8, సెప్టెంబర్ 2008, సోమవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---22 (గీతా వ్యాసాలు)





IV: యజ్ఞం (నిష్కామ కర్మ)

‘సత్యం’ సిద్ధ వస్తువు కాదు. అంటే సత్యం సహజ సిద్ధం (ready made) గా ఎక్కడా దొరకదు. మనకు అందుబాటులో ఉండేది త్రిగుణాత్మకమైన ఈ ‘జగత్తు’ మాత్రమే. ఈ జగత్తు నుండే సత్యాన్ని ‘నిష్కామకర్మ’ ద్వారా ఆవిష్కరించాలి. ఈ నిష్కామకర్మే గీతా శాస్త్రం (3వ అధ్యాయం) లో ‘యజ్ఞం’గా చెప్పబడింది.

దీనికొరకు మనం త్రిగుణాలకు సంబంధించి అతి ముఖ్యమైన ధర్మం ఒక దాని గురించి తెలుసుకోవాలి. అదేమంటే ‘త్రిగుణాలు మౌలిక స్థాయిలో పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆంశిక స్థాయిలో పరస్పరం సమన్వయం చెందుతాయి’. ఈ సమన్వయం ఫలితంగానే సత్యావిష్కరణ జరుగుతుంది.

త్రిగుణాలు మౌలిక స్థాయిలో వేటికవే ఒక ప్రమాణం (Single Unit) గా కొనసాగుతాయి. దీనివలన అవి తమకు విరుద్ధంగా ఉన్న ఏ ఇతర ప్రమాణాన్ని అంగీకరించవు; దేనినైనా ద్వేషిస్తాయి. ఈ కారణం చేతనే పరస్పర విరుద్ధమైన త్రిగుణాలు మౌలిక స్థాయిలో పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఈ పరస్పర సంఘర్షణ వలనే మౌలిక స్థాయిలో అవి సత్యావిష్కరణ చేయలేవు. అందుకే జగత్తు సత్యం కాదు. (జగత్తు త్రిగుణాల మౌలిక మిశ్రమం; సత్యం త్రిగుణాల ఆంశిక సమ్మేళనం)

ఆంశిక స్థాయిలో గుణాలు వేటికవే ఒక ప్రమాణంగా కొనసాగలేవు. అందువలన ప్రతి గుణం కూడా తనకు విరుద్ధంగా ఉన్న మిగతా రెండు గుణాలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. వాటితో సమన్వయం చెంది ఒకే ప్రమాణాన్ని ఏర్పరచాలని ఉవ్విళ్ళూరుతుంది. అంటే వైరుధ్యం అనే ఒకే లక్షణం మౌలిక స్థాయిలో సంఘర్షణకు, ఆంశిక స్థాయిలో సమన్వయానికీ కారణమగుచున్నది. అందువలనే పరస్పర విరుద్ధమైన త్రిగుణాలు ఆంశిక స్థాయిలో పరస్పరం సమన్వయం చెందుతాయి. ఆ సమన్వయం ఫలితంగా ఏర్పడేదే ‘సత్యం’.

అంటే ‘వైరుధ్యాల మధ్యన సమన్వయమే సత్యం’. విద్యుత్ శాస్త్రం (Electricity) లో ధన, ఋణ ఆవేశాల మధ్యన ఆకర్షణ; అయంస్కాంతత్వానికి (Magnetism) సంబంధించి సజాతి, విజాతి ధృవాల మధ్యన ఆకర్షణ; రసాయన బంధం (Chemical Bond)లో ఎలక్ట్రాన్, ప్రొటాన్‌ల మధ్యన ఆకర్షణ.. ఇవన్నీ కూడా వైరుధ్యాల మధ్యన సమన్వయానికి నిదర్శనాలే.

భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు మూడు.. అవి త్రిగుణాలు. కానీ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు రెండే.. అవి ‘వాదం’ (Thesis) మరియు ‘ప్రతి వాదం’ (Anti Thesis). ఈ రెంటి ‘సంశ్లేషణ’ (Synthesis) తో సత్యాన్ని సాధించడానికి పాశ్చాత్య తత్త్వశాస్త్రం (గతితార్కిక సిద్ధాంతం లేక Dialectic Theory) ప్రయత్నిస్తుంది. అంటే ‘వైరుధ్యాల మధ్యన సమన్వయమే సత్యం’ అనే విషయాన్ని అది కూడా అంగీకరిస్తుంది. కానీ వైరుధ్యాలు మూడు కాక రెండు అని అనుకోవడమే పాశ్చాత్య తత్త్వశాస్త్రం సత్యశోధనలో వైఫల్యం చెందటానికి కారణం.

భారతీయ తత్త్వశాస్త్రాన్నే పాశ్చాత్య పరిభాషలో చెబితే వైరుధ్యాలలో మూడవ దాని పేరు ‘విశ్లేషణ’ ( Analysis). అపుడు మూడు వైరుధ్యాల మధ్యన అంటే Thesis, Anti Thesis మరియు Analysis మధ్యన Synthesis జరిగి సత్యం ఆవిష్కరింపబడుతుంది. (సత్వ రజస్తమో గుణాలు మూడునూ యజ్ఞంలో పాల్గొని సత్యాన్ని ఆవిష్కరిస్తాయి అనే విషయాన్నే పాశ్చాత్య పరిభాషలో చెప్పామన్న మాట.)

సత్యాన్ని విశదీకరించే మూడు సూత్రాలలో చివరిసూత్రం ప్రకారం ‘జగత్తు నుండి సత్యాన్ని ఆవిష్కరించే సాధనం యజ్ఞం’. అంటే గుణాలు మౌలిక రూపంలో మిశ్రమంగా ఉండే జగత్తు నుండి అంశీభూత రూపంలో సమ్మేళనంగా ఉండే సత్యాన్ని ఆవిష్కరించడమే ‘యజ్ఞం’. సాధారణంగా యజ్ఞం అంటే మనకు తెలిసినది మండే యజ్ఞగుండం నలువైపులా ఋషులు పద్మాసన స్థితులై మంత్ర పఠనం చేస్తూ హవిస్సులు సమర్పిస్తారు. గీతలో చెప్పబడిన యజ్ఞం ఇది కాదు.అది సత్యావిష్కరణ కొరకు ఉద్దేశించిన నిష్కామ కర్మ. నిష్కామ కర్మే గీతా శాస్త్రంలో యజ్ఞం గా చెప్పబడింది.

యజ్ఞః కర్మసముద్భవః (అ.3-శ్లో.14)

యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తున్నది.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|

కర్మజాన్విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే|| (అ.4-శ్లో.32)

ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరించబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుండి విముక్తి పొందుతావు… (సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి