9, సెప్టెంబర్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---24 (గీతా వ్యాసాలు)



అలాగే మరో ఉదాహరణ చూద్దాం. జీవన విధానానికి సంబంధించి తమోగుణ కర్మను ఇష్టపడేవారు మానవుడు సాంప్రదాయకంగా, ఆచారపరాయణత్వంతో జీవించాలని కోరుకుంటారు. అలాగే రజోగుణకర్మను ఇష్టపడే వారు మానవుడు అభ్యుదయ భావాలతో, ఆధునికంగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సత్వగుణకర్మను ఇష్టపడేవారు మానవుడు సంప్రదాయాలను, ఆచారాలను కాలరాచి, కాలానుగుణమైన మార్పుతో జీవించాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ఏ ఒక్కరూ మిగతా వారి జీవన విధానం యొక్క ఆవశ్యకతను ఏ మాత్రం గుర్తించకపోగా వారిని తీవ్రంగా ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు.తమ జీవన విధానం మాత్రమే మానవునికి మేలు చేస్తుంది అని ఈ మూడు వర్గాలలో ప్రతి ఒకరు గాఢంగా నమ్ముతారు.

బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో ఈ విషయానికి సంబంధించి మనకు స్పష్టమైన ఉదాహరణలు దొరుకుతాయి. పూర్వాచార పరాయణులైన వారు సతీసహగమనం, బాల్యవివాహాలు చేయటం, సముద్రయానాన్ని అంగీకరించకపోవడం ఇత్యాది మూఢనమ్మకాలతో జీవించేవారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు ఆంగ్ల విద్య నభ్యసించి, ఇంగ్లీష్ వారి కట్టూబొట్టూ నేర్చి భారతీయతను హేళన చేసేవారు; చులకనగా చూసేవారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు సంఘసంస్కరణ పేరుతో వారివాదనలను సమర్ధించుకొనడానికి అపౌరుషేయాలైన వేదముల యొక్క ప్రామాణ్యాన్నే ధిక్కరించి తూలనాడేవారు. అంటే వీరు సత్వ గుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

భాషకు సంబంధించి ఒక ఉదాహరణ. సత్వ గుణకర్మను ఇష్టపడేవారు సాధారణ జనులకు సైతం అర్ధమయ్యే వాడుక భాషనే ప్రతి సందర్భంలోనూ వాడాలని కోరుకుంటారు. రజోగుణకర్మను ఇష్టపడేవారు విద్యావంతులైన కొందరికి మాత్రమే అర్ధమయ్యే ఇంగ్లీషు లాంటి భాషనే ప్రతి సందర్భంలోనూ వాడాలని కోరుకుంటారు. తమోగుణ కర్మను ఇష్టపడేవారు పురోహిత వర్గానికి తప్ప మరెవరికీ అర్ధం కాని వాడుకలో లేని సంస్కృతం లాంటి భాషనే వాడాలని కోరుకుంటారు. ఈ మూడు వర్గాలలో ప్రతి ఒక్కరూ మిగతా వారు ప్రతిపాదించే భాషలమీద తీవ్రస్థాయిలో దాడి చేస్తారు.

హేతువాదులు వివాహసందర్భంలో కూడా సంస్కృత మంత్రాలను వ్యతిరేకించి, అప్పుడు కూడా వాడుక భాషే వాడాలని పట్టుబడతారు. వారు జరిపించే వివాహాలు ఇలానే జరుగుతాయి. అంటే వీరు సత్వగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. ఛాందస పండితులు సామాన్య జనులందరికీ ఉపయోగపడవలసిన గ్రంథాలను సైతం కఠినమైన సంస్కృతంలోనో, గ్రాంథికంలోనో రాస్తారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు ఉన్నత స్థాయి విద్యావంతులు ప్రతి సందర్భంలోనూ ఇంగ్లీషు భాషే వాడతారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

పిల్లల పెంపకమే తీసుకోండి.. కొందరు క్రమశిక్షణ పేరుతో పిల్లలను తీవ్రనిర్భంధానికి గురిచేస్తారు. అంటే వీరు తమోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు అతి గారాబం చేసి వారు కోరిందల్లా సమకూర్చుతారు. అంటే వీరు రజోగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు. కొందరు పిల్లలను వారిమానాన వారిని గాలికి వదిలేస్తారు. అంటే వీరు సత్వగుణకర్మ ఎడల వ్యామోహితులయ్యారు.

సమాజంలో మనుగడ సాగించే మానవుడు అలవరచుకోవలసిన లక్షణాల విషయమే తీసుకోండి. కొందరు విజ్ఞానాన్ని సముపార్జిస్తే చాలనుకుంటారు. అంటే వీరు సత్వగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు లౌక్యాన్ని, వ్యవహారదక్షతను అలవరచుకుంటే చాలనుకుంటారు. అంటే వీరు రజోగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరికొందరు మంచి నడవడిక (శీలం) కలిగి ఉంటే చాలనుకుంటారు. అంటే వీరు తమోగుణకర్మను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణలన్నింటిలో కూడా మనకు కనిపిస్తున్నది ఒకటే. వీరంతా గుణాలకు మౌలిక స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎందుకంటే గుణాలు మూడింటిలో ప్రతి ఒకటి కూడా మౌలిక స్థాయిలో మిగతా గుణాలకు చోటు పెట్టకుండా దేనికదే పూర్తిస్థాయి ప్రమాణంగా (Unit) కొనసాగతుంది. ఈ కారణం చేత మౌలిక స్థాయిలో గుణాలు మూడూ పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి. దీనికనుగుణంగా ఈ మూడు వర్గాలూ కూడా తమదే సరైన మార్గమంటే తమదే సరైన మార్గమంటూ పరస్పరం ద్వేషించుకుంటూ, కలహించుకుంటూ ఉంటాయి.

మౌలిక స్థాయి కనుక ముగ్గురిలోనూ మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. కానీ ప్రతి ఒకరు తమలోని మంచిని, ఎదుటివారిలోని చెడుని మాత్రమే చూస్తారు. దీనికి కారణం రాగద్వేషపూరితమైన మనస్సే. అంటే తమకిష్టమైన గుణకర్మల ఎడల రాగం, తద్వ్యతిరిక్తమైన మిగతా రెండు గుణకర్మల ఎడల ద్వేషం. రాగం తమలోని చెడుని చూడనివ్వదు; ద్వేషం ఎదుటివారిలోని మంచిని చూడనివ్వదు. వీరి కలహానికి అంతే ఉండదు. వీరినిలాగే వదిలేస్తే యుగాంతం వరకూ ద్వేషించుకుంటూనే ఉంటారు.

ఈ విధంగా వీరంతా సత్యానికి దూరమయ్యారు. దీనికంతటికీ కారణం వీరు మూడు గుణాలలో ఒకానొక గుణం యొక్క ఆకర్షణకు లోబడి దాని మీద కోరికను పెంచుకోవడం. దాని ప్రలోభానికి లొంగిపోవటం. తద్వ్యతిరిక్త గుణాలమీద అనిష్టత పెంచుకోవటం. దీనినే ‘కామం’ అంటారు.


V: కామం

‘కామం’ గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది.

అర్జున ఉవాచ:

అథ కేన ప్రయు క్తోయం పాపం చరతి పూరుషః |

అనిచ్ఛ న్నపి వార్ష్ణేయ బలా దివ నియోజితః || (అ.3-శ్లో.36)

అర్జునుడు: కృష్ణా! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు?(తనకు ఇష్టం లేకపోయినా అంటే తన ‘జీవేచ్ఛ’కు వ్యతిరేకంగా అని; ఈ ‘జీవేచ్ఛ’ అంటే ఏమిటో ముందు ముందు వివరించబడుతుంది.)


శ్రీ భగవానువాచ:

కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః |

మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం || (అ.3-శ్లో.37)

భగవానుడు: రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకు మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామమూ, మహా పాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మానవుడికి మహా శత్రువులు.



ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ |

యథోల్బేనావృతో గర్భః తథా తేనేద మావృతం || (అ.3-శ్లో.38)

పొగ అగ్నినీ, మురికి అద్దాన్నీ, మావి గర్భంలోని శిశువునూ కప్పివేసినట్లు కామం ఆత్మ జ్ఞానాన్ని ఆవరించింది.



ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా |

కామరూపేణ కౌంతేయ ! దుష్పూ రేణానలేన చ || (అ.3-శ్లో.39)

అర్జునా! ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మ జ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది.



ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్టానముచ్యతే |

ఏతై ర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినం || (అ.3-శ్లో.40)

ఈ కామానికి ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహధారులకు మోహం కలగజేస్తున్నది.



తస్మాత్త్వ మింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ! |

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశినం || (అ.3-శ్లో.41)

అర్జునా ! అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని, జ్ఞాన విజ్ఞానాలను నాశనంచేసే కామమనే పాపిని పారద్రోలు.



ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః |

మనస్తసు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || (అ.3-శ్లో.42)

దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటే మనస్సు శ్రేష్టం. మనస్సు కంటే బుద్ధి అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ.



ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మన మాత్మనా |

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం || (అ.3-శ్లో.43)

అర్జునా ! ఇలా బుద్ధికంటే ఆత్మ గొప్పదని గుర్తించి, బుద్ధితోనే మనస్సు నిలకడచేసుకుని, కామరూపంలో ఉన్న జయించరాని శత్రువును రూపుమాపు… (సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి