12, డిసెంబర్ 2008, శుక్రవారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--I

‘మనసులో మాట’ సుజాత గారు కొన్నాళ్ళ క్రితం చేసిన కామెంట్‌లో నేను రాసిన తాత్త్విక విషయాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని అన్నారు. తాత్త్విక విషయాలు అలానే ఉంటాయని అప్పుడు నేను సమాధానం చెప్పాను. ఇటీవలి కాలంలో ఆ వ్యాసాలను శ్రద్ధతో చదువుతున్న సీతారాం రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే విధంగా అన్నారు. మొదట ఈయనకు కూడా అదే సమాధానం చెప్పాను. ప్రతీ అంశాన్ని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా చదవడమే మార్గమని చెప్పాను. కానీ ఆయన ఆ విషయాన్ని అంటే నా రచనలోని సంక్లిష్టతను బాగా ఇన్సిస్ట్ చేశారు. దానితో నేను పునరాలోచనలో పడక తప్పలేదు. అందుకే ఆ తాత్త్విక విషయాలన్నింటినీ సాధ్యమైనంత సులువైన భాషలో శ్లోకాల ఉటంకింపు లేకుండా, సంస్కృత పరిభాష లేకుండా కొంచెం బ్రీఫ్‌గా మరలా రాస్తున్నాను.

అయితే ఈ సారి ఉదాహరణలను ఎక్కువగా వివరించను. ఎందుకంటే ఉదాహరణలను ఆల్రెడీ అసలు రచనలో వివరణాత్మకంగా పేర్కొని ఉన్నాను కదా! ఇవి కేవలం ఆ రచనలోని సంక్లిష్టతను విడగొట్టటానికి మాత్రమే ఉద్దేశించిన టపాలు.


I. కర్మ స్వరూపం


1.కర్మలు ఎల్లప్పుడూ ‘త్రయం’ (Triad) గానే ఉంటాయి. అంటే మూడేసి కర్మలు కలసి ఒక త్రయంగా ఏర్పడతాయి. ఈ విధమైన త్రయం ఏదో ఒక పరిస్థితిని లేక ఏదో ఒక విషయాన్ని సూచిస్తుంది. ఇటువంటి త్రయాలు అనేకం (అనంతం) ఉంటాయి.

ఉదాహరణకు ఈ క్రింద కొన్ని కర్మత్రయాలను పరిశీలించండి.


వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం:

ఎండ-వర్షం-చలి


మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం:

అదుపు-స్వేచ్ఛ-ఉపేక్ష


మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం

నిజం-అబద్దం-రహస్యం


రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం

రాజ్యం-సమాజం-వ్యక్తి


ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

విశ్వాసం-శాస్త్రీయత-హేతుబద్ధత

ఈ విధంగా ఏ విషయానికి సంబంధించైనా కర్మత్రయం తప్పనిసరిగా ఉంటుంది.


2.ఒక కర్మత్రయంలోని కర్మలు మూడూ పరస్పరం విరుద్ధంగా (mutual opponents) ఉంటాయి. అంటే మూడింటిలో ప్రతి ఒకటి మిగతా రెంటికీ విరుద్ధంగా ఉంటుంది. పై ఉదాహరణలనొకసారి పరిశీలించండి.

‘ఎండ’ కు ‘వర్షం’ విరుద్ధం. ఈ రెంటికీ ‘చలి’ విరుద్ధం.

అలానే ‘నిజాని’కి ‘అబద్ధం’ వ్యతిరేకం. ఈ రెంటికీ ‘రహస్యం’ వ్యతిరేకం.

అలానే ఏ కర్మత్రయంలోని మూడు కర్మలైనా అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.


3.ఈ విధంగా పరస్పరం విరుద్ధంగా ఉండే మూడు కర్మలలో ఒకదానిని ‘వాదం’ (Thesis) అంటారు. రెండవదానిని ‘ప్రతివాదం’ (AnTi Thesis) అంటారు. మూడవ దానిని ‘విశ్లేషణ’ (Analysis) అంటారు.

పైన వాతావరణానికి సంబంధించి తెలిపిన మొదటి ఉదాహరణలో ఎండ ‘వాదం’, వర్షం ‘ప్రతివాదం’, చలి ‘విశ్లేషణ’.

అలానే మరో ఉదాహరణలో అదుపు ‘వాదం’, స్వేచ్ఛ ‘ప్రతివాదం’, ఉపేక్ష ‘విశ్లేషణ’.


4.ఏ కర్మత్రయమైనా తీసుకోండి ఆ త్రయంలోని ప్రతికర్మా తనదైన ఆకర్షణ కలిగి ఉంటుంది. ఈ ఆకర్షణతోనే ఆ కర్మ మానవుడి మనసును ఆకట్టుకోగలుగుతుంది.

అయితే ఒక కర్మత్రయంలోని ఒకానొక కర్మ ఆకర్షణలో పడిన మానవుడు ఆ కర్మత్రయంలోని మిగతా రెండు కర్మల యొక్క ఆకర్షణలకు మాత్రం లోబడడు. పైగా వాటిని ద్వేషించనారంభిస్తాడు. ఎందుకంటే అవి తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నాయి కనుక.

ఈ విధంగా కర్మలు తమ ఆకర్షణ శక్తితో మానవునిలో రాగద్వేషాలకు కారణమవుతున్నాయి…(కర్మ స్వరూపం అయిపోయింది)

10 కామెంట్‌లు:

  1. ఏమిటండీ, ఎంత బిజీగా ఉంటే మాత్రం, ఇన్ని రోజులకా కనపడేది?

    వివరంగా రాస్తే, సంక్లిష్టంగా ఉన్నాయనిపించిన విషయాలు, అర్థమయ్యేలా తేలిగ్గా వివరిస్తే "ఇంకొంచెం వివరిస్తే బాగుండేదేమో" అనిపిస్తున్నాయి. కానీ చాలా బాగా అర్థమయ్యాయి. తత్వ శాస్త్రం అనేదే సంక్లిష్టమైన విషయమని నా(లాంటి పామరులకు)కు అనిపిస్తుంది. మీ తర్వాతి టపాలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. కళ్ళు చెదిరిపోగెట్టే అందంతో ఆకర్షిపచేసి, దగ్గరికెళితే భరింపనలవికానియక, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేసే అమ్మాయి లాంటిదీ తత్వ శాస్త్రం.

    జీర్ణించుకోలేము, తినకుండా ఉండనూ లేము.

    ఎప్పటినుంచో ఓ సిప్ చేసి చూద్దామాన్న కోరికతో, బోర్డర్స్ కెళ్ళి Friedrich Nietzsche-Thus Spake Zarathustra పట్టుకొచ్చా.

    అమ్మతోడు, నాలుగే పేజీలు. మూడు రోజుల Immodium టాబ్లెట్స్. పది టిష్ష్యూ రోల్స్.

    పోతే thesis+anti-thesis=synthesis, which then becomes thesis after a while, giving rise to it's anti-thesis, అనీ దాన్నే dialectics అంటారనీ చిన్నప్పుడెప్పుడో చదూకున్నట్లు గుర్తు.

    ఈ సరళత్వం కొంచెం ప్రోత్సాహకరంగానే ఉంది. రాస్తూండండి. మా కోసం.
    ధన్య వాదాలు.
    Kumar N

    రిప్లయితొలగించండి
  3. ఈ తత్త్వ శాస్త్రంలో పంపర పనసలాంటి కొన్ని తెలిసిన / ఎదురయిన కొన్ని వింత అభిప్రాయాలు, అనుభవాలు

    1) "ఏదో జరిగేది జరగక మానదు. రానున్నది రాక మానదు. కాబోయేది కాక తప్పదు. మనం అడ్డుపడగలమా?" - ఏ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టకుండా, పెట్టనక్కరలేకుండా తప్పించుకునే మేధావులు. అయితే ఇదే సిద్ధాంతం సొంత ఆస్తికి బొక్క పడితే వర్తించదు.

    2) "పరస్పర కలహాలు ప్రకృతిలో సహజమే, కాబట్టి పెద్దగా పట్టించుకోనక్కరలా" - ప్రకృతిలోనే అంతా ఇమిడి ఉంది కాబట్టి ఇవి అన్నీ ఒక లెక్కలోకి రావు. కానీ ఇదే సిద్ధాంతం, ఆ చెప్పినాయన చెంప ఎవడన్నా పగలగొడితే వర్తించదు. అర్థం కానిది ఏమంటే ఈ పోట్లాటలు లేకపోతే మానవుల ముఖ్యలక్షణానికి ఎసరు వచ్చిందనా?..

    3) "అన్నిటికీ మానవుడి మనస్సే కారణం. ముందుగా మనసు మారితే , మార్చుకుంటే అన్నీ అవగతమవుతాయి" - ఎలా ? దైవభక్తి, మతం మీద భక్తి, ఆపైన అనురక్తి ఎక్కువ చెయ్యటం. అయితే ఇదే సిద్ధాంతం, ఆ చెప్పినాయన అమ్మాయి కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నప్పుడు వర్తించదు.

    4) "భగవంతుడి లీలే ఏదయినా. సర్వం జగన్నాథం, అంతా దైవేచ్ఛ" - ఇదే సిద్ధాంతం ఆ చెప్పినాయనకు ఏలినాటి శనిపట్టి సకలకష్టాలు ఎదురయితే వర్తించదు.


    ఈ తత్త్వ శాస్త్రాన్ని గురించి ఆలోచించకుండా ఉండటానికి కొన్ని కారణాలు -

    తీవ్రంగా ఆలోచించి ఆ శాస్త్రం కోసం జీవితాన్ని సన్యాసుల్లో కలిపేస్తామేమో అనే భయం, లేదా తమ చుట్టూ ఉన్న అన్నీ కట్టుబాట్లనూ ధిక్కరించాల్సి వస్తుందేమో, అలా ధిక్కరించాల్సి వస్తే కులం, మతం, దేవుడు దయ్యం అన్నీ మట్టికొట్టుకుపోతాయేమో అనే భయం కావచ్చు.

    అయితే ప్రతి మనిషి చేసే పనికి ఏదో ఒక సిద్ధాంతం, ఒక తత్త్వం, ఆ పైన ఒక ప్లాను ఉండాల్సిందే. మరి తత్త్వం ఇమిడిపోయింది కాబట్టి వాడు చేసే ప్రతిపని తత్త్వశాస్త్రానికి సంబంధించిందే అనుకుంటే పోలా?

    ఓహో అలా వచ్చావా? అయితే - ప్రతి పని అభివృద్ధికి తోడ్పడేదేనా? ఏమో నాశనానికే దారితీస్తుందేమో ?

    ప్రతి పనికి ఒక తత్త్వం ఉంటే, మరి దృక్పధాల మాటేమిటి ? ఆదర్శవాదం, భౌతికవాదాల పరిస్థితి ఏమిటి ?

    ప్రత్యక్ష ప్రమాణమే మూలసూత్రం అయితే ఈ ప్రపంచం అంతా మిధ్య అనే ఆదర్శవాదులకి ఈ సూత్రం నచ్చుతుందా ?

    ఎహే ఆదర్శవాదులకి అర్థం అయితే ఏమిటి కాకపోతే ఏమిటి ? నాగరికత రక్షించబడుతోందా లేదా అన్నది ముఖ్యం మహాశయా!

    ఓహో - అలానా ? అయితే ప్రజాసామాన్యానికి ఆ నాగరికత నిలబెట్టే ప్రజాఉద్యమం చూపిస్తే చాలన్నమాట.

    అవును సమిష్టి చైతన్యం సాంఘిక పరిణామంలోనూ, సంఘం యొక్క ఉన్నత స్థితిని తెలియచేస్తుంది. మరి ఆ నాగరీక మనుషులకు నల్లమందు లాగా పట్టిన మతాల సంగతి ఏమిటి ?

    అబ్బో - మతమంటే మన నిత్యజీవితంలో సన్మార్గాన్ని చూపించే సూత్రం అని ఇప్పటిదాకా అనుకున్నానే !

    నీకు చాలా తెలివుంది ..అయితే నీకు వర్గపోరాటమే దారి. అప్పుడే నీకు చైతన్యం కలుగుతుంది. వెర్రివేదాంతాలు బోధించే స్వాముల పక్కన చేరితే నీకు మిగిలేది ఏమిటి ? బూడిద, కమండలం..

    సరే రేపు మళ్ళీ వస్తా....

    రిప్లయితొలగించండి
  4. సరస్వతి కుమార్ గారూ...అర్థం అయ్యింది అనే అనుకుంటున్నాను...:)...కాకపోతే maganti.org at gmail.com కు ఒక వేగు పంపండి

    రిప్లయితొలగించండి
  5. సుజాత గారూ!

    ఇన్నాళ్ళూ నేను టపాలకూ, కామెంట్లకూ సమయం కేటాయించలేక పోయినా తరచూ బ్లాగులు చూస్తూనే ఉన్నాను.

    ఇక పోతే ఈ టపాలలో విషయాన్ని సాధ్యమైనంత కంపాక్ట్ గా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఉన్నవి కొద్ది భావనలే. అయితే వాటిని అనేక ఉదాహరణల ద్వారా వివరించడం, గీతలోని ఏ శ్లోకాల ద్వారా ఆయా భావనలు రూపుదిద్దుకున్నాయో ఆ శ్లోకాలన్నింటినీ పేర్కొనడం- మొదలైన విషయాలే రచన సంక్లిష్టంగా అనిపించడానికి కారణంగా భావించాను. అందుకే ఈ సారి కేవలం భావనల వరకే బ్రీఫ్‌గా రాద్దామనుకున్నాను. ఈ టపాలు చదివిన తరువాత ఇంకా వివరణ కావాలంటే అసలు రచన ఎటూ ఉండనే ఉంది కదా!

    మీరు పామరులూ కాదు, నేను పండితుణ్ణీ కాదు. నాకు ఎందుకో ఈ తత్త్వశాస్త్రం మీద మొదటినుండీ కొంచెం ఆసక్తి. దానితో అందుబాటులో ఉన్న వనరులతో కొంచెం అధ్యయనం చేశాను.అంతే.

    మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు! ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  6. కుమార్ గారూ

    మీరు పేర్కొన్న dialectic principle సరియైనదే. అయితే గతితర్కం (dialectics) పాశ్చాత్య తత్త్వశాస్త్రం. వైరుధ్యాలు రెండే అని వారి అభిప్రాయం. (అంటే కర్మలు ద్వయాలుగా ఉంటాయి) వాటి మధ్యన అనేకసార్లు synthesis జరగటం వలన క్రమంగా సత్యం ఆవిష్కరింపబడుతుందని వారి వాదన.

    కానీ భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం వైరుధ్యాలు మూడు. (అంటే కర్మలు త్రయాలుగా ఉంటాయి)వీటినే త్రిగుణాలు అన్నారు. వాటి మధ్యన synthesis (యజ్ఞం) ఒకే ఒక్కసారి జరగటంతోనే సత్యం ఆవిష్కరింపబడుతుంది.

    నేను పై టపాలో పేర్కొన్నది భారతీయ తత్త్వశాస్త్రాన్నే. అయితే సంస్కృత పదాలను ఎవాయిడ్ చేయడానికి dialectics లోని పాశ్చాత్య పదాలను వాడవలసివచ్చింది.

    జరాతుష్ట్ర (జొరాస్టెర్) పార్శీ మత స్థాపకుడు. మతానికి సంబంధించిన తాత్త్వికత ఎప్పుడూ ఆధ్యాత్మికతతో (spirituality) ముడిపడి ఉంటుంది. మనం ఇక్కడ చర్చిస్తున్నది శాస్త్రీయమైన తత్త్వశాస్త్రం గురించి మాత్రమే.

    మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు! ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  7. వంశీ గారూ!

    భారతదేశంలో ఆధ్యాత్మికత, తాత్త్వికత విడదీయలేనంతగా కలసిపోయాయి. పాశ్చాత్య దేశాలలో ఇవి రెండూ వేటికవి స్వతంత్రంగానే వృద్ధి చెందాయి. మన దేశంలో మాత్రం తత్త్వశాస్త్రం చాలాకాలంనుడి ఆధ్యాత్మిక వాదుల హైజాకింగ్ లో ఉండిపోయింది.

    పైగా మన తాత్త్విక చింతన అంతా చరిత్రపూర్వ యుగం (వేదకాలం లేక పురాణ కాలం) లోనే ఆవిర్భవించినది. దానితో మనం ఆ తాత్త్వికులను మరియు వారి బోధనలను ఆధ్యాత్మిక దృష్టితో చూడటానికి అలవాటు పడిపోయాము. ఆఖరికి నిరీశ్వర వాదులు, మహా తార్కికులు అయిన సాంఖ్యులను సైతం ఆధ్యాత్మిక దృష్టితోనే చూస్తాము.

    అదీగాక భారతీయ తాత్త్విక చింతనలో మార్మికత ఉంటుంది. అంటే విషయం సూటిగా, స్పష్టంగా ఉండదు. పరోక్షంగా, అన్యాపదేశంగా ఉంటుంది. దానితో భాష్యం, వివరణ తప్పనిసరి అవుతుంది. వందల సంవత్సరాల కాలం నుండి అనేక మంది పండితులు ఎవరికి తోచిన వివరణ, ఎవరికి నచ్చిన వివరణ వారు ఇచ్చారు.

    ఈ అన్ని కారణాలతో కాలక్రమంలో మనదేశంలో అనేక మెట్ట వేదాంతాలు పుట్టాయి.

    ఆధ్యాత్మిక వాదుల, మెట్టవేదాంతుల హైజాకింగ్‌లో ఉన్నంత మాత్రాన మన ప్రాచీన తాత్త్విక చింతన లోని అమూల్య మైన విషయాలను మనం వదలుకోవలసిన అవసరంలేదు కదా! పైగా పాశ్చాత్య తత్త్వశాస్త్రం స్పష్టంగా విఫలమైన ఈ తరుణంలో మన అమూల్యమైన తత్త్వసంపదను తిరిగి వెలికి తీయవలసిన బాధ్యత మనందరిమీదా ఉన్నది. అలా తీయాలంటే దాని చుట్టూ అల్లుకున్న ఈ ఆధ్యాత్మికవాదుల మెట్టవేదాంతాన్ని ముందు తొలగించాలి. నేను చేస్తున్నది ఆ పనే. మీరేమో మెట్టవేదాంతాన్ని కారణంగా చూపి మొత్తం మన తాత్త్వికతనే వదిలేయమంటున్నారు.

    మీరు సూచించిన వర్గపోరాటానికి మూలం హెగెల్, మార్క్స్‌ల తాత్త్విక భావాలే. అవి ఇప్పుడు విఫలమయ్యాయి కదా! మరి దాన్నెలా మనం అనుసరించగలం. ఇప్పుడు మనకు కావలసినది వాటికన్నా వేరైన తాత్త్వికత.. విభిన్నమైన మార్గదర్శకత్వం.

    రిప్లయితొలగించండి
  8. హబ్బా...హయ్యో...హయ్యయ్యో...నేను దక్షిణధృవంలో రాస్తే మీరు ఉత్తరధృవంలో పట్టుకున్నారు. అంతకీ రెండో కామెంటు కూడా రాసాను...మళ్లీ హబ్బా...హయ్యో...హయ్యయ్యో...నాకు ఇష్టమయినవి ఇవీ - మెట్ట, మాగాణి, ఖరీఫ్, రబీ వేదాంతాలు, దైవభక్తి, పాపభీతి....ఇక ఇంతకన్నా చెప్పలేను...

    రిప్లయితొలగించండి
  9. "అయితే ఒక కర్మత్రయంలోని ఒకానొక కర్మ ఆకర్షణలో పడిన మానవుడు ఆ కర్మత్రయంలోని మిగతా రెండు కర్మల యొక్క ఆకర్షణలకు మాత్రం లోబడడు. పైగా వాటిని ద్వేషించనారంభిస్తాడు. ఎందుకంటే అవి తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నాయి కనుక."

    చాలా బాగా చెప్పారు. ఏ కొందరో తప్పించి, అందరు మానవులూ ఈ కర్మల త్రయంలోని ఒక కర్మ ఆకర్షణకే ఎందుకు లోనవుతారు, మిగతా రెండింటికీ ఎందుకు అవరు? దీని ఫలితాలేంటివి మొదలైన విషయాలను తెలిపే జ్ఞానమే సంస్కృతీ సంప్రదాయం, ఆ సంప్రదాయం లో పుట్టిన తాత్త్వికత.

    విజ్ఞులు మీరు గమనించే ఉంటారు, మనం నివసించే ప్రపంచం ఒక రకమైన ఆలోచనా తీరుకు అలవాటుపడ్డది. వివరంగా దీన్ని విశ్లేషించడం మూలాన నన్ను మత చాందసవాదిగా ముద్ర వేసే ప్రమాదం ఉంది(ముద్రలకు నేను వెరవను గానీ, దీని వలన నేను చెప్పదలచుకున్న విషయపు dilute అవుతుంది). సైద్ధాంతికం గా చెబుతాను. నిత్యమూ మన జీవితాలను ప్రభావితం చేసే చిన్న చిన్న పనులు, ఆ పనుల మూలాలు ఎక్కడయితే ఉన్నాయో ఆ సిద్ధాంతాలూ, ఒక claim ఆధారితంగా నిర్మింపబడ్డాయి; మానవులందరూ intentional beings అని(pertaining to the capacity of the mind to refer to an existent or nonexistent object)

    ప్రతి ఒక్కరికీ ఒక అనుభవం ఉంది. "నా" కెరీర్, "నా" ఇల్లు, "నా" కుటుంబం, "నా" పిల్లలు అని. ఈ *నా* అనే అనుభవం కొత్తదేమీ కాదూ, వివరణలూ అఖ్ఖర్లేదు. భారతీయ సంప్రదాయాలు ఈ *నా* అన్న అనుభవం నిజం కాదు, మిథ్య అని చెబుతాయి. ఇదే నా దృష్టిలో మన సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అత్యుత్తమ జ్ఞానం.

    ప్రతి ఒక్క వ్యక్తీ మనం Intentional agents కాదు అన్న విషయాన్ని గ్రహించి, ప్రతి ఒక్క వ్యక్తీ ఈ అనుభవం నిజం కాదు అని గ్రహించి, ప్రతి ఒక్క వ్యక్తీ ఆ అత్యున్నత నిజాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ ఆ అత్యున్నత నిజాన్ని అనుభవిస్తే ఏమవుతుంది? ఇదే భారతీయ సంస్కృతి చూపే ఆదర్శ సమాజం(ఇప్పుడు దీన్ని పాశ్చాత్య ఉటోపియా తో పోల్చుకుని చూడండి, ఊరికే తేడా తెలుసుకోవడానికి).

    ఈ రకం గా చూస్తే, భారతీయ సంప్రదాయాలూ, వారి తాత్త్వికచింతనా సామాజిక సూత్రాలూ, అవి ప్రతిపాదించే వ్యవస్థా ఇప్పటి అందుబాట్లో ఉన్న సిద్ధాంతాలకంటే కొన్ని కాంతి సంవత్సరాలు ముందున్నాయి.

    But as you said, our half baked spiritual gurus have reduced this concept of Maya to a mere philosophy. We have this tendency to equate every experience of ours to those of the westerners and deduce theories from them. Maya is not any goddamn philosophy like metaphysics, epistemology, ethics and aesthetics etc., Maya is a term given to a learning process. A learning process which makes us think that the agency of "me" "my" is true. That is Maya and Indian traditions is all about breaking that learning process.

    మీ వ్యాసపు ఉద్దేశ్యానికి దోహదపడుతుందో లేక అప్రస్తుతమో మీరే చెప్పాలి గానీ, ఏదో ఉండబట్టలేక రాసేసాను. క్షమించాలి. మీలా ఆలోచించేవారి సైన్యం ఒకటి మనదేశానికి దొరకాలని ఆకాంక్షిస్తూ...

    యోగి

    రిప్లయితొలగించండి
  10. యోగి గారూ,
    మీకు త్వరలోనే సమాధానం ఇస్తాను. ఆలస్యానికి క్షమించగలరు. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి