8, ఫిబ్రవరి 2012, బుధవారం

సన్-జు 'యుద్ధకళ': 6వ అధ్యాయం




యుద్ధకళ




6వ అధ్యాయం: బలాలుబలహీనతలు








సన్జు చెప్పాడు:

1) యుద్ధ క్షేత్రానికి ఎవరైతే మొదట చేరుకుని శత్రువు రాకకై ఎదురు చూస్తారో వారు నవ్యోత్సాహంతో యుద్ధం చేస్తారు. ఎవరైతే యుద్ధక్షేత్రానికి ఆ తరువాత చేరుకుని యుద్ధంలో పాల్గొనడానికి హడవుడి పడవలసి ఉంటుందో వారు అక్కడకు చేరుకునేసరికే డస్సిపోతారు.

2) కనుక, తెలివైన యోధుడు తన అభీష్టానికి అనుగుణంగా శత్రువు అడుగువేసేటట్లు చేస్తాడుగానీ శత్రువు అభీష్టానికి అనుగుణంగా తను అడుగు వేసే పరిస్థితి రానీయడు.

3) లాభాన్ని చూపడం ద్వారా శత్రువు తనంతట తానుగా తనను సమీపించేటట్లు చేయగలడు; లేదా నష్టాన్ని కలిగించడం ద్వారా తనను సమీపించడం శత్రువుకు అసాధ్యమయ్యేటట్లూ చేయగలడు.

4) శత్రువు విశ్రాంతిగా ఉంటే, అతడిని ఇక్కట్లపాలు చేస్తాడు; శత్రువుకు ఆహారం సమృద్ధిగా అందుతుంటే, అతడిని ఆకలితో మాడేటట్లు చేస్తాడు; శత్రువు ప్రశాంతంగా శిబిరాన్ని ఏర్పరచుకుని ఉంటే, అతడు అక్కడి నుండి కదలిపోయేటట్లు ఒత్తిడి తెస్తాడు.

5) ఏ ప్రాంతాలను రక్షించుకోవడానికి శత్రువు హడావుడి పడతాడో అక్కడ నీవు ప్రత్యక్షమవ్వు. అతడు నిన్ను ఊహించని ప్రాంతాలకు నీవు త్వరితగతిన చేరుకో.

6) ఎటువంటి బాధ లేకుండా సైన్యం సుదూరాలను ప్రయాణించాలంటే, శత్రువు లేని దేశం గుండా ప్రయాణించు.

7) నీవు చేసే దాడులు ఖచ్చితంగా సఫలమవ్వాలంటే అరక్షితమైన ప్రాంతాల మీద మాత్రమే దాడి చేయి. నీ స్వీయరక్షణకు హాని జరగకుండా ఉండాలంటే శత్రువు దాడి చేయలేనటువంటి ప్రదేశాలలో మాత్రమే ఉనికిని కలిగి ఉండు.

8) కనుక, ప్రత్యర్థికి దేనిని కాపాడుకోవాలో తెలియకుండా దాడి చేయగల సైన్యాధికారే దాడి చేయడంలో నిపుణుడు. అలాగే ప్రత్యర్థికి దేనిమీద దాడి చేయాలో తెలియకుండా చేయగలవాడే ఆత్మరక్షణ చేసుకోవడంలో నిపుణుడు.

9) మార్మికతను, నిగూఢతను నేర్పే ఓ దైవ విద్యా! నీ ద్వారానే మేము కనబడకుండా ఉండటం నేర్చుకున్నాము, నీ ద్వారానే మేము వినబడకుండా ఉండటం నేర్చుకున్నాము; ఆ కారణంగానే మేము శత్రువు తలరాతను మా చేతులలో ఉంచుకోగలుగుతున్నాము.

(కనబడకుండా ఉండేంతగా మార్మికతను అలవరచుకో! వినబడకుండా ఉండేంతగా నిగూడతను అలవరచుకో! అపుడు నీవు శత్రువు యొక్క తలరాతను నిర్దేశించగలవు)

10) శత్రువు ప్రతిఘటించలేకుండా నీవు పురోగమించాలంటే, నీవు అతడి బలహీనతలమీద పనిచేయి; శత్రువు వెంటాడలేకుండా నీవు తిరోగమించాలంటే, నీ కదలికలు అతడి కన్నా మరింత వేగంగా ఉండాలి.

11) మనం యుద్ధం చేయాలనుకుంటే, శత్రువు ఎత్తైన గోడలు, లోతైన కందకాలకు ఆవల ఆశ్రయం పొంది ఉన్నాకూడా అతడిని మనతో తలపడేటట్లు ఒత్తిడి చేయవచ్చు. అందుకు మనం చేయవలసిందల్లాఅతడు తప్పకుండా రక్షించుకోవలసిన ఏదైనా మరో ప్రాంతం మీద దాడి చేయడమే.

12) మనం యుద్ధం చేయకూడదనుకుంటే, మన శిబిరం ఎటువంటి రక్షణ లేకుండా చుట్టూ కేవలం ఒక గీత మాత్రమే గీసి ఉన్నాకూడా శత్రువు మనతో తలపడకుండా చేయవచ్చు. అందుకు మనం చేయవలసిందల్లాకొత్తగా, అనుమానాస్పదంగా ఉండే దేనినైనా అతడి మార్గంలో విసిరివేయడమే.

13) శత్రు పథకాలను మనం కనిపెట్టి, మన పథకాలను మాత్రం శత్రువుకు గోచరం కాకుండా ఉంచడం ద్వారా శత్రు బలగాలు విడిపోక తప్పని సమయంలో మనం మన బలగాలను ఒకేచోట కేంద్రీకరించగలం.

(శత్రు పథకాల గురించి మనకు తెలియడం వలన అతడు ఏ వైపు నుండి దాడి చేస్తాడో మనకు తెలుస్తుంది. కనుక అతడి దాడినెదుర్కోవడానికి మనం ఆ దిశలో సంఘటితరూపంలో కాచుకొని ఉంటాం. కానీ శత్రువుకు మన పథకాల గురించి తెలియకపోవడం వలన మనం ఎటువైపునుండి దాడి చేస్తామో అతడికి తెలియదు. కనుక మనం చేయబోయే దాడిని ఎదుర్కోవడం కొరకు అతడు అన్ని వైపులా సంసిద్ధంగా ఉండవలసి రావడంతో, తన సైన్యాన్ని అనేక భాగాలుగా విడగొట్టవలసి వస్తుంది.)

14)  శత్రువు వివిధభాగాలుగా విడిపోక తప్పని సమయంలో, మనం ఒకే సంఘటిత దేహంగా రూపొందగలం. దానిమూలంగా ఒక పూర్ణత్వం, మరో పూర్ణత్వపు విడిభాగాలకు ఎదురునిలిచి ఉంటుంది. అంటే శత్రువుకు చెందిన కొద్దిమందికి ప్రతిగా మనం అనేక మందిమి ఉంటాము.

15) ఆవిధంగా మనం బలమైన సైన్యంతో బలహీనమైన సైన్యం మీద దాడి చేయగలిగితే, మన ప్రత్యర్థులు భయానక కష్టంలో చిక్కుకుపోతారు.

16) మనం ఏ ప్రాంతంలో పోరాడాలనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని ఎట్టిపరిస్థితుల్లో శత్రువుకు తెలియనీయకూడదు. అలా తెలియనీయకపోవడం వలన జరగబోయే దాడికొరకు శత్రువు అనేక ప్రాంతాలలో సంసిద్ధుడవవలసి వస్తుంది. ఆ విధంగా అతడి బలగాలు అనేక దిశలలోకి విడిపోయి, ఏదేని ఒక ప్రాంతంలో మనం ఎదుర్కోవలసిన శత్రుసైన్యం సాపేక్షంగా కొద్ది సంఖ్యలో ఉంటుంది.

17) శత్రువు తన సేనావాహిని ముందుభాగాన్ని బలోపేతం చేయడం కొరకు వెనుక భాగాన్ని బలహీనం చేస్తాడు; వెనుక భాగాన్ని బలోపేతం చేయడం కొరకు ముందు భాగాన్ని బలహీనం చేస్తాడు; ఎడమ భాగాన్ని బలోపేతం చేయడం కొరకు కుడి భాగాన్ని బలహీనం చేస్తాడు; కుడి భాగాన్ని బలోపేతం చేయడం కొరకు ఎడమ భాగాన్ని బలహీనం చేస్తాడు. అతడు అన్నిచోట్లకూ అదనపు బలగాలను పంపితే, అన్నిచోట్లా బలహీనపడతాడు.

18) సంఖ్యాపరమైన బలహీనత శత్రువు చేయబోయే దాడుల కొరకు మనం సిద్ధంకావలసి రావడం వలన వస్తుంది. సంఖ్యాపరమైన బలం మనం చేయబోయే దాడుల కొరకు శత్రువు సిద్ధంకావలసి వచ్చేటట్లు చేయడం ద్వారా వస్తుంది.

(శత్రుదాడి కొరకు సిద్ధంకావటమంటే సైన్యాన్ని అనేక భాగాలుగా విభజించడమే)

19) జరగబోయే యుద్ధం ఏ ప్రాంతంలో, ఏ సమయంలో జరుగుతుందో తెలియడం వలన సుదూరప్రాంతాల నుండి వచ్చి పోరాటం కొరకు ఏకీకృతం కావచ్చు.

(వేగవంతమైన ప్రయాణం కొరకు సైన్యం వివిధ భాగాలుగా విడిపోయి కూడా యుద్ధం జరగబోయే ప్రాంతాన్ని చేరుకొనే సమయానికి అన్ని భాగాలు కలసి పోయి సంఘటితంగా పోరాటంలో పాల్గొనవచ్చు.)

20) ఐతే పోరు జరిగే సమయంకానీ, ప్రదేశం కానీ తెలియనపుడు, ఎడమవైపున ఉన్న సైన్య భాగం కుడివైపున ఉన్న సైన్య భాగాన్ని ఆపదలో ఆదుకోవడానికి అసమర్థమై ఉంటుంది. అదే విధంగా కుడి సైన్యభాగం కూడా ఎడమ సైన్యభాగాన్ని ఆదుకోవడానికి అసమర్థమై ఉంటుంది. ముందు భాగం వెనుకభాగాన్ని ఆదుకోలేదు, వెనుక భాగం ముందుభాగానికి మద్దతుగా నిలువలేదు. సైన్యంలో అతిదూరంగా ఉండే భాగాల మధ్య దూరం వంద లీలు అయి ఉండి, చివరికి అతి సమీపంగా ఉండే భాగాల మధ్య దూరం సైతం కొన్ని లీలు అయి ఉంటే పరిస్థితి ఇంకెంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

21) నా అంచనా ప్రకారం యూ’ (Yueh) రాజ్య సైన్యం మన సైన్యం కన్నా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ అధిక్యం వారికి విజయాన్ని అందించడంలో ఏ విధంగానూ సహాయకారిగా ఉండదు. అందువలన మనం విజయం సాధించగలమని నేను చెబుతున్నాను.

(‘యూరాజ్యం వారికి యుద్ధం జరిగే ప్రాంతం, సమయం తెలియకుండా చేయడం ద్వారా)

22) శత్రువు సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ, పోరుసల్పకుండా అతడిని నిరోధించవచ్చు. దానికొరకు అతడి పథకాలను, వారి విజయావకాశాలను కనిపెట్టడానికి ఎత్తుగడవేయి.

23) అతడిని రెచ్చగొట్టి, అతడు ఏ పరిస్థితుల్లో క్రియాశీలంగా ఉంటాడు, ఏ పరిస్థితుల్లో స్థబ్దుగా ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకో! అతడు తనను తాను వెల్లడి చేసుకునేటట్లు వత్తిడి చేసి, తద్వారా అతడి బలహీన ప్రాంతాలను కనిపెట్టు.

24) ప్రత్యర్థి సైన్యాన్ని, నీ సైన్యంతో జాగ్రత్తగా పోల్చి చూడటం ద్వారా శత్రుసైన్యంలో బలం ఎక్కడ సమృద్ధిగా ఉన్నదో, ఎక్కడ లోపించి ఉన్నదో నీవు తెలుసుకోవచ్చు.

25) వ్యూహాత్మక పథకాలను రచించడంలో నీవు చేరుకోదగిన అత్యున్నత స్థానం ఏమిటంటే వాటిని దుర్గ్రాహ్యంగా ఉంచడమే. నీ పథకాలను ఆ విధంగా ఉంచడం వలన గుచ్చి గుచ్చి పరిశీలించే రహస్య గూఢచారుల తీక్షణ దృక్కుల నుండి, ఎంతో తెలివిగలిగినవారు పన్నే కుట్రల నుండి నీవు రక్షింపబడతావు.

(నీ పథకాలను రహస్యంగా ఉంచడం వలన శత్రు గూఢచారులు వాటిని గ్రహించలేరు. తెలివైన ప్రత్యర్థులు నీకు వ్యతిరేకంగా ఎటువంటి ఎత్తుగడా వేయలేరు)

26) శత్రువు వేసే ఎత్తుగడల నుండి తమకు విజయం ఎలా సమకూరగలదో సామాన్యులు గ్రహించలేరు.

27) నేను విజయం సాధించిన సమయంలో తాత్కాలికంగా అనుసరించిన ఉపాయాన్నే అందరూ చూడగలరు, కానీ విజయం యొక్క క్రమపరిణామానికి కారణమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని ఎవరూ చూడలేరు.

(విజయాన్ని స్థూలంగా అందరూ దర్శిస్తారు. కానీ అది సమకూరడానికి దారితీసిన దీర్ఘకాలిక వ్యూహప్రతివ్యూహాలను ఎవరు దర్శించలేరు)

28) ఒకానొక విజయాన్ని పొందడనికి నీవు అనుసరించిన ఎత్తుగడలను మరలా మరలా అనుసరించకు. లెక్కలేనన్ని విధాలుగా ఉండే పరిస్థితులకనుగుణంగా నీ విధానాలను మార్చుకుంటూ ఉండు.

29) నీరు ప్రవహించేటపుడు ఎత్తైన ప్రదేశాలను వదిలిపెట్టి, పల్లపు ప్రాంతాలను వడివడిగా చేరుకుంటుంది. సైనిక ఎత్తుగడలు అటువంటి నీటిని పోలి ఉంటాయి.

30) కనుక యుద్ధంలో అనుసరించవలసిన విధానమేమిటంటే ఏది బలమైనదో దానిని వదిలి పెట్టడం, ఏది బలహీనమైనదో దానిమీద దాడి చేయడం.

31) నీరు తను ప్రవహిస్తున్న నేలను బట్టి తన ప్రవాహదిశను రూపొందించుకుంటుంది. సైనికుడు తను ఎదుర్కొంటున్న శత్రువుకు తగినట్లుగా విజయం కొరకు కృషి చేస్తాడు.

32) కనుక నీటికి ఎలాగైతే స్థిరమైన రూపం ఉండదో, అలాగే యుద్ధంలో కూడా స్థిరమైన పరిస్థితులుండవు.

33) ఎవరైతే తన శత్రువుకు అనుగుణంగా తన ఎత్తుగడలను మార్చుకోగలిగి తద్వారా గెలుపును సాధిస్తాడో అతడిని స్వర్గం నుండి దిగివచ్చిన సైన్యాధికారిగా పిలువవచ్చు.

34) పంచభూతాలలో ఏ ఒక్కటీ ఎల్లవేళలా మిగతావాటిని అధిగమించి ఉండదు.
నాలుగు ఋతువులు వంతుల వారీగా ఒకదానికొకటి అవకాశాన్ని ఇచ్చుకుంటాయి.
పగటికాలం ఒక్కోసారి ఎక్కువ సమయం ఉంటుంది. ఒకోసారి తక్కువ సమయం ఉంటుంది.
చంద్రుడు కొంతకాలం క్షీణిస్తాడు, మరికొంతకాలం వృద్ధిచెందుతాడు.

(అదేవిధంగా యుద్ధంలోని పరిస్థితులు కూడా మారుతుంటాయి, వాటికనుగుణంగా మన ఎత్తుగడలను కూడా మార్చుకుంటుండాలి)




(ఆరవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి