26, జూన్ 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---5





సమస్యగా పరిణమించిన పరిష్కారం

మొదటే చెప్పినట్లుగా ఇస్లాం అనేది అప్పుడు నెలకొన్న సామాజిక పరిస్థితులకు ప్రతిక్రియగా తలయెత్తినది. అప్పట్లో రాజ్యవ్యవస్థ యొక్క ప్రయోజనాలకు విపత్తు వాటిల్లింది. నిజానికి వ్యవస్థలో ‘రాజ్యం’, ‘సమాజం’, ‘వ్యక్తి’ అనే మూడు అంగాలున్నా అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజ్య వ్యవస్థకు మాత్రమే ప్రమాదం వాటిల్లినట్లుగా భావించబడింది. అందువలన సక్రమమైన వ్యవస్థకు మూడింటి ప్రయోజనాలూ సమంగా నెరవేరవలసి ఉన్నా కూడా రాజ్యం యొక్క ప్రయోజనాలను మాత్రమే ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఇస్లాం ఆవిర్భవించింది.దీనికి అనుగుణంగానే ఇస్లాంలో అతి శక్తివంతమైన రాజ్యవ్యవస్థ ఏర్పడింది.

‘రాజ్యం’ రీత్యా ఇస్లాం అఖండ విజయాలు సాధించినా వ్యవస్థలోని మిగతా అంగాలైన ‘సమాజం’ మరియు ‘వ్యక్తి’ ల యొక్క ప్రయోజనం నెరవేరలేదు.

ఐతే ఈసారి కూడా చరిత్ర పునరావృతమైనది. అరాచక పరిస్థితులలో ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే ప్రమాదంలో పడినట్లుగా ఏవిధంగా భావించబడిందో అదేవిధంగా ఇస్లామిక్ వ్యవస్థలో ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే ప్రమాదంలో పడినట్లుగా గోచరించింది.

‘వ్యక్తి’ ప్రయోజనాలు మరుగున పడటం ఇక్కడ ఒక దోషమైతే ‘రాజ్యం’ ఒక దోషిగా ఆవిష్కృతమైనది. అంటే ‘వ్యక్తి’ ప్రయోజనాలు ఇంకా తెరమీదకు రాలేదు. ‘రాజ్యం’ ప్రయోజనాలు తెరమరుగయ్యాయి. ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు కొత్తగా తెరమీదకు వచ్చాయి. ఇక్కడ రాజ్యమే ఒక సమస్యగా పరిణమించింది. అరాచకం ఒక సమస్య ఐనపుడు దానికి పరిష్కారంగా ‘రాజ్యం’ ఆవశ్యకత గుర్తించబడినది. కానీ అదే ‘రాజ్యం’ మితిమీరినపుడు పూర్తిగా వ్యతిరేకించబడినది. స్వయంగా తానే ఒక సమస్యగా గుర్తించబడింది.

ఇస్లాంలో శక్తివంతమైన రాజ్యవ్యవస్థ నాణానికి ఒక పార్శ్వమైతే, అది సామాజిక వికాసాన్ని మరియు వ్యక్తి స్వేచ్ఛను నిర్లక్ష్యం చేయటం రెండవ పార్శ్వం. వాస్తవానికి సమాజం, వ్యక్తి అనే రెండు అంగాలూ నిర్లక్ష్యం చేయబడ్డా బాహ్యదృష్టికి సమాజం ప్రయోజనాలు మాత్రమే ప్రమాదంలో పడినట్లుగా గోచరించినది. రాజ్యం యొక్క మితిమీరిన అధికారం వలన, నిర్బంధం వలన సమాజం యొక్క వికాసం కుంటుపడింది. అధికారం రాజ్యం యొక్క లక్షణమైతే, అభ్యుదయం సమాజం యొక్క లక్షణం. వికాసమే సమాజానికి కావలసినది. ఐతే రాజ్యం యొక్క మితిమీరిన చర్యలవలన సమాజవికాసానికి అది విపత్తుగా పరిణమించింది.దీనితో ఒకప్పుడు రాజ్యాన్ని పరిష్కారంగా గుర్తించిన ప్రతిక్రియాత్మకమైన మానవదృష్టికి ఇప్పుడు అదే రాజ్యం ఒక సమస్యగా గోచరమైనది.

అరాచకమనే సమస్యకు పరిష్కారంగా రాజ్యశక్తి నిర్మాణాన్ని ఇస్లాం ప్రతిపాదించి ఆచరించి చూపింది. కానీ కాలగతిలో ఆచరణలో రాజ్యశక్తే ఒక సమస్యగా, ఒక పీడగా పరిణమించినది. ఇస్లాంలో వడ్డీ వ్యాపారం చేయకూడదు, పరులను హింసించకూడదు, పరులను హత్యచేయకూడదు, దయతో మెలగాలి లాంటి సమాజాన్ని మరియు తోటి మనిషిని ఉద్దేశించిన బోధనలున్నాయి. ఐతే తాత్వికంగా ఇస్లాం రాజ్యశక్తిని మాత్రమే ఉద్దేశించినది. కనుకనే వ్యవస్థలోని మిగతా అంగాలైన సమాజం మరియు వ్యక్తిలకేమీ ప్రయోజనం సమకూరలేదు. పైగా ఆయా అంగాలు మితిమీరిన రాజ్య శక్తివలన ప్రమాదంలో పడ్డాయి.

ఇస్లాం యొక్క మౌలిక సిద్ధాంతాలు తప్ప ఇస్లామిక్ పాలనలో రాజ్యాంగమంటూ ఏమీ ఉండదు. ‘రాజ్యాంగం’ అనేది తదనంతరకాలంలో రూపుదిద్దుకున్న భావన. అంతా రాజు యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలమీదే ఆధారపడి పరిపాలన జరిగేది. న్యాయపరమైన, సైనికపరమైన, పరిపాలనాపరమైన అన్ని అధికారాలూ రాజు చేతిలోనే ఉండేవి. అతను ఇతరులనుండి సలహాలు తీసుకున్నా అది నామమాత్రమే.అంతిమ నిర్ణయం రాజుదే. శిరచ్ఛేధం, కాళ్ళు చేతులు నరికి వేయటం, రాళ్ళతో కొట్టి చంపడం, బతికి ఉండగా చర్మం వలిపించటం లాంటి క్రూరమైన శిక్షలు సాధారణంగా అమలవుతుండేవి.

ఇస్లాంకి పూర్వం ప్రపంచంలో రాజ్యపాలన పారమార్థిక చింతనతోకూడిన మతం యొక్క, మతపెద్దల యొక్క బోధనల ప్రభావంతో సాగుతుండేది. కానీ ఇస్లాంలో ఐహిక విషయమే మతం స్థాయికి తీసుకురాబడినది. అల్లా ఒక్కడే దేవుడు, అందరూ అతనికి మాత్రమే విధేయులై ఉండాలి, విగ్రహారాధన చేయకూడదు-అనేదే ఇస్లాం అనే ఉద్యమానికంతటికీ మౌలిక సూత్రం. తరచి చూస్తే ఈ సూత్రం ఐహికమైనదే కానీ పారమార్థికమైనది కాదు. అది రాజ్యశక్తినే సూచిస్తున్నది. దాని యెడల విధేయతనే ప్రతిపాదిస్తున్నది. ఇస్లామిక్ దాడులు, ఆక్రమణలు, బలవంతపు మతమార్పిడులు, పరిపాలన అంతా ఈ సూత్రం కొరకే, దాని ప్రేరణతోనే, అది ఇచ్చిన ఆవేశంతోనే జరిగాయి. ఇస్లాం అరాచకం మీద కత్తిగట్టింది. దానిమీద విజయం సాధించింది. పటిష్ఠమైన రాజ్యశక్తిని నిర్మించినది. ఆ ఊపులో అది సమాజాన్ని, వ్యక్తిని విస్మరించింది.

వికాసానికి తగిన స్వేచ్ఛను కలిగి ఉండడమే ‘సమాజం’ యొక్క ప్రయోజనం. ఆ మేరకు సమాజం మీద ‘రాజ్యం’ యొక్క నియంత్రణ సడలింపబడాలి. ‘వ్యక్తి’ ప్రయోజనమేమిటంటే సమాజాన్ని తన శ్రేయస్సుకు అనుగుణంగా వ్యవస్థీకరించడం లేక తన శ్రేయస్సు కు అనుకూలంగా ఉన్న సమాజంలో జీవించడం. బాహ్యాంతర్గత విద్రోహ శక్తులనుండి ఈ రెంటినీ కాపాడటమే, ఈ రెండు పరిస్థితులు నెలకొనేటట్లు చూడటమే ‘రాజ్యం’ యొక్క కర్తవ్యం మరియు దాని యొక్క ప్రయోజనం. మితమైన రాజ్య శక్తి మాత్రమే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలదు. అట్లుగాక రాజ్యశక్తి కొరవడినా లేక మితిమీరినా ఇది నెరవేరదు. ఇస్లాంలో రెండవ పరిస్థితి ఏర్పడింది.

వ్యాపార వాణిజ్యాల్లాంటి పరస్పర చర్యలు, నాగరికతా వ్యాప్తే సమాజ వికాసానికి ఆయువుపట్టు. నిరంతరం యుద్ధాలతో అల్లకల్లోలంగా ఉండే ఆనాటి పరిస్థితిలో సమాజం వికసించలేకపోయింది. వ్యాపార వాణిజ్యాలన్నీ సమాజ వికాస దృష్టిలేని నిరంకుశ రాజుల కరకు శాసనాలకు విధేయత చూపుతూ ఆ పరిమితిలోనే జరిగేవి. నాడు ప్రజాజీవితాన్ని రాజ్యం డామినేట్ చేసింది. నిరంతరం మారే రాజ్యపు సరిహద్దులు, నిరంతరం శత్రుదాడులు, యుద్ధాలు, ఆక్రమణలు. యుద్ధసమయంలో సైనికులు ప్రజల ధన, మాన, ప్రాణములను కొల్లగొట్టేవారు. ఇటువంటి పరిస్థితిలో సమాజవికాసానికి అవకాశమేలేదు. ఇస్లాం అనేది వ్యవస్థీకృత ఫ్యూడలిజం. ఇది అరాచకాన్ని అణచి ప్రపంచానికి పటిష్ఠవంతమైన, చక్కటి రాజ్యశక్తినందించి ఎంత మేలు చేసిందో, అదే రాజ్య శక్తి మితిమీరటం వలన, కేవలం దానిమీదే దృష్టి పెట్టబడటం వలన ‘సమాజం’, ‘వ్యక్తి’ నిర్లక్ష్యం చేయబడటం వలన మానవాళికి అంతే హానికరంగా పరిణమించింది. ఫ్యూడలిజం(ఇస్లాం)లో ప్రధానంగా ‘సమాజం’ మీద ప్రత్యక్ష దాడి జరిగినది. దానితో ‘సమాజం’ ప్రమాదంలో పడినట్లుగా భావించబదింది.

దీనితో మానవుడు రాజ్యశక్తికి వ్యతిరేకంగా, సమాజ వికాసానికి అనుకూలంగా ఆలోచించటం ప్రారంభించాడు. రాజ్యాన్ని సంకెలగా భావించాడు. ఈ ఆలోచనలే పెట్టుబడిదారీ వ్యవస్థ (Capitalism) కు బాటలు పరిచాయి. ఈ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మౌలిక సిద్ధాంత గ్రంథం రూసో అనే తత్వవేత్త రచించిన ‘సోషల్ కాంట్రాక్ట్ ’ (Social Contract) అనే గ్రంథం. ఈ గ్రంథమే ‘ఫ్రెంచ్ విప్లవం ’(French Revolution)నకు ప్రేరణగా నిలచినది.

ఈ గ్రంథం ప్రకారం రాజ్యం అనేది ఒక 'సామాజిక ఒడంబడిక ’ (Social Contract). ఫ్యూడల్ వ్యవస్థలో రాజ్యం 'దైవదత్తమైన అధికారం’(Devine Right of The Emperor) గా భావించబడింది. ఈ భావనకు వ్యతిరేకంగా ఈ గ్రంథంలో రాజ్యం ఒక సామాజిక ఒడంబడిక గా భావించబడింది. ఒడంబడిక అనేది ఇరువురు సమానస్థాయి వారి మధ్యన జరుగుతుంది. అంటే రాజు ప్రజలకన్నా ఏ విధంగానూ గొప్పవాడు కాదనీ, వారితో సమాన స్థాయి కలవాడేననీ, అతనికి ఎటువంటి దైవత్వం లేదనీ భావన. మరొక విషయం ఏమంటే రాజుకి ఆ అధికారం ప్రజలు అతనితో ఒప్పందం చేసుకోవటం వలననే సంక్రమించినది కనుక ఆ అధికారం ప్రజలు ఇచ్చినదేకాని అది దైవదత్తమైనది కాదు అని కూడా భావన.

ఈ గ్రంథం యొక్క ప్రారంభ వాక్యం చాలా ప్రసిద్ధమైనది. ‘మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు. కానీ ఎక్కడ చూచినా సంకెళ్ళతోటే కనిపిస్తున్నాడు’ అనేదే ఆ వాక్యం. ఈ సంకెలలు మితిమీరిన రాజ్యశక్తిని ఉద్దేశించినవే కానీ మరేవీ కావు.

‘ఫ్రెంచ్ విప్లవం’ పెట్టుబడిదారీ వ్యవస్థ కొరకు, రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగిన విప్లవాలలోకెల్లా అతిముఖ్యమైనది మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇది ఫ్రాన్స్ దేశంలో 1789వ సం||లో సంభవించినది. ఈ విప్లవ సమయంలోనిదే అత్యంత ప్రసిద్ధి పొందిన నినాదం ‘స్వేచ్ఛ’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతృత్వం’ (Liberty, Equality, and Fraternity). పెట్టుబడిదారీ దేశాలకు చెందిన జాతీయ పతాకాలలోని (మన తిరంగా కూడా) త్రివర్ణాలకు ఈ మూడు మాటలే ప్రతీకలు. ఈ మూడు భావాలు కూడా రాజ్యశక్తికి వ్యతిరేకంగా రూపొందినవే. రాజ్యం వలన స్వేచ్ఛ గానీ, సమానత్వంగానీ, సౌభ్రాతృత్వం గానీ లభించటంలేదని భావించబడింది. కనుక వీటి కొరకు ఆ రాజ్యశక్తి అపరిమితంగా ఉండే రాచరికాలను కూలదోసి సమాజవికాసానికి దారితీసే పెట్టుబడిదారీ వ్యవస్థలను ఏర్పరచాలని భావించబడింది.....(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి