9, సెప్టెంబర్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---23 (గీతా వ్యాసాలు)



పాశ్చాత్య (గ్రీకు) తత్త్వశాస్త్రంలోని Synthesis భారతీయ తత్త్వశాస్త్రంలోని యజ్ఞం; ఈ రెండు భావాలూ ఒకటే. ఐతే పాశ్చాత్యులు ఈ ప్రక్రియలో రెండు వైరుధ్యాలు (Thesis మరియు Anti Thesis) మాత్రమే పాలు పంచుకుంటాయని భావించారు. కానీ భారతీయులు మూడు వైరుధ్యాలు (త్రిగుణాలు) పాలుపంచుకుంటాయని ఖచ్చితంగా చెప్పారు.

త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే గుణకర్మలే ఈ యజ్ఞంలో హవిస్సులు. ‘మౌలిక స్థాయి గుణకర్మలు ’ ఆ విధంగా యజ్ఞంలో హవిస్సులుగా దగ్ధమై ‘అంశీభూత గుణకర్మలు ’గా ఆవిర్భవిస్తాయి. ఇలా ఆవిర్భవించిన మూడు అంశలూ పరస్పరం సమన్వయం చెంది ఆ విషయంలో (ఏ విషయంలోనైనా సరే) ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది.

సత్యాన్ని అందరూ అంగీకరించినా వాస్తవమైన సత్యస్వరూపాన్నెరిగి తదాచరణకు అందరూ పూనుకోరు. గుణకర్మలు చేస్తూ అదే సత్యమని వ్యాఖ్యానిస్తారు. ‘యజ్ఞం’ వలన మాత్రమే ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. గుణకర్మల వలన సత్యం లభించకపోగా మానవుడు కర్మ బంధాలలో చిక్కుకుంటాడు.

జగత్తులోని మూడు గుణాలూ వేటికవే ఆకర్షణీయమైనవి. దేని భౌతిక ఔన్నత్యం దానిదే. దేని సమ్మోహనత్వం దానిదే. ఇవి సాధారణ మానవుడి మనస్సును సులభంగా ప్రలోభపెడతాయి. ఆ గుణాన్ని లేక ఆ గుణానికి ప్రాతినిథ్యం వహించే వస్తువును పొందాలనే కాంక్షను మానవుడిలో ప్రేరేపిస్తాయి. అలానే ఇవి మూడు గుణాలూ కూడా పరస్పర విరుద్ధమైనవి కావడం వలన ఏదో ఒక గుణం యొక్క ఆకర్షణలో పడిన మానవుడు మిగతా రెండు గుణాల యెడల అనిష్టత చూపటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అవి తానిష్టపడే గుణానికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక.

మానవుడు మూడు గుణాలలో ఏ ఒక్క గుణాన్నైనా ఇష్టపడటం జరగవచ్చు. అది అతని స్వభావాన్ననుసరించి ఉంటుంది. కానీ దేన్ని ఇష్టపడినా మిగతా రెండింటి ఎడలా అయిష్టత చూపటం అనివార్యం. ఇష్టానిష్టాలనే ‘రాగద్వేషాలు’ అంటారు. ఈ విధంగా రాగద్వేషపూరితమైన మనస్సుతో కర్మాచరణకు పూనుకున్నపుడు మానవుడు తానిష్టపడే గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మనే అధికంగా చేస్తాడు. తాను అయిష్టత చూపే తద్వ్యతిరిక్త గుణాలకు ప్రాతినిధ్యం వహించే కర్మలను ద్వేషభావం వలన సాధ్యమైనంతవరకూ ఆచరించడు. ఇలా అతని కర్మాచరణలో ఒక గుణకర్మ అధికమై సత్యనిర్మాణం జరగదు. ఎందుకంటే సత్యంలో మూడుగుణ కర్మలకూ సమాన ప్రాతినిధ్యం ఉండవలసినదే కనుక.

కానీ గుణాల ఆకర్షణకు లోబడకుండా, రాగద్వేషాలు లేకుండా కర్మనాచరించినపుడు మానవుడు ప్రత్యేకించి ఏ గుణకర్మనూ ఇష్టపడడు మరియు ఏ గుణకర్మనూ ద్వేషించడు. సందర్భౌచిత్యాన్ననుసరించి మూడు గుణకర్మలనూ ఆచరిస్తాడు. ఈ విధంగా అతని జీవితంలో మూడు గుణాలకూ సమాన ప్రాతినిధ్యం ఏర్పడుతుంది. ఏ ఒక్క గుణం కూడా మిగతా గుణాలకన్నా ఆధిక్యత నొందదు.. అంటే మౌలిక స్థాయికి ఎదగదు. ప్రతి గుణం కూడా మిగతా రెండు గుణాలకు చోటు పెట్టేంత పరిమిత స్థాయిలోనే అంటే ఆంశిక స్థాయిలోనే ఉండి అవి మూడునూ సమన్వయం చెందటం వలన సత్యావిష్కరణ జరుగుతుంది. ఈ విధంగా రాగద్వేషాలు లేకుండా కర్మాచరణ చేయటాన్నే ‘యజ్ఞం’ అంటారు.

సోదాహరణంగా మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ‘వ్యవస్థ’ అనే విషయాన్నే తీసుకుంటే తమోగుణ కర్మను ఇష్టపడే వారు ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. అలాగే రజోగుణ కర్మను ఇష్టపడే వారు ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. అలాగే సత్వగుణ కర్మను ఇష్టపడే వారు ‘వ్యక్తి’ ప్రయోజనాలు మాత్రమే నెరవేరాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ఏ ఒక్కరూ మిగతావారు ప్రతిపాదించే ప్రయోజనాల ఆవశ్యకతను ఏమాత్రం గుర్తించకపోగా వాటిని తీవ్రంగా ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు. తాము కోరుకునే ప్రయోజనాలతోటే వ్యవస్థ పరిపూర్ణమౌతుందని వీరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఫ్యూడల్ భావాలు కలిగిన పరిపాలకులు (తాలిబన్లు లాంటి ఇస్లామిక్ ఛాందసవాదులు) అనేక నిర్బంధాలతో తమ పరిపాలనను కొనసాగిస్తారు. స్త్రీజాతి మీద మరియు సాధారణ ప్రజానీకం యొక్క జీవనవిధానం మీద వీరు అనేక కట్టుబాట్లు, నిర్బంధాలు విధిస్తారు. అంటే వీరు ప్రజల మీద అధికారం ప్రదర్శిస్తూ ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. అంటే వీరు ‘తమోగుణ కర్మ’ యెడల వ్యామోహితులయ్యారు.

పెట్టుబడిదారీ పరిపాలకులు సమాజాన్ని, సమాజంలోని ఉత్పత్తి వనరులను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ఐతే వీరు అలా అభివృద్ధి చెందిన సమాజంలోని ఉత్పత్తి వనరులను సమాజంలో కొద్ది సంఖ్యలో ఉండే బూర్జువా వర్గపు స్వంత ఆస్థిగా మార్చి, సామాన్య ప్రజానీకాన్ని అమ్ముకోవటానికి తమ శరీర శ్రమ తప్ప మరేమీ లేని పేదవారిగా మార్చివేస్తారు. అంటే వీరు సమాజాన్ని అభివృద్ధి చేసి దాని యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. అంటే వీరు ‘రజోగుణకర్మ’ యెడల వ్యామోహితులయ్యారు.

సామ్యవాద పరిపాలకులు సమానత్వం పేరుతో, సామాన్య జనుల ప్రయోజనాల పేరుతో తమవైన ప్రతిభాపాటవాలు కలిగిన వ్యక్తులకు వాటిని నిరూపించుకునే అవకాశం (స్వేచ్ఛ) ఈయరు. అంటే వీరు ‘వ్యక్తి’ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్నారు. ఎందుకంటే వీరు ‘సత్వగుణకర్మ’ యెడల వ్యామోహితులయ్యారు… (సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి