27, డిసెంబర్ 2008, శనివారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--III

IV. సత్యావిష్కరణ

మనం II భాగంలో ‘జగత్‌స్వరూపం’ గురించీ, ‘సత్యస్వరూపం’ గురించీ తెలుసుకున్నాం. ఇప్పుడు జగత్తు ద్వారా సత్యాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలుసుకుందాం.

మనిషికి సిద్ధసత్యం (ready made TRUTH) ఎక్కడా లభించదు. మనకు అందుబాటులో ఉండేది కర్మలు మౌలిక రూపంలో ఉండే జగత్తు మాత్రమే. ఈ జగత్తు ద్వారానే మనం సత్యనిర్మాణం చేయాలి. (జగత్తు సత్యం కాకపోవచ్చు అసత్యమే కావచ్చు. అంతమాత్రాన ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా మిథ్య మాత్రం కాదు. జగత్తు సత్యానికి ముడి పదార్థం)

మానవునకు జగత్తులోని కర్మలను అవి ఏ రూపంలో ఉన్ననూ ఆచరింపక తప్పదు. ఐతే ఆ కర్మాచరణలో సత్యనిర్మాణం చేయాలా లేక తిరిగి జగత్తునే (అసత్యాన్నే) పొందాలా అనేది మన మానసిక స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది.

ఈ కర్మలను ఒకానొక మానసిక స్థితి ద్వారా ఆచరించడానికి ఉపక్రమిస్తే ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది. అదే ‘నిష్కామ మానసికస్థితి’. అలా కాకుండా కామపూరితమైన మనస్సుతో కనుక కర్మలాచరిస్తే మనకు తిరిగి ఈ సంఘర్షణాత్మకమైన జగత్తే లభిస్తుంది కానీ సత్యం లభించదు.

ఇప్పుడు ‘కామం’ అంటే ఏమిటో, ‘నిష్కామం’ అంటే ఏమిటో చూద్దాం.


V. కామం

మనం ఇంతకు ముందు ‘కర్మ స్వరూపం’ లో చెప్పుకున్నాం ‘ఒక కర్మత్రయంలోని ప్రతికర్మకు మనిషి మనసును ఆకట్టుకునే ఆకర్షణ శక్తి ఉంటుంది’ అని. అలా ఒక కర్మ యొక్క ఆకర్షణకు లోబడి పోయే మనిషి బలహీనతను ‘కామం’ అంటారు.

ఈ కామం ద్వారా కర్మలాచరించే మానవుడు ఒక కర్మత్రయంలోని ఏదో ఒక కర్మ యొక్క ఆకర్షణకు లోబడి (ఏ కర్మ అనేది అతని స్వభావాన్ని బట్టి ఉంటుంది) దానినే ఇష్టపడుతూ దానినే ఎక్కువగా ఆచరిస్తూ దానికి విరుద్ధంగా ఉన్న మిగిలిన రెండు కర్మలను ద్వేషిస్తూ వాటిని ఆచరించకుండా సాధ్యమైనంత దూరంగా ఉంటాడు. మనిషి ఇటువంటి కర్మ విధానాన్ని కనుక ఆచరిస్తే ఒక కర్మ యొక్క ఆధిక్యత పెరిగిపోయి ‘సత్యం’ ఆవిష్కరింపబడదు. (మూడు కర్మలకూ సమాన ప్రాతినిథ్యం ఉన్నపుడే దానిని సత్యం అంటారు) దీనినే రాగద్వేషాలతో కూడుకున్న కర్మ విధానం అంటారు.

ఇక్కడ ‘రాగం’ అంటే కర్మత్రయంలోని ఏదో ఒక కర్మను ఇష్టపడటం, ‘ద్వేషం’ అంటే దానికి విరుద్ధంగా ఉన్న మిగిలిన రెండు కర్మలను ద్వేషించడం.


VI. నిష్కామం

నిష్కామం అంటే కామం లేకుండా అని అర్థం. నిష్కామంగా కర్మకు ఉపక్రమిస్తే కర్మత్రయంలోని ఏ ఒక్క కర్మ యొక్క ఆకర్షణ కూడా పనిచేయదు. ఎప్పుడు మనిషిలో కామం, రాగం ఇత్యాదివి ఉంటాయో అప్పుడే మనిషి ఏదో ఒక కర్మ వైపు అధిక మొగ్గు చూపడం జరుగుతుంది. అలాంటి కామమేదీ లేనపుడు మనిషి సందర్భౌచిత్యాన్ననుసరించి కర్మత్రయంలోని మూడు కర్మలనూ సమానంగా ఆచరిస్తాడు. అప్పుడు అతని జీవితంలో మూడు కర్మలకూ సమాన ప్రాతినిథ్యం లభించి ‘సత్యం’ ఆవిష్కరింపబడుతుంది.


VII. అనువర్తనం (application)

పైన వివరించిన విధానాన్ని అనుసరించి మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఏ విషయంలోనైనా మనం సత్యాన్ని ఆవిష్కరించవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనవచ్చు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థకు సంబంధించి చిరకాలంగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యను ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం.

“భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” అనే శీర్షికతో రాసిన వ్యాసావళిలోని మొదటి అధ్యాయంలో మనం ప్రపంచ రాజకీయ, సామాజిక చారిత్రక క్రమాన్ని సంగ్రహంగా పరిశీలించాం. అందులో రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయంగా ‘రాజ్యం-సమాజం-వ్యక్తి’ పేర్కొనబడింది. అంటే వ్యవస్థలో రాజ్యం, సమాజం, వ్యక్తి అనే మూడు అంగాలుంటాయి. వాటినే ఇక్కడ త్రయంగా పేర్కొనడం జరిగింది.

(‘సమాజం’ అంటే సామాజికమైన ఉత్పత్తివనరులను అభివృద్ధిచేసి వాటిని స్వంత ఆస్థి రూపంలో తన అధీనంలో ఉంచుకున్న బూర్జువా వర్గం. ‘వ్యక్తి’ అంటే సాధారణమైన జనబాహుళ్యం)

వ్యవస్థలోని ‘రాజ్యం’ అనే అంగం యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన ఇస్లాం సమాజాన్ని, వ్యక్తిని అణచి వేసింది. ఈ విధంగా ‘రాజ్యం’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘ఇస్లాం’ సత్యాన్ని నిర్మించలేకపోయింది.

‘సమాజం’ యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చిన కాపిటలిజం రాజ్యం మరియు వ్యక్తి అనే అంగాలను అణచివేసింది. ఈ విధంగా ‘సమాజం’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘కాపిటలిజం’ కూడా సత్యాన్ని నిర్మించలేకపోయింది.

అలానే ‘వ్యక్తి’ ప్రయోజనాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత నిచ్చిన కమ్యూనిజం మిగిలినవైన రాజ్యం మరియు సమాజం అనే అంగాలను అణచి వేసింది. ఈ విధంగా ‘వ్యక్తి’ అనే కర్మ యెడల రాగం మిగిలిన రెండు కర్మల యెడల ద్వేషం చూపిన ‘సామ్యవాదం’ కూడా సత్యాన్ని నిర్మించలేక పోయింది.

‘వాదం’, ‘ప్రతివాదం’ మరియు ‘విశ్లేషణల’ ఆంశిక సమన్వయమే సత్యమని మనం ‘సత్యస్వరూపం’ లో తెలుసుకున్నాం. TRUTH is the Synthesis of Thesis, Anti-Thesis and Analysis.

దీనిని బట్టి మనం వ్యవస్థలోని ఏ ఒక్క అంగపు ప్రయోజనాలో కాకుండా మూడు అంగాల యొక్క అంటే రాజ్యం-సమాజం-వ్యక్తి ల యొక్క ప్రయోజనాలనూ సమానంగా నెరవేర్చగలిగేటట్లుగా మన రాజకీయ, సామాజిక వ్యవస్థను నిర్మించుకోగలిగితే కర్మత్రయంలోని మూడు కర్మలూ సమనంగా ఆచరింపబడినటై ఆ వ్యవస్థ సత్యానికి ప్రాతినిథ్యం వహిస్తుంది.

ఇదే విధంగా ఒక్క రాజకీయ వ్యవస్థకు సంబంధించిన సమస్యే కాక ఏ సమస్యైనా పరిష్కారమౌతుంది. …(అయిపోయింది)

20, డిసెంబర్ 2008, శనివారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--II

II. జగత్ స్వరూపం

1. ఇంతకు ముందే ‘కర్మ స్వరూపం’ లో మనం చెప్పుకున్నాం కర్మలన్నీ త్రయాలుగా ఉంటాయని. ఏ విషయానికి సంబంధించైనా ఒక 'త్రయం' ఉంటుంది. అలాంటి అనంతమైన త్రయాల సమూహమే ‘జగత్తు’.

2. జగత్తులో కర్మలు వాటి ‘మౌలిక’ (fundamental or primary) రూపంలో ఉంటాయి. అంటే ఒక త్రయంలోని కర్మలు మూడునూ విడివిడి ప్రమాణాలు (1+1+1=3) గా ఉంటాయి గానీ అన్నీకలసి ఒకే ప్రమాణం (1/3+1/3+1/3=1) గా ఉండవు.

3. మౌలిక రూపంలో ఉన్న ప్రతి కర్మ కూడా 1/3 వంతు దోషరహితంగానూ, 2/3 వంతు దోషభూయిష్టంగానూ ఉంటుంది.

4. మౌలిక రూపంలో ఉండే ఏ త్రయంలోని మూడు కర్మలైనా అవి పరస్పర విరుద్ధమైనవి కనుక దానికి తగినట్లుగానే పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి. ప్రతి కర్మా మిగతా రెండు కర్మలను డామినేట్ చేయడానికి మరియు ఆ రెంటినీ అణచి తానొక్కటే పెంపొందటానికి ప్రయత్నిస్తుంది. ఫలితం...అంతులేని సంఘర్షణ.

ఉదాహరణకు సంప్రదాయవాదం -అభ్యుదయవాదం- సంస్కరణ వాదం అనే కర్మత్రయాన్ని పరిశీలిద్దాం. సమాజంలో ఈ మూడు వాదాలకూ దేని అనుచరవర్గం దానికి ఉంటుంది. ఈ ముగ్గురూ సంఘంలో విడి విడి సమూహాలుగా ఉండి నిరంతరం అభిప్రాయభేదాలతో పోట్లాడుకుంటుంటారు.

సంప్రదాయవాదులు ఏ విషయంలోనైనా గతకాలంలో ఉన్నదానినే కొనసాగించాలని కోరుకుంటారు. అభ్యుదయవాదులు గతకాలంలో ఉన్నదానిని అభివృద్ధిపరచి, మరింత మెరుగుపరచి ఆచరించాలని కోరుకుంటారు. సంస్కరణవాదులు గతకాలంలో ఉన్నదానిని అది ఎటువంటిదైనప్పటికీ దానిని పూర్తిగా తొలగించి సరికొత్త ఆచరణలను నెలకొల్పాలని కోరుకుంటారు.

ఎవ్వరూ ఎదుటివారి వాదన లోని ఔచిత్యాన్ని గమనించరు. తమవాదనలోని లోటుపాట్లను గ్రహించరు. తాము చెప్పేదే సరియైనదని గుడ్డిగా వాదిస్తుంటారు. తమ ఆలోచనా విధానంమాత్రమే సమాజంలో చలామణీ అవ్వాలని కోరుకుంటారు. మిగతా వారి ఆలోచనా విధానాన్ని సమూలంగా నాశనం చేసి ప్రజలెవ్వరూ దానిని ఆచరించకుండా చేయాలని వీరు ప్రయత్నిస్తారు. అంటే ప్రతిఒక్కరూ ‘1’ గా ఉండటానికే గానీ ‘1/3’ గా ఉండాటానికి ఎవరూ ఇష్టపడరు.


ఈ విధంగా జగత్తులో ఏ కర్మత్రయంలోని మూడు కర్మలైనా వాటి మౌలిక రూపంలో విడివిడి ప్రమాణాలుగా ఉండి నిరంతరం సంఘర్షించుకుంటూ ఉంటాయి.

అంటే జగత్తులోని ఏ కర్మత్రయంలోనైనా ‘వాదం’, ‘ప్రతివాదం’ మరియు ‘విశ్లేషణల’ మధ్యన నిరంతర సంఘర్షణ తప్పదు.

III. సత్య స్వరూపం

1.'వాదం', 'ప్రతివాదం' మరియు 'విశ్లేషణ ' ల సమన్వయమే 'సత్యం'. ఒకానొక కర్మత్రయంలోని మూడు కర్మలే ఆ విషయానికి సంబంధించిన సత్యనిర్మాణంలో కూడా పాలు పంచుకుంటాయి.

2. అయితే ఈ మూడు కర్మలూ 'సత్యం'లో మౌలిక (1) రూపంలో ఉండవు. ‘ఆంశిక’ (componental) (1/3) రూపంలో ఉంటాయి. ఈ కారణంగా అవి విడివిడి ప్రమాణాలుగా కాక మూడూ కలసి 'ఒకే ప్రమాణం'(single unit)గా మారతాయి. అంటే 1/3+1/3+1/3=1 గా ఉంటాయి.

3. మౌలికరూపంలో ఉన్న మూడు కర్మలలోని దోషరహితమైన మూడు భాగాలూ కలవడంవలన (1/3+1/3+1/3) రూపుదిద్దుకున్న సత్యం కూడా దోషరహితంగా ఉంటుంది.

4. ఆంశిక (1/3) రూపంలోని కర్మల మధ్యన (అవి పరస్పరవిరుద్ధమైనవి అయినప్పటికీ) సంఘర్షణ కాకుండా సమన్వయం ఉంటుంది. అందుకే అవి అన్నీ కలసి పోయి 'ఒకే ప్రమాణం'గా ఏర్పడతాయి.

అంటే జగత్తులో మౌలిక రూపంలో త్రయం గా ఉండి పరస్పరం సంఘర్షించుకునే కర్మలే సత్యంలో ఆంశికరూపంలోకి మారి ఒకదానితో ఒకటి కలసి పోయి పరస్పర సమన్వయంతో ఒకే ప్రమాణం గా ఏర్పడతాయి.

పైన జగత్‌స్వరూపాన్ని వివరించేటపుడు పేర్కొన్న సంప్రదాయవాదం-అభ్యుదయవాదం-సంస్కరణవాదం ఉదాహరణలో ఒక వ్యక్తి గానీ, ఒక ప్రజాసమూహం గానీ ఏ ఒక్క వాదానికో కట్టుబడి మిగతా రెంటినీ ద్వేషించక సందర్భౌచిత్యాన్ని బట్టి సంప్రదాయవాదాన్ని, అభ్యుదయవాదాన్ని, సంస్కరణ వాదాన్నీ మూడింటినీ ఆచరిస్తుంటే అది సత్యాచరణగా చెప్పవచ్చు.

వాతావరణానికి సంబంధించిన ఎండ-వర్షం-చలి లాగానే మానవ సంకల్పానికి అతీతమైన మరో కర్మత్రయాన్ని కూడా ఈ సందర్భంలో మనం పరిశీలిద్దాం. అది మానవ శరీరలక్షణాలకు సంబంధించిన నీగ్రోయిడ్ –యూరోపియన్ (కాకసాయిడ్)- మంగోలాయిడ్ అనే కర్మత్రయం.

మానవశరీరంలో ‘వాదం’ డామినేట్ అయితే అది నీగ్రోయిడ్ శరీరం. ‘ప్రతివాదం’ డామినేట్ అయితే అది యూరోపియన్ శరీరం. ‘విశ్లేషణ’ డామినేట్ అయితే అది మంగోలాయిడ్ శరీరం. (ఇవి మూడునూ జగత్తుకు ప్రాతినిథ్యం వహించే మౌలిక స్థాయి శరీరాలు) ఏ ఒక్కటీ డామినేట్ కాకుండా మూడురకాల లక్షణాలకూ సమాన ప్రాతినిథ్యం లభిస్తే అది సత్యానికి ప్రాతినిథ్యం వహించే శరీరం.. అదే భారతీయ శరీరం.

ఈ టపాలో వివరించిన విషయాన్ని సంగ్రహంగా చెప్పాలంటే ‘వాదం’, ‘ప్రతివాదం’, ‘విశ్లేషణ’ అనే వైరుధ్యాలు మౌలిక స్థాయిలో సంఘర్షించుకుంటాయి… అదే ‘జగత్తు'. ఆంశిక స్థాయిలో సమన్వయం చెందుతాయి… అదే ‘సత్యం’. ...(మిగతా విషయం మూడవ భాగంలో)

12, డిసెంబర్ 2008, శుక్రవారం

తేలిక భాషలో తత్త్వశాస్త్రం--I

‘మనసులో మాట’ సుజాత గారు కొన్నాళ్ళ క్రితం చేసిన కామెంట్‌లో నేను రాసిన తాత్త్విక విషయాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని అన్నారు. తాత్త్విక విషయాలు అలానే ఉంటాయని అప్పుడు నేను సమాధానం చెప్పాను. ఇటీవలి కాలంలో ఆ వ్యాసాలను శ్రద్ధతో చదువుతున్న సీతారాం రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే విధంగా అన్నారు. మొదట ఈయనకు కూడా అదే సమాధానం చెప్పాను. ప్రతీ అంశాన్ని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా చదవడమే మార్గమని చెప్పాను. కానీ ఆయన ఆ విషయాన్ని అంటే నా రచనలోని సంక్లిష్టతను బాగా ఇన్సిస్ట్ చేశారు. దానితో నేను పునరాలోచనలో పడక తప్పలేదు. అందుకే ఆ తాత్త్విక విషయాలన్నింటినీ సాధ్యమైనంత సులువైన భాషలో శ్లోకాల ఉటంకింపు లేకుండా, సంస్కృత పరిభాష లేకుండా కొంచెం బ్రీఫ్‌గా మరలా రాస్తున్నాను.

అయితే ఈ సారి ఉదాహరణలను ఎక్కువగా వివరించను. ఎందుకంటే ఉదాహరణలను ఆల్రెడీ అసలు రచనలో వివరణాత్మకంగా పేర్కొని ఉన్నాను కదా! ఇవి కేవలం ఆ రచనలోని సంక్లిష్టతను విడగొట్టటానికి మాత్రమే ఉద్దేశించిన టపాలు.


I. కర్మ స్వరూపం


1.కర్మలు ఎల్లప్పుడూ ‘త్రయం’ (Triad) గానే ఉంటాయి. అంటే మూడేసి కర్మలు కలసి ఒక త్రయంగా ఏర్పడతాయి. ఈ విధమైన త్రయం ఏదో ఒక పరిస్థితిని లేక ఏదో ఒక విషయాన్ని సూచిస్తుంది. ఇటువంటి త్రయాలు అనేకం (అనంతం) ఉంటాయి.

ఉదాహరణకు ఈ క్రింద కొన్ని కర్మత్రయాలను పరిశీలించండి.


వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం:

ఎండ-వర్షం-చలి


మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం:

అదుపు-స్వేచ్ఛ-ఉపేక్ష


మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం

నిజం-అబద్దం-రహస్యం


రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం

రాజ్యం-సమాజం-వ్యక్తి


ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

విశ్వాసం-శాస్త్రీయత-హేతుబద్ధత

ఈ విధంగా ఏ విషయానికి సంబంధించైనా కర్మత్రయం తప్పనిసరిగా ఉంటుంది.


2.ఒక కర్మత్రయంలోని కర్మలు మూడూ పరస్పరం విరుద్ధంగా (mutual opponents) ఉంటాయి. అంటే మూడింటిలో ప్రతి ఒకటి మిగతా రెంటికీ విరుద్ధంగా ఉంటుంది. పై ఉదాహరణలనొకసారి పరిశీలించండి.

‘ఎండ’ కు ‘వర్షం’ విరుద్ధం. ఈ రెంటికీ ‘చలి’ విరుద్ధం.

అలానే ‘నిజాని’కి ‘అబద్ధం’ వ్యతిరేకం. ఈ రెంటికీ ‘రహస్యం’ వ్యతిరేకం.

అలానే ఏ కర్మత్రయంలోని మూడు కర్మలైనా అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.


3.ఈ విధంగా పరస్పరం విరుద్ధంగా ఉండే మూడు కర్మలలో ఒకదానిని ‘వాదం’ (Thesis) అంటారు. రెండవదానిని ‘ప్రతివాదం’ (AnTi Thesis) అంటారు. మూడవ దానిని ‘విశ్లేషణ’ (Analysis) అంటారు.

పైన వాతావరణానికి సంబంధించి తెలిపిన మొదటి ఉదాహరణలో ఎండ ‘వాదం’, వర్షం ‘ప్రతివాదం’, చలి ‘విశ్లేషణ’.

అలానే మరో ఉదాహరణలో అదుపు ‘వాదం’, స్వేచ్ఛ ‘ప్రతివాదం’, ఉపేక్ష ‘విశ్లేషణ’.


4.ఏ కర్మత్రయమైనా తీసుకోండి ఆ త్రయంలోని ప్రతికర్మా తనదైన ఆకర్షణ కలిగి ఉంటుంది. ఈ ఆకర్షణతోనే ఆ కర్మ మానవుడి మనసును ఆకట్టుకోగలుగుతుంది.

అయితే ఒక కర్మత్రయంలోని ఒకానొక కర్మ ఆకర్షణలో పడిన మానవుడు ఆ కర్మత్రయంలోని మిగతా రెండు కర్మల యొక్క ఆకర్షణలకు మాత్రం లోబడడు. పైగా వాటిని ద్వేషించనారంభిస్తాడు. ఎందుకంటే అవి తను ఇష్టపడుతున్న కర్మకు విరుద్ధంగా ఉన్నాయి కనుక.

ఈ విధంగా కర్మలు తమ ఆకర్షణ శక్తితో మానవునిలో రాగద్వేషాలకు కారణమవుతున్నాయి…(కర్మ స్వరూపం అయిపోయింది)

9, డిసెంబర్ 2008, మంగళవారం

వ్యాఖ్యలకు జవాబులు…II

‘సత్యాన్ని ఏదో బ్రహ్మపదార్ధం చేయకూడదు. అది చట్రాల్లో ఒదగదు.. సూత్రీకరణలకు లొంగదు.’ అని అన్నారు.

సత్యం బ్రహ్మపదార్ధం కాదనేదే నా అభిప్రాయం కూడా. ‘అది చట్రాల్లో ఒదగదు, సూత్రీకరణలకు లొంగదు’ అని మీరే దానిని బ్రహ్మ పదార్ధం చేస్తున్నారు. ‘గతితార్కిక పద్దతి ద్వారా సత్యాన్ని చేరవచ్చు’ అని పాశ్చాత్యులు నిర్ధారిస్తే, ‘గుణాతీత స్థితి ద్వారా సత్యాన్ని ఆవిష్కరించవచ్చు’ అని భారతీయులు పేర్కొన్నారు. సత్యం చట్రాల్లో ఒదగదు, సూత్రీకరణలకు లొంగదు అని మీరు ఏ ప్రాతిపదికతో పేర్కొనగలిగారో తెలియడంలేదు. అసలు తత్త్వశాస్త్రం యొక్క ఉద్దేశ్యమే సత్యాన్ని సూత్రీకరించడం, దాన్నెలా చేరాలో చెప్పడం.


ఏమిటిదంతా?’ అని అన్నారు

ఇదంతా ‘తాత్త్విక చర్చ’.. చాలా అవసరమైనది. ఈ విషయాన్ని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.


‘మీమాంసలో కొట్టుకుపోతే జీవితాన్ని దర్శించలేము’ అని అన్నారు.

‘మీమాంస’ అంటే సందేహాస్పద స్థితి..డోలాయమానం..డైలమా. నేను ఏదైతే చెప్పానో అదంతా రూఢిగానే చెప్పాను. ఎక్కడా సందేహాలను గానీ, ఊగిసలాట ధోరణిని గానీ వెలిబుచ్చలేదు. మరి ఇదంతా మీకు మీమాంసగా ఎలా అనిపించింది?


‘రచనలో సరళతలేదు.. హెచ్చు స్థాయిలో ఉన్నది.’ అన్నారు.

ఈ మాట మాత్రం నిజం. అయితే ఇందులో నా పాండిత్య ప్రదర్శన ఏమీలేదు. తత్త్వశాస్త్రంలో సంక్లిష్టత, పైస్థాయి అనేవి అనివార్యం. తత్త్వశాస్త్రం అనేదే తలపగిలే సబ్జెక్ట్. జనబాహుళ్యాన్ని ఆకట్టుకోలేనిది. చాలాకొద్దిమందికి మాత్రమే ఆసక్తి ఉండే విషయం. అప్పటికీ నేను సబ్జెక్టును సాధ్యమైనంతవరకూ సరళం చేయడానికే ప్రయత్నించాను.

(తత్త్వశాస్త్రంలో నాకున్న కొద్దిపాటి ప్రవేశం, కొద్దిపాటి అభిరుచి మేరకు నేను రాసిన ఈ వ్యాసాలే మీకు సరళంగాలేవని అనిపించాయంటే ఇక ప్రసిద్ధ తత్త్వవేత్తల రచనలు ఎలా ఉంటాయో ఆలోచించండి!)

ఈ రచనలో నా ప్రధాన ఉద్దేశం జనబాహుళ్యానికి అర్ధంకావాలనేదానికన్నా..

..ముందుగా ఇప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు పునాదిగా ఉన్న తాత్త్విక భావాలకు మారుగా భారతీయ తాత్త్విక భావాలను పరిచయం చేయడం, వాటిని మన సమస్యల పరిష్కారానికి అనుగుణమైన రూపంలో, ఒక క్రమపద్ధతిలో, సాధ్యమైనంత సంగ్రహంగా క్రోడీకరించడం..

..అలా క్రోడీకరించిన తాత్త్విక భావనలే పునాదిగా నూతన రాజకీయ, సామాజిక వ్యవస్థను ప్రతిపాదించే ఒక నూతన సిద్ధాంతాన్ని రూపొందించడం. అందుకనుగుణమైన నూతన భావజాలాన్ని నిర్మించడం.

ముందుగా భారతీయ తత్త్వశాస్త్రంలోని కొన్ని మౌలికభావనలను ప్రాధమిక స్థాయిలో సంగ్రహంగా ఒక నూతన దృక్కోణంలో (new interpretation) పరిచయంచేసే ఈ తాత్త్విక రచన విజయవంతంగా పూర్తయితే దానిని ఆధారంగా చేసుకుని ప్రజలందరికీ అర్ధమయ్యేటట్లుగా, వారిని ఆకట్టుకునేటట్లుగా విపులమైన , వివరణాత్మకమైన, విస్తారమైన రచనలు చేయవచ్చు.


‘ఇదంతా స్పెక్యులేషన్ లాగా అనిపిస్తున్నది’

ఈ మాట మీద నేను స్పందించదలచుకోలేదు.


నేరుగా విషయాన్ని చెప్పండి.. వింటాను.

మొదటి అధ్యాయంతో మీకేమీ సమస్య లేదని అనుకుంటున్నాను. రెండవ అధ్యాయం లోని విషయం మాత్రం కొంచెం కన్‌ఫ్యూజన్ కు దారితీసే అవకాశం ఉంది. చెప్పుకున్నాం కదా!..సబ్జెక్ట్ అటువంటిది. పైగా కొత్త భావాలు.

(భారతీయ తాత్త్విక విషయాలకు కొన్ని వందల సంవత్సరాలుగా అనేకమంది పండితులు అనేక రకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే నేను ఈ రచనలో ఎంపిక చేసుకున్నది కొద్ది భావాలే అయినప్పటికీ ఆయా పండితుల భాష్యాలన్నింటికీ భిన్నంగా, సరికొత్తగా, నేటి మన అవసరాలకు అనుగుణంగా భాష్యం (interpretation) రాశాను.)

ఆ తాత్త్విక వ్యాసాల (గీతా వ్యాసాలు)లో ‘కర్మ స్వరూపం’ అనే శీర్షిక క్రింద రాసిన విషయాన్నంతా వీలైతే మరోసారి చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ విషయం అర్థమైతే వ్యాసావళిలోని మిగతా విషయాలన్నీ చాలా సులువుగా అర్థమౌతాయి. అప్పుడు నేను చెప్పినదంతా మీకు నేరుగానే అనిపిస్తుంది.


ఇక చివరిగా.. నేను రాసిన ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసం బావుందన్నారు. ధన్యవాదాలు! నేను రాస్తున్న వ్యాసావళినంతా ఓ చిన్న పేజీలోకి ఓ చిరు వ్యాసంగా సంగ్రహిస్తే అది ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసమౌతుంది. అంతే తప్ప ఈ రెంటికీ ఏమీ తేడా లేదు. ఆ వ్యాసం నచ్చితే ఈ వ్యాసావళంతా నచ్చినట్లే. నా ఆలోచనా సారాన్నంతటినీ ఒక్క ముక్కలో చెప్పమంటే నేను లిటరల్‌గా ఒక్కముక్కలో చెప్పలేనుగానీ ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసాన్ని మాత్రం సూచిస్తాను.

సీతారాం గారూ! మీరు ఈ రచన యెడల వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటికీ సమాధానాలు ఇవ్వగలిగాననుకుంటున్నాను.

ఈ రచనకు లక్షిత పాఠకులైన అతికొద్దిమందిలో ఒకరైన మీకు మరోసారి కృతజ్ఞతలు! ఈ రోజు భగవద్గీత ఆవిర్భవించిన రోజు. మీకూ మరియు మిగతా బ్లాగ్మితృలందరికీ 'గీతా జయంతి ' శుభాకాంక్షలు!

8, డిసెంబర్ 2008, సోమవారం

వ్యాఖ్యలకు జవాబులు…I

బ్లాగ్మితృలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతకాలంగా వేరేపనులలో పడిపోయి అప్పుడప్పుడూ కూడలిలో బ్లాగులు చూడటమేతప్ప వాటిలో కామెంట్లు గానీ, నా బ్లాగులో టపాలుగానీ రాయడంలేదు. అయితే చదువరిగారి ‘మన భద్రతే మనకు ముఖ్యం’ చదివిన తరువాత కామెంట్ చేయకుండా ఉండలేకపోయాను. ఈ విధంగా నేను తిరిగి బ్లాగ్లోకంలోకి వచ్చిన సమయంలోనే సీతారాం రెడ్డి గారు నా బ్లాగులో ముచ్చటగా మూడు బాణాలవలే మూడు విమర్శనాత్మకమైన వ్యాఖ్యలను సంధించడం జరిగినది.

బోర్‌కొట్టే నా సీరియస్ సబ్జెక్ట్‌కు వ్యాఖ్యలులేక కొన్నాళ్ళుగా నేను -తరచూ కొత్త వ్యాఖ్యలేమైనా వచ్చాయా లేదా అని చూసుకోవటం, ఒకవేళ వస్తే వాటిలో కొన్నింటికైనా సమాధానాలివ్వటం, వివాదాలు మొదలవ్వటం.. తిరిగి వ్యాఖ్యలకూ, ప్రతివ్యాఖ్యలకూ పాల్పడటం, డిస్ట్రబ్ అవటం- ఇలాంటి బాధలేవీలేకుండా హాయిగా ఉన్నాను. :). అయితే సీతారాంగారి పదునైన వ్యాఖ్యలతో ఇప్పుడు వాటికి ప్రతిస్పందించక తప్పడంలేదు. వాటికి సమాధానం చాలా పెద్దది గనుక కామెంట్‌గా కన్నా టపా రూపంలో అందిస్తే బావుంటుంది అనుకున్నాను. అందుకే ఈ టపా రాస్తున్నాను.. అది కూడా రెండు భాగాలుగా.


సీతారాం రెడ్డిగారూ,

ముందుగా మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు! అభినందనలకు ధన్యవాదాలు!

నేను ‘భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!’ అనే టైటిల్‌తో రాస్తున్న వ్యాసావళిలో ఇప్పటివరకూ 28 భాగాలను రాశాను. ఇది మొత్తం మూడు అధ్యాయాల చిరుగ్రంథం. ఇంకొక టపాతో (అంటే 29వ భాగంతో) రెండవ అధ్యాయం పూర్తవుతుంది. ఆ తరువాత 3వ అధ్యాయం రాయవలసి ఉన్నది. వాటిని కూడా వీలును బట్టి త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.

ఇక మీరు చేసిన విమర్శల సంగతి చూద్దాం.


‘మానవ జీవితాన్ని నేరుగా తాకి స్పందిస్తున్నట్లుగా లేదు’ అన్నారు.

ఈ వ్యాసావళిలోని ఇప్పటివరకూ రాసిన భాగాలను మొదటి నుండి అన్నింటినీ మరి మీరు చదివారో?!..లేదో!! నేను ఈ వ్యాసాలలోని మొదటి అధ్యాయమంతా అంటే 16వ భాగం వరకూ ప్రపంచ ప్రజల రాజకీయ, సామాజిక చారిత్రక క్రమాన్ని విశ్లేషించడానికే కేటాయించాను. (ఆ క్రమం వెనుక ఉన్న తాత్త్విక నేపథ్యాన్ని వివరించడానికి రెండవ అధ్యాయాన్ని కేటాయించాను. ఆ తాత్త్వికతననుసరించి చరిత్ర క్రమాన్ని ఏ విధంగా భవిష్యత్తులోకి పురోగమింపచేయాలో మూడవ అధ్యాయంలో చర్చిద్దామనుకుంటున్నాను) మరి అదంతా మానవ జీవితాన్ని తాకుతున్నట్లుగా మీకు అనిపించలేదా?!


‘తాజాదనం కానరావడంలేదు’ అని అన్నారు.

తాజాదనం అంటే సమకాలీన సంఘటనలను పేర్కొనలేదనా మీ ఉద్దేశ్యం. ఈ రచన చాలా విస్తారమైన విషయాన్ని బాగా కుదించి అతిసంగ్రహంగా చెబుతున్న స్థూలమైన రచన. కేవలం మౌలిక భావనలకే పరిమితమైన రచన. ఇటువంటి సంగ్రహ మరియు మౌలిక రచనలో సమకాలీన సంఘటనలనుపేర్కొనడంగానీ, వాటిని సవివరంగా రాయడంగానీ కుదిరే పనికాదు.


‘ఈ శ్లోకాలు వగైరాలు అంతా చాదస్తంలాగా కనపడుతున్నది.’ అని అన్నారు.

ఆ శ్లోకాలన్నీ భగవద్గీతలోనివని మీరు గమనించే ఉంటారు. చాదస్తపు ముసలమ్మలు, మూఢ భక్తులు మొదలైనవారి చేతిలో పారాయణ గ్రంథంగా కనబడే ఆ భగవద్గీతే ప్రపంచ ప్రసిద్ధ తత్త్వవేత్తల చేత (ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తతోసహా) మహా తాత్త్విక గ్రంథంగా, భారతీయ తత్త్వశాస్త్ర సారంగా కొనియాడబడింది. కాకలు తీరిన కమ్యూనిస్టులు, మహా మహా హేతువాదులు, కరుడు గట్టిన నాస్తికులు సైతం గీతను సర్వోన్నత తాత్త్విక గ్రంథంగా అంగీకరించారు. గీతను మరి మీరు ఏ దృష్టితో చూస్తారో మీరే నిర్ణయించుకోండి.


యజ్ఞం’, ‘కర్మ’ ఇవన్నీ అవసరమా?! అని అన్నారు.

బహుశా మీకు తత్త్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అంతగా తెలిసినట్లులేదు. అన్ని శాస్త్రాలకు, మనిషి సాధించిన సమస్త విజ్ఞానానికి, సమస్త మానవ ఆలోచనలకు, మానవుడు రూపొందించే అన్ని సిద్ధాంతాలకు పునాది తత్త్వశాస్త్రమే. ఇవి అన్నీ కూడా తమ మూలాలను తత్త్వశాస్త్రంలోనే కలిగి ఉంటాయి. అటువంటి తత్త్వశాస్త్రంలో ‘భారతీయ తత్త్వశాస్త్రం’ అత్యంత విశిష్టమైనది. దానిలో ‘యజ్ఞం’, ‘కర్మ’ అనేవి చాలా కీలకమైన భావనలు. అవి చర్చించబడకుండా భారతీయ తత్త్వశాస్త్రమే లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న రాజకీయ, సామాజిక వ్యవస్థలకు పాశ్చాత్య తత్త్వశాస్త్రం పునాదిగా ఉన్నది. లాక్, హ్యూం, రూసో లాంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రాతిపదికన ప్రజాస్వామ్య, కాపిటలిస్టు వ్యవస్థలు పెంపొందాయి. హెగెల్, మార్క్స్ వంటి తత్త్వవేత్తల సిద్ధాంతాల ప్రాతిపదికన కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యవస్థలు నిర్మింపబడ్డాయి. ఇప్పుడివన్నీ స్పష్టంగా విఫలంచెందాయి. ఈ వ్యవస్థలన్నీ మానవుడిని అనేక రకాల బాధలకు గురిచేశాయి. పైన పేర్కొన్న తత్త్వవేత్తలంతా చతికిలబడ్డారు. మరి అటువంటి దోషభూయిష్టమైన తాత్త్విక మూలాలను మార్చకుండా మనం మన రాజకీయ వ్యవస్థలో, మన సామాజిక పరిస్థితులలో ఏ విధంగా మార్పును కోరగలం.. ఏ విధంగా దానిని సాధించగలం.

నిజమైన మార్పు కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులకు తాత్త్విక మూలాలు ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టుకుని, వాటిని తొలగించి, అక్కడ సరియైన, సరికొత్త తాత్త్విక బీజాలను నాటాలి. అప్పుడు మాత్రమే వస్తుంది అసలైన మార్పు..కావలసిన మార్పు. అంతేకానీ ఆ తాత్త్విక సిద్ధాంతాలను అసలు గుర్తించనైనా గుర్తించకుండా, వాటిని అధ్యయనం చేయకుండా, వాటిలోని దోషాన్ని గ్రహించి దానిని మార్చకుండా అలానే వదిలేసి పైపై పరిస్థితులలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తే ఆ మార్పులు ఏ మాత్రం ప్రభావం చూపజాలవు.

ఎప్పుడు తత్త్వం మారుతుందో అప్పుడు సమస్తం మారుతుంది. మరి ఇప్పుడు భారతీయ తాత్త్విక చింతన తప్ప ఈ ప్రపంచానికి వెలుగు చూపగలిగే తత్త్వశాస్త్రం మరోటిలేదు…(మిగతా జవాబులు రెండవ భాగంలో)