16, ఫిబ్రవరి 2012, గురువారం

సన్-జు 'యుద్ధకళ': 10వ అధ్యాయం





యుద్ధకళ




10వ అధ్యాయం: భూస్వరూపం








సన్జు చెప్పాడు:

1) ఆరు రకాలైన భూస్వరూపాలను మనం గుర్తించవచ్చు. అవి:

a. సులువుగా చేరగలిగిన భూమి,

b. చిక్కుకు పోయిన భూమి

c. కాల విలంబనజరిగే భూమి,

d. ఇరుకైన కనుమలు,

e. నిట్టనిలువు శిఖరాలు,

f. శత్రువు నుండి బాగా దూరంగా ఉన్న ప్రాంతాలు

2) ఇరువైపులనుండి స్వేచ్ఛగా రాకపోకలు జరపడానికి అనువైన భూమిని సులువుగా చేరగలిగినదిఅని పిలుస్తారు.

3) ఇటువంటి లక్షణంగల భూమి విషయంలో మెరకగానూ మరియు వెలుతురుతోనూ ఉండే ప్రాంతాలను ఆక్రమించుకోవడంలో నీవు శత్రువు కన్నా ముందుండి, నీ సరఫరా మార్గాలను జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు నీవు సానుకూలతతో యుద్ధంచేయగలుగుతావు.

4) ఒక ప్రదేశాన్ని వదలి వెళ్ళగలిగి, తిరిగి దానిని ఆక్రమించుకోవడం కష్టమైనపుడు దానిని చిక్కుకుపోయిన భూమిఅని పిలుస్తారు.

5) ఇటువంటి ఒక స్థానం నుండి శత్రువు సన్నద్ధతలో లేని పక్షంలోనీవు హఠాత్తుగా ముందుకురికి, దాడిచేసి అతడిని ఓడించవచ్చు. ఐతే శత్రువు నీ రాకకొరకు సంసిద్ధుడై ఉండి, నీవు అతడిని ఓడించడంలో విఫలుడవైతేఅపుడు వెనుకకు తిరిగి రావడం అసాధ్యం అవుతుంది కనుక పెనువిపత్తు సంభవిస్తుంది.

6) మొదటి అడుగు వేయడం మూలంగా ఇరుపక్షాలలో దేనికీ లాభం జరిగే పరిస్థితిలేని ప్రదేశాన్ని కాలవిలంబన జరిగే భూమిగా పిలుస్తారు.

7) ఇటువంటి పరిస్థితిలో శత్రువు మనకు ఆకర్షణీయమైన ఎరను ఇవ్వజూపినప్పటికీ మనం ఆశపడి ముందడుగు వేయకూడదు, పైగా తిరోగమించాలి. ఆ విధంగా శత్రువునే మనం ప్రలోభ పెట్టాలి. అపుడు, అతని సైన్యంలో కొంత భాగం బయటకు వచ్చినపుడు మనం సానుకూలంగా మనదాడిని ప్రయోగించవచ్చు.

8) ఇరుకైన కనుమల విషయంలో, వాటిని మొదట నీవు ఆక్రమించుకోగలిగితే, వాటిలో బలమైన సైనిక రక్షణను ఏర్పరచి ఆపై శత్రువు రాక కోసం వేచిచూడు.

9) శత్రువు నీ కన్నా ముందే కనుమను ఆక్రమించినపుడు కనుమలో బలమైన సైనిక రక్షణ ఉంటే నీవు అతడిని వెంబడించకు, సైనిక రక్షణ బలహీనంగా ఉంటే మాత్రం అతడిని వెంబడించు.

10) నిటారు శిఖరాలకు సంబంధించి, నీవు నీ శత్రువు కన్నా ముందుగా వాటిని చేరితే, మెరకగానూ మరియు వెలుతురుగానూ ఉండే ప్రాంతాలను ఆక్రమించుకొని, అతడి ఆగమనం కొరకు అక్కడ వేచి ఉండు.

11) శత్రువు వాటిని నీకంటే ముందుగా ఆక్రమించితే, నీవు అతడిని అనుసరించకు, పైగా తిరోగమించి అతడు అక్కడినుండి కదిలేటట్లు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించు.

12) నీవు శత్రువు నుండి చాలా దూరంలో ఉండి, ఇరు సైన్యాల బలాలు సమానంగా ఉంటే, యుద్ధాన్ని పురిగొల్పడం అంత తేలిక కాదు. ఒక వేళ యుద్ధం చేసినా అది నీకు ప్రతికూలంగా ఉంటుంది.

13) ఇవి ఆరు కూడా భూమితో ముడిపడి ఉన్న సూత్రీకరణలు. ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని పొందిన సేనాని వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

14) సహజ సిద్ధమైన కారణాలనుండి కాక, సేనాని బాధ్యత వహించవలసిన దోషాలనుండి ఉత్పన్నమయ్యే ఆరు వేరువేరు రకాలైన విపత్తులకు సైన్యం గురి అవుతుంది. అవి : 

a. పలాయనం (Flight),

b. అవిధేయత (Insubordination)

c. వైఫల్యం (Collapse),

d. వినాశనం (Ruin),

e. గందరగోళం (Disorganization),

f. ఓటమి (Rout)

15) మిగతా పరిస్థితులన్నీ సరిసమానంగా ఉండి, ఒక బలగం తన కన్నా పరిమాణంలో పదిరెట్లు పెద్దదైన మరో బలగం మీద ప్రయోగించబడితే, దానిఫలితం మొదటి బలగపు పలాయనం’.

16) సాధారణ సైనికులు మరీ బలంగా ఉండి, వారి అధికారులు మరీ బలహీనంగా ఉన్నపుడు దాని ఫలితం అవిధేయత’. ఆధికారులు మరీ బలంగా ఉండి సాధారణ సైనికులు మరీ బలహీనంగా ఉన్నపుడు దాని ఫలితం వైఫల్యం’.

(అధికారుల వత్తిడి తట్టుకోలేక సైనికులు వైఫల్యం చెందుతారు)

17) ఉన్నతాధికారులు కోపంగా, అవిధేయంగా ఉండి, శత్రువును కలుసుకొన్నపుడు కోపం కారణంగాసర్వ సైన్యాద్యక్షుడు తాను పోరాడగలిగే స్థితిలో ఉన్నాడో లేదో చెప్పటానికంటే ముందేతమ ఇష్టానుసారంగా యుద్ధం ప్రారంభించినపుడు దాని ఫలితం వినాశనం’.

18) సేనాని బలహీనుడూ, పట్టులేనివాడూ అయినపుడు; అతని ఆజ్ఞలు స్పష్టంగా, తేటతెల్లంగా లేనపుడు; అధికారులకు, సైనికులకు నిర్దిష్టమైన విధుల కేటాయింపు జరగనపుడు, శ్రేణులను క్రమపద్దతిలో కాకుండా చిత్తానికి తోచినట్లు రూపొందించినపుడు, దాని ఫలితం పూర్తి గందరగోళం’.

19) ఒక సేనాని శత్రువు శక్తిని అంచనా వేయలేకపోయి, ఒక పెద్దబలగాన్ని ఎదుర్కోవడానికి ఒక చిన్నబలగాన్ని అనుమతించి లేక శక్తివంతమైన సైనిక దళం మీదకు బలహీనమైన దళాన్ని ఉరికించిఎంపిక చేయబడిన సైనికులను ముందరి శ్రేణిలో నెలకొల్పడాన్ని నిర్లక్ష్యం చేసినపుడు దాని ఫలితం తప్పనిసరిగా ఓటమి’.

20) ఓటమి కొనితెచ్చుకొనే ఈ ఆరు విధానాలనూ ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని పొందిన సేనాని తప్పనిసరిగా జాగ్రత్తగా గమనించాలి.

21) దేశ సహజ స్వరూపం సైనికులకు ఉత్తమ సహాయకారిగా ఉంటుంది. ఐతే శత్రువును అంచనా వేసే సామర్థ్యం, విజయం దిశగా బలగాలను నడిపించే సామర్థ్యం అలాగే కష్టాలను, ప్రమాదాలను, దూరాలను సునిశితంగా లెక్కగట్టే సామర్థ్యం ఒక గొప్ప సేనానికి గీటురాళ్ళుగా ఉంటాయి.

22) ఈ విషయాలన్నీ తెలిసి ఉండి, పోరాటంలో తన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టే వ్యక్తి తను చేసే యుద్ధాలను గెలుస్తాడు. వీటిని తెలియనివాడు, ఆచరణలో పెట్టనివాడు తప్పకుండా ఓటమి చెందుతాడు.

23) పోరాటంలో విజయం తప్పక సిద్దిస్తుందనుకున్నపుడు, పాలకుడు నిరాకరించినప్పటికీ, నీవు తప్పక పోరాడాలి; పోరాటంలో విజయం సిద్ధించదనుకున్నపుడు పాలకుడు ఆదేశించినప్పటికీ నీవు ససేమిరా పోరాడకూడదు.

24) కీర్తిని అభిలషించకుండా పురోగమించేవాడు, అగౌరవానికి భయపడకుండా తిరోగమించేవాడు; తన దేశాన్ని రక్షించడం, తన ప్రభువుకు మంచి సేవలందించడం మినహాయించి వేరే ఆలోచన లేనివాడు అయిన సేనాని రాజ్యానికి రత్నాభరణం వంటివాడు.

25) నీ సైనికులను నీ బిడ్డలుగా భావించు, వారు మిక్కిలి లోతైన లోయలలోకి సైతం నిన్ను అనుసరిస్తారు. వారిని నీ స్వంత ప్రియమైన పుత్రులుగా భావించు, వారు మరణంలోకూడా నీ వెంటే నిలచి ఉంటారు.

26) నీవు మెతకవైఖరితో నీ అధికారాన్ని ప్రదర్శించలేకపోయినట్లైతే; దయార్ధ్ర హృదయంతో నీ ఆదేశాలను పాటించేటట్లు వత్తిడి చేయలేకపోయినట్లైతే, మరిముఖ్యంగా అల్లర్లను అణచడంలో నీవు అసమర్థుడవైనట్లైతే అప్పుడు నీ సైనికులు చెడిపోయిన పిల్లల మాదిరిగా తయారవుతారు. ఆచరణాత్మకమైన ఏ ఉద్దేశ్యానికైనా వారు నిరుపయోగం.

27) మనకు మన సైనికులు దాడి చేయగల స్థితిలో ఉన్నారనే విషయం తెలిసి ఉండి, శత్రువు దాడికి అనుకూలంగా లేడనే విషయం తెలియకపోతే, మనం విజయం దిశగా సగం దూరం మాత్రమే ప్రయాణించినట్లు.

28) మనకు శత్రువు దాడికి అనుకూలంగా ఉన్నాడనే విషయం తెలిసి ఉండి, మనసైనికులు దాడి చేయగల స్థితిలో లేరనే విషయం తెలియకపోతే మనం విజయం దిశగా సగదూరం మాత్రమే ప్రయాణించినట్లు.

29) మనకు శత్రువు దాడికి అనుకూలంగా ఉన్నాడనే విషయం తెలిసి ఉండి, అలాగే మన సైనికులు దాడిచేయగల స్థితిలో ఉన్నారనే విషయం కూడా తెలిసి ఉండి, భూమి స్వభావం యుద్ధానికి అనువుగా లేదనే విషయం తెలియకపోతే, అప్పుడు కూడా మనం విజయం దిశగా సగదూరం మాత్రమే ప్రయాణించినట్లు.

30) కనుక అనుభవజ్ఞుడైన సైనికుడు ఒకసారి ముందడుగు వేసిన తరువాత ఎప్పుడూ తికమకకు లోనుగాడు. తన శిబిరం నుండి బయలు దేరటమంటూ జరిగిన తరువాత ఎప్పుడూ నష్టాన్ని పొందడు.

(బయలు దేరడానికి ముందే అన్ని విషయాలు పూర్తిగా ఆలోచిస్తాడు. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా అన్ని జాగ్రత్తలూ ముందే తీసుకుంటాడు.)

31) దీనినిబట్టి ఇలా చెప్పబడింది: నీకు నీ శత్రువు గురించీ, అలాగే నీ గురించి కూడా తెలిసి ఉన్నట్లైతే నీ విజయం సందేహాస్పదం అవదు. నీకు వాతావరణం గురించీ, అలాగే భూస్వరూపం గురించి కూడా తెలిసి ఉన్నట్లైతే నీవు సంపూర్ణ విజయాన్ని పొందుతావు.




(పదవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి





3 కామెంట్‌లు:

  1. సరస్వతి కుమార్ గారు,
    ఎంతో సమయం వెచ్చించి ఈ పుస్తకం తెలుగులోకి అనువదిస్తున్నారు కదా, ఇది చదివిన పాఠకులు దీనివలన ఎటువంటి లాభం ఉందనుకొంట్టున్నారు? ఎప్పుడో పురాతన యుద్ద తంత్రాలను తెలుసుకొని చేయదగినది ఎముంది? ఈ రోజులలో యుద్ద స్వరూపమే మారిపొయింది. మీరు ఇటువంటి పుస్తకాన్ని అనువదించి రాసేదాని కన్నా తెలుగులోకి వర్తమాన మేధావులు రాసిన వ్యాసాలను అనువదిస్తే ఉపయోగం వుoట్టుంది.

    రిప్లయితొలగించండి
  2. సాంబశివుడు గారూ! మీ సూచనకు ధన్యవాదాలు!


    ఈ గ్రంథం గురించి సరైన అవగాహన లేకపోవడం వలనే మీరు పైవిధంగా వ్యాఖ్యానించి ఉంటారు. ఓ సారి హోమ్‌పేజీ కెళ్ళి ఈ గ్రంథపరిచయాన్ని చదవండి.


    ఇక వర్తమాన మేథావులు రాసే వ్యాసాలు తెలుగులోకి అనువదిస్తే మంచిది అన్నారు. నిజమే, కానీ నాకున్న సమయంలో నేను ఎంపిక చేసుకున్న వాటినే నేను అనువదించగలను.


    ఈ గ్రంథం పురాతనకాలంలో రచించబడిన మాట నిజమే కానీ ఈ గ్రంథంలో ఉన్న విషయం కాలాతీతమైనది.

    రిప్లయితొలగించండి
  3. నెగెటివ్ గా స్పందించిన ఆయనకు ఇందులోని విజ్ఞానం గురించి అసలు అర్థము కాలేదు. నేను ఈ బుక్ గురించి నెట్లో చాలా వెతికాను. అన్న గారు మీరు చేసిన ఈ అనువడానికి చాలా కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి