4, ఫిబ్రవరి 2012, శనివారం

సన్-జు 'యుద్ధకళ': 4వ అధ్యాయం




యుద్ధకళ




4వ అధ్యాయం: వ్యూహాత్మక సంసిద్ధత








సన్జు చెప్పాడు:

1) ప్రాచీన కాలపు ఉత్తమ యోధులు మొదట తమను ఓటమి సంభావ్యతకు ఆవల నిలుపుకుని, తదుపరి శత్రువును ఓడించే అవకాశం కోసం వేచి ఉండేవారు.

2) మనలను ఓటమి బారినుండి సురక్షితులను గావించుకోవడం అనేది మన చేతులలో ఉంటుందిగానీ, శత్రువును ఓడించే అవకాశాన్ని మాత్రం శత్రువే స్వయంగా అందిస్తాడు.

3) ఆ విధంగా ఉత్తమ యోధుడు ఓటమి బారి నుండి తనను రక్షించుకోగలడు గానీ, శత్రువును ఓడించే విషయంలో మాత్రం ఖచ్చితత్వాన్ని సాధించలేడు.

4) కనుకనే ఇలా చెప్పబడింది: జయించే సామర్థ్యం లేనివానికి జయించడమెలాగో తెలిసి ఉండవచ్చు.

5) ఓటమి బారినుండి రక్షించుకోవడం అనేది ఆత్మరక్షణ వ్యూహం. శత్రువును ఓడించే సామర్థ్యం అంటే దాడిచేసే వ్యూహం.

6) ఆత్మరక్షణను అనుసరించడం లోపించిన బలాన్ని సూచిస్తుంది. దాడిచేయడం అనేది మిగులు ఉన్న బలాన్ని సూచిస్తుంది.

7) ఆత్మరక్షణ నైపుణ్యం కలిగిన సేనాని అతిరహస్యమైన భూఅంతరాలలో దాగి ఉంటాడు. దాడి చేయడంలో నైపుణ్యం కలిగినవాడు స్వర్గశిఖరాల నుండి మెరుపువలే దూసుకొస్తాడు. వారి విధానాన్ని అనుసరించడంవలన మనం ఒకపక్క మనల్ని మనం రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. మరోపక్క సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తాం.

8) విజయాన్ని అందరూ దర్శించగలిగినపుడే నీవూ దర్శించగలగడం అత్యున్నత ప్రతిభ అనిపించుకోదు

9) సామ్రాజ్యం అంతా భళాఅనేటట్లుగా నీవు పోరాడి, విజయం సాధిస్తే అది అత్యున్నత ప్రతిభ అనిపించుకోదు.

(యుద్ధం చేయకుండా విజయం సాధించడమే అత్యున్నత ప్రతిభ)

10) కుందేలు వెంట్రుకను ఎత్తడం పెనుబలానికి నిదర్శనం కాదు; సూర్యచంద్రులను చూడటం నిశితదృష్టికి నిదర్శనం కాదు; పిడుగు శబ్దాన్ని వినడం సునిశితమైన వినికిడి శక్తికి నిదర్శనం కాదు.

11) కేవలం గెలుపొందడమే కాదు, ఆ గెలుపును సునాయాసంగా పొందే ప్రతిభ ఉన్న వానిని ప్రాచీనులు తెలివైన యోధుడుఅని పిలిచేవారు.

12) ఆకారణంగానే అతడి విజయాలు అతడి యుద్ధపరిజ్ఞానానికి ప్రఖ్యాతినీ, అతడి ధైర్యానికి గుర్తింపునూ తేలేకపోయాయి.

(వెలుగు చూడని వ్యవహారాల వలన అతడు విజయాన్ని సాధిస్తాడు, అందువలనే అతడి యుద్ధపరిజ్ఞానం ప్రఖ్యాతిని బడయదు. రక్తపాతం జరగక ముందే శత్రురాజ్యం అతడికి లోబడి పోతుంది. అందువలనే అతడి ధైర్యానికి గుర్తింపు రాదు.)

13) పొరపాట్లు చేయకపోవడం ద్వారా అతడు తన యుద్ధాలను గెలుపొందుతాడు. పొరపాట్లు చేయకపోవడం అంటే ముందే ఓడిపోయిన శత్రువును జయించడం అని అర్థం కనుక అది విజయాన్ని ఖాయపరుస్తుంది.

14) అందువలన నైపుణ్యం కలిగిన యోధుడు తను ఓడిపోవడం అసాధ్యమయ్యే పరిస్థితిని కల్పించుకోవడమే కాక, శత్రువును ఓడించే క్షణాన్ని జారవిడుచుకోడు.

15) ఆవిధంగా యుద్ధంలో, విజయవంతమైన వ్యూహకర్త విజయాన్ని గెలుచుకున్న తరువాత మాత్రమే పోరాటాన్ని కోరతాడు. ఐతే ఓటమి రాసిపెట్టి ఉన్నవాడు మొదట పోరాడి, ఆ తదుపరి విజయం కోసం చూస్తాడు.

(‘విజయాన్ని గెలుచుకున్న తరువాతఅంటే గెలుపును ఖాయం చేసే ప్రణాళికను సిద్ధం చేసుకున్న తరువాత)

16) పరిపూర్ణమైన నాయకుడు ప్రజామద్దతును కూడగట్టడం ద్వారా, అలాగే యుద్ధ వ్యవహారాన్నంతా సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విజయాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు.

17) సైనిక పద్దతి ప్రకారం మనం అనుసరించవలసిన చర్యాక్రమం ఇలా ఉంటుంది.

మొదటగా భూమి కొలత (measurement),

రెండవది శత్రు బలాన్ని మదింపు చేయడం (estimation of quantity),

మూడవది అంచనాలు వేయడం (calculations),

నాల్గవది శత్రువుకు, మనకు ఉన్న అవకాశాలను పోల్చిచూడటం (balance of chances),

అయిదవది విజయాన్ని పొందడం (victory).

18) భూమినుండి కొలతను రాబడతాము, కొలతనుండి శత్రుబలాన్ని మదింపు చేస్తాము, ఆ మదింపు నుండి అంచనాలు వేస్తాము, అంచనాల నుండి శత్రువుకు, మనకు ఉన్న అవకాశాలను పోల్చుతాము, ఆ పోలిక నుండి విజయాన్ని పొందుతాము.

19) విజయవంతమైన సైన్యం, ఓడిపోయిన సైన్యం ఎదురెదురుగా ఉంటే, ఆ పరిస్థితి త్రాసులో ఒక ధాన్యపు గింజను తూయడానికి ఒక పౌండ్ బరువును ఉంచినట్లుగా ఉంటుంది.

20) కట్టడి చేయబడిన నీరు వేల అడుగుల లోతున్న ఒక సన్నని అగాథంలోనికి ఏవిధంగా మహోధృతంగా చొచ్చుకుపోతుందో అదేవిధంగా గెలుపొందే సైన్యం మున్ముందుకు దూసుకొస్తుంది.




(నాలుగవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి