29, జూన్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---9





పారిశ్రామిక విప్లవం-నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు

ఐరోపా ప్రజలలో ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలితంగా ఏర్పడిన శాస్త్రీయ దృక్పథం కేవలం మతసంస్కరణకేకాక నూతన విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలకు కూడా దారితీసింది. 18వ శతాబ్దంలో మొదటగా జేమ్స్‌వాట్ అనే శాస్త్రవేత్త 1765వ సం||లో ఆవిరి యంత్రాన్ని కనుగొనటంతో ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలకు పునాది పడింది. మనిషి చేసే పనిని యంత్రం ద్వారా చేయించటంతో వస్తూత్పత్తి సామర్ధ్యం పెరిగింది. ఇది క్రమంగా మొదటగా ఇంగ్లండ్‌లో తదుపరి మిగతా యూరప్‌లో అనతికాలంలోనే అనేక పరిశ్రమలు ఏర్పడటానికి దోహదంచేసింది.

అప్పటివరకు కార్ఖానాలలో తయారయ్యే వస్తువులు పెద్ద పెద్ద పరిశ్రమలలో తయారవటం ప్రారంభమైనది. భారీ పరిశ్రమలకు కావలసిన యంత్రాల తయారీకి ఇనుము, ఉక్కు వంటి లోహాలు మరియు యంత్రాలను నడపటానికి అవసరమైన ఆవిరిశక్తి ఉత్పత్తి కోసం బొగ్గు కావలసి వచ్చాయి. ఫలితంగా ఈ లోహాల ఉత్పత్తి మరియు గనులనుండి బొగ్గు తవ్వితీయడం అధికమైనది. ముడి సరుకులను పరిశ్రమలకు మరియు ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చవలసి రావడంతో రవాణారంగం కూడా తీవ్రంగా ప్రభావితమైనది. రైల్వేలు, స్టీమర్లు, ఓడలు నిర్మించబడ్డాయి. ఈ విధంగా ఒక పరిశ్రమ మరికొన్ని పరిశ్రమలు ఏర్పడటానికి మరలా ఆయా పరిశ్రమలన్నీ మరి ఎన్నో పరిశ్రమలు ఏర్పడటానికి కారణమయ్యాయి. ఇదంతా వెరసి ‘పారిశ్రామిక విప్లవం’గా పిలువబడింది.

పారిశ్రామిక విప్లవంలో భాగంగానే అనేక నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగాయి.వీటివలన ప్రజల జీవితం మరింత సుఖవంతమైనది. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలిగాయి. ప్రజాజీవితాన్ని సుఖప్రదం చేయటంలో తోడ్పడ్డ ఆవిష్కరణలు విద్యుచ్ఛక్తి, టెలిగ్రాఫ్, టెలిఫోన్, నిస్తంత్రీ వార్తావిధానం, కుట్టుమిషన్, టైపు మిషన్, పెట్రోల్, రబ్బర్, రిఫ్రిజరేటర్ మొదలైనవి. విద్యుచ్ఛక్తి, పెట్రోల్ లను కనుగొన్న తరువాత యంత్రాలను నడపటానికి అవసరమయ్యే ఇంధనంకొరకు బొగ్గు స్థానంలో క్రమంగా ఈ రెంటి వాడకం ప్రారంభమైనది.

ఆనాడు ప్రారంభమైన ఈ నూతన వైజ్ఞానిక ఆవిష్కరణల పర్వం వలస పాలన ఏనాడో అంతమైనా కూడా నేటికీ కొనసాగుతూనే ఉన్నది. మానవ జీవితంలోకి అనేక నూతనమైన వస్తువులు మరియూ పరికరాలూ వచ్చిచేరుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ కనుగొన్న ప్రతివస్తువు కూడా అది కనుగొనబడిన సమయం దగ్గరనుండి మొదలుకొని నేటి వరకూ కాలానుగుణంగా సున్నితత్వాన్ని మరియు మరింత సామర్ధ్యాన్ని సంతరించుకుంటూనే ఉన్నది.

తెల్లవాడి బాధ్యత

ప్రపంచాన్ని ఆక్రమించుకొనుట కొరకు అప్పటికే ఐరోపాలో అనేక వర్తక సంఘాలు ఏర్పడ్డాయి. స్పానిష్, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ జాతులకు చెందిన ఈ వర్తక సంఘాలు ప్రపంచం అంతా వ్యాపించి ఎవరికి దొరికిన ప్రాంతాన్ని వారు ఆక్రమించుకున్నారు. ఆక్రమణ, పాలన, వర్తకం, దోపిడీ, మతప్రచారం, ఆధునిక నాగరికతా వ్యాప్తి మరియు నూతన వైజ్ఞానిక విద్యా వ్యాప్తి అంతా పక్కపక్కనే జరిగేవి. ఇదంతా ‘ప్రపంచం యెడల తెల్లవాడి బాధ్యత’ గా యూరోపియన్‌లు భావించేవారు.ఇది కొంతవరకు నిజమే. ఐతే దోపిడీ అన్నది మిగిలిన అన్ని విషయాలకన్నా ప్రాధాన్యతను సంతరించుకోవడంతో ఆఖరికి అదే ప్రధాన సమస్యగా పరిణమించింది.

అగ్రరాజ్యంగా బ్రిటన్ ఆవిర్భావం

పారిశ్రామిక విప్లవానికి ముందు స్పెయిన్, పోర్చుగల్ దేశాలు బలమైన నౌకాశక్తిని కలిగి ఉండి అగ్రరాజ్యాలుగా చలామణీ అయ్యేవి. అప్పట్లో దోపిడీ పచ్చిగా, నగ్నంగా జరిగేది. నౌకాబలమే అప్పట్లో దేశాల ఔన్నత్యాన్ని నిర్దేశించేది.

కాలక్రమంలో ఇంగ్లాండులో మొదటగా తదుపరి మిగతా యూరప్‌లో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో పారిశ్రామిక శక్తి దేశాల ఔన్నాత్యాన్ని నిర్దేశించటం ప్రారంభమైనది. దీనితో స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాల స్థానంలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్సు దేశాలు అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఈ దేశాల దోపిడీ స్పెయిన్, పోర్చుగల్ దేశాల దోపిడీకి భిన్నంగా ఉంటుంది. ఇవి తాము ఆక్రమించుకున్న దేశాలను తమదేశంలోని పరిశ్రమలకు ముడిసరుకు సరఫరాదారులుగా మరియు తమ దేశపు పరిశ్రమలలో తయారైన వస్తువులకు మార్కెట్లుగా ఉపయోగించుకునేవి. దీనితో ఆయాదేశాలలో అనాదిగా ఉన్న ఆర్థిక జీవనం తలక్రిందులైనది.

ఐరోపా పరిశ్రమలలో తయారైన వస్తువులతో వలస దేశాల మార్కెట్లను ముంచెత్తటంతో ఆయా దేశాలలోని కుటీర పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. ఆ ఉత్పత్తులను కొనే నాథుడే లేడు. దీనివలన ముఖ్యంగా గ్రామీణ జీవనం నాశనమైనది. బ్రతుకుతెరువు కోల్పోయిన గ్రామీణులు పరిశ్రమలలో పనిచేసేటందుకు పట్టణాలకు వలస వచ్చారు.

ఈ వలసలతో పట్టణాలు పెద్ద పెద్ద నగరాలుగా మారాయి. నూతన 'కార్మికవర్గం' సమాజంలో ఆవిర్భవించింది.

గ్రామీణులు పట్టణాలకు వలస రావటం అనే పరిణామం ఐరోపా దేశాలలో కూడా జరిగినది. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఐరోపా పట్టణాలలో స్థాపించబడిన పరిశ్రమల మూలంగా ఆ దేశాలలోని గ్రామాలలో గల కుటీర పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి.

మధ్యతరగతి ఆవిర్భావం-విప్లవ సన్నాహం

కార్మిక వర్గంతోపాటు మరో వర్గంకూడా సమాజంలో ఏర్పడింది. అదే 'మధ్య తరగతి వర్గం'. కార్మిక వర్గం పారిశ్రామిక విప్లవం తదనంతరం తలయెత్తితే మధ్యతరగతి వర్గం మాత్రం అంతకన్నా ముందే వలసల స్థాపనతోటే సమాజంలో జనించి పారిశ్రామిక విప్లవంతో మరింతగా పెరిగి బలపడింది.

అప్పటి వరకు ప్రజలు రెండే వర్గాలుగా ఉండే వారు. ధనిక ప్రభువర్గం మరియు పేద ప్రజలు. ఫ్రజలంతా దాదాపూ పేదలే(వ్యాపార వర్గం ఉపేక్షించదగిన స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉండేది. వారికెటువంటి ప్రాబల్యం ఉండేది కాదు). ప్రభువర్గం మాత్రమే ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అనుభవించేది. కానీ వలసల స్థాపనతో మరియు ఆ తరువాత పారిశ్రామిక విప్లవంతో వ్యాపార, వాణిజ్యాలు పెరగటంతో ప్రభువర్గం, పేదప్రజలకు మధ్యన వ్యాపారం మరియు పరిశ్రమలద్వారా ధనం ఆర్జించిన మరో వర్గం సమాజంలో ఏర్పడింది. అదే మధ్య తరగతి వర్గం లేక బూర్జువా వర్గం. ఈ మధ్య తరగతి వర్గం కాలక్రమంలో విశ్వరూపం దాల్చింది. అనేక స్థాయీ భేదాలతో ఈ వర్గపు ప్రజలు పెంపొందారు. దీనికి తోడు ఆధునిక వైద్య సౌకర్యాలతో ప్రజల ఆయుఃప్రమాణం పెరిగి విస్పోటనం సంభవించినట్లుగా జనాభా పెరిగింది.

ఈ మధ్య తరగతి ఏర్పడినప్పటినుండి మానవుడు అదృష్టవంతుడయ్యాడు. ప్రభువర్గంలో జన్మించని పక్షంలో పేదవాడిగా అణగారి జీవించాల్చిన పరిస్థితి దీనితో అంతరించింది. సాధారణమైన పౌరుడు జీవితంలో ఏ కొద్ది వృద్ధి అయినా సాధించగలిగే అవకాశాలు సమాజంలో ఏర్పడ్డాయి. అలా అభివృద్ధి సాధించిన వారే మధ్యతరగతివారు. వీరు అటు ఫ్యూడల్ ప్రభువులు కారు.ఇటు నిరుపేదలు కారు. అందుకే వీరిని మధ్య తరగతి అన్నారు. వీరిలో కోటీశ్వరులూ ఉన్నారు; చిన్న చిన్న వ్యాపారస్థులు మరియు వివిధ స్థాయి ఉద్యోగులూ ఉన్నారు. ఐతే వీరిలో ధనిక బూర్జువా వర్గం మత్రమే విప్లవాత్మకం అయిన క్రియాశీలతను కలిగిఉన్నది.

మొదట ఈ విప్లవ బూర్జువావర్గానికి చెందినవారు ఫ్యూడల్ ప్రభువుల కనుసన్నలలో మెలగుతూ వారికి విధేయులై వారి ఆజ్ఞలకు, శాసనాలకు లోబడి పెంపొందారు. వీరు ఎంతగా వృద్ధి చెందారంటే వీరి భావి వికాసం ఇక ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో ఎంత మాత్రం జరగదు. ఫ్యూడల్ వ్యవస్థ వీరికి ఆటంకంగా పరిణమించింది. దీనితో ఈ బూర్జువా వర్గం తమకనుగుణమైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం దానంతటదే జరిగిపోయింది. ప్రపంచ మానవాళి జీవనంలో ఇస్లాం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రపంచ రాజకీయ కేంద్రం ఇస్లామిక్ ఆసియా నుండి పెట్టుబడిదారీ ఐరోపాకు మారింది.

ఈ మధ్యతరగతి వర్గం వ్యవస్థలోని మూడు అంగాలలో ‘సమాజం’ అనే అంగానికి ప్రాతినిథ్యం వహించింది. సమాజ వికాసం వీరివలనే సాధ్య పడింది. వీరు మితిమీరిన రాజ్య శక్తినుండి మానవాళిని కాపాడారు. ప్రమాదంలో పడిన సమాజాన్ని రక్షించారు. వ్యవస్థలోని సమాజం అనే అంగం యొక్క ప్రయోజనాలను వీరు కాపాడారు. వీరి వలన సమాజం బహుముఖాలుగా విస్తరిల్లింది. దానిలోని ఉత్పత్తి వనరులు మరియు మౌలిక సదుపాయాలు వృద్ధిచెందాయి.ఖండాంతర వ్యాపారం వృద్ధి చెందింది.నిరంతర యుద్ధాల బారినుండి ప్రజలను వీరు రక్షించారు.సమాజంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో మూఢ విశ్వాసాల స్థానంలో శాస్త్రీయ దృక్పథం నెలకొన్నది. తద్వారా విజ్ఞాన శాస్త్రావిష్కరణ జరిగినది. ఆ విజ్ఞాన శాస్త్ర ఫలాలను, అది అందించే సౌకర్యాలను మానవాళి అందుకున్నది. సమాజంలో అభ్యుదయకారకమైన నూతన నాగరికత, నూతన జీవన విధానం వెల్లివిరిసాయి.

ఇంతకు ముందే చెప్పినట్లుగా మొదట ఈ మధ్యతరగతి వర్గం నిరంకుశ ఫ్యూడల్ ప్రభువుల శాసనాలకు లోబడే వృద్ధిచెందింది. కాలక్రమంలో రాజ్యపు చట్రంనుండి తాము బయటపడి ప్రజలను కూడా రక్షించాలని వీరు కాంక్షించారు. ఈ క్రమంలో ఫ్రాన్సు దేశంలో సంభవించిన విప్లవం ప్రపంచంలో సమాజం యొక్క ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ అయిన పెట్టుబడిదారీ వ్యవస్థకు మరియు దాని రాజకీయ రూపమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంనకు ప్రాతిపదికగా నిలచింది.అదే ‘ఫ్రెంచ్ విప్లవం’ గా చరిత్రలో పిలువబడింది.

ఈ విధంగా ఏర్పడిన పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళి జీవన విధానాన్ని,వారి జీవన దృక్పథాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. ఐతే కాలక్రమంలో ఈ వ్యవస్థకు దీని యొక్క దోపిడీ స్వభావంవలన సామ్యవాదరూపంలో ఎంతో వ్యతిరేకత ఏర్పడినది. ఆ పరిణామాలను ఇప్పుడు చూద్దాం.....(సశేషం)


28, జూన్ 2008, శనివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---8





పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావం

వలసల స్థాపన

సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలితంగా ఐరోపా జాతిలో ఏర్పడిన నూతన భావజాలం, అభ్యుదయ మరియు ఆధునిక జీవన విధానం, శాస్త్రీయమైన ఆలోచనావిధానం మొదలైన వాటిని ప్రపంచ ప్రజలందరికీ అందించే ఉద్దేశంతో ఐరోపా జాతులు ప్రపంచాన్ని పాలించడానికి ఆయత్తమయ్యాయి. వీరి ఉద్దేశం మంచిదే.కానీ ఈ లక్ష్య సాధనకు వీరు ఎంచుకున్న మార్గం మాత్రం దోపిడీకి మరియు మోసానికి దారితీసింది.

ఇప్పటివరకు చరిత్రకారుల భావన ప్రకారం వలసల స్థాపనలోని ముఖ్యోద్దేశం ‘మర్కెంటైలిజం’. అంటే వలసలను దోపిడీ చేసి స్వదేశ సంపదను పెంచడం. వలసలలో ఆధునిక నాగరికతా వృద్ధి అనేది ఒక పర్యవసానం మాత్రమే. కానీ ఏది ముఖ్యోద్దేశం ఏది పర్యవసానం అనేది మనం చరిత్రను చూచే దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. చరిత్రలోని వాస్తవ సంఘటనలకు ఎవరి అభిప్రాయానికి అనుగుణంగా వారు నిర్ధారణలు చేస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్ధకులు ఒక రకంగా చేసిన నిర్ధారణలను సామ్యవాద దృక్పథం కలిగినవారు మరోరకంగా చేస్తారు.

(ఆయా వ్యవస్థల సాఫల్యత ఎలా ఉన్నా మౌలిక ఉద్దేశానికి సంబంధించి నంతవరకూ కమ్యూనిజం మాత్రమే ప్రజాప్రయోజనం యెడల చిత్తశుద్ధితో ఉన్నట్లుగా కనపడుతుంది. కాపిటలిజం ఉద్దేశం మాత్రం దోపిడీ అన్నట్లుగా ఉంటుంది. ఇక ఇస్లాం విషయంలో ఆ మాత్రం స్పష్టత కూడా ఉండదు. అది అసలు రాజకీయ వ్యవస్థలానే అనిపించదు.ఓ మతంలా గోచరిస్తుంది. ఆయా వ్యవస్థల మౌలిక తత్త్వాలలో ఉన్న భేదం వలననే ఈవిధంగా జరుగుతుంది. అవి ఎలా ఉన్నా, బాహ్య దృష్టికి అవి ఎలా గోచరించినా అసలు వాస్తవమేమిటనేది మనం విజ్ఞతతోనే గ్రహించాలి)

చారిత్రక ఘటనామాలికలోని అంతస్సూత్రాన్ని ఇంతవరకూ ఎవరూ వివరించలేకపోయారు. చరిత్రలోని సంఘటనాక్రమాన్ని వెనుకనుండి నడిపిస్తున్న తత్త్వాన్ని ఇంతవరకూ ఎవరూ తెలుసుకోలేకపోయారు. దానిని కొంతవరకు కార్ల్ మార్క్స్ వివరించటానికి ప్రయత్నించాడు. కానీ సఫలీకృతం కాలేకపోయాడు. కనుక మనం ఇప్పటి వరకూ ఉన్న నిర్ధారణల యెడల మరీ అంతగా నిబద్ధులం అవ్వవలసిన అవసరమేమీలేదు.స్వేచ్ఛగా మన అభిప్రాయాలను మనం ఏర్పరచుకోవచ్చు.

చరిత్రలో మునుపెన్నడూ సాధ్యంకానంతటి విస్తారమైన భూభాగంతో, యశోవంతమైన వలస సామ్రాజ్యం కేవలం స్వార్ధ, సంకుచిత, దుర్బల, అనైతికమైన దోపిడీని పునాదిగా కలిగి అన్నినాళ్ళు మనగలిగినదనడం అసంబద్ధం. ఈ వలస సామ్రాజ్య స్థాపనలో అంతర్లీనంగా ఉన్న ఉద్దేశం ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవన ఫలితంగా తలెత్తిన నూతన నాగరికతను, నూతన జీవన విధానాన్ని ప్రపంచ ప్రజలందరకూ అందజేయటం మాత్రమే. ఐతే దోపిడీ అనేది వలస పాలన యొక్క అనివార్య పర్యవసానం. ఇస్లాం తన సిద్ధాంత వ్యాప్తికి దురాక్రమణను మార్గంగా గైకొంటే ఐరోపా జాతులు వలస విధానాన్ని మార్గంగా గైకొన్నాయి.

ఇస్లాం కానీయండి, కాపిటలిజం కానీయండి, కమ్యూనిజం కానీయండి; మౌలికంగా వీటి ఉద్దేశం `ప్రజాప్రయోజనమే. కానీ వాటి యొక్క కొన్ని అనివార్య లక్షణాలు, పర్యవసానాలవలన అవి ప్రజలకు పీడగా పరిణమించాయి.

ఏదైనా ఒక నూతన తాత్త్విక నేపథ్యంతో లేక మరేదైనా నూతన దృక్కోణంలో చరిత్ర క్రమాన్ని పరిశీలించేటపుడు ఆ దృక్పథానికి అనుగుణంగా చారిత్రక సంఘటనలకు నూతనమైన నిర్ధారణలు చేయటం సాధారణమైన విషయం. ఒక్కొక సారి మౌలిక అంశాలలో కూడా అప్పటికి వ్యాప్తిలో ఉన్న నిర్ధారణలతో విభేదించవలసి వస్తుంది. కార్ల్ మార్క్స్ సామ్యవాద దృక్పథంతో, గతితార్కిక తాత్త్విక నేపథ్యంతో ప్రపంచ చరిత్రను ఎంత వినూత్నంగా వివరించాడో మనకు తెలిసిన విషయమే. ఈ రచన కూడా ప్రపంచ చరిత్రను భారతీయ తత్త్వశాస్త్రానుగుణమైన (రెండవ అధ్యాయంలో వివరిస్తాను) ఒక విభిన్న దృక్కోణంలో పరిశీలించటానికి ప్రయత్నిస్తున్న కారణంగా ఈ రచనలో చరిత్ర గురించి కొన్ని నూతనమైన నిర్ధారణలు జరిగాయి. ఇస్లాం క్రైస్తవం, బౌద్ధంల తోపాటు పేర్కొనదగిన ఒక మతంగా కాక కాపిటలిజం, కమ్యూనిజంల సరసన పేర్కొనదగిన ఒక సామాజిక, రాజకీయ వ్యవస్థగా నిర్ధారింపబడినది. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మౌలిక ఉద్దేశం దోపిడీ కాదు, ప్రపంచ దేశాలకు ఆధునిక, అభ్యుదయ నాగరికతనందించటమేననీ; దోపిడీ ఈ వ్యవస్థ యొక్క అనివార్య పర్యవసానం మాత్రమేననే నిర్ధారణ కూడా ఇటువంటిదే.

కొత్తగా కనుగొనబడిన జలమార్గాలు మరియు ‘నూతన ప్రపంచం’ వలన ఐరోపా జాతులు ప్రపంచమంతటా వలసల స్థాపనకు పూనుకున్నాయి. ఈ నూతన భౌగోళిక ఆవిష్కరణలలో ప్రధాన పాత్ర పోషించిన స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలు వలసల స్థాపనలో ముందు నిలిచాయి. బ్రెజిల్ మినహా మిగతా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను స్పెయిన్‌కు, బ్రెజిల్ మరియు ఆసియా, ఆఫ్రికా ఖండాలను పోర్చుగల్‌కు దఖలు పరుస్తూ 15వ శతాబ్దపు చివరికాలంలో పోప్ ఒక నిర్ణయం చేసాడు.

దక్షిణ అమెరికా ఖండాన్ని స్పెయిన్ ఆక్రమించి అక్కడికి స్పానిష్ ప్రజలు వలస వెళ్ళటంతో ఇప్పటి లాటిన్ అమెరికా జాతులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఆ ప్రాంతాలలో విలసిల్లిన ‘మాయా’, ‘అజ్‌టెక్’ తదితర నాగరికతలు స్పానియార్డులచే సమూలంగా నాశనం చేయబడ్డాయి. అక్కడ అనాదిగా నివసిస్తున్న మంగోల్ జాతికి చెందిన ‘రెడ్ ఇండియన్‌లు’ పెద్దయెత్తున ‘జీనోసైడ్’ (ఒక జాతికి చెందిన ప్రజలను పెద్దయెత్తున చంపటం) కు గురయ్యారు. మిగిలిన కొద్దిమంది అడవుల్లోకి తరిమివేయబడ్డారు.

తదనంతర కాలంలో ‘కెప్టెన్ కుక్’ అను బ్రిటిష్ నావికుని వలన కనుగొనబడి, బ్రిటిష్ జాతి ఆక్రమణకు గురైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో కూడా ఇదే విధమైన మారణహోమం జరిగినది. అప్పటి వరకు అక్కడ నివసించిన నీగ్రోజాతికి చెందిన స్థానిక ప్రజలు చాలావరకు జీనోసైడ్‌కు లోనై, మిగిలిన కొద్ది మంది అడవుల్లోకి తరిమివేయబడ్డారు.

అమేయమైన నౌకాశక్తి కలిగిన స్పెయిన్ దేశం నూతన భౌగోళిక ఆవిష్కరణలలో ప్రధాన పాత్ర పోషించింది. దక్షిణ అమెరికా ఖండాన్ని ఆక్రమించి అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. ప్రపంచంలో దోపిడీ ప్రారంభమయ్యింది. స్పెయిన్ హయాంలో దోపిడీ ప్రత్యక్షంగా జరిగేది. అక్కడున్న సంపదలను ప్రత్యక్షంగా దోపిడీ చేసి స్వదేశానికి నౌకల ద్వారా తరలించేవారు. ఈ క్రమం దాదాపు ఒకటిన్నర శతాబ్దంపాటు కొనసాగింది.అప్పట్లో పోర్చుగల్ కూడా గొప్ప రాజ్యంగా ఉండి వలసలను స్థాపించింది. హాలెండ్ (డచ్చి వారు) కూడా ఈ సమయంలో వలసలను స్థాపించనారంభించిన మరోదేశం.

ఈ సమయంలోనే పోర్చుగీసు వారు భారతదేశంలోని గోవాలో మరియు కొన్ని తూర్పు ఆసియా దేశాలలో కూడా వర్తక స్థావరాలను ఏర్పరచుకున్నారు. వీరితో పాటే క్రైస్తవ మిషనరీలు కూడా ఆయాదేశాలకు వచ్చి తమ మత ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాయి. కానీ కాలక్రమంలో ఇంగ్లాండ్‌దేశాంతో క్రీ||శ.1588వ సం||లో జరిగిన యుద్ధంలో ‘స్పానిష్ అర్మడా’ పేరుతో ఖ్యాతివహించిన స్పెయిన్ దేశపు నౌకాదళం ఓడిపోవటంతో వలస రాజ్య స్థాపనలో స్పెయిన్ ప్రాబల్యం క్రమంగా అంతరించింది. అప్పటినుండి ఇంగ్లాండ్ ప్రాభవం ప్రారంభమైనది. ఫ్రాన్స్ కూడా బ్రిటన్‌తో పోటీ పడింది.

కెనడా ప్రాంతంలో కొన్ని ఫ్రెంచ్ వలసలు స్థాపించబడ్డాయి. 17వ శతాబ్దంలో మతకారణాల వలన దేశ బహిష్కరణకు గురైన అనేక మంది ఇంగ్లాండ్ దేశీయులు అమెరికా తూర్పు తీరంలో అనేక వలసలను ఏర్పరచుకున్నారు. వీరంతా తామరతంపరగా వృద్ధిచెంది ఉత్తర అమెరికా ఖండపు దేశాలైన అమెరికా మరియు కెనడాలు ఆవిర్భవించాయి......(సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---7





ఐరోపాలో సామాజిక వికాసం

15వ శతాబ్దంలో జరిగిన ఒక కీలక సంఘటన చీకటి యుగంలో మగ్గుతున్న ఐరోపాలో సామాజిక వికాసానికి దారితీసినది. ఈ సామాజిక వికాసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ వికాసం తదనంతర ప్రపంచ చరిత్రగతిని నిర్దేశించినదిగా, పెట్టుబడిదారీ వ్యవస్థకు నేపథ్యంగా చెప్పుకోవచ్చు.

ఆ కీలక సంఘటన ఏమిటంటే ఆటోమన్ టర్కులు తమపొరుగున ఉన్న బైజాంటైన్ సామ్రాజ్యం మీద దాడి చేసి దాని రాజధాని అయిన కాన్‌స్టాంటినోపుల్ (నేటి ఇస్తాంబుల్) ను ఆక్రమించి సుధీర్ఘకాలం నుండి వెలుగొందుతున్న ఆ సామ్రాజ్యాన్ని పతనం చేసారు. ఆటోమన్ సామ్రాజ్యం ఇస్లామిక్ సామ్రాజ్యం. ఇది నేటి టర్కీ ప్రాంతంలో ఉండేది. బైజాంటైన్ సామ్రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యం. ఒకప్పటి రోమన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండి తదుపరి దానినుండి విడివడి తూర్పు యూరప్‌లో విలసిల్లిన గొప్ప సామ్రాజ్యం.

(క్రీస్తు పూర్వం నేటి ఇటలీ దేశపు రాజధాని ఐన రోము నగరం రాజధానిగా సువిశాలమైన భూభాగంలో విస్తరించి విలసిల్లినది రోమన్ సామ్రాజ్యం. కాలాంతరంలో దానియొక్క తూర్పు ప్రాంతం విడిపోయి బైజాంటైన్ సామ్రాజ్యంగా ఏర్పడింది. గ్రీసు దేశం, రష్యా మొదలైనదేశాలు కలిగిన నేటి తూర్పు యూరప్ ప్రాంతంలో ఈ బైజాంటైన్ సామ్రాజ్యం కొనసాగింది. రోము నగరం రాజధానిగా గల పశ్చిమ ఐరోపా లోని రోమన్ సామ్రాజ్యం అనాగరిక, బర్బర, అరాచక జాతులవలన ఏర్పడిన కల్లోలంలో పతనమైనది. దీనివలన అప్పటి వరకు రోమన్ సామ్రాజ్యం వలన గొప్ప నాగరికతా సంస్కృతులతో ఉజ్వల వైభవాన్ని చవిచూచిన పశ్చిమ ఐరోపాలో అన్ని రంగాలలోనూ స్థబ్దత ఆవహించినది. ఈ స్థబ్దత ఒక వేయి సంవత్సరాలు (క్రీ||శ.410 నుండి క్రీ||శ.1410 వరకు) కొనసాగింది. ఈ కాలాన్ని ఐరోపా చరిత్రలో చీకటి యుగంగా చరిత్రకారులు పిలిచారు. బైజాంటైన్ సామ్రాజ్యం మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగింది.

సరిగా ఈ సమయంలోనే పశ్చిమ ఆసియా ప్రాంతంలో 7వ శతాబ్దంలో ఇస్లాం ఆవిర్భవించి ప్రపంచ రాజకీయాలలో తిరుగులేకుండా ఆధిపత్యాన్ని చాటి అంతా తానై అజేయంగా నిలిచింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఇస్లామిక్ ప్రస్థానంలో నేటి టర్కీ ప్రాంతంలో (ఆసియా మైనర్) నెలకొని సువిశాలంగా విస్తరిల్లిన ఆట్టోమన్ టర్కీ సామ్రాజ్యం క్రీ||శ.1453వ సంవత్సరంలో తమ పొరుగున ఉన్న బైజాంటైన్ సామ్రాజ్యం మీద దాడిచేసి దాని రాజును హతమార్చి ఆ సామ్రాజ్యాన్ని పతనం చేసింది.)

ఆటోమన్ టర్కులు బైజాంటైన్ సామ్రాజ్యం మీద దాడి చేసి దాని రాజధాని ఐన కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించుకోవటం యావత్ మానవజాతి నాగరిక ప్రస్థానంలోనే, యావత్ మానవజాతి రాజకీయ చరిత్రలోనే అత్యంత ప్రధానమైన సంఘటనలలో ఒకటి. దీనివలన భవిష్యప్రపంచాన్ని, మానవాళి జీవనశైలినీ నిర్దేశించే ప్రధానమైన కొన్ని పరిణామాలు 15వ మరియు 16వ శతాబ్దాలలో ఐరోపాలో సంభవించాయి.

అవి:

1. నూతన భౌగోళిక ఆవిష్కరణలు.

2. సాంస్కృతిక పునరుజ్జీవనం.

3. క్రైస్తవ మత సంస్కరణోద్యమం.

సామాజిక వికాసాన్ని జాతిగత స్వభావంగా కలిగిన ఐరోపా జాతులకు తమ స్వభావాన్ని వ్యక్తీకరించుకొనుటకు మరియు తదనుగుణమైన పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించుట కొరకు ఈ పరిణామాలద్వారా కాలం కలసి వచ్చింది.


నూతన భౌగోళిక ఆవిష్కరణలు

అనాదినుండి ఐరోపా మరియు తూర్పు ఆసియా దేశాల మధ్యన వర్తకం మధ్యధరా సముద్రం ద్వారా జరిగేది. ఆ ప్రాంతం మొదట క్రైస్తవ బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉండటం వలన యూరప్ దేశాల వర్తకం నిరాటంకంగా జరిగేది.కానీ అది ఇస్లామిక్ ఆటోమన్ టర్కుల ఆక్రమణలోకి వచ్చేసరికి యూరప్ వర్తకానికి ఆటంకమేర్పడింది. ఈ వర్తకం ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది. దానితో వారు తూర్పు ఆసియా దేశాలకు నూతన మార్గాలను అన్వేషించటానికి పూనుకున్నారు. ఈ అన్వేషణను ప్రధానంగా స్పానిష్, పోర్చుగీసు పాలకుల ధనసహాయంతో మరియు ప్రోద్బలంతో సాహసవంతులైన ఇటాలియన్ నావికులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆఫ్రికా ఖండం క్రిందివైపుగా 1498వ సం||లో ప్రధానంగా భారతదేశానికి తద్వారా తూర్పు ఆసియా దేశాలకు నూతన మార్గాన్వేషణా ప్రయత్నం ఫలించింది. ఈ ప్రయత్నంలోనే యాదృచ్ఛికంగా అమెరికా ఖండం కనుగొనబడింది. అలాగే సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా ఖండపు ప్రాంతంతో కూడా మిగతా ప్రపంచానికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా కనుగొనబడిన అమెరికా ఖండం తదితర ప్రాంతాలను ‘నూతన ప్రపంచం’ గా చరిత్రకారులు పిలిచారు.

సాంస్కృతిక పునరుజ్జీవనం(The Renaissance)

బైజాంటైన్ సామ్రాజ్యం ఆటోమన్ టర్కుల ఆధీనంలోకి రావటంతో టర్కుల దురంతాలకు భయపడి గ్రీకు పండితులు, కవులు, కళాకారులు ఇటాలియన్ నగరాలకు వలస వెళ్ళిపోయారు. బైజాంటైన్ సామ్రాజ్యం ఇటలీ కేంద్రంగా వర్ధిల్లిన ఒకనాటి రోమన్ సామ్రాజ్యానికి దాయాది రాజ్యం అవడంవలన అది గ్రీకోరోమన్ సంస్కృతికి ఆటపట్టుగా నిలచినది. అందువలన ఈ కాందిశీకులను ఆ సంస్కృతి యెడల ఆదరణ గలిగిన ఇటలీలోని సంపన్న వర్తకులు ఆదరించి, ఆశ్రయమిచ్చారు. వీరి ప్రభావం వలన ప్రాచీన గ్రీకురోమన్ సంస్కృతి పునరధ్యయనానికి ప్రేరణ కలిగినది. దానితో ఒకనాడు సముజ్వలంగా వెలుగొందిన కళలు, సాహిత్యం, వాస్తుశిల్పం, సంస్కృతి తిరిగి జవజీవాలు సంతరించుకోవడంతో సాంస్కృతిక పునరుజ్జీవనం సంభవించి, అది క్రమంగా ఇటలీ నుండి ఐరోపా అంతటా వ్యాపించింది. ఇదే సమయంలో 1450వ సం||లో అచ్చు యంత్రం కనుగొనబడటంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా పునరుజ్జీవన ఉద్యమం ప్రజలలో వ్యాపించినది. దేశభాషలలో సారస్వత వికాసం జరగటంతో జనబాహుళ్యంలోకి నూతనభావజాలం విస్తృతంగా వ్యాపించింది.

పునరుజ్జీవన ఉద్యమంతో యూరోపియన్ సమాజంలో బహుముఖ ప్రగతి సంభవించి అది ఆధునిక నాగరికతకు పునాది వేసింది. ఈ ఉద్యమం యూరోపియన్ మేధావులలో సృజనాత్మకమైన, నూతనమైన, స్వీయ ఆలోచనలను కలిగించింది. చీకటి యుగపు బంధిఖానా నుండి ఐరోపా ప్రజ విముక్తిపొందింది. ఆ యుగంనాటి అన్నిరకాల మూఢత్వాలను ప్రజలు తిరస్కరించారు.

చీకటి యుగం మూలంగా తెగిపోయిన తమ సాంస్కృతీ వికాస స్రోతస్సును ఐరోపా ప్రజలు తిరిగి ముడివేసి నేటి ఆధునిక, అభ్యుదయ జీవన విధానం మరియు శాస్త్రీయ దృక్పథములవైపు కొనసాగించారు.

క్రైస్తవ మత సంస్కరణోద్యమం(Reformation)

ప్రజల ఆలోచనాధోరణిలో వచ్చిన ఈ మార్పు యూరప్‌లో సామాజిక వికాసానికి, జనజీవన చైతన్యానికి ఆటంకంగా ఉన్న మతంలో మార్పుకు దారితీసింది. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ ప్రభావంతో జర్మనీలో మార్టిన్ లూథర్ చర్చి దురాచారాలను ఖండిస్తూ 1517వ సం||లో కరపత్రం విడుదల చేయటంతో చెలరేగిన కలకలం క్రైస్తవ మతసంస్కరణోద్యమానికి దారితీసింది. తిరిగి ఈ ఉద్యమం కూడా ఐరోపా అంతటా వ్యాపించింది. క్రైస్తవ మతాన్ని తమ జీవన వికాసానికి అనుగుణంగా ప్రజలు తీర్చిదిద్దుకున్నారు. చర్చి రెండుగా చీలి క్రైస్తవులు రోమన్ కాథెలిక్కులు (పూర్వాచార) మరియు ప్రొటెస్టెంట్‌లు (సంస్కరణవాద) గా విడిపోయారు.

ప్రొటెస్టెంట్ ఉద్యమ ఫలితంగా కాథలిక్కులు కూడా ఇగ్నేషియా లయోలా నాయకత్వంలో తమలోని లోటుపాట్లను సరిదిద్దుకోవటంతో (ప్రతిసంస్కరణోద్యమం) క్రైస్తవ మతసంస్కరణ సంపూర్ణమైనది.

టర్కులు బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం వలన పై విధంగా ఐరోపాలో సంభవించిన సామాజిక వికాసం తిరిగి వలసల స్థాపన, పారిశ్రామిక విప్లవం, నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు లాంటి తదనంతర పరిణామాల రూపంలో విశ్వవ్యాప్తమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసింది. ఆ పరిణామాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.......(సశేషం)


26, జూన్ 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---6





జాతిగత స్వభావం

ఇక్కడ ఒక ముఖ్యవిషయం చెప్పుకోవాలి. ఆదేమంటే కాపిటలిష్టు విప్లవాలు రాజ్యశక్తికి వ్యతిరేకంగా జరిగాయి. రాజ్యశక్తికి ఇస్లాం కేంద్రబిందువు. దానిని ఇస్లాం పెంపొందించింది. కానీ పెట్టుబడిదారీ విప్లవాలేవీకూడా రాజరికానికి వ్యతిరేకంగా జరిగినా కూడా అవి ఇస్లామిక్ దేశాలలో జరగలేదు. ఇక్కడ మనం ఒక ప్రధాన విషయం గుర్తించాలి. ఇస్లాంకానీ, కాపిటలిజం కానీ,తదనంతరం తలయెత్తిన కమ్యూనిజం కానీ మానవాళినంతటినీ ఉద్దేశించినవి. ఐతే ఇవి ఆయాజాతుల జాతిగత స్వభావాన్ననుసరించి ఒక్కొక వ్యవస్థను ఒక్కొక జాతి ఏర్పరచి మిగతా ప్రపంచమంతా వ్యాప్తినొందటానికి ప్రయత్నించాయి.ఇక్కడ మానవుడు సామాన్య విషయం (Common Factor). ఎక్కడైనా మానవుడే ఈ సమస్యలను ఎదుర్కొని పరిష్కారానికి పూనుకున్నాడు.

ఇస్లాం ఆవిర్భావానికి ముందు ఆటవిక బర్బరజాతుల అరాచకానికి గురయ్యింది ప్రధానంగా యూరప్. (ఆనాటి ప్రపంచమంతా ఇవి ఆగడాలు చేసినా సర్వ విధ్వంసం సృష్టించినది మాత్రం యూరప్‌లోనే)ఐతే దీనికి విరుగుడుగా ఇస్లాం ఆవిర్భవించింది అరేబియాలో. అలాగే రాజ్యశక్తి మితిమీరిన భూస్వామ్యవ్యవస్థ వ్యవస్థీకృతమైనది, సిద్ధాంతీకరింపబడినది ఇస్లామిక్ దేశాలలో. కానీ ఈ మితిమీరిన రాజ్యశక్తికి వ్యతిరేకంగా విప్లవాలు చెలరేగి కాపిటలిజం ఏర్పడినది ఐరోపాలో. అలాగే కాపిటలిజం మితిమీరి పచ్చిదోపిడీదారీగా మారినది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ ఐరోపాలో మరియు దాని వలసలలో. ఐతే దీనికి వ్యతిరేకంగా కమ్యూనిష్టు విప్లవం వచ్చింది రష్యాలో;తదనంతరం చైనాలో. ఇవి రెండూ అప్పటీకి రైతు రాజ్యాలే.ఫ్యూడల్ వ్యవస్థలోనే ఉన్నాయి.

అంటే యావత్ మానవాళినంతటినీ ఉద్దేశించిన ఈ పరిష్కారాలు సమస్య తీవ్రంగా ఉన్న చోటకాక మరోచోట కనుగొనబడ్డాయి. వైవిధ్యమైన జాతులున్న విశాల ప్రపంచంలో ఆయాజాతుల జాతిగత స్వభావాన్ననుసరించి కొన్ని జాతులు సమస్యగా పరిణమిస్తే మరికొన్ని జాతులు పరిష్కారాలు కనుగొన్నాయి.అలా కనుగొనడంలో అవి తమతమ దేశాలలోని వ్యవస్థలమీదే పోరాడాయి.

బర్బరజాతులు ఐరోపాను ఛిన్నాభిన్నం చేస్తున్న సమయంలో పటిష్ఠమైన రాజ్యవ్యవస్థను ఏర్పరచి అరాచకాన్ని అణచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఐతే శక్తివంతమైన రాజ్యవ్యవస్థను ప్రపంచంలోనే మేటిగా ఏర్పరచగలిగే విధంగా జాతిగత స్వభావాన్ని కలిగి ఉన్న అరేబియా ప్రాంతంలో ఇస్లాం ఆవిర్భవించింది. ఆ స్వభావాన్ని కలిగిన ఇతర జాతులలో కూడా అది వ్యాపించింది. తిరిగి రాజ్యమే ఒక సమస్యగా పరిణమించినపుడు సమాజ ప్రయోజనాలు ప్రమాదంలో పడినపుడు రాజ్య శక్తిని నిర్వీర్యం చేసే ఆలోచనా విధానం ఏ జాతైతే రాజ్యశక్తిని నిర్మించటం జాతిగత స్వభావంగా కలిగిఉందో అదే జాతిలో ఎలా జనించగలదు?

కనుకనే సమాజ వికాసాన్ని కలుగజేయగలగటాన్ని జాతిగత స్వభావంగా కలిగిన ఐరోపాలో ఆ ఆలోచనావిధానం జనించి తదనుగుణమైన కాపిటలిస్టు విప్లవాలు వచ్చాయి.

సరిగా ఇదే సూత్రం కమ్యూనిజం విషయంలో కూడా వర్తిస్తుంది.సమాజ వికాసం పేరుతో సామాజిక శక్తులు అంటే సామాజికమైన ఉత్పత్తివనరులను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొందరు స్వార్థపరులు పేదప్రజలను దోపీడీ చేస్తుండటంతో సమాజవికాసమే ఒక సమస్యగా పరిణమించి వ్యక్తి ప్రయోజనం ప్రమాదంలో పడినపుడు వ్యక్తి ప్రయోజనాలకొరకు సామాజిక శక్తులకు, సామాజిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే విప్లవాలు, పోరాటాలు సమాజ వికాసాన్ని పెంపొందించడమే జాతిగత స్వభావంగా కలిగిన పశ్చిమ ఐరోపా జాతులలో ఎలా ఏర్పడతాయి?. వ్యక్తి ప్రయోజనాన్ని కాపాడే తత్వాన్ని జాతిగత స్వభావంగా కలిగిన రష్యాలో ఆ మహత్తర కమ్యూనిష్టు విప్లవం (October Revolution) సంభవించింది.

ఈ సమయంలో చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. అదేమంటే ‘మనుషలంతా ఒక్కటే’అనే భావన నేటి ఆదర్శం, నేటి నీతి. మరి ఈ వివిధ జాతులు వివిధ జాతిగత స్వభావాలను కలిగి ఉంటాయనేది ఎంతవరకు నిజం?

మనుషులు మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, శరీర వర్ణం పేరుతో ఒకరినొకరు ద్వేషించటానికి, నాశనం చేసుకోవటానికి పూనుకున్నపుడు దానికి ప్రతిక్రియగా ‘మనుషలంతా ఒక్కటే’లాంటి నీతులు పుట్టాయి. కానీ ఈ వైషమ్యాలను కాసేపు పక్కన పెట్టి చూస్తే ఈ విశాల ప్రపంచంలో ఉన్న అనేక జాతులలో మౌలికంగా ఆలోచనావిధానంలోగానీ, జీవనవిధానంలోగానీ, తాత్వికచింతనలోగానీ మార్పు ఉన్నది. దానికి కారణం ఆయా జాతులలో ప్రతి ఒకటి తనదైన స్వభావాన్ని కలిగి ఉన్నది. రోజువారీ జీవితంలో విడివిడి వ్యక్తుల ప్రవర్తన వారు ఏ జాతికి చెందిన వారైనా బాహ్యదృష్టికి ఒక్కలాగే ఉంటుంది. కానీ విశాల దృష్టితో చూచినపుడు అంటే ఒక జాతి మొత్తాన్ని సుధీర్ఘకాలంలో దానియొక్క మనుగడను పరిశీలిస్తే ఆ జాతికే విశిష్టమైన ఒకానొక ప్రవర్తనావిధానం, పోకడ, తీరుతెన్ను ఉంటాయి.దానికి కారణం ఆ జాతికి తనదైన జాతిగత స్వభావం ఉండటమే.

ఫ్రాచ్యము-పాశ్చాత్యము (East and West)

ఇప్పుడు తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్యగల తేడాలను స్థూలంగా ఒకసారి పరిశీలిద్దాం. ప్రాచ్య దేశాల (Asian Countries)లో పారమార్థిక చింతన అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రసిద్ధ మతాలు ఆసియాలోనే జన్మించాయి. వాటిని స్థాపించిన మహాపురుషులలో బుద్ధుడు నేపాల్‌లో, వర్థమాన మాహావీరుడు, గురునానక్ భారతదేశంలో, కన్‌ఫ్యూషియస్ చైనాలో, జీసస్ దూరప్రాచ్యంలో, జొరాస్టర్ పర్షియాలో జన్మించారు.

ఒక్క పారమార్థిక ధోరణి మాత్రమేకాదు; మధ్య యుగపు ప్రపంచ విజేతలందరూ ఆసియా వారే.

పాశ్చాత్య దేశాల (Westren Countries)లో ఐహిక చింతన అధికంగా ఉంటుంది.ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎక్కువగా యూరోపియన్ జాతులకు చెందిన వ్యక్తులే రూపొందించారు. నేటి పాలనా వ్యవస్థ రూపుసంతరించుకున్నది ఐరోపాలోనే. ప్రజాస్వామ్యం, జాతీయభావం, సామ్యవాదం మొదలైనవి ఐరోపాలోనే జన్మించాయి. నేటి ఆధునిక జీవన విధానం ఐరోపాలోనే రూపుదిద్దుకున్నది.

ప్రపంచంలో ప్రాచ్యము, పాశ్చాత్యము అనేది స్థూలమైన విభజన. సూక్ష్మంగా చూస్తే ఇవే కాక ఇంకా అనేక జాతులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా తనదైన జాతిగత స్వభావాన్ని కలిగి ఉన్నది.

ఈ విధంగా విశాల ప్రపంచంలోని వివిధ జాతులలో ఆయా జాతులు తమతమ జాతిగత స్వభావాలననుసరించి ఒక్కొక్క వ్యవస్థకు అంటే కొన్ని జాతులు ఇస్లాంకు, మరికొన్ని జాతులు కాపిటలిజానికి, అలాగే మరికొన్ని జాతులు కమ్యూనిజానికి ప్రాతినిథ్యం వహించాయి. తమ కనుగుణమైన వ్యవస్థలను తమవంతు వచ్చినపుడు నెలకొల్పాయి.

దీనికనుగుణంగానే సమాజవికాసాన్ని ఉద్దేశించిన లేక సమాజ ప్రయోజనాలను ఉద్దేశించిన కాపిటలిష్టు వ్యవస్థ ఐరోపాలో తలయెత్తినది. ఇది కూడా మానవాళినంతటినీ ఉద్దేశించిన సామాజిక, రాజకీయ వ్యవస్థే. ఈ వ్యవస్థ గురించి చెప్పుకోవటానికి ముందు ఇది తలయెత్తటానికి ముందున్న నేపథ్యం గురించి చెప్పుకోవాలి. అరాచకాన్ని నిరసిస్తూ రాజ్యశక్తికి ప్రాతినిథ్యం వహిస్తూ ఇస్లాం పశ్చిమ ఆసియా, మధ్య ఆసియాలలో తలయెత్తితే మితిమీరిన రాజ్యశక్తికి నిరసనగా సమాజవికాసానికి ప్రాతినిథ్యం వహిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ ఐరోపాలో తలయెత్తినది. ఐతే ఇస్లాంకు మరియు పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మించబోయే ఐరోపాకు సిద్ధాంతపరంగా ప్రత్యక్ష యుద్ధమేమీ జరగలేదు. ఇస్లాం కూడా ఫ్యూడలిజమేకానీ ఐరోపాలోని ఫ్యూడల్ వ్యవస్థలను కూలదోసి మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థ జనించినది.

(ఈ రెండు శిబిరాల మధ్యన క్రూసేడులు జరిగినా అవి కేవలం మత ప్రాతిపదికనే తప్ప రాజకీయ సిద్ధాంత పరంగా జరగలేదు. అప్పటికి ఐరోపా ఇంకా చీకటి యుగంలోనే ఉన్నది. పెట్టుబడిదారీ భావజాలం ఆసమయానికి ఇంకా అక్కడ రూపుదిద్దుకోలేదు.)


(మూడు వ్యవస్థలలో కూడా ఒక్క కమ్యూనిజం మాత్రమే కాపిటలిజం మీద ప్రత్యక్షంగా సుద్ధీర్ఘమైన వాదోపవాదాలకు పూనుకున్నది. కాపిటలిజం మాత్రం ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా సిద్ధాంతచర్చలు చేసినా అవేవీ కూడా ఇస్లాంకు వ్యతిరేకంగా కాక తమదేశాలలోని భూస్వామ్య వ్యవస్థమీదే కేంద్రీకరింపబడ్డాయి. ఇక ఇస్లాం జనించేటపుడైతే సిద్ధాంతం పరోక్షంగా, తాత్వికంగా, ఆధ్యాత్మికంగా చెప్పబడిందేకానీ ప్రత్యక్షంగా చెప్పబడలేదు.)

ఐరోపాలో భూస్వామ్యవ్యవస్థ

ఐతే ఇస్లామిక్ ఫ్యూడలిజానికి ఐరోపాలో మధ్యయుగాలలో నెలకొన్న ఫ్యూడలిజానికి హస్తిమశకాంతరమైన తేడా ఉన్నది.ఇస్లాంలో రాజు సర్వశక్తిమంతుడు.కానీ ఐరోపా ఫ్యూడల్ వ్యవస్థలో రాజు స్థానిక భూస్వాముల చేతిలో కీలుబొమ్మ. ఎందుకంటే ఇతని చేతిలో సిద్ధ సైన్యం ఉండేది కాదు. యుద్ధ సమయంలో అతనికి కావలసిన సైన్యాన్ని ఈ భూస్వాములు సమకూర్చేవారు.రాజు యొక్క ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని స్వార్థపరులైన ఈ భూస్వాములు రాజునుండి అనేక రాయితీలు పొందేవారు.

క్రూసేడ్‌ల సమయంలో ఆసియాలో ఇస్లామిక్ రాజుల తిరుగులేని అధికారాన్ని గమనించిన ఐరోపా రాజులు తమదేశాలలో కూడా అటువంటి నిరంకుశ రాచరిక వ్యవస్థలను ఏర్పరచుకోవాలని కాంక్షించారు. చివరకు నూతనంగా స్థాపించిన వలసలతో వర్తక, వాణిజ్యాలు అభివృద్ధిచెంది సంపన్న మధ్య తరగతి ఆవిర్భవించడంతో వీరిసహాయంతో ఐరోపా రాజులు భూస్వాముల పీచమణచి నిరంకుశ రాచరికాలను (Enlightened Despotism) స్థాపించారు.

కానీ కాలక్రమంలో ఒకనాడు భూస్వాములను అణచడానికి రాజుకు సహాయంగా నిలబడిన ఈ అవకాశవాద బూర్జువా (సంపన్న మధ్యతరగతి) వర్గం వారి పీడ విరగడవ్వగానే ఈ నిరంకుశ రాచరికాలకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసి పెట్టుబడిదారీ వ్యవస్థకు రాజకీయ రూపమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థను క్రమంగా నెలకొల్పింది.

ఇప్పుడు ఐరోపాలో సామాజిక వికాసం ఎలా సంభవించినదీ మరియూ ఆ వికాసం పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసి అది ప్రపంచమంతా ఎలా వ్యాప్తి పొందినదీ అనే విషయాన్ని సవివరంగా పరిశీలిద్దాం.......(సశేషం)


భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---5





సమస్యగా పరిణమించిన పరిష్కారం

మొదటే చెప్పినట్లుగా ఇస్లాం అనేది అప్పుడు నెలకొన్న సామాజిక పరిస్థితులకు ప్రతిక్రియగా తలయెత్తినది. అప్పట్లో రాజ్యవ్యవస్థ యొక్క ప్రయోజనాలకు విపత్తు వాటిల్లింది. నిజానికి వ్యవస్థలో ‘రాజ్యం’, ‘సమాజం’, ‘వ్యక్తి’ అనే మూడు అంగాలున్నా అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజ్య వ్యవస్థకు మాత్రమే ప్రమాదం వాటిల్లినట్లుగా భావించబడింది. అందువలన సక్రమమైన వ్యవస్థకు మూడింటి ప్రయోజనాలూ సమంగా నెరవేరవలసి ఉన్నా కూడా రాజ్యం యొక్క ప్రయోజనాలను మాత్రమే ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఇస్లాం ఆవిర్భవించింది.దీనికి అనుగుణంగానే ఇస్లాంలో అతి శక్తివంతమైన రాజ్యవ్యవస్థ ఏర్పడింది.

‘రాజ్యం’ రీత్యా ఇస్లాం అఖండ విజయాలు సాధించినా వ్యవస్థలోని మిగతా అంగాలైన ‘సమాజం’ మరియు ‘వ్యక్తి’ ల యొక్క ప్రయోజనం నెరవేరలేదు.

ఐతే ఈసారి కూడా చరిత్ర పునరావృతమైనది. అరాచక పరిస్థితులలో ‘రాజ్యం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే ప్రమాదంలో పడినట్లుగా ఏవిధంగా భావించబడిందో అదేవిధంగా ఇస్లామిక్ వ్యవస్థలో ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు మాత్రమే ప్రమాదంలో పడినట్లుగా గోచరించింది.

‘వ్యక్తి’ ప్రయోజనాలు మరుగున పడటం ఇక్కడ ఒక దోషమైతే ‘రాజ్యం’ ఒక దోషిగా ఆవిష్కృతమైనది. అంటే ‘వ్యక్తి’ ప్రయోజనాలు ఇంకా తెరమీదకు రాలేదు. ‘రాజ్యం’ ప్రయోజనాలు తెరమరుగయ్యాయి. ‘సమాజం’ యొక్క ప్రయోజనాలు కొత్తగా తెరమీదకు వచ్చాయి. ఇక్కడ రాజ్యమే ఒక సమస్యగా పరిణమించింది. అరాచకం ఒక సమస్య ఐనపుడు దానికి పరిష్కారంగా ‘రాజ్యం’ ఆవశ్యకత గుర్తించబడినది. కానీ అదే ‘రాజ్యం’ మితిమీరినపుడు పూర్తిగా వ్యతిరేకించబడినది. స్వయంగా తానే ఒక సమస్యగా గుర్తించబడింది.

ఇస్లాంలో శక్తివంతమైన రాజ్యవ్యవస్థ నాణానికి ఒక పార్శ్వమైతే, అది సామాజిక వికాసాన్ని మరియు వ్యక్తి స్వేచ్ఛను నిర్లక్ష్యం చేయటం రెండవ పార్శ్వం. వాస్తవానికి సమాజం, వ్యక్తి అనే రెండు అంగాలూ నిర్లక్ష్యం చేయబడ్డా బాహ్యదృష్టికి సమాజం ప్రయోజనాలు మాత్రమే ప్రమాదంలో పడినట్లుగా గోచరించినది. రాజ్యం యొక్క మితిమీరిన అధికారం వలన, నిర్బంధం వలన సమాజం యొక్క వికాసం కుంటుపడింది. అధికారం రాజ్యం యొక్క లక్షణమైతే, అభ్యుదయం సమాజం యొక్క లక్షణం. వికాసమే సమాజానికి కావలసినది. ఐతే రాజ్యం యొక్క మితిమీరిన చర్యలవలన సమాజవికాసానికి అది విపత్తుగా పరిణమించింది.దీనితో ఒకప్పుడు రాజ్యాన్ని పరిష్కారంగా గుర్తించిన ప్రతిక్రియాత్మకమైన మానవదృష్టికి ఇప్పుడు అదే రాజ్యం ఒక సమస్యగా గోచరమైనది.

అరాచకమనే సమస్యకు పరిష్కారంగా రాజ్యశక్తి నిర్మాణాన్ని ఇస్లాం ప్రతిపాదించి ఆచరించి చూపింది. కానీ కాలగతిలో ఆచరణలో రాజ్యశక్తే ఒక సమస్యగా, ఒక పీడగా పరిణమించినది. ఇస్లాంలో వడ్డీ వ్యాపారం చేయకూడదు, పరులను హింసించకూడదు, పరులను హత్యచేయకూడదు, దయతో మెలగాలి లాంటి సమాజాన్ని మరియు తోటి మనిషిని ఉద్దేశించిన బోధనలున్నాయి. ఐతే తాత్వికంగా ఇస్లాం రాజ్యశక్తిని మాత్రమే ఉద్దేశించినది. కనుకనే వ్యవస్థలోని మిగతా అంగాలైన సమాజం మరియు వ్యక్తిలకేమీ ప్రయోజనం సమకూరలేదు. పైగా ఆయా అంగాలు మితిమీరిన రాజ్య శక్తివలన ప్రమాదంలో పడ్డాయి.

