యుద్ధకళ
9వ అధ్యాయం: సైన్యం కదలిక
సన్–జు
చెప్పాడు:
1) ఇప్పుడు మనం సైనిక శిబిరం ఏర్పాటు చేసుకోవటం, శత్రువు ఆనవాళ్ళను పరిశీలించటం అనే విషయాలకు
వచ్చాం. పర్వతాలనుండి త్వరత్వరగా తప్పుకుని లోయల చెంతకు రా!
(లోయలలో ఆహారం, నీరు
దొరుకుతుంది, పర్వతాలమీద అవి
దొరకవు.)
2) సూర్యునికి అభిముఖంగా ఎత్తైన ప్రదేశాలమీద విడిది చెయ్యి.
ఎత్తైన ప్రదేశం మీద ఉన్న శత్రువుతో పోరాటం కొరకు నీవు ఆ ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహించకు.
(ఎత్తైన ప్రదేశాలమీద విడిది చెయ్యి అంటే పర్వాతాలమీద కాదు. లోయలలోనే కొంచెం
ఎత్తుగా ఉండే ప్రదేశంలో)
పర్వత
ప్రాంత యుద్ధం గురించి తెలుసుకున్నాం.
3) నదిని దాటిన తరువాత నీవు దానినుండి దూరంగా వెళ్ళిపోవాలి.
(శత్రువు కూడా ఆ నదిని దాటేటట్లు ప్రేరేపించడానికి)
4) దండెత్తివస్తున్న సైన్యం నదిని దాటుతున్నపుడు దానితో
తలపడటానికి ప్రవాహం మధ్యలోకి ఎదురెళ్ళకు. సగం సైన్యాన్ని నదిని దాటనిచ్చి, అప్పుడు దాడి చేయడం ఉత్తమం.
5) నీవు పోరాటం కొరకు ఆతురతతో ఉన్నట్లైతే, శత్రువు దాటవలసిన నది సమీపంలో అతడిని ఎదుర్కోవడానికి వెళ్ళకు.
6) నీ పడవను శత్రువుకన్నా ఎగువగానూ, సూర్యునికి అభిముఖంగానూ లంగరు వేయి. శత్రువును ఎదుర్కోవడానికి
ప్రవాహానికి ఎదురెళ్ళకు.
నదీ
యుద్ధం గురించి తెలుసుకున్నాం.
7) ఉప్పునీటి కయ్యలను, బురదనేలలను
దాటేటపుడు నీ దృష్టిని పూర్తిగా వాటిని ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరత్వరగా
అధిగమించడం మీదే ఉంచాలి.
8) అటువంటి నేలలలో యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తే నీకు
సమీపంలో నీరు, గడ్డి ఉండేటట్లు,
అలాగే నీ వెనుకవైపు చెట్ల సమూహం
ఉండేటట్లు చూసుకో.
ఉప్పునీటి
కయ్యలలో సైనిక వ్యవహారాల గురించి తెలుసుకున్నాం.
9) పొడిగా, చదునుగా
ఉన్న భూభాగంలో నీ కుడివైపూ,
నీ వెనుకవైపూ ఎత్తైన ప్రదేశం ఉన్నటువంటి సులువుగా చేరుకోగల స్థితిని చేపట్టు.
అప్పుడు ముందువైపు మాత్రమే ప్రమాదానికి అవకాశం ఉండి, వెనుకవైపు రక్షణ ఉంటుంది.
చదునైన
ప్రాంతంలో సైనిక విన్యాసాల గురించి తెలుసుకున్నాం.
10) సైనిక పరిజ్ఞానానికి సంబంధించిన ఈ నాలుగు ఉపయోగకరమైన శాఖలు
ప్రాచీనకాలపు చైనా చక్రవర్తి అయిన Yellow Emperor నలుగురు రాజులను జయించడానికి (వేరువేరుయుద్ధాలలో) దోహదపడ్డాయి.
11) అన్ని సైన్యాలూ పల్లపు ప్రాంతంకన్నా ఎత్తైన ప్రదేశానికి;
అలాగే వెలుతురు లేని ప్రాంతంకన్నా
వెలుతురు ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తాయి.
12) నీ సైనికుల మీద నీకు శ్రద్ధ ఉండి, ఆహారం, నీరు
పుష్కలంగా దొరికే ఆరోగ్యకరమైన ప్రాంతంలో నీవు శిబిరాన్ని ఏర్పాటుచేస్తే వారికి
ఎటువంటి వ్యాధులు సంక్రమించవు—ఆరోగ్యవంతమైన
సైన్యం అజేయమైనది.
13) నీవు ఒక కొండ వద్దకు గానీ లేక నదిగట్టు వద్దకు గానీ వచ్చినపుడు
సూర్యకిరణాలు పడే భాగాన్ని ఆక్రమించుకో. వాలు ప్రాంతం నీ కుడివెనుక ఉండాలి. ఆ విధంగా నీవు
ఒకేసమయంలో నీ సైనికులకు సహాయకరంగా పనిచేయనూ గలవు, అలాగే భూమి సహజ సానుకూలతలను ఉపయోగించుకోనూగలవు.
14) ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాల మూలంగా నీవు
దాటాలనుకుంటున్న నది పొంగి పొర్లుతూ ప్రవహిస్తుంటే, ఆ వరద తగ్గుముఖం పట్టే వరకు నీవు తప్పనిసరిగా వేచి ఉండాలి.
15) నిట్టనిలువుగా ఉన్న కొండ చరియల మధ్యన ప్రవాహాలున్నటువంటి,
సహజసిద్ధంగా ఏర్పడిన లోతైన
సొరంగాలున్నటువంటి, దిగ్బంధం చేయబడిన
ప్రదేశాలున్నటువంటి, అడుగుముందుకు
వేయలేకుండా అల్లుకుపోయిన దట్టమైన పొదలతో కూడినటువంటి, బురదనేలలు గానీ లేక నేలలో లోతైన పగుళ్ళు గానీ ఉన్నటువంటి
ప్రాంతాన్ని సాధ్యమైనంత వేగంగా వదిలిపెట్టాలి. దానినెప్పుడూ సమీపించకూడదు.
16) అటువంటి ప్రదేశాలకు మనం దూరంగా ఉంటూ శత్రువు వాటిని సమీపించేటట్లు
చేయాలి. వాటికి మనం అభిముఖంగా ఉన్నపుడు శత్రువుకు అవి వెనుకవైపు ఉండేటట్లు చేయాలి.
17) నీ శిబిరానికి పొరుగున ఏదైనా కొండ ప్రదేశం గానీ, చుట్టూ గడ్డి ఉన్న సరస్సులు గానీ,
నీటిలో పెరిగే చెట్లతో నిండిన లోయలుగానీ,
దట్టంగా అల్లుకుపోయిన పొదలతో కూడిన
అడవిగానీ ఉన్నట్లైతే ఆ ప్రదేశాలన్నింటినీ జాగ్రత్తగా గాలించాలి. ఎందుకంటే అవి శత్రువులు
మాటువేసి ఉండటానికిగానీ, లేక
జిత్తులమారి గూఢచారులు నక్కి ఉండటానికిగానీ అవకాశం ఉన్న ప్రదేశాలు.
18) శత్రువు అతి చేరువలో ఉండి, నిశ్చలంగా ఉంటే అతడు తన స్థావరం యొక్క సహజసిద్ధమైన బలం మీద
ఆధారపడుతున్నాడని అర్థం.
(బలమైన ఆ స్థావరాన్ని వదిలితే అతడు బలహీనపడతాడు కనుక దాని నుండి
కదలడు)
19) అతడు దూరంగా ఉండి పోరాటానికి కవ్విస్తుంటే, నీవు ముందడుగు వేయడానికి అతడు ఆతురత
చెందుతున్నాడని అర్థం.
(ఆ విధంగా నీవు నీ సూరక్షితమైన స్థావరాన్ని వదలాలని అతడి కోరిక)
20) అతడు శిబిరం ఏర్పాటు చేసిన ప్రదేశం సులువుగా చేరుకోదగినదిగా
ఉంటే అతడు ఎరవేస్తున్నాడని అర్థం.
21) అడవిలోని చెట్లమధ్య కదలిక శత్రువు పురోగమిస్తున్నాడన్న
విషయాన్ని తెలియజేస్తుంది. దట్టమైన పొదల మధ్యన అడ్డుతెరలు అనేకం కనిపిస్తే మనం
అనుమానపడాలని శత్రువు కోరుకుంటున్నాడని అర్థం.
(తెరలవెనుక శత్రువు మాటువేసి ఉండి ఉంటాడనే అనుమానం మనకు కలగాలని
శత్రువు ఉద్దేశ్యం. కానీ ఆ తెరలు శత్రువు పారిపోయాడన్న దానికి సంకేతం)
22) పక్షులు తమ ప్రయాణం మధ్యలో హఠాత్తుగా మరింత ఎత్తుకు వెళితే,
అది శత్రువు పొదలలో మాటువేసి ఉండటాన్ని
సూచిస్తుంది. భయపడిన జంతువులు ‘హఠాత్తుదాడి’
జరగబోతున్నదనే విషయాన్ని సూచిస్తాయి.
23) ఎగసిన ధూళి నిట్టనిలువుగా, చాలా ఎత్తువరకూ వ్యాపించటం రథాలు పురోగమిస్తున్నాయన్నదానికి
గుర్తు; ధూళి తక్కువ ఎత్తులో
వెడల్పుగా విస్తరిస్తే అది పదాతిదళం సమీపిస్తుండటానికి సంకేతం, ధూళి వివిధ దిశలలో విస్తరిస్తే అది
కట్టెలు సేకరించడానికి బృందాలు పంపబడ్డాయన్న విషయాన్ని తెలుపుతుంది; కొద్ది సంఖ్యలో ధూళిమేఘాలు అటూఇటూ
కదులుతుండటం సైన్యం విడిది ఏర్పాట్లు చేసుకోవడాన్ని సూచిస్తుంది.
(రథాలు గానీ, వాటికి
కట్టబడిన గుఱ్ఱాలు గానీ మనిషి కన్నా చాలా ఎక్కువ బరువు ఉంటాయి. అందువలన అవి
కదిలేటపుడు ధూళి మనుషులు కదిలేటపుడు కన్నా ఎక్కువ ఎత్తు లేస్తుంది. అంతేకాక రథాలు
ఒకదానివెనుక ఒకటిగా ప్రయాణిస్తాయి కనుక ధూళిమేఘం వెడల్పుగా ఉండదు. అదే పదాతి దళం
కదిలేటపుడు అది అనేక వరుసలలో ఉన్నప్పటికీ ప్రతీ వరుసలోనూ ఒకరి పక్కన ఒకరుగా చాలా
వెడల్పుగా సైనికులుంటారు కనుక వారు కదిలేటపుడు ధూళి వెడల్పుగా వ్యాపిస్తుంది.)
24) అణకువ కలిగిన మాటలు,
పెరిగిన యుద్ధ సన్నాహాలు—శత్రువు
పురోగమించబోతున్నాడనేదానికి సంకేతాలు. కఠినమైన భాష, దాడి చేయడానికన్నట్లుగా ముందుకు చొచ్చుకు రావడం—అతడు పారిపోతాడనేదానికి సంకేతాలు.
25) తేలిక పాటి రథాలు ముందుగా వచ్చి రణరంగపు పక్క ప్రాంతాలలో తమ
స్థానాన్ని స్వీకరిస్తే అది శత్రువు యుద్ధానికి ఆయత్తమవుతుండటాన్ని సూచిస్తుంది.
26) ప్రమాణపూర్వకమైన ఒప్పందం తోడుగా లేని శాంతి ప్రతిపాదనలు
కుట్రను సూచిస్తాయి.
27) రణరంగంలో పరుగులు మొదలై, సైనికులందరూ తమ తమ స్థానాలను చేరుకుంటుంటే కీలక సమయం
వచ్చేసిందని అర్థం.
28) కొందరు పురోగమిస్తూ, కొందరు
తిరోగమిస్తూ కనబడితే అది ఒక ప్రలోభం.
29) సైనికులు తమ బల్లాలమీద వాలిపోయి నిలబడినప్పుడు వారు ఆకలితో
నీరసించి పోయినట్లు.
30) మంచి నీరు తేవడానికి పంపబడిన వారు ముందుగా తాము నీరు త్రాగడంతో
పనిప్రారంభిస్తే సైన్యం దప్పికతో బాధపడుతున్నట్లు.
31) తాము పొందగలిగిన ప్రయోజనాన్ని శత్రువు గమనించి కూడా దానిని
పొందడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకపోతే సైనికులు డస్సిపోయినట్లు.
32) ఏదైనా ప్రాంతంలో పక్షులు మూగితే అక్కడ ఎవరూ లేనట్లే*. రాత్రి పూట ఉద్వేగపూరితమైన అరుపులు
వినిపిస్తుంటే అది శత్రువు భయంతో ఉన్నాడన్నదానికి సంకేతం.
(అక్కడ ఎవరూ లేనట్లే*: శత్రువు అక్కడినుండి వెళ్ళిపోయాడని అర్థం)
33) శిబిరంలో అలజడి చెలరేగితే, సేనాని అధికారం బలహీనంగా ఉన్నదని అర్థం. జండాలు, చిహ్నాలు మారిపోతుంటే తిరుగుబాటును
రెచ్చగొట్టే చర్యలు ఊపందుకున్నాయని అర్థం. ఆధికారులు కోపంగా ఉన్నారంటే, సైనికులు అలసి పోయారని అర్థం.
34) ఒక సైన్యం తన గుఱ్ఱాలకు ధాన్యాన్ని ఆహారంగా అందిస్తూ, తమ ఆహారం కొరకు పశువులను వధిస్తుంటే;
అలాగే తమ గుడారాలకు తాము ఇక తిరిగి
రామని తెలిపే విధంగా సైనికులు శిబిరంలో వేసిన మంటలపై వంటపాత్రలను వ్రేలాడదీయకపోతే—వారు మరణించేవరకూ తెగించి పోరాడటానికి
నిర్ణయించుకున్నారని నీవు తెలుసుకోవచ్చు.
(మామూలు సమయాలలో సైన్యం తాము ధాన్యాన్ని ఆహారంగా స్వీకరించి,
గుఱ్ఱాలకు ప్రధానంగా గడ్డిని ఆహారంగా పెడుతుంది,
పశువులను సంరక్షించుకుంటుంది. చావుకు
సిద్ధపడిన సమయంలో ఇక పశువులు ఉండీ ఎవరికి ప్రయోజనం అనుకొని, బ్రతికిఉన్న కొద్ది దినాలూ రుచికరమైన
మాంసాహారం తినే ఉద్దేశ్యంతో వారు పశువులను వధిస్తారు. తాము తినే ధాన్యాన్ని గుఱ్ఱాలకు పెడతారు.)
35) సైనికులు చిన్న చిన్న సమూహాలుగా చేరి గుసగుసలాడుకుంటున్న లేక
తగ్గుస్వరంతో మాట్లాడుకుంటున్న దృశ్యం సైన్యపు క్రింది స్థాయిలోని అసంతృప్తిని సూచిస్తుంది.
36) చాలా తరచుగా ఇవ్వబడే బహుమతులు శత్రువు నిల్వలు తరిగి
పోతున్నాయన్నదానికి గుర్తు. మరీ ఎక్కువ సంఖ్యలో శిక్షలు వారు అత్యంత తీవ్రమైన
బాధను ఎదుర్కొంటున్నారనే దానిని బయటపెడతాయి.
(శత్రువు దిగ్బంధం చేయబడి అతడికి సరఫరాలు నిలచిపోతే అతడి
నిల్వలు తరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో తిరుగుబాటు చెలరేగే ప్రమాదముంది కనుక
సైనికులను సంతోష పెట్టడానికి తరచుగా బహుమతులు ఈయబడతాయి. అలాగే శత్రుసైన్యం దుర్భరమైన
పరిస్థితిలో ఉంటే వారిలో క్రమశిక్షణ లోపిస్తుంది కనుక వారిని దారిలో పెట్టడానికి
తరచుగా శిక్షలు అమలౌతుంటాయి)
37) సేనాని మొదట డంబాలు పలికి, తరువాత శత్రుసైన్యం యొక్క సంఖ్యకు భయపడితే, అది అతడి యొక్క వివేకరాహిత్యాన్ని తెలుపుతుంది.
(ఈ వాక్యం కొందరి వ్యాఖ్యాతల ప్రకారం ఇలా ఉంటుంది: సేనాని తన సైనికులతో
మొదట కౄరంగా ప్రవర్తించి, తదుపరి
తిరుగుబాటుకు పాల్పడతారేమో అని వారికి భయపడితే అది అతడికి ఏమాత్రం వివేకం
లేకపోవడాన్ని తెలుపుతుంది)
38) నోటినిండా ప్రశంసలు కురిపిస్తూ దూతలు పంపబడినపుడు, శత్రువు తాత్కాలిక యుద్ధవిరమణను
కోరుకుంటున్నాడని దానికి సంకేతం.
39) శత్రు సైన్యం కోపోద్రిక్తతతో ముందుకు వచ్చి, ఆ తరువాత మన సైన్యానికి అభిముఖంగా –యుద్ధాన్ని ప్రారంభించకుండా, వెనుకకు మరలకుండా– దీర్ఘకాలం పాటు అలానే ఉండిపోతే, అది ఎంతో అప్రమత్తంగా ఉండి ప్రతి
విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించవలసిన పరిస్థితి.
(శత్రువు హఠాత్తుగా దాడికి పాల్పడటానికి కావలసిన సమయాన్ని
తీసుకుంటున్నాడు.)
40) చాలినంతమంది సైనికులున్న శత్రుసైన్యం కన్నా మన సైన్యం సంఖ్యలో
తక్కువగా ఉంటే, దాని అర్థం మనం
ప్రత్యక్ష దాడికి పాల్పడలేమని మాత్రమే. మనం చేయవలసినదేమిటంటే మనకు అందుబాటులో ఉన్న
బలాన్నంతటినీ ఏకీకృతం చేసి, శత్రువును
నిశితంగా గమనిస్తూ, అదనపు బలగాలను
చేర్చుకోవడం.
(అదనపు బలగాలను బయటినుండి కాక దండయాత్రను అనుసరించి వచ్చే
సైనికేతరుల నుండే సమకూర్చుకోవాలి)
41) ముందు ఆలోచన అనేది చేయకుండా ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసే
వాడు తప్పక వారికి పట్టుబడిపోతాడు.
42) సైనికులకు నీతో అనుబంధం ఏర్పడకముందే వారిని శిక్షిస్తే,
వారు నీ యెడల విధేయత కలిగి ఉండరు.
విధేయత లేనట్లైతే వారు ఆచరణలో నిరుపయోగంగా ఉంటారు. వారికి నీతో అనుబంధం ఏర్పడిన
తరువాత వారిని శిక్షించకపోతే అప్పుడు కూడా వారు నిరుపయోగంగానే ఉంటారు.
43) కనుక సైనికులను మొదట మానవత్వంతో ఆదరించాలి, కానీ ఆ తరువాత వారిని ఉక్కు క్రమశిక్షణ
ద్వారా నియంత్రణలో ఉంచాలి. ఇది విజయానికి ఓ ఖచ్చితమైన దారి.
44) సైనికులకు శిక్షణ ఇచ్చేటపుడు ఆదేశాలను స్థిరంగా, క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే సైన్యం మంచి
క్రమశిక్షణ గలదిగా అవుతుంది. అలా చేయకపోతే దానికి క్రమశిక్షణ ఉండదు.
45) ఒక సేనాని తన సైనికులలో విశ్వాసం కనబరుస్తూనే తన ఆజ్ఞలకు వారు
విధేయత చూపాలని ఎల్లప్పుడూ కోరుకుంటుంటే ఇరువురికీ మేలు జరుగుతుంది.
Hello Sir
రిప్లయితొలగించండిi am Rajesh and i am big fan of you
now a days i didnt visit your blog
earlier i used to read your blog భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి and maid a comment as well in the first post
is it possible for me to talk with you
i just want to appreciate and
wanted to know more about you and your thoughts
may send me your phone no to my mail id
gsivarajesh@gmail.com