21, ఆగస్టు 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---14





మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమే

గడచిన చరిత్రను పరిశీలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభంజనంతో ఫ్యూడల్ ఇస్లాం తన ప్రాభవాన్ని దాదాపూ కోల్పోయింది. కానీ ఆ విధంగా కమ్యూనిజం యొక్క ప్రభంజనంతో కాపిటలిజం తన ప్రాభవాన్ని కోల్పోలేదు.

ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిజం ఆవిర్భవించింది. అంటే ఫ్యూడలిజం కన్నా కాపిటలిజం ప్రగతిశీలమైనది.కాపిటలిజం కన్నా కమ్యూనిజం ప్రగతిశీలమైనది. చరిత్రలో ఫ్యూడలిజం తనకన్నా పురోగామి అయిన కాపిటలిజం చేతిలో చావుదెబ్బ తిన్నది. కానీ అదే విధంగా కాపిటలిజం మాత్రం తనకన్నా పురోగామిశీలియైన కమ్యూనిజం వలన నష్టపోయింది కానీ చావు దెబ్బ మాత్రం తినలేదు.పైగా కాలగతిలో పురోగామిశీలియైన కమ్యూనిజమే దెబ్బతిన్నది.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఖలీఫేట్ రద్దుతో ఇస్లాం ఆధిపత్య చరిత్ర ముగిసిపోయింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లు అగ్ర రాజ్య హోదా కోల్పోయినా అమెరికా, రష్యాలు యుద్ధానంతరం అగ్ర రాజ్యాలుగా అవతరించడంతో అమెరికా రూపంలో కాపిటలిజం తన ప్రాభవాన్ని యుద్ధానంతరం కూడా చాటుతూనే ఉన్నది. కాలక్రమంలో సోవియట్ రష్యాలోనే కమ్యూనిజం దెబ్బతిని రష్యా అగ్ర రాజ్య హోదా కోల్పోయినా కూడా అమెరికా రూపంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాభవం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అమెరికా ఒక్కటే ఇప్పుడు అగ్రరాజ్య హోదా కలిగి ఉండటంతో ఇప్పటి ప్రపంచాన్ని ఏకధృవ ప్రపంచం గా పిలుస్తున్నారు.

దీనివలన మనకు ఒక విషయం స్పష్టంగా బోధపడుతున్నది. అదేమంటే మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమేనని. ఎందుకంటే ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం లు మూడునూ కూడా మానవాళికి సరిసమానంగా మేలు-కీడులు చేసినప్పటికీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ప్రాభవం లేనివీ, ఈ సరికే చావుదెబ్బతిన్నవీ అయిన ఇస్లాం మరియు సామ్యవాదాలు మానవాళికి ఏవిధంగా శత్రువులు కాగలవు? ఒక వేళ ఫ్యూడలిజం కాపిటలిజం చేతిలో దెబ్బతిన్నట్లుగా కాపిటలిజం కమ్యూనిజం చేతిలో దెబ్బతిని నేడు కమ్యూనిజం ప్రాభవం కలిగిన ప్రపంచం ఏర్పడినట్లైతే మానవజాతి తన అంతిమశత్రువుగా కమ్యూనిజాన్ని పరిగణించవలసివచ్చేది. ఎందుకంటే చరిత్రలో మానవుడు అంతిమ వ్యవస్థను అప్పటికి ప్రాభవం కలిగిన వ్యవస్థను కూల్చి మాత్రమే కదా నెలకొల్పేది. కాబట్టి ఇప్పుడు అమెరికా రూపంలో కాపిటలిజం తన ప్రాభవాన్ని చాటుతున్నది కనుక ఆ కాపిటలిజాన్ని కూల్చి మాత్రమే మానవుడు తన అంతిమ సామాజిక, రాజకీయ వ్యవస్థను నెలకొల్పుతాడు. ఈ కారణ వలన మానవాళి అంతిమ శత్రువు కాపిటలిజమే.. పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రమే.

తనకన్నా పురోగామి వ్యవస్థ చేతిలో ఫ్యూడల్ వ్యవస్థ కూలిపోయినట్లుగా కాపిటలిజం తన కన్నా పురోగామి అయిన కమ్యూనిజం చేత దెబ్బ తిని ఎందుకు కూలిపోలేదు. పైగా ఆ పోరాటంలో తుదకు పురోగామి కమ్యూనిజమే ఎందుకు కూలిపోయింది? అని ప్రశ్నించుకున్నట్లైతే మనకు ఈ విధమైన సమాధానం లభిస్తుంది.

ఇస్లాంలో గానీ, కమ్యూనిజంలో గానీ లేని ఒక లక్షణం కాపిటలిజంలో ఉన్నది కనుననే కాలగతిలో కాపిటలిజం ఈనాటికీ నిలబడగలిగింది. ఆ లక్షణం వలననే తనకన్నా పురోగామి అయిన కమ్యూనిజంతో జరిగిన పోరాటంలో ఎంత నష్టపోయినా అంతిమంగా గెలిచింది. ఆ లక్షణమేమంటే కాలానుగుణంగా మారటం.. మారిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తన వ్యూహాలను తగిన విధంగా మార్చుకోవడం.

మొదట కాపిటలిజం జనించిన కాలంలో అప్పటికి కాపిటలిజం అనే పేరును కూడా సంతరించుకోలేదు. ఆ కాలంలో స్పెయిన్, పోర్చుగల్‌లు అగ్రరాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో దోపిడీ ప్రత్యక్షంగా జరిగేది. తమ వలసల నుండి కొల్లగొట్టిన సంపదను ప్రత్యక్షంగా దోపిడీ దొంగల మాదిరిగా నౌకలలో స్వదేశాలకు తరలించేవారు. ఇది ఆ వ్యవస్థ యొక్క మొదటి దశ. ఈ దశలో నౌకాబలం నిర్ణాయక శక్తిగా ఉండేది. ఆ బలం అధికంగా ఉన్న స్పెయిన్ అప్పట్లో అగ్రరాజ్యంగా చెలామణీ అయినది. పారిశ్రామిక విప్లవం సంభవించేవరకూ ఈ దశ కొనసాగింది.

కాలక్రమంలో ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు జరిగి వస్తూత్పత్తి యంత్రాల సాయంతో జరగటం ప్రారంభమైనపుడు ఈ వ్యవస్థ తన వ్యూహం మార్చినది. తన వలసలను తన దేశంలోని పరిశ్రమలకు ముడిసరకు సరఫరాదారులుగా, తమదేశ పారిశ్రామికోత్పత్తులకు మార్కెట్లుగా వాడుకున్నది. దీనివలన దోపిడీ మరింత తీవ్రంగా జరిగినది. ఈ కాలంలోనే ఈ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ అనే పేరును సంతరించుకున్నది. ఈ కాలమే ఈ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలం. ఈ దశకు బ్రిటన్, ఫ్రాన్స్‌లు అగ్రరాజ్యాలుగా వ్యవహరించటం జరిగినది. పారిశ్రామిక ప్రగతి ఈ కాలంలో నిర్ణాయక శక్తిగా ఉండేది. ఈ దశ రెండవ ప్రపంచ యుద్ధకాలం వరకు కొనసాగింది.

తరువాత దశ వలసలను పోగొట్టుకున్నకాలం. ఈ దశ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడి సోవియట్ రష్యాలో కమ్యూనిజం పతనమయ్యేవరకూ కొనసాగింది. ఈ దశలో అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా కొనసాగాయి.ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రధానంగా ఆత్మరక్షణ దశ. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షేమ రాజ్యం అవతార ఎత్తింది. కమ్యూనిజం తనమీద చేసిన ప్రధాన విమర్శలనన్నింటినీ దిద్దుకున్నది. వలసలకు స్వతంత్ర్యమిచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే సోషలిస్టు లక్ష్యాలను సాధించవచ్చంటూ సోషలిస్టు మంత్రాన్ని తానే జపిస్తూ వచ్చింది. ఈ విధంగా ప్రజలకు ప్రత్యేకించి సామ్యవాదాన్ని కోరుకునే అవసరం లేకుండా జాగ్రత్త పడింది.

సరిగా ఈ దశనే స్వాతంత్ర్యానంతరం భారతదేశం అవలంబించింది. ఈ దశ యొక్క ప్రధాన లక్షణం ‘కమ్యూనిస్టు భీతి’.

ప్రచ్ఛన్న యుద్ధం

కమ్యూనిస్టు భీతి ప్రధాన లక్షణంగా గల ఈ దశలో నిర్ణాయక శక్తి సైనిక బలం. ఈ దశలో కాపిటలిజం యొక్క ప్రధాన లక్ష్యం కమ్యూనిజాన్ని అంతమొందించడం. తుదకు తూర్పు ఐరోపా దేశాలలో మరియు సోవియట్ రష్యాలో సామ్యవాదం కూలిపోవటంతో ఈ దశ అంతరించింది. ఈ సామ్యవాద పతనం అన్నది చరిత్రలో ఇటీవలి పరిణామమే. 80వ దశకం చివరిలోనూ 90వ దశకం ప్రారంభంలోనూ ఈ పరిణామాలు జరిగాయి. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న అమెరికా మరియు సామ్యవాద వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న రష్యాకు మధ్యన సిద్ధాంతపరమైన ఆధిపత్యం కొరకు 'ప్రచ్ఛన్న యుద్ధం'(Cold War) జరిగినది. అందుకే ఈ దశ ప్రచ్ఛన్నయుద్ధ కాలంగా కూడా సుప్రసిద్ధం…(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి