యుద్ధకళ
3వ అధ్యాయం:ఎత్తుగడే ఆయుధం
సన్–జు
చెప్పాడు:
1) యుద్ధంలో శత్రుదేశాన్ని స్వాధీనం చేసుకునేటపుడు దానికి హాని
జరగకుండా చూడటం, అది ముక్కలవకుండా ఒకే
రాజ్యంగా ఉండేటట్లు చూడటం అన్నింటికన్నా ఉత్తమమైన విషయం. దానిని తునాతునకలు చేసి
నాశనం చేయడం అంత మంచిది కాదు. అలాగే ఒక సైన్యాన్ని గానీ, ఒక రెజిమెంటును గానీ, ఒక
డిటాచ్‌మెంటును గానీ, ఒక కంపెనీని గానీ
పట్టుకున్నపుడు వాటిని నాశనం చేయడం కన్నా పదిలంగా ఉంచడమే మంచిది.
2) కనుక నీవు తలపెట్టిన యుద్ధాలన్నింటిలోనూ పోరాడి గెలుపొందటం
సర్వోత్తమ నైపుణ్యం అనిపించుకోదు. సర్వోత్తమ నైపుణ్యం ఏమిటంటే పోరాటం లేకుండానే శత్రు ప్రతిఘటనను అంతం
చేయడం.
3) ఈ విధంగా అన్నింటికన్నా ఉత్తమ సేనాధిపత్యం అంటే శత్రు పథకాలు కార్యరూపం
దాల్చకుండా అడ్డుకోవడం; తరువాత
ఉత్తమమైనది శత్రు బలగాలను
ఒకదానితో మరొకటి వచ్చిచేరనీయకపోవడం; తరువాత
ఉత్తమమైనది శత్రుసైన్యం మీద యుద్ధరంగంలో దాడిచేయడం; అన్నిటికన్నా అధమ విధానం కోటకట్టిన నగరాలను ముట్టడించడం.
4) అవకాశమున్నంత వరకు రక్షణ గోడలు కట్టిన నగరాలను ముట్టడించక
పోవడం అనేది ఒక నియమం. ఎందుకంటే అటువంటి ముట్టడిలో రక్షణ కవచాలు, కదిలే రక్షణ నిలయాలు, వివిధ రకాల యుద్ధ పరికరాలు; వీటన్నింటినీ సిద్ధం చేయడానికి మూడునెలల
పూర్తికాలం తీసుకుంటుంది. మరలా గోడల కెదురుగా మట్టి గుట్టల నిర్మాణానికి మరొక మూడు
నెలలు పడుతుంది.
5) సేనాని ఓర్పు నశించిపోయి తన సైన్యాన్ని కోటమీద దాడిచేయడానికి
చీమల దండులాగా వదులుతాడు. వారిలో మూడింట ఒక వంతు సైనికులు చంపివేయబడతారుగానీ నగరం
స్వాధీనం కాదు. ముట్టడి వలన ఆ విధమైన విపత్తులు సంభవిస్తాయి.
6) కనుక నైపుణ్యం కలిగిన నాయకుడు శత్రుసైన్యాలను పోరాటం లేకుండానే
లోబరుచుకుంటాడు. అతడు వారి నగరాలను ముట్టడి వేయకుండానే స్వాధీనం చేసుకుంటాడు. అతడు
యుద్ధరంగంలో దీర్ఘకాలం పోరాడకుండానే వారి రాజ్యాన్ని అంతం చేస్తాడు.
7) తన బలగాలకు ఏ విధమైన హాని జరగకుండానే అతడు రాజ్యపాలకులతో తగవు
పడతాడు. ఆ విధంగా ఒక్క సైనికుడిని కూడా కోల్పోకుండా సంపూర్ణ విజయాన్ని సాధిస్తాడు.
‘ఎత్తుగడే ఆయుధం’గా దాడి చేసే పద్దతి ఇదే.
8) ఇది యుద్ధనియమం: మన బలగాలు శత్రు బలగాలకు పదింతలు ఉంటే వారిని
చుట్టుముట్టాలి, ఐదింతలు ఉంటే వారిమీద
సూటిగా దాడి చేయాలి, రెండింతలు ఉంటే మన
సైన్యాలను రెండుగా విభజించాలి,
9) సమానంగా ఉంటే మనం యుద్ధాన్ని ప్రతిపాదించాలి; సంఖ్యలో కొంచెం తక్కువగా ఉంటే శత్రువును
ఎదుర్కోవడాన్ని అప్పటికి దాటవేయాలి; ప్రతీ
విషయంలోనూ అసమానంగా ఉంటే మనం అతడినుండి పారిపోవాలి.
10) ఎందుకంటే, చిన్నసైన్యం
మొండిగా పోరాడినప్పటికీ చివరికి పెద్దసైన్యానికి పట్టుబడిపోతుంది.
11) సైన్యాధిపతి దేశానికి రక్షణకుడ్యం వంటివాడు. ఈ రక్షణకుడ్యం
అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉంటే రాజ్యం బలీయంగా ఉంటుంది; లోపభూయిష్టంగా ఉంటే బలహీనంగా ఉంటుంది.
12) ఒక పాలకుడు మూడు విధాలుగా తన సైన్యానికి ముప్పు తెచ్చిపెడతాడు.
13) (1) సరైన సమాచారం లేకుండా సైన్యానికి ఆదేశాలను జారీ చేయడం: సైన్యం
తన ఆజ్ఞలను తలదాల్చగల స్థితిలో లేదనే విషయం తెలుసుకోకుండా దానిని పురోగమించమనో లేక
తిరోగమించమనో ఆదేశించడం ద్వారా—దీనిని
సైన్యం కాళ్ళను బంధించివేయడం అంటారు.
(సైన్యం పురోగమించలేని స్థితిలో ఉన్నపుడు ఆ విషయాన్ని తెలుసుకోక
పురోగమించమని ఆజ్ఞాపించడం, లేక
తిరోగమించలేని స్థితిలో ఉన్నపుడు అది తెలుసుకోలేక తిరోగమించమని ఆజ్ఞాపించడం)
14) (2) సైనిక నిర్ణయాలలో అనవసర జోక్యం: సైన్యానికి సంబంధించిన విషయాల యెడల
అవగాహన లేకుండా రాజ్యాన్ని పరిపాలించినట్లుగానే సైన్యంతో గూడా వ్యవహరించడానికి
యత్నించడం ద్వారా—ఇది సైనికుల మనసులలో
అవిశ్రాంతతకు కారణమవుతుంది.
15) (3) సైనిక నియామకాలలో అనవసర జోక్యం: పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం అనే
సైనిక నియమం యెడల అవగాహన లేకుండా తన సైన్యంలోని అధికారులను విచక్షణారహితంగా
నియమించడం ద్వారా—దీనివలన సైనికుల
ఆత్మవిశ్వాసం సడలిపోతుంది.
16) సైన్యం అవిశ్రాంతంగా ఉండి, దానికి ఆత్మవిశ్వాసం లేనపుడు ఇతర రాజులనుండి తప్పక ముప్పు
వస్తుంది. సైన్యంలోనికి అరాచకాన్ని తేవడం,
విజయాన్ని దూరంగా తరిమివేయడం అంటే ఇదే.
17) ఈ విధంగా విజయానికి ఐదు ముఖ్యావసరాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఆవి:
a. ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు
పోరాడకూడదో తెలిసినవాడు గెలుపొందుతాడు.
b. పెద్దసైన్యం,
చిన్నసైన్యం—ఈ రెంటితో ఎలా
వ్యవహరించాలో తెలిసినవాడు గెలుపొందుతాడు.
c. ఎవరిసైన్యంలో శ్రేణులన్నీ ఒకే స్ఫూర్తితో ప్రేరేపించబడి ఉంటాయో
అతడు గెలుపొందుతాడు.
d. తాను సిద్ధంగా ఉండి, సిద్ధంగా
లేని శత్రువును పట్టుకోవడానికి వేచియుండేవాడు గెలుపొందుతాడు.
e. ఎవరు సైనిక వ్యవహారాలలో సమర్థత కలిగి ఉండి, పాలకుడి జోక్యం లేకుండా ఉంటాడో అతడు
గెలుపొందుతాడు.
18) దీనిని బట్టి ఇలా చెప్పబడింది: నీకు నీ గురించీ, నీ శత్రువు గురించి కూడా తెలిసి ఉంటే
నీవు వంద యుద్ధాలు చేసినా, ఒక్క
దాని ఫలితం గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. నీకు కేవలం నీ గురించే తెలిసి ఉండి,
నీ శత్రువు గురించి మాత్రం తెలియకపోతే నీవు
పొందే ప్రతీ గెలుపుకీ బదులుగా మరో ఓటమిని కూడా అనుభవిస్తావు. మరినీకు నీ గురించీ,
నీ శత్రువు గురించి కూడా తెలియకపోతే
నీవు చేసే ప్రతీ యుద్ధంలోనూ ఓడిపోతావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి