పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావం
వలసల స్థాపన
సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలితంగా ఐరోపా జాతిలో ఏర్పడిన నూతన భావజాలం, అభ్యుదయ మరియు ఆధునిక జీవన విధానం, శాస్త్రీయమైన ఆలోచనావిధానం మొదలైన వాటిని ప్రపంచ ప్రజలందరికీ అందించే ఉద్దేశంతో ఐరోపా జాతులు ప్రపంచాన్ని పాలించడానికి ఆయత్తమయ్యాయి. వీరి ఉద్దేశం మంచిదే.కానీ ఈ లక్ష్య సాధనకు వీరు ఎంచుకున్న మార్గం మాత్రం దోపిడీకి మరియు మోసానికి దారితీసింది.
ఇప్పటివరకు చరిత్రకారుల భావన ప్రకారం వలసల స్థాపనలోని ముఖ్యోద్దేశం ‘మర్కెంటైలిజం’. అంటే వలసలను దోపిడీ చేసి స్వదేశ సంపదను పెంచడం. వలసలలో ఆధునిక నాగరికతా వృద్ధి అనేది ఒక పర్యవసానం మాత్రమే. కానీ ఏది ముఖ్యోద్దేశం ఏది పర్యవసానం అనేది మనం చరిత్రను చూచే దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. చరిత్రలోని వాస్తవ సంఘటనలకు ఎవరి అభిప్రాయానికి అనుగుణంగా వారు నిర్ధారణలు చేస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్ధకులు ఒక రకంగా చేసిన నిర్ధారణలను సామ్యవాద దృక్పథం కలిగినవారు మరోరకంగా చేస్తారు.
(ఆయా వ్యవస్థల సాఫల్యత ఎలా ఉన్నా మౌలిక ఉద్దేశానికి సంబంధించి నంతవరకూ కమ్యూనిజం మాత్రమే ప్రజాప్రయోజనం యెడల చిత్తశుద్ధితో ఉన్నట్లుగా కనపడుతుంది. కాపిటలిజం ఉద్దేశం మాత్రం దోపిడీ అన్నట్లుగా ఉంటుంది. ఇక ఇస్లాం విషయంలో ఆ మాత్రం స్పష్టత కూడా ఉండదు. అది అసలు రాజకీయ వ్యవస్థలానే అనిపించదు.ఓ మతంలా గోచరిస్తుంది. ఆయా వ్యవస్థల మౌలిక తత్త్వాలలో ఉన్న భేదం వలననే ఈవిధంగా జరుగుతుంది. అవి ఎలా ఉన్నా, బాహ్య దృష్టికి అవి ఎలా గోచరించినా అసలు వాస్తవమేమిటనేది మనం విజ్ఞతతోనే గ్రహించాలి)
చారిత్రక ఘటనామాలికలోని అంతస్సూత్రాన్ని ఇంతవరకూ ఎవరూ వివరించలేకపోయారు. చరిత్రలోని సంఘటనాక్రమాన్ని వెనుకనుండి నడిపిస్తున్న తత్త్వాన్ని ఇంతవరకూ ఎవరూ తెలుసుకోలేకపోయారు. దానిని కొంతవరకు కార్ల్ మార్క్స్ వివరించటానికి ప్రయత్నించాడు. కానీ సఫలీకృతం కాలేకపోయాడు. కనుక మనం ఇప్పటి వరకూ ఉన్న నిర్ధారణల యెడల మరీ అంతగా నిబద్ధులం అవ్వవలసిన అవసరమేమీలేదు.స్వేచ్ఛగా మన అభిప్రాయాలను మనం ఏర్పరచుకోవచ్చు.
చరిత్రలో మునుపెన్నడూ సాధ్యంకానంతటి విస్తారమైన భూభాగంతో, యశోవంతమైన వలస సామ్రాజ్యం కేవలం స్వార్ధ, సంకుచిత, దుర్బల, అనైతికమైన దోపిడీని పునాదిగా కలిగి అన్నినాళ్ళు మనగలిగినదనడం అసంబద్ధం. ఈ వలస సామ్రాజ్య స్థాపనలో అంతర్లీనంగా ఉన్న ఉద్దేశం ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవన ఫలితంగా తలెత్తిన నూతన నాగరికతను, నూతన జీవన విధానాన్ని ప్రపంచ ప్రజలందరకూ అందజేయటం మాత్రమే. ఐతే దోపిడీ అనేది వలస పాలన యొక్క అనివార్య పర్యవసానం. ఇస్లాం తన సిద్ధాంత వ్యాప్తికి దురాక్రమణను మార్గంగా గైకొంటే ఐరోపా జాతులు వలస విధానాన్ని మార్గంగా గైకొన్నాయి.
ఇస్లాం కానీయండి, కాపిటలిజం కానీయండి, కమ్యూనిజం కానీయండి; మౌలికంగా వీటి ఉద్దేశం `ప్రజాప్రయోజనమే. కానీ వాటి యొక్క కొన్ని అనివార్య లక్షణాలు, పర్యవసానాలవలన అవి ప్రజలకు పీడగా పరిణమించాయి.
ఏదైనా ఒక నూతన తాత్త్విక నేపథ్యంతో లేక మరేదైనా నూతన దృక్కోణంలో చరిత్ర క్రమాన్ని పరిశీలించేటపుడు ఆ దృక్పథానికి అనుగుణంగా చారిత్రక సంఘటనలకు నూతనమైన నిర్ధారణలు చేయటం సాధారణమైన విషయం. ఒక్కొక సారి మౌలిక అంశాలలో కూడా అప్పటికి వ్యాప్తిలో ఉన్న నిర్ధారణలతో విభేదించవలసి వస్తుంది. కార్ల్ మార్క్స్ సామ్యవాద దృక్పథంతో, గతితార్కిక తాత్త్విక నేపథ్యంతో ప్రపంచ చరిత్రను ఎంత వినూత్నంగా వివరించాడో మనకు తెలిసిన విషయమే. ఈ రచన కూడా ప్రపంచ చరిత్రను భారతీయ తత్త్వశాస్త్రానుగుణమైన (రెండవ అధ్యాయంలో వివరిస్తాను) ఒక విభిన్న దృక్కోణంలో పరిశీలించటానికి ప్రయత్నిస్తున్న కారణంగా ఈ రచనలో చరిత్ర గురించి కొన్ని నూతనమైన నిర్ధారణలు జరిగాయి. ఇస్లాం క్రైస్తవం, బౌద్ధంల తోపాటు పేర్కొనదగిన ఒక మతంగా కాక కాపిటలిజం, కమ్యూనిజంల సరసన పేర్కొనదగిన ఒక సామాజిక, రాజకీయ వ్యవస్థగా నిర్ధారింపబడినది. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మౌలిక ఉద్దేశం దోపిడీ కాదు, ప్రపంచ దేశాలకు ఆధునిక, అభ్యుదయ నాగరికతనందించటమేననీ; దోపిడీ ఈ వ్యవస్థ యొక్క అనివార్య పర్యవసానం మాత్రమేననే నిర్ధారణ కూడా ఇటువంటిదే.
కొత్తగా కనుగొనబడిన జలమార్గాలు మరియు ‘నూతన ప్రపంచం’ వలన ఐరోపా జాతులు ప్రపంచమంతటా వలసల స్థాపనకు పూనుకున్నాయి. ఈ నూతన భౌగోళిక ఆవిష్కరణలలో ప్రధాన పాత్ర పోషించిన స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలు వలసల స్థాపనలో ముందు నిలిచాయి. బ్రెజిల్ మినహా మిగతా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను స్పెయిన్‌కు, బ్రెజిల్ మరియు ఆసియా, ఆఫ్రికా ఖండాలను పోర్చుగల్‌కు దఖలు పరుస్తూ 15వ శతాబ్దపు చివరికాలంలో పోప్ ఒక నిర్ణయం చేసాడు.
దక్షిణ అమెరికా ఖండాన్ని స్పెయిన్ ఆక్రమించి అక్కడికి స్పానిష్ ప్రజలు వలస వెళ్ళటంతో ఇప్పటి లాటిన్ అమెరికా జాతులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఆ ప్రాంతాలలో విలసిల్లిన ‘మాయా’, ‘అజ్‌టెక్’ తదితర నాగరికతలు స్పానియార్డులచే సమూలంగా నాశనం చేయబడ్డాయి. అక్కడ అనాదిగా నివసిస్తున్న మంగోల్ జాతికి చెందిన ‘రెడ్ ఇండియన్‌లు’ పెద్దయెత్తున ‘జీనోసైడ్’ (ఒక జాతికి చెందిన ప్రజలను పెద్దయెత్తున చంపటం) కు గురయ్యారు. మిగిలిన కొద్దిమంది అడవుల్లోకి తరిమివేయబడ్డారు.
తదనంతర కాలంలో ‘కెప్టెన్ కుక్’ అను బ్రిటిష్ నావికుని వలన కనుగొనబడి, బ్రిటిష్ జాతి ఆక్రమణకు గురైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో కూడా ఇదే విధమైన మారణహోమం జరిగినది. అప్పటి వరకు అక్కడ నివసించిన నీగ్రోజాతికి చెందిన స్థానిక ప్రజలు చాలావరకు జీనోసైడ్‌కు లోనై, మిగిలిన కొద్ది మంది అడవుల్లోకి తరిమివేయబడ్డారు.
అమేయమైన నౌకాశక్తి కలిగిన స్పెయిన్ దేశం నూతన భౌగోళిక ఆవిష్కరణలలో ప్రధాన పాత్ర పోషించింది. దక్షిణ అమెరికా ఖండాన్ని ఆక్రమించి అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. ప్రపంచంలో దోపిడీ ప్రారంభమయ్యింది. స్పెయిన్ హయాంలో దోపిడీ ప్రత్యక్షంగా జరిగేది. అక్కడున్న సంపదలను ప్రత్యక్షంగా దోపిడీ చేసి స్వదేశానికి నౌకల ద్వారా తరలించేవారు. ఈ క్రమం దాదాపు ఒకటిన్నర శతాబ్దంపాటు కొనసాగింది.అప్పట్లో పోర్చుగల్ కూడా గొప్ప రాజ్యంగా ఉండి వలసలను స్థాపించింది. హాలెండ్ (డచ్చి వారు) కూడా ఈ సమయంలో వలసలను స్థాపించనారంభించిన మరోదేశం.
ఈ సమయంలోనే పోర్చుగీసు వారు భారతదేశంలోని గోవాలో మరియు కొన్ని తూర్పు ఆసియా దేశాలలో కూడా వర్తక స్థావరాలను ఏర్పరచుకున్నారు. వీరితో పాటే క్రైస్తవ మిషనరీలు కూడా ఆయాదేశాలకు వచ్చి తమ మత ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాయి. కానీ కాలక్రమంలో ఇంగ్లాండ్‌దేశాంతో క్రీ||శ.1588వ సం||లో జరిగిన యుద్ధంలో ‘స్పానిష్ అర్మడా’ పేరుతో ఖ్యాతివహించిన స్పెయిన్ దేశపు నౌకాదళం ఓడిపోవటంతో వలస రాజ్య స్థాపనలో స్పెయిన్ ప్రాబల్యం క్రమంగా అంతరించింది. అప్పటినుండి ఇంగ్లాండ్ ప్రాభవం ప్రారంభమైనది. ఫ్రాన్స్ కూడా బ్రిటన్‌తో పోటీ పడింది.
కెనడా ప్రాంతంలో కొన్ని ఫ్రెంచ్ వలసలు స్థాపించబడ్డాయి. 17వ శతాబ్దంలో మతకారణాల వలన దేశ బహిష్కరణకు గురైన అనేక మంది ఇంగ్లాండ్ దేశీయులు అమెరికా తూర్పు తీరంలో అనేక వలసలను ఏర్పరచుకున్నారు. వీరంతా తామరతంపరగా వృద్ధిచెంది ఉత్తర అమెరికా ఖండపు దేశాలైన అమెరికా మరియు కెనడాలు ఆవిర్భవించాయి......(సశేషం)
EXCELLENT ఒక్కమాటలో చెప్పాలంటే... really సూపర్ నేను మాత్రం ఈ టపా నుండీ చాలా విషయాలు నేర్చుకున్నాను.
రిప్లయితొలగించండిTHANK YOU.
రిప్లయితొలగించండి