30, మే 2021, ఆదివారం

NICE GUY & BADASS (Part-3)

 



Gentleman Politics - Power Politics


స్వతంత్ర భారతదేశంలోని రాజకీయాలనే తీసుకుంటే అవి మొదట్లో Nice Guy Politicsగా (Gentleman Politics) ఉండేవి. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు గౌరవించుకొనేవారు. పరస్పరం సద్విమర్శలు చేసుకునేవారు. ఇవతలి వారు ఆ విమర్శలను ఆహ్వానించి తమలో లోపాలుంటే సరిదిద్దుకునేవారు. కీలక సమయాలలో ప్రత్యర్థుల అభిప్రాయాలను కోరేవారు. వారితో సంప్రదించేవారు. ప్రత్యర్థులిచ్చే సలహాలు, సూచనలను శ్రద్దగా పరిశీలించేవారు, పాటించేవారు. వీటినే ప్రజాస్వామ్య విలువలుగా రాజకీయాలలో చెప్పుకుంటారు.


కాలక్రమంలో Nice Guy Politics కాస్తా Badass Politics గా (Power Politics) రూపాంతరం చెందాయి. 


రాజకీయ ప్రత్యర్థులమీద కువిమర్శలు చేయడం,  

కావాలని నిందలు వేయడం, 

వారికి దురుద్దేశాలు ఆపాదించడం, 

వ్యక్తిగత విమర్శలు చేయడం, 

వేయి అబద్దాలతో దుష్ప్రచారం చేయడం

ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేయడం

వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినేటట్లు చేయడం

దాడులు చేయడం, 

భయపెట్టడం, 

ఎక్కిరించడం, 

ఎగతాళి చేయడం, 

వెటకారంగా మాట్లాడటం,

విలువ ఇవ్వకుండా పురుగును తీసిపడేసినట్లు మాట్లాడటం, 

ప్రత్యర్థివర్గాన్ని బలహీనపరచడం

Mind Game ఆడటం, 

ప్రలోభాలకు గురిచేయడం, 

వారి Emotionsతో ఆడుకోవడం, 

గుండె గాయపడేటట్లు దూషించడం, 

ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, 

వారు mentalగా Unhinge అయ్యేటట్లు దుర్భాషలాడటం, 

వారిని అవమానించడం, 

వారిని ఇబ్బందిపెట్టడం, 

వారిని రకరకాల కష్టనష్టాలకు గురిచేయడం .... 


ఇవన్నీ Badass Politicsగా మనం చెప్పుకోవచ్చు.


తొలినాళ్ళలో ఆదర్శభావజాలం కలిగిన ఉన్నత విద్యావంతులు ప్రజాసేవా దృక్పథంతో, దేశభక్తితో రాజకీయాలలో ప్రవేశించి విలువలతో వ్యవహరించి రాణించేవారు. 


కాలక్రమంలో.... 

అధికారంలోకి రావడానికి అల్ప ప్రయోజనాలకు ఓటును అమ్ముకునే పాటకజనాన్ని manage చేయగలిగితే చాలు ; ఈ విలువలు ఎవడికి కావాలనే స్వార్థరాజకీయనాయకుల ప్రవేశంతో దేశరాజకీయాలు దిగజారాయి. క్రమంగా దేశభక్త నేతలను ఈ విలువలు లేని నేతలు replace చేసివేశారు. నేటి దుస్థితికి ఇదే కారణం.   


ఇప్పుడు....

పాటకజనం ఓట్లేస్తున్నారు

స్వార్థపరులు అధికారంలోకి వస్తున్నారు

దేశభక్తులు గుడ్లప్పగించి చూస్తున్నారు.


ఇదే నేటి దేశ రాజకీయ పరిస్థితి. 



Some More Examples


క్రికెట్ ఆటలో స్లెడ్జింగ్ Badass Tendencyనే. 

క్రీడాస్పూర్తి లేకుండా ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్ళను సూటిపోటి మాటలతో వేధించి, వారిని mentalగా Unhinge చేసి, తద్వారా ఆటమీద ఏకాగ్రత లేకుండా చేసి, ఓడిపోయేటట్లు చేయడమే ఈ స్లెడ్జింగ్ ఉద్దేశం. 


భారతీయ సినిమాలలోని కథానాయకుడు ఒకప్పుడు Nice Guy గా ఉండేవాడు. నేటి కాలంలో అతడు Badass గా రూపాంతరం చెందాడు.  


ఆదర్శవాదం ఎదుటి వ్యక్తి విలువ, గౌరవం ఇనుమడించే భాషను మాట్లాడమంటుంది.

అనాదర్శవాదం ఎదుటివ్యక్తి విలువను తుంచివేసే భాషను మాట్లాడమంటుంది. 


ఏం పీకుతావో పీక్కో, 

దొబ్బెయ్, 

నీకు అంత సీన్ లేదమ్మా, 

కళ్ళు దొబ్బినయ్యా, 

రా చూసుకుందాం, 

కొట్టానంటే ఎగిరి మీ ఊళ్ళో పడతావ్ 


...ఇలాంటి మాటలు.



మర్యాద - బలుపు

నీ భాష (వ్యవహరించేతీరుమర్యాద అయినపుడు ఎదుటి మనిషి భాష బలుపు అయితే  అతడు నీ భాషనైనా నేర్చుకోవాలి లేదా నీవు అతడి భాషనైనా నేర్చుకోవాలి,  .






29, మే 2021, శనివారం

NICE GUY & BADASS (Part-2)



Nice Guy vs Badass



వాస్తవవాది ఎదుటివ్యక్తిని బట్టి తన ప్రవర్తనను మార్చుకుంటాడు. కనుక వాస్తవవాదిని పక్కన పెట్టి మిగిలిన ఇరువురు సమాజంలో ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారో పరిశీలిద్దాం. 


ఇది నాలుగు రకాలుగా ఉంటుంది.  


A.ఆదర్శవాది - B.ఆదర్శవాది             (A. Nice Guy - B. Nice Guy)


A.ఆదర్శవాది - B.అనాదర్శవాది         (A. Nice Guy - B. Badass)


A.అనాదర్శవాది - B.ఆదర్శవాది         (A. Badass - B. Nice Guy)


A.అనాదర్శవాది - B.అనాదర్శవాది     (A. Badass - B. Badass)     


ఉదాహరణకు A ని B విష్ చేసాడనుకుందాం. పైన పేర్కొన్న నాలుగు సందర్భాలలోనూ Dynamics వేరువేరుగా ఉంటాయి. వాటిని మనం ఓ సారి పరిశీలిద్దాం. 


A. Nice Guy    -     B. Nice Guy

ఇక్కడ A & B ఇరువురూ Nice Guys అయిన పక్షంలో ఒక చక్కటి సుహృద్భావ సన్నివేశం ఆవిష్కరింపబడుతుంది. 

A:     తనను B గౌరవించినందుకుగాను సంతోషిస్తాడు, ప్రసన్నుడౌతాడు. 

B:     ఎదుటివారిని గౌరవించిన సంస్కారవంతుడవుతాడు. 


A. Nice Guy     -     B. Badass

కానీ ఇక్కడ A Nice Guy అయి ఉండి B Badass అయిన పక్షంలో పరిస్థితి మరోలా ఉంటుంది. 

A:   తనను B గౌరవించినందుకుగాను ఎప్పట్లానే సంతోషిస్తాడు. జిత్తులమారి వాడిని నమ్మిన అమాయకుడు అవుతాడు.

B:    విష్ చేయడం ద్వారా A తో rapport పెంచుకొని ముందు ముందు అతని ద్వారా తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్నదే B ఎత్తుగడ అయి ఉంటుంది. 


A. Badass     -     B. Nice Guy

A:     పాచికలు విసరడానికి Nice Guy అయిన B ని ఒక easy target గా నిర్థారించుకుంటాడు. 

B:     ఎప్పట్లానే తన సంస్కారం కొద్దీ ఎదుటివారిని గౌరవించాలనుకుంటాడు. అపాత్రుడిని గౌరవించిన వెర్రివాడవుతాడు.


A. Badass     -     B. Badass

A:     తనతో ఏదో అవసరం ఉన్నది గనుకనే B తనకు నమస్కరించాడని భావించి, అతడిని అవమానించే విధంగా ప్రతినమస్కారం కూడా చేయకుండా ఏమీ గమనించనట్లు వెళ్ళిపోతాడు.

B:     తన పప్పులు A దగ్గర ఉడకవని తెలుసుకుని మరోసారి అతని దగ్గర తన అతి తెలివితేటలు ప్రదర్శించడు. 



పెద్దలను గౌరవించవలెను అనే కోణంలో మరో ఉదాహరణను పరిశీలిద్దాం


ఆదర్శవాదం (Idealism) ప్రకారం మనం పెద్దలందరినీ గౌరవించాలి. పెద్దరికం గలిగిన పెద్దలున్నంతవరకు ఈ నీతి ఎంతో హర్షణీయం. కానీ ఆదర్శవాదం అనేది పెద్దరికంలేని పెద్దలుండే పరిస్థితిని అసలు ఊహించదు. వారితో ఎలా ఉండాలో చెప్పదు. 


సరిగా ఈ కారణంచేతనే Cynicism యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఈ అనాదర్శవాదం (Cynicism) పేరుకే పెద్దలు.. వారిలో పెద్దరికమనేదే ఉండదు.. కనుక వారిని గౌరవించాల్సిన పనిలేదని వాదిస్తుంది. పెద్దరికం కలిగిన పెద్దలుంటారనే విషయాన్ని Cynicism గుర్తించదు. వారిని గౌరవించాలని చెప్పదు. 


ఇక వాస్తవవాదం (Realism) పెద్దరికమున్న పెద్దలను గౌరవిస్తుంది, అదిలేనివారిని గౌరవించదు.


పెద్దరికమున్న పెద్దలు, వారిని గౌరవించగలిగే సంస్కారమున్న పిన్నలు; ఈ ఇరువురూ ఒకచోట తటస్థపడితే హర్షణీయమైన సన్నివేశం ఆవిష్కరింపబడుతుంది. వారు సమాజంలో బుధజన సమూహంగా కీర్తింపబడతారు. ఇటువంటి విలువలున్న ప్రదేశాన్నే లక్ష్మి తనకు నిలయంగా మార్చుకుంటుంది. 


 కానీ దురదృష్టవశాత్తూ అన్ని ప్రదేశాలలో, అన్ని సందర్భాలలో ఇది సాధ్యం కాదు. 


విలువలు లేనివారికి లక్ష్మి దూరంగా జరిగి పోతుంది. వారు పేదరికంలో మగ్గుతూ అలగాజనంగా పిలువబడుతుంటారు. వారిలో పెద్దరికమున్న పెద్దలు ఉండరు, సంస్కారమున్న పిన్నలూ ఉండరు.


ఆదర్శవాదం ప్రతీసారీ సాధ్యమవటం వాంఛనీయం, అభిలషణీయం; 


అనేకసార్లు సాధ్యం కాకపోవడం ఒక విచారకరమైన వాస్తవం.  


కనుకనే మనిషికి చిన్ననాటినుండి ఆదర్శవాదం మాత్రమే బోధింపబడుతుంది. అనాదర్శవాదం ఎప్పుడూ బోధింపబడదు. దానిని మనిషి కాలక్రమంలో వ్యవహారజ్ఞానం పెంపొందే కొలదీ, మానవ సంబంధాలలో అనుభవం పెరిగే కొలదీ స్వయంగా గ్రహిస్తాడు. 


కనుక ఎవరైనా సరే తమ First Priority ని Idialism కే ఇవ్వాలి. పరిస్థితినిబట్టి Cynicism ని కూడా ఆచరించగలిగినవాడై ఉండాలి. అదే Realism అనిపించుకుంటుంది.





28, మే 2021, శుక్రవారం

NICE GUY & BADASS (Part-1)

 



ఆదర్శవాదం - అనాదర్శవాదం - వాస్తవిక వాదం


Idealism - Cynicism - Realism



ఓ మనిషి తాను బ్రతికే సమాజంలో ఇతరులతో వ్యవహరించే విధానంలో మనం కొన్ని రకాలైన పోకడలను గమనించవచ్చు. 


తన ప్రవర్తన తనకు ప్రయోజనకరంగా ఉన్నదా లేదా అన్నదానికన్నా ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా అన్నవిషయానికే అధిక ప్రాధాన్యత నిచ్చేవాడు Nice Guy.


తనను ఇబ్బందిపెట్టడానికి, నష్టపరచడానికి ఎదుటివారు కుయుక్తితో ప్రయత్నించే అవకాశమున్నదని భావించి, అందరితో ముందునుంచే అమర్యాదకరంగా, మొరటుగా వ్యవహరించేవాడు Badass.


ఎదుటివారితో వ్యవహరించేటపుడు వారెటువంటివారో గమనించి సజ్జనులైతే మర్యదపూర్వకంగానూ, దుష్టబుద్ధి కలిగినవారైతే వారి ఆటకట్టించే విధంగానూ సందర్భాన్నిబట్టి ప్రవర్తించేవాడు Perfect Person. 


మనుషులలో మనం గమనించగలిగే ఈ విధమైన ప్రవర్తనల వెనుక ఉన్న తాత్విక నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే....


Nice Guy ను నడిపించేది ఆదర్శవాదం (Idealism).


Badass అనుసరించేది (Cynicism), 


Perfect Person  ఆచరించేది వాస్తవిక వాదం (Realism)


ఈ మూడింటినీ ఒకసారి పరిశీలిద్దాం



ఆదర్శవాదం (Idealism):

 

సమాజంలో మనం నడచుకోవలసిన విధానానికి సంబంధించి మనకు ఎప్పుడూ ఆదర్శవంతమైన ప్రవర్తనమాత్రమే బోధింపబడుతుంది. అంటే ఇక్కడ సమాజంలోని వ్యక్తులందరూ ఆదర్శంగా ఉన్నట్లు భావించబడి వారితో మనంకూడా వారికి తగినవిధంగా ఆదర్శంగా ఉండాలని భావం. 


ఆదర్శవాదం (Idealism) అనేది ఆదర్శాన్ని తప్ప మరిదేనినీ బోధించదు, అంగీకరించదు. అది నీలోనూ, నాలోనూ అలానే మిగిలిన అందరిలోనూ కేవలం ఆదర్శాన్ని మాత్రమే ఆశిస్తుంది. అందుకే ఇది ఒక ఆశావాదం (Optimism). 


ఇది వాస్తవికతను (Reality) పరిగణనలోకి తీసుకోదు. అంటే ఆచరణలో ఎదురయ్యే క్షేత్రస్థాయి పరిస్థితులను గురించి ఆలోచించదు. అందుకే ఆదర్శవాదం ఒక అవాస్తవికవాదం. అలాగని ఆదర్శవాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం.


వాస్తవిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు ఆదర్శవాదాన్ని ఆచరించగలిగితే అంతకన్న హర్షణీయమైన విషయం మరోటి ఉండదు. అంతకన్నా ఆశించదగినది కూడా మరోటి ఉండదు. ఆదర్శానికి వాస్తవానికి వైరుధ్యం లేని పరిస్థితి అంత గొప్పది. 


కానీ విచారకరమైన విషయమేమిటంటే ఎక్కువ సందర్భాలలో ఆదర్శవాదానికి పరిస్థితులు సహకరించవు. ఆదర్శానికి వాస్తవానికి వైరుధ్యం ఉంటుంది. వాస్తవిక పరిస్థితులు అనుకూలంగా లేనపుడు కూడా ఆదర్శవాదాన్ని ఆచరించాలని ప్రయత్నించడం వెర్రితనమే అవుతుంది. 



అనాదర్శవాదం (Cynicism):  


(Cynicism అనే ఆంగ్లపదానికి సమానార్థకమైన తెలుగు పదం వాడుకలో లేదు. ఈ సినిసిజాన్ని ఆదర్శవాదానికి విరుద్ధమైనదానిగా పేర్కొంటున్నందున దీనికి అనాదర్శవాదం అనే పదాన్ని వాడదలచుకున్నాను.)

 

ఆదర్శవాదం (Idealism) మనిషిలోని సత్ప్రవర్తన మీద నమ్మకముంచితే ఈ అనాదర్శవాదం మనిషిలోని దుష్ప్రవర్తనను ఎత్తి చూపుతుంది. దానికి తగిన విధంగా నడచుకోమని బోధిస్తుంది. 


ఈ వాదం కీడెంచి,మేలెంచమని చెబుతుంది. ఆదర్శవాదం ఆశావాదమైతే (Optimism) ఇది నిరాశావాదం (Pessimism). ఎందుకంటే ఇది  ఆదర్శవాదం వలే మనుషులలో నీతిని, సత్ప్రవర్తనను ఆశించదు. అందుకు విరుద్ధంగా ఇది మనుషులను నీతిలేనివారిగా, దుష్ప్రవర్తనకలిగిన వారిగా మాత్రమే అంచనా వేస్తుంది. ఆవిధంగానే వారిని గుర్తిస్తుంది. 


ఇది కూడా వాస్తవికతను (Reality) పరిగణనలోకి తీసుకోదు. అంతా సవ్యంగా ఉన్నప్పటికీ అనుమానాన్ని వ్యక్త పరుస్తుంది. ఎదుటి వ్యక్తికి దురాలోచనను అంటగడుతుంది. అందుకే అనాదర్శవాదం కూడా ఒక అవాస్తవికవాదమే. అలాగని అనాదర్శవాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. సమాజంలో వక్రంగా ఆలోచించేవారికి కొరతలేదు కనుక అనేక సందర్భాలలో దుష్టబుద్ధి కలిగిన వారి బారిన పడి నష్టానికీ, కష్టానికీ గురికాకుండా ఈ అనాదర్శవాదం మనలను కాపాడుతుంది. 


కానీ ప్రతీసారీ ఈ అనాదర్శవాదాన్ని ఆచరించినందువలన మనకు మర్యదలేనివారిగా, వక్రంగా అలోచించేవారిగా, Bad Person గా ముద్ర పడుతుంది. సజ్జనుల యెడల కూడా అనాదర్శవాదాన్ని ఆచరించాలని ప్రయత్నించడం నిజంగా మూర్ఖత్వమే అవుతుంది.  

 

ఈ విధంగా మనిషిలో ఉండే మంచి చెడులలో ఆదర్శవాదం మంచి అనే పార్శ్వాన్ని మాత్రమే గుర్తిస్తే అనాదర్శవాదం చెడు అనే పార్శ్వాన్ని మాత్రమే గుర్తిస్తుంది. 


అందుకే ఈ వాదాలు రెండూ కూడా మనిషికి పాక్షికంగానే ఉపయోగపడతాయి. ఈ రెండూ కాకుండా మనిషికి పూర్తి ప్రయోజనం చేకూర్చేటటువంటి వాదం కూడా ఒకటున్నది... అదే వాస్తవికవాదం.


వాస్తవిక వాదం (Realism) : 


ఈ వాదం ఆచరణలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన విధంగా మనం వ్యవహరించవలెనని చెబుతుంది. అంటే మన ప్రవర్తన ఎప్పుడూ ఒకే మూసలో కాకుండా ఎదుటివారినిబట్టి ఒక్కోసారి ఆదర్శవాదాన్ని (Idealism), ఒక్కోసారి అనాదర్శవాదాన్ని (Cynicism) ఆచరించాలని చెబుతుంది. 


పేరులో ఆదర్శం లేకపోయినా నిజానికి ఇదే ఆదర్శవంతమైన ప్రవర్తన.