20, డిసెంబర్ 2008, శనివారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--II

II. జగత్ స్వరూపం

1. ఇంతకు ముందే ‘కర్మ స్వరూపం’ లో మనం చెప్పుకున్నాం కర్మలన్నీ త్రయాలుగా ఉంటాయని. ఏ విషయానికి సంబంధించైనా ఒక 'త్రయం' ఉంటుంది. అలాంటి అనంతమైన త్రయాల సమూహమే ‘జగత్తు’.

2. జగత్తులో కర్మలు వాటి ‘మౌలిక’ (fundamental or primary) రూపంలో ఉంటాయి. అంటే ఒక త్రయంలోని కర్మలు మూడునూ విడివిడి ప్రమాణాలు (1+1+1=3) గా ఉంటాయి గానీ అన్నీకలసి ఒకే ప్రమాణం (1/3+1/3+1/3=1) గా ఉండవు.

3. మౌలిక రూపంలో ఉన్న ప్రతి కర్మ కూడా 1/3 వంతు దోషరహితంగానూ, 2/3 వంతు దోషభూయిష్టంగానూ ఉంటుంది.

4. మౌలిక రూపంలో ఉండే ఏ త్రయంలోని మూడు కర్మలైనా అవి పరస్పర విరుద్ధమైనవి కనుక దానికి తగినట్లుగానే పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి. ప్రతి కర్మా మిగతా రెండు కర్మలను డామినేట్ చేయడానికి మరియు ఆ రెంటినీ అణచి తానొక్కటే పెంపొందటానికి ప్రయత్నిస్తుంది. ఫలితం...అంతులేని సంఘర్షణ.

ఉదాహరణకు సంప్రదాయవాదం -అభ్యుదయవాదం- సంస్కరణ వాదం అనే కర్మత్రయాన్ని పరిశీలిద్దాం. సమాజంలో ఈ మూడు వాదాలకూ దేని అనుచరవర్గం దానికి ఉంటుంది. ఈ ముగ్గురూ సంఘంలో విడి విడి సమూహాలుగా ఉండి నిరంతరం అభిప్రాయభేదాలతో పోట్లాడుకుంటుంటారు.

సంప్రదాయవాదులు ఏ విషయంలోనైనా గతకాలంలో ఉన్నదానినే కొనసాగించాలని కోరుకుంటారు. అభ్యుదయవాదులు గతకాలంలో ఉన్నదానిని అభివృద్ధిపరచి, మరింత మెరుగుపరచి ఆచరించాలని కోరుకుంటారు. సంస్కరణవాదులు గతకాలంలో ఉన్నదానిని అది ఎటువంటిదైనప్పటికీ దానిని పూర్తిగా తొలగించి సరికొత్త ఆచరణలను నెలకొల్పాలని కోరుకుంటారు.

ఎవ్వరూ ఎదుటివారి వాదన లోని ఔచిత్యాన్ని గమనించరు. తమవాదనలోని లోటుపాట్లను గ్రహించరు. తాము చెప్పేదే సరియైనదని గుడ్డిగా వాదిస్తుంటారు. తమ ఆలోచనా విధానంమాత్రమే సమాజంలో చలామణీ అవ్వాలని కోరుకుంటారు. మిగతా వారి ఆలోచనా విధానాన్ని సమూలంగా నాశనం చేసి ప్రజలెవ్వరూ దానిని ఆచరించకుండా చేయాలని వీరు ప్రయత్నిస్తారు. అంటే ప్రతిఒక్కరూ ‘1’ గా ఉండటానికే గానీ ‘1/3’ గా ఉండాటానికి ఎవరూ ఇష్టపడరు.


ఈ విధంగా జగత్తులో ఏ కర్మత్రయంలోని మూడు కర్మలైనా వాటి మౌలిక రూపంలో విడివిడి ప్రమాణాలుగా ఉండి నిరంతరం సంఘర్షించుకుంటూ ఉంటాయి.

అంటే జగత్తులోని ఏ కర్మత్రయంలోనైనా ‘వాదం’, ‘ప్రతివాదం’ మరియు ‘విశ్లేషణల’ మధ్యన నిరంతర సంఘర్షణ తప్పదు.

III. సత్య స్వరూపం

1.'వాదం', 'ప్రతివాదం' మరియు 'విశ్లేషణ ' ల సమన్వయమే 'సత్యం'. ఒకానొక కర్మత్రయంలోని మూడు కర్మలే ఆ విషయానికి సంబంధించిన సత్యనిర్మాణంలో కూడా పాలు పంచుకుంటాయి.

2. అయితే ఈ మూడు కర్మలూ 'సత్యం'లో మౌలిక (1) రూపంలో ఉండవు. ‘ఆంశిక’ (componental) (1/3) రూపంలో ఉంటాయి. ఈ కారణంగా అవి విడివిడి ప్రమాణాలుగా కాక మూడూ కలసి 'ఒకే ప్రమాణం'(single unit)గా మారతాయి. అంటే 1/3+1/3+1/3=1 గా ఉంటాయి.

3. మౌలికరూపంలో ఉన్న మూడు కర్మలలోని దోషరహితమైన మూడు భాగాలూ కలవడంవలన (1/3+1/3+1/3) రూపుదిద్దుకున్న సత్యం కూడా దోషరహితంగా ఉంటుంది.

4. ఆంశిక (1/3) రూపంలోని కర్మల మధ్యన (అవి పరస్పరవిరుద్ధమైనవి అయినప్పటికీ) సంఘర్షణ కాకుండా సమన్వయం ఉంటుంది. అందుకే అవి అన్నీ కలసి పోయి 'ఒకే ప్రమాణం'గా ఏర్పడతాయి.

అంటే జగత్తులో మౌలిక రూపంలో త్రయం గా ఉండి పరస్పరం సంఘర్షించుకునే కర్మలే సత్యంలో ఆంశికరూపంలోకి మారి ఒకదానితో ఒకటి కలసి పోయి పరస్పర సమన్వయంతో ఒకే ప్రమాణం గా ఏర్పడతాయి.

పైన జగత్‌స్వరూపాన్ని వివరించేటపుడు పేర్కొన్న సంప్రదాయవాదం-అభ్యుదయవాదం-సంస్కరణవాదం ఉదాహరణలో ఒక వ్యక్తి గానీ, ఒక ప్రజాసమూహం గానీ ఏ ఒక్క వాదానికో కట్టుబడి మిగతా రెంటినీ ద్వేషించక సందర్భౌచిత్యాన్ని బట్టి సంప్రదాయవాదాన్ని, అభ్యుదయవాదాన్ని, సంస్కరణ వాదాన్నీ మూడింటినీ ఆచరిస్తుంటే అది సత్యాచరణగా చెప్పవచ్చు.

వాతావరణానికి సంబంధించిన ఎండ-వర్షం-చలి లాగానే మానవ సంకల్పానికి అతీతమైన మరో కర్మత్రయాన్ని కూడా ఈ సందర్భంలో మనం పరిశీలిద్దాం. అది మానవ శరీరలక్షణాలకు సంబంధించిన నీగ్రోయిడ్ –యూరోపియన్ (కాకసాయిడ్)- మంగోలాయిడ్ అనే కర్మత్రయం.

మానవశరీరంలో ‘వాదం’ డామినేట్ అయితే అది నీగ్రోయిడ్ శరీరం. ‘ప్రతివాదం’ డామినేట్ అయితే అది యూరోపియన్ శరీరం. ‘విశ్లేషణ’ డామినేట్ అయితే అది మంగోలాయిడ్ శరీరం. (ఇవి మూడునూ జగత్తుకు ప్రాతినిథ్యం వహించే మౌలిక స్థాయి శరీరాలు) ఏ ఒక్కటీ డామినేట్ కాకుండా మూడురకాల లక్షణాలకూ సమాన ప్రాతినిథ్యం లభిస్తే అది సత్యానికి ప్రాతినిథ్యం వహించే శరీరం.. అదే భారతీయ శరీరం.

ఈ టపాలో వివరించిన విషయాన్ని సంగ్రహంగా చెప్పాలంటే ‘వాదం’, ‘ప్రతివాదం’, ‘విశ్లేషణ’ అనే వైరుధ్యాలు మౌలిక స్థాయిలో సంఘర్షించుకుంటాయి… అదే ‘జగత్తు'. ఆంశిక స్థాయిలో సమన్వయం చెందుతాయి… అదే ‘సత్యం’. ...(మిగతా విషయం మూడవ భాగంలో)

19 కామెంట్‌లు:

  1. సరస్వతీ కుమార్ గారూ,
    మీరు రాసిన సిరీస్ లోని 17 నుండి 28 భాగాల వరకు సంపూర్తిగా చదివాను.
    త్రిగుణాత్మక జగత్తు, సత్యస్వరూపం, యజ్ఞం, నిష్కామకర్మలు అర్ధం అయ్యాయి. ఇదివరకు వీటిగురించి నాకు ఎక్కువగా తెలియదు. అసలు తెలుసుకోవాలన్న స్పృహ కూడా ఉండేది కాదు. దీనికి బలమైన కారణం కూడా ఉంది. అది వాటిలోని మార్మికత, ముకుళిత తత్వం. మనదైన తత్వాన్ని తెలుసుకొనేందుకు మీరు రాసిన విషయాలు బాగా ఉపయోగపడ్డాయి. సంతోషం. మీకు ధన్యవాదాలు.

    ఇకపోతే నాకు ఇవ్వన్నీ చదివిన తర్వాత వచ్చే సందేహాలు.

    1.గీతలో ప్రవచించినట్లు జగత్తు త్రిగుణాత్మకమా, పాశ్చాత్యులు అనుకొన్నట్లు ద్విగుణాత్మకమా, ఇంకెవ్వరూ ఊహించనట్లుగా బహుగుణాత్మకమా? దీనికి ఏది ప్రమాణం,ప్రాతిపదిక?

    2.బేసిక్ ఫిలాసఫీలలోని ఈ గుణాల సంఖ్య (రెండా, మూడా, నాలుగా) అనే విషయమే వాటి జయాపజయాలకు ప్రాతిపదిక అనేనా మీరు చెప్పదలచుకొన్నది?

    3. ఈ ద్విగుణాత్మక, త్రిగుణాత్మక జగత్తు అని మనం ఒకటి ఊహించి ఆ చట్రానికణుగుణంగా జగత్తుకు భాష్యం చెప్పుకొంటూ పోవడం, కొండొకచో జగత్తుని దానిలో, ఒక పరిధిలో ఇరికించడం చేస్తున్నామేమోనని నా అనుమానం.

    నాకు నచ్చిన విషయం: ఎన్ని గుణాలున్నప్పటికీ సమన్వయం అవసరం. యజ్ఞం అంటే సమన్వయయుక్త కార్యం అని నాకు మీరు రాసిన వాటివలన అర్దం అయినది. గుణాతీత స్థితి కూడా అర్ధం అయ్యింది.

    నాకొక సహాయం కావాలి. సత్వ, రజ, తమో శబ్దాలకు విడి విడిగా అర్దం కావాలి. సాత్వికము అంటే నాకు పూర్తిగా అర్ధం అయింది. తామసము అంటే కొంత అర్ధం అయింది. తమస్ అంటే చీకటి అని ఏమైనా అర్దం ఇందులో ఉందా? రజస్సు అంటే వెలుగు అని అర్దమేమైనా ఉందా? వీటి మధ్య కొంత గజిబిజి ఉంది. విశదీకరించగలరు.


    చీకటి-వెలుగు, సుఖము-దు:ఖము, నిజం-అబద్దం, రాగము-ద్వేషము, ఆడ-మొగ మొదలైన విషయాలలో మూడవ గుణమేమిటి?

    నాకు సాధారణంగా కలిగే ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి.

    శాస్త్రీయంగా మానవ పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకొన్నాక మానవుని సంభవం ప్రకృతి పరిణామంలో ఒక హయ్యర్ ఆర్డర్ వైపు జరగడమే కనపడుతుంది. ఈ హయ్యర్ ఆర్డరే సత్యమా? అది ప్రకృతిలోనే ఉందా? దానిని మనిషి తెలుసుకోవడమేనా జ్ఞానమంటే? ఇది తెలుసుకొని ఆ హయ్యర్ ఆర్డర్ కి అణుగుణంగా నడుచుకొనడమేనా మనిషి చేయవలసిన పని? ఆ హయ్యర్ ఆర్డర్ ఏమిటో తెలుసుకొంటే సరిపోతుందా? కొద్దిమంది తెలుసుకొంటే మిగతావాళ్ళందరినీ ఆ ఆర్డర్ వైపు నడిపించవచ్చా? లేదా అందరూ దాన్ని తెలుసుకోవాలా? ఒకరు తెలుసుకొన్నదాన్ని ఇంకొకరికి చెప్పాలా? తెలుసుకోవడమే దానికణుగుణంగా నడచుకోవడమా?

    వీటికి త్రిగుణాత్మక జగత్తు అనే భావన ద్వారా సమాధానాలు ఏ విధంగా రాబట్టుకోవాలి.

    ఇక పోతే సత్యం గురించి చెప్పుకొంటున్న మనం కాలస్వరూపం గురించి మరచి పోయాము. కాలాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను సత్యం చట్రాల్లో ఒదగదని గతంలో రాశాను.

    మీరు సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది క్యాపిటలిజం, వ్యక్తికి ప్రాముఖ్యతనిచ్చేది సోషలిజం అని రాశారు. నాకు దానికి తిరుగవేసినట్లుగా అర్ధం గోచరిస్తున్నది.

    మీరు రాసిన విషయాల్లో విలువైన విషయం ఉంది. తర్కంకొరకు కాకుండా నా అనుమానాల నివృత్తి కొరకు ఇదంతా రాశాను.

    రిప్లయితొలగించండి
  2. సవరణ:

    పై కామెంట్ లో

    మానవుని సంభవం ప్రకృతి పరిణామంలో ఒక హయ్యర్ ఆర్డర్ వైపు జరగడమే కనపడుతుంది

    కి బదులుగా

    మానవుని సంభవం ప్రకృతి పరిణామంలో ఒక హయ్యర్ ఆర్డర్ వైపు జరగడంగానే కనపడుతుంది

    గా చదువుకోవాలని మనవి

    రిప్లయితొలగించండి
  3. సీతారాం రెడ్డి గారూ,

    మీ శ్రద్ధకు మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. పైన మీరు చేసిన కామెంట్‌తో మరోసారి సుధీర్ఘమైన సమాధానం ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఐతే ఈ సారి టపా రూపంలో కాక వీలును బట్టి మూడు నాలుగు కామెంట్ల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ సమాధానాలు మీరు ప్రశ్నించిన ఆర్డర్ లో ఉండకపోవచ్చు.

    మొదటగా మీ చివరి సందేహం:

    “మీరు సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది క్యాపిటలిజం, వ్యక్తికి ప్రాముఖ్యతనిచ్చేది సోషలిజం అని రాశారు. నాకు దానికి తిరుగవేసినట్లుగా అర్ధం గోచరిస్తున్నది.” అని రాశారు.

    మీ ఉద్దేశం నాకు అర్థమైనది. వ్యవస్థలోని మూడు అంగాలను నేను రాజ్యం-సమాజం-వ్యక్తి అనే పేర్లతో పేర్కొన్నాను. వీటిని నేను ఏ అర్థాలతో వాడుతున్నానో మొదటే పేర్కొన్నాను. “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో ఎటువంటి నంబరింగ్ లేకుండా ఉన్న వ్యాసాన్ని (ఈ 28 భాగాలలో 1 వ భాగం కన్నా ముందు రాసిన వ్యాసం) (2008, జూన్ నెల వ్యాసాలు) దయచేసి మీరు ఓ సారి చూడండి. మీ సందేహం తీరగలదు.

    ఇది ఎవరికైనా కలిగే అభిప్రాయంలానే ఉన్నది. ఈ ప్రమాదాన్ని నేను ముందు ఊహించలేదు. ముందే వివరించాను కదా! అనుకున్నాను. ‘వ్యక్తి’ బదులుగా ‘ప్రజ’ అనే పదం వాడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. "నాకు సాధారణంగా కలిగే ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి.

    శాస్త్రీయంగా మానవ పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకొన్నాక మానవుని సంభవం ప్రకృతి పరిణామంలో ఒక హయ్యర్ ఆర్డర్ వైపు జరగడమే కనపడుతుంది. ఈ హయ్యర్ ఆర్డరే సత్యమా? అది ప్రకృతిలోనే ఉందా? దానిని మనిషి తెలుసుకోవడమేనా జ్ఞానమంటే? ఇది తెలుసుకొని ఆ హయ్యర్ ఆర్డర్ కి అణుగుణంగా నడుచుకొనడమేనా మనిషి చేయవలసిన పని? ఆ హయ్యర్ ఆర్డర్ ఏమిటో తెలుసుకొంటే సరిపోతుందా? కొద్దిమంది తెలుసుకొంటే మిగతావాళ్ళందరినీ ఆ ఆర్డర్ వైపు నడిపించవచ్చా? లేదా అందరూ దాన్ని తెలుసుకోవాలా? ఒకరు తెలుసుకొన్నదాన్ని ఇంకొకరికి చెప్పాలా? తెలుసుకోవడమే దానికణుగుణంగా నడచుకోవడమా?

    వీటికి త్రిగుణాత్మక జగత్తు అనే భావన ద్వారా సమాధానాలు ఏ విధంగా రాబట్టుకోవాలి." అని రాశారు.

    హయ్యర్ ఆర్డర్ వైపు పురోగమించడమనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మనం ఉద్దేశ్య పూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా ఏ విషయంలోనైనా సరే ఇప్పుడున్న స్థితికన్నా మెరుగైన స్థితికోసం ప్రయత్నించడం. ఇది మనం చేసే రోజువారీ కార్యకలాపాలలో కనిపిస్తుంది. అసలు మనుషులలో అధికులు నిరంతరం తమ సమయాన్ని ఈ ప్రయత్నాలకే వెచ్చిస్తుంటారు. మరింత ధనం, మరింత అధికారం, మరింత సుఖం, మరింత ప్రఖ్యాతి, మరింత విజయం. చదువుల్లో హయ్యర్ ర్యాంక్, స్పొర్ట్స్‌లో హయ్యర్ ర్యాంక్, అందాల పోటీలలో హయ్యర్ ర్యాంక్… ఇంకా గిన్నిస్ బుక్, లింకా బుక్ మొదలైనవాటిలో చోటు సంపాదించడం కోసం చేసే రకరకాల పనులు.

    ఇటువంటి ఉద్దేశ్యపూర్వకమైన హయ్యర్ ఆర్డర్ ఎప్పుడూ సత్యానికి దారి తీయదు. ఇది కేవలం మరింత మెరుగైన ఫిజికల్ క్వాలిటీ మాత్రమే. ఇది సత్యం కాదు. ఇది రజోగుణ సంబంధమైన ఒక దృగ్విషయం మాత్రమే. మూడు గుణాలు సమానంగా ఉంటేనే అది సత్యమవుతుంది. కేవల రజోగుణం సత్యం కాదు. దీనిని సత్యంలో అంతర్భాగంగా ఆచరించవచ్చు గానీ కేవలం హయ్యర్ ఆర్డరే లక్ష్యంగా మాత్రం ఆచరించకూడదు.అలా ఆచరిస్తే రజోగుణాధిక్యత పెరిగిపోయి సత్యావిష్కరణ జరగదు.

    (ఈ ఫిజికల్ క్వాలిటీ మెరుగు పరచుకోవడం కొరకు అంటే ఏ విషయంలోనైనా భౌతికంగా మరింత మెరుగైన స్థితిని సాధించడం కొరకు భారతీయ తత్త్వశాస్త్రంలో ‘రాజ యోగం’ అనే ప్రత్యేక అభ్యాసం ఉన్నది.)

    (పాశ్చాత్యులు హయ్యర్ ఆర్డర్ వైపు పురోగమించడమే సత్యాన్ని చేరే ఏకైక మార్గం అని నమ్మారు. హయ్యర్ ఆర్డర్ వైపు పురోగమనం ఎల్లప్పుడూ గతితార్కిక పద్దతిలోనే జరుగుతుంది కనుక వారు గతితర్కాన్నే అంతిమ జ్ఞానంగా విశ్వసించారు.)

    జీవ పరిణామం కూడా హయ్యర్ ఆర్డర్ వైపు పురోగమనంగానే కనపడుతుంది కానీ దాని వెనుక ఎవరి ఉద్దేశ్యం, ప్రయత్నం, సంకల్పం మనకు కనిపించవు. అంతకన్నా సూక్ష్మమైన, లోతైన చోదనశక్తి పనిచేస్తుంది. అందుకే పైన తెలిపిన ప్రయత్నపూర్వకమైన వాటికి ఈ జీవపరిణామ ప్రక్రియ విభిన్నమైనది. కానీ ఇది మాత్రం సత్యానికే దారి తీస్తుంది. ఎలా అంటే సత్యమంటే త్రిగుణాలు 1:1:1 గా అంటే సమానం గా ఉండలి. కానీ అమీబాలో 1: 0.001: 0.001 గా ఉంటాయి. అంటే సత్వ గుణం మాత్రమే సంపూర్ణం గా ఉన్నది. రజస్తమో గుణాలు అసంపూర్తిగా ఉన్నాయి. అంటే మూడింటి మధ్యన తుల్యతలేదు. కనుక అది అసత్యం. మరి సత్యం ఎలాగైనా సాధింపబడాలి. దానికొరకు రజస్తమోగుణాల పరంగా ఉన్న లోటు పూరింపబడాలి. దానికొరకే ఆ గుణాలు రెండూ యాక్టివ్ అయి గతితార్కిక పద్ధతిలో పురోగమిస్తాయి. ఈ పురోగమనమే జీవపరిణామం.

    ఈ జీవపరిణామంలో సత్వగుణానికి పనేమీలేదు. ఎందుకంటే అది ముందే సంపూర్ణం గా ఉన్నది. రజోగుణం, తమోగుణం ఒక దాని తరువాత ఒకటి వృద్ధి చెందుతూ ఉంటే క్రమంగా మరింత ఉన్నతమైన జీవులు ఆవిర్భవించి చివరికి మూడు గుణాల నిష్పత్తి 1:1:1 అవగానే మానవుడు ఆవిర్భవించాడు.ఈ విధంగా సత్యం సాధింపబడింది.

    ఈ జీవపరిణామంలో కేవలం రజస్తమోగుణాలు రెండే గతితార్కిక పద్దతిలో పాల్గొనడం వలన ఇది బాహ్యదృష్టికి హయ్యర్ ఆర్డర్ వైపు పురోగమనం చెంది చివరికి సత్యాన్ని చేరినట్లు కనపడుతుందికానీ ఇది కేవలం గుణాల సమతుల్యత ద్వారా సాధింపబడిన సత్యం మాత్రమే.

    జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరంలేదు (తెలుసుకోకూడదని నిబంధన ఏమీ లేదు). కొద్ది మంది తెలుసుకుని తగిన రాజకీయ వ్యవస్థ ద్వారా ఆ జ్ఞాన ఫలాన్ని ప్రతిఒక్కరూ పొందేటట్లు చేయవచ్చు.

    ఒక్కరు తెలుసుకున్నా చాలు. ఆ జ్ఞానాన్ని మిగిలిన వారికి తెలిపినపుడు వారిలో కొందరైనా గ్రహిస్తారు.

    తెలుసుకోవడం జరిగిన తరువాత దానికి అనుగుణంగా నడచుకోకుండా ఉండలేడు. జ్ఞానసిద్ధి అనివార్యంగా కర్మయోగానికి దారితీస్తుంది. ‘జ్ఞానం’, ‘కర్మ’ వేరు వేరు కాదని గీతలోకూడా తెలుపబడింది.

    రిప్లయితొలగించండి
  5. "ఈ ద్విగుణాత్మక, త్రిగుణాత్మక జగత్తు అని మనం ఒకటి ఊహించి ఆ చట్రానికణుగుణంగా జగత్తుకు భాష్యం చెప్పుకొంటూ పోవడం, కొండొకచో జగత్తుని దానిలో, ఒక పరిధిలో ఇరికించడం చేస్తున్నామేమోనని నా అనుమానం.


    ఇక పోతే సత్యం గురించి చెప్పుకొంటున్న మనం కాలస్వరూపం గురించి మరచి పోయాము. కాలాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను సత్యం చట్రాల్లో ఒదగదని గతంలో రాశాను." అని రాశారు.


    ‘హయ్యర్ ఆర్డర్’ అంటూ రాజయోగానికి సంబంధించిన ప్రశ్న లేవనెత్తారు. ‘సత్యం చట్రాల్లో ఒదగదు, దానిని ఒక పరిధిలో ఇరికించలేము’ అంటూ జ్ఞానయోగానికి సంబంధించిన ప్రశ్న లేవనెత్తారు.

    నేను రాసిన వ్యాసావళిలో 17వ భాగం నుండి 28 వ భాగం వరకూ రాసినది కేవలం ‘కర్మయోగం’ గురించి మాత్రమే. కర్మయోగం కాక భారతీయ తత్త్వశాస్త్రంలో ఇంకా ‘జ్ఞానయోగం’, ‘రాజయోగం’, ‘భక్తియోగం’ అనబడే మూడు యోగాలు ఉన్నాయి. వాటి గురించి నేను రాయలేదు. ఎందుకంటే నూతన రాజకీయ వ్యవస్థ యొక్క నిర్మాణానికి కర్మయోగం ఒక్కటి చాలు. అందుకే అది మాత్రమే రాశాను.

    మీరు భావిస్తున్న విధంగా ఒక పరిధిలో ఇరికించలేనిదీ, ఏ చట్రాల్లో ఒదగనిదీ, సూత్రీకరించలేనిదీ, మాటలతో వర్ణించలేనిదీ ఒకటి ఉన్నది. అయితే దాని గురించి మనం చర్చించలేదంతే. ఎందుకంటే రాజకీయ వ్యవస్థకు సంబంధించినంతవరకూ ఆ చర్చ అనవసరం. మీరు అనుకుంటున్నట్లుగా అది జగత్తో, సత్యమో కాదు. జగత్తు, సత్యం రెండూ కూడా ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయగలిగినవే. అంటే చట్రాల్లో ఒదిగేవే..సూత్రీకరణకు లొంగేవే.

    ప్రకృతి, పురుషుడు అని రెండు ఉన్నాయి. ఇందులో పురుషుడే భగవంతుడు లేక శుద్ధ బ్రహ్మం. ఈ శుద్ధ బ్రహ్మమే చట్రాల్లో ఒదగనిదీ, సూత్రీకరణలకు లొంగనిదీ, మాటలతో వర్ణించనలవికానిదీ.

    కానీ ప్రకృతి అనేది ఒక నియతి ప్రకారం, ఒక క్రమాన్ని అనుసరించి నడుస్తుంది. ఆ క్రమాన్ని మనం సూత్రీకరించవచ్చు..ఒక చట్రం పరిధిలో అధ్యయనం చేయవచ్చు. అలాగే ప్రకృతి సంబంధమైనది ఏదైనా సూత్రీకరణలకు అనుగుణంగానే ఉంటుంది. జగత్తు, సత్యం రెండూ కూడా ప్రకృతి సంబంధమైనవే. జగత్తు మాటెలా ఉన్నా మీరు సత్యాన్ని భగవత్ సంబంధమైనదిగా చూడటం వలనే అది సూత్రీకరణలకు లొంగదు, చట్రాల్లో ఒదగదు అనే భావనలో ఉన్నారు.

    కానీ సత్యం మీరనుకుంటున్నట్లుగా భగవత్సంబంధమైనది కాదు. అది కేవలం ప్రకృతి సంబంధమైనది మాత్రమే. జగత్తు ‘ముడి ఖనిజం’ లాంటిదైతే సత్యం ఆ ముడి ఖనిజాన్ని శుద్ధి చేయడం ద్వారా లభించే ‘లోహం’ వంటిది. జగత్తు పాలైతే సత్యం వెన్న. సత్యం అనేది భగవంతుడిని చేరే మార్గమే తప్ప భగవత్‌స్వరూపం కాదు.

    సత్యం అనేది జగత్తులోని దోషాన్ని తొలగించే ఒక టెక్నిక్ వంటిది. జగత్తులోని మూడు విరుద్ధ గుణాల మధ్యన equilibrium సాధించటం వలన ఆ గుణాలు ఒక దాన్ని మరొకటి effect less చేసుకుంటాయి ..న్యూట్రల్ చేసుకుంటాయి. దాంతో జగత్సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా దోషం తొలగిన జగత్తునే మనం ‘సత్యం’ అంటాము. సత్యం అంటే ఇంతకు మించి మరేమీ కాదు.

    మీరు చెబుతున్న కాలం కూడా అంతే. కాలాన్ని భగవత్ సంబంధంగా చూస్తే, అంటే భగవత్ స్వరూపంగా చూస్తే తుదిమొదలు లేని అనంతకాలమే మనకు గోచరిస్తుంది. దానికి ఏ చట్రాలూ ఉండవు.. ఏ పరిధులూ ఉండవు. కానీ మన జీవితంతో relative గా చూస్తే, అంటే ప్రకృతి సంబంధంగా చూస్తే భూత, భవిష్యత్, వర్తమానాలుగా సూత్రీకరించక తప్పదు.

    ప్రకృతి సంబంధమైన దృష్టితో ఆఖరికి శుద్ధ బ్రహ్మమైన ఆ భగవంతుడిని కూడా మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా విభజించగలిగాము.

    రిప్లయితొలగించండి
  6. నేను మీరు రాస్తున్న వివరణలని శ్రద్దగా చదువుతున్నాను.

    రిప్లయితొలగించండి
  7. ధన్యవాదాలు! మీ శ్రద్ధను నేను మీ కామెంట్లలోనే గమనించాను.

    ఈ వివరణలతో మీ సందేహాలు నివృత్తి అవుతున్నాయా? లేక మరిన్ని సందేహాలు కలుగుతున్నాయా? :) ఒక వేళ కలిగినా కూడా అడగటానికి సంకోచించకండి. నాకు తెలిసినంతలో చెప్పటానికి ప్రయత్నిస్తాను.

    ఇక మీ మరో సందేహం సంగతి చూద్దాం.

    "1.గీతలో ప్రవచించినట్లు జగత్తు త్రిగుణాత్మకమా, పాశ్చాత్యులు అనుకొన్నట్లు ద్విగుణాత్మకమా, ఇంకెవ్వరూ ఊహించనట్లుగా బహుగుణాత్మకమా? దీనికి ఏది ప్రమాణం,ప్రాతిపదిక?

    2.బేసిక్ ఫిలాసఫీలలోని ఈ గుణాల సంఖ్య (రెండా, మూడా, నాలుగా) అనే విషయమే వాటి జయాపజయాలకు ప్రాతిపదిక అనేనా మీరు చెప్పదలచుకొన్నది?"

    అని రాశారు.


    ఔను నేను చెప్పదలచుకున్నది దాదాపుగా అదే!

    ప్రాపంచిక విషయాలను అధ్యయనం చేయడానికి అనుగుణంగా ఎవరికి వారు తమదైన తత్త్వశాస్త్రాన్ని నిర్మించుకున్నారు. ఎవరికి వారు తమ శాస్త్రమే సరైనదనే భావనలోనే ఉంటారు. దీనికి ప్రామాణికత ఏమీలేదు. అసలు అటువంటి ప్రామాణికతే గనుక ఉంటే ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఎలా తత్త్వశాస్త్రాలను నిర్మిస్తారు? అందరూ ఆ ప్రమాణాన్నే అనుసరిస్తారు కదా! అటువంటి దేమీ లేకపోవడం వలననే ఇంత డీవియేషన్. ఇన్ని సిద్ధాంతాలు. ఒక వేళ అటువంటి ప్రామాణికత ఏదైనా ఉంటే దానినే అందరూ అనుసరించేటట్లుగా శాసించేదెవరు? పర్యవేక్షించేదెవరు?

    వేద విజ్ఞాన్ని వ్యతిరేకిస్తూ బౌద్ధులు విస్తారమైన జ్ఞాన చర్చ చేశారు. ఈ బౌద్ధుల చర్చను వ్యతిరేకిస్తూ శంకరుడాది మతాచార్యులు మరలా తిరిగి విస్తృతమైన జ్ఞాన చర్చ చేశారు. మరలా ఈ మతాచార్యులు ఒకరిలో ఒకరికి భిన్నాభిప్రాయాలు. వీరు గాక ప్రాచీన గ్రీకులు చేసిన తాత్త్విక చర్చ, ఆధునిక జర్మన్ పండితులు చేసిన తాత్త్విక చర్చ. ఇంకా రకరకాల తాత్త్విక చర్చలు. వీరిలో ఏ ఒక్కరికీ వేరొకరితో పొంతన ఉండదు.

    ఏవరైనా సరే జరుగుతున్న, జరిగిన ప్రాపంచిక విషయాలలో అంతర్లీనంగా ఉన్న సారూప్యతను గమనించిన మీదట వీటన్నింటినీ నడిపిస్తున్న తత్త్వం ఇదై ఉంటుందని తమ మేథస్సు మేరకు ఊహించి ఆ క్రమానికి, ఆ తత్త్వానికి అనుగుణంగా ఆ ప్రాపంచిక విషయాలన్నింటినీ అధ్యయనం చేయటం ప్రారంభిస్తారు. కొన్ని సిద్ధాంతాలు రూపొందిస్తారు.

    ఏవరికి వారు తమదే సరైన తత్త్వశాస్త్రం అని వాదిస్తారు కనుక ఏది సరియైనదనే దానికి ఎటువంటి గీటు రాయి ఉండదు. ఒక వేళ అటువంటి గీటు రాయి ఏదైనా ఉన్నాకూడా ఆ గీటురాయికి మాత్రం ప్రామాణికత ఏమిటి?

    కాలపరీక్షకు నిలబడేదే, మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేదే అసలైన తత్త్వశాస్త్రం.

    మనదేశంలో ప్రాచీన కాలంలో త్రిగుణ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు సాంఖ్యులు. షడ్దర్శనాలలో ఒకటైన సాంఖ్య దర్శనంలో ఈ సిద్ధాంతం చర్చించబడింది. కపిలముని ఈ సాంఖ్య దర్శన నిర్మాత. ఈయన అత్యంత ప్రతిభావంతుడు.. మహా తత్త్వ వేత్త. ఈ సాంఖ్యులు నాస్తికులు. అంటే నిరీశ్వరవాదులు. వీరు తార్కికులు..హేతువాదులు. అంతే కానీ మూఢ భక్తులు కారు.

    ఆస్తికులైన ఉపనిషత్కారులు కూడా ఈ త్రిగుణ సిద్ధాంతాన్నే స్వీకరించారు. ఈ సిద్ధాంతమే గీతలో కూడా ప్రతిపాదించబడింది. తనను విశ్వసించనివారు ప్రతిపాదించినది కనుక గీతాకారుడు (భగవంతుడు) ఈ సిద్ధాంతాన్ని తోసిపుచ్చలేదు. అది సరియైన సిద్ధాంతం కనుకనే సమర్ధించాడు.

    ఏ సిద్ధాంతానికైనా ప్రామాణికత తాత్కాలిక విజయం కాకుండా కాలపరీక్షకు నిలబడటం ఒక్కటే. అంతవరకూ దానిని బలంగా విశ్వసించటం, దానికి అనుగుణంగా ప్రపంచాన్ని అధ్యయనం చేయడమొక్కటే మార్గం.

    రిప్లయితొలగించండి
  8. "నాకొక సహాయం కావాలి. సత్వ, రజ, తమో శబ్దాలకు విడి విడిగా అర్దం కావాలి. సాత్వికము అంటే నాకు పూర్తిగా అర్ధం అయింది. తామసము అంటే కొంత అర్ధం అయింది. తమస్ అంటే చీకటి అని ఏమైనా అర్దం ఇందులో ఉందా? రజస్సు అంటే వెలుగు అని అర్దమేమైనా ఉందా? వీటి మధ్య కొంత గజిబిజి ఉంది. విశదీకరించగలరు.


    చీకటి-వెలుగు, సుఖము-దు:ఖము, నిజం-అబద్దం, రాగము-ద్వేషము, ఆడ-మొగ మొదలైన విషయాలలో మూడవ గుణమేమిటి?"

    అని రాసారు.

    మన ప్రాచీన తత్త్వవేత్తలు ప్రకృతిలోగానీ, ప్రాపంచిక వ్యవహారాలలోగానీ మూడు వైరుధ్యాలను గమనించిన మీదట వాటికి ‘సత్వము’, ‘రజస్సు’, ‘తమస్సు’ అని పేర్లు పెట్టారు.

    చీకటి తమోగుణకార్యం. అందుకే చీకటిని ఒక్కోసారి తమస్సు అనికూడా అంటుంటారు. అంతమాత్రాన తమోగుణం అంటే చీకటి మాత్రమే అనే అర్ధం ఏమీ లేదు. తమస్సంటే ఒక సందర్భంలో చీకటి కావచ్చు. మరో సందర్భంలో మరోటి అవవచ్చు. తమస్సంటే ప్రకృతిలోని మూడు వైరుధ్యాలలో ఒకటి. అది అనేక రూపాలలో తనను అభివ్యక్తీకరించుకుంటుంది. తమస్సంటే చీకటంటూ ఏదో ఒక అభివ్యక్తీకరణతో ఆ గుణాన్ని మనం వివరించలేము. తమోగుణం ప్రాతినిథ్యం వహించే శతకోటి కార్యాలలో చీకటి కూడా ఒకటి.. అంతే!

    (రజస్సు అంటే వెలుగు అనే విషయం కూడా ఇంతే)

    మన భాష్యకారులు దాదాపూ అందరూ సత్వగుణాన్ని పాజిటివ్ గానూ, రజస్తమోగుణాలను నెగెటివ్ గానూ వ్యాఖ్యానించారు. సత్త్వగుణాన్ని ఆచరించదగినది గానూ, రజస్తమస్సులు రెంటినీ త్యజించదగినవి గానూ అర్థం చెప్పారు.

    కానీ గీతాకారుని ఆంతర్యం మాత్రం అది కాదు. మూడింటి ఎడల సమదృష్టి కలిగిన ‘గుణాతీత స్థితి’ నే గీతాకారుడు ప్రతిపాదించాడు.

    మూడు గుణాలలో ప్రతిదానిలోనూ మానవునకు మేలు చేసే అంశాలున్నాయి. అలానే కీడు చేసే అంశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ మూడింటిలో ఒకటి ఆచరంచదగినది మిగతావి త్యజించదగినవి అనేది సరైన భావన కాదు. మూడింటిలోనూ మంచి చెడులున్నాయి. కనుక మూడు గుణాలనూ సమదృష్టితో చూడవలసిన ఆవశ్యకత మానవునకు ఉన్నది.

    పండితుల భాష్యాల వలన మనకు ఈ సత్త్వరజస్తమో గుణాలమీద కొన్ని దురభిప్రాయాలు స్థిరపడిపోయాయి. అందుకే వాటిని ‘వాదం’, ‘ప్రతివాదం’, ‘విశ్లేషణ’ అనేటటువంటి వేరే పేర్లతో కూడా పిలుస్తూ ఆ భావనల ద్వారా వాటిని సరియైన విధంగా అర్థంచేసుకుని ఈ అభిప్రాయాలనుండి బయటపడటానికి ప్రయత్నిద్దాం.

    (వీటిని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటూ ఆ పేర్లతోనే పిలవాలనే నియమమేమీ లేదు. మన అధ్యయన సౌలభ్యం కోసం వేరే పేర్లతోనైనా వాటిని పేర్కొనవచ్చు. ప్రకృతిలో మూడు వైరుధ్యాలున్నాయన్నదే ప్రధానం. వాటి పేర్లేమిటన్నది,ఆ పేర్లకు అర్ధాలేమిటన్నది అంత ప్రధానం కాదు.)

    చీకటి-వెలుగు లో మూడవగుణం ఏది అని అడిగారు.

    రాత్రి-పగలు-సంధ్య అనే త్రయాన్ననుసరించి చీకటి-వెలుగుకు మూడవ గుణంగా మసక వెలుతురును చెప్పవచ్చు.

    నిజం-అబద్దం కు మూడవగుణం అడిగారు.

    నేను గమనించిన వాటిలో కొన్ని కర్మత్రయాలను ‘కర్మస్వరూపం’ అధ్యాయంలో పేర్కొన్నాను. వాటిలో ఈ నిజం-అబద్దం ఉన్నది. ‘రహస్యం’ ఈ సందర్భంలో మూడవ గుణం. అంటే ఏమీ చెప్పకపోవడం (నో కామెంట్) లేక విషయాన్ని రహస్యంగా ఉంచడం.

    ఆడ-మగ కు మూడవ గుణం అడిగారు.

    కర్మస్వరూపంలో నేను తల్లి-తండ్రి-సంతానం అనే త్రయాన్ని పేర్కొని ఉన్నాను. దీనిని బట్టి ఆడ-మగకు పసిబిడ్డను మూడవగుణంగా చెప్పవచ్చు. ఎందుకంటే బిడ్డకు ఒక వయసు వచ్చేవరకూ లింగాన్ని (సెక్స్‌ను) పరిగణించకూడదు.

    అలాగే రాగం-ద్వేషం, సుఖం-దుఃఖం మొదలైన వాటికి మూడవ గుణంగా నిర్లిప్తత, స్తబ్దత, స్పందన లేకపోవడం, ఉదాసీనత మొదలైన వాటిని చెప్పవచ్చు.

    కొన్ని సార్లు మనం మూడవ గుణాన్ని గమనించలేక పోవచ్చు. ఇదని చెప్పలేకపోవచ్చు. అంతమాత్రాన అది లేకుండా పోదు. ప్రతి విషయానికీ మూడవ గుణం తెలిసి తీరవలసిన అవసరమేమీ లేదు. మొదట మనం త్రిగుణ సిద్ధాంతాన్ని కొన్ని ఉదాహరణలద్వారా అర్థం చేసుకుని విశ్వసించగలిగి, తద్వారా మన సమస్యలను మనం పరిష్కరించుకోగలిగితే అంతే చాలు.

    సంక్లిష్టమైన ఈ జగత్తులోని ప్రతి విషయంలో ఈ మూడింటినీ దర్శించాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. కొన్ని విషయాలు త్రిగుణాల పరంగా కాకుండా అవసరాన్ని బట్టి మరో ప్రాతిపదికన పేర్కొన బడతాయి. ఆ సమయంలో వాటిని త్రిగుణ ప్రాతిపదికన విభజించి చెప్పటం సాధ్యం కాకపోవచ్చు.

    సీతారాం రెడ్డి గారూ! మీ కామెంట్‌లోని సందేహాలన్నింటికీ సమాధానాలు ఇవ్వగలిగాననే అనుకుంటున్నాను.

    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  9. మనో మధనాన్ని కలిగిస్తాయండి మీ వ్యాసాలు.

    రిప్లయితొలగించండి
  10. @ కొండముది సాయికిరణ్ కుమార్ గారు, నా వ్యాసాలు నచ్చినందుకు ధన్యవాదాలు! మీ వ్యాసాలు కూడా చాలా బావుంటాయి. నేను మీరు రాసే ప్రతి వ్యాసం మిస్ అవకుండా చదువుతుంటాను. మీరు గతంలో రాసిన ‘మేడిపండు ప్రజాస్వామ్యం’ వ్యాసావళి నాకు బాగా నచ్చినది. మీ విమర్శలు సునిశితంగా ఉండటమే కాదు, మీరచనా శైలి చదివించేటట్లుగా ఉంటుంది. మీ వాక్యనిర్మాణం కూడా సులువుగా అర్థమయ్యేటట్లు ఉంటుంది. నా ‘శంఖారావం’ బ్లాగ్‌లిస్ట్‌లో మీ ‘అంతర్యానం’ ను గమనించే ఉంటారు.

    రిప్లయితొలగించండి
  11. I have been trying to post a comment for few days now. but it shows a processing error every time i try.

    Thank you very much for patiently clarifying the doubts. But i would get bank with few more once again

    - rayraj

    రిప్లయితొలగించండి
  12. ౧.నాదే కన్‍ఫ్యూజన్‍లెండి. వర్గీకరణలో మార్పును గమనించి కూడా, మిగితాది చదివేయాలన్న ఆసక్తిలో పొరబడ్డాను.
    ౨.కుటుంబ వ్యవహారాలలో యజమాని పరంగా చెప్పిందే నాకు కావలసింది. సంతృప్తిగా,సంతోషంగా ఉంది.
    ౩.‘ధన నిర్వహణ’ గా నే కావాలి.అది కూడ అర్దమయ్యింది.
    కొన్ని ఇంట్యూటివ్ గా‍, ప్రాక్టికల్‍ గా తెలిసినా, సూత్రాలలో పెట్టి మళ్ళీ చూడటం రాదు. అందుకని మీరు విశదీకరించనప్పుడు చాలా బావుంది.

    పని ఉన్నా ఆటంకం లేకుండా సర్దుబాటు చేసుకొని చదువుకున్నట్టుగానే నేననుకుంటూంటాను లెండి! దోషముంటే అనుభవించకు తప్పదు.ఇదీ ఓ విధంగా బలహీనతేనేమో నని నాకనిపిస్తుంది.

    ఇవాళ్టి రోజుల్లో గవర్నెమెంటు గుమాస్తా ఉద్యోగాల్లా ’పనివస్తే’ చేయడం అనేది ఉండదు. చాలా సార్లు పని మనమే కల్పించుకోవాలి, కలిపించాలి. లేకపోతే అభివృద్ధి చూపించలేము.అందుకని నా ఈ ‘సర్వారంభపరిత్యాగీ’ మీద ప్రశ్న.

    పరిస్థితులకు ప్రతిస్పందన (reactive) గా ఉండకూడదు. అవును. ముందస్తుగానే ప్రవర్తించాలి. చర్యలుండాలి. అదే ప్రోఆక్టివ్‍నెస్‍. కానీ "ఎలా ప్రవర్తిస్తే, ఎలా స్పందిస్తే మనకు మంచిఫలితం వస్తుందో " అనేసరికి మళ్ళా అందులో రియాక్షనే వినబడుతోంది నాకు!. లేదా ఆబ్జెక్టివ్ సెట్టింగ్‍ కూడా ‘సర్వారంభపరిత్యాగీ’ విరుద్ధంగానే అనిపిస్తూంది నాకు.

    ముందస్తు చర్య అనేసరికి :ఎలా చేయడం!? సరే : "మనిషిలో ఉండే inner guidence ప్రేరేపణతోనే ప్రారంభించాలి. మనసులోచెలరేగే ఇష్టాయిష్టాలతో (కామంతో) కాదు." ఈ గైడన్స్ లోనే క్లారిటీ మిస్సయ్యి, ద్వైదీగానూ, ద్వంద్వంగానూ ఉంటాం నాలాంటి వాళ్ళం చాలా మంది. అందుకని కూడా జీవేచ్ఛ" ప్రేరేపించేవేంటో" తెలుసుకుందామని అడిగాను. అలాగే ఏ ప్రేరకంతో ఇది టైపు చేసి వేస్తున్నాను!? ఇష్టంగాబట్టి. కెరీర్‍కు మించి ఇష్టంగాబట్టి.ఇది ఖచ్చితంగా మనసుకు సంబంధించిందేగా!

    బహుశా మీరు మరో బ్లాగు రాసినా సరే. నాకెందుకో "జీవేచ్ఛ-స్వభావం-సంకల్పం " కీనూ, ‘సర్వారంభపరిత్యాగీ కీనూ లింకున్నట్టుగా ఉంది. (మళ్ళా యోగాలుగా విడగొట్టకండి సార్!. కర్మయోగం అంతే!ప్లీజ్!)

    ఇవన్నీ చెబుతున్నందుకు మీకు నా ధన్యవాదాలు. నమస్సులు.

    రిప్లయితొలగించండి
  13. please remove my english comments- the above apology for delay and this present one.

    ivi paanakam lo pudakala intha manchi disucssionlo enduku ceppaMDi. please delete these two.

    -రేరాజ్

    రిప్లయితొలగించండి
  14. నేనుండే ప్రాంతంలో పైప్ లైన్ పనుల మూలంగా నెట్ కేబుళ్ళు తెగిపోవడతో మీకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం జరిగినది. క్షమించగలరు! ఈ నెలాఖరుకు 'సుధర్మ ' బ్లాగులో ప్రస్తుతం నేను రాస్తున్న టపాలను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. అది అవగానే మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు వేచి ఉండగలరు. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  15. నేను ఇంకా వేచి చూస్తున్నాను. సాంకేతిక కారణాలవల్ల నే రోజు చూసే చోటనుండి మీకు వ్యాఖ్య వేయలేను. కాక క్రమ బద్ధంగా ఉన్న ఈ పోస్టుల్లో మాటిమాటికి విషయంలేని వ్యాఖ్యలెందుకని కూడా వదిలేశాను.

    ఈ వ్యాఖ్యలు నిజానికి మూడో భాగంలో , కిందట నాకు సమాధానాలిచ్చిన క్రింది భాగంలో ప్రశ్నలతో సహా వచ్చే విధంగా సమాధనమివ్వ గలరు. ఇక్కడ ఉన్న నా కామెంట్లన్నీ తీసివేయగలరు.

    రిప్లయితొలగించండి
  16. రేరాజ్ గారూ! మీకు సమాధానం ఇవ్వవలసిన విషయం నాకు జ్ఞాపకం ఉన్నది. అయితే నేను బ్లాగింగ్ నిరంతరాయంగా చేయను. మధ్య మధ్యలో కొంత విరామం ఇస్తుంటాను. మీకు సమాధానం ఇచ్చే లోపే ఆ విరామదశ వచ్చినట్లున్నది. అయితే మీకోసం ఆ విరామానికే విరామాన్నిద్దామనుకుంటున్నాను.

    కానీ మీరడుగుతున్నట్లుగా 'కర్మయోగం' ఒక్కటే చాలంటే కుదరదు. మిగతా యోగాల గురించి కూడా నాకున్న అభిప్రాయాలను వివరిస్తాను. అవి చదివితే మీ సందేహాలు వాటంతటవే తొలగిపోవచ్చు.

    మీ కామెంట్లను తొలగించవలసిన అవసరం లేదు. మీరు కూడా తొలగించకండి. అవన్నీ చర్చలో భాగమే.

    రిప్లయితొలగించండి