ఇస్లాం యొక్క మౌలిక సిద్ధాంతాలు తప్ప ఇస్లామిక్ పాలనలో రాజ్యాంగమంటూ ఏమీ ఉండదు. ‘రాజ్యాంగం’ అనేది తదనంతరకాలంలో రూపుదిద్దుకున్న భావన. అంతా రాజు యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలమీదే ఆధారపడి పరిపాలన జరిగేది. న్యాయపరమైన, సైనికపరమైన, పరిపాలనాపరమైన అన్ని అధికారాలూ రాజు చేతిలోనే ఉండేవి. అతను ఇతరులనుండి సలహాలు తీసుకున్నా అది నామమాత్రమే.అంతిమ నిర్ణయం రాజుదే. శిరచ్ఛేధం, కాళ్ళు చేతులు నరికి వేయటం, రాళ్ళతో కొట్టి చంపడం, బతికి ఉండగా చర్మం వలిపించటం లాంటి క్రూరమైన శిక్షలు సాధారణంగా అమలవుతుండేవి.

ఇస్లాంకి పూర్వం ప్రపంచంలో రాజ్యపాలన పారమార్థిక చింతనతోకూడిన మతం యొక్క, మతపెద్దల యొక్క బోధనల ప్రభావంతో సాగుతుండేది. కానీ ఇస్లాంలో ఐహిక విషయమే మతం స్థాయికి తీసుకురాబడినది. అల్లా ఒక్కడే దేవుడు, అందరూ అతనికి మాత్రమే విధేయులై ఉండాలి, విగ్రహారాధన చేయకూడదు-అనేదే ఇస్లాం అనే ఉద్యమానికంతటికీ మౌలిక సూత్రం. తరచి చూస్తే ఈ సూత్రం ఐహికమైనదే కానీ పారమార్థికమైనది కాదు. అది రాజ్యశక్తినే సూచిస్తున్నది. దాని యెడల విధేయతనే ప్రతిపాదిస్తున్నది. ఇస్లామిక్ దాడులు, ఆక్రమణలు, బలవంతపు మతమార్పిడులు, పరిపాలన అంతా ఈ సూత్రం కొరకే, దాని ప్రేరణతోనే, అది ఇచ్చిన ఆవేశంతోనే జరిగాయి. ఇస్లాం అరాచకం మీద కత్తిగట్టింది. దానిమీద విజయం సాధించింది. పటిష్ఠమైన రాజ్యశక్తిని నిర్మించినది. ఆ ఊపులో అది సమాజాన్ని, వ్యక్తిని విస్మరించింది.

వికాసానికి తగిన స్వేచ్ఛను కలిగి ఉండడమే ‘సమాజం’ యొక్క ప్రయోజనం. ఆ మేరకు సమాజం మీద ‘రాజ్యం’ యొక్క నియంత్రణ సడలింపబడాలి. ‘వ్యక్తి’ ప్రయోజనమేమిటంటే సమాజాన్ని తన శ్రేయస్సుకు అనుగుణంగా వ్యవస్థీకరించడం లేక తన శ్రేయస్సు కు అనుకూలంగా ఉన్న సమాజంలో జీవించడం. బాహ్యాంతర్గత విద్రోహ శక్తులనుండి ఈ రెంటినీ కాపాడటమే, ఈ రెండు పరిస్థితులు నెలకొనేటట్లు చూడటమే ‘రాజ్యం’ యొక్క కర్తవ్యం మరియు దాని యొక్క ప్రయోజనం. మితమైన రాజ్య శక్తి మాత్రమే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలదు. అట్లుగాక రాజ్యశక్తి కొరవడినా లేక మితిమీరినా ఇది నెరవేరదు. ఇస్లాంలో రెండవ పరిస్థితి ఏర్పడింది.

వ్యాపార వాణిజ్యాల్లాంటి పరస్పర చర్యలు, నాగరికతా వ్యాప్తే సమాజ వికాసానికి ఆయువుపట్టు. నిరంతరం యుద్ధాలతో అల్లకల్లోలంగా ఉండే ఆనాటి పరిస్థితిలో సమాజం వికసించలేకపోయింది. వ్యాపార వాణిజ్యాలన్నీ సమాజ వికాస దృష్టిలేని నిరంకుశ రాజుల కరకు శాసనాలకు విధేయత చూపుతూ ఆ పరిమితిలోనే జరిగేవి. నాడు ప్రజాజీవితాన్ని రాజ్యం డామినేట్ చేసింది. నిరంతరం మారే రాజ్యపు సరిహద్దులు, నిరంతరం శత్రుదాడులు, యుద్ధాలు, ఆక్రమణలు. యుద్ధసమయంలో సైనికులు ప్రజల ధన, మాన, ప్రాణములను కొల్లగొట్టేవారు. ఇటువంటి పరిస్థితిలో సమాజవికాసానికి అవకాశమేలేదు. ఇస్లాం అనేది వ్యవస్థీకృత ఫ్యూడలిజం. ఇది అరాచకాన్ని అణచి ప్రపంచానికి పటిష్ఠవంతమైన, చక్కటి రాజ్యశక్తినందించి ఎంత మేలు చేసిందో, అదే రాజ్య శక్తి మితిమీరటం వలన, కేవలం దానిమీదే దృష్టి పెట్టబడటం వలన ‘సమాజం’, ‘వ్యక్తి’ నిర్లక్ష్యం చేయబడటం వలన మానవాళికి అంతే హానికరంగా పరిణమించింది. ఫ్యూడలిజం(ఇస్లాం)లో ప్రధానంగా ‘సమాజం’ మీద ప్రత్యక్ష దాడి జరిగినది. దానితో ‘సమాజం’ ప్రమాదంలో పడినట్లుగా భావించబదింది.

దీనితో మానవుడు రాజ్యశక్తికి వ్యతిరేకంగా, సమాజ వికాసానికి అనుకూలంగా ఆలోచించటం ప్రారంభించాడు. రాజ్యాన్ని సంకెలగా భావించాడు. ఈ ఆలోచనలే పెట్టుబడిదారీ వ్యవస్థ (Capitalism) కు బాటలు పరిచాయి. ఈ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మౌలిక సిద్ధాంత గ్రంథం రూసో అనే తత్వవేత్త రచించిన ‘సోషల్ కాంట్రాక్ట్ ’ (Social Contract) అనే గ్రంథం. ఈ గ్రంథమే ‘ఫ్రెంచ్ విప్లవం ’(French Revolution)నకు ప్రేరణగా నిలచినది.

ఈ గ్రంథం ప్రకారం రాజ్యం అనేది ఒక 'సామాజిక ఒడంబడిక ’ (Social Contract). ఫ్యూడల్ వ్యవస్థలో రాజ్యం 'దైవదత్తమైన అధికారం’(Devine Right of The Emperor) గా భావించబడింది. ఈ భావనకు వ్యతిరేకంగా ఈ గ్రంథంలో రాజ్యం ఒక సామాజిక ఒడంబడిక గా భావించబడింది. ఒడంబడిక అనేది ఇరువురు సమానస్థాయి వారి మధ్యన జరుగుతుంది. అంటే రాజు ప్రజలకన్నా ఏ విధంగానూ గొప్పవాడు కాదనీ, వారితో సమాన స్థాయి కలవాడేననీ, అతనికి ఎటువంటి దైవత్వం లేదనీ భావన. మరొక విషయం ఏమంటే రాజుకి ఆ అధికారం ప్రజలు అతనితో ఒప్పందం చేసుకోవటం వలననే సంక్రమించినది కనుక ఆ అధికారం ప్రజలు ఇచ్చినదేకాని అది దైవదత్తమైనది కాదు అని కూడా భావన.

ఈ గ్రంథం యొక్క ప్రారంభ వాక్యం చాలా ప్రసిద్ధమైనది. ‘మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు. కానీ ఎక్కడ చూచినా సంకెళ్ళతోటే కనిపిస్తున్నాడు’ అనేదే ఆ వాక్యం. ఈ సంకెలలు మితిమీరిన రాజ్యశక్తిని ఉద్దేశించినవే కానీ మరేవీ కావు.

‘ఫ్రెంచ్ విప్లవం’ పెట్టుబడిదారీ వ్యవస్థ కొరకు, రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగిన విప్లవాలలోకెల్లా అతిముఖ్యమైనది మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇది ఫ్రాన్స్ దేశంలో 1789వ సం||లో సంభవించినది. ఈ విప్లవ సమయంలోనిదే అత్యంత ప్రసిద్ధి పొందిన నినాదం ‘స్వేచ్ఛ’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతృత్వం’ (Liberty, Equality, and Fraternity). పెట్టుబడిదారీ దేశాలకు చెందిన జాతీయ పతాకాలలోని (మన తిరంగా కూడా) త్రివర్ణాలకు ఈ మూడు మాటలే ప్రతీకలు. ఈ మూడు భావాలు కూడా రాజ్యశక్తికి వ్యతిరేకంగా రూపొందినవే. రాజ్యం వలన స్వేచ్ఛ గానీ, సమానత్వంగానీ, సౌభ్రాతృత్వం గానీ లభించటంలేదని భావించబడింది. కనుక వీటి కొరకు ఆ రాజ్యశక్తి అపరిమితంగా ఉండే రాచరికాలను కూలదోసి సమాజవికాసానికి దారితీసే పెట్టుబడిదారీ వ్యవస్థలను ఏర్పరచాలని భావించబడింది.....(సశేషం)


25, జూన్ 2008, బుధవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---4





ఇస్లాం సిద్ధాంతం మరియు ఉద్యమ వ్యాప్తి

ఇస్లాం యొక్క ప్రధాన సిద్ధాంతం ‘అల్లా ఒక్కడే దేవుడు. అతనికి మాత్రమే అందరూ విధేయులై ఉండాలి’.

ఇస్లాం అంటే లోబడుట, ముస్లిం అంటే లోబడినవాడు అని అర్థం. ఇస్లాం అల్లాని రాజ్య శక్తికి, రాజ్యాధికారానికి, రాజ్య వ్యవస్థకు ప్రతీకగా భావించినది. (రాజ్యాన్ని దైవస్వరూపంగా భావించడం, రాజ్యాధికారాన్ని దైవదత్తమైనదిగా భావించడం భూస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణం The Devine Right of The Emperor) అల్లా ఒక్కడే దేవుడు అనటంలో ఒకే ఒక కేంద్రీకృత అధికారానికి ప్రజలను విధేయులుగా చేయటానికి ఇస్లాం ప్రయత్నిస్తున్నది. అంటే ‘రాజ్యవ్యవస్థకు మాత్రమే అందరూ విధేయులై లోబడి ఉండాలి. అన్యమైన దేనికీ విధేయత చూపరాదు ’ అనే దీని యొక్క అర్థం. ఆచరణలో కూడా ఈ సిద్ధాంతం పటిష్ఠంగా అమలు పరచబడినది.

ఇస్లామిక్ వ్యవస్థలో రాజ్యశక్తి అప్రతిహతమై వెలుగొందింది. ఇస్లాం మూర్తి ఆరాధనను లేక విగ్రహారాధనను ఖండించినది. ఎందుకంటే భగవంతునికి రూపం ఈయటం ప్రారంభించిన తరువాత ఎవరికి నచ్చిన రూపం వారు ఈయటం వలన అది అనేక రూపాలకు దారితీస్తుంది. అది అనేక దేవతా ఉపాసనకు దారితీస్తుంది. దానితో అల్లా ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతానికి విఘాతం కలుగుతుంది. అంటే విగ్రహారాధన అల్లా యెడల అవిధేయతకు చిహ్నం. అందుకనే ఇస్లాం విగ్రహారాధకులను తీవ్రంగా వ్యతిరేకించినది. వారిని ‘కాఫిర్లు ’ అని పిలిచింది. అల్లా కేంద్రీకృత అధికారమైన రాజ్యశక్తికి ప్రతీక కనుక అనేక దేవతారాధన తాత్వికంగా అరాచకానికి, రాజ్యశక్తి నిర్వీర్యమవటానికి దారితీస్తుంది. ఇస్లాం ఆవిర్భవించిందే పటిష్ఠమైన రాజ్యవ్యవస్థను ఏర్పరచటానికి కనుక అందుకు వ్యతిరిక్తమైన దేనినీ ఇస్లాం క్షమించదు.

మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఇస్లాం ప్రధానంగా మానవజాతినంతనూ ఉద్దేశించినది కనుక ప్రపంచాన్నంతటినీ ఇస్లామిక్ వ్యవస్థగా మార్చడానికి తిరుగులేని ప్రయత్నాన్ని ఆరంభించింది.

ఇస్లాం అరేబియాలో జనించినది. మొట్టమొదట ఇస్లామిక్ వ్యాప్తి పశ్చిమదిశగా కొనసాగింది. ఆఫ్రికా ఖండంలో సహార ఎడారికి ఎగువన ఉన్న అని దేశాలు ప్రతిఘటన లేకుండా ఇస్లాంకు లోబడిపోయాయి. పశ్చిమదిశలో అట్లాంటిక్ మహాసముద్రం మాత్రమే ఇస్లాం వ్యాప్తిని ఆపగలిగింది. తరువాత జిబ్రాల్టర్ జలసంధిని దాటి యూరప్‌లో అడుగుపెట్టిన ఇస్లామిక్ సైన్యం స్పెయిన్‌ను జయించి ఫ్రాన్సులో ఓటమి చవిచూచింది.అజేయమైన ఇస్లాం చీకటియుగంలో మగ్గుతున్న ఫ్రాన్సు చేతిలో ఓటమి పొందటం చారిత్రక వైచిత్రి. దీనివలన రాబోయే కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పెంపొందవలసిన ఐరోపా ఇస్లామిక్ వ్యాప్తినుండి మినహాయింపు పొందినది. ఐరోపాను ఇస్లాం జయించడమన్నది చరిత్రకు అక్కరలేని పరిణామం. చారిత్రక ఘటనలు యాదృచ్ఛికంగా జరగవు; నిర్ధిష్ఠమైన తాత్విక నేపథ్యంతోనే జరుగుతాయనడానికి ఈ సంఘటన ఒక తార్కాణం.

తూర్పుదిశగా మెసపొటేమియా (ఇరాక్), పర్షియా (ఇరాన్), మధ్య ఆసియా, చైనా పశ్చిమ ప్రాంతం మొదలైన ప్రాంతాలన్నింటినీ ఇస్లాం జయించింది. ఆయా ప్రాంతాలన్నింటిలో ఇస్లాం సంపూర్ణంగా వ్యాప్తినొందింది. అప్పటివరకూ అక్కడ వ్యాప్తిలో ఉన్న అన్ని మతాలూ నామరూపాల్లేకుండా తుడుచిపెట్టుకు పోయాయి. చరిత్రలో ఇంత స్వల్ప కాలంలో, ఇంతటి విస్తారమైన భూభాగం ఒక భావన చేత జయించబడటం, కేవలం జయించబడటమే కాకుండా అదే భావనకు శాశ్వతంగా లోబడి ఉండటం అపూర్వమైన, అద్భుతమైన సంఘటన.

మనమింతకుముందే ఒక విషయం చెప్పుకున్నాం. ఇస్లాం ప్రధానంగా మతం కాదు అని. అది ఒక రాజకీయ, సామాజిక వ్యవస్థ. దాని తీరుతెన్నుల రీత్యా అది మనకు ఓ మతంలా అనిపిస్తుంది. ఇస్లాం ఇతర మతాలవలే శాంతియుతమైన బోధనలకు పరిమితం కాలేదు. రాజ్యవ్యవస్థనుండి, రాజ్యాధికారాన్నుండి ఇతరమతాలవలే వేరుగా కొనసాగలేదు. సాధారణంగా అన్ని మతాలూ ప్రచారం మరియు వ్యాప్తి కొరకు రాజాశ్రయం పొందాయేగానీ స్వయంగా రాజ్యాధికారాన్ని పొందటం జరగలేదు. కానీ ఇస్లాం ఇందుకు భిన్నం.

మహమ్మద్ ప్రవక్త స్వయంగా ఒక సమర్ధుడైన సేనాని. ఇస్లాం సిద్ధాంతాన్ని, అది వ్యాప్తిచెందవలసిన విధానాన్ని ఈయనే ఒక ఉదాహరణగా ఆచరించి రూపొందించాడు. కరవాలంతో తన సిద్ధాంతాన్ని వ్యతిరేకించినవారిని జయిస్తూ, జయింపబడిన ప్రాంతాల్లో రాజ్యాధికారాన్ని నెలకొల్పి ఏలుబడిసాగిస్తూ, ఇస్లాంను వ్యాపింపచేసి,రాజ్యవిస్తరణకు పూనుకొని తిరిగి ఆయా ప్రాంతాలన్నింటిలో ఇస్లాం వ్యాపింపచేసేవారు. ఆయన తదనంతరం కూడా ఇదే తరహాలో ఇస్లాం యొక్క వ్యాప్తి జరిగినది.

(భారతదేశంలోని శిఖ్ఖు మతం ఒక్కటే సైనిక ప్రవృత్తిలో ఇస్లాంను పోలి ఉంటుంది.)

సుదీర్ఘమైన ఇస్లాం పయనంలో దాని వ్యాప్తికి అనేక ప్రాంతాలకు చెందిన అనేక జాతులు నాయకత్వం వహించాయి. మొదట ఇస్లాం జనించిన అరేబియాలోని అరబ్‌లు ఈ ఉద్యమ వ్యాప్తికి నాయకత్వం వహించారు. తదనంతరకాలంలో ఈ స్థానాన్ని పర్షియన్‌లు భర్తీ చేసారు.తరువాత మధ్య ఆసియా వాసులు, ఆ తదుపరి ఆఫ్ఘన్‌లు, ఆ పిమ్మట ఆటోమన్ టర్కులు; ఇలా ఒకరి తరువాత ఒకరు నాయకత్వం వహిస్తూ సుదీర్ఘమైన ఇస్లామిక్ ప్రస్థానం కొనసాగింది.

ఇస్లాం సమర్థవంతమైన పాలనా వ్యవస్థను ఏర్పరచింది. దేశంలో అరాచక శక్తులను అణచి అంతర్గత శాంతిభద్రతలను కాపాడింది. ఒక ప్రాంతంలోని విజ్ఞానాన్ని మిగతా అన్ని ప్రాంతాల్లోని ప్రజలు తెలుసుకునేటట్లుగా వ్యాపింపజేసింది. విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి, వ్యాప్తికి దోహదపడింది. వాస్తుశాస్త్రం, కళలు ఇత్యాది వాటిని ప్రోత్సహించింది. గొప్ప గొప్ప కట్టడాలను నిర్మించినది. చరిత్రని గ్రంథస్థం చేయటంలో ఇస్లాం ఎనలేని శ్రద్ధను తీసుకున్నది.

ఇకపోతే ఇస్లామిక్ దాడులు, వారు ఇతరదేశాలను ఆక్రమించటం అనేవి అధికార దాహంతోనో లేక ఏ ఒక్కరి కీర్తి ప్రతిష్ఠల కోసమో జరగలేదు. సమజంలోని అస్తవ్యస్థ పరిస్థితులను గమనించిన మీదట ఒకానొక సిద్ధాంతాన్ని వారు పరిష్కారంగా భావించారు. ప్రపంచ ప్రజలందరినీ ఆ పరిష్కారం ద్వారా రక్షించాలనుకున్నారు. దానినే వారు ఆచరించారు.

ఏ సమాజంలోనైనా అత్యున్నత స్థాయి వ్యక్తులు అందరి మంచికోసం కొన్ని కట్టుబాట్లు,నీతినియమాలు, విధివిధానాలు ఏర్పరచి అవి సమాజంలోని అట్టడుగు వ్యక్తి సైతం-(ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి స్థాయికి అవి ఆచరించడం ఇష్టం లేఖపోయినా) అధికారంతో శాసించి బలవంతంగానైనా-ఆచరించేటట్లు చేయటమే రాజ్యవ్యవస్థ యొక్క మౌలిక ఉద్దేశం.కనుక ఇస్లాం వ్యాప్తి కొరకు వారు ఇతర రాజ్యాలను ఆక్రమించడం, ఆక్రమిత ప్రాంతాలలో బలవంతంగా మతమార్పిడికి పాల్పడటం తప్పుకాదు.అదంతా వారు మంచి అని భావించినదానిని అందరికీ అందివ్వటం కొరకే అలా ప్రవర్తించారు.

ఈ ఉద్యమ ఫలితంగా, ఈ జైత్రయాత్రల కారణంగా ఒక్క భారతదేశం తప్ప ఇస్లాం ఆక్రమణలోకి వచ్చిన అన్ని ప్రాంతాలూ నూటికి నూరు శాతం ఇస్లామిక్‌గా మారిపోయాయి. (ఒక్క భారతదేశాన్ని మాత్రం ఇస్లాం రాజకీయంగా, సైనికంగా మాత్రమే జయించగలిగింది కానీ మత వ్యాప్తిని అంతగా చేయలేకపోయింది. అంటే ఇస్లాంకు లొంగిన భారతదేశం ఇస్లామీకరణకు లొంగలేదు. ఒక వేళ భారతదేశం ఇస్లామిక్ దాడులను అంతకు ముందు అనాగరిక సంచారజాతుల దాడులను తిప్పికొట్టినట్లుగా ఎదుర్కొని పారద్రోలినట్లైతే భారతీయులకు తమ సనాతన వైదిక జీవనవిధానం లోగల మహత్తరమైన విశ్వాసం ఈ ప్రపంచం ఎదుట ఇంతగా నిరూపితమయ్యేది కాదేమో…!!)…….(సశేషం)


24, జూన్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---3





'ఇస్లాం' నేపథ్యం

ఇస్లాం యొక్క ఆవిర్భావం చరిత్రలో హఠాత్తుగా జరిగినా దీనికి చారిత్రక నేపథ్యం ఉన్నది. అప్పట్లో ప్రపంచమంతా(అప్పటి ప్రపంచమంటే ఇప్పటి ప్రపంచం కాదు.ఈనాటి ప్రపంచంలోని ఉత్తర,దక్షిణ అమెరికా ఖండాలను, ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి దిగువ ప్రాంతం మొదలైన వాటిని మినహాయించాలి. అప్పటికి ఆయా ప్రాంతాలతో ప్రధాన నాగరికత కొనసాగుతున్న మిగతా ప్రాంతానికి సంబంధబాంధవ్యాలు ఏర్పడలేదు.) బర్బర జాతులు అల్లకల్లోలం సృష్టిస్తుండేవి. శకులు, హూణులు, కుషాణులు మొదలైన అనాగరిక సంచార జాతులు ఒకదాని తరువాత ఒకటిగా తలయెత్తి అరాచకం సృష్టించేవి. పటిష్ఠమైన నాగరిక సామ్రాజ్యాలకు ఇవి సంకటంగా పరిణమించాయి. గొప్ప గొప్ప నాగరికతలను ఇవి ధ్వంసం చేసాయి.

పైన పేర్కొన్న జాతులు ప్రధానంగా మధ్య ఆసియా నుండి తలయెత్తేవి. ఇక ఉత్తర ఐరోపా నుండి తలయెత్తిన జాతుల సంఖ్యకు లెక్కేలేదు. ఈ జాతులకు ఏవిధమైన సిద్ధాంతం లేదు. నూతన ఆవాసాల కొరకు నాగరిక రాజ్యాలపై నిరంతరం దాడి చేసేవి. యూరప్‌లోని రోమన్ సామ్రాజ్యం గోథ్‌లు, వాండల్స్ మొదలగు ఉత్తర ఐరోపా అనాగరిక జాతులవలననే కూలిపోయి ఐరోపా చీకటియుగంలోకి నెట్టివేయబడింది. హూణులు కూడా ఈ సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారకులయ్యారు.

(భారతదేశాన్ని కూడా ఈ జాతులు చీకాకు పెట్టాయి. కాని శక్తివంతమైన భారతదేశం ఈ ఆటవిక జాతులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. భారతదేశం చరిత్రలో మొదటిసారిగా అత్యంత నాగరికత, నిర్ధిష్ట సిద్ధాంతం మరియు లక్ష్యం కలిగిన ఇస్లామిక్ దాడులవలనే ఓటమిపాలైనది. భారతదేశం ఒకసారి ఇస్లామిక్ పాలనకు లోనైన తరువాత మాత్రమే ఈ ఆటవిక, అరాచక జాతులలో ఆఖరుది, ఇస్లాం ఆవిర్భవించిన తరువాత తలయెత్తిన ఏకైక అనాగరిక జాతి అయిన మంగోలులు భారతదేశంలో అరాచకం సృష్టించగలిగారు. దీనిని బట్టి ఆనాటికి భారతదేశంలో ఐరోపాలో కన్నా శక్తివంతమైన రాజ్యవ్యవస్థ ఉండేది; అది ఈ అనాగరిక జాతులనుండి ప్రపంచాన్ని రక్షించగలిగేటంత సమర్ధవంతమైనది అని భావించవచ్చు. ఐతే అటువంటి స్పృహే భారతజాతిలో కొరవడినది. తదనంతరకాలంలో ఈ నిష్క్రియాపరత్వానికి భారతజాతి మూల్యం చెల్లించినది.)

ఈ అనాగరిక జాతులనుండి నాగరిక సమాజాన్ని రక్షించే నాథుడేలేడు. అంటే ‘రాజ్యం ‘ ప్రమాదంలో పడింది. అసలు వ్యవస్థలో రాజ్యం, సమాజం, వ్యక్తి అనే మూడు అంగాలుంటాయి. వీటి మూడింటి ప్రయోజనాలూ సక్రమంగా, సమంగా ,సమతుల్యంగా నెరవేరినపుడే అది సరియైన వ్యవస్థ. కానీ పై పరిస్థితిలో ‘రాజ్యం ’ ప్రయోజనాలు నెరవేరకపోవటం ప్రధాన సమస్యగా కనిపిస్తున్నది. ఎందుకంటే అరాచకాన్ని అణచటం, శాంతియుత పరిస్థితులు నెలకొల్పటం రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ సమస్యకు, ఈ అరాచకానికి ప్రతిక్రియగా ఆవిర్భవించినదే ‘ఇస్లాం ’.

ఆనాటి ప్రపంచపు అరాచక పరిస్థితులను మనం పరిశీలించినట్లైతే మానవజాతినంతటనూ ఉద్దేశించి ఒక శక్తివంతమైన రాజ్యవ్యవస్థ ఏర్పడవలసిన ఆవశ్యకత మనకు బోధపడుతుంది. ఇస్లాం విస్తరించిన వేగాన్ని బట్టే మనం ఆనాడు ప్రపంచంలో నెలకొని ఉన్న Political Vacuum ను అంచనా వేయవచ్చు. ఇస్లాం ఆవిర్భావ సమయంలోని ప్రపంచ పరిస్థితులను జవహర్ లాల్ నెహ్రూ తన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ’ గ్రంథంలో అభివర్ణించిన తీరును ఒకసారి పరిశీలిద్దాం.

Before we start on Islam's and the Arab's career of conqest, let us have one brief look around. We have just seen that Rome had collapsed. The old Graeco-Roman civilization had ended, and the whole social structure which it had built up had been upset. The northern European tribes and clans were now coming into some prominence.Trying to learn something from Rome, they were really building up an entirely new type of civilization. But this was just the biginning of it, and there was little of it visible. Thus the old had gone and the new had not taken its place; so there was darkness in Europe. At the eastern end of it, it is true, there was the Eastern Roman Empire, which still fiourished. The city of Constantinople was even then a great and splendid city-the greatest in Europe. Games and circuses took place in its amphitheatres, and there was a great deal of pomp and show. But still the Empire was weakening. There were continuous wars with the Sassanids of Persia. Khusrau the Second of Persia had indeed taken away from Constantinople part of its dominions and even claimed a nominal overlordship over Arabia. Khusrau also conqered Egypt and went right up to Constantinople, but was then defeated by Heraclius the Greek Emperor there. Later, Khusrau was murdered by his own son, Kavadh.

So you will notice that both Europe in the West and Persia in the East were in a bad way. Add to this the quarrels of the Christian sects, which had no end. A very corrupt and quarrelsome Christianity flourished in the West as well as in Africa. In Persia, the Zoroastrian religion was part of the State and was forced on the people. So the average person in Europe or Africa or Persia was disillusioned with the existing religion. Just about this time, early in the seventh century, great plagues swept all over Europe, killing millions of people.

In India, Harsha-Vardhana ruled, and Hiuen Tsang paid his visit about this time. During Harsha's reign India was a strong Power, but soon after, northren India grew divided and weak. Farther east, in China, the great Tang dynasty had just begun its career. In 627 A.C. Tai Tsung, one of their greatest emperors, came to the throne, and during his time the Chinese Empire extended right up to the Caspian Sea in the West. Most of the countries of Central Asia acknowledged his suzerainty and paid tribute to him. Probably there was no centralized government of the whole of this vast empire.

This was the state of the Asiatic and European world when Islam was born. China was strong and powerful, but it was far ; India was strong enough for a period at least, but we shall see that there was no conflict with India for a long time to come ; Europe and Africa were weak and exhausted.

ఇస్లాం ప్రత్యక్షంగా అనాగరిక జాతులమీద కత్తి కట్టక పోయినా ఇస్లాం ఆవిర్భావం వెనుకనున్న తాత్విక నేపథ్యం శక్తివంతమైన రాజ్యవ్యవస్థను ఏర్పరచటమే. ఇస్లాం వలనే ప్రపంచంలో మొట్టమొదటిసారి (మానవాళినంతటినీ ఉద్దేశించిన ) పటిష్ఠమైన రాజ్య వ్యవస్థ ఏర్పడింది. ఇస్లాం ఆవిర్భవం తరువాత ఆటవిక మంగోలులు తలయెత్తినా వారంతా ఒక వంద సంవత్సరాల కాలంలోనే సమసిపోయారు. ఇస్లాం మాత్రం జేగీయమానంగా కొనసాగింది……..(సశేషం)


23, జూన్ 2008, సోమవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---2







మొదటి అధ్యాయం : ప్రపంచ చారిత్రక, రాజకీయ పరిణామాల సంగ్రహ అధ్యయనం

మానవుడు తన ఐహిక జీవితంలోని బాధలకు పరిష్కారాన్ని సాధించటం కొరకు సమస్త మానవ జాతిని ఉద్దేశించి ఒక చక్కని రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పరచాలని ఎన్నో శతాబ్దాలనాడే ప్రయత్నాన్ని ప్రారంభించాడు.ఐతే అప్పటికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు ప్రతిక్రియే పరిష్కారం అనుకొని పొరబడటంవలన, దానినే పరమ సత్యంగా ప్రచారం చేయటం వలన మానవుడు తన అన్ని ప్రయత్నాలలోనూ విఫలం చెందాడు.

ఈ ప్రయత్నానికి పూర్వం మానవుడిలో మానవ జాతినంతటినీ ఉద్దేశించిన రాజకీయ, సామాజిక లక్ష్యాలు ఏవీ ఉండేవి కావు. ప్రపంచంలోని అన్ని నాగరిక జాతుల మధ్యన వ్యాపార వాణిజ్యాల్లాంటి పరస్పర చర్యలు జరుగుతున్నా కూడా ఏజాతికాజాతి తమతమ సామ్రాజ్యాలను ఏర్పరచుకొని ఏకాంతంగా మనుగడ సాగిస్తుండేవి. పైగా అప్పట్లో మానవుడు మతపరంగా ఆలోచిస్తూ ఉండేవాడు. భారతదేశంలో, చైనాలో, ఐరోపాలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలుండేవి.ఐతే అవేవీ కూడా సమస్త మానవాళినుద్దేశించి రాజకీయంగా ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. చైనాలో కన్‌ఫ్యూషియస్, దూరప్రాచ్యంలో క్రిస్టియానిటీ, భారతదేశంలో బౌద్ధ,జైన మతాలు జన్మించి వ్యాప్తినొందాయి.

అలెగ్జాండర్ లాంటి చక్రవర్తులు ప్రపంచాన్ని జయించాలని తలపెట్టినా అది ప్రధానంగా వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠలకోసం చేసిందే కానీ మానవజాతిని ఉద్ధరించాలనిగానీ, మానవాళి సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఏదైనా సైద్ధాంతిక నేపథ్యంతో కానీ జరిగినది కాదు. అంటే మానవుడు ఆ సమయంలో పారమార్థిక చింతననుండి ఐహిక చింతనకు మరలే- అంటే రాజకీయ సామాజిక వ్యవస్థను నెలకొల్పే- పరిణామం అప్పటికింకా జరగలేదు.

ఇస్లాం ఆవిర్భావం

ఐతే ఈ పరిణామం తదనంతరకాలంలో ఒకనాడు హఠాత్తుగా జరిగినది. అదే ఇస్లాం ఆవిర్భావం.ఇది క్రీ||శ.7వ శతాబ్దపు ప్రథమార్ధంలో సంభవించినది.

అరేబియా దేశంలో క్రీ||శ.570వ సం||లో మక్కా అనే పట్టణంలో ఇస్లాం స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మించాడు. నడి వయసు వరకు సాధారణ జీవితాన్నే గడిపిన ఈయన కాలక్రమంలో ఆధ్యాత్మికంగా మారటంతో ఒకనాడు ధ్యాన సమయంలో జ్ఞానోదయమైనది. అప్పటి వరకు అరేబియన్‌లు మక్కాలోగల 360 విగ్రహాలను మరియు 'కాబా ' అను నల్లని రాతిని పూజించేవారు. మహమ్మద్ ప్రవక్తకు కలిగిన జ్ఞానోదయం ప్రకారం 'అల్లా ఒక్కడే దేవుడు. అతనికి మాత్రమే అందరూ విధేయులై ఉండాలి '.కనుక ఈ విధంగా లెక్కకు మిక్కిలిగా విగ్రహాలను పూజించకూడదు. అసలు విగ్రహారాధనే చేయకూడదు. తాను ఆ దేవుని సందేశాన్ని మానవాళికి అందించటానికి అవతరించిన అంతిమ ప్రవక్త.అంటే తన తరువాత ప్రవక్తలెవరూ ఉదయించరు.తన సందేశమే అంతిమ సందేశం.

ఐతే తన స్వంత పట్టణమైన మక్కాలో ఈయన బోధనలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవటంతో ఈయన తన అనుచరులతో క్రీ||శ.622సం||లో మదీనా అనే పట్టణానికి చేరుకున్నాడు.అచ్చట ఈయన బోధనలకు ఆదరణ లభించడంతో తన ఉద్యమాన్ని అచటినుండే ప్రారంభించాడు. మక్కా నుండి మదీనాకు మహమ్మద్ ప్రవక్త చేరుకున్న ఈ సంఘటననే ఇస్లాం ఆవిర్భావంగా పరిగణిస్తున్నారు.

క్రీ||శ.632 లో మహమ్మద్ ప్రవక్త మరణించారు.అప్పటి వరకు అనేక దేవతలను ఆరాధిస్తూ దానికి తగినట్లుగానే ఐకమత్యంలేక చిన్న చిన్న విషయాల దగ్గర తమలోతాము కలహించుకొని రక్తపుటేరులు పారించిన అరేబియన్ తెగలు ఈయన బోధనల ప్రభావంతో ఇస్లాం ఛత్రం క్రింద ఒక్కటైనవి. ఈయన మరణానంతరం వీరంతా మహోత్తుంగతరంగం వలే ఉద్యమించటంతో ఇస్లాం ప్రపంచంలోని అనేక దేశాలలో ఆశ్చర్యకర వేగంతో విస్తరించినది.

ఇస్లాం కేవలం ఒక మతమా..?!

ఇస్లాం ప్రధానంగా మతం కాదు. అది మానవాళినంతటినీ ఉద్దేశించిన ఒక రాజకీయ సామాజిక వ్యవస్థ. ఇస్లాం క్రిస్టియానిటీ, బౌద్ధం, కన్‌ఫ్యూషియస్ మొదలైనవాటి సరసన పేర్కొనదగిన మతమా..? లేక కాపిటలిజం,కమ్యూనిజం మొదలైనవాటి సరసన పేర్కొనదగిన రాజకీయ సామాజిక వ్యవస్థా..?అనే సమస్య మనకెదురైతే రెండవ అభిప్రాయమే అన్నివిధాలా సరియైనది.ఇస్లాం దాని యొక్క తీరు తెన్నుల వలన మనకు ఒక మతంలా గోచరిస్తున్నది.కనుక ఇప్పటి వరకూ మన అవగాహనలో ఇస్లాంను ఒక మతంగానే స్వీకరిస్తున్నాము. దీనిని మొదట మనం మార్చుకోవాలి.

మతం అన్నది ఏదైనా మానవుడు దానిని ఐచ్ఛికంగా అవలంబించేటట్లుగా ప్రేరేపిస్తుంది. శాంతియుతంగా బోధిస్తుంది. మతాన్ని మానవుడు దైవభక్తి, పాపభీతి మొదలైనవాటితో స్వయంప్రేరితుడై ఆచరిస్తాడు. కానీ ఇస్లాం మానవుడిని బలవంతంగా ఆచరించేటట్లుచేస్తుంది. అలానే మతం మానవుని వ్యక్తిగతజీవితంలో జోక్యం చేసుకోదు. వస్త్రధారణ, స్త్రీలకు ఈయవలసిన స్వేచ్ఛ, ఇంకా మానవుడి వ్యక్తిగత నైతిక ప్రవర్తన ఇత్యాది విషయాలలో మతం జోక్యం చేసుకోదు. అవన్నీ సమాజంలో నెలకొన్న సమకాలీన ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలగు వాటిద్వారా నిర్దేశింపబడతాయి. కానీ ఇస్లాం వీటన్నింటిలోనూ జోక్యం చేసుకుంటుంది. అన్ని విషయాలలోనూ కొన్ని విధివిధానాలను ఏర్పరచి వాటిని బలవంతంగా ఆచరించేటట్లు చేస్తుంది. ఇటువంటి బలవంతం మతలక్షణం కాదు. ఇది శాసనాధికారంగల రాజ్యశక్తి యొక్క లక్షణం మాత్రమే.

క్రైస్తవం, బౌధ్ధం, జైనం, యూదుమతం, జొరాష్ట్రియనిజం, కన్‌ఫ్యూషియస్ మతం ఇవేవీ కూడా తమ బోధలను ఆచరించేటట్లుగా మానవుడిని బలవంతం చేయలేదు. మతబోధలు ఆదేశ సూత్రాల్లా ఉంటాయేగానీ శాసనాల్లా ఉండవు. కానీ ఇస్లాం మానవుడిని శాసిస్తుంది. ఏ మతం కూడా ప్రత్యక్షంగా రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. కానీ ఇస్లాం అలా చేపట్టింది.కాబట్టి ఇస్లాం అనేది తనయొక్క ప్రగాఢమైన దైవ విశ్వాసం వలన ఒక మతంలా గోచరిస్తున్నా ఈ లక్షణాలన్నింటిని బట్టి ఇస్లాంలో అంతర్లీనంగా ఉన్న తత్వం ఒక రాజకీయ, సామాజిక వ్యవస్థ అని మనం నిర్థారణ చేయవచ్చు.

ఈ రచనలో చెప్పినంత రూఢీగా కాకపోయినా ఇస్లాం గురించి చరిత్రకారులలో ఇటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఐతే వారు చరిత్రను పరిశీలించే దృక్కోణం వేరుకనుక ఇంత ఖచ్చితంగా చెప్పిఉండకపోవచ్చు. మనం ఒకానొక ప్రామాణిక గ్రంథంలో వెలువరించిన అటువంటి అభిప్రాయాన్ని ఒకదానిని పరిశీలిద్దాం.

Traditionally, Islam has been regarded by its followers as extending over all areas of life, not merely those (such as faith and worship) which are commonly viewed as the sphere of religion today. Thus many Muslims prefer to call Islam a way of life rather than a religion. It is for this reason too that the word Islam, especially when reffering to the past, is often used to reffer to a society, culture or civilization, as well as to a religion. While a history of Christianity will usually cover only matters relating to religion in a narrow sense, a history of Islam may discuss, for example, political developments, literary and artistic life, taxation and landholding,tribal and ethnic migrations, etc. In this wider sense Islam is the equivalent not only of Christianity but also of what is often called Christendom.

ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం-ఇవి మూడూ కూడా కేవలం రాజకీయ ఉద్యమాలే కావు. అవి మానవుడి జీవనంలోని అన్ని కోణాలనూ స్పృశించిన జీవన విధానాలు. మానవుడు చరిత్రలో సాధించిన మూడు మహా నాగరికతలు. సామ్యవాదం హేతువాద ప్రధానమైనది. ఇది ఒక నాస్తిక వాదం; భగవద్విశ్వాసాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మతాన్ని మత్తుమందుగా ఈసడించినది. కాపిటలిజం మాత్రం మధ్యేమార్గాన్ని అవలంబించినది.తనకు అడ్డురానంత వరకూ ఇది మతాన్ని వ్యతిరేకించలేదు.తనకు ఆటంకంగా పరిణమించినంతమేరా ఇది మతాన్ని సంస్కరించి అంతటితో సరిపెట్టినది.

ఇస్లాం మాత్రం భగవంతునిలో ప్రగాడమైన విశ్వాసాన్ని ప్రకటించినది. ఈ కారణం చేతనే ఇస్లాం ఓ మతంలా గోచరిస్తుంది. గోచరించడమేకాదు నిజానికి ఈ విశ్వాసం వలననే ఇస్లామిక్ వ్యవస్థలో మతం కూడా విలీనమైపోయి ఉన్నదని చెప్పవచ్చు. అందుకనే ఇస్లామిక్ వ్యవస్థలో జీవించే ప్రజలు ప్రత్యేకించి వేరే ఏ మతాన్నీ అవలంబించక ఇస్లాంనే ఓ మతంలా కూడా ఆచరిస్తుంటారు. అందువలననే ఇస్లాం అధికారంలో ఉన్నా లేకున్నా అది ఓ మతంలా ప్రజలలో నిలచిపోయింది. ఇస్లామిక్ వ్యవస్థలోని మతపరమైన అంశ ఒక అవక్షేపంలా మిగిలిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఐరోపా ప్రజలకు క్రిస్టియానిటీ ప్రత్యేకించి మతం పాత్ర పోషిస్తున్నది. ఇస్లామిక్ వ్యవస్థలో అలా కాదు. మతం పాత్ర కూడా ఇస్లామే పోషిస్తున్నది. ఇక సామ్యవాదంలో మత సమస్యే లేదు.....(సశేషం)


22, జూన్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---1




ఉపోద్ఘాతం:

నేను 'సత్యాన్వేషణ పథం' అనే వ్యాసంలో (ఫిబ్రవరి పోస్టు) 'సత్యాన్వేషణ ' అనే కోణంలో వివరించిన విషయాన్నే 'భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!' అనే వ్యాసంలో రాజకీయ కోణంలో వివరించాను. రెండు వ్యాసాలు బింబ ప్రతిబింబాలు మాత్రమే. ఆ విషయాన్నే సమగ్రంగా వివరించటానికి ప్రారంభంగా ఈ ఉపోద్ఘాతాన్ని రాస్తున్నాను.

ఈ సమగ్ర వివరణను చదివేటపుడు అసలు విషయం ఎక్కడనుండి ఎక్కడకు పోతున్నది?..భారతదేశ వ్యవస్థ అంటూ దేశానికి ఆవల చరిత్రలో ఎప్పుడో జరిగిన విషయాలు వివరిస్తున్నాడేమిటి?...ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న సంఘటనలనో,లేక భారతదేశ చరిత్రనో చెప్పవచ్చు కదా...అనే సందేహాలు పాఠకులకు తలయెత్తకుండా అసలు నేను చెప్పదలచుకున్నదేమిటో ముందుగానే పై వ్యాసాలలో చెప్పివేసాను.'సత్యాన్వేషణ పథం ' వ్యాసంలో పరోక్షంగా,తాత్వికంగా చెప్పాను. 'భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?! 'అనే వ్యాసంలో ప్రత్యక్షంగా చెప్పాను. అందుకే ఈ వ్యాసపరంపరకు కూడా ఆ రెండవ వ్యాసపు టైటిల్‌నే ఇచ్చి నంబరింగ్ ఇస్తున్నాను.

ఈ వ్యాసాలు విడివిడి వ్యాసాలు కాదు. కొన్ని సశేష వ్యాసాల సమాహారం. మొత్తాన్ని కలిపి ఒక చిన్న గ్రంథంగా పరిగణించవచ్చు. ఈ గ్రంథంలో మూడు అధ్యాయాలుంటాయి. మొదటి అధ్యాయంలో ప్రపంచ రాజకీయ,సామాజిక రంగాలలో వచ్చిన మార్పుల యొక్క చారిత్రక క్రమాన్ని వివరిస్తాను. రెండవ అధ్యాయంలో ఏ తాత్విక పునాది మీద ఆధారపడి ఈ అధ్యయనమంతా జరుగుతున్నదో, ఏ తాత్విక భావనల ఆధారంగా భావి వ్యవస్థను ఈ దేశంలో ఏర్పరచాలని భావించడం జరుగుతున్నదో ఆ తాత్విక విచారధారను వివరిస్తాను. ఇక మూడవ అధ్యాయంలో ఆ భావి వ్యవస్థ ఎలా ఉంటుంది? ..దాని స్వరూప స్వభావాలేవిధంగా ఉంటాయి తదితర విషయాలను వివరిస్తాను.

ఇదంతా సమగ్ర వివరణ అంటున్నానే గానీ ఈ గ్రంథంలో అందించే వివరణ కూడా ఒక రకంగా సంగ్రహమే. ఈ విషయాలను వివరిస్తూ ఒక మహాగ్రంథమే రాయవచ్చు. ఐతే బయట విడిగా వేరే గ్రంథాలలో లభ్యమయ్యే విషయసంచయమేదీ ఈ వ్యాసాలలో పేర్కొనబడలేదు. విషయం యొక్క సమగ్ర వివరణకు అవసరమైన కనీస వివరాలను మాత్రమే పేర్కొన్నాను.మరీ వివరాలు ఎక్కువైనా కూడా అదంతా ఈ బ్లాగు ద్వారా చెప్పటం సాధ్యపడకపోవచ్చు. అన్ని వివరాలు అవసరమని కూడా నేను అనుకోవడంలేదు.

నా స్వీయ అవగాహనకొరకు, నా భావాలను స్పష్టపరచుకొనుట కొరకు, వాటిని క్రమబద్దీకరించుకొనుట కొరకు నేను డైరీలో రాసుకున్న విషయాలనే ఇప్పుడు మీముందు ఉంచుతున్నాను.

ఇంతటితో ఉపోద్ఘాతం సమాప్తం.వచ్చే వ్యాసంతో ఈ చిరుగ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం.నిజానికి ఈ గ్రంథానికి ప్రారంభం ఈ మొదటి అధ్యాయం కాదు. ఈ గ్రంథం లో చెప్పబోయే విషయానికి ప్రాతిపదికగా నిలచిన ఆ రెండు సంక్షిప్త వ్యాసాలను ముందుగా చదవాలి. కనుక ఈ గ్రంథానికి ప్రారంభం ఆ రెండువ్యాసాలే.




3, జూన్ 2008, మంగళవారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!

నేను జె.పి.గారిలో మరియు లోక్‌సత్తాలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతూ ఇటీవల రాసిన వ్యాసాలకు ప్రతిస్పందించిన కామెంటేటర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారిలో ఎక్కువ మంది అసలు మీరెలాంటి వ్యవస్థను కోరుకుంటున్నారనీ మరియూ మీరు ఆశిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్వరూపమెలా ఉంటుందనీ అడిగారు.దానిని వివరించటం కొరకే ఈ వ్యాసం రాస్తున్నాను.

భారతదేశానికి ఏటువంటి వ్యవస్థ కావాలో తెలుసుకోవటానికి ముందుగా ఒక దేశపు రాజకీయ వ్యవస్థ స్వరూపమెలా ఉంటుందో తెలుసుకుందాం. ఏ దేశపు రాజకీయ వ్యవస్థలోనైనా మూడు అంగాలుంటాయి.

అవి 1.రాజ్యం 2.సమాజం 3.వ్యక్తి

1.రాజ్యం:- ఒకే శాసనాధికారం క్రింద జీవిస్తున్న ప్రజలతో కూడిన నిర్ణీత ప్రాదేశిక పరిధిని 'రాజ్యం' అంటారు.రాజ్యానికి ఇలాంటి నిర్వచనం ఉన్నది.కానీ రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎక్కువగా' రాజ్యం' అనే పదాన్నివేరే అర్థంలో వాడుతున్నారు. అదేమంటే రాజ్యం అంటే సైన్యం,పోలీసులు,పాలనా యంత్రాంగం,శాసనం.. ఇలాంటి శక్తులను మరియు వాటిని ప్రయోగించే విధానాన్ని' రాజ్యం' లేక 'రాజ్యశక్తి' అంటున్నారు.మనం ఈ రెండవ అర్థంలోనే అధ్యయనం చేస్తాము.

2.సమాజం:- 'సమాజం' అంటే నదులు,ఖనిజాలు లాంటి సహజవనరులు, రోడ్లు,వంతెనలు లాంటి మౌలిక సదుపాయాలు, విద్య,వైద్యం లాంటి సౌకర్యాలు, ఫాక్టరీలు, వ్యవసాయ భూములు లాంటి ఉత్పత్తి సాధనాలు మరియు వీటితో కూడుకున్న జనబాహుళ్యం అనే అర్థం ఉన్నది. కానీ మన అధ్యయనంలో సమాజంలో మిగతావన్నీ కలుపుతాముకానీ జనబాహుళ్యం స్థానంలో మాత్రం మౌలిక సదుపాయాలు,సౌకర్యాలు, ఉత్పత్తి సాధనాలు తదితరాల మీద పెత్తనం కలిగిన ధనిక(బూర్జువా)వర్గాన్ని మాత్రమే ఉంచుతాము.'సమాజం' అనే అంగంలో సామాన్య ప్రజలు రారు.ఎందుకంటే సామాన్య ప్రజలకు పైన పేర్కొన్న వాటిలో వేటిమీద పట్టు కానీ,పెత్తనం కానీ ఉండదు.

3.వ్యక్తి:- ఇక్కడ 'వ్యక్తి' అంటే ఒక వ్యక్తి అని కాదు అర్థం.పైన సమాజంలో కలపకుండా ఉంచిన సామాన్య ప్రజలంతా ఈ విభాగంలోకి వస్తారు.


ఈ అర్థాలతోనే మనం ఇప్పుడు 'రాజ్యం', 'సమాజం', 'వ్యక్తి' అనే అంగాలను పరిశీలిస్తాము. మొదటే చెప్పినట్లుగా 'వ్యవస్థ' యొక్క పూర్తి స్వరూపం ఈ మూడు అంగాలతో కూడుకొని ఉంటుంది. ఈ మూడు కూడా పరస్పర విరుద్ధ మైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పరస్పర విరుద్ధ మైన ప్రయోజనాలు అంటే 'రాజ్యం' యొక్క ప్రయోజనాలు సమాజానికి,వ్యక్తికి విరుద్ధంగా ఉంటాయి.'సమాజం' యొక్క ప్రయోజనాలు రాజ్యానికి,వ్యక్తికి విరుద్ధంగా అలాగే 'వ్యక్తి' యొక్క ప్రయోజనాలు రాజ్యానికి,సమాజానికి విరుద్ధంగా ఉంటాయి. పరస్పర విరుద్ధ మైన ఈ మూడు అంగాలనూ సమన్వయపరచవలసిన బాధ్యత ప్రభుత్వానిది.ఈ మూడు అంగాలనూ ప్రభుత్వం సమదృష్టితో చూడాలి.అలా కాక ప్రభుత్వం ఏదో ఒక అంగం యొక్క ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి మిగతా రెండు అంగాలను అణచి వేస్తే అది మంచి వ్యవస్థ అనిపించుకోదు.

ఇప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థలలో ఏ ఒక్కటి కూడా అటువంటి నిష్పక్షపాతమైనది కాదు. కొన్ని వ్యవస్థలలో ప్రభుత్వం 'రాజ్యం' యొక్క ప్రయోజనాల వైపు మొగ్గినది.కొన్ని వ్యవస్థలలో ప్రభుత్వం 'సమాజ' ప్రయోజనాల వైపు మొగ్గినది. మరికొన్నింటిలో 'వ్యక్తి 'ప్రయోజనాల వైపు మొగ్గినది.

వ్యవస్థ లోని ఈ మూడు అంగాల ప్రయోజనాలకూ సమప్రాధాన్యత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.దాని కొరకు మనం సృజనాత్మకతతో ప్రయత్నించాలే గానీ ఇప్పుడున్న వాటిలో ఏదో ఒక దానిని ఏరుకోవటమో లేక వాటిలో ఏదో ఒక దాన్ని దుమ్ము దులిపి అంటే కొంచెం మార్చి వాడుకోవటమో కుదరదు. ఎందుకంటే అవన్నీ మౌలికంగా ఏదో ఒక అంగం వైపు మొగ్గు చూపిన పక్షపాత వ్యవస్థలే. వాటిని ఎంత సంస్కరించినా వాటి మౌలిక స్వభావంలో మార్పు రాదు. కనుక నూతన వ్యవస్థను సృజన చేయడ మొక్కటే మార్గం.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకూ వ్యవస్థలోని మూడు అంగాలకూ సమప్రాధాన్యతనిచ్చే నిష్పక్షపాతమైన ప్రభుత్వం ఏర్పడలేదు. ఆ క్రమాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

బర్బర జాతుల దాడులతో ప్రపంచమంతా అట్టుడికిపోతున్న అరాచక పరిస్థితులు నెలకొన్న సమయంలో పటిష్ఠవంతమైన రాజ్యశక్తి తక్షణావసరంగా భావించబడి 'ఇస్లాం' జనించినది(ఇస్లాం ఒక మతంగా పరిగణింపబడుతున్నప్పటికీ రాజనీతి శాస్త్రమునకు సంబంధించినంతవరకూ ఇస్లాం ఒక వ్యవస్థీకృత ఫ్యూడలిజం).కానీ ఇస్లాంలో శక్తివంతమైన రాజ్యం ఆవిర్భవించినప్పటికీ సమాజం మరియు వ్యక్తి యొక్క ప్రయోజనాలు తీవ్రంగా అణచివేయబడ్డాయి. మరీ ముఖ్యంగా సమాజమనేది వికాసం లేక కృశించుకుపోయింది.దానితో కాలక్రమంలో సమాజ వికాసం తక్షణావసరంగా భావించబడి తదనుగుణమైన 'పెట్టుబడిదారీ వ్యవస్థ'(కాపిటలిజం) జనించినది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లో సమాజం అన్నిరంగాలలోనూ వికాసాన్ని సంతరించుకున్నది.కానీ 'రాజ్యం' మరియు 'వ్యక్తి' ల యొక్క ప్రయొజనాలు తీవ్రస్థాయిలో దెబ్బ తిన్నాయి. మరీ ముఖ్యంగా వ్యక్తి దారుణమైన దోపిడికి గురి అయ్యాడు. దానితో కాలక్రమంలో వ్యక్తి ప్రయోజనం తక్షణావసరంగా భావించబడి 'కమ్యూనిజం'(సామ్యవాదం) ఆవిర్భవించినది.ఈ కమ్యూనిజంలో 'వ్యక్తి' కి అధిక ప్రాధాన్యత ఈయబడినప్పటికీ రాజ్యం,సమాజం ఈ రెంటి ప్రయోజనాలూ దెబ్బతిని కాలక్రమంలో ఈ సామ్యవాదం దానికదే కూలిపోయింది(సోవియట్ యూనియన్ పతనం).

ఈ విధంగా మానవ సమాజానికి ఒక చక్కని రాజకీయ,సామాజిక వ్యవస్థను అందించటానికి తలయెత్తిన ప్రయత్నాలన్నీ విఫలమైన ప్రపంచం ఈనాడు మన ఎట్ట ఎదుట ఉన్నది. ఈనాడు ప్రపంచానికి కావలసినది వ్యవస్థలోని మూడు అంగాల ప్రయోజనం సమంగా నెరవేరే వ్యవస్థ. దానిని ఏర్పరచటానికే మనం ఇప్పుడు కృషి చేయాలి.మానవ సమాజానికి ఒక చక్కని రాజకీయ,సామాజిక వ్యవస్థ నందించే సమస్య ఈ నాటికీ అపరిష్కృతంగానే ఉన్నది. దానినే మనం ఇప్పుడు పరిష్కరించాలి.

ఈ కార్యాన్ని ఏ పాశ్చాత్యులో కాదు భారతీయులు కూడా చేయవచ్చు.అసలు చేయవలసినది భారతీయులే.ఎందుకంటే ప్రపంచంలో సామర్థ్యమున్న జాతులన్నీ కూడా ఒకసారి ప్రయత్నించి విఫలమైపోయాయి.ఇక ఇప్పుడు అవి అంతకుమించి చేయగలిగినది ఏమీలేదు.తమకు తోచిన వ్యవస్థలనేవో అవి అందించివేశాయి.ఇక మిగిలినది భారతదేశం మాత్రమే.

పై మూడు ప్రయత్నాలు వాటి అంతిమ లక్ష్యంలో విఫలమైనా కూడా విజ్ఞాన శాస్త్రంతో కూడుకున్న నేటి అత్యాధునిక, స్వేచ్ఛాయుత ప్రపంచం మరియు ప్రపంచమంతటా దాదాపు ఒకే విధమైన జీవనవిధానంతో ఏకరూపత ఉన్న మానవ సమాజం ఏర్పడటానికి పై మూడు విఫల యత్నాలే కారణం. ఇటువంటి ఏకరూప సమాజానికి మనం ఇప్పుడు వ్యవస్థలోని అన్ని అంగాలూ సమంగా ప్రయోజనం పొందే వ్యవస్థను అందించాలి.

అటువంటి వ్యవస్థను మనం ఒక సూత్రీకరణ ద్వారా సాధించవచ్చు. అదేమంటే Truth is the Synthesis of Thesis, Antithesis and Analysis. పై మూడు వ్యవస్థలలో ఇస్లాం Thesis, కాపిటలిజం Antithesis, కమ్యూనిజం Analysis. ఈ మూడింటి Synthesis వలన వచ్చే వ్యవస్థే మనకు కావలసినది.( ఈ Synthesis ప్రక్రియ స్వరూపమెలా ఉంటుందనేది తరువాత వివరంగా తెలుసుకుందాం)

అంటే ఆ వ్యవస్థను మనం ఈ మూడు విఫలయత్నాలకు భిన్నంగా కొత్తగా సృజించవలసిన పనిలేదు. పై మూడు ప్రయత్నాల ద్వారానే సాధించుకోవచ్చు.ఈ విధంగా సాధించుకున్న వ్యవస్థలో ఇస్లాంలో వలే రాజ్యం యొక్క ప్రయోజనాలు,కాపిటలిజంలో వలే సమాజం యొక్క ప్రయోజనాలూ మరియూ కమ్యూనిజంలో వలే వ్యక్తి యొక్క ప్రయోజనాలూ ఈ విధంగా వ్యవస్థలోని మూడు అంగాల ప్రయోజనాలూ సమంగా నెరవేరతాయి.అటువంటి వ్యవస్థనే ఈ నాడు మనం భారతదేశంలో ఏర్పరచాలి.

ఈ వ్యవస్థ మానవ సామాజిక పరిణామపు అత్యున్నత దశ..పరిపూర్ణ దశ..అంతిమ దశ.