20, ఫిబ్రవరి 2012, సోమవారం

సన్-జు 'యుద్ధకళ': 12వ అధ్యాయం





యుద్ధకళ



12వ అధ్యాయం: నిప్పుతో దాడి








సన్జు చెప్పాడు:

1) నిప్పుతో దాడిచేయడానికి ఐదురకాల పద్దతులున్నాయి.

మొదటిది సైనికులను వారి శిబిరంలోనే తగులబెట్టడం;

రెండవది నిల్వలను తగులబెట్టడం;

మూడవది సైన్యం వ్యక్తిగత సామానులు తీసుకువస్తున్న వాహనాలను తగులబెట్టడం;

నాల్గవది వారి ఆయుధాగారాలకు నిప్పుబెట్టడం;

ఐదవది శత్రువు మధ్యలోకి అగ్నిజ్వాలలను విసిరివేయడం.    

2) ఒక దాడిని నిర్వహించాలంటే దానికి కావలసిన సాధనాలను మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. నిప్పు రాజెయ్యడానికి కావలసిన సామాగ్రిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.

3) నిప్పుతో దాడిచేయడానికి తగిన కాలం ఉంటుంది. అలాగే దహనకాండను ప్రారంభించడానికి ప్రత్యేక దినాలు ఉంటాయి.

4) తగినకాలం అంటే వాతావరణం బాగా పొడిగా ఉన్న సమయం; ప్రత్యేక దినాలు అంటే చాంద్రమాసంలోని 7, 14, 21, 28వ రోజులు. ఎందుకంటే ఈ నాలుగు రోజులలో గాలి బాగా వీస్తుంది.

5) నిప్పుతో దాడి చేసేవారు ఐదురకాల సంభావ్య పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి:

6) (1) శత్రుశిబిరం లోపల మంటలు చెలరేగగానే, నీవు వెనువెంటనే వెలుపలి నుండి దాడిచేయి.

7) (2) అక్కడ మంటలు చెలరేగినా కూడా శత్రు సైనికులు ప్రశాంతంగానే ఉంటే సదవకాశం కోసం వేచి చూడు, దాడి చేయకు.

8) (3) అగ్నిజ్వాలలు క్రమంగా పెరిగి ఉవ్వెత్తున ఎగసిన సమయంలో సాధ్యపడితే దాడిచేయి, సాధ్యం కాకపోతే ఉన్నచోటునుండి కదలకు.

9) (4) శత్రుశిబిరం వెలుపలినుండి నిప్పుతో దాడి చేయడం సాధ్యమైతే, శిబిరంలోపల మంటలు చెలరేగడం కొరకు ఎదురుచూడక, అనుకూలమైన సమయంలో దాడిచేయి.

10) (5) నీవు నిప్పుతో దాడిని ప్రారంభించేటపుడు గాలి ఏ వైపునుండి వీస్తుందో ఆ వైపే నీవు ఉండాలి. గాలివీచే దిశకు ఎదురుగా ఉండి దాడి చేయకూడదు.

11) పగటిపూట వీచే గాలి ఉధృతి చాలా సేపు ఉంటుంది. రాత్రి పూట వీచే గాలి త్వరలోనే నెమ్మదిస్తుంది.

12) ప్రతి సైన్యంలోనూ నిప్పుకు సంబంధించిన ఈ ఐదు పరిణామాలు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి, నక్షత్రాల కదలికలను గణించాలి, తగిన రోజుల కోసం కాపు కాయాలి.

13) దాడిలో సహాయకారిగా నిప్పును ఉపయోగించేవారు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దాడిలో సహాయకారిగా నీటిని ఉపయోగించేవారు తమ శక్తిని పెంపొందించుకుంటారు.

14) నీటివలన శత్రువు ప్రయాణించే మార్గానికి ఆటంకం కలుగవచ్చేమోగానీ, అతడు తన సర్వస్వాన్నీ కోల్పోవడం జరుగదు.

15) సాహసోపేతమైన కార్యాలు చేపట్టగల స్ఫూర్తిని పెంపొందించకుండానే తను చేపట్టే యుద్ధాలను గెలవడానికీ, తను చేసే దాడులలో విజయాన్ని సాధించడానికీ ప్రయత్నించేవాడి తలరాత విషాధభరితంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి ప్రయత్నాల ఫలితం సమయం వృధా అవడం, పరిస్థితిలో మార్పు లేకపోవడం.

(అటువంటి స్పూర్తిని పెంపొందించాలంటే యుద్ధంలో ప్రతిభ చూపిన వారికి, దాడులలో కీలక పాత్ర పోషించిన వారికి ఏ మాత్రం అశ్రద్ధ చేయక, తగిన ప్రోత్సాహకాలను వెనువెంటనే అందించాలి.)

16) కనుకనే ఇలా చెప్పబడింది: ప్రాజ్ఞుడైన రాజు దూరదృష్టితో ఈ విషయాన్ని ముందుగానే యోచించి, తన ప్రణాళికలను సిద్ధం చేస్తాడు. మంచి సేనాని తన అధికారులలో, సైనికులలో ప్రతిభ కలవారిని ప్రోత్సహించి వారి పని సామర్థ్యాన్ని పెంపు చేస్తాడు.

(అతడు సైనికులను తన అధికారం ద్వారా నియంత్రిస్తాడు. వారిలో విశ్వాసం పాదుకొల్పడం ద్వారా వారందరినీ సమైక్యంగా ఉంచుతాడు. తగిన పురస్కారాలు అందించడం ద్వారా వారిలో కర్తవ్యపరాయణతను పెంపొందిస్తాడు. విశ్వాసం క్షీణిస్తే సమైక్యత లోపిస్తుంది. పురస్కారాలు లోపభూయిష్టంగా ఉంటే ఆదేశాల మన్నింపు ఉండదు.)

17) సానుకూలత కనిపించకపోతే కదలకు, పొందడానికి ఏదో ఒకటి లేకపోతే నీ బలగాలను ఉపయోగించకు, పరిస్థితి ప్రమాదకరంగా లేకపోతే యుద్ధం చేయకు.

18) ఏ పాలకుడూ కేవలం తన వ్యక్తిగత కోపాన్ని చల్లార్చుకోవడానికి సైన్యాన్ని యుద్ధభూమికి తరలించకూడదు. ఏ సేనానీ కేవలం తన అహం దెబ్బతిన్న కారణంగా యుద్ధానికి పాల్పడకూడదు.

19) నీకు సానుకూలంగా ఉంటుందనుకుంటే ముందడుగు వేయి, లేకుంటే ఉన్నచోటు నుండి కదలకు.

20) కోపం కొంతకాలానికి సంతోషంగా మారవచ్చు; చిరాకు పోయి సంతృప్తి రావచ్చు.

21) కానీ ఒక సారి ధ్వంసం చేయబడిన సామ్రాజ్యం తిరిగి మరలా ఎప్పటికీ ఉనికిలోనికి రాలేదు. అలాగే మరణించిన వారిని తిరిగి ఎప్పటికీ బ్రతికించలేము.

22) కనుక ప్రాజ్ఞుడైన పాలకుడు అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, మంచి సేనాని పూర్తి జాగరూకతతో ఉంటాడు. ఒక దేశాన్ని శాంతియుతంగా ఉంచే పద్దతి, ఒక సైన్యాన్ని దుర్బేధ్యంగా ఉంచే పద్దతి ఇదే.




(పన్నెండవ అధ్యాయం సమాప్తం)




హోమ్‌పేజి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి