I. కర్మ స్వరూపం
జగత్తు (ప్రకృతి) త్రిగుణాత్మకమన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రకృతి లేక జగత్ సంబంధమైన సత్వము, రజస్సు, తమస్సు అను మూడు (త్రి) గుణాల వలనే సమస్త కర్మలూ జరుగుతున్నాయని గీతలో అనేకసార్లు చెప్పబడింది.
ప్రకృతేః క్రియామాణాని గుణైః కర్మాణి సర్వశః | (గీత:అ.3-శ్లో.27)
ప్రకృతి గుణాల వలన సర్వకర్మలు జరుగుతున్నాయి.
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః | (అ.13-శ్లో.30)
ప్రకృతి వల్లనే సమస్త కర్మలూ సాగుతున్నాయి.
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టనుపశ్యతి | (అ.14-శ్లో.19)
కర్మలన్నిటికీ గుణాలను తప్ప మరోదాన్ని కర్తగా భావించకూడదు.
I.A : కర్మ భావన-కర్తృత్వం
ఇప్పుడు 'కర్మ భావన' (Concept of Karma) గురించి పరిశీలిద్దాం. సాధారణంగా కర్మ అంటే మనకు ఉండే అవగాహన మానవుడు చేసే పని అని.అంటే కర్మకు కర్తృత్వం మనం మానవుడికి ఆపాదిస్తాము. కానీ సర్వకర్మలూ ప్రకృతి గుణాల వలనే జరుగుతున్నాయని గీతాకారుడు చెప్పినపుడు కర్మల యొక్క కర్తృత్వం ప్రకృతి గుణాలకు ఆపాదింపబడింది. గీతాకారుడు ఇలా ఎందువల్ల చెప్పాడో, దీని అసలు అర్థం ఏమిటో మనకు ఈ క్రింది నిర్ధారణల ద్వారా తెలుస్తుంది.
I.B : ప్రాతినిథ్యం-అనురూపాలు
‘గుణం వలన జరిగే కర్మ’ అంటే ‘గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మ’ అని అర్థం. అంటే ఒక కర్మ సత్వగుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే ఆ కర్మను సత్వగుణం వలన జరిగిన కర్మగా చెబుతాము. ఒక కర్మ రజోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే ఆ కర్మను రజోగుణం వలన జరిగిన కర్మగా చెబుతాము. అలాగే ఒక కర్మ తమోగుణానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే ఆ కర్మ తమోగుణం వలన జరిగిన కర్మగా చెబుతాము. దీనిని బట్టి సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాయని అర్థం.
ఏ కర్మైనా త్రిగుణాలలో ఏదో ఒక గుణానికి తప్పనిసరిగా ప్రాతినిథ్యం వహిస్తుంది. అంటే ఒక కర్మ సాత్వికమైనా అయి ఉండాలి లేదా రాజసమన్నా అయి ఉండాలి లేదా తామసమన్నా అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ మూడింటిలో ఏదో ఒకటి అయితీరాలి. ఈ మూడింటిలో దేనికీ చెందని కర్మ మూడు లోకాలలో ఎక్కడా ఉండదు.
మరో విషయమేమంటే ఏదేనీ ఒక గుణానికి చెందిన కర్మ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది. అంటే ఒక విషయానికి సంబంధించి సాత్విక కర్మ ఉంటే అదే విషయానికి సంబంధించి రాజస కర్మ ఉంటుంది. అలాగే అదే విషయానికి సంబంధించి తామస కర్మ కూడా ఉంటుంది. అలా మూడు గుణాలకు ప్రాతినిథ్యం వహించే ఈ మూడు కర్మలు కలసి ఏదో ఒక విషయాన్ని లేక ఏదో ఒక పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
ఈ రెండు నిర్థారణలను మనం కొన్ని ఉదాహరణల ద్వారా రూఢిపరచుకోవచ్చు.
‘వాతావరణం’ అనే విషయాన్ని తీసుకుంటే దాని యొక్క సాత్విక కర్మ ‘చలి’, దాని రాజస కర్మ ‘వర్షం’, దాని తామస కర్మ ‘ఎండ’. ఇక్కడ మూడు గుణకర్మలలోనూ సత్వ గుణకర్మ ఐన చలి, రజోగుణ కర్మ ఐన వర్షం, తమోగుణ కర్మ ఐన ఎండ.. ఈ మూడునూ కలసి ‘వాతావరణం’ అనే పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.
అలాగే ‘మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరి’అనే విషయాన్నే తీసుకుంటే దానికి సంబంధించి సాత్విక కర్మ ‘ఉపేక్ష’, రాజస కర్మ ‘స్వేచ్ఛ’, తామస కర్మ ‘అదుపు’.
మనం ఏదైనా సమాచారాన్ని ఇతరులకు చెప్పే సందర్భంలో సాత్విక కర్మ ‘నిజం’, రాజస కర్మ ‘అబద్ధం’, తామస కర్మ ‘ఏమీ చెప్పక పోవడం’.
‘వ్యవస్థ’ అనే విషయాన్నే తీసుకుంటే దానికి సంబంధించిన సాత్విక కర్మ ‘వ్యక్తి’, రాజస కర్మ ‘సమాజం’, తామస కర్మ ‘రాజ్యం’.
అలాగే జీవన విధానానికి సంబంధించి సాత్విక కర్మ ‘సంస్కరణ’(మార్పు), రాజస కర్మ ‘అభ్యుదయం’, తామస కర్మ ‘సంప్రదాయం’.
ఆలోచనా విధానానికి సంబంధించి సాత్విక కర్మ ‘హేతుబద్దత’, రాజస కర్మ ‘శాస్త్రీయత’, తామస కర్మ ‘విశ్వాసం’.
భాషకు సంబంధించి సాత్విక కర్మ ‘వాడుక భాష’,రాజస కర్మ ‘శిష్ట భాష’ (విద్యావంతులైన కొందరికే అర్థమయ్యే భాష, ఉదాహరణకు ఇంగ్లీషు), తామస కర్మ ‘పురాతన భాష’ (పురోహిత వర్గానికి తప్ప వేరెవ్వరికీ అర్థం కాని సంస్కృతం, లాటిన్, హీబ్రూ లాంటివి).
వ్యక్తి సమాజంలో మనుగడ సాగించేటపుడు అలవరచుకోవలసిన లక్షణాల విషయంలో సాత్విక కర్మ ‘విజ్ఞానం’, రాజస కర్మ ‘వ్యవహార దక్షత’, తామస కర్మ ‘శీలం’.
ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితికి సంబంధించి సాత్విక కర్మ ‘పచ్చిక బయలు’, రాజస కర్మ ‘దట్టమైన అడవులు’, తామస కర్మ ‘ఎడారి’.
ఉదకము యొక్క వివిధ రూపాలకు సంబంధించి సాత్విక కర్మ ‘మంచు’, రాజస కర్మ ‘నీరు’, `తామసకర్మ ‘ఆవిరి’.
భగవంతుని గురించి అభిప్రాయము తెలియజేయునపుడు సాత్విక కర్మ ‘భగవంతుడు లేడనుట’, రాజస కర్మ ‘భగవంతుడు మన కొరకు త్యాగము చేయుననుట’, తామస కర్మ ‘భగవంతుని కొరకు మనము త్యాగము చేయవలెననుట’.
దర్పణం యొక్క ఉపరితలం విషయంలో సాత్విక కర్మ ‘కుంభాకార’, రాజస కర్మ ‘సమతల’, తామస కర్మ ‘పుటాకార’.
ధనాన్ని ‘అసలు ఖర్చు చేయక పోతే’ అది సాత్విక కర్మ, ‘మితంగా ఖర్చు చేస్తే’ అది రాజస కర్మ, ‘ధారాళంగా ఖర్చు చేస్తే’ అది తామస కర్మ.
కాలం విషయంలో సాత్విక కర్మ ‘భవిష్యత్ కాలం’, రాజస కర్మ ‘వర్తమాన కాలం’, తామస కర్మ ‘భూత కాలం’…(సశేషం)
chakkani bhaasyam vraastunnaaru. dhanyavaadamulu
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు!
రిప్లయితొలగించండి