12, సెప్టెంబర్ 2008, శుక్రవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---26 (గీతా వ్యాసాలు)



అటువంటి జీవేచ్ఛ నెరవేర్చుకొనుటకొరకు మానవునికి మార్గదర్శియై నిలచేదే యజ్ఞం.ప్రతి మానవుడిని అతని జన్మాదిగా యజ్ఞం వెన్నంటే ఉంటుంది.ఇది అతని సత్య కర్మాచరణకు,సత్య నిర్మాణానికి మార్గదర్శిగా ఉంటుంది.


సహ యజ్ఞాః ప్రజా స్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |

స్నేన ప్రసవిష్యధ్వం ఏష వో స్త్విష్ట కామధుక్ || (అ.3-శ్లో.10)

బ్రహ్మ ఆదియందు ప్రజలను సృష్టించినపుడే యజ్ఞమును కూడా సృష్టించి వారితో నిట్లనియె. “ఈ యజ్ఞమే కామధేనువు వలే మీ సమస్త వాంఛితములను పూర్ణమొనర్చును. దీనినాశ్రయించి మీరు పురోభివృద్ధి నొందుదురు గాక !”


యజ్ఞం యొక్క మార్గదర్శకత్వం ప్రతి మానవునికి అతని హృదయానుభూతి ద్వారా వ్యక్తమవుతూనే ఉంటుంది. రాగ ద్వేష పూరిత మనస్కుడు ఈ హృదయానుభూతి తెలుసుకోలేడు. అతడు తన మనసులో చెలరేగిన కోరిక మేరకు తానిష్టపడిన, తననాకర్షించిన గుణకర్మనే చేస్తూ సత్యానికి దూరమై, ఆ గుణకర్మ బంధంలో చిక్కుకుపోతాడు. కానీ రాగ ద్వేషాలు లేని గుణాతీతుడు హృదయానుభూతి ద్వారా యజ్ఞం యొక్క మార్గదర్శకత్వంలో కర్మలాచరిస్తాడు. రాగద్వేషాల తో కల్లోలితం కాకుండా మనస్సు ఉన్నపుడే మానవుడు హృదయానుభూతిని తెలుసుకోగలడు. యజ్ఞార్థం కర్మలు చేయగలడు. ఈ విధంగా యజ్ఞం ఒక మానవుడికి ఏది సత్యమో అదే ఆచరించేటట్లుగా ప్రేరేపిస్తుంది; ఒక మనిషి జీవేచ్ఛ నెరవేరటానికి సహకరిస్తుంది. (“ఈ యజ్ఞమే కామధేనువువలే మీ సమస్త వాంఛితములను పూర్ణమొనర్చును” అన్న మాటలో వాంఛితములంటే జీవేచ్ఛ పరిధిలోకి వచ్చే కోరికలని అర్థం)

హృదయానుభూతి అనే భావనను అర్థం చేసుకోవటానికి సొదాహరణంగా ప్రయత్నిద్దాం. ఏదైనా గట్టి దారానికి కొద్దిగా బరువున్న వస్తువు నేదైనా వ్రేలాడదీసిన దానిని మనం భౌతిక శాస్త్ర పరిభాషలో ‘లఘులోలకం’ (Simple Pendulam) అంటాం. ఈ లఘులోలకం దానిమీద బాహ్యబలం (External Force) పని చేస్తున్నంత కాలం అది అటునిటు ఊగుతూ డోలనాలు (Simple Harmonic Motion) చేస్తూనే ఉంటుంది. ఈ External Force ఉన్నా, లేకున్నా కూడా ఈ లఘులోలకం మీద నిరంతరం పనిచేస్తూ మరొకబలం ఉంటుంది. అదే Gravitational Pull. ఈ Gravitational pull లఘులోలకాన్ని చలనరహితంగా, స్థిరంగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ఐతే బాహ్యబలం పని చేస్తున్నంత కాలం ఈ ఉద్దేశ్యం నెరవేరదు. ఎందుకంటే బాహ్యబలం Gravitational Pull కన్నా ప్రబలమైనది. ఐతే బాహ్యబలం తాత్కాలికమైనది. ఇది తొలగి పోగానే ఎల్లప్పుడూ ఉండే Gravitational Pull వలన లఘులోలకం డోలనాలు లేకుండా స్థిరంగా ఉంటుంది.

Simple Pendulam యొక్క చలనాలే మనసు యొక్క చాంచల్యం. Gravitational Pull హృదయానుభూతి. మనశ్చాంచల్యం అణగగానే హృదయానుభూతి దానంతటదే అనుభూతిలోకి వస్తుంది. దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన పనిలేదు. అది ప్రతి మానవుడిలోనూ ఎల్లప్పుడూ ఉండేదే. అది నిరంతరం ఉండి ప్రతిమానవుడిని సత్యమార్గంలో నడపడానికి ప్రయత్నిస్తుంది. ఐతే మనశ్చాంచల్యం భగదనుభూతికన్నా భౌతికంగా ప్రబలమైనది. అందువలన అది ఉన్నంతకాలం ఈ అనుభూతి అనుభవంలోకి రాదు. ఐతే ఈ అశాశ్వతమైన మనశ్చాంచల్యాన్ని సత్సంకల్పంతో, అభ్యాసంతో అణచివేయవచ్చు. అది అణగి పోగానే శాశ్వతమైన హృదయానుభూతి దానంతటదే అనుభవంలోకి వస్తుంది.

అలాగే తాత్కాలికమైన మేఘాలు తొలగగానే శాశ్వతమైన నిర్మలాకాశం దృగ్గోచరమైనట్లు మనోమాలిన్యం తొలగగానే నిరంతర వాహిని అయిన భగవదనుభూతి దానంతటదే అనుభవంలోకి వస్తుంది.

మనశ్చాంచల్యం ఉన్నంతకాలం మానవుడు దాని ప్రకారమే కర్మాచరణ చేస్తాడు. అసత్య మార్గంలో పయనిస్తాడు. ఆ హోరుగాలిలో అతనికి మంద్రమైన హృదయనాదం వినిపించదు. ఎప్పుడైతే ఈ మనశ్చాంచల్యం అణగిందో అప్పుడు మానవుడు ఆ Devine Pull కి లోబడతాడు. అపుడు దాని ప్రకారం కర్మాచరణ చేస్తాడు.

అంటే మానవునికి కర్మాచరణ ఎప్పుడూ తప్పదు. ఐతే ఆ కర్మాచరణ మనోచలనాలకు లోబడి చేయాలా లేక హృదయానుభూతికి లోబడి చేయాలా అన్నదే సమస్య.

ప్రతి మనిషీ సత్యాన్నే పొందాలి.. సత్యాన్నే ఆచరించాలి. సత్యం ‘యజ్ఞం’ ద్వారా మాత్రమే నిర్మింపబడుతుంది. యజ్ఞం హృదయానుభూతి ద్వారా అభివ్యక్తం అవుతుంది. అంటే యజ్ఞం యొక్క మార్గదర్శకత్వం ప్రతిమానవునికి అతని హృదయానుభూతిద్వారా వ్యక్తమౌతుంది. కనుక సత్యాన్ని కోరేవారు మనసు యొక్క ఇష్టానిష్టాలననుసరించి కాక హృదయానుభూతికి లోబడి మాత్రమే కర్మ చేయాలి. అదే గీతలో యజ్ఞార్థం కర్మ చేయడంగా చెప్పబడింది.


యజ్ఞార్ధాత్ కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః |

తదర్ధం కర్మ కౌంతేయ ! ముక్తసంగః స్సమాచర || (అ.3-శ్లో.9)

కుంతీ పుత్రా ! యాగసంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసార బంధం కలుగ చేస్తాయి.కనుక ఫలాపేక్ష లేకుండా యజ్ఞార్ధమే కర్మలాచరించు.


ఏ విషయమైనా త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే పరస్పర విరుద్ధమైన మూడు అనురూప గుణకర్మలు గా ఉంటుందని మనకు తెలుసు. కామి కర్మాచరణకు పూనుకున్నపుడు తనకిష్టమైన గుణకర్మను ఎంచుకుని దాన్నే ఆచరిస్తాడు. నిష్కామి అలా కాక యజ్ఞం సూచించే గుణకర్మ నెంచుకుంటాడు. అంటే నిష్కామికి తన ఇష్టానిష్టాలు ఉండవు. యజ్ఞమేది చెబితే అదే ఆచరిస్తాడు. ఆనుగా ఏ ఒక్క కర్మనూ సంకల్పించడు (సర్వారంభ పరిత్యాగీ) యజ్ఞం సందర్భౌచిత్య్యాన్ననుసరించి ఒక్కొకసారి సత్వగుణ కర్మను, ఒక్కొకసారి రజోగుణకర్మను, ఒక్కొకసారి తమోగుణకర్మను; ఈ విధంగా ఒక్కొకసారి ఒక్కొక గుణకర్మను సూచిస్తుంది. నిష్కామి వాటిని ఆచరిస్తుంటాడు. ఈ విధంగా మూడు గుణాలకూ సమాన ప్రాధాన్యం ఏర్పడి సత్యనిర్మాణం జరుగుతుంది. మానవుని జీవేచ్ఛ నెరవేరుతుంది. ఈ విధమైన కర్మాచరణవలన ఏ విధమైన కర్మబంధాలలోనూ మానవుడు చిక్కుకోడు… (సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి