జీవితంలో యుద్ధం అనివార్యమైనది. దుష్టుడు యుద్ధాన్ని ఆరంభిస్తాడు; శిష్టుడు ఆ యుద్ధాన్ని ముగిస్తాడు. యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఎవరైనా సరే మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, విజయాన్ని సాధించడం కోసం యుద్ధం చేసితీరాలి. నీవు శాంతి కాముకుడవు అయినా కూడా యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే శాంతి యుద్ధాన్ని నిరాకరిస్తే రాదు; యుద్ధం చేస్తే వస్తుంది. మనిషి జీవితంలో యుద్ధమనేది ఒక నిరంతర ప్రక్రియ.
అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సుబోధకంగా వివరించే ఓ చిరు గ్రంథాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ గ్రంథం పేరు The Art of War. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన యుద్ధతంత్ర గ్రంథం. ఈ గ్రంథ రచయిత క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు సైనిక వ్యూహకర్త అయిన సన్–జు. ఇతడు ‘వు’ రాజ్య సేనానిగా పనిచేసి అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఈ గ్రంథాన్ని చైనీస్ లో ‘పింగ్ ఫా’ అని అంటారు. ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఎన్నో యుద్ధ గతులను, వాటి ఫలితాలను ప్రభావితం చేసింది. ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో సేనానులు ఈ గ్రంథం లో వివరించిన వ్యూహాలను ఆచరించి విజయాన్ని తమ స్వంతం చేసుకున్నారు.
నెపోలియన్, మావో సేటుంగ్, హొచిమిన్ వంటి రణతంత్రవేత్తలు, హెన్రీ కిసింజర్ వంటి రాజనీతి కోవిదుడు; ఇంకా ఇటువంటి వారు అనేక మంది ఈ గ్రంథాన్ని నిత్యపఠనీయ గ్రంథంగా పరిగణించారు. మరిముఖ్యంగా ఈ గ్రంథంతో నెపోలియన్కున్న అనుబంధం ప్రత్యేకమయినది. ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ 'నెపోలియన్' రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు. వియత్నాం యుద్ధకాలం నుండి అమెరికన్ సైనికాధికారులలో ఈ గ్రంథం విశేషమైన ఆదరణను పొందుతున్నది. వారి యుద్ధ వ్యూహాలన్నీ ఈ గ్రంథం మీదనే ఆధారపడి ఉంటాయి.
ఈ గ్రంథానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. అలాగే ఈ గ్రంథం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో వివరించిన వ్యూహాలు కేవలం సైనిక పరంగానే కాక ఇతర రంగాలకు కూడా అన్వయించుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.
విషయాన్ని నైతిక దృక్పథంతో బోధించే గ్రంథాలు అనేకం ఉంటాయి. కానీ వాస్తవ దృక్పథంతో బోధించే గ్రంథాలు అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన గ్రంథం ఈ The Art of War. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. మానవ సంబంధాలలో మనకు తరచూ ఎదురయ్యే అనేక సమస్యలను ఈ గ్రంథంలో వివరించిన వ్యూహాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చు. ఇది ఒక మానసిక శాస్త్ర గ్రంథం. ఎదుటిమనిషి అంతరంగాన్ని అంచనా వేయడానికి ఈ గ్రంథం ఎంతైనా ఉపకరిస్తుంది.
ఈ గ్రంథానికి ఆంగ్లభాషలో అనేక అనువాదాలున్నాయి. వాటన్నింటిలోకీ Lionel Giles యొక్క అనువాదం ప్రామాణికమైనదిగా పరిగణింపబడుతున్నది. ఇంటర్నెట్లో ఈ గ్రంథం యొక్క Giles అనువాదాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రోజెక్ట్ గుటెన్బర్గ్ అందిస్తున్నది. వ్యాఖ్యాన రహితంగా అనేక వెబ్సైట్లు అందిస్తున్నాయి. Thomos Cleary యొక్క అనువాదాన్ని www.sonshi.com అనే వెబ్సైట్ అందిస్తున్నది.
మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ తో సమానంగా, ప్రపంచవ్యాప్త ఆదరణ చూరగొన్న ఈ గ్రంథాన్ని మీరు కూడా చదవండి!