యుద్ధకళ
8వ అధ్యాయం: ఎత్తుగడలలో మార్పు
సన్–జు
చెప్పాడు :
1) యుద్ధానికి సంబధించి సేనాని తన సార్వభౌముడు నుండి ఆదేశాలను
స్వీకరించి, తదనుగుణంగా
సైన్యాన్ని సమీకరించి, తన
బలగాలను ఏకీకృతం చేస్తాడు.
2) కష్టాలమయమైన ప్రదేశంలో శిబిరాన్ని ఏర్పాటు చేయకు. ప్రధాన
రహదారుల కూడలి ఉండే సరిహద్దుప్రాంతంలో మిత్రులతో చేయి కలుపు. ప్రమాదకరంగా వేరుపడి
ఉన్న ప్రాంతంలో రోజులు వెళ్ళదీయకు, దిగ్బంధం
చేయబడిన పరిస్థితులలో నీవు తప్పనిసరిగా ఎత్తుగడమీద ఆధారపడు. అత్యంత ప్రమాదకరంగా
ఉన్న స్థితిలో నీవు తప్పక పోరాడు.
3) కొన్ని రహదారులుంటాయి—వాటిలో
ప్రయాణించకూడదు; కొన్ని సైన్యాలుంటాయి—వాటిమీద దాడి చేయకూడదు; కొన్ని పట్టణాలుంటాయి—వాటిని ముట్టడించకూడదు; కొన్ని స్థావరాలుంటాయి—వాటి కొరకు పోటీపడకూడదు; సార్వభౌముని ఆదేశాలు కొన్ని ఉంటాయి—వాటిని పాటించకూడదు.
4) ఎత్తుగడలలో మార్పుతో ఒనగూడే ప్రయోజనాలను చక్కగా అవగతం
చేసుకున్న సేనాని తన బలగాలను ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటాడు.
5) అలా అవగతం కాని సేనాని యుద్ధం జరిగే దేశపు భూస్వరూపం గురించి
బాగా తెలిసి ఉన్నప్పటికీ, ఆ
విజ్ఞానం నుండి అతడు ఆచరణాత్మకంగా ఎటువంటి ప్రయోజనాన్నీ పొందలేడు.
6) ఎత్తుగడలను మార్చే యుద్ధకళలో నేర్పరితనం లేని
యుద్ధవిద్యార్థికి "ఐదు సానుకూలతల"ను గురించి తెలిసి ఉన్నప్పటికీ అతడు
తన సైనికులను ఉత్తమంగా ఉపయోగించుకోవడంలో విఫలమౌతాడు.
[ఐదు సానుకూలతలు:
(1) ఏదైనా ఒక రహదారి దగ్గరదారి ఐతే, దానిలో తప్పక ప్రయాణించాలి.
(2) ఒక పటాలం వేరు పడి ఉంటే, దానిమీద తప్పక దాడి చేయలి.
(3) ఒక పట్టణం ప్రమాదకర పరిస్థితిలో ఉంటే, దానిని తప్పక ముట్టడించాలి.
(4) ఒక స్థావరం దాడికి అనుకూలంగా ఉంటే, తప్పక దాడికి పాల్పడాలి.
(5) సైనిక కార్యకలాపాలకు సరిపోయే విధంగా ఉంటే, సార్వభౌముని ఆదేశాలను తప్పక పాటించాలి.
ఐతే ఒక సేనాని ఇటువంటి సానుకూలతల నుండి ప్రయోజనాన్ని పొందకూడని
పరిస్థితులు కూడా తలయెత్తుతాయి. ఉదాహరణకు ఒక రహదారి దగ్గర దారి అయినా కూడా ఆ దారి
గుండా ఎన్నో ఆటంకాలుంటాయని తెలిసిన పక్షంలో లేక శత్రువు ఆ మార్గంలో మాటువేసి
ఉన్నాడని తెలిసిన పక్షంలో ఆ దారిలో వెళ్ళకూడదు; అలాగే శత్రుసైన్యం దాడిచేయ వీలైనదిగా ఉన్నాకూడా అది నిస్పృహతో
కూడిన తెగింపుతో ఉన్నదని తెలిస్తే తప్పక దానినుండి దూరంగా ఉండాలి—ఇలా సేనానికి పరిస్థితిని బట్టి
ఎత్తుగడలను మార్చగల నేర్పరితనం ఉండాలి.]
7) అందువలన వివేకవంతుడైన సేనానాయకుడి పథకాలలో సానుకూలతల గురించిన
ఆలోచనలు, ప్రతికూలతల గురించిన
ఆలోచనలు రెండూ కలగలసి ఉంటాయి.
8) సానుకూలతలు గురించిన మన ఆశలను, ఊహలను ఈ విధంగా*
మితిమీరకుండా ఉంచగలిగితే మన పథకాలలోని ముఖ్యమైన భాగాన్ని నెరవేర్చడంలో మనం
సఫలమైనట్లే.
(ఈ విధంగా*:
ప్రతికూలతల గురించి కూడా యోచించడం ద్వారా)
9) మరోప్రక్క,
కష్టాలమధ్యలో ఒక సానుకూలతను
చేజిక్కించుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లైతే మనల్ని మనం దురదృష్టం
బారినుండి విముక్తి చేసుకోగలం.
10) కష్టాన్నీ, నష్టాన్నీ
కలిగించడం ద్వారా శత్రుసేనానులను బలహీనపరచు, వారు నిరంతరం పనితో సతమతమయ్యేటట్లు చేయి, ఊరించే ఆకర్షణలను వారి ముందు ఉంచు,
ఏ దైనా ప్రదేశానికి వారు అనాలోచితంగా
దూసుకొచ్చేటట్లు చేయి.
11) శత్రువు రాకుండా ఉండే సంభావ్యత మీద కన్నా, శత్రువు వచ్చినపుడు అతడిని ఎదుర్కొనే మన
స్వీయ సంసిద్ధత మీద మనం అధారపడటం; అలాగే
అతడు దాడిచేయకపోయే అవకాశం మీదకన్నా, మన
పరిస్థితిని దుర్నిరీక్ష్యంగా చేసుకోవడం మీద మనం ఆధారపడటం యుద్ధకళ మనకు
నేర్పుతుంది.
12) ఒక సేనానిని ప్రభావితం చేయగల ప్రమాదకర లోపాలు ఐదు ఉన్నాయి:
a. నిర్లక్ష్యం—ఇది
వినాశనానికి దారితీస్తుంది.
b. పిరికితనం—ఇది
పట్టివేతకు దారితీస్తుంది.
c. త్వరగా ఆవేశపడే లక్షణం—అవమానాల
ద్వారా రెచ్చగొట్టబడుతుంది.
d. సున్నిత మనస్తత్వం—నిందలను
తట్టుకోలేదు.
e.తన
సైనికుల మీద వల్లమాలిన ప్రేమ—అతనిని
చింతకు, కష్టానికి
గురిచేస్తుంది.
[నిర్లక్ష్యం:
ముందుచూపులేని మొరటుధైర్యం గలిగిన సేనాని పిచ్చెక్కిన ఎద్దువలే గుడ్డిగా, ప్రమాదకరంగా పోరాడుతూ నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తాడు. అటువంటి సేనానిని ప్రత్యర్ధులు తాము మాటువేసి ఉన్న ప్రాంతంలోకి
ఎరవేసి రప్పించి, అక్కడ
వధిస్తారు.
పిరికితనం:
పిరికితనం వలన సేనాని ఏదైనా ఒక ప్రయోజనాన్ని చేజిక్కించుకోవడానికి ముందడుగు
వేయలేడు, ప్రమాదం కనబడిన
వెంటనే పారిపోవడం గురించి ఆలోచిస్తాడు. ప్రాణాలతో ఇంటికి తిరిగివెళ్ళాలనుకుంటూ
ప్రమాదంలోకి అడుగిడలేడు. అటువంటి వాడు శత్రువులచేతిలో ఓడిపోయి, వారికి పట్టుబడిపోతాడు.
త్వరగా ఆవేశపడే లక్షణం: పోరాటాన్ని ప్రారంభించేటట్లుగా శత్రువులు అతడిలో ఆగ్రహాన్ని
రగిలించి, తరువాత ఆ పోరాటంలోనే
అతడిని వధిస్తారు.
సున్నిత మనస్తత్వం: శత్రువు తన మీద దుష్ప్రచారం ద్వారా చేసే మానసిక యుద్ధంలో
ఓడిపోతాడు.
తన సైనికుల మీద వల్లమాలిన ప్రేమ: తన బలగాల సంక్షేమం యెడల నిర్లక్ష్యం
చూపాలని సన్–జు ఉద్దేశ్యం కాదు.
తన సైనికులకు ఆ క్షణానికి ఒనగూడే సౌకర్యం కొరకు ఏదైనా ఒక ముఖ్యమైన సైనిక
ప్రయోజనాన్ని త్యాగం చేయడంలో ఉండే ప్రమాదాన్నే అతడు తెలియజేస్తున్నాడు. అటువంటి
హ్రస్వదృష్టి విధానాల పర్యవసానంగా దీర్ఘకాలంలో ఓటమి చెందటం మూలంగా గానీ లేక సాగదీత
యుద్ధం వలన గానీ సైన్యం అంతకంటే ఎక్కువ కష్టాన్నే ఎదుర్కోవలసి వస్తుంది.]
13) ఒక సేనానిలో ఉండే చుట్టుముట్టే పాపాల్లాంటి ఈ దోషాలు
యుద్ధనిర్వహణకు వినాశకరం.
14) ఒక సైన్యం ఓటమి చెంది, దాని
నాయకుడు వధింపబడినప్పుడు దానికి కారణం ఈ ఐదు ప్రమాదకర లోపాలలోనే ఖచ్చితంగా
కనబడుతుంది. కనుక అవి నిరంతరం ధ్యానించవలసిన విషయాలుగా ఉండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి