలలో కమ్యూనిష్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.దానితో తూర్పు నుండి దూసుకొస్తున్న ఎర్ర కెరటం తమను కూడా ముంచెత్తుతుందేమో నన్న భయంతో ఆత్మరక్షణలో పడిన బ్రిటన్,ఫ్రాన్స్ తదితర దేశాలు వలసల సంగతి దేముడెరుగు ముందు తమ దేశాలలోని కనీసం తమ అస్తిత్వాన్నైనా రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో అవి వలసలను వదిలేసుకున్నాయి.

ౘ యుద్ధం వలన బ్రిటన్,ఫ్రాన్స్ తదితర దేశ ప్రజలలో సైతం సామ్రాజ్యవాదం మీద వ్యతిరేకత ఏర్పడి యుద్ధానంతరం జరిగిన ఎన్నికలలో సోషలిస్టు భావాలు కలిగిన పార్టీలను గెలిపించడంతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీల ప్రభుత్వాలు వలసలకు స్వాతంత్ర్యమొసగాయి. బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చిన 'లేబర్ పార్టీ' ఇదే విధంగా భారతదేశానికి స్వాతంత్ర్యమిచ్చింది.

ౘ అప్పటికే భారత దేశం లాంటి దేశాలలో స్వాతంత్ర్యం కొరకు అహింసాయుతంగా జరుగుతున్న ప్రజాపోరాటం ముమ్మరమై అది ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తున్నది.స్వాతంత్ర్యం కొరకు ఆయాదేశాలలోని ప్రజలు ఆయా పోరాటాలలో పెద్దయెత్తున పాల్గొంటున్నారు. ఈది కూడా వలసలకు స్వాతంత్ర్యం ఈయడానికి ఒక ప్రధాన కారణం.

ఏది ఏమైతేనేం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఒక పది,ఇరవై సంవత్సరాలలోనే దాదాపు వలస పాలన అంతా అంతరించింది.

ఈ సమయంలో ఒక విషయం చెప్పుకోవాలి.ఫ్యూడల్ వ్యవస్థలోని అన్ని రాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే అంతరించలేదు.అప్పటికి ముందే కొన్ని రాజ్యాలు అంతరించాయి. కానీ ఆ సమయానికి కూడాఎంతో విస్తారమైన భూభాగం ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే ఉన్నది.ఆ మిగిలి ఉన్నది మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

అలాగే రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగా వలస పాలన అంతరించినా మొత్తం ఆ కాలంలోనే అంతరించలేదు.అంతకు మునుపే కొంత వలస పాలన అంతమైనది.అదే 'అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య పోరాటం'.ఇది 18 వ శతాబ్దపు చివరికాలంలో జరిగినది.అమెరికా సాయుధ పోరాటం ద్వారా బ్రిటన్ పాలన నుండి విముక్తి పొందింది.దీనితో స్ఫూర్తి పొందిన దక్షిణ అమెరికా ఖండపు లాటిన్ అమెరికా దేశాలు 19వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాల కాలంలో అప్పటికే ప్రాభవాన్ని కోల్పోయిన స్పెయిన్ దేశపు వలస పాలన నుండి తిరుగుబాట్ల ద్వారా, సాయుధ పోరాటాల ద్వారా విముక్తి పొందాయి.ఇక మిగిలిన వలస పాలన రెండవ ప్రపంచ యుద్ధానంతరం అంతరించింది.

ఈ విధంగా రెండు ప్రపంచ యుద్ధాల వలన నేటి స్వేచ్ఛాయుత ప్రపంచం ఏర్పడింది.అంటే యుద్ధాలవలన ఒక పార్శ్వంలో ప్రజలు నష్ట పోయినా అంటే ప్రాణ నష్టం,ఆస్థి నష్టం సంభవించినా మరో పార్శ్వంలో మానవాళికి అంతకు మించిన మేలే జరిగినది.కానీ నేటి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఈ రెండు యుద్ధాలలోని నెగెటివ్ పార్శ్వాన్నే ఎక్కువగా ప్రచారం చేశాయి. ఎందుకంటే అవి ఈ యుద్ధాలవలన ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం వలన నష్టపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిథులు కనుక… (సశేషం)


2 కామెంట్‌లు:

  1. మీరు చెప్పిన అంశం నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. నిజంగా ఇప్పటి దాక ప్రపంచ యుద్ధాల వలన మానవాళికి ఎంతో నష్టం జరిగింది అనే తెలుసు! మీరు చెప్పిన పార్శ్వం లో చూస్తే ఒక రకం గా నష్టం జరిగినా, దీర్ఘ కాలం లో మంచే జరిగింది అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. బెజవా గారూ! మనకు విద్యాలయాలలో చరిత్ర కాపిటలిస్టు దృక్కోణంలో బోధించబడుతున్నది. మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం గురించైతే మన చిన్నప్పుడు చాలా వాస్తవాలు మరుగుపరచబడి కొన్ని అతిశయోక్తులే చెప్పబడ్డాయి. వాస్తవాలను తెలుసుకోవాలంటే మనం స్వయంగా చరిత్ర గ్రంథాలు చదవ వలసి ఉన్నది.

    రిప్లయితొలగించండి