యుద్ధకళ
5వ అధ్యాయం: శక్తి
సన్–జు
చెప్పాడు:
1) కొద్దిమందిని ఏ పద్దతిలో నియంత్రిస్తామో అదే పద్దతిలో ఒక పెద్ద
బలగాన్ని కూడా నియంత్రించవచ్చు. మనం చేయవలసిందల్లా ఆ బలగాన్ని చిన్నచిన్న
సమూహాలుగా విభజించడమే.
2) నీ అదుపాజ్ఞలలో ఓ పెద్దసైన్యం ఉన్నపుడు చేసే పోరాటానికి,
ఓ చిన్నసైన్యం ఉన్నపుడు చేసే పోరాటానికీ
ఏ మాత్రం తేడా ఉండదు. నీవు చేయవలసిందల్లా సంకేతాలు, సంజ్ఞల ద్వారా సమాచార మార్పిడిని సరైన విధంగా
నెలకొల్పుకోవడమే.
3) నీ సైన్యమంతా శత్రుదాడి తీవ్రతను తట్టుకొని చలించకుండా నిలబడటం
అనేది ప్రత్యక్షంగానూ,
పరోక్షంగానూ ఉండే ఎత్తుగడల వలన సాధ్యమవుతుంది.
4) నీ సైన్యపు ప్రభావం గుడ్డు మీదకు విసిరిన గులకరాయి వలే ఉండటం అనేది
బలమైన, బలహీనమైన అంశాల
గురించిన పరిజ్ఞానం వలన సాధ్యమవుతుంది.
5) యుద్ధాన్ని ప్రారంభించడానికి ప్రత్యక్షంగా ఉండే పద్దతులను
ఉపయోగించవచ్చు. కానీ విజయాన్ని
పొందడానికి మాత్రం పరోక్షంగా ఉండే పద్దతులు అవసరమవుతాయి.
6) సమర్థవంతంగా అమలు చేయబడే పరోక్షమైన ఎత్తుగడలు ఆకాశంవలే,
భూమివలే తరిగిపోనివి; నదులు, సెలయేళ్ళ ప్రవాహం వలే అంతులేనివి; సూర్యచంద్రుల వలే అవి అంతమయ్యేది తిరిగి కొత్తగా మొదలవడానికే;
నాలుగు ఋతువుల వలే అవి గతించిపోయేది
మరోసారి తిరిగి రావడానికే.
7) సంగీత స్వరాలు ఐదు కన్నా ఎక్కువలేవు. అయినాకూడా ఆ అయిదింటి
మేళవింపుతో ఎప్పటికీ వినలేనన్ని బాణీలను కూర్చవచ్చు.
8) ప్రాథమిక రంగులు ఐదుకన్నా ఎక్కువ లేవు. ఆయినా కూడా వాటి
మేళవింపుతో ఎప్పటికీ చూడలేనన్ని వర్ణమిశ్రమాలను సృష్టించవచ్చు.
9) ప్రాథమిక రుచులు ఐదుకన్నా ఎక్కువ లేవు. అయినాకూడా వాటి
సమ్మేళనంతో ఎప్పటికీ ఆస్వాదించలేనన్ని రుచులను తయారు చేయవచ్చు.
(మనకు సంగీత స్వరాలు, ప్రాథమిక వర్ణాలు ఏడేసి ఉంటాయి. అలాగే రుచులు ఆరు. కానీ పైన
తెలిపిన ఐదు సంఖ్య చైనా సంప్రదాయాన్ని అనుసరించి తెలపబడినది)
10) యుద్ధంలో దాడి చేయడానికి రెండు కన్నా ఎక్కువ పద్ధతులు లేవు.
అవి ప్రత్యక్షం, పరోక్షం. అయినాకూడా
ఆ రెండింటి మేళవింపు అంతులేని ఎత్తుగడల పరంపరకు కారణమవుతుంది.
11) ప్రత్యక్ష,
పరోక్షమైన పద్దతులు వరుసగా ఒకదానికొకటి దారితీస్తుంటాయి. అది ఒక చక్రభ్రమణం
వంటిది. నీవెప్పటికీ అంతానికి చేరుకోలేవు. వాటి మేళవింపు వలన జనించే పథకాలను ఎవరు
మాత్రం పూర్తిగా వినియోగించుకోగలరు?
12) రాళ్ళను సైతం తన మార్గంవెంట దొర్లించుకుపోయే ఉరకలెత్తే
నీటిప్రవాహపు ఉధృతి వలే బలగాల దాడి ఉంటుంది.
13) గ్రద్ద ఆకాశంనుండి తన ఆహారంమీద సరైనసమయంలో దాడి చేసి, దాని శరీరాన్ని ఛిద్రంచేసే విధానంలో
సరైన నిర్ణయం ఉంటుంది.
14) కనుక
ఉత్తమ యోధుడు తన
దాడి భీకరంగా ఉండేటట్లు, తన
నిర్ణయం ఖచ్చితంగా ఉండేటట్లు జాగ్రత్త పడతాడు.
15) శక్తిని వింటి నారిని లాగడంతో పోల్చవచ్చు. నిర్ణయాన్ని శరాన్ని
వదలడంతో పోల్చవచ్చు.
16) యుద్ధకల్లోలంలో అంతా అస్తవ్యస్తంగా ఉన్నట్లు అనిపించవచ్చు.
కానీ నిజానికి అక్కడ ఏ అస్తవ్యస్తతా ఉండదు. ఆ తికమకలో, ఆ కోలాహలంలో నీ బలగాల మోహరింపు తలాతోకా లేనట్లుగా ఉంటుంది.
ఆయినా కూడా అది ఓటమిని అడ్డుకుంటుంది.
17) అస్తవ్యస్తతను నటించాలంటే ముందు ఉత్తమ క్రమశిక్షణ ఉండాలి.
పిరికితనాన్ని నటించాలంటే ముందు ధైర్యం ఉండాలి; బలహీనతను నటించాలంటే ముందు బలం ఉండాలి.
18) అస్తవ్యస్తత ముసుగులో క్రమత్వాన్ని దాయడం అనేది విభజనకు
సంబంధించిన విషయం.
(అనేక విభాగాలు, ఉపవిభాగాలుగా
విభజింపబడి వాటన్నింటికీ అధికారులు నియమించబడి పూర్తి క్రమశిక్షణతో ఉన్న పెద్ద బలగం పైకి
అస్తవ్యస్తంగా కనబడుతుంది.)
పిరికితనం
మాటున ధైర్యాన్ని కనుమరుగు చేయడానికి పైకి
గోచరంకాని అంతర్గతశక్తి నిల్వ ఉండాలి.
(ముందడుగు వేయగలిగే అనువైన పరిస్థితిలో ఉండి కూడా మనం ముందడుగు
వేయకపోతే, మనం భయపడినట్లుగా
శత్రువు భావిస్తాడు.)
బలహీనత
ముసుగులో బలాన్ని దాయడం అనేది వ్యూహాత్మక మోహరింపు ద్వారా సాధించబడుతుంది.
(సేనలోని మంచి శరీర సౌష్టవం కలిగిన సైనికులను, బలిష్ఠమైన గుఱ్ఱాలను బయటకు కనబడకుండా
చేసి వృద్ధులైన సైనికులను, బక్కచిక్కిన
గుఱ్ఱాలను బయటకు ప్రదర్శించడం ద్వారా శత్రువు మనలను తక్కువ అంచనా వేసేటట్లు చేయవచ్చు.)
19) ఆ విధంగా శత్రువు కదలికలో ఉండేటట్లు చేయడంలో నేర్పరి అయినవాడు
మోసపూరితమైన ప్రదర్శనలను కొనసాగిస్తుంటాడు. వాటి ప్రకారంగానే శత్రువు స్పందిస్తాడు.
శత్రువు దేనినైతే తటాలున స్వీకరిస్తాడో దానినే అతడు త్యాగం చేస్తుంటాడు.
20) ఎరలు వేయడం ద్వారా శత్రువును ముందుకు కదిలేటట్లు చేసి, ఆ తదుపరి ఎంపిక చేసిన మనుషులతో అతడి
కొరకు వేచి ఉంటాడు.
21) తెలివైనయోధుడు సంఘటిత శక్తి యొక్క ప్రభావం కొరకే చూస్తాడు.
విడివిడి మనుష్యులతో అతడికి అంతగా అవసరముండదు. కనుక సరైన మనుషులను ఎంచుకొని వారి ఐక్యత
ద్వారా సమకూరే సంఘటిత శక్తిని ఉపయోగించుకోవడంలోనే అతడి సమర్థత వెల్లడవుతుంది.
22) అతడు సంఘటిత శక్తిని ఉపయోగించేటపుడు అతని సైనికులు దొర్లిపోయే
కొయ్యదుంగలు లేక బండరాళ్ళవలే మారతారు. ఎందుకంటే సమతల ప్రదేశం పై కదలకుండా ఉండటం,
వాలు ప్రాంతంలో దొర్లడం; నాలుగుపలకలుగా ఉంటే నిశ్చలం గా ఉండటం,
గుండ్రంగా ఉంటే దొర్లుతూ క్రిందికి
పోవడం కొయ్యదుంగ లేక బండరాయి లక్షణం.
(సంఘటిత శక్తిని ఉపయోగించడమంటే, సైనికులను యుద్ధంలో సమిష్టిగా, వ్యూహాత్మకంగా వినియోగించడం. Making the best out of
them.)
23) ఆవిధంగా, మంచి
సైనికుల వలన పెంపొందింపబడిన శక్తి, వేల
అడుగుల ఎత్తు ఉండే పర్వతం మీద నుండి దొర్లుతూ వచ్చే గుండ్రని బండరాయి యొక్క
శక్తిని పోలి ఉంటుంది.
శక్తి
అనే అంశం గురించిన చర్చ ముగిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి