I.C: వైరుధ్యం
కర్మ యొక్క ధర్మాలను నిర్దేశించే మరో ముఖ్యమైన విషయమేమంటే జగత్తులోని సత్త్వ రజ స్తమో గుణాలు మూడునూ పరస్పర విరుద్ధమైనవి (Mutual Opponents).
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|
రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా|| (అ.14-శ్లో.10)
అర్జునా! రజోగుణాన్నీ, తమోగుణాన్నీ అణచివేసి సత్వ గుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్త్వ తమోగుణాలను అణచివేసి రజోగుణమూ, సత్వరజో గుణాలను అణగ ద్రొక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.
అంటే ఈ మూడు ప్రకృతి గుణాలలో ప్రతి ఒక్కటి మిగతా రెండింటికీ విరుద్ధంగా ఉంటుంది. ఇవి మూడునూ ఒకే ప్రకృతిలో భాగస్వాములైననూ పరస్పరం విరుద్ధమైనవిగా ఉంటాయి. అలానే ఈ గుణాల వలన జరిగే కర్మలు అనగా ఈ గుణాలకు ప్రాతినిథ్యం వహించే కర్మలు మూడునూ కూడా ప్రతిఒక్కటి మిగతా రెండింటికీ విరుద్ధంగా ఉంటాయి. ఐనా కూడా ఇవి మూడునూ కలసి ఒకే విషయాన్ని లేక ఒకే పరిస్థితిని సూచిస్తాయి.
ఉదాహరణకు మన అధీనుల ఎడల మనం అవలంబించవలసిన వైఖిరినే తీసుకుంటే తమోగుణం అదుపు చేయమంటే రజోగుణం అందుకు విరుద్ధంగా స్వేచ్ఛనీయమంటుంది. సత్త్వగుణం ఈ రెంటికీ కూడా విరుద్ధంగా ఉపేక్ష చూపమంటుంది. అలానే జీవన విధానానికి సంబంధించి తమోగుణం గతంలో ఉన్నదానినే ఆచరిస్తూ సంప్రదాయబద్ధంగా జీవించమంటే రజోగుణం దీనికి విరుద్ధంగా గతంలో ఉన్నదానిని అభివృద్ధిపరచి అభ్యుదయంతో ఆధునికంగా జీవించమంటుంది. సత్వగుణం ఈ రెండు విధానాలకూ కూడా విరుద్ధంగా గతంలో ఉన్నదానిని సమూలంగా మార్చి (Radical Change), సంస్కరించి మార్పుతో జీవించమంటుంది. ఈ విధంగా ఏ గుణకర్మ ఐనకూడా తన అనురూపాలైన మిగతా రెండు గుణకర్మలకు విరుద్ధంగా ఉంటుంది.
I.D: రాగద్వేషాలు
ఇప్పుడు ఈ గుణకర్మల మరో ధర్మమైన ‘సమ్మోహనత్వం’ గురించి చర్చించుకుందాం. అంటే ఈ గుణకర్మలు మూడింటికి కూడా మానవుడి మనసును ఆకర్షించగల, సమ్మోహన పరచగల లక్షణం ఉంది. ప్రతి గుణకర్మ కూడా తనదైన ఆకర్షణను కలిగి ఉంటుంది. దేని ఆకర్షణ దానిదే.
ప్రకృతే ర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు |
తా నకృత్స్నవిదో మందాన్ కృత్సవిన్న విచాలయేత్|| (అ.3-శ్లో.29)
ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులూ, మందబుద్ధులూ అయిన వాళ్ళ మనస్సులను జ్ఞానులు చలింపచేయకూడదు.
త్రిభిర్గుణమయై ర్భావై ఏభిస్సర్వమిదం జగత్|
మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయం|| (అ.7-శ్లో.13)
ఈ మూడుగుణాల ప్రభావం వల్ల ప్రపంచమంతా భ్రమ చెంది, వాటి కంటే విలక్షణుడిగా, వినాశం లేని వాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది.
స్వాధీన మనస్కులు కాని వారెవరైనా కూడా తన స్వభావానుసారంగా ఏదో ఒక గుణం యొక్క వ్యామోహంలో చిక్కుకొని ఆ గుణానికి చెందిన కర్మలనే అధికంగా చేస్తారు. ఐతే ఒక గుణ కర్మ యొక్క వ్యామోహంలో చిక్కుకున్న మానవుడు దాని అనురూపాలైన మిగతా రెండు గుణకర్మల ఆకర్షణకు లోబడడు; పైగా తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నందువలన వాటిని ద్వేషిస్తాడు.
ఉదాహరణకు జీవన విధానానికి సంబంధించి తమోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే సంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న సత్వ, రజో గుణాలను, వాటికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ జీవన విధానాన్ని మరియు సంస్కరణయుత జీవన విధానాన్ని ద్వేషిస్తాడు.
అదే రజోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ మరియు ఆధునిక జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న సత్వ, తమో గుణాలను మరియు వాటికి ప్రాతినిథ్యం వహించే సంస్కరణయుత జీవన విధానాన్ని మరియు సంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని ద్వేషిస్తాడు.
అలాగే సత్వగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు దానికి ప్రాతినిథ్యం వహించే సంస్కరణయుత జీవన విధానాన్ని ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న రజస్తమో గుణాలను మరియు వాటికి ప్రాతినిథ్యం వహించే అభ్యుదయ మరియు సాంప్రదాయక జీవన విధానాలను ద్వేషిస్తాడు.
అలాగే ఆలోచనా విధానానికి సంబంధించి తమోగుణం యొక్క సమ్మోహనత్వానికి లోనైన మానవుడు విశ్వాసాలను, నమ్మకాలను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన శాస్త్రీయతను, హేతుబద్దతనూ ద్వేషిస్తాడు. రజోగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు శాస్త్రీయతను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన విశ్వాసం, హేతుబద్దతలను ద్వేషిస్తాడు. సత్వగుణం యొక్క వ్యామోహంలో పడిన మానవుడు హేతుబద్దతను ఇష్టపడుతూ దానికి విరుద్ధంగా ఉండే మిగతా రెండు గుణాలకు చెందిన విశ్వాసం, శాస్త్రీయతలను ద్వేషిస్తాడు.
ఏ గుణకర్మ విషయమైనా ఇదే విధంగా ఉంటుంది. మానవుడు తనను సమ్మోహన పరచిన లేక తాను వ్యామోహానికి లోనైన గుణకర్మను ఇష్టపడుతూ, దానినే అధికంగా ఆచరిస్తూ తాను ద్వేషించే దాని యొక్క మిగతా రెండు అనురూపాలను సాధ్యమైనంతవరకు ఆచరించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు.
ఈవిధంగా మూడు గుణకర్మలూ పరస్పర విరుద్ధంగా ఉండి, ప్రతి గుణకర్మ కూడా తనదైన సమ్మోహనత్వాన్ని కలిగి మానవులలో రాగద్వేషాలకు కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని ‘నిష్కామకర్మ’ గురించి చర్చించుకునేటపుడు మరింత విపులంగా తెలుసుకుందాము.
ఇంతటితో ‘కర్మస్వరూపం’ గురించిన చర్చ ముగిసినట్లే. సంక్లిష్టమైన కర్మస్వరూపం గురించి తెలుసుకున్న తరువాత జగత్ స్వరూపం, సత్యస్వరూపం మరియు నిష్కామకర్మ స్వరూపం మొదలైన వాటి గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు సుదీర్ఘమైన ఈ చర్చలోని ప్రధానాంశాలను ఒకసారి పరికిద్దాం.
1.’గుణం వలన జరిగే కర్మ’ అంటే ‘గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మ’ అని అర్థం. సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయని అంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం వహిస్తున్నాయని అర్థం.
2.ఏ కర్మైనా త్రిగుణాలలో ఏదో ఒక గుణానికి తప్పనిసరిగా ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ మూడింటిలో దేనికీ చెందని కర్మ మూడులోకాలలో ఎక్కడా ఉండదు.
3.ఏదేనీ ఒక గుణానికి చెందిన కర్మ మిగతా రెండు గుణాలలోనూ తన అనురూపాలను కలిగి ఉంటుంది.
4.సత్వ రజస్తమో గుణాలు మూడునూ పరస్పర విరుద్ధమైనవి (Mutual Opponents). అదే విధంగా ఏ గుణకర్మ ఐనా కూడా తన అనురూపాలైన మిగతా రెండు గుణకర్మలకు విరుద్ధంగా ఉంటుంది.
5.ఈ గుణకర్మలు మూడింటికి కూడా మానవుడి మనసును ఆకర్షించగల, సమ్మోహనపరచగల లక్షణం ఉంది. ప్రతి గుణకర్మ కూడా తనదైన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఈ లక్షణమే మానవులలో రాగద్వేషాలకు కారణమగుచున్నది… (సశేషం)
అద్భుతంగా ఉంది. కానీ సంక్లిష్టంగా కూడా ఉంది. రెండు సార్లు చదవ వలసి వచ్చింది.
రిప్లయితొలగించండిఇంతకు ముందువన్నీ ప్రింట్ తీసి ఒకేసారి మొత్తం చదవాలి.(భారత దేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి భాగాలన్నీ)
సుజాత గారూ!
రిప్లయితొలగించండిఈ వ్యాసావళి ఎక్కువమందిని ఆకట్టుకునే సబ్జెక్ట్ కాదు. కనుకనే కొద్దిమందే చదువుతున్నారు. ఆ కొద్దిమందిలో మీరున్నందుకు సంతోషం. మీరు చదవటంలేదేమో అనుకున్నాను.
ఈ వ్యాసాలు రాయడంలో నా ఉద్దేశాలు రెండు. ఒకటి: మీలాంటి కొద్దిమందైనా చదువుతారని. రెండు: ఈ వ్యాసాలను అందరికీ అందుబాటులో ఉండే ఒక పర్మినెంట్ అడ్రస్‌లో పొందుపరచడం.
నేను ఈ వ్యాసాలకు ఎక్కువ కామెంట్లను ఆశించడం లేదు. కానీ మీలాంటి వారెవరైనా కనీసం ఒక కామెంటైనా చేస్తారేమోనని ఆతురతతో ఎదురు చూస్తుంటాను. మీ కామెంట్ నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. 'బావుంది '.. 'బాగా రాస్తున్నారు '.. 'మంచి విషయం రాస్తున్నారు ' లాంటి కాజువల్ కామెంట్లలా కాకుండా మీ కామెంట్ మీ 'మనసులో మాట ' చెప్పినట్లుగా ఉంది. నిజంగా అది చదవగానే నాకు సన్మానం జరిగినట్లుగా ఫీలయ్యాను. మీకు మరీ మరీ ధన్యవాదాలు.
ఇక వ్యాసాలలో సంక్లిష్టత అంటారా.. సబ్జెక్ట్ అటువంటిది మరి. అప్పటికీ విశదంగా వివరించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను(ప్రయత్నిస్తున్నాను).
అన్నట్టు మీకో విషయం చెప్పాలి. మీరు గమనించారో లేదో మీ ఊరివాళ్ళు మరొకరు పెరిగారు. 'ఈమాట ' వెబ్జైన్ లో 'ఏటి ఒడ్డున ' అనే కవిత రాసినది మీ NRT కే చెందిన వైదేహి శశిధర్.
సరస్వతీ కుమార్ గారు,
రిప్లయితొలగించండినేను నా బ్లాగులు సరదాగా రాసినా, చాలా సీరియస్ రీడర్ని!(అనుకుంటూ ఉంటాను ) భారత దేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి అనే ఈ పరంపరను నేను మొదటినుంచి ఫాలో అవుతున్నాను. మీరు చెప్పినట్టు ఇది అందరూ ఎంజాయ్ చేసే సబ్జెక్టు కాకపోవడం వల్ల, సీరియస్ విషయం కావడం వల్ల,పైగా మీరు ఉత్తమస్థాయి భాషలో రాస్తుండటం వల్ల, రెండేసి సార్లు చదవాల్సి వస్తున్నది. అదే చెప్పాను.ముఖ్యంగా తత్వ శాస్త్ర భావాలు, ఆట్టే కొరుకుడు పడవు కదా, న్యూస్ పేపర్ చదివినంత ఈజీగా! (ఇలాంటి సీరియస్ సబ్జెక్టులు కూడా రాసే వారున్నారా బ్లాగర్లలో అని నా మిత్రుడొకరు ఆశ్చర్యపోయారు మీ బ్లాగు నిన్న నాతోపాటు చూస్తూ)
ఇకపోతే వైదేహి గారు నాకు స్నేహితురాలే! మాలతి గారి ద్వారా పరిచయం! ఆమె కూడా మాది ఆ వూరే అని మాలతి గారి ద్వారా తెలుసుకుని నాతో పరిచయం చేసుకున్నారు. కాకపోతె వైదేహి కవిత చదవలేదు. బ్లాగులు చదవడానికే టైం సరిపోవడం లేదు.చదివి నా అభిప్రాయం రాయాలి.
మా వూరు అని నేను తరచుగా వాడటాన్ని బట్టి నాకు ప్రాంతీయాభిమానం మరీ ఎక్కువనుకునేరు, అదేం లేదండీ, సరదాగా అంటుంటాను, అంతే!