7, సెప్టెంబర్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---21(గీతా వ్యాసాలు)





II: జగత్ స్వరూపం

జగత్ స్వరూపాన్ని తెలుసుకొనటానికి ముందు మనం సత్యం గురించి చెప్పిన మూడు సూత్రాలలో మొదటి సూత్రాన్ని మరలా ఒకసారి చూద్దాం.

సత్వము, రజస్సు, తమస్సు అను పరస్పర విరుద్ధమైన మూడు గుణాల ‘మౌలిక మిశ్రమం’ ఈ జగత్తు.

ఈ సూత్రం ద్వారా మనం కర్మస్వరూపాన్ని మరియు జగత్ స్వరూపాన్ని రెంటినీ తెలుసుకోవచ్చని మొదటనే చెప్పుకున్నాం. ఇంతవరకూ కర్మస్వరూపం గురించి విపులంగా తెలుసుకున్నాం. ఇప్పుడు జగత్తు యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం.

జగత్తు త్రిగుణాత్మకమైనది. జగత్తులో గుణాలు మూడునూ వాటి మూల (Raw or Fundamental) రూపంలో మిశ్రమంగా ఉంటాయి. ఈ విషయమే పై సూత్రంలో ‘మౌలిక మిశ్రమం’అనే మాటద్వారా తెలియచేయబడింది. సత్యంలో ఈ గుణాలు ‘ఆంశిక’ (Componental) రూపంలొకి మారతాయి. ఇక ‘మిశ్రమం’ అంటే ఒకే ప్రకృతిలో అంతర్భాగాలుగా కొనసాగుతున్నా ఈ గుణాల మధ్యన ఏ విధమైన బంధమూ (Bond) ఉండదు. ఇవన్నీ విడివిడిగా ఉండి, అన్నీ కలసి ఒక రాశిగా ఉంటాయి. అందుకే దీన్ని ‘మిశ్రమం’ అన్నాము. సత్యంలో ఈ గుణాలు విడివిడిగా ఉండక అంశలుగా మారి ఒకటిగా బంధింపబడి ఒకే ‘ప్రమాణం’ (Single Unit) గా కొనసాగుతాయి. సత్యస్వరూపం గురించి చర్చించేటపుడు ఈ విషయాన్ని విపులంగా పరిశీలిద్దాం.

జగత్తులోని మూడు గుణాలలో ప్రతి ఒక గుణానికి కూడా ప్రాతినిథ్యం వహిస్తూ లెక్కకు మిక్కిలిగా గుణకర్మలు ఉంటాయి. ఈ విధంగా సత్వ రజస్తమో గుణాలు మూడింటికీ ప్రాతినిథ్యం వహిస్తూ అనంతమైన సంఖ్యలో గుణకర్మలుంటాయి (కొన్ని రకాల గుణకర్మలను ‘కర్మ స్వరూపం’ గురించి వివరించేటపుడు పేర్కొనడం జరిగినది). ఇవన్నీ కూడా అవి ప్రాతినిథ్యం వహించే త్రిగుణాల వలెనే ‘మౌలిక మిశ్రమం’గా జగత్తులో ఉంటాయి. ఒక గుణానికి ప్రాతినిథ్యం వహించే గుణకర్మలన్నీ కలసి ఒక గుణం. అటువంటి గుణాలు మూడు కలసి జగత్తు. ఈ విధంగా 'అనంతమైన గుణకర్మల సమూహమే జగత్తు’. ఇదే జగత్ స్వరూపం.

III: సత్య స్వరూపం

సత్యం మరియు భగవంతుడు ఒక్కటే అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే సత్యం అందరూ అంగీకరించిన విషయం. కానీ భగవంతుడిని నాస్తికులు అంగీకరించరు. సత్యం సర్వజనామోదమైనది. ‘మానవుడు సత్యాన్ని మాత్రమే ఆచరించాలి’ అనే విషయంలో సర్వమానవులూ సర్వకాలాలలోనూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ భగవంతుడి అస్తిత్వానికి సంబంధించిన విషయంలో ఇటువంటి ఏకాభిప్రాయం లేదు. దేవుడు ఉన్నాడు, లేడు అనే ఇరువర్గాలూ కూడా సర్వకాలాలోనూ ఉన్నాయి. దీనిని బట్టి మనం సత్యాన్ని భగవంతుడికన్నా వేరైనదిగా చర్చించవలసి ఉంటుంది. సత్యం ‘దైవ స్వరూపం’ అని మనం వ్యాఖ్యానిస్తే ఆస్తికులు మాత్రమే అంగీకరిస్తారు కానీ నాస్తికులు అంగీకరించరు. ఆఖరికి సత్యం ‘భగవంతుని చేరే మార్గం’అని కూడా మనం ఆస్తికులతోనే అనగలం కానీ నాస్తికులతో అనలేము.

మనకు ఆచరించటానికి కావలసినది సత్యమే. సర్వజనులకూ కావలసినది కూడా సత్యమే. కనుక ఆ సత్యాన్ని గురించే చర్చిద్దాం. సత్యాన్ని విశదీకరిస్తూ ఈ రెండవ అధ్యాయం యొక్క ప్రారంభంలో చెప్పిన మూడు సూత్రాలలో రెండవది ‘సత్య స్వరూపం’ గురించి చర్చిస్తుంది. దాని ప్రకారం ‘త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం’.

జగత్తును గుణాల ‘మౌలిక మిశ్రమం’ అన్నాం. సత్యాన్ని గుణాల ‘ఆంశిక సమ్మేళనం’ అన్నాం. మిశ్రమం (Mixture), సమ్మేళనం (Compound) అనే పదాలు రసాయన శాస్త్రం (Chemistry) నుండి తీసుకోబడ్డాయి.

‘మౌలిక’ అంటే జగత్తులో గుణాలు వాటి మూల రూపంలో ఉంటాయి. అంటే ముడిపదార్థాలుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మూలపదార్థాలైన గుణాల మధ్యన ఏ విధమైన సంబంధమూ (Bond) ఉండదు. దేనికదే విడివిడిగా ఉండి అన్నీ కలసి ఒక రాశిగా ఉంటాయి.అందుకే దీన్ని ‘మిశ్రమం’ అన్నాం. మిశ్రమంలో ఉండేవన్నీ భౌతికంగా కలగాపులగంగా కలసి ఉంటాయేగానీ వాటి మధ్యన ఏ విధమైన సంబంధం ఉండదు. వాటిని సులభంగా విడదీయవచ్చు. ఉదాహరణకు బియ్యం, రాళ్ళ మిశ్రమం.

‘ఆంశిక’ అంటే సత్యంలో గుణాలు వాటి ‘అంశ’(Component) ల రూపంలో ఉంటాయి.’అంశ’ అనేది తనలాంటి మరికొన్ని అంశలతో కలసి ఒక ‘ప్రమాణం’ (Single Unit)గా ఏర్పడుతుందే గానీ స్వయంగా తానే ఒక ప్రమాణంగా ఉండలేదు.అంశ అనేది ఒక పూర్ణత్వంలో ఒకానొక భాగస్వామి మాత్రమే గానీ తానొక్కటే స్వయంగా పూర్ణత్వం కాలేదు. ఈ విధమైన అంశల కలయిక వలన ఏర్పడిన ప్రమాణాన్నే ‘సమ్మేళనం’ అంటాం. సమ్మేళనంలో ఉండే మూలకాలన్నీ రసాయనచర్య ద్వారా బంధింపబడి ఉంటాయి. వాటిని సాధారణ పరిశ్రమతో విడదీయలేము. మిశ్రమంలో మూలకాలు వేటికవి విడిగానే ఒక ‘ప్రమాణం’గా చెప్పబడతాయి. సమ్మేళనంలోని వాటిని వేటికవి విడిగా చూడలేము. సమ్మేళనంలో మూలకాలన్నీ కలసి ఒకే పదార్థంగా చెప్పబడతాయి. ఉదాహరణకు ‘ఉదజని’ (Hydrozen), ‘ఆమ్లజని’ (Oxyzen) సమ్మేళనంగా కలిస్తే ‘నీరు’ (Water) ఏర్పడుతుంది. నీటిలో ఉదజని ఒక అంశ, ఆక్సిజన్ మరో అంశ. నీటిలో ఇవి రెండూ విడివిడిగా ఉండవు. అవి రసాయన బంధం ద్వారా బంధింపబడి ఉంటాయి. దాన్ని మనం నీరు అనే ఒకే పదార్ధంగా చూస్తాము.

అలాగే సత్యంలో గుణాలు ఆంశిక రూపంలో ఉండి సమ్మేళనంగా బంధింపబడి ఉంటాయి. జగత్తులో మూలరూపంలో మిశ్రమంగా ఉన్న మూడుగుణాలూ అంశలు (Components) గా మారి అవి మూడునూ సమానంగా కలసి ఒక సమ్మేళనంగా మారితే అంటే సత్వగుణం యొక్క అంశ, రజోగుణం యొక్క అంశ, మరియు తమోగుణం యొక్క అంశ.. ఇలా సమాన స్థాయి కలిగిన మూడు అంశలూ కలసిపోయి ఒక ప్రమాణం (Single Unit) గా, ఒక పూర్ణత్వంగా మారితే అదే ‘సత్యం’.

ఏ విషయానికైనా ఈ నిర్థారణను అనువర్తనం (application) చేయవచ్చు. ఏ విషయానికి చెందిన మూడు గుణకర్మలైనా పై విధంగానే అంశలుగా మారి సమాన స్థాయిలో కలిస్తే ఆ విషయంలో సత్యం ఆవిష్కరింపబడినట్లే. ఉదాహరణకు ‘మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరి’ అనే విషయాన్నే తీసుకుంటే తామస గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘అదుపు’, రాజస గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘స్వేచ్ఛ’, సాత్విక గుణకర్మకు ప్రాతినిథ్యం వహించే ‘ఉపేక్ష’.. ఇవి మూడునూ సమాన స్థాయి కలిగిన అంశలుగా మారి ఒకే ప్రమాణంగా కలిసిపోతే ఆ ప్రమాణమే ‘సత్యం’. సాధారణమైన మాటలలో చెప్పాలంటే ఆ వైఖరిలో అదుపు-స్వేచ్ఛ-ఉపేక్ష.. ఈ మూడు ధోరణులునూ సమానంగా వ్యక్తమైతే అదే సత్యం. గుణాలు అవి మిశ్రమంగా ఉండే మౌలిక స్థాయినుండి సమ్మేళనంగా ఉండే ఆంశిక స్థాయికి ఎలా మారతాయనేది ‘యజ్ఞ స్వరూపం’ లేక ‘నిష్కామ కర్మ’ను గురించి చర్చింటేటపుడు మనకు తేటతెల్లమవుతుంది…(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి