అన్ని కర్మలలోని దోషాలను యజ్ఞం పరిహరిస్తుంది. సర్వ కర్మలకు భోక్త ఆ భగవంతుడే.
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || (అ.5-శ్లో.29)
యజ్ఞాలకూ,తపస్సులకూ భోక్తననీ, సర్వలోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ | (అ.9-శ్లో.24)
సర్వ యజ్ఞాలలో భోక్త, ప్రభువు నేనే.
భగవంతుడు యజ్ఞంలో స్థితమై ఉంటాడు.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మా క్షర సముద్భవం |
తస్మా త్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం || (అ.3-శ్లో.15)
కర్మ వేదం నుండి పుట్టినది. పరమాత్మ వల్ల వేదం వెలసినది. అంతటా వ్యాపించిన పరమాత్మ అందువలనే యజ్ఞంలో ఎప్పుడూ ఉంటాడు.
‘యజ్ఞం’ యొక్క ప్రేరేపణతో చేసే కర్మను ‘యజ్ఞం’ హవిస్సుగా స్వీకరిస్తుంది. ఈ విధంగా యజ్ఞార్ధం చేసే కర్మ యజ్ఞంలోని భగవంతుడికి సమర్పింపబడి దానిలోని దోషాలు దగ్ధమై దోషరహితమైన ‘అంశీభూత గుణకర్మ’గా మారుతుంది. అదే కర్మఫలంగా (యజ్ఞ శేషంగా) ఆ మానవుడికి దక్కుతుంది. అది సత్య నిర్మాణంలో పాలుపంచుకుంటుంది. యజ్ఞం మూడు గుణకర్మలనూ హవిస్సులుగా కోరుతుంది కనుక త్రివిధమైన అంశీభూత గుణాలూ ఏర్పడి అవి మూడునూ పరస్పరం సమన్వయం చెంది ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. ఆ విధంగా ఆ మానవుడి జీవనం సత్యమయమౌతుంది.
రాగద్వేషాలతో చేసే కర్మలను భగవంతుడు స్వీకరించడు. ఎందుకంటే అవి (యజ్ఞార్ధం చేయబడలేదు కనుక) ఆయనకు సమర్పింపబడటంలేదు. అందువలన వాటిలోని దోషం దగ్ధం కాదు. దోషభూయిష్టమైన కర్మ ఫలమే ఆ మానవునికి అందుతుంది. అది కర్మ బంధానికి దారితీస్తుంది.
యజ్ఞశిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపాః యే పచంత్యాత్మ కారణాత్ || (అ.3-శ్లో.13)
యజ్ఞశేషమును భుజించు సజ్జనులు సర్వ పాపముల నుండీ విముక్తులగుచున్నారు. కర్మలను యజ్ఞార్ధం కాక తమ ఇష్టయిష్టాలమేరకు చేసేవారు పాపమునే వండుకుని ఆ పాపమునే భుజిస్తున్నారు.
యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం |
నాయం లోకో స్త్య యజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ ! || (అ.4-శ్లో.31)
కురుకుల భూషణా! యజ్ఞశేషము అమృతము.దీనిని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మపదం పొందుతారు. యజ్ఞం ఒకటీ చేయని వాడికి ఇహలోక సుఖంలేదు; పరలోక సుఖం అసలే లేదు.
ఇంతకు ముందు (‘యజ్ఞం’ అనే అంశం యొక్క ప్రారంభంలో) చెప్పుకున్న ఉదాహరణలలో ‘యజ్ఞం’ ద్వారా ‘సత్యం’ ఏ విధంగా ఆవిష్కరించబడుతుందో చూద్దాం.
‘వ్యవస్థ’ అనే విషయంలో పాలకులు ఏ ఒక్క గుణకార్యానికి లోబడకుండా అటు తమో గుణకార్యమైన ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు, ఇటు రజో గుణ కార్యమైన ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు, అలాగే సత్వ గుణకార్యమైన ‘వ్యక్తి’ యొక్క ప్రయోజనాలు ఇలా మూడింటినీ సమన్వయపరచి, మూడింటి యొక్క ప్రయోజనాలనూ నెరవేర్చినచో ‘వ్యవస్థ’ విషయంలో ‘యజ్ఞం’ జరిగి ‘సత్యం’ ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.
అలానే ‘భాష’ విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి ఒక్కొకసారి వాడుక భాష, ఒక్కోకసారి ఇంగ్లీషు భాష (శిష్ట భాష), ఒక్కొకసారి సంస్కృతం (పురాతన భాష) ఇలా మూడు భాషలనూ అంగీకరించినట్లైతే భాష విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరించబడినట్లుగా భావించవచ్చు.
అలానే ‘జీవన విధానం’ విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి సంప్రదాయాలనూ పాటించాలి. ఆధునికంగానూ జీవించాలి. ఒక్కొక సందర్భంలో కాలానుగుణమైన మార్పులనూ అంగీకరించాలి. ఇలాగనుక ప్రవర్తిస్తే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.
అలాగే ‘పిల్లల పెంపకం’లో ఒక్కొక సందర్భంలో వారిని క్రమశిక్షణతో కట్టడి చేయాలి. ఒక్కొక సందర్భంలో వారికి స్వేచ్ఛ నిచ్చి వారు అడిగినది సమకూర్చాలి. ఒక్కొక సందర్భంలో మన ప్రమేయంలేకుండా విషయాన్ని వారి స్వయం నిర్ణయానికి వదలి వేయాలి. ఇలా గనుక ప్రవర్తిస్తే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.
అలాగే సమాజంలో మనుగడ సాగించే మానవుడు సత్వ గుణ సంబంధమైన విజ్ఞానాన్నీ ఆర్జించాలి. రజోగుణ సందర్భమైన లౌక్యాన్నీ, వ్యవహార దక్షతనూ పెంపొందించుకోవాలి. అలానే తమోగుణసంబంధమైన మంచి నడవడికనూ కలిగి ఉండాలి. ఇలా గనుక జరిగినట్లైతే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు.
ఇలా సనాతనమైన, సార్వత్రికమైన, సార్వజనీనమైన ‘యజ్ఞం’ ద్వారా ఏ విషయంలోనైనా సత్యావిష్కరణ చేయవచ్చు. సర్వేసర్వత్రా ఎక్కడైనా, ఎప్పుడైనా మానవాళి జీవనంలోని ఏ కోణానికైనా, ఏ శాస్త్రానికైనా, ఏ రంగానికైనా యజ్ఞాన్ని అన్వయించుకోవచ్చు; ఆయా విషయాలకు సంబంధించి సత్యాన్ని సాధించవచ్చు.
(విషయం అవగాహన అవటం కొరకు ఎక్కువగా తేలిక పాటి విషయాలను తీసుకొని వివరించడం జరిగింది. దీనిని బట్టి ‘సత్యనిర్మాణం’ ఇంత తేలికా అని అనుకోకూడదు. మనకు వాస్తవ జీవితంలో అది వ్యక్తిగతమైనా కానివ్వండి సామాజికమైనా కానివ్వండి చాలా సంక్లిష్టమైన సమస్యలు ఎదురుపడుతుంటాయి. ముందు సులువైన విషయాల ద్వారా యజ్ఞప్రక్రియను అర్ధం చేసుకుంటే ఆ తరువాత ఎంతటి క్లిష్టమైన వ్యవహారంలోనైనా మనం సరిగా వ్యవహరించగలుగుతాము.)… (సశేషం)
ఇదంతా స్పెక్యులేషన్ గా అనిపిస్తుంది. యజ్ఞం, కర్మ ఇవన్నీ అవసరమా. సత్యాన్ని ఏదో బ్రహ్మ పదార్దం చేయకూడదు. అది చట్రాల్లో ఒదగదు. సూత్రీకరణలకు లొంగదు. ఏమిటిదంతా?
రిప్లయితొలగించండిమీమాంసలోనే కొట్టుకుపోతే జీవితాన్ని దర్శించలేము.
నేరుగా విషయం చెప్పండి. వింటాను.
కొన్ని బాగానే చెప్పారు.