2, జులై 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---10





సామ్యవాద జననం


వ్యక్తి విలవిల-రాజ్యం వెలవెల

పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే కాపాడబడ్డాయి. ‘వ్యక్తి’ మరియు ‘రాజ్యం’ ల యొక్క ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రధానంగా వ్యక్తి ప్రయోజనాల మీద ప్రత్యక్ష దాడి జరిగింది. దానితో వ్యక్తి ప్రమాదంలో పడినట్లుగా భావించబడింది. ధనవంతుడు పేదవాడిని దోచాడు. ధనిక దేశాలు బడుగు దేశాలను దోచాయి. సామాజిక పరమైన ఉత్పత్తివనరులన్నీ సమాజంలోని కొద్దిమంది ధనవంతుల చేతులలో స్వంత ఆస్తి రూపంలో కేంద్రీకృతమై మిగతా వారంతా ఆ ధనవంతుల ఉత్పత్తి వనరులలో అంటే ఫాక్టరీలలో కూలికి పనిచేసే కార్మికులుగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.ధనిక దేశాలు పేద దేశాలను ఆక్రమించి, తమ వలసలుగా చేసుకొని వాటిని తమ దేశ పరిశ్రమలకు ముడిసరకు సరఫరాదారులుగా, తమ ఉత్పత్తులకు మార్కెట్లుగా వాడుకున్నాయి.

ఫాక్టరీలలో పనిచేసే కార్మికులు పొద్దస్తమానం చాకిరీ చేయవలసి వచ్చేది. వారికి నిర్దిష్టమైన పనిగంటలు ఉండేవికావు. రోజుకి 18గం|| నుండి 20గం|| వరకు పనిచేయవలసి వచ్చేది. బ్రతకటానికి అదికూడా జీవచ్ఛవంలా బ్రతకడానికి సరిపడే కూలి మాత్రమే ఫాక్టరీ యజమాని చెల్లించేవాడు. కార్మికులకు ఏ విధమైన హక్కులూ ఉండేవి కావు. సమాజం ఎంతగా వికసించిందో వ్యక్తి అంతగా దోపిడీ చేయబడ్డాడు.

సామాజిక శక్తుల (బూర్జువా వర్గం) కార్యకలాపాలు మానవ జీవితాన్ని డామినేట్ చేసాయి. ఖండాంతర వాణిజ్యం, ఆధునిక యంత్ర సామాగ్రితో పెద్ద పెద్ద పరిశ్రమలు, నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు, నూతన శాస్త్రాల అభివృద్ది, ఆధునిక జీవన విధానం ఇత్యాది అన్నింటి ముందు రాజ్య శక్తి, ఫ్యూడల్ జీవన శైలి వెలవెల బోయాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో రాజ్యం సామాజిక శక్తులకు అంటే కొల్లదారీ బూర్జువా వర్గానికి కావలసిన పనులు చేసి పెట్టే బంట్రోతుగా మారినది.సమాజం ముందు రాజ్యం తన ప్రాబల్యాన్ని కోల్పోయింది.తన కార్యకలాపాల విస్తృతి ద్వారా రాజ్యాన్ని ‘సమాజం’ సులభంగా డామినేట్ చేసేసింది.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దోపిడీ వ్యక్తి స్థాయిలోనే కాక జాతి స్థాయిలో కూడా జరిగింది. ధనవంతుడు పేదవాడిని దోస్తే, ధనిక దేశాలు అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలైన సాధనా సంపత్తిని కలిగిన దేశాలు వాటి సాయంతో అవిలేని బడుగు దేశాలను ఆక్రమించి దోపిడీ చేశాయి. ఐతే దీనివలన ఐరోపాలో జనించిన నూతన విజ్ఞాన శాస్త్రాలు, ఆధునిక నాగరికత, శాస్త్రీయ దృక్పథం మొదలైనవి ప్రపంచమంతటా వ్యాప్తిచెందాయి. ప్రపంచ ప్రజలందరూ తమతమ జాతి ఆలోచనా పరిధులనుండి బయటపడి ఈ నూతన భావాలను అందిపుచ్చుకున్నారు. ప్రపంచ ప్రజలందరి జీవన శైలిలో ఒక ఏకరూపత సాధించబడింది. ఈ వలస పాలన వలననే ప్రపంచమంతా ఒక్కసారిగా ఫ్యూడల్ దశనుండి అంతకన్నా పురోగామి అయిన ఆధునిక పెట్టుబడిదారీ దశలోనికి పరిణామం చెందింది.

అయితే నాణానికి మరోవైపుగా వ్యక్తి దారుణంగా దోపిడీ చేయాబడ్డాడు. సమాజం ఎంతగా వికసించిందో వ్యక్తి అంతగా అణగారిపోయాడు. వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ‘సమాజం’ నుండి ‘వ్యక్తి’ని రక్షించటం తక్షణ కర్తవ్యం గా భావించబడింది. ఈ ఊపులో సమాజం లేక సామాజిక శక్తులవలన ప్రపంచానికి జరిగిన మేలు మరువబడింది. గతంలో రాజ్యం చేసిన మేలు మరచి అది చేసిన కీడును వ్యతిరేకిస్తూ సమాజం ఏవిధంగా విప్లవ పథంలో పయనించిందో ఈ సారీ అలానే సమాజం చేసిన మేలు మరువబడి అది చేసిన కీడుకు వ్యతిరేకంగా మానవుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఈ ఆలోచనలే క్రమంగా ‘సామ్యవాదం’గా పరిణమించాయి.ఈ సామ్యవాదం హేతువాద ప్రధానమైనది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు శాస్త్రీయ దృక్పథం ఎలానో సామ్యవాదానికి హేతువాద దృక్పథం అలాంటిది.

ఊహా స్వర్గం

ఈ ఆలోచనలు ప్రారంభంలో రాబర్ట్ ఓవెన్, చార్లెస్ ఫొరియెర్, సెయింట్ సైమన్ మొదలైన వారి ద్వారా జరిగాయి. సమాజంలో వ్యక్తి ఎవరి దోపిడీకీ గురికాకుండా తన హక్కులను అనుభవిస్తూ, మిగతా వారితో సమానంగా, ఆనందంగా బ్రతకాలని వీరు కాంక్షించారు. ఫాక్టరీ యజమానులు స్వచ్ఛందంగా మారాలని వీరు కోరుకున్నారు. స్వయంగా వీరు ఫాక్టరీలను స్థాపించి కార్మికుల శ్రేయస్సుకు పాటుపడుతూ మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ప్రయత్నించారు.

ఇటువంటి ఆలోచనలన్నీ ‘ఊహాస్వర్గ వాదం’(Utopia) గా భావించబడ్డాయి. ఇవి ఎటువంటి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. ఊహాజనితంగా,’ఇలా ఉంటే బాగుండు’అన్న పద్ధతిలో జరిగాయి.

శాస్త్రీయ కమ్యూనిజం

అయితే కాలక్రమంలో ఇటువంటి ఆలోచనలన్నీ ఒక క్రమమైన రూపుదాల్చాయి.క్రీ||శ.1818వ సం||లో జర్మనీలో జన్మించిన కార్ల్‌మార్క్స్ అనే ఆర్థిక, రాజనీతి, తత్వశాస్త్ర వేత్త సామ్యవాద విచారధారకు ఒక శాస్త్రీయమైన రూపాన్ని ఇచ్చాడు. హెగెల్ అనే సుప్రసిద్ధ తాత్త్వికుని గతితార్కిక సిద్ధాంతం (Dialectic Theory) ప్రకారం ఈయన సామ్యవాదాన్ని శాస్త్రీయంగా వివరించాడు.’పెట్టుబడి’(Das Capital) అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో ఆయన తన సిద్ధాంతాన్ని వివరించాడు. సమాజం ఏ విధంగా వర్గాలుగా విభజింపబడిందీ, పాలకవర్గం రాజ్యశక్తిని ఉపయోగించి పాలిత వర్గాన్ని అణచివేస్తూ దాన్నెలా దోపిడీ చేస్తున్నదీ, సమాజంలో ఉత్పత్తి సాధనాలను స్వంత ఆస్తిగా కలిగి ఉన్నవారు అమ్ముకోవటానికి శారీరక శ్రమ తప్ప మరేమీ లేని కార్మికులను ఏ విధంగా పీల్చిపిప్పిచేస్తున్నదీ, సమాజంలో ఉత్పత్తి సంబంధాలు ఏవిధంగా మానవ జీవితాన్ని నిర్దేశిస్తాయి మొదలైన విషయాలన్నీ కూలంకషంగా ఆ గ్రంథంలో చర్చించాడు.

ఈ గ్రంథం మానవుని సామాజిక జీవితాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. మానవుని ఆలోచనా ధోరణిలో పెనుమార్పులు తీసుకువచ్చింది. మానవునికి తార్కిక దృక్పథాన్ని అంటే హేతువాద దృష్టిని అలవరచింది. ఈ గ్రంథం ప్రచురింపబడిన నాటినుండి నేటికాలం వరకు ఎవరు ఏవిధమైన ఆలోచన చేసినా దాని నేపథ్యంలో ఎంతోకొంత ఈ సామ్యవాద ఆలోచనాధోరణి ఛాయలు ఉండకపోవటం అరుదు. అంతగా ఈ గ్రంథంలోని విచారధార మానవుడిని ప్రభావితం చేసింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక

కార్ల్ మార్క్స్ తన సన్నిహితుడైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ అనే తత్త్వవేత్తతో కలసి ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’(Communist Manifesto) అనే చిరు గ్రంథాన్ని కూడా 1848వ సం||లో రచించాడు. సామ్యవాద సాహిత్యంలో ఇది కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. దీనిలో చరిత్రలోజరిగిన వర్గపోరాటక్రమాన్ని సంగ్రహంగా వివరించి అది అంతిమంగా కార్మికవర్గ నియంతృత్వానికి ఎలా దారితీస్తుందో వివరించి కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణను సంగ్రహంగా వివరించటం జరిగినది......(సశేషం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి