27, డిసెంబర్ 2008, శనివారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--III

IV. సత్యావిష్కరణ

మనం II భాగంలో ‘జగత్‌స్వరూపం’ గురించీ, ‘సత్యస్వరూపం’ గురించీ తెలుసుకున్నాం. ఇప్పుడు జగత్తు ద్వారా సత్యాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలుసుకుందాం.

మనిషికి సిద్ధసత్యం (ready made TRUTH) ఎక్కడా లభించదు. మనకు అందుబాటులో ఉండేది కర్మలు మౌలిక రూపంలో ఉండే జగత్తు మాత్రమే. ఈ జగత్తు ద్వారానే మనం సత్యనిర్మాణం చేయాలి. (జగత్తు సత్యం కాకపోవచ్చు అసత్యమే కావచ్చు. అంతమాత్రాన ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా మిథ్య మాత్రం కాదు. జగత్తు సత్యానికి ముడి పదార్థం)

మానవునకు జగత్తులోని కర్మలను అవి ఏ రూపంలో ఉన్ననూ ఆచరింపక తప్పదు. ఐతే ఆ కర్మాచరణలో సత్యనిర్మాణం చేయాలా లేక తిరిగి జగత్తునే (అసత్యాన్నే) పొందాలా అనేది మన మానసిక స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది.

ఈ కర్మలను ఒకానొక మానసిక స్థితి ద్వారా ఆచరించడానికి ఉపక్రమిస్తే ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. అదే ‘నిష్కామ మానసికస్థితి’. అలా కాకుండా కామపూరితమైన మనస్సుతో కనుక కర్మలాచరిస్తే మనకు తిరిగి ఈ సంఘర్షణాత్మకమైన జగత్తే లభిస్తుంది కానీ సత్యం లభించదు.

ఇప్పుడు ‘కామం’ అంటే ఏమిటో, ‘నిష్కామం’ అంటే ఏమిటో చూద్దాం.


V. కామం

మనం ఇంతకు ముందు ‘కర్మ స్వరూపం’ లో చెప్పుకున్నాం ‘ఒక కర్మత్రయంలోని ప్రతికర్మకు మనిషి మనసును ఆకట్టుకునే ఆకర్షణ శక్తి ఉంటుంది’ అని. అలా ఒక కర్మ యొక్క ఆకర్షణకు లోబడి పోయే మనిషి బలహీనతను ‘కామం’ అంటారు.

ఈ కామం ద్వారా కర్మలాచరించే మానవుడు ఒక కర్మత్రయంలోని ఏదో ఒక కర్మ యొక్క ఆకర్షణకు లోబడి (ఏ కర్మ అనేది అతని స్వభావాన్ని బట్టి ఉంటుంది) దానినే ఇష్టపడుతూ దానినే ఎక్కువగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న మిగిలిన రెండు కర్మలను ద్వేషిస్తూ వాటిని ఆచరించకుండా సాధ్యమైనంత దూరంగా ఉంటాడు. మనిషి ఇటువంటి కర్మ విధానాన్ని కనుక ఆచరిస్తే ఒక కర్మ యొక్క ఆధిక్యత పెరిగిపోయి ‘సత్యం’ ఆవిష్కరింపబడదు. (మూడు కర్మలకూ సమాన ప్రాతినిథ్యం ఉన్నపుడే దానిని సత్యం అంటారు) దీనినే రాగద్వేషాలతో కూడుకున్న కర్మ విధానం అంటారు.

ఇక్కడ ‘రాగం’ అంటే కర్మత్రయంలోని ఏదో ఒక కర్మను ఇష్టపడటం, ‘ద్వేషం’ అంటే దానికి విరుద్ధంగా ఉన్న మిగిలిన రెండు కర్మలను ద్వేషించడం.


VI. నిష్కామం

నిష్కామం అంటే కామం లేకుండా అని అర్థం. నిష్కామంగా కర్మకు ఉపక్రమిస్తే కర్మత్రయంలోని ఏ ఒక్క కర్మ యొక్క ఆకర్షణ కూడా పనిచేయదు. ఎప్పుడు మనిషిలో కామం, రాగం ఇత్యాదివి ఉంటాయో అప్పుడే మనిషి ఏదో ఒక కర్మ వైపు అధిక మొగ్గు చూపడం జరుగుతుంది. అలాంటి కామమేదీ లేనపుడు మనిషి సందర్భౌచిత్యాన్ననుసరించి కర్మత్రయంలోని మూడు కర్మలనూ సమానంగా ఆచరిస్తాడు. అప్పుడు అతని జీవితంలో మూడు కర్మలకూ సమాన ప్రాతినిథ్యం లభించి ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది.


VII. అనువర్తనం (application)

పైన వివరించిన విధానాన్ని అనుసరించి మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఏ విషయంలోనైనా మనం సత్యాన్ని ఆవిష్కరించవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనవచ్చు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థకు సంబంధించి చిరకాలంగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యను ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం.

“భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో రాసిన వ్యాసావళిలోని మొదటి అధ్యాయంలో మనం ప్రపంచ రాజకీయ, సామాజిక చారిత్రక క్రమాన్ని సంగ్రహంగా పరిశీలించాం. అందులో రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయంగా ‘రాజ్యం-సమాజం-వ్యక్తి’ పేర్కొనబడింది. అంటే వ్యవస్థలో రాజ్యం, సమాజం, వ్యక్తి అనే మూడు అంగాలుంటాయి. వాటినే ఇక్కడ త్రయంగా పేర్కొనడం జరిగింది.

(‘సమాజం’ అంటే సామాజికమైన ఉత్పత్తివనరులను అభివృద్ధిచేసి వాటిని స్వంత ఆస్థి రూపంలో తన అధీనంలో ఉంచుకున్న బూర్జువా వర్గం. ‘వ్యక్తి’ అంటే సాధారణమైన జనబాహుళ్యం)

వ్యవస్థలోని ‘రాజ్యం’ అనే అంగం యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన ఇస్లాం సమాజాన్ని, వ్యక్తిని అణచి వేసింది. ఈ విధంగా ‘రాజ్యం’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘ఇస్లాం’ సత్యాన్ని నిర్మించలేకపోయింది.

‘సమాజం’ యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చిన కాపిటలిజం రాజ్యం మరియు వ్యక్తి అనే అంగాలను అణచివేసింది. ఈ విధంగా ‘సమాజం’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘కాపిటలిజం’ కూడా సత్యాన్ని నిర్మించలేకపోయింది.

అలానే ‘వ్యక్తి’ ప్రయోజనాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత నిచ్చిన కమ్యూనిజం మిగిలినవైన రాజ్యం మరియు సమాజం అనే అంగాలను అణచి వేసింది. ఈ విధంగా ‘వ్యక్తి’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘సామ్యవాదం’ కూడా సత్యాన్ని నిర్మించలేక పోయింది.

‘వాదం’, ‘ప్రతివాదం’ మరియు ‘విశ్లేషణల’ ఆంశిక సమన్వయమే సత్యమని మనం ‘సత్యస్వరూపం’ లో తెలుసుకున్నాం. TRUTH is the Synthesis of Thesis, Anti-Thesis and Analysis.

దీనిని బట్టి మనం వ్యవస్థలోని ఏ ఒక్క అంగపు ప్రయోజనాలో కాకుండా మూడు అంగాల యొక్క అంటే రాజ్యం-సమాజం-వ్యక్తి ల యొక్క ప్రయోజనాలనూ సమానంగా నెరవేర్చగలిగేటట్లుగా మన రాజకీయ, సామాజిక వ్యవస్థను నిర్మించుకోగలిగితే కర్మత్రయంలోని మూడు కర్మలూ సమనంగా ఆచరింపబడినటై ఆ వ్యవస్థ సత్యానికి ప్రాతినిథ్యం వహిస్తుంది.

ఇదే విధంగా ఒక్క రాజకీయ వ్యవస్థకు సంబంధించిన సమస్యే కాక ఏ సమస్యైనా పరిష్కారమౌతుంది. …(అయిపోయింది)

10 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. కాపిటలిజం కమ్యూనిజమ్ లను తారుమారుగా వాడారు. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  3. అదేంటి! మూడో అధ్యాయం ఉందన్నారు!? అప్పుడే అయిపోయింది అనేశారు!!?? ఏమన్న మిస్స్ అయ్యానా!? మీరిచ్చిన లింక్ నుంచి మొదలెట్టాను. ఆంటే మొదటి ఆధ్యాయం ఇంకా చదవలేదు. మళ్ళా అంతా ఒక సారి చదువాతాను. కాకపోతే కొన్ని ప్రశ్నలు: 1.(భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---21(గీతా వ్యాసాలు) ) :
    మనకు ఆచరించటానికి కావలసినది సత్యమే. సర్వజనులకూ కావలసినది కూడా సత్యమే. కనుక ఆ సత్యాన్ని గురించే చర్చిద్దాం. సత్యాన్ని విశదీకరిస్తూ ఈ రెండవ అధ్యాయం యొక్క ప్రారంభంలో చెప్పిన మూడు సూత్రాలలో రెండవది ‘సత్య స్వరూపం’ గురించి చర్చిస్తుంది. దాని ప్రకారం ‘త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం’. (భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---26(గీతా వ్యాసాలు) ) :
    అలాగే తాత్కాలికమైన మేఘాలు తొలగగానే శాశ్వతమైన నిర్మలాకాశం దృగ్గోచరమైనట్లు మనోమాలిన్యం తొలగగానే నిరంతర వాహిని అయిన భగవదనుభూతి దానంతటదే అనుభవంలోకి వస్తుంది (భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---27 (గీతా వ్యాసాలు) :)
    అన్ని కర్మలలోని దోషాలను యజ్ఞం పరిహరిస్తుంది. సర్వ కర్మలకు భోక్త ఆ భగవంతుడే. ఈ మధ్యలో "సత్యం" - "త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం" అన్నారు. మరి ఈ భగవంతుడెవరూ!? సడెన్‌గా మధ్యలో వచ్చేశాడు. ఎక్కడో కనెక్షన్ మిస్సాయ్యాను. వివరించగలరా!? ప్లీజ్. 2.అలానే ‘భాష’ విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి ఒక్కొకసారి వాడుక భాష, ఒక్కోకసారి ఇంగ్లీషు భాష (శిష్ట భాష), ఒక్కొకసారి సంస్కృతం (పురాతన భాష) ఇలా మూడు భాషలనూ అంగీకరించినట్లైతే భాష విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరించబడినట్లుగా భావించవచ్చు.
    ఇదే పంథాలో, ఒక ఉద్యోగంనిర్వహణలో, ఒక ధన సముపార్జనలో, ఒక కుటుంబ వ్యవహారాలలో త్రిగుణాలు ఏవో దయచేసి వివరించండి. ఇంకా మీరుపదేశించింది ఈ రంగాలకు అనువర్తనం( అప్లికేషన్ కి మీనించి నేర్చుకున్న పదం) చేయడం రాలేదు. కనీసం ఉద్యోగనిర్వహణలో ఎలాగో చెప్పండి.అలాగే " సర్వారంభ పరిత్యాగీ" అనేది వీటిలో ఎలా సరిపోతుందో చెప్పండి. పైగా మనకి ప్రోఆక్టివ్‌నెస్స్ మీద మ్యానేజ్మెంట్ పాఠాలు కూడా ఉంటాయి కదా! అందుకని. మీ వ్యాసాలు మళ్ళీ చదివితే ఎమన్నా తెలియచ్చేమో కానీ మీరు మళ్ళా చెబిదే బావుంటుంది. 3.జీవేఛ్ఛ గురించి కూడా ఎక్కాడన్నా రాశారా!?దయచేసి లింకు ఇవ్వగలరూ. చివరగా, నేనూ ఆఫిస్ అవర్స్లో మీ వ్యాసావళీ చదివాను. ఇది ఏ గుణం!!? :))

    రిప్లయితొలగించండి
  4. @రాయ్‌రాజ్ గారు, మీకు సమాధానం సిద్ధం చేస్తున్నాను. దయచేసి వేచి చూడగలరు!

    రిప్లయితొలగించండి
  5. రాయ్‌రాజ్ గారూ! నేను మీ కామెంట్‌కు ఒకే కామెంట్‌లో కాకుండా మూడు నాలుగు కామెంట్‌ల రూపంలో సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తాను. (ఈ సమాధానాలు మీరు ప్రశ్నించిన ఆర్డర్లో ఉండకపోవచ్చు.) ముందుగా మీరు కామెంట్ ప్రారంభంలో వెలిబుచ్చిన సందేహం:

    ‘’అదేంటి! మూడో అధ్యాయం ఉందన్నారు!? అప్పుడే అయిపోయింది అనేశారు!!?? ఏమన్న మిస్స్ అయ్యానా!?’’


    నేను మూడవ అధ్యాయం ఉందన్నది “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షిక కలిగిన వ్యాస పరంపరనుద్దేశించి, ‘అయిపోయింది’ అన్నది, “తేలిక భాషలో తత్త్వశాస్త్రం” అన్న శీర్షిక ఉన్న మూడు భాగాల వ్యాసాన్నుద్దేశించి. రెంటినీ వేరువేరు వర్గాల్లో ఉంచాను ..దయచేసి గమనించగలరు!

    (రెండవ అధ్యాయం (గీతావ్యాసాలు) లోని శ్లోకాలూ, వాటి వివరణలతో విషయం సంక్లిష్టంగా మారినదని ఒకరిద్దరు చదువరులంటే, కేవలం విషయాన్ని తేలిక పరచడానికి, ఆ గీతావ్యాసాలనే మరలా సంగ్రహంగా “తేలిక భాషలో తత్త్వశాస్త్రం” అనే శీర్షికతో మూడు భాగాలుగా రాశాను.)

    రిప్లయితొలగించండి
  6. ఇక మీరడిగిన మూడు ప్రశ్నలలో రెండవదాని గురించి ముందు చూద్దాం!

    "ఒక ఉద్యోగంనిర్వహణలో, ఒక ధన సముపార్జనలో, ఒక కుటుంబ వ్యవహారాలలో త్రిగుణాలు ఏవో దయచేసి వివరించండి.”

    ఇవి మీరు ఏ దృష్టితో అడిగారో కానీ వీటికి సంబంధించి నాకున్న అభిప్రాయాలను మాత్రం చెబుతాను. ముందుగా కుటుంబ వ్యవహారాలు..

    కుటుంబ వ్యవహారాలలో యజమాని పరంగా ఆలోచిస్తే భార్యాబిడ్డలు, వారి బాగోగులు చూసుకోవడం ‘సాత్వికకర్మ’. తాను, తన వ్యక్తిగత జీవితం, తన స్నేహాలు, తన సరదాలు.. ఇది ‘రాజస కర్మ’. తల్లిదండ్రులు లాంటి పెద్దవారి బాధ్యతలు చూసుకోవడం ‘తామస కర్మ’. కుటుంబ యజమాని అనేవాడు ఈ మూడు కర్మలనూ సమానంగా ఆచరిస్తే అది సత్యాచరణగా చెప్పవచ్చు.

    మిగతా కుటుంబసభ్యుల పరంగా కుటుంబ వ్యవహారాలను వివరించాలంటే రజోగుణకర్మ అయిన ‘మానవ సంబంధాల’ పరంగా వివరించాలేగానీ త్రిగుణాల పరంగా వివరించలేము.

    మరో విషయం ధన సముపార్జన:

    ముందుగా ‘ధన నిర్వహణ’ను (money management) గురించి చెప్పుకుందాం. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న మొత్తం ధనంలో మూడవ వంతును స్థిరాస్తి రూపంలోనో లేక భవిష్యత్తు అవసరాల కోసం బాంకుల్లో రిస్క్‌లేని ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలోనో పొదుపు చేయాలి. మరొక మూడవ వంతును పెట్టుబడిగా అంటే మరింత సంపాదించే నిమిత్తం మదుపు (investment) చేయాలి. మిగిలిన మూడవ వంతును అనుభవించడానికి కేటాయించాలి.

    ఇక్కడ పొదుపు ‘తామస కర్మ’, మదుపు ‘రాజస కర్మ’, అనుభవించడం ‘సాత్విక కర్మ’.

    ‘ధన నిర్వహణ’ కాకుండా అచ్చంగా ‘ధనార్జనే’ అయిన పక్షంలో మనం దానిని త్రిగుణాల పరంగా చూడలేము. రజోగుణ కర్మ అయిన ‘వ్యాపారదక్షత’ నే అక్కడ పరిగణించవలసి వస్తుంది.

    ఇక ఉద్యోగ నిర్వహణ

    అక్కడ మీకన్నా పెద్ద అధికారులు ‘తామస కర్మ’, తోటి ఉద్యోగులు ‘రాజస కర్మ’, క్రింది ఉద్యోగులు ‘సాత్విక కర్మ’ అవుతారు.

    కానీ ఉద్యోగ నిర్వహణలో మీరెదుర్కొనే సమస్యలను త్రిగుణాల పరంగా చూడకూడదు. అది రజోగుణ సంబంధమైన ‘లౌక్యం’, ‘వ్యవహార దక్షత’ మొదలైన వాటి పరంగా చూడాలి.

    పై మూడు సందర్భాలలో కూడా రజోగుణం క్రింద చెప్పబడిన ‘మానవ సంబంధాలు’, ‘వ్యాపారదక్షత’, ‘వ్యవహార దక్షత’ మొదలైన విషయాలు అసత్యం కావు. సత్యంలో అంతర్భాగంగా ఉండే రజోగుణమే అది. కానీ అవే పనులు పరిమితికి మించి ఆచరిస్తే రజోగుణాధిక్యత పెరిగి అసత్యం అవుతుంది. కాబట్టి ఆయా రజోగుణకర్మలను సత్యపు పరిధిలో మాత్రమే ఆచరించాలి.

    (భారతీయ తత్త్వశాస్త్రంలో ‘కర్మయోగం’ అనేది మూడు గుణాల సమన్వయాన్ని మాత్రమే చర్చిస్తుంది. అలా కాకుండ త్రిగుణాలను విడివిడిగా చర్చించడానికి మనకు మరలా సత్వగుణానికి ‘జ్ఞానయోగం’, రజోగుణానికి ‘రాజయోగం’, తమోగుణానికి ‘భక్తియోగం’ ఉనాయి. నేను ‘గీతావ్యాసాల’ పేరుతో రాసినది కేవలం కర్మయోగం గురించి మాత్రమే. ఒక దేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలో మార్గదర్శనం చేయడానికి మనకు కావలసినది కర్మయోగం మాత్రమే. అందుకే ఆ వ్యాసావళిలో ఆ ఒక్కదానినే వివరించడం జరిగినది.)

    రాజస, తామస కర్మల ప్రాముఖ్యతను వివరిస్తూ నేను నా ‘సుధర్మ’ బ్లాగులో ఓ వ్యాసం రాశాను. ఆ తదుపరి వ్యాసాలలో అనేక రజోగుణ కర్మలను (వీటిలో కొన్ని పరిమితి మించినవే అనుకోండి) ప్రస్తుతం వివరిస్తున్నాను. వీలైతే వాటిని ఓ సారి చదవండి.

    రిప్లయితొలగించండి
  7. క్షమించాలి! పై కామెంట్‌లో 'సుధర్మ ' బ్లాగులోని వ్యాసానికి లింక్ పేర్కొనడం మరచాను. ఆ లింక్

    http://sudharmasabha.blogspot.com/2009/01/blog-post_10.html

    రిప్లయితొలగించండి
  8. ఇక మీరు వేసిన మూడవ ప్రశ్న

    "3.జీవేఛ్ఛ గురించి కూడా ఎక్కాడన్నా రాశారా!?దయచేసి లింకు ఇవ్వగలరూ. చివరగా, నేనూ ఆఫిస్ అవర్స్లో మీ వ్యాసావళీ చదివాను. ఇది ఏ గుణం!!? :))”

    ‘జీవేచ్ఛ’ అనేది జ్ఞానయోగానికి సంబంధించిన విషయం. నేను ‘జ్ఞానయోగం’ గురించి ఎక్కడా రాయలేదు. త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి జీవేచ్ఛకు సంబంధించిన కర్మత్రయాన్ని మీకు పరిచయం చేసి వదిలేస్తాను. వివరాలు జ్ఞానయోగంలో పరిశీలిద్దాం.

    జీవేచ్ఛ-స్వభావం-సంకల్పం

    ‘జీవేచ్ఛ’ అనేది తామస కర్మ, ‘స్వభావం’ అన్నది రాజస కర్మ, ‘సంకల్పం’ అన్నది సాత్విక కర్మ.

    మీరు ఆఫీసు అవర్స్‌లో బ్లాగు చదవడం అనే విషయాన్ని ‘ఏ గుణం’ అనే ప్రాతిపదికతోకాక ‘ఎటువంటి గుణం’ అనే ప్రాతిపదికతో పరిశీలించవచ్చు. పై కర్మత్రయంలోని ‘స్వభావం’ అనే రజోగుణకర్మ పరిధిలోకి ఇది వస్తుంది. ‘ఇలా చదవటం ఎటువంటి స్వభావం’ అన్న ప్రాతిపదికతో ఈ విషయాన్ని పరిశీలించగలం. మీరు మీ ఆఫీసు పని మానేసి చదివారా ..పనేమీ లేకపోతే చదివారా ..పని ఉన్నా ఆటంకం లేకుండా సర్దుబాటు చేసుకొని చదివారా ..ఎప్పుడూ ఇలానే చదువుతారా అన్నదాన్ని బట్టి ఆ స్వభావాన్ని నిర్ణయించగలం. మీ ఆఫీసు పనికి ఆటంకం కలగనంతవరకూ, ఈ విషయం మీద తోటిఉద్యోగులో లేక పైఉద్యోగులో మిమ్మల్ని నిందించే అవకాశం లేనంతవరకూ మీరు అలా చదవడంలో దోషంలేదు.

    ఇక మీ రెండవ ప్రశ్నలో ఓ విషయం వదిలేశాము. అది ‘సర్వారంభ పరిత్యాగీ’ అన్న విషయం. సర్వారంభ పరిత్యాగీ అంటే ఏ పనీ చేయకుండా, కదలకుండా కూచోడం అని అర్థం రాదు. మనిషిలో ఉండే inner guidence ప్రేరేపణతోనే తప్ప ‘మనసులోచెలరేగే ఇష్టాయిష్టాలతో (కామంతో) పనిని ప్రారంభించనివాడు ’ అని అర్థం. లేదంటే ‘జీవేచ్ఛను నెరవేర్చుకోవడానికే తప్ప ‘కామం’ వలన జనించిన కోరికలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో కర్మలు ప్రారంభించనివాడు’ అని కూడా చెప్పవచ్చు. (జీవేచ్ఛ పరిధిలోకి వచ్చే కోరికలను నిస్సందేహంగా, నిస్సంకోచంగా నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏ మనిషికైనా జీవేచ్ఛ దోషరహితం.)

    ఇక మీరడిగినది కుటుంబంలో, ధనార్జనలో, ఉద్యోగ నిర్వహణలో ‘సర్వారంభపరిత్యాగీ’ అన్నదానిని ఎలా ఆచరించాలి అని. మీరే అన్నారు మేనేజ్‌మెంట్ పాఠాలలో ‘ప్రొయాక్టివ్‌నెస్’ గురించి బోధిస్తారు అని. మేనేజ్‌మెంట్ పాఠాలన్నీ రజోగుణపరిధిలోకి వస్తాయి. అది సత్యంలో అంతర్భాగమైన రజోగుణమే. ఆ బోధలలో దోషమేమీ ఉండదు.

    పై సందర్భాలలో సర్వారంభ పరిత్యాగీకి proactiveness ను సమానార్ధకంగా తీసుకోవచ్చు. అంటే మన స్పందన, మనం చేసేపని వివేకానుసారం (అంటే మనం ఎలా ప్రవర్తిస్తే, ఎలా స్పందిస్తే మనకు మంచిఫలితం వస్తుందో జాగ్రత్తగా బేరీజు వేసుకొని, తదనుగుణంగా అవసరానికి తగినట్లుగా పనిచేయడం) ఉండాలిగానీ పరిస్థితులకు ప్రతిస్పందన (reactive) గా ఉండకూడదు. ‘అటువంటి ప్రతిస్పందనలను మనం ప్రారంభించకూడదు ’ అనే అర్ధంగా తీసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  9. చివరిగా మీ మొదటి ప్రశ్న సంగతి చూద్దాం

    "1.(భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---21(గీతా వ్యాసాలు) ) :
    మనకు ఆచరించటానికి కావలసినది సత్యమే. సర్వజనులకూ కావలసినది కూడా సత్యమే. కనుక ఆ సత్యాన్ని గురించే చర్చిద్దాం. సత్యాన్ని విశదీకరిస్తూ ఈ రెండవ అధ్యాయం యొక్క ప్రారంభంలో చెప్పిన మూడు సూత్రాలలో రెండవది ‘సత్య స్వరూపం’ గురించి చర్చిస్తుంది. దాని ప్రకారం ‘త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం’. (భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---26(గీతా వ్యాసాలు) ) :
    అలాగే తాత్కాలికమైన మేఘాలు తొలగగానే శాశ్వతమైన నిర్మలాకాశం దృగ్గోచరమైనట్లు మనోమాలిన్యం తొలగగానే నిరంతర వాహిని అయిన భగవదనుభూతి దానంతటదే అనుభవంలోకి వస్తుంది (భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---27 (గీతా వ్యాసాలు) :)
    అన్ని కర్మలలోని దోషాలను యజ్ఞం పరిహరిస్తుంది. సర్వ కర్మలకు భోక్త ఆ భగవంతుడే. ఈ మధ్యలో "సత్యం" - "త్రిగుణాల అంశీభూత సమ్మేళనమే సత్యం" అన్నారు. మరి ఈ భగవంతుడెవరూ!? సడెన్‌గా మధ్యలో వచ్చేశాడు. ఎక్కడో కనెక్షన్ మిస్సాయ్యాను. వివరించగలరా!? ప్లీజ్."


    గీతను చదివి నేను పొందిన అవగాహనను నేను ముందుగా నా శక్తి మేరకు,నాకు తోచిన భాషలో,ఒకానొక క్రమంలో వ్యక్తీకరించాను. మీరు point out చేసిన సందర్భంలో భగవంతుడి ప్రస్తావన తేవడంతో వివరణ పొసగలేదన్న విషయాన్ని నేనూ గమనించాను. మీరు కూడా గుర్తించి తెలియజేసినందుకు ధన్యవాదాలు! 'ఏది సత్యమో తెలుసుకోవడానికీ, గుణకర్మలు కాకుండా సత్యాన్ని మాత్రమే ఆచరించేటట్లుగా మనకు మార్గదర్శనం చేయడానికీ, మనలో ఒక inner guidence ఉంటుంది ' అనే విషయాన్ని చెప్పడానికి నేను భగవంతుడి ప్రస్తావన తెచ్చాను.

    భావాన్ని సరిగా వ్యక్తీకరించడం కొరకు సరైన భాష కోసం, సరైన పదజాలం కోసం ఆలోచిస్తూ కొంతా, వేరే వ్యాపకాలలో పడిపోయి కొంతా ఇన్నాళ్ళూ ఎడిటింగ్‌ను వాయిదా వేశాను. వాక్యాలను తగిన విధంగా మార్చి త్వరలోనే ఎడిట్ చేస్తాను. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